"(చివరకు మిగిలేది) నవల చదవడం ముగించిన తరవాత ఈ నవల సందేశం ఏమిటి అని చాలా ఆలోచించవలసివచ్చింది. మగవారి మనోభావాలు ఇంత సంకుచితంగా తమ పరిధిలోనే ఉంటాయా? మగవారిలో కనీసం దయానిధిలా ఆలోచించేవారు వుండటానికి అవకాశం ఉందనా? ఇలా జీవితం విశ్లేషిస్తూ కూచుంటే జీవితం నిజంగా అనుభవించడం గానీ, జీవితంలో సాధించేది గానీ ఏమీ ఉండదనా?" - నిడదవోలు మాలతి
నేను రాసిన "చివరకు మిగిలేది ఎందుకు చదవాలి?" వ్యాసం చదివిన ఒక మిత్రులు నిడదవోలు మాలతిగారు ఈ నవల మీద ఎప్పుడో రాసిన "పునరావలోకనం"ని pdf రూపంలో పంపించారు. మొత్తంగా చదివిన తరువాత కొంత ఆశ్చర్యం మరికొంత నిరాశ కలిగాయి. వ్యాసం చాలా శాస్త్రీయంగా సాగినా, నా భావాలకు ప్రతికూలంగా ఉండటం వల్లనో లేక నవల ముందిచ్చిన ఉపోద్ఘాతాన్ని పట్టుకుని మొత్తం నవలని (తన ప్రెజుడిస్ లతో కలిపి) జడ్జిచేసిన విధానం వల్లనోగానీ నిరాశ ఎక్కువ కలిగింది. అందుకే ఆ వ్యాసాన్ని ఉటంకిస్తూ దానిపై ఒక పునరాలోచన నాతరఫున్నుంచీ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
ఒక రచనను ముందుమాటా వెనుకమాటల్లాంటి ‘కొసరుమాటల’ తులనల ద్వారా (అవి స్వయంగా రచయిత రాసినవైనా సరే) బేరీజు చెయ్యడం పాఠకులకు చెల్లితే చెల్లచ్చేమోగానీ విమర్శకులకు చెల్లదనేది నా నమ్మకం. ఎందుకంటే విమర్శకుడి ఉద్దేశమే to see the work in itself, as IT IS. అలాంటప్పుడు మూల రచన ముందుండగా దాని ముందు వెనుకల్ని త్రవ్వి నవల స్థాయిని నిర్ణయిస్తాను అనేది విమర్శన స్ఫూర్తికే విరుద్ధం. పైగా "అతను (దయానిధి) జీవించి ఉండగానే ఇక ఏమీ లేదు అనుకోవడం నిరాశావాదం" గనక, నవలకు సామాజిక ప్రయోజనం ఏర్పడలేదని. "నిజానికి అతను జీవితంలో అనుభవించింది కూడా ఏమీ లేదు" (పుట 4) గనక పాఠకులకు ఈ నవల జీవితంపై కలగ జేసిన ధృక్పథం ఏమీ లేదని తేల్చెయ్యడం చాలా హ్రస్వదృష్టి అనిపించింది.
విమర్శకురాలు "అప్పట్లో అందరూ చదువుతున్నారనో,ఎవరో చదవమన్నారనో" యాభైసంవత్సరాల క్రితం ఈ నవలను చదివి "మనసును రంజింపజేయగల రచన"కాదు అని నిర్ధారించుకునేశారు. ఆ తరువాత ఇంత కాలానికి "మల్లీ ఈ వ్యాసంకోసం" చదివారు. మనసుకు హత్తుకోలేదు గనక "మళ్ళీ చదువుతానా అంటే ఏమో" (పుట 5) అనే సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి pre- conceived bias, prejudice నేపధ్యంలో నవల ‘విలువని’ పాఠకుడి కోసం ఎత్తి చూపడం సాధ్యమేనా? ఒకవేళ ప్రయత్నించినా నిస్పాక్షికమైన విమర్శన సాధ్యమేనా? అనేవి నా సమస్యలు. నావరకూ ఆ నిస్పాక్షికత కరువయ్యిందనే అనిపించింది.
విమర్శకురాలి విశ్లేషణలో నవల యొక్క చరిత్ర, ఈ నవలకి ఖ్యాతి నార్జించి పెట్టిన (రెండు) విశేషాల గుర్తింపుని నేను అంగీకరిస్తాను. ముఖ్యంగా ఈ నవలా విశేషాలైన సైకో అనలిటికల్ అప్రోచ్ (మానసిక విశ్లేషాత్మక విధానం), ‘జీవితం గురించి అభిప్రయాల సిద్ధాంతీకరణ’ నన్ను ఒక పాఠకుడిగా అమితంగా ప్రభావితం చేసిన అంశాలు. కాకపోతే వ్యాసంలో ఈ రెండు విషయాలనీ అపరిపక్వంగా అర్థం చేసుకున్న విమర్శన కనిపిస్తుందేతప్ప నవల సార్థకతను గుర్తించే నిశితదృష్టి కనిపించదు. అదే నిరాశను కలిగిస్తుంది.
సైకో అనలిటికల్ అప్రోచ్ సాహిత్యంలో ఎలా ఉపయోగిస్తారో తెలిసిన విమర్శకురాలైతే "దయానిధి వాదనల్లో, ఇతివృత్తం విషయంలో నేలవిడిచి సాము చేస్తున్నట్లు అనిపిస్తుంది" (పుట 1) అని నిర్ణయించి ఉండరు. ముఖ్యంగా "కథంతా దయానిధి అనబడే ఒక తాత్వికునికోణంలో నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు" (ఫుట 2) అని సుస్పష్టంగా గుర్తించిన పిదప ఇటువంటి జడ్జిమెంటుని వెలువరించడం ఆశ్చర్యకరం. తత్వచింతన, మానసికవిశ్లేషణ,ఆలోచన,భవ్యోద్రేకం స్థూలజగత్తుకు చెందిన ప్రక్రియలు కావు. భావజగత్తుకు చెందిన మానవ అంతరాళాల్లో అవి జరుగుతాయి. దాన్ని "నేలవిడిచి సాముచెయ్యడం" అనము. కళాసాధన అంటాము. కళాయజ్ఞం అని ప్రశంసిస్తాము. తల్లి, కోమలి,అమృతం,సుశీల, ఇందిర, నాగమణి, కాత్యాయని ఎవరూ దయానిధికి పూర్తిగా అర్థం కారు. సాహిత్యంలోనే కాదు నిజజీవితంలో కూడా ఎవరూ ఎవరికీ పూర్తిగా అర్థం కారు. కానీ, దయానిధి స్తూలజగత్తును మీరిన తన తాత్విక చింతనద్వారా భావజగత్తుకు చేరువై, వాళ్ళను మనకన్నా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే నవల ఉద్దేశం కూడా.
తల్లి నైతిక ప్రవర్తన దయానిధిని "బాధిస్తూంటుంది"(పుట 2) అని విమర్శకురాలు స్వీయప్రకటన కావించేసి, "దయానిధిలో ఆమె దుష్ప్రవర్తనకి వెనుకనున్న కారణాలు ఏమిటి అనిగానీ, ఆమెని అర్థంచేసుకోవాలన్న తపన, వాటిని అధిగమించి తాను సమపార్జించిన జ్ఞానం ద్వారా తన జీవితాన్ని చక్కదిద్దుకుందాం అన్న అవేశం కనిపించవు." అనే నిర్ధారణకి చాలా లాజికల్ గా వచ్చేసారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, "యవ్వనమొక ప్రాచీనశక్తి... నిశోధి తెరుచుకున్న ద్వారాలమధ్య ఆత్మహత్య చేసుకున్న యవ్వనపు శక్తి, సంస్కారాన్ని కోరదు... ఏ చదువు ఈ అస్థిపంజరపు నిర్మాణాన్ని మార్చగలదు? బుర్ర,మెదడు, యివి దాస్యానికి అంతరాయాలే." అన్న తాత్వికుడు దయానిధి. శారీరకశక్తులపైన ఒకస్థాయి పరిపూర్ణ అవగాహనా, వాటిని అధిగమించలేని బలీయమైన బలహీనతల్లో ఓలలాడిన ఇతడికి తల్లి "దుర్నడత"ను అర్థం చేసుకోవడం నిజంగా కష్టమా? తల్లి ప్రవర్తనని దయానిధి ఏనాడో అర్థం చేసుకున్నాడు. కానీ షేక్స్పియర్ హేమ్లెట్ లాగే ఆ అర్థాన్ని అంగీకరించే విఫలయత్నం (నవలలోని ‘చీకటి సమస్య’ ప్రకరణ దాని గురించే) చేస్తూవచ్చాడు. coming to terms with that reality through self realization is the effort. ఇక్కడ ఆ యత్నం ముఖ్యం. దాని ఫలితం కాదు.
విమర్శకురాలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేసి, అమృతంలోని తల్లి సారూప్యతని చూసి దయానిధి అమృతానికి దగ్గరయ్యాడని, అమృతంతో "అనుభవం" కారణంగా తల్లి నడవడిక అర్థమయ్యిందని, తల్లికి పట్టిన దురవస్థే అమృతం కూతురికి పడుతుందన్న స్పృహకన్నా, అమృతం కూతురు తనదా కాదా అన్న ధ్యాసే ఎక్కువ అని తీర్మానించి (పుట 2) దయానిధిని నిజాయితీని పాఠకుడు శంకిస్తాడేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తూ విమర్శకురాలు దయానిధి నిజాయితీ మీద ప్రశ్నచిహ్నాన్ని ముద్రించేశారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ఘటనల్లోని అమృతం "ఆడతనాన్ని" విమర్శకురాలు గుర్తించలేకపోవడం.
అమృతం-దయానిధి కలయిక ప్రేమోద్రేకమే అయినా, పరిస్థితి అమృతం కల్పించింది అనేది కాదనలేని నిజం. ఆ కలయిన అమృతం తన సంసారాన్ని నిలబెట్టుకోవటానికి ఒక "అవసరం" అయినంత మాత్రానా, తనకు దయానిధి పట్ల ఉన్న ప్రేమ మలినమైపోదు. ప్రేమలేని దయానిధికి తన అపేక్షని అందించి, తన అవసరాన్ని పూర్తి చేసుకున్నంత మాత్రానా అమృతం స్వార్థపరురాలైపోదు. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి మనకు మనసొప్పదు. స్త్రీపాత్రలకున్న సహజ అవసరాలు, కుటుంబం కోసం వాళ్ళు ఆడేనాటకాలూ బహిరంగంగా చర్చించాలంటే మనకు బెదురు. తేటతెల్లంగా కనిపించినా, కళ్ళు మూసుకుని "పవిత్రత జపం" చేస్తేనే మనకు ఆనందం.
నిజానికి ఈ కలయిక తరువాత ఎక్కువ గిల్ట్ ఫీలయ్యేది దయానిధి. అతని పూర్వపు భావాలూ,ఆదర్శాలూ,అభిప్రాయాలకీ ఈ నిజతత్వానికీ ఎంతటి బేధముందో తెలుసుకుని భయపడేది ఇతనే.తనకు నిజస్వరూపాన్ని చూపించి హాయిగా నిద్రపోతున్న అమృతానికి ముఖం చూపించలేక "పారిపోయేది" దయానిధే. వెళ్తూవెళ్తూ నిద్రపోతున్న అమృతాన్ని చూసి "అంత నిద్రపోవడానికి ఎంతటి నిర్మల హృదయమో! కడసారి పవిత్రంలో పవ్వళించిన అమృతం" అనుకోవడమూ దయానిధికే సాధ్యం. ఇక్కడ దయానిధి అమృతానికి అపవిత్రత,చెడుగు,దుర్నీతి ఆపాదించలేదు. అమృతం నిజరూపాన్ని (ఒక స్థాయిలో విశ్వరూపాన్ని) చూసిన కళ్ళతో "ఈ వ్యక్తుల్నీ, ఈ స్థలాన్నీ"చాడలేను అనుకుని వెళ్ళిపోతాడు. ఆ కలయికని అవినీతి అనుకోని దయానిధి నిజాయితీని పాఠకుడు ఎందుకు శంకించాలి? అమృతం అప్పటికీ పవిత్రమే అనుకునే దయానిధి మనసులో ఉన్న వికారమేమిటి? అది self realization అనుకోవాలా లేక self obsession అని విమర్శకురాలిలాగా తీర్మానించాలా?
దయానిధి-అమృతం కలయిక ఇక ఎత్తైతే,(తనకు పుట్టిందనుకుంటున్న) అమృతం కూతుర్ని చూడటానికి దయానిధి వెళ్తే అక్కడ అమృతం ప్రవర్తన మరొక ఎత్తు. దయానిధి ఇంట్లో, అత్తా-భర్తలు లేని సమయంలో, ఒంటరితనంలో దయానిధిపై అమితమైన అపేక్షను చూపిన అమృతం అక్కడ మచ్చుకైనా కనబడదు. బిడ్డద్వారా సంసారాన్ని సుస్థిరపరుచుకున్న గృహస్థురాలు కనిపిస్తుంది. దయానిధి చూసిన నిజరూప ఛాయలుకూడా అమృతంలో కానరావు. మరో కొత్త రూపంలో దర్శనమిస్తుంది. అమృతం ఇంటికి దొంగచాటుగా వెళ్తున్న దయానిధి పరిపరి విధాలుగా వారి "కలయిక" తరువాతి కలయికని ఊహించుకుంటాడు, ఆ కలయికలోని ప్రేమను కనీసం రహస్యంగానైనా వ్యక్తపరిచే అమృతాన్ని ఆశిస్తాడు. కానీ...ఈ అమృతం వేరు. ఆ అమృతం వేరు అని గ్రహిస్తాడు. తన జీవితం "బండి మలుపు" తిరిగిందని గుర్తిస్తాడు.
మరో ముఖ్యపాత్ర కోమలి గురించి విమర్శకురాలి ధృక్కోణానికీ అమృతం పట్లగల అవాజ్యనీయమైన అభిమానానికీ ఏదో బలవత్తరమైన కారణం ఉందనిపిస్తుంది. కోమలిని ప్రాగ్మాటిక్ అనీ, జాణ అనీ, లౌక్యం తెలిసిన స్త్రీ అని విమర్శకురాలు నవలమొత్తం ఆకళింపు చేసుకుని తేల్చేస్తారు. దయానిధికి కోమలిపట్లవున్న దైహికవాంచ, మానసిక ప్రేమని దయానిధి పాత్రలోని వైరుధ్యంగా తేల్చేస్తారు. ఇకడుగు ముందుకేసి, దయానిధి ధృక్పధం అన్ని స్త్రీపాత్రల పట్లా sexist అనే అర్థంవచ్చే విధంగా "అతని మనోవైజ్ఞానిక విశ్లేషణ ఒకచోటా శారీరకమైన "కళ్ళు" (పుట 2) మరొకచోటా ఉంటాయి" అని చెప్పి నవలలోవున్న (తను అనుకుంటున్న) అంగాంగవర్ణనల గురించి చెప్పారు.
కోమలి ఒక కుటుంబ స్త్రీ కాదు. తనది సామాజికంగా అమోదమైన పుట్టుకకూడా కాదు. కులగోత్రాలూ,చదువూసంస్కారాలూ లేవు. జీవితం ఒక గాలివాటు గమనం. ప్రపంచానికి నిమిత్తం లేని బ్రతుకు. అయినా దయానిధి ఆమెను వాంచించాడు. ఈ వాంఛకు కారణం తన యవ్వనం, కోమలి సౌందర్యం అని గ్రహించాడు. "ఇంద్రియాలు పీకేస్తున్నాయి. పల్చటి ఎముకలు చల్లటి మాంసం - వీటికి తన యవ్వనం దాస్యం చెయ్యక తప్పదు" అని తెలుసుకున్న తాత్వికుడు దయానిధి.ఆరంభ యవ్వనం నుంచీ ఫ్రౌఢయవ్వన పరిణామ దశవరకూ సౌందర్యశక్తులు ప్రబలంగా పనిచేస్తాయనే ఎరుక కలిగిన జ్ఞాని దయానిధి. కోమలి సౌందర్యం దయానిధిని చిత్రవర్ణ కిమ్మీరితం చేసింది. అందుకే "చదువు లేకపోతే చెప్పించొచ్చు, సంపర్కం వల్ల సంస్కారం తెప్పించొచ్చు, ఎట్లాపడితే అట్లా తయారు చేసుకోవచ్చు, కానీ సౌందర్యం ఎక్కడనుంచీ తేగలం..." అని ప్రశ్నిస్తాడు. "కోమలే కావాలి -ఇంకెవ్వరూ (తన యవ్వనానికి) పనికిరారు" అని నిర్ణయిస్తాడు. దైహిక వాంచలోని తాత్వికసిద్ధాంతాన్ని ఇంత చక్కగా చెప్పిన రచయిత తెలుగులో ఇంకెవరున్నారు? ఆ అనుభవాన్ని అందుకుని సిద్ధాంతీకరించిన పాత్రలెన్నున్నాయి?
కోమలిని కలవటానికి వెళ్ళిన దయానిధి "ఆకస్మికంగా ఆమెని ప్రేమించడం జరిగింది" అందుకే తిరిగొచ్చేశాను అనటంలో విమర్శకురాలికి అతని వైరుధ్యం కనిపించింది. కానీ అదొక సహజమైన పరిణామం అనే ఆలోచన రాకపోవడం విచారకరం. దయానిధి ఆ పరిణామానికి తనదైన కారణంకూడా చెబుతాడుకూడా. "(మనిషి) వాంఛించిన వస్తువుల్ని ఎప్పూడూ ప్రేమించలేడు. వాంఛించడం అంటే అనుభవించడం, అనుభవించడంవల్ల వస్తువు నశిస్తుంది. నశింపు కాకుండా చేసేదే నిజమైన ప్రేమ అనుకుంటాను" అని సిద్ధాంతీకరిస్తాడు. అంతటితో ఆగక "నాకు చంద్రుడూ, నక్షత్రాలూ, మేఘాలూ, హిమాలయా పర్వత శిఖరం, కోమలీ అందరూ సమానులే. ఇవి లేకపోతే నే జీవించలేను. వీటిని వాంఛించను. ప్రేమిస్తాను." అని కోమలికి తన జీవితంలోని ప్రాముఖ్యతను వివరిస్తాడు. ఇంతకన్నా ఉత్తమమైన ప్రేమ,స్వార్థరహితమైన ప్రేమ ఉంటుందా? అంతకన్నా గౌరవం "సౌందర్యానికి" లభిస్తుందా? ఇందులో వైరుధ్యంకన్నా ఒక సిద్ధాంత పరిణామం కనిపిస్తుంది. ఒక తాత్వికుడి భావప్రగతి కనిపిస్తుంది.
ఇక కోమలి గురించి. కోమలి కుటుంబ స్త్రీ కాదు కాబట్టి జాణతనాన్నీ, లౌక్యాన్నీ తేలిగ్గా అంటగట్టచ్చు. ఎవరెవరితో తిరిగిందో, ఎంత మందిని డబ్బడిగిందో, ఎంత మందితో తన అవసరాలు తీర్చుకుందో లెక్కగట్టచ్చు. కానీ కోమలి లోని ఉనికే అర్థంకాని ముగ్ధను, అమాయకత్వాన్ని చూసిన దయానిధి నిజాయితీ మీద మాత్రం విమర్శకురాలికి అనుమానమే. అమృతం అవసరం కుటుంబం కోసం కాబట్టి "పవిత్రం". కోమలి అవసరం తనకోసం కాబట్టి ప్రాగ్మటిజం. ఈ వైరుధ్యం ఎవరిది. నటనకు పట్టంగట్టే మన నైతికతదా? పరిస్థితుల ప్రభావంలో జీవితాల్ని తమదైన విధంగా నిర్దేశించుకున్న ఈ ఇద్దరు మహిళలదా. ఐతే ఇద్దరూ జాణలే. లేకపోతే ఇద్దరూ పవిత్రమైనవారే. రెండూ కాకుండా ఏ జడ్జిమెంటూ లేకుండా ఆసక్తికరమైన, ఆలోచనను రేకెత్తించే, తాత్వికతను ప్రేరేపించే పాత్రలే. నా ఆప్షన్ మూడోది. ఇక పాఠకుల ఆప్షన్ వారి సంస్కారాన్ని బట్టి వారిది. విమర్శకురాలి కోణం మాత్రం ఇప్పటికీ (నాకు) అభ్యంతరకరమే.
ఒక విధంగా చూస్తే దయానిధి గమ్యం ఎప్పుడూ కోమలే. అయితే, ఆ గమ్యాన్ని చేరడానికి మరిన్ని అనుభవాలు అవసరమై జీవితాన్ని అలాఅలా గడిపాడు.దయానిధి గమ్యం తన తాత్విక చింతనద్వారా ప్రత్యామ్న్యాయ జీవన సిద్ధాంతాల్ని (తనకోసం) తెలుసుకోవడం. అలాంటప్పుడు "కోమలి అసలు స్త్రీయేకాదు. అన్ని శక్తుల్నీ తనలో కలుపుకుని దహించేసే ఒక జ్వాల. సంప్రదాయాలూ, ఆచారాలూ, నైతిక విలువలూ,కట్టుబాట్లు - అన్నింటినీ ముంచెత్తివేసే మహాసముద్రంలోని అఘాతం" అని గ్రహించిన మరుక్షణం తనను అందిపుచ్చుకోవలసింది. ఉన్న జీవన విలువల్ని కాల్చి-ముంచితేగానీ కొత్త సిద్ధాంతం పుట్టదుకదా! కానీ ఆ అద్వితీయ తీరానికి అప్పుడే చేరే ధైర్యాన్ని ప్రోది చేసుకోలేకపోయాడు. పారిపోయాడు. అనుభవాల్ని వెతుక్కున్నాడు. ఆనందాన్ని శోధించాడు. చివరకు కోమలి రాకతో, అప్పటివరకూ సంపాదించుకున్న అనుభవంతో సిద్ధాంతాన్ని స్థిరీకరించుకుంటాడు. అందుకే నవల అక్కడే అంతమవుతుంది.
మరణంతోనే జీవితానికి ముగింపు.కానీ దయానిధి శోధన "చివరకు మిగిలేది"ఏమిటో తెలుసుకోవడం. అది తెలుసుకున్నాడు. తను తెలుసుకున్న "సత్యం"తో ఎవరైనా విభేధించొచ్చు. కానీ తన తత్వచింతన, దానికోసమై తను చేసిన యత్నాన్ని నిరర్థకం అని తీర్మానించడం సబబు కాదు.కాబట్టి నవల తన సిద్ధాంతంతో కాకుండా తన మరణంతో మరణంతో అంతమవ్వాలన్న ప్రతిపాదన అర్థరహితం (పుట 4). కోమలి గమ్యం కూడా దయానిధే. అందుకే తిరిగొచ్చిన తరువాత "నేనప్పుడు పుట్టలా. నాకు తెలీకుండా అవన్నీ జరిగాయి. ఇప్పుడన్నీ తెలుసు నాకు. మీదగ్గరే ఉండనియ్యండి...లేకపోతే చచ్చిపోతాను!" అంటుంది. దయానిధికి, కోమలి " సంపూర్ణంగా ఏర్పడలేదని" ఎప్పుడో తెలుసు. ఈ చేతులు మారిన ప్రయాణంలో పూర్ణత్వాన్ని సంతరించుకుని తిరిగొచ్చింది. తమతమ అనుభవాలు పరిపూర్ణం చేసిన రెండు జీవితాలు ఒకదానికొకటి గమ్యమై వీరి కలయిక జరిగింది. అందుకే కులస్త్రీ అయిన అమృతాన్ని త్రోసిరాజని కోమలి ఈ నవలానాయిక అయ్యింది.
విమర్శకురాలు దయానిధి మీద వేసిన మరో అపవాదు "తనచుట్టూ వున్న అమ్మాయిలందరూ తనకొసం తపించిపోతున్నారని, తనపై ఉచ్చులు పన్నుతున్నారనీ మురిసిపోతూ రోజులు గడపటం" (పుట 3). నవలలోని ‘అనుభవానికి హద్దులు లేవు’ ప్రకరణ మొత్తంగా ఈ ఆకర్షణ,వికర్షణ,ప్రకర్షణలదే. ఇందులో దయానిధి మురిసిపాటుకన్నా, స్త్రీత్వంలోని మార్మికతను అర్థంచేసుకునే ప్రయత్నం కనిపించకపోవడం శోచనీయం. యవ్వనాకర్షణలోని స్వేచ్చననుభవిస్తున్న స్త్రీపాత్రల మధ్యనున్న సౌందర్యాస్వాదకుడైన యువకుడు ఆ స్త్రీల స్త్రీత్వాన్ని గురించి అర్థం చేసుకునే ఆలోచన చేస్తే అది సత్యాన్వేషణ కాదా? ఉన్న ఒక్కమగాడినీ తమవైపు తిప్పుకోవాలనే అసంకల్పిత ఆలోచన అక్కడున్న కోమలి,సుశీల,నాగమణి,అమృతం తమదైన విధంగా చెయ్యటం అత్యంత సహజపరిణామం. కాలేజీ టుర్లలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఇది కొత్తకాదే! ఒకమగాడు పదిమంది ఆడవాళ్ళ మధ్యనున్నా అదే జరుగుతుంది. ఒక స్త్రీ పదిమంది స్నేహపూరితమైన మగాళ్ళమధ్య ఉన్నా ఈ ప్రయత్నాలు తప్పవు. వాటి ఉద్దేశం "అనుభవించడం" కానఖ్ఖరలేదు. కానీ ఆకర్షించడం వరకూ అసంకల్పితంగా జరిగేదే.
మూల ఉద్దేశాల్ని గాలికొదిలి, ఆపాదనల మధ్య తీవ్రమైన ప్రతిపాదనలు చేసిన ఈ వ్యాసం యొక్క నిబద్ధత శంకించదగినదిగా అనిపించింది. దయానిధిలోని తాత్విక చింతనని మగవారిలోని సంకుచిత భావనలు అని నిర్ణయించి, విమర్శకురాలు చేసిన వ్యాఖ్య All men are bastards అనే (ఇక్కడా మరో స్త్రీని అవమానిస్తున్నామన్న స్పృహకూడా లేని) పిడివాదస్త్రీవాదుల భావజాలానికి అతిదగ్గరగా అనిపించింది. ఈ పునరావలోకనం ఎప్పుడు చేశారో తెలీదు. కానీ ఈ పునరావలోకనం మీద ఒక పునరాలోచనమాత్రం అత్యంత అవసరం అని నా నమ్మకం.