Tuesday, July 28, 2009

‘చివరకు మిగిలేది’ ఎందుకు చదవాలి?


"భావాలు చాలా చిత్రమైనవి. సొంతభావాలు,ఎవరివోలా కనిపిస్తాయి. ఎవరో చెప్పినవి మన సోంతంలా అనిపిస్తాయి. నిజంగా కొత్తభావాలంటూలేవు ఆకలి,నిద్ర,దాహం,ఆకర్షణ అసంతృప్తి, జీవితంపై మమకారం - అందరికీ ఇవి సమానమే. కొత్తవి ఎట్లావస్తాయి? భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు, మానవుల్ని విడదీస్తాయి" - బుచ్చిబాబు, చివరకు మిగిలేది.

నచ్చిన పుస్తకాలు చాలా ఉంటాయి. కానీ జీవితాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు కొన్నే ఉంటాయి. వాటి గురించి ఎప్పుడు రాయాలన్నా చిక్కే. ఎందుకంటే, చాలా వరకూ ప్రభావితం చేశాయనుకున్న పుస్తకాలుకూడా కొన్నాళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే "నిజమా!" అనే సందేహం కలుగుతుంది. అప్పట్లో ఈ పుస్తకం నన్ను ప్రభావితం చేసింది అని ఎందుకనుకున్నాను అనే ప్రశ్నకూడా ఉదయిస్తుంది. బహుశా ఆ వయసుకి అవసరమైన జ్ఞానాన్ని లేక అప్పటి సమస్యలకు సమాధానాల్ని ఆ పుస్తకాలు ఇవ్వడం వలన "ప్రభావితం" చేశాయి అనే భావన ఉన్నా, మళ్ళీ తిరిగి చూసుకుంటే జీవితాంతం ప్రభావాన్ని వీడిన పుస్తకంగా అది కనిపించకపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు "నా జీవితాన్ని ప్రభావం చేసిన పుస్తకం" అని ఏ పుస్తకాన్ని గురించి చెప్పాలన్నా నాక్కొంచెం బెరుగ్గా ఉంటుంది.

ఇప్పటివరకైతే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ పుస్తకాన్ని నిస్సందేహంగా జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకంగా చెప్పగలను. ఇంకో పది సంవత్సరాలకు మారితే...తెలీదు. ‘చివరకు మిగిలేది’ని నేను ఎనిమిదో తరగతి చదివినప్పుడు ఒక లెండింగ్ లైబ్రరీ నుంచీ తెచ్చుకుని చదివాను. సగానికి పైగా అర్థం కాలేదు. కానీ కొన్ని భాగాలు మాత్రం వెంటాడుతూనే ఉండేవి. ముఖ్యంగా ‘కోమలి’తో దయానిధి ప్రేమ. నాగమణికి దయానిధిపై గల ఆసక్తి. సుశీలకు దయానిధిపట్ల ఉన్న ప్రేమ-విముఖత. అమృతంలోని "ఆడతనం". ఇందిర సాధారణత్వం. దయానిధి తల్లి పాత్రలోని మర్మం. జగన్నాధం పాత్రలోని చలాకితనం. శ్యామల ‘సౌందర్య రాహిత్యం’ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. తెలిసిన మనుషులు, అర్థమయ్యీ కాని భావాలు ఒక విధమైన గుర్తుల్ని మిగిల్చాయి. అజ్ఞాతంగా, అసంకల్పితంగా ఈ నవల నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిందన్న విషయం కొన్ని సంవత్సరాలకిగానీ తెలిసిరాలేదు.


అప్పటి నుండీ ఇప్పటి వరకూ నా జీవితంలోని వివిధ దశల్లో ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏదో కనుక్కుంటూనే ఉన్నాను. కొత్త అర్థాల్ని వెలికితీస్తూనే ఉన్నాను. పుస్తకం తన మార్మిక పార్శ్వాల్ని అవిష్కరిస్తూనే ఉంది. పాత్రలు ఉల్లిపొరల్లాగా తమ వ్యక్తిత్వాల్నీ,అస్తిత్వాల్నీ ఒక్కో పొరగా విడిచి విడర్చి చూపుతూకూడా, మనసుకు పూర్ణంగా అవగతం కాకుండానే మిగులుతున్నాయి. నాయకుడు ‘దయానిధి’ నవలలో "జీవితానికి అర్థం ఏమిటి?" అని అడిగినట్లు, "చివరకు మిగిలేది లో ఏముంది?" అని ఇప్పటికీ ప్రశ్నించుకుని కొత్తకొత్త సమాధానాలు నాకైనేను కనుక్కొని సమాధానపరుచుకుంటూనే ఉన్నాను. "ఇది ఇంతే" అనే సమాధానం ఇప్పటికీ దొరకలేదు. దొరకాలని కోరుకోవడం కూడా లేదు.

ఈ నవల నాకు అంతగా నచ్చడంతో పాటూ నా జీవితాన్ని ప్రభావితం చెయ్యడానికి గల కారణాలు రెండు. ఒకటి ఈ నవల శైలి. రెండు నవల విషయంలోని తాత్విక కోణం, ఆ తాత్విక చింతనం యొక్క సిద్ధాంతీకరణ.

ఈ నవల శైలి గురించి "ప్రొఫెషనల్"గా చెప్పగలిగే జ్ఞానం నాకు లేకున్నా, ఈ నవల తీరులోని మానసికవిశ్లేషణాత్మకత (సైకో అనలిటికల్ అప్రోచ్) నన్నెప్పుడూ ఆకట్టుకుంది. ఏదో కథ చెబుతున్నట్లు కాకుండా, తన మనసునీ, ఆలోచననీ పంచుకున్నట్లుగా నాయకుడు దయానిధి తరఫునుంచీ సాగే వివరణ ఈ పుస్తకానికి అవసరమైన "ఆత్మ"ని అందించిందనిపిస్తుంది. కథలోని పాత్రల్ని, పరిస్థితుల్నీ వ్యక్తిగత-సామాజిక ‘విలువల’ కోణంలోంచీ కాకుండా, తన స్వతంత్ర్యాలోచన ద్వారా అర్థం చేసుకోవాలనుకునే నాయకుడి తపనను ఆవిష్కరించే ఈ నవలా శైలి అద్భుతం అనిపిస్తుంది. బహుశా ఈ శైలివల్లనే రచయిత బుచ్చిబాబుకూ నాయకుడు దయానిధికీ మధ్యనున్న తేడా అప్పుడప్పుడూ చెరిగిపోయినట్లుగా భావించాల్సి వస్తుంది. "జీవితంలో తాను తెలుసుకున్న విషయాలను కుదించి కథగా సమకూర్చడంతో తాను పొందిన అనుభూతిని కళగా మార్చి ఇతరులతో పంచుకునేటందుకు కృషి చేసేవాడు కథకుడు. కథకుడు చూసినవీ, అనుభవించినవీ, హృదయంతో తెలుసుకున్నవీ అతడితో కలిసిపోయి ధృక్పథం ద్వారా మార్పులకు గురై కొత్త స్వరూపంతో కొంత కాలానికి కథగా ఆకృతి తెచ్చుకుంటుంది" అని బుచ్చిబాబు బహుశా అందుకే అన్నాడేమో!

ఈ నవల శైలి కారణంగా పాఠకుడు దయానిధి హృదయంలో మిళితమై, మెదడు అలోచనల్లో భాగమై ప్రయాణించే, అనుభవించే, ఆలోచించే అవకాశం పొందుతాడు. అందుకే నవల చదివిన ప్రతి పాఠకుడూ అదే అనుభవాల్లోంచీ వేర్వేరు సమాధానాల్ని, పాఠాల్నీ అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. రచయిత తన అనుభవాల్లోంచీ మందుచీటీల్ని రాసి పాఠకుడిని ఉద్ధరించే ప్రయత్నం చెయ్యకుండా, తన అనుభవంలోకి ఆహ్వానించి తనతొపాటూ ప్రయాణించే అవకాశం ఇవ్వడం ఎంతైనా ముదావహం కదా!

నవలలోని తాత్వికత మరో ఆకట్టుకునే అంశం. పాఠకుడి అంతరాళాల్లో శోధనకు ప్రేరేపించే విషయం. "మనుషులందరికీ మనసుంటుంది. కొందరు దానిని గుర్తించనే గుర్తించరు. అనేకులకు దాని శక్తేమిటో అసలు తెలియదు. మనసు ఎంతో దూరం పోగలదు. దానికి ఎన్నో శక్తులున్నాయి. ఆచరణలోకి తీసుకొస్తున్న కొద్దీ ఒక్కోశక్తీ మనకు తెలిసి వస్తుంది" అంటాడు బుచ్చిబాబు. బహుశా ఆ శక్తే దయానిధిని జీవితాన్ని కేవలం జీవించడానికి కాకుండా జీవితాన్ని గురించి ఆలోచించడానికి పురిగొల్పుతుంది. దయానిధిది స్థూలజగత్తు కాదు. భావజగత్తు. ఒక తాత్విక జగత్తు. నవలంతా స్థూలజగత్తులోని సంకుచిత జీవితంలోని పరిధిని తన ఆలోచనలతో, మనసు శక్తితో విశాలపరుచుకోవడానికి దయానిధి చేసే ఒక యజ్ఞం.

ఈ యజ్ఞాన్ని భౌతికజగత్తు కోణంలోంచీ చూస్తే ఒక విఫల ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ, స్థూలజగత్తులోని అనుభవాల ఆధారంగా భావజగత్తులో తాత్వికతను వెతుక్కోవడం భవ్యోద్రేకానికి సంకేతం. ఆ భవ్యోద్రేకంలోంచీ వచ్చిన భావస్పష్టత ఒక తాత్విక సిద్ధాంతం అవుతుంది. ఇవన్నీ మనలాగా "సాధారణంగా" జీవించేవాళ్ళం చెయ్యలేం. మన సామాజిక చట్రంలో అలా జీవించడం బహుశా కుదరదేమో కూడా. అందుకే ఆ తాత్విక చింతనని బుచ్చిబాబు దయానిధి చేత మనకోసం చేయించాడు. దయానిధి జీవితం గాలివాటు గమనంలా అనిపించినా, తాత్విక విశ్లేషణతో ప్రధానమైన జీవిత సమస్యలైన ప్రేమ,ధనం, కీర్తి ఒక సైద్ధాంతిక సమన్వయాన్ని సాధించి పాఠకుడికి అర్పించాడు. ఆ అర్పణను అందిపుచ్చుకోవడం మన కర్తవ్యం.

‘చివరకు మిగిలేది’ ఒక కళాత్మకత వాస్తవిక వాదాన్ని అందించే నవల. అది సామాజిక వాస్తవికతకన్నా భిన్నంగా ఉన్నంత మాత్రానా "కల్పన" అని కొట్టిపారెయ్య తగదు. సంఘాన్ని సంస్కరించడానికో, నైతిక విలువలు స్థాపించడానికో ఈ నవల ప్రయత్నించదు. కాబట్టి, ఆ కోణంలో ఈ నవలను చదివితే దయానిధి ఒక విఫలుడిగా కనిపిస్తాడు. సాధకుడిగా కాదు. అందుకే నవల శైలిని అందులోని తాత్వికతల్ని అందిపుచ్చుకోగలిగితే, ఒక మార్మికలోకం సాక్షాత్కరిస్తుంది. ఆ మార్మిక లోకం మన మనోలోకానికి అతిదగ్గరగా ఉంటుంది. మనల్ని మనం కనుక్కోవడానికి, మన అంతరాలాల్లోని కొన్ని పార్శ్వాలతో పరిచయం పెంచుకోవడానికీ ఈ నవల ఉపయోగపడుతుంది.

అందుకే, నవల
"- కాలవగట్టున యిప్పటిలాగే ఏకాంతంలో గడ్డిలో పడుకుని అతను వేసుకొన్న ప్రశ్న "జీవితానికి అర్థం ఏమిటి?" ఈనాడూ అదే ప్రశ్న.
చివరికి మిగిలింది. దానికి సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేటందుకు తను చేసిన యత్నాల జ్ఞాపకాలు - తనలో తాను సమాధానం పడటం - అది మిగిలింది" అంటూ అంతమవుతుంది.

*****

18 comments:

వెంకటరమణ said...

చాలా బాగా వివరించారు మహేష్ గారు.
నేను ఒక 6 నెలల క్రితం నుండే పుస్తకాలను చదవటం మొదలు పెట్టాను. నాకు పుస్తకాల మీద ఆసక్తి ని కలిగించిన పుస్తకం గా 'చివరకు మిగిలేది? ' నిస్సందేహం గా పేర్కొంటాను. పుస్తకాలు చదివే ఆసక్టే కాకుండా, నా 'ఆలోచనా దృక్పధాన్ని ' మార్చిన పుస్తకం కూడా.
ఇలాంటి పుస్తకాన్ని గురించి వ్రాసినందుకు ధన్యవాదాలు.

ఇక ఈ నవల విషయానికి వస్తే, ఇందులో కధానాయకుడు 'దయానిధి ' అనుక్షణం సంఘంతో ఘర్షణ పడతాడు. సమాజంలోని దురాచారాలకు బాధపడుతూ ఉంటాడు. సమాజం అతని తల్లి శీలాన్ని గురించి చెడుగా చెబుతూ, అతన్ని హింసించటం వలనే అతడు ఏకాకిగా మిగిలిపోయాడని నవల్లో అనిపించినా, ఈ విషయాన్ని అనేక విధాలుగా అన్వయించవచ్చు. ఉదాహరణకు, ప్రాంత, మత, కుల,భాష, వేషం .... మొదలైన వివక్షతలతో సమాజంలో చాలామంది 'దయానిధులు ' తయారవుతారు.

అతనికి సరియైన రీతిలో ప్రేమ దొరకదు కాబట్టే , అతను వేరే ఎవరినీ ప్రేమించలేకపోతాడు. కానీ 'అమృతం ' ,'కోమలి ', 'నారయ్య ' , 'కాత్యాయని ' ల ప్రేమే మళ్ళీ మామూలు మనిషి గా మారుస్తుంది.

అప్పటి వరకు సమాజాన్నీ, చుట్టూ ఉన్న మనుషులను ద్వేషించే దయానిధి వారిని అంగీకరించే స్థితికి చేరుకుంటాడు.

సమాజం లో ఉన్న ఆచారాలను అంగీకరించగలుగుతాడు.
మానవునికి కావాల్సింది 'దేవుళ్ళు, మ్రొక్కుబడులు, మతం కాదు కావాల్సింది. మానవుడికి కావాల్సింది "దయ", "జాలి". కాస్తయినా చాలు ' అని తెలుసుకుంటాడు.

అప్పటినుంచి కోమలితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమౌతాడు.

ఇందులో దయానిధి తనలోకి తాను చూకోగలిగే తత్వం ఉన్నవాడు . అందుకనే తనలో లోపాలను సరి దిద్దుకో గలుగుతాడు.
కానీ చాలా మంది అలా చూసుకోలేరు. అటువంటప్పుడు సమాజంలో కొట్లాటలు, గొడవలు, అరాచకత్వం ప్రబలుతుంది. మానవుల మధ్య పరస్పర ద్వేషమే నవల వ్రాయటానికి నిర్నయించుకున్నానంటారు "బుచ్చిబాబు '.

gaddeswarup said...

మీరు చెప్పారు గాబట్టి దొరికితే మళ్ళీ చదువుతాను. నేను తెలుగులో చదివిన కొద్ది పుస్తకాలలో ఇది నాకు రక్తంలేని పుస్తకము అనిపించింది. ఇంతకంటే 'అసమర్థుని జీవయాత్ర', 'చిల్లరదెవుళ్ళు' గట్టి పుస్తకాలని అనిపించింది. బహుశా 'కాలాతీత వ్యక్తులు' గూడా. పంకజ్ మిశ్ర రాసిన "Edmund Wilson in Benares" లాంటి కథలు తెలుగులో ఏమైనా ఉన్నయ్యోమో చెప్తారా?

వెంకటరమణ said...

ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. తెలుగు నవలలో బుచ్చిబాబు గారి వంటి రచనా శైలి ని ఇంతవరకు చూడలేదు. మళ్ళీ అటువంటి రచనా శైలి వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం, హిమజ్వాల నవల్లోలే చూశాను.

స్వరూప్ గారు అన్నట్లు గోపీచంద్ గారి 'అసమర్ధుని జీవయాత్ర ' కూదా అందరూ తప్పక చదవాల్సిన పుస్తకమనే అనుకుంటున్నాను.

'చివరకు మిగిలేది ' లో బుచ్చిబాబు గారు ఉపయోగించిన భాష వచన కవిత్వం లాగానే ఉంటుంది. భావాల్లో గాఢత ఎక్కువ ఉంటుంది.
ఒక్కసారి చదివితే పూరిగా అర్ధం కాదు. ఈ పుస్తకం ఎన్ని సార్లైనా చదివింపచేస్తుంది. చదివిన ప్రతిసారీ ఏదొక కొత్త అర్ధాన్ని స్పురింప చేస్తుంది.

నేను మాత్రం వారానికి ఒక్కసారైనా ఈ నవలలో అక్కడక్కడా చదువుతూనే ఉన్నాను.

కొత్త పాళీ said...

బాగా చెప్పారు.
నా మట్టుకు నాకు ఈ నవలంటే చాలా చిరాకు. కానీ నవలని చాలా వొడుపుగా నిర్మించారు బుచ్చిబాబు అని ఒప్పుకుంటాను.

ప్రేమికుడు said...

ఎప్పుడో చదువుదామని కొని ఒక సారి చదివాను. కానీ రచయిత అంతరంగం అంతగా అర్ధమవ్వలేదు. మరో సారి చదువుదాములే అనుకున్నా అది తఠస్థించలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే మరో సారి చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు :)

సుజాత said...

నేనొప్పుకోను. ఇది నేను రాద్దామనుకుంటున్న టపా! అన్యాయం! మళ్ళీ వస్తానుండండి!

గీతాచార్య said...

Hmm

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత:ఈ నవల గురించి ఎంత రాసినా, ఎందరు రాసినా తక్కువే. కానివ్వండి. మీ టపా కోసం వెయిటింగిక్కడ. నిజానికి ఈ టపాకూడా మురళిగారి "అమృతం" టపా నుంచీ నాకొచ్చిన ఆలోచనే.

@కొత్తపాళీ:మూడ్ బాగా లేనప్పుడు ఈ నవల చదివినట్టున్నారే! నాకోసం మరో సారి ప్రయత్నించండి.

@వెంకటరమణ: నిజమే. ‘చివరకు మిగిలేది’ చాలా భాగాల్లో వచన కవిత్వంలాగానే అనిపిస్తుంది. బుచ్చిబాబు గారి శైలి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.

శ్రీ said...

నేను ఈ మధ్యనే కొన్న పుస్తక్కాల్లో ఇది ఒకటి. ఒక 20 పేజీలు చదివాను ఇప్పటివరకు.

భావన said...

మంచి పుస్తకం... నాకైతే రెండు సార్లు పైనే చదవ వలసి వచ్చింది అసలు కధ ఏమిటో అర్ధం చేసుకోవటానికి, ఇంక లోతు గా అర్ధం కావాలంటే ఒక జీవితం పడుతుందేమో... కథ చదువుతున్నంతసేపు చాలా దిగులు వేస్తుంది నాకు ఎంత సంఘర్షణ అని.

ఉష said...

మహేష్, మురళీ గారి టపాలో చర్చ తర్వాత మీనుండి ఈ టపా రానుందనిపించింది. నాయకుడు దయానిధి తరఫునుంచీ సాగే కథని మీ విశ్లేషణ జోడించి మళ్ళీ ఓ సారి చదవాలనిపించారు. కానీ అమృతం మీద ఆ అభిప్రాయంతో ఏకీభవించను. అలాగని మీతో విరోధించను కూడా.
సుజాతా, మీరు స్త్రీ పాత్రల పరంగా ఓ విశ్లేషణ వ్రాయకూడదాండి?

S said...

నేనూ ఇటీవలే ఈ నవల చదివాను. నాకు మరీ అంతగా నచ్చలేదు కానీ, శైలి, వర్ణనలు నచ్చాయి.
మీ వ్యాసం-నవల గురించిన సమీక్ష చాలా బాగుంది.

సుజాత said...

ఇంతకు ముందెక్కడో రాశాననుకుంటా....ఈ నవల చదువుతుంటే చేతికందినట్టే ఉండి తప్పించుకుపోయే విషయమేదో దీంట్లో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది నాకు , ఎన్ని సాల్రు చదివినా సరే!

‘కోమలి’తో దయానిధి ప్రేమ. నాగమణికి దయానిధిపై గల ఆసక్తి. సుశీలకు దయానిధిపట్ల ఉన్న ప్రేమ-విముఖత. అమృతంలోని "ఆడతనం". ఇందిర సాధారణత్వం. దయానిధి తల్లి పాత్రలోని మర్మం. జగన్నాధం పాత్రలోని చలాకితనం. శ్యామల ‘సౌందర్య రాహిత్యం’ ఇవన్నీ చాలా బాగా అనిపించడానికి ముందు అయోమయానికి గురి చేశాయి నన్ను.(ఒక పక్క బాగానే అనిపిస్తూ కూడా) ఏ ప్రేమానుభవమూ లేకుండానే దయానిధికి అందరూ వివిధ స్త్రీలతో సంబంధాలు అంటగట్టడం సమాజం వికృత స్వరూపాన్ని ఆవిష్కరించినట్లనిపిస్తుంది.

నా లైబ్రరీలో నిరంతరం చదివే పుస్తకం ఏదైనా ఉందంటే అది "చివరికి మిగిలేది" మాత్రమే! ఎన్ని సార్లు చదివినా కొత్తగానే, ఇంకా ఏదో తెలుసుకోవాలనిపించే విషయం మిగిలిపోయినట్లనిపించే పుస్తకం ఇది. బుచ్చి బాబు ఏ మెంటల్, సైకలాజికల్ స్టేటస్ లో ఉండి రాశారో అర్థం కాదు కానీ ఇలాంటి నవలలు పాత్రలు సృష్టించాలంటే ఎంతో కొంత వ్యక్తిగతానుభవాలు కూడా తోడై ఉండాలి.(నా అభిప్రాయం మాత్రమే)

దయానిధిని తనలోనే ఉన్నట్లు భావించుకుని ప్రతి పాఠకుడూ(పాఠకురాళ్ళు కూడా) చదివే నవల ఇది.

ప్రతి పాత్రా ఒక అనంతమైన విషయాన్ని తనలో దాచుకున్నట్లు కనిపిస్తుంది. కోమలి, ఇందిర, సుశీల..జగన్నాథం..ఇలా అందరూ! కేతిగాడిలా జోకులేస్తూ, సరదా తెలుగు అనువాదాలు చేస్తూ ఉండే చలాకీ జగన్నాధం గోదావరి ఒడ్డున గుడిసె వేసుకుని తాత్విక చింతనలో మునగడం గొప్ప ఆశ్చర్యాన్ని కల్గించే విషయంగా కనపడింది నాకైతే!

చదవడానికి కొత్త పుస్తాకాలేమీ లేనప్పుడు చివరికి మిగిలేది తీసి కొత్త పుస్తకం చదివినంత ఉత్సాహంగా చదవగలను. కాలాతీత వ్యక్తులు-చివరికి మిగిలేది ఈ రెంటిలో నా అభిమాన నవలేది అని అడిగితే రెంటికీ వోటేసి వోటు చెల్లకుండా చేస్తాను గానీ జవాబు సరిగా చెప్పలేను.

ఉష గారు,
అద్భుతమైన అయిడియా ఇచ్చారు. ప్రయత్నిస్తే బాగుండేట్లే ఉంది.

వెంకటరమణ said...

// సంఘాన్ని సంస్కరించడానికో, నైతిక విలువలు స్థాపించడానికో ఈ నవల ప్రయత్నించదు. కాబట్టి, ఆ కోణంలో ఈ నవలను చదివితే దయానిధి ఒక విఫలుడిగా కనిపిస్తాడు. సాధకుడిగా కాదు.

మీరు వ్రాసిన వ్యాసంలో, పై విషయం మీద నేను విభేదిస్తున్నాను మహేష్ గారు.
ఈ నవలకు సామాజిక ప్రయోజనం లేదని అనుకోలేను. రచయిత తనంతట తానుగా ప్రజలను సంస్కరించాలని నవలలో ఎక్కడా చెప్పకపోయినా, దయానిధి స్వగతంలో అనుకొనే విషయాలను వివరించేటప్పుడు అది పాఠకుడికి గోచరమౌతుంది.

ఈ విషయాన్ని బుచ్చిబాబు గారు ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. అచ్చు ఇలాగే కాకపోయినా ఈ విధంగా వ్రాసినట్లు గుర్తు
"ఈ నవల నాకోసం వ్రాసుకున్నాను. ఎవరికీ అర్ధంకాకపోయినా పర్వాలేదు అని నేననుకోలేను. రచయిత తను తెలుసుకున్న విషయాన్ని నలుగురితో పంచుకున్నపుడే అతనికి విముక్తి. స్వీయ విముక్తే ఈ నవల వ్రాయడానికి ప్రేరణ."

మనుషుల మధ్య ఉన్న పరస్పర ద్వేషమే, అది ఎందుకు కలుగుతుందో తెలుసుకుందామనే ఈ నవల వ్రాసానని బుచ్చిబాబు గారు చెప్పారు.

"తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు" అని నవలలో దయానిధి చివరకు తెలుసుకుంటాడు.
సమాజంలో ఉన్న పరస్పర ద్వేషమే వ్యక్తులను ప్రేమించలేకుండా చేస్తుందని చెప్పదల్చుకున్నారు.

కత్తి మహేష్ కుమార్ said...

@ఉష:మళ్ళీమళ్ళీ చదవాల్సిన నవల ఇది. నా విశ్లేషణ మిమ్మల్ని మరో సారి చదివిస్తే, నా అదృష్టం.

అమృతం విషయంలో నా వ్యాఖ్యానం ఒక ధృక్కోణం మాత్రమే. కాబట్టి ఒక పాఠకురాలిగా మీ అభిప్రాయం మార్చుకోవలసిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పిన ధృక్కోణంలోంచీ ఒకసారి చూడటానికి ప్రయత్నించండి.

అమృతం ఒక జీవితేచ్చ కలిగిన మహిళ.ఆ ప్రయాణంలో (సామాజిక కోణంలో) తను విజయవంతురాలు కూడా. తన ప్రేమ "నిస్వార్థం" కానక్కరలేదు. స్వార్థంతో ప్రేమించినా తప్పులేదు. కాబట్టి నేను అమృతం విలువల్ని బేరీజు చెయ్యటం లేదు. తన పరిస్థితుల్ని,తన బ్రతకనేర్చినతనాన్ని గుర్తిస్తున్నాను. అంతే.

ఎలాగూ సుజాత గారు ‘చివరకు మిగిలేది’లోని స్త్రీపాత్రల గురించి పూనుకుంటున్నారు కాబట్టి ఇంతటితో నా అమృతం విశ్లేషణ ఆపుతాను.

@సుజాత: మీరు సింపుల్గా చెప్పేసి, నాతో చాలా కాంప్లెక్స్ ఆలోచనలు చేయించేస్తున్నారండీ బాబూ!

"అనుభవాన్ని ఊహల్లో తిప్పుకుని తన స్వార్థంతో ముడిపడ్డ వ్యక్తిగత ఛాయల్ని తొలగించి రచన ద్వారా ఇతరులతో పంచుకుని అంతరంగం బాధ నుండి విముక్తుడవాలి రచయిత" అంటారు బుచ్చిబాబు. ఈ విమోచనోద్యమమే కళాసృష్టికి ప్రేరణ అవుతుందని భావిస్తారు. అందుకే మీరు ఇలాంటి పాత్రలు సృష్టించాలంటే వ్యక్తిగత అనుభవం తోడై ఉండాలి అంటే అంగీకరించక తప్పదు. లేకపోతే ఈ ఘాడత ఎలా వస్తుంది చెప్పండి? ఆ స్థాయి భావ భూమిక లేకపోతే ఇంతటి ఉచ్చస్థాయి రచన అసలు జరుగుతుందా?

‘సౌందర్య రాహిత్యం’ గురించి చాలా బాగా చెప్పారు. మొదట్లో అలాంటి మానసిక జబ్బొకటి ఉంటుందంటేనే నమ్మబుద్దెయ్యలేదు నాకు. కానీ ఒకటి మాత్రం నిజం. అందరూ సౌందర్యాన్ని ఒక్కలాగా అనుభవించలేరు. అందరి సౌదర్య నిర్వచనమూ ఒకటి కాదు. సౌందర్య రాహిత్యం ప్రకరణం ద్వారా బుచ్చిబాబు కళాసృజన గురించి,మనిషిలోని సౌందర్య"శక్తిని" గురించి చాలా చెప్పాడనిపిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే చాలా అనుభవం,జ్ఞానం కావాలి. అవి ఎప్పుడో ఒకప్పుడు నాకు సమకూరి అర్థం చేసుకోగలననే ఆశ నాలో ఇంకా ఉంది.

మీరు ఎలాగూ స్త్రీపాత్రల గురించి రాస్తున్నారు కాబట్టి నేను పురుషపాత్రలు ముఖ్యంగా రాజా(రాజ భూషణం),జగన్నాధం గురించి రాయడానికి ప్రయత్నిస్తాను.

@భావన: నిజమే. జీవితాంతం కొత్త అర్థాలు గోచరించే నవల యిది. కాబట్టి చదువుతూ ఉండటమే. కాకపోతే మీరు దిగులులోంచీ ఆలోచన దిశగా, ఆలోచన లోంచీ అనుభవం దిశగా పఠనను తీసుకెళ్ళగలిగితే ఈ నవల ఒక personal discovery - స్వీయశోధన గా పనికొస్తుంది.

@వెంకటరమణ: నవల వల్ల సామాజిక ప్రయోజనం జరిగిందా లేదా అనేది కాదు ప్రశ్న. రచయిత సమాజన్ని "ఉద్దరించడానికి" రాశాడా లేదా అనేది ప్రశ్న.

బుచ్చిబాబు ఉద్దేశం స్వీయవిముక్తి. That is a personal quest rather than an intention to reform society based on his deliverance.అందుకే సామాజిక- నైతిక విలువల స్థాపనను కేంద్రంగా నవలను బేరీజు చెయ్యకూడదంటున్నాను.

వెంకటరమణ said...

సమాజాన్ని ఉద్ధరించడానికి రాశారని చెప్పను. కానీ సామాజిక ప్రయోజనం ఉన్న నవల అని ఖచ్చితంగా చెప్పగలను.

చిన్ని said...

మీ దృక్పధం లో చదివే ప్రయత్నం లో వున్నాను ,నా నుండి రెక్కలు వచ్చి ఏ స్నేహితురాలి వద్ద వాలి వుందో తెలుసుకోలేక మరల విశాలాంద్ర నుండి తెప్పించుకున్నాను . ఈ లోపు సుజతగారేలాను రాస్తారు ,అప్పుడోస్తాముపూర్తి స్థాయిలో చర్చలో పాల్గొనడానికి.

mohanraokotari said...

maanava manasthatvaalu entha chitra mainavo kada..