Monday, July 13, 2009
ఖాకీబతుకులు
తాగుతున్న టీ ముగిస్తూ మిత్రులు అప్పాజీ, "నువ్వు చదవాల్సిన పుస్తకమొకటుంది. పద!" అన్నారు.
పదినిమిషాల తరువాత NRS హాస్టల్లో ఉన్నాం. నాచేతిలో చెక్క తుండంత పుస్తకం ఒకటి పెట్టాడు.
పుస్తకం పేరు ‘ఖాకీబతుకులు’. రచయిత స్పార్టకస్.
"ఎప్పుడూ వినలేదే?" అనాను.
"ఇప్పుడు చేతికొచ్చింది కదా. చదువు." నవ్వుతూ అన్నారు అప్పాజి.
"అంతమంచి పుస్తకమా?" మరో ప్రశ్న.
"చదవాల్సిన పుస్తకం"
"ఎందుకుచదవాలి?"
"ఎందుకో నేను వివరించలేను. అందుకే చదవాలి."
"ఇంతకూ దేనిగురించీ పుస్తకం?"
"పోలీసుల గురించి. దళితుల గురించి.దొరతనం గురించి. జీవితం గురించి. బాసిజం గురించి. బానిసిజం గురించి. పోలీసుల కష్టాల గురించి. వ్యవస్థ సంస్కరణల గురించి.మనుషుల గురించి."
"చాలా ‘గురించిలు’ ఉన్నాయే! "
"ఐతే చదువు. ఇప్పుడే వస్తాను" అని అప్పాజీ వెళ్ళిపోయారు.
పుస్తకాలలోని ముందుమాటని చివర్లో చదివే అలవాటు నాది. ఆ రాసింది రచయితే అయితే, "చెప్పాల్సిన సోది పుస్తకంలో చెప్పేసి మళ్ళీ కొసరు సోది ఎందుకురాస్తోరో" అనుకుని ముందుమాటలు మొదట్లో చదవను. వేరొకరు రాస్తే, "వీడి అభిప్రాయం ముందేచదివేసి ఆ కళ్ళజోడుతో పుస్తకం చదివితే నాకళ్ళెందుకని?" అనుకుని ఆ ముందుమాట చదవను.
సూటిగా...పుస్తకంలోకే దూకాను.
బాధపడ్డాను. ఆవేశపడ్డాను. ఆవేదనకు గురయ్యాను. ఆశ్చర్యపోయాను. నా అజ్ఞానానికి చింతించాను. కొపగించాను. వ్యవస్థను పెళ్ళగించాలని విప్లవించాను. అస్సహాయంగా తిట్టుకున్నాను.
అప్పాజీ ఎనిమిది గంటలకొచ్చి "బోజనానికి వెళ్దాం" అన్నారు.
"నాకు ఆకలిగా లేద"న్నాను.
పదకొండు గంటలకి అప్పాజీ పడుకుంటూ," నిద్రపోవా?" అని అడిగారు.
"ఇది చదివేసి" అన్నాను.
గుండెబరువెక్కింది. కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఏడ్చాను. ఏడుస్తూ చదివాను. కళ్ళ మసకల్లోంచీ అక్షరాల్ని చీల్చుకుంటూ చదివాను. నన్నునేను కాల్చుకుంటూ చదివాను. నాలాంటి ఎందరివో జీవితాలతో పోల్చుకుంటూ చదివాను. పుస్తకం గురించి అడుగుతూ నేను వృధాచేసిన నాలుగు నిమిషాల్నీ తల్చుకుంటూ చదివాను.
దాదాపు 800 వందల పేజీల పుస్తకం. తెల్లారి ఏడుగంటలకి పూర్తయ్యింది. పుస్తకాన్ని చేతిలో పట్టుకుని హాస్టల్ వరకూ కలలో వచ్చాను. పుస్తకాన్ని దిండుగా మార్చుకుని కాట్ మీద పడుకున్నాను. కలత నిద్ర. కలల నిద్ర. భయంకరమైన నిజాల నిద్ర. ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన నిద్ర. రొజంతా నిద్ర. ఆ రోజు క్లాసులకు పోలేదు. ఇప్పటీకీ ఆపుస్తకం నీడ నన్ను విడిచిపోలేదు.
ఆ తరువాత ఆ పుస్తకం నాలో మిగిలిందేతప్ప నాచేతికి మళ్ళీ అందలేదు. 2003 లో సొంతంగా పుస్తకాలు కొనే స్థాయికి వచ్చినప్పటి నుంచీ ఆ పుస్తకం కోసం వెతుకుతూనే ఉన్నాను.
"ఔట్ ఆఫ్ ప్రింట్"
"ఆ పుస్తకం దొరకదండీ"
"ఒకే సారి ప్రింట్ అయ్యిందండీ. ఇప్పుడు లేదు."
"ఎప్పుడు వస్తుందో తెలీదు." ఇవే సమాధానాలు వింటూ వస్తున్నాను.
ఈ మధ్యనే అమెరికాలో ఉన్న ఒక స్నేహితురాలు. "నాదగ్గరుంది. కావాలా" అంటే నా చెవుల్ని నేనే నమ్మలేదు.
బహుశా నమ్మలేదు కాబట్టే, మర్చిపోయానుకూడా.
హైదరాబాద్. జూలై, 2009
నిన్న హైదరాబాదొచ్చి కలిసినప్పుడు, నా ముందొక పుస్తకం పెట్టారు.
"ఖాకీబతుకులు" రచయిత "స్పార్టకస్"
కళ్ళల్లో నీళ్ళొచ్చాయో లేదో తెలీదు. పుస్తకం మాత్రం మసగ్గా కనిపించింది.
మళ్ళీ అదేరాత్రి పునరావృతమయ్యింది. చదివాను. మళ్ళీ చదివాను.
ఈ నవల మొదటి భాగం మాత్రమే. రెండో భాగం ఇంతవరకూ రాలేదు. వ్యవస్థ ఇలా ఉండేంతవరకూ బహుశా రాదుకూడా.
ఏమీ మారలేదు. ఈ రోజు నేను ఆఫీసుకి వెళ్ళలేదు. అంతే!
*****
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
Your quisition (శోధన) ended finally. I just missed when it's under my sleeve.
Hmm. Good luck.
Could have written more about it.
అంత సీనేం లేదు. పోలీసు వ్యవస్థ గురించి సాధారణంగా బయటికి తెలియని కొన్ని విషయాల్ని చెబుతుంది. అఫ్కోర్సు, మీ స్పందన మీది, కాదనడం లేదు.
@కొత్తపాళీ: దాదాపు మీ స్పందనలాంటి స్పందనే శ్రీరమణ ‘మిధునం’ కథ గురించి ("అంతసీనేం లేదు" అని) నేననుకున్నాను.కాబట్టి స్పందనకేముంది లెండి. అది వ్యక్తిగతం. ఈ టపాకూడా వ్యక్తిగతమే కదా!
ఈ నవల "సాధారణమయ్యింది" అయ్యుంటే దీనివెనుక ఇంత state conspiracy అవసరమయ్యేది కాదు. రచయితపై డిపార్టుమెంట్ పెద్దల కక్ష సాధింపు చర్యలు జరిగేవి కావు. ఉద్యోగం ఊడగొట్టి గొంతు నొక్కేంతవరకూ వచ్చేవే కాదు. రెండవభాగం రాయనీయకుండా ఆపేంతవరకూ, ఉన్న పుస్తకం ఎక్కడా దొరకనీయనంత వరకూ ప్రయత్నించే అవసరం వచ్చేది కాదు.
నావరకూ ఖాకీబతుకులు అలెక్స్ హెలీ ‘రూట్స్’ తో సమానం.
నావరకూ ఖాకీబతుకులు అలెక్స్ హెలీ ‘రూట్స్’ తో సమానం. Is it?
RighttO!
ఒక రచన అసాధారణం కావడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. వేర్వేరు లక్షణాల వల్ల అది అసాధారణం కావచ్చు.
ఒక పుస్తకం మీద రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం చెయ్యడం ఒక లక్షణం. ఒక పాఠకుడికి ఆకలి దప్పులు నిద్ర గుర్తు రానివ్వకుండా తనలో కరిగించేసుకుని కంట తడి పెట్టించడం పూర్తిగా వేరే లక్షణం.
ఈ పుస్తకం ఒక పాఠకుడిగా నన్నెందుకు నిరాశా పరిచిందో, ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివిన సమయంలో సమగ్రమైన విమర్శ రాశాను. ఇప్పుడది అందుబాటులో లేదు, అదంతా ప్రస్తుతం గుర్తూ లేదు. మౌలికంగా ఒకటి గుర్తుంది. ఒక వ్యక్తి చరిత్రలా ఆత్మకథలా రాయాల్సిన విషయాన్ని ఫిక్షనుగా రాయడం మొదటి కారణం. తను రాయదల్చుకున్న రచన స్వరూపం మొదలూ తుదా తెలియకుండా రొడ్డకొట్టుడులా రాసుకు పోవడం రెండో కారణం. ఒక వ్యక్తి చరిత్రగా రాణించేది, నవలగా విఫలమైంది.
అఫ్కోర్సు, విడుదలైన తొలి రోజుల్లో దేశంలో గొప్ప సంచలనమే సృష్టించింది, కనీసం రెండు కూర్పులు పడింది. మీరు ప్రదర్శించిన కవరు కూడా మలి కూర్పు, తొలికూర్పు కాదు.
ఖాకీ బతుకులు రచయితను నేను విరసం సభలల్లో ఆర్టిస్ట్ మోహన్ గారితొ వున్నప్పుడు కలిసాను. మనిషి రగిలె అగ్ని పర్వతంలానే వుంటారు. పతంజలిగారి ఖాకీవనం పరిచయాలతో రాసింది అయితే ఇది స్వానుభవం. మీ స్పందనకు నా వందనం..
బాధపడ్డాను. ఆవేశపడ్డాను. ఆవేదనకు గురయ్యాను. ఆశ్చర్యపోయాను. నా అజ్ఞానానికి చింతించాను..
------------------------------
ఈ రోజు నేను ఆఫీసుకి వెళ్ళలేదు. అంతే!..
--------------------------------
సస్పెన్సా??? విన్నప్పడినుండి.. నేను ఒక సారి చదివితె బాగుండు అని అనిపిస్తుంది.. కాని ఆ పుస్తకం దొరకడం కష్టమేమొ..
@కొత్తపాళీ: ఈ పుస్తకం ఒక పాఠకుడిగా కాదు, ఒక సాహితీ విమర్శకుడిగా మిమ్మల్ని సంతృప్తి పరచలేదని మీ వ్యాఖ్యద్వారా అర్థమవుతోంది.
రచనాస్వరూపం,శైలి,కథాంశం,శిల్పం ఇవన్నీ ఈ రచయితకు అప్రస్తుతాలు. ఒక దళిత కానిస్టేబుల్ తన తండ్రి జీవితం, తన జీవితాన్ని తరచిచూసుకుని ఆ బాధకు అక్షరరూపాన్నిచ్చాడు. ఆ భిన్నమైన జీవితాన్ని కథరూపంలో చెప్పాడు. అందులో మీకు "కావ్యసౌందర్యం" కనిపించక బహుశా "రసస్పందన" కలగలేదు. కానీ నాకు తన హృదయ వేదన కనిపించింది. నాకు తెలిసిన జీవితం కనిపించింది. స్పందించాను. నన్ను కదిలించింది. అందుకే నెత్తికెక్కించుకున్నాను.
ఈ రచయిత ఉద్దేశం "రాణించడం" కాదు.తన రోదనను వినిపించడం. తనలాంటి బ్రతుకులున్నాయని. వాటికి అస్తిత్వాలున్నాయని. వాటికి గౌరవాలు కావాలని. మనుష్యులుగా గుర్తించే అవసరం రావాలనే రోదనను వినిపించడం.అందుకే బహుశా మీకు "రోడ్డుకొట్టుడు"లా అనిపించుంటుంది.
ఈ రచయితకు రచనా స్వరూపాలూ,వాక్య నిర్మాణాలూ, రసవత్తరమైన వర్ణనలూ చేతకావు. జీవితాంతం కరుడుగట్టిన పోలీసుగా బ్రతికిని బరువుని దింపుకుని, "నేనిలా ఉండటానికి నాదైన కారణం ఉంది" అని గుండెలవిశేలా చెప్పుకునే బలవత్తరమైన కోరికని తీర్చుకున్నాడు.
నాలో పాఠకుడూ, సాహితీ విమర్శకుడు వేరు వేరు కాదు.
సాహిత్యంలో వ్యక్తి అనుభవాల (personal narratives) కి సముచిత స్థానం ఉంది. కాదనడం లేదు. అటువంటిక్వి కొన్ని ఉత్తమ సాహిత్య స్థాయికి ఎదిగినవీ ఉన్నాయి. Women Writing in India సంకలనంలో తెలంగాణా సాయుధ పోరాటంలో పోరాడిన ఒక చదువురాని మహిళ తన సొంత మాటల్లో చెప్పిన కథనం ఒకటుంది. వాక్యనిర్మాణమూ రచనా స్వరూపమూ స్పార్టకస్ గారికి తెలిసినంత మాత్రం కూడా ఆమెకి తెలియవు. ఐనా ఆ భాగం చదివినప్పుడు వొళ్ళు గగుర్పొడిచింది. రచయితగా ఆయన ఉద్దేశాన్నీ నిజాయితీనీ నేను శంకించడం లేదు. He executed it badly. Again, I am not questioning your experience of it. Just as you are trying to say it is a great work, I am trying to show it is a mediocre work. Ok, I am going to stop here.
Must be interesting. Nice effort.
Kottapali garu,
Do you mean "Women writing in India" edited by Susie Tharu and K. Lalita ? If so, can you mention the name of the author? I have a copy of the above book and could not locate the piece quickly. thanks.
Swarup
చాలా చాలా బావుంది. మంచి రచన. ఈ టపా బావుంది.
this post is very nice........and the conversation b/w u and kotaapali garu also nice............
meeru chadivaaru ok..mari memu ela chadavaalo koncham cheppandi boss.........
http://epaper.sakshi.com/Details.aspx?id=232706&boxid=28680880
కొత్త పాళి గారికి, మీరు నాణానికి ఒక వైపు మాత్రమే చూస్తున్నారు.మీరు పోలీస్ జీవితాల లోకి తొంగి చూడండి,అప్పుడు తెలుస్తుంది వారి జీవితాల గురించి
Post a Comment