Monday, July 6, 2009

వామపక్ష చరిత్ర - ఒక చారిత్రాత్మక అవసరం


స్వాతంత్ర్యం వచ్చేనాటికి మనకున్న చరిత్ర, బ్రిటిష్ వారు తమకోసం రాసుకున్నది. స్వాతంత్ర్యానంతరం మతకల్లోలాలూ,దేశవిభజన, ఇంకా ఏకీకృతంకాని దేశం, పరిపాలన స్థిరమవ్వని పరిస్థితి నేపధ్యంలో "చరిత్ర పునర్నిర్మాణానికి"పూనుకున్న దేశం మనది. అప్పటికి కనీసం ఒకదేశం కూడాకాని భారతదేశానికున్న అత్యంత అవసరమైన కార్యాలు "దేశనిర్మాణం"(national building), ఏకత్వంలో సాధించాల్సిన సుస్థిరత (stability
with unification). ఈ రెండు ముఖ్యాశయాలను సాకారం చేసే చరిత్ర నిర్మాణం ఒక చారిత్రాత్మక అవసరం.

దేవుడి లీలలు, రాజుల-ప్రభువుల ఘనత తప్ప అప్పటివరకూ చరిత్రను చరిత్రగా రాసుకి ఎరుగని జాతి మనది. అందుకే మన దగ్గర కల్పనలుంటయిగానీ కాలమానాల్ని ఖచ్చితంగా లెక్కగట్టే కొలమానాలు కానరావు. అలాంటి పరిస్థితిలో వాటిని ప్రమాణాలుగా తీసుకుని చరిత్ర రాస్తే అది మత చరిత్రగా మిగిలిపోతుందేతప్ప మతాతీత నిజంగా కనిపించదు.అప్పటికే మతం బలహీనపరిచిన దేహంగా మిగులున్న దేశానికి మతచరిత్ర అవసరమా! అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. ముఖ్యంగా హిందూ-ముస్లిం కోణంలోంచీ చరిత్రను పునర్లిఖిస్తే దేశ సమగ్రతకు ముప్పేతప్ప ఏకత్వసాధన మృగ్యమైపోతుంది.

ఈ మీమాంశ నేపధ్యంలో, అప్పటికే రష్యా ఆర్థిక-సామాజిక విధానాలతో ప్రభావితమైన నాయకత్వం చరిత్రను కూడా ఒక విన్నూత్న (మతరహిత) రీతిలో చూసే మార్క్సిస్టు ధృక్కోణం సరైనదనే నిర్ణయానికొచ్చింది.ఈ ధృక్కోణానికీ, ఈ చరిత్రకారులకీ రాజకీయ మార్క్సిజంతో సంబంధం లేదు. ఇదొక అకడమిక్ ధృక్కోణం.

భారతీయ సాంప్రదాయ చరిత్రను తీసుకుంటే అది మతాన్ని మూలాధారం చేసుకుని సమాజనిర్మాణాన్ని, ఆర్ధిక వ్యవస్థనూ, చట్టాన్నీ,సంస్కృతినీ నిర్వచిస్తుంది. కానీ దానికి విపరీతంగా "Marxists believe that economic and social conditions determine religious beliefs, legal systems and cultural frameworks." అంటే పూర్తిగా ఉల్టా అన్నమాట. ఆర్ధిక-సామాజిక స్థితిగతులు మిగతా అన్నింటినీ నిర్ధారిస్తాయి అనే కోణంలో చరిత్రను చూస్తే, మతం యొక్క ప్రాబల్యం neutralize అయ్యి, దేశం మరో మతసంక్షోభంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన్మా దోరణిని ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర నిర్మాణం మొదలయ్యింది.

ఆశయాల సంగతి పక్కనపెట్టినా, చరిత్రను కేవలం పరిపాలకుల క్రమంలో చెప్పడంగా వస్తున్న పరంపరను పక్కనబెట్టి, రాజుల పరిపాలనను ప్రజా సంక్షేమం,ఆర్ధిక స్వావలంబన, సామాజిక సుస్థిరత వంటి అంశాల దిశగా బేరీజుచెయ్యడం ఈ చరిత్రకారుల నుంచే ప్రారంభమయ్యింది. రాజు ఎంత గొప్ప సౌదర్యపోషకుడు,జ్ఞాని లేక దుర్మార్గుడు అనే విషయాలకన్నా తను ప్రజకు,దేశానికీ చేసిన "సేవల" దృష్ట్యా చరిత్రలో ఎలా ముఖ్యుడయ్యాడు అనే ధృక్కోణంలో చరిత్రను తిరగరాయడం ప్రారంభించారు. అందుకే మనకు చరిత్రలో అశోకుడు కళింగలో చంపిన జనాల సంఖ్యకన్నా, ఆ తరువాత తాను స్థాపించిన శాంతి ప్రాముఖ్యత సంతరించుకుని "Ashoka The Great" గా అవతారమెత్తుతాడు. అక్బర్ ఎందరు రాజపుత్ర వీరుల్ని చంపి రాజ్యాన్ని విస్తరించాడు అనే దానికన్నా, మతసామరస్యమైన ఒక మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఎలా "The great" అయ్యాడో వివరణ దొరుకుతుంది.

ఈ చరిత్రలోని selectivity ని తప్పుబట్టే ముందు. అప్పటి పరిస్థితుల్ని, ఆశయాల్ని అర్థం చెసుకోవడం ముఖ్యం. అంతేకాక వారు "దాచేశారు" అని అభియోగం మోపే ముందు ఆ దాచిన దాన్ని వెలికితీస్తే వచ్చే "చారిత్రాత్మక లాభం" ఏమిటో కూడా కొంచెం బేరీజు చేసుకోవాలి. ఒక ఉదాహరణ తీసుకుని కొంత వివరించడానికి ప్రయత్నిస్తాను.

బ్రిటిష్ వారి చరిత్రప్రకారం 1857 తిరుగుబాటు ఒక "సిపాయిల తిరుగుబాటు". వామపక్ష చరిత్రకారుల ప్రకారం అది "ప్రథమ స్వాతంత్ర్య సమరం". కానీ నిజాల్ని ఖచ్చితంగా బేరీజు చేస్తే అది చాలా వరకూ ఒక మతపరమైన తిరుగుబాటు. పంది మాసం- ఆవు మాసం అనే మతనమ్మకాల అవమానంతో మొదలైన ఘటన డిల్లీ హత్యాకాండతో, చివరిశ్వాస విడుస్తున్న మొఘల్ సామ్రాజ్య పతనంతో ముగిసిన ఒక ఘటన. మొట్టమెదటిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం సైనికులు"జిహాద్" జరిపిన పోరాటం. "హైందవధర్మాన్ని" కాపాడుకోవడానికి హిందూ సిపాయిలు ప్రాణాలొడ్డి పోరాడిన పోరాటం. ఈ జిహాదీలు ,దర్మ పరిరక్షులు తమ మతపరమైన నమ్మకాలకోసం కటికి కనబడిన బ్రిటిష్ జనాల్ని
పిల్లలు,మహిళలు,వృద్ధులు అని చూడకుండా ఊచకోత కోసిన పోరాటం.

ఈ పోరాటం జరిగిన నాలుగు నెలల కాలాన్ని పరీక్షిస్తే ఎక్కడా "భారతదేశ"(?) స్వతంత్ర్యం కోసం పోరాడారన్న స్పృహ కలగదు. సిపాయిల పోరాటానికి మతం కారణమైతే, తాంతియాతోపే, ఝాన్సీ లక్ష్మీబాయ్, నానాసాహెబ్ వంటివారికి తమతమ కారణాలున్నాయి. కానీ చరిత్ర కారుల ఆశయం ఒక గౌరవప్రదమైన భారతీయ చరిత్రను సృష్టించడం. భారతదేశ ప్రజల్లో ఒక గాఢమైన నమ్మకాన్ని రేకెత్తించే చరిత్రను లిఖించడం. వాటి దృష్ట్యా కొన్ని నిజాల్ని విస్మరించి చరిత్ర రాయాల్సి వచ్చింది. మన జాతిలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి వందసంవత్సరాలుగా ఉందనే నమ్మకాన్ని కలిగించడానికి రాయాల్సొచ్చింది.

ఆ నిజాల్ని దాచకుంటే చరిత్రలోని ఈ ఘటన ఎలా ఉండేదో చూడండి. పోరాటం సాగించిన భారతీయ సిపాయిల్ని ఊచకోత కోసింది కూడా కంపెనీ సైన్యంలో ఉన్న భారతీయులే. పోరాడిన రాజు/రాణుల్లో ఎప్పుడూ ఏకాభిప్రాయం లేదు. ముఖ్యంగా (చివరి మొఘల్) బహదూర్షా జఫర్ ని తమ నాయకుడుగా ఒప్పుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. 60 ఏళ్ళ వయసులో బహదూర్షా జఫర్ ఈ లంపటాన్ని నెత్తికెత్తుకోవడానికి అస్సలు సంసిద్దుడిగా లేడు. ఢిల్లీ చేరిన సిపాయిలు, ముఖ్యంగా బారక్ పూర్, లక్నో,కాన్పూర్ ల నుంచీ వచ్చిన సిపాయిలు ఢిల్లీలో చేసిన అరాచాలు అన్నీఇన్నీ కావు. ముస్లిం-హిందూ సిపాయిలు తమలో తాము కొట్టుకోవడం మొదలెట్టారు. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ వాసులు నవాబు తమల్ని ఈ సిపాయిల ఆగడాల్నుంచీ రక్షించలేడని గ్రహించి కనీసం బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ బాధల్నుంచీ విముక్తుల్ని గావిస్తారని కోరుకునేలా పరిస్థితులు తయారయ్యాయి. పూర్తిగా ఈ పోరాటం ఉత్తరమధ్య భారతదేశానికే పరిమితం.

పైవిధంగా "నిజాల్ని" బటపెడితే nation building ఎలా జరుగుతుంది? ఏకత్వం ఎలా వస్తుంది? అప్పటి ఉద్దేశాలకూ,ఆశయాలకూ తగిన చరిత్ర అప్పుడు పుట్టింది. ఇప్పుడు హిందుత్వ అజెండాకు సరిపడే చరిత్ర కావాలికాబట్టి కొన్ని selective ధ్రృక్కోణాలు ఇప్పుడూ వెలువడుతున్నాయి. కాకపోతే ఉద్దేశాలు....ప్రశ్నార్ధకాలు. అంతే తేడా.

ఈ హిందుత్వ చరిత్ర కారులు సందుదొరికితే వామపక్ష చరిత్రకారుల మీద నానా అభాండాలూ వేసేస్తుంటారు. ముఖ్యంగా మార్క్సిస్ట్ చరిత్ర ధృక్పానికీ కమ్యూనిజానికీ,ముఖ్యంగా రాజకీయ కమ్యూనిజానికీ సంబంధం లేదనే విషయం వీరికి తెలీదు. కమ్యూనిస్టు చారిత్రాత్మక ధృక్పధం కూడా ఎన్నో ప్రశ్నల నేపధ్యంలో మార్పులకు లోనయ్యిందనే విషయం వీరికి తెలీదు. ఫ్రాంక్ ఫుర్ట్ స్కూల్, యూరోపియన్ స్ట్రక్చరలిజం, పోస్ట్ స్ట్రక్చరలిజం వంటి ఎన్నో ప్రగతిశీల విధానాల్ని మార్క్సిస్టు ధృక్పధం తనలో ఇముడ్చుకుని ఎదిగింది, ఎదుగుతోంది అనే విషయం కూడా వీరికి తెలీదు.
వీరికి తెలిసిందల్లా ఆరెస్సెస్ ఘనులు రాసిన హిందూ చరిత్ర. తాజ్ మహల్ నిజానికి ఒక హిందూ రాజప్రాసాదం. బాబ్రీ మసీదు స్థలంలో ఒకప్పుడు రాముడి కొడుకు కుశుడు కట్టించిన దేవాలయం ఉండేది. అనే అధారరహిత చరిత్ర, అపాయకరమైన చరిత్ర, భారతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర. వారి ఉద్దేశాలు ప్రమాదకరం గనక I prefer leftist history over Hindutva history. వామపక్ష చరిత్రలో లోపాల్ని లక్కిస్తూనే నేను దాన్ని ఆమోదిస్తాను.

*****

14 comments:

Bhanu Prakash said...

నమస్కారం మహేశ్ గారు,

ఏ పని మొదలెట్టినా అందులోని ఉద్దేశ్యము ముఖ్యము. మీరు ఈ పోస్టులో రాసిన కింద వ్యాఖ్య ఎంతో నిజము.

"ఈ చరిత్రలోని selectivity ని తప్పుబట్టే ముందు. అప్పటి పరిస్థితుల్ని, ఆశయాల్ని అర్థం చెసుకోవడం ముఖ్యం. అంతేకాక వారు "దాచేశారు" అని అభియోగం మోపే ముందు ఆ దాచిన దాన్ని వెలికితీస్తే వచ్చే "చారిత్రాత్మక లాభం" ఏమిటో కూడా కొంచెం బేరీజు చేసుకోవాలి. "


విషయానికి వస్తే, తాజ్ మహల్ మరియు హిందూ దేవాలయం గురించి మీరు వాడిన పదజాలం కటువుగా ఉంది.
ఏది ఏమయినా, ఈ పోస్టు మీ సొంత అభిప్రాయము.

తాజ్ మహల్ గురించి ఒకసారి కింద లింక్ చూడగలరు.
http://www.stephen-knapp.com/was_the_taj_mahal_a_vedic_temple.htm

Praveen Mandangi said...

కమ్యూనిజం అంటే ప్రైవేట్ ఆస్తిని పూర్తిగా రద్దు చెయ్యడం. మార్క్సిజం అంటే మార్క్స్, ఎంగెల్స్ మహాసయులు నిర్దేశించిన గతితార్కిక, చారిత్రక భౌతికవాద సూత్రాల ఆధారంగా ఆలోచించడం. ఫ్రాంక్ ఫర్ట్ స్కూల్ వారు గతితార్కిక భౌతికవాదం కాకుండా గతితార్కిక భావవాదాన్ని ప్రతిపాదించారు. మావోయిస్టులు మాత్రం పూర్తిగా గతితార్కిక భౌతికవాదాన్నే నమ్ముతారు. మార్క్సిజాన్ని విమర్శించే వాళ్ళలో 99% మందికి భౌతికవాదానికీ, భావవాదానికీ మధ్య ఉన్న తేడా తెలియదు. చరిత్రని కూడా భావవాద దృష్టితో చూసే వాళ్ళు ఉన్నారు. చరిత్రని మరచిన వాళ్ళు చరిత్రని ముందుకి నడిపించలేరని అంబేద్కర్ మహాశయులు అన్నారు. చరిత్ర వక్రీకరణ (revision of history) మంచిది కాదు.

Chittoor Murugesan said...

వ్రాయండి భాగా వ్రాయండి. లాటరి వారి వద్దనుండి తమ పర్టి పత్రిక మాత్రు భూమికి అభివ్రుద్ది నిది స్వీకరించిన కథ వ్రాయండి. చైనా మన మాత్రు భూమిపై ఆక్రమణకు పాల్పడితే దానిని సప్పోర్ట్ చెయ్యాలా వద్దా అని రెండుగా చీలిన వైనాన్ని కూడ వ్రాయండి కీప్ ఇట్ అప్

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మీరురాసిన వాటిలో చాలావాటితొ నేను ఏకీభవిస్తాను మహేష్‌గారు. ఐతె దేవుడిలీలలు, ప్రభువుల ఘనతలు తప్ప అన్నారు అది కరక్టుకాదేమో అనిపిస్తోంది. హరప్పాలొ బయల్పడిన సింధునాగరికత మీరు చెప్పినదానికి అతీతం కాదా. ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఏప్రాచీన నాగరికతైనా మతానికి అతీతంగా నడిచిందా. మార్కిస్ట్ విధానాలు సగటుభారతీయుని ఆలోచనాసరళికి చాలాదూరం. అవి ఇక్కడి కుటుంబవ్యవస్థకు కంపాటిబుల్ కాదు అని నా అభిప్రాయం. హిందూత్వ చరిత్ర ఆధార రహితమైనది అన్నారు మరి సేతుసముద్రం ఆధారాన్ని మనకళ్లముందే చిధ్రం చేస్తున్నారు. విదేశీదాడులలో ఇలా మనం కోల్పోయిన ఆధారాలు ఎన్నో.

కత్తి మహేష్ కుమార్ said...

@సుబ్రహ్మణ్య ఛైతన్య: మార్క్సిజం భారతీయ ఫ్యూడలిజానికి సరిపోయే "మార్పు మూస" కాదు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. సామాజిక,రాజకీయ రంగాలలో అందుకే మార్క్సిజానికి ఎప్పుడో చెల్లుచీటీ రాసేశారు. బెంగాలు,కేరళలో కూడా భూసంస్కరణలవల్ల ఇన్నాళ్ళు మనుగడసాగించారేతప్ప అది లేకుంటే ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయేవాళ్ళు.కానీ మార్క్సిస్టు అకడమిక్ ఐడియాలజీ ఇప్పటికీ ఒక ప్రముఖ మేధోసరళిగా క్యాపిటలిస్ట్ దేశమైన అమెరికాలోకూడా ఉంది. అందుకే రాజకీయ క్మార్క్సిజాన్నీ అకడమిక్ మార్క్సిజాన్నీ వేరువేరుగా చూడమంటున్నాను.

హరపా-మొహెంజోదారో(సింధునాగరికత) త్రవ్వకాలు 1922 లో మొదలై 1965లో పూర్తయ్యాయి. అప్పటికి అరాకొరవా చరిత్ర తప్ప దానిగురించి మన చరిత్రకారులు రాసింది తక్కువే. కానీ 1947-65 మధ్యన,నెహ్రూ హయాంలో చాలా చరిత్రను తిరగరాశారు. నేను ఇప్పుడు చెప్పిన "దేవుడిలీలలు, ప్రభువుల ఘనతల"చరిత్ర దాన్ని ఉదహరించే.

హిందుత్వ చరిత్ర శాస్త్రీయ ఆధారరహిత చరిత్ర అనడానికి మీరు చెప్పిన ఉదాహరణే సాక్ష్యం. "రామసేతువు" మానవ నిర్మితంకాదు. అది సముద్రంలో సహజంగా ఏర్పడింది అనేది శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించబడింది. అయినా "సెంటిమెంటుని" అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వం మొదలెట్టిన ప్రాజెక్టుకి ప్రభుత్వం మారేసరికీ కాలొడ్డుతున్న బేజేపీది ఏ చరిత్ర? సేతుసముద్రం ప్రాజెక్టు ఒక పర్యావరణ disaster ఆ పరంగా దాన్ని అడ్డుకోమనండి ఎవరు కాదన్నారు?

@చిత్తూరు మురుగేశన్: నేను రాసింది భారతదేశంలోని రాజకీయ మార్క్సిజం గురించి కాదు. మీరు కార్క్సిస్టుల చరిత్ర బాగా తెలిసినట్టుంది మీరే ఒక టపా రాయండి. చైనా యుద్ధ సమయంలో కమ్యూనిస్టుల దేశద్రోహ ప్రయత్నాల గురించి.

@భానుప్రకాశ్: నేను ఉదహరించిన తాజ్ మహల్ మరియు హిందూ దేవాలయం "చరిత్ర", ఆరెస్సెస్ చరిత్రలోనిది.

Anonymous said...

wow manchi post

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

సేతుసముద్రం మానవనిర్మితమా లెక సహజంగానే ఏర్పడిందా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఎవరి రాజకీయ అవసరాలు వాళ్లకి ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో నిర్ధారణ కాదు. నేను ఒక సైంటిస్టు రాసిన ఆర్టికల్ చదివాను. ఆయన విపులంగా విశ్లేషించారు అది మానవనిర్మితం అని. దాని కట్టుబడిలో సిమెంటింగ్ మటీరియల్ ఉపయోగించారు అని, అందులో రాళ్లను ఒకరీతిలో అమర్చిన పద్దతిని చూస్తే కచ్చితంగా అది మానవనిర్మితం అని అన్నాడు. ఆయన భారతీయుడు అందునా హిందువు కాదు కాబట్టి తటస్తుని నిర్ణయనికి మనం విలువ ఇవ్వాలి. సునామీ వచ్చిన తరువాత ఒక భారతీయ సైంటిస్టు చెప్పినదాని ప్రకారం దానివల్లే కేరళతీరం కాపాడబడిండి అని తెలుసుకొన్నాను.

Kathi Mahesh Kumar said...

@సుబ్రహ్మణ్య ఛైతన్య: రామసేతువుగా చెప్పబడుతున్న నిర్మాణం యొక్క పర్యావరణ ప్రాముఖ్యత ఎవరూ కాదనటం లేదు. తమిళనాడు ప్రభుత్వ వాదనల్లా, పర్యావరణ ప్రమాదంకన్నా ఆర్థిక లాభం ఎన్నోరెట్లు ఎక్కువ అని మాత్రమే. ఈ విషయంలో విభేధించడానికి ఎటువంటి సమస్యా లేదు.

కాకపోతే అది మానవనిర్మితమా కాదా అనేదానికి ఇంకా స్పష్టమైన ఋజువులు లేవుగనక దాన్ని మతానికి ఆపాదించడం అంగీకరించలేని ప్రతిపాదన.

Vinay Chakravarthi.Gogineni said...

mmeeru rrayalsindi history ni....... baaga raasevaaremo......meeru sekarinchi raayandi ............

paniki raani daanimeeda bhale gola chestaare......meeru

Kathi Mahesh Kumar said...

@గోగినేను వినయ్ చక్రవర్తి: బ్లాగుల్లో పనికిరానివి చాలా ఉన్నాయి వాటిని వెతుక్కుంటూ మీరు నా బ్లాగుకి రానఖ్ఖరలేదు. గోల చేసే ఉద్దేశం నాకు లేదు. మీకు భరించాల్సిన అవసరం అంతకన్నా లేదు.కాబట్టి ఇంతటితో...ఎవరో అన్నట్లు "ఇంతేసంగతులు.చిత్తగించవలెను."

Vinay Chakravarthi.Gogineni said...

moosukomana mee meaning no prob........

konni nachhevi first lo but ee madhya konni veriety ga raastunnaru thats y ..........

mee post s choosukondi chaala saarlu baga vunnayi ani cheppanu.......nachhaledu kaabatti nachhaledu ani cheppanu........

edo cheppalanukunna but nenu meela cheppe anta ettuku edagaledu.....

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

తమిళనాడు చెప్తున్న ఆర్ధిక లాభం ఎవరికి? అన్నాదురై, కామరాజు లాంటి వాళ్లు మొదట ఈప్రాజెక్టుకు ఉత్సాహం చూపించారు. తరువాత వాళ్లె నిష్కృమించారు. అందుకు ప్రధాన కారణాల్లో మొదటిది అక్కడి జంతుజాలం. అక్కడి పగడపుదీవులపై ఆధారపడి అనేక రకాల చేపలు ఇతర సముద్రపుజీవులు బతుకుతున్నాయి. అందులో చాలా వరకు ప్రపంచంలో కేవలం అక్కడ మాత్రమే జీవించేవి. రెండవ మరియు ముఖ్య కారణం అసలు ఆ ఆర్ధికలాభం ఎవరికి? దాదాపు 10000మంది జాలర్లు వాళ్ల కుటుంబాలు వీధిన పడుతాయి. వాళ్లకి ఆవృత్తితప్ప వేరేది తెలీదు. మరొక ప్రాంతానికి వెళ్లి బతకలేరు.అయినా ఎవరో వచ్చి వాళ్ల ప్రాంతాన్ని ఆక్రమించుకొంటే వాళ్లు ఎందుకు వదిలివెళ్లాలి? అక్కడ వచ్చే షిప్పింగ్ కంపనీలు అన్నీ బడా కార్పొరేటు గద్దలే. అప్పటివరకు వాళ్లకష్టంతో స్వయం ఉపాధిరంగలో ఉన్న వాళ్లు తరువాత ఎవడొ మేస్త్రీకింద దేహీ అని పాకులాడాలి. ఇంతా చేస్తే ఆమార్గంకేవలం మద్యతరహా నౌకలు మాత్రమే పోగలవు. విపత్కర పరిస్థుతుల్లోనొ, యుద్ధంలోనొ మిలిటరీనౌకలొ పోలేవు. ఇక నా అభిప్రాయం, ఒకవేళ అది సహజసిద్ధంగా ఏర్పడింది అనుకొందాం. అది శ్రీలంకలాంటి ఇతర దీవుల్ని ఇండియన్ టెక్టోనిక్ ప్లేటుకి( ఇది దాదాపు ఉపఖండం మొత్తం వ్యాపించి ఉండి ఆసియాన్ ప్లేటుకు దక్షిణంగా ఉంది) కలుపుతుంది. ఇప్పుడు దీన్ని కదిలించడంవల్ల అక్కడ భూస్థిరత్వం ప్రశ్నార్ధకం అవుతుంది. అప్పుడు జరిగే నష్టంతో పోలిస్తే మనకుకలిగే లాభం చాలా తక్కువ. ఈప్రాజెక్టు పూర్తి ఐతే ఆప్రాంతం అంతర్జాతీయ జలాలకింద వస్తుంది. ఇప్పటివరకు మనకు, లంకకు మాత్రమే హక్కు ఉన్న ఈప్రాంతంలో ఏదేశపు నౌకలైనా స్వేచ్చగా వెళ్లవచ్చు. మరి అదిమన భద్రతకు ముప్పు కాదా? మనకు ఇప్పటివరకు ముప్పు పశ్చిమ తీరానికి మాత్రమే ఉంది. అప్పుడు తూర్పుతీరం భద్రతకూడా ప్రశ్నార్ధకం అవుతుంది.ఇలాంటి విషయాలపై లోతుగావిశ్లేషించి ప్రారంభించాల్సిన దానిపై అనవసరంగా తొందర పడుతున్నారు. దేశంలో ఎన్నో ముఖ్యమైనవి, అవసరమైనవి ఉండగా కేవలం కరుణను ఒప్పించే రాజకీయ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అనవసరమైన తొందరపాటును ప్రదర్శిస్తోంది. కొన్ని మిషనరీలు కూడా అత్యుత్సాహాన్ని చూపిస్తున్నాయి అని విన్నాను. మరివాటికి పనికొచ్చే విషయం అక్కడ ఏమీలేదు రాముడు తప్ప. ఒకసారి తొలగించిన తరువాత దానివళ్ల కలిగే నష్టాలు తెలిస్తే మళ్లీదాన్ని అక్కడ యధాతధంగా పెట్టగలమా? దానికి అయ్యే ఖర్చు మనమీద కాక ఎవరిపై పడుతుంది? ఒకవేళ పెట్టగాఇగినా అప్పటికే అనర్ధం జరిగిపోతే? ఇలాంటివాటిలో కొంచెం ఆచితూచాలి. ఈది లంకతో మన సంబంధాలు దెబ్బతీయగలదు. ఇప్పటికే ఇద్దరుతమ్ముళ్లు చేసే పనులకు విసుగెత్తి పొయ్యి ఉన్నాం.

telugODu said...

sensible comments Subramanya chaitanya.

kuffir said...

great post. your analysis is impressive. but it places the historians who rewrote indian history beyond the reach of hindutva. even to my untrained (in the social sciences) eye that seems like a major assumption.

one of my first visits here, have been browsing through your archives, and i'd like to thank you for providing such interesting food for thought.