Thursday, July 16, 2009

సాంప్రదాయం - ఆధునికత

ఈ మధ్య నా టపాల్ని చదివిన ఒక మిత్రుడు నీది (సామాజిక)వర్గ పోరాటమా? సైద్ధాంతిక విభేధమా లేక ఆధునికతను సమర్ధిస్తూ సాంప్రదాయకతపై విరోధమా? అని కొన్ని existential ప్రశ్నలు అడిగేసాడు. "అవన్నీ వేరు వేరు ఎలా అవుతాయి" అనేది నా ప్రశ్న. కానీ ఇవన్నీ inter related అనేది అర్థం చేసుకోవాలంటే ఈ "సాంప్రదాయం- ఆధునికత" (Tradition and Modernity) అనే పడికట్టు పదాల్ని అర్థం చేసుకోవల్సిన అవసరం ఎంతో ఉందనిపిస్తుంది. ముఖ్యంగా my interpretation of these words is much more important to me in this context.

ప్రచలితమై ఉన్న ప్రాపంచిక నియమనిబంధనల్ని ‘సాంప్రదాయం’గా వ్యవహరిస్తే, ‘ఆధునికత’ అనేది ఆ సాంప్రదాయానికి మార్పుగానో లేక వ్యతిరేకంగానో ప్రతిపాదించే ప్రత్యామ్న్యాయ సూత్రణ అనుకోవచ్చు. ఈ వ్యాఖ్యానాన్ని చర్చకు అంగీకరిస్తే, ఆధునికత సాంప్రదాయం యొక్క కొన్ని మార్పులో భాగంగానో లేక మహాఅయితే కొంత విభేదిస్తూనో కనిపిస్తుందేతప్ప ఒక విప్లవంగా ఎన్నటికీ అనిపించదు. ఎందుకంటే, ఆధునికత విభేధం, "మారాల్సిన" కొన్ని సాంప్రదాయాలతో ఉంటుందేతప్ప paradigm shift కోరుకోదు. సాంప్రదాయకతను త్రోసిరాజని ప్రత్యామ్న్యాయ స్థాపనకు పూనుకోదు. కేవలం ఒక alternate vision ని ప్రకటిస్తుంది అంతే.

ఈ దారిలో, ప్రత్యామ్న్యాయ విలువలు ప్రజాస్వామికంగా ఉన్నంతవరకూ వాటిమధ్య ఘర్షణకు తావులేదు. "ఎవరిష్టం వారిది" అన్న తరహాలో ఈ స్రవంతులు రైలుపట్టాల్లాగా ఎప్పటికీ కలవకుండానో లేక అప్పుడప్పుడూ కలిసి విడిపోతూనో ప్రయాణించెయ్యొచ్చు. అందుకే శంకరాభరణం శంకరశాస్త్రి తరహాలో "నేనింతే" అంటే వారితో నాకు సమస్యలేదు. హాయిగా పక్క పట్టాల్ని చూసుకుంటూ ప్రయాణించెయ్యొచ్చు. మహాయైతే అప్పుడప్పుడూ కొన్ని సాంప్రదాయాల్ని ప్రశ్నించి, వ్యతిరేకించి ఆధునిక పంధాను పరిచయం చెయ్యడానికి కొన్ని చర్చలు జరిపి తప్పుకోవచ్చు. వారూ తమ వంతుగా నన్ను "సంస్కరించడానికి" ప్రయత్నించినా పెద్ద విఘాతం కలగదు.

సమస్య వచ్చేదల్లా శంకరశాస్త్రులు కాలేని టింకరశాస్త్రులతోనే. వీరి సాంప్రదాయ ప్రతిపాదనే లోపభూయిష్టం. నిబద్ధత ప్రశ్నార్ధకం. ఆధునికత పేరుతో మనమేదైనా ప్రతిపాదన చేస్తే వీరు వెంఠనే వారే first hand గా చదవని "వేదాలు,శాస్త్రాలూ,పురాణాలూ" అంటూ "నిజమైన(?)" సాంప్రదాయాలవైపు వేలుచూపుతారు. హిందూమతంలో "కులవివక్ష నశించాలి" అని మనమంటే, అసలు అనాదిగావస్తున్న హిందూమతంలో కులప్రస్తావనే లేదంటారు. ఆదిసాంప్రదాయాలు ఆధునికతతో మమేకమయ్యాయి. అవే మన ఆధునికతకు పట్టుగొమ్మలన్నట్టుగా వాదిస్తారు.

ఆధునికత అందించే వస్తుసామాగ్రిని అమితంగా ప్రేమించి,కాంక్షించి వాటికి అనుగుణంగా విలువల్ని తాకట్టు పెట్టే ఈ టింకరశాస్త్రులు క్రీస్తుపూర్వంలో ఎప్పుడో చెప్పబడిన పుక్కిటిపురాణాల్ని ఉటంకిస్తూ, జరిగిన - జరుగుతున్న నిజాల్ని మర్చి, గత కాలపు వైభవంలో బ్రతకమంటారు. ఆధునికతకూ ఆదికాలానికీ మధ్య అగాధమే లేదంటారు. As if ఇప్పుడే హిమాలయాల నుంచీ తపస్సుతరువాత వచ్చి, గడ్డం మీసాలు గొరిగి కార్పొరేట్ ఆఫీసు గుమ్మం తొక్కిన ఫీలింగిస్తారు. వేదాలు,ఉపనిషత్తుల కాలం నుంచీ ఈ కాలానికి మనం ప్రయాణించడానికి మధ్యన సవాలక్ష మార్పులొచ్చి "ఆదిసాంప్రదాయం" చంకనాకిపోయిందని మనం చెబితే, అమెరికాలో బీరుమగ్గు చేతిలో పట్టుకుని అర్జంటుగా "వీడొక సంస్కృతి ద్రోహి. దేశద్రోహి" అని తీర్మానాలు (ఫత్వాలు) జారీచేస్తారు.

వీళ్ళకు మతపరమైన chauvinism తప్ప సాంప్రదాయం మీద మక్కువ ఏమీ ఉండదు. ఆధునికత ఫలాల్ని మొట్టమొదట అందుకుని, మిగతా వర్గాలకు అందకుండా చెయ్యాలనే దుగ్ధతప్ప నిబద్ధత ఉండదు. వీళ్ళ లాజిక్ ఎంత విశాలంగా ఉంటుందంటే "ఏ దేశమోడైనా ఫరవాలేదు మా కులపోడైతే చాలు" అన్నంత లోపాయికారిగా ఉంటుంది. ఇంగ్లీషోడు తనతో తీసుకొచ్చిన విక్టోరియన్ నైతిక విలువల నుంచీ లిబరలిజందాకా వీరి ఉన్నతికి,వినిమయ దృష్టికీ "పనికొచ్చే" సిద్ధాంతాలన్నింటినీ ఔపోసనపట్టి, వీలైతే ప్రక్షిప్తాలుగా వాటిని వేదాల్లో జోడించి తమ దూల ఒదిలించుకున్నారు. ఇప్పుడు "సాంప్రదాయం! సాంప్రదాయం!!" అని నాటకాలాడుతూ కాలక్షేపం చేస్తుంటారు.

హిందుత్వ రాజకీయధోరణుల పుణ్యమా అని ఈ నియో-సాంప్రదాయ వాదుల తాకిడి సమాజంలో పెరిగింది. అదే ద్వంద్వధోరణి బ్లాగుల్లోనూ ఉంది. ఇక్కడ విలువలతో పేచీ లేదు. ఆభిజాత్యాలతోతప్ప. ఇక్కడ ఆధునికత సమస్య కాదు. ద్వంద్వం ప్రవృత్తితో తప్ప. ఇక్కడే నా ప్రతిఘటన మొదలౌతుంది. నా విరోధం, విబేధం వీరితోనే. అది వర్గం,సాంప్రదాయం, ఆధునికత, అస్తిత్వం, ఆలోచన,అభిప్రాయబేధం లాంటి అన్నిటినీ కలగలిపి సాగుతుంది.

*****

17 comments:

Marxist-Leninist-Feminist Revolutionary said...

ఆధునికత ఎక్కడ ఉంది మహేష్ గారు? 60 ఏళ్ళ స్త్రీ భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవచ్చు అంటే కొంత మంది స్వయం ప్రకటిత ఆధునికవాదులు అంగీకరించలేకపోయారు. ఆడవాళ్ళు విమానాలు నడుపుతున్నా ఆడవాళ్ళ విషయంలో ఇంకా సంకుచిత నమ్మకాలని వదులుకోలేని స్థితిలో ఉన్నారు మన వాళ్ళు.

కత్తి మహేష్ కుమార్ said...

@ప్రవీణ్: మీరు ఎక్కడిదో లంకె ఇక్కడికేస్తున్నారు. ఆ విషయంలో సమస్య మీరు వాడిన అభ్యంతరకరమైన భాషది. ఆధునికత కాదు.

Marxist-Leninist-Feminist Revolutionary said...

నేనేమీ సంబంధం లేని విషయాలు మాట్లాడడం లేదు. ఆధునికతని అంగీకరించడం ఇష్టం లేని వాళ్ళు ఆధునికవాదులమని చెప్పుకుంటున్నారు. ఇలాంటి హిపోక్రైట్లు ఉన్న సమాజంలో ఆధునికత అనే పదానికి అర్థం ఎంత వరకు ఉంటుందనేది ప్రశ్న.

Vinay Chakravarthi.Gogineni said...

60 years vunname pelli chesukunte adhunikata fallow avutunnatta......em matladutnnaru meeru

bane vundi gani littlebit confusion...............
one thing naaku anipinchindi...meeru vallu veellu ani kakunda....
sampradaayam adhunikata ante ento full fledged ga analysis cheste bagundedemo...em ledu koncham confusing ga vundi..............

Vinay Chakravarthi.Gogineni said...

ఆధునికత అందించే వస్తుసామాగ్రిని అమితంగా ప్రేమించి,కాంక్షించి వాటికి అనుగుణంగా విలువల్ని తాకట్టు పెట్టే ఈ టింకరశాస్త్రులు క్రీస్తుపూర్వంలో ఎప్పుడో చెప్పబడిన పుక్కిటిపురాణాల్ని ఉటంకిస్తూ, జరిగిన - జరుగుతున్న నిజాల్ని మర్చి, గత కాలపు వైభవంలో బ్రతకమంటారు. ఆధునికతకూ ఆదికాలానికీ మధ్య అగాధమే లేదంటారు. As if ఇప్పుడే హిమాలయాల నుంచీ తపస్సుతరువాత వచ్చి, గడ్డం మీసాలు గొరిగి కార్పొరేట్ ఆఫీసు గుమ్మం తొక్కిన ఫీలింగిస్తారు. వేదాలు,ఉపనిషత్తుల కాలం నుంచీ ఈ కాలానికి మనం ప్రయాణించడానికి మధ్యన సవాలక్ష మార్పులొచ్చి "ఆదిసాంప్రదాయం" చంకనాకిపోయిందని మనం చెబితే, అమెరికాలో బీరుమగ్గు చేతిలో పట్టుకుని అర్జంటుగా "వీడొక సంస్కృతి ద్రోహి. దేశద్రోహి" అని తీర్మానాలు (ఫత్వాలు) జారీచేస్తారు.

technologyni andipuchhukovatam veru............adhunikata antu minimum morals fallow kaakapovatam veru..............
paina pera maatram excellent...
baaga chepparu...........

కత్తి మహేష్ కుమార్ said...

@ప్రవీణ్: మీరెక్కువగా సంబంధం లేని విషయాలే మాట్లాడతారు అనేదానికి ఈ వ్యాఖ్యా ఉదాహరణ.టపాకూ మీ వ్యాఖ్యకూ ఏమైనా సంబంధం ఉందా?

ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించాను. మీతో విబేధించాను గనక తిట్లదండకం మొదలెడతారు. అది మీకున్న అలవాటు. కాబట్టి బహుశా మీ వ్యాఖ్యలు ఇకపై ఈ టపాలో కనిపించవనుకుంటాను.

bala said...

The idea of justice demands comparisons of actual lives that people can lead rather than a remote search of ideal intuitions. -A Sen.

కత్తి మహేష్ కుమార్ said...

@గోగినేని వినయ్ చక్రవర్తి: Modernity,liberalism అనేవి ఒక నిర్వచనానికి లొంగే పోకడలు కావు. అందుకే నిర్వచించలేదు. నా నిర్వచనం చెప్పినా ఎవరికీ ఉపయోగం లేదు.

అదెట్లాగో ఒక ఉదాహరణ ద్వారా చెబుతాను. ఒక పెళ్ళికావలసిన అమ్మాయి నాన్న ఆధునిక భావాలు కలిగిన వాడు అనుకుందాం. తన కూతురికి...
"నేను వెతికినవాళ్ళలో నీకు ఇష్టమైతేనే ఒకర్ని పెళ్ళిచేసుకో" అని ఒకరు చెప్పొచ్చు.
"నీ ఇష్టమొచ్చినవాడ్ని చూపించు. వాడితో పెళ్ళిచేస్తాంకానీ ఒకే కులమోడైతే చాలు." అని మరొకరు అనొచ్చు.
"నువ్వు ప్రేమించిన ఎవరైనా ఫరవాలేదమ్మా, తెలుగోడైతే చాలు" అని ఒకరనొచ్చు.
"హిందువైతే చాలు" అని మరొకరు.
"భారతీయుడైతే చాలు" అని మరొకరు.
"ఎవడినా ఫరవాలేదు. డబ్బులుంటే చాలు" అని మరొకరు.
"ఎవరైనా ఫరవాలేదు. మగాడైతే చాలు" అని మరొకరు.
"అడామగాఎవరైనా చాలు" అనే వాళ్ళు మరొకరు.

పైన చెప్పిన అన్నీ ఆధునికాలే విశాలదృక్పధాలే. కానీ వాటిల్లోకూడా స్థాయిలున్నాయి. అంటే modernity is highly subjective and often personal. అందుకే దాన్ని నేను ఇతరులకోసం నిర్వచించలేను.మీరు చెప్పిన morals కి కూడా ఇదే వర్తిస్తుంది.(ఈ విషయం మార్తాండ ప్రవీణ్ చెప్పలని ప్రయత్నించి నేను విఫలమయ్యాను. బహుశా మీకైనా అర్థమవుతుందేమో!)

కాకపోతే ఒకటి. ఆధునికం అన్నది ఒక alternative vision. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఆలోచనా ధోరణికి కొంచెం భిన్నమైనది. అంతే!

మీరు టెక్నాలజీని value neutral అని ఎందుకనుకుంటున్నారు? Each technology comes with its own set of "values" attached to you. కాబట్టి just access to technology is not very deferent from adopting to different set of values.

sk said...

meeru great saar..

good post

నాగప్రసాద్ said...

సాంప్రదాయం మతం మీద ఆధారపడినప్పటికీ, అది కేవలం ఫలనా విధంగా జీవిస్తే మనిషి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతుకుతారని చెబుతుంది.

సాంప్రదాయం ఎక్కువగా మనిషి జీవన విధానం, ఆరోగ్యం, దైవభక్తి చుట్టూ తిరుగుతుంది.

అదే ఆధునికమైతే కార్పోరేట్ కంపెనీల చుట్టూ, డబ్బు చుట్టూ తిరుగుతుంది.

ఆధునికమెంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. లేదంటే కార్పోరేట్ ధన దాహానికి బలి అవ్వడం ఖాయం.


>>"హిందూమతంలో "కులవివక్ష నశించాలి" అని మనమంటే, అసలు అనాదిగావస్తున్న హిందూమతంలో కులప్రస్తావనే లేదంటారు."

మీరు కులవివక్ష నశించాలి అని ఎప్పుడు రాశారు. నేనింత వరకు చూడలేదు. మీరు ఎంతసేపూ బ్రాహ్మణులని, హిందుత్వాన్ని విమర్శించారే తప్ప ఎప్పుడూ కూడా పరిష్కారం గురించి చెప్పలేదు.

కేవలం విమర్శిస్తే ఉపయోగం ఉండదు. దానికి ఏదైనా పరిష్కారం చెప్పి, ఆచరణలో పెడతేనే సాధ్యమయ్యేది.

వీరేశలింగం లాంటి వాళ్ళు ఆచరణలో పెట్టడం వలననే, అప్పట్లో ఉన్న సాంఘిక దురాచారాలను చాలా వరకు రూపుమాపగలిగారు.

కత్తి మహేష్ కుమార్ said...

@నాగప్రసాద్:మీ అర్ధాలు మీవి. నా అర్థాలు నావి. మీ అర్ధాలతో నేను ఏకీభవించడం లేదు. నా అర్థాలతో మిమ్మల్ని ఏకీభవించమనట్లేదు. కాబట్టి ఖేల్ ఖతం.

మీరెంతసేపూ నేను రాసే హిందుత్వ విమర్శ, బ్రాహ్మణుల(అదెప్పుడు చేశానబ్బా!) విమర్శ మాత్రమే చదువుతుంటే నాదా తప్పు? కులవివక్ష గురించి నేను చాలా సార్లు చాలా టపాల్లో చెప్పాను. అవి మీకు కనిపించవులెండి.

ఇక విమర్శలంటారా! వాటివల్ల ఉపయోగం లేదని మీరనుకుంటే ఇక్కడ చర్చలెందుకు? మీ ఆపసోపాలెందుకు?

పరిష్కారమంటారా! అవి నా దగ్గరలేవు. ఆచరణ నేను చెయ్యను. కేవలం బ్లాగు రాసుకుంటాను. మీకేమైనా అభ్యంతరమా?

నేను ఏం చెయ్యాలో, ఏమిరాయాలో మీరేనిర్దేశిస్తే ఎలా? I have my reasons for writing the way I do. If you want to contribute to the discussion. Please do so. కేవలం రంధ్రాన్వేషణ మీ ధ్యేయమైతే నమస్కారం.

నాగప్రసాద్ said...

>>"నేను ఏం చెయ్యాలో, ఏమిరాయాలో మీరేనిర్దేశిస్తే ఎలా?"

ఈ టపా వరకు నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. అంతేకాని, మీరు ఏమిరాయాలో, ఏం చెయ్యాలో నేను ఎక్కడ నిర్దేశించాను.

>>"ఇక విమర్శలంటారా! వాటివల్ల ఉపయోగం లేదని మీరనుకుంటే ఇక్కడ చర్చలెందుకు? మీ ఆపసోపాలెందుకు?"

నేను "కేవలం విమర్శిస్తే ఉపయోగం ఉండదు." అన్నాను. అంటే, దాని అర్థం విమర్శలు వద్దని కాదనుకుంటా. విమర్శతో పాటుగా పరిష్కారం కూడా ఉంటే బాగుంటుందని అన్నాను పోనీ ఉచిత సలహా ఇచ్చాను అనుకోండి.

>>"మీరెంతసేపూ నేను రాసే హిందుత్వ విమర్శ, బ్రాహ్మణుల(అదెప్పుడు చేశానబ్బా!) విమర్శ మాత్రమే చదువుతుంటే నాదా తప్పు? కులవివక్ష గురించి నేను చాలా సార్లు చాలా టపాల్లో చెప్పాను."

మీరు రాశారో, నేను చదవలేదో, ఒకవేళ మీరు రాసి ఉంటే ఆ లింకులేవో ఇవ్వొచ్చుగా.

నా వరకూ నా అభిప్రాయం వెలిబుచ్చాను. అది మీకు నచ్చాలని, వాటితో మీరు ఏకీభవించాలని, అందులోనివి మీరు పాటించాలని రూలేం లేదు.

మీ బ్లాగు మీది, మీ రాతలు మీవి, మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి. ఖేల్ ఖతం.

కత్తి మహేష్ కుమార్ said...

@నాగప్రసాద్: ఉచిత సలహాలిచ్చి నన్ను సంస్కరించాలనుకునేవాళ్ళ లిస్టు చాలా పెద్దది. మీరూ అందులో చేరతానంటా మీ ఇష్టం. కాకపోతే ఒక మాట నేను సంస్కరింపబడాలని కోరుకోవటం లేదు. I am happy the way I am. So,thank you.

నేను హిందుత్వ గురించి రాస్తే వెతుక్కుని వచ్చేవాళ్ళు నా బ్లాగులోని (మీ దృష్టిలో)అర్థవంతమైన టపాలు కూడా వెతుక్కోండి. లేకపోతే నా మానాన నన్ను వదిలెయ్యండి.

పరిష్కారాలు చెప్పడానికి నేను డాక్టర్నో, మతగురువునో కాదు. సంఘసంస్కర్తని అంతకన్నా కాదు. కాబట్టి నా బాధ నాకు నచ్చిన వాటిని నేను చెప్పుకుంటూ ఉంటాను. అంతకు మించి మరేమీ చెయ్యను. కాబట్టి నన్ను క్షమించెయ్యండి.

satyamevajayate said...

మీ పోస్ట్ లు ఎంతో educative.ఎన్నో విషయాలు ఎంతో insight ,కలిగిస్తాయి.
చాలా బాగా విశ్లేషిస్తారు ఎవిషయాన్నయినా.మీ నాలేడ్జీకి జోహార్లు ..

venkataramana said...

మీరు చెప్పినవి ఒప్పుకోక తప్పని నిజాలు.
అయితే నాగప్రసాద్ గారు చెప్పినట్లు, ఆధునికవాదం-సాంప్రదాయవాదాల సమన్వయమే మేలని నా అభిప్రాయం కూడా. ఈ సమన్వయం ఎంతవరకు అని చెప్పటం క్లిష్టతరం. ఇది ఎవరికి వారు తరచి చూసుకోవాల్సిన అంశం.

కత్తి మహేష్ కుమార్ said...

@వెంకటరమణ: ఆధునికత-సాంప్రదాయం వేరువేరు కాదు. అవి జీవితాన్ని చూసే రెండు భిన్నమైన ధృక్కోణాలు(visions). అవి భిన్నంగా ఉన్నా వచ్చే నష్టం లేదు. Because they can coexist and be in transition for most of the time.

కానీ,నాసమస్య ఆ "మార్పు continuum"లోని అఘాధాల్ని మర్చిపొమ్మని, ఆదికాలానికీ-ఆధునిక యుగానికీ లంకెకట్టి వాదించే నియో-సాంప్రదాయవాదుల హిపోక్రసీతోనే.

ఈ విషయం అర్థం చేసుకోకుండా మళ్ళీ సాంప్రదాయం - ఆధునికతకు అదే కాంట్రాస్టుని చూపుతున్న నాగప్రసాద్ గారి వాదనతో నాకు కొంచెం చిరాకొచ్చింది. సాంప్రదాయం అంతా బంగారమూ కాదు. ఆధునికత అంతా శృంగారమూ కాదు. రెంటిలోనూ లోటుపాట్లున్నాయి. కానీ మార్పు దిశగా ప్రయాణించాలంటే ఆధునిక ఒక అవసరం. ఆ అవసరాన్ని అందిపుచ్చుకుంటూ కూడా కేవలం లిప్ సర్విస్ చేసే ద్వంద్వప్రవృత్తినే నేను వ్యతిరేకించేది.

తెలుగోడు said...

@నాగప్రసాద్: ఇక్కడ సమస్య ఆధునికత-సంప్రదాయం. అంతే కానీ కుల వివక్ష కాదు. మహేష్ అయినా, నాగ ప్రసాద్ అయినా, నేనయినా & ఎవరైనా వాళ్ళ అనుభవాలు, అభిప్రాయాలూ మాత్రమే చెప్పగలరు, చెప్తారు కూడా ! చెప్పిన దాన్ని గురించి మాట్టాడ్డం మానేసి, "నువ్వది అప్పుడు చెప్పలా, నువ్విది ఇప్పుడు చేయలా ..." అనే కాడికి, ఈ బ్లాగ్ దాకా రావడం అనవసరం.

నేను అనుకునేది: సంప్రదాయం అనేది చాలా బలమైన వ్యవస్థ/వ్యసనం. దాన్ని పడగొట్టాలంటే ఇంకా పెద్ద బలం కావాలి. ఆధునికత సంప్రదాయాన్ని విస్మరిస్తుంది, కాని పెద్దగా ఖండించదు. అది చాలదు. సంప్రదాయాన్నిబలంగా ప్రశ్నించడం, ఖండించడం, ధిక్కరించడం చేసినపుడే ఆ వ్యవస్థని పడగొట్టగల౦. ఆ వ్యసనాన్ని వదిలించుకోగలం.

"అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష !" అని అంటేనే నాకు కాలుద్ది. అట్టనే అకారణంగా "నీకు తెలిసినదల్లా తప్పు" అనే ఆధునికత అన్నా కాలుద్ది. రెండు కూడా చేసే పని ఒకటే, నిర్దేశించడం. కొన్ని వర్గాలు సమయానుకులంగా వీటిని వాడుకుంటూ అధికారం చలాయిస్తూ ఉంటాయి. దారి ఏదైనా, చలాయించేది అధికారమే.

ప్రశ్నించ లేని సంప్రదాయం, అర్థం లేని ఆధునికతా రెండూ కూడా వ్యర్థమే. మనకు కావాల్సింది నిర౦తర మార్పు. హేతుబద్ధమైన ఆధునికత ! నిర౦తర మార్పు లేని నాడు, ఈ నాటి ఆధునికత కూడా రేపటి సంప్రదాయం గా మిగిలిపోతుంది.