Sunday, July 12, 2009
తెలుగులో ఒరిజినల్ ఆలోచనలు ఎలా వస్తాయి?
సొంత ఆలోచన కావాలంటే సొంత నేపద్యం కావాలి. సొంత నేపధ్యం కావాలంటే మనదైన సిద్ధాంతం కావాలి. మనదైన సిద్ధాంతం కావాలంటే స్వతంత్ర్య తాత్విక సాంప్రదాయం కావాలి. స్వతంత్ర్య తాత్విక సాంప్రదాయం కావాలంటే విభిన్నమైన సాంస్కృతిక,సామాజిక చరిత్ర కావాలి...విభిన్నమైన సాంస్కృతిక,సామాజిక చరిత్రకావాలంటే స్వతంత్ర్య తాత్విక సాంప్రదాయం కావాలి. స్వతంత్ర్య తాత్విక సాంప్రదాయం కావాలంటే మనదైన సిద్ధాంతం కావాలి. మనదైన సిద్ధాంతం కావాలంటే సొంతంగా ఒక నేపధ్యం కావాలి. ఒక సొంతమైన నేపధ్యం కావాలంటే ఒరిజినల్ థాట్- సొంత ఆలోచన కావాలి.
ఫుల్ సర్కిల్ వచ్చాం కదూ! అదే మనదగ్గరున్న సమస్య. ఎక్కడో ఎప్పుడో మధ్యలో ఏదో ఒక లంకె తెగింది. అందుకే తోకపట్టుకుని ముఖం, ముఖం పట్టుకుని తోక అక్కడే తెగ చుట్టేస్తున్నాయి గానీ ముందుకు మాత్రం సాగటం లేదు. ముందుకు సాగటం ఎట్లానో తెలియకపోయినా, కనీసం లంకె ఎక్కడ తెగిందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే సమాధానం అంత సులువుగా దొరకదు. కానీ ఒకటి మాత్రం నిజం. There is a historical discontinuity for sure.
"తెలుగు జాతి" భావపరతంత్రత బ్రిటిష్ పాలనకన్నా ముందునుంచే మొదలయ్యిందేమో అనేది నా ఆలోచన. ఎందుకంటే, బ్రిటిష్ వారికి పూర్వంకూడా (వేమన తప్ప) మనవంటూ కొన్ని తెలుగు ఆలోచనలు పుట్టినట్టుగా కనిపించవు. ఏకాకిగా కనిపించే "తెలుగు ఆలోచనల" వేమనను కూడా కులవిరోధిగానో, నాస్తికుడిగానో, చార్వాకుడిగానో, హేతువాదిగానో బ్రాండేసి చుట్టేసామేతప్ప తన ఆలోచనల్లోని తెలుగుతనాన్ని మనం నెత్తికెక్కించుకోలేదు. ఇక మిగిలినవాళ్ళందరూ అనువాదకవులూ, అసమాన సంస్కృత ప్రేమికులూ తప్ప మరొకరు దొరకరు.
సామాజికంగా,సాంస్కృతికంగా, చారిత్రకంగా బహుకొద్ది మందికి చెందిన. ముఖ్యంగా గిరిగీసుకున్న (closed groups) మైనారిటీలకు చెందిన సంస్కృతాంధ్రులది. వీరు బహుజనుల ఆలోచనల్ని క్రోడీకరించకపోవడం, అక్షరరూపంలో భవిష్యత్తుకోసం భద్రపరచకపోవడంతో ఈ మౌఖికజ్ఞానం హరణకు గురయ్యింది. ఇక మిగిలిందల్లా కడుపునిండిన వారు చెప్పుకునే భక్తి,ఆధ్యాత్మికత, వేదాంతం. రాజులని మెప్పించడానికి అల్లుకునే శృంగారం, రసస్పందన. వీటిల్లో ఒరిజినల్ తెలుగు ఆలోచనలకన్నా అప్పటికే సంస్కృతంలో పుష్కలంగా ఉన్న వాటిని ఏరుకోవడం సులువు. అసలే మనోళ్ళు అనువాదాల్లో దిట్టలు కాబట్టి ఇంతేసంగతులు చిత్తగించవలెను అనిపించారు. "తెలుగు జాతీయత"స్ఫూర్తిగాలేని సంస్కృతాంధ్ర సారస్వతం తెలుగు ఆలోచనల్ని ప్రేరేపించలేకపోతే అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
బ్రిటిష్ (వలస)పూర్వపు ఉద్యమాలన్నీ మతానికి సంబంధించినవి. సామాజిక జీవన విధానాల్ని పుట్టుకనుంచీ చావువరకూ నిర్దేశించినది మతం. కానీ ఆంధ్రదేశంలో పుట్టి ఆంధ్రదేశంలో (తెలుగులో) మతాన్ని బోధించిన మతస్థాపకులు ఒకరూ మనకు కనిపించరు. పక్క రాష్ట్రాలైన తమిళ నాడుని తీసుకుంటే సంగం సాహిత్యం నుంచీ, శైవ-వైష్ణవ పోరాటాల వరకూ ఆపైన భక్తి ఉద్యమాల దాకా మొత్తంగా మతపరమైన "ఒరిజినల్ థాట్" కనిపిస్తుంది. కర్ణాటకలో వీరశైవం వంటి ఆలోచనా సరళులు పురుడుపోసుకున్నాయి. ఇక కేరళలో అయితే ఏకంగా శంకరాచార్యుడు ఉద్భవించాడు. వాగ్వివాదాలతో, ఖండనతో మతనిరూపణ చేసే మహత్తర నమూనాని ప్రతిపాదించాడు. అదొక విప్లవాత్మక ఆలోచన. కానీ ఆంధ్రదేశంలో...తెలుగులో...తెలుగు జాతిలో...ఇలాంటి పోకడలు అస్సలు కనిపించవు. జీవనపద్దతికి అప్పట్లో మూలాధారమైన మతం విషయంలోకూడా మనవి ఎంగిలి ఆలోచనలేగానీ ఒరిజినల్ థాట్ అస్సలు లేదు.
ఈ ఎంగిలిపోకడకు కూడా మూలం మన సంస్కృత ఉన్మాదమే అనేది కొందరి వాదన. నిజమే కావచ్చు. ఎందుకంటే, తమిళనాడుకి వెళితే దేవుడి మంత్రాలు చాలా వరకూ తమిళ్ లో ఉంటాయి. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఆగమశాస్త్రాన్ని స్థాపించుకున్న జాతి తమిళజాతి. కర్ణాటకలో వీరశైవులు పూజావిధానాలనే మార్చారు. సంస్కృతాన్ని మంత్రాలకోసం వాడుకున్నా, వారి కన్నడ ఆలోచనల్ని సంస్కృతీకరించారేగానీ సంస్కృతంలోని ఆలోచనల్ని తేరగా అనువదించుకుని తృప్తిపడలేదు. మనలాగే అదేగొప్ప అని గర్వపడలేదు.
ఇలా సంస్కృత బానిసత్వం నెరపిన తెలుగుజాతికి వలసవాదుల పరతంత్ర్య మేధా పరిజ్ఞానానికి దాసోహం అనడం చేపకు ఈతనేర్పినంత సులభం. ఇప్పుడు వాజ్మయవాదులుగా, సంస్కృతీ పరిరక్షకులుగా నయా-అవతారమెత్తుతున్న వారు గ్రహించాల్సిన సత్యమేమిటంటే సంస్కృతానికి గొడుగుపట్టినవీరే వలసవాద మేధనూ ఆధునిక కాలంలో ప్రతిష్టించి, పట్టంగట్టి పూజించారని. మెకాలే మానసపుత్రులని ఇతరుల్ని అనడం కాదు. వీళ్ళెంత పరతంత్ర-పరాన్న భుక్కులో వీళ్ళే గ్రహించుకోవడం ఒక అవసరం. తెలుగు జాతి ఆలోచనను యుగయుగం నిర్వీర్యం చేసిన వీరికి, ‘తెలుగుని కాపాడే బాధ్యత మీద సాధికారత ఉందా లేదా’ అని ఇతరులు ఆలోచించడం. గత అరవై సంవత్సరాలలో వలసతత్వం చూపిన దారిలో కాకుండా "ఆంధ్రజాతి" కోసం ఒక్క సొంత ఆలోచనని కూడా సృష్టించని ఈ మేధావులు తెలుగు పరిరక్షణకోసం పూనుకుంటే, ఒరిజినల్ థాట్ వస్తుందా అనేది నాకు సందేహమే.
తమిళ జనులు ద్రవిడ ఉద్యమంలో ఊగిపోతుంటే, "మాకు సంస్కృతంతో పేచీలేదు. హిందీతో అసలు గొడవలేదు." అని ద్రవిడ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచిన తెలుగుజాతి భాష దాస్యాన్నివీడే ఆ ఒక్క ఆధునిక అవకాశాన్నీ చేజేతులారా నాశనం చేసింది ఈ ఘనులే. "కన్నుగానని వస్తుతత్వము/ కాంచనేర్పురు లింగిరీజులు/కల్లనొల్లరు; వారి విద్యల/కరచి సత్యము నరసితిన్" అనుకున్న మన "ఆది" వలసమేధావులు ఎవరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వారిప్పుడు తెలుగును కాపాడి, తెలుగు ఆలోచనను పుట్టిస్తామని ఉర్రూతలూగితే శంకించడంలో తప్పేముంది?
మొదటగా సంస్కృతం, ఆ తరువాత "ఆధునిక దృష్టి"గా ఆంగ్లేయుల ద్వారా ప్రచారంగావింపబడిన క్రైస్తవ సాంస్కృతిక లిఖిత వ్యాఖ్యాన సాంప్రదాయాల్లోని లాభఫలాల్ని తొలుతనే గ్రహించేసి, మానసిక మేదోపరమైన మతమెప్పుడో మార్చుకున్న ఈ ఘనులు, ధురంధరులు తెలుగును, తెలుగు ఆలోచననూ ఏ మూసను ఉపయోగించి కాపాడుతారో తెలుసుకోవాలనుకోవడం న్యాయం కాదా?
అందుకే తెలుగులో ఒరిజినల్గా ఎలా ఆలోచించాలి అనేది వీరి గుత్తాధిపత్యానికి వదిలెయ్యకుండా అందరం ఆలోచించాలి.
****
Subscribe to:
Post Comments (Atom)
23 comments:
ఇన్ని రాసే బదులు మనవాళ్ళు వఠ్ఠి వెధవాయిలోయ్ అని ఒక్క ముక్కలో చెప్పేసుంటే సరిపోయుండేదిగా. ఎవరైనా కాదంటేగా ఈవివరణలు.
హ్మ్... నాకందుకే సొంత అలోచనలు సరిగా రావట్లేదేమొ..?
నాకు హేఁవీ హర్ధం కాఁలే. తెలుగులో ఆలోచించటం, సంస్కృతంలో ఆలోచించటం ఏంటీ? మీరు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నారు.
మీకు శ్రీపాద శ్రీవల్లభుడు తెలుసా? అహోబిళంలో ఉండే వైష్ణవమఠం లాంటివి కూడ ఇక్కడ ఉన్నవి. కాకపోతే కంచిమఠంవల్ల తమిళనాడులో, శృంగేరివల్ల కర్ణాటకలో మఠాల సంప్రదాయం ఎక్కువైంది. తమిళనాడులో ఉండే అనేక మఠాలలో ఎంతోమంది తెలుగువారు పీఠాథిపతులుగా ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. ఉదాహరణకు చినజీయర్‌స్వామివారి మఠం మధురైదగ్గర శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. కుర్తాళంపీఠంలోను తెలుగువారి ప్రాముఖ్యత కనిపిస్తుంది. కంచిమఠంలో ఎంతోమంది గతంలో పీఠాథిపతులుగా ఉన్నారు. మీరుచెప్పే తమిళనాడులో ముప్పతికభాగం శాస్త్రీయసంగీతం త్యాగరాయకృతులనుంచే వర్ధిల్లింది. ఎన్నోతమిళకృతులు ఉన్నా వీటినిపాడని కచ్చేరీలకు ప్రజలు ఉచితంగా రమ్మన్నా రారు.
తమిళనాడులో జరిగిన శైవ-వైష్ణవ పోరాటలు ఇచ్చిన ఒరిజినల్ థాట్ అక్కడిపోరాటలకు పనికివచ్చిందేకాని సమాజానికి ఇలాంటి వాటివల్ల ప్రయోజనం శూన్యం. ఇక వీరశైవంకూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ పూర్తి ఏకపక్షం. బసవేశ్వరుని అనంతరం ఇది తీవ్రంగా దెబ్బతిన్నది. మన చుట్టుపక్కల ఇంతటి మతపోరాటలు జరుతున్నా మనం అందులో పాల్గొనలేదు అంటే అది మనం గర్వించాల్సిన విషయమేగాని అంత బాధపడటం ఎందుకు.
తెలుగుపుట్టీంది సంస్కృతంనుంచి అని ప్రతి తెలుగువాడు ఒప్పికొంటాడు. బిడ్డలో తల్లిపోలికలు ఎంతసహజమో తెలుగులో ఆభాష వాసనలు ఉండటం అంతేసహజం. ఆమాటకువస్తే ఏ భారతీయభాషా సంస్కృతానికి అతీతంకాదు. ప్రతిభాషలోనూ దాని వాసనలు ఉంటాయి. కాకపోతే తమిళంలో(కేవలం తమిళంలో మాత్రమే) ఆభాష వాడుక తక్కువ. మనకు అసలురాని మరే ఇతర భారతీయభాషను విన్నా అందులోకొన్ని పదాలు అయినా తెలిసినవి ఉండడానికి కారణం ఇదే.
ఆగమశాస్త్రం తమిళులు స్థాపించినది కాదు. కాకపోతే దక్షిణాది ఆలయనిర్మాణంలో, అక్కడి వాతావరణాన్ని బట్టి ఉదాహరణకు ఇక్కడ ఊతరాదితో పోలిస్తే గాలిబలంగా ఉంటుంది అందునా ఋతుపవనాల సమయంలో మరీ ఉధృతంగా ఉండడమే కాక తరచూ దిశనుకూడా మార్చుకొంటుంది. ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఆలయవాస్థును మార్చుకొన్నారు. అందుకే పక్కనే ఉన్న కేరళలో గుళ్లు వేరేరకంగా ఉంటాయి. వాటిపై దీని ప్రభావం ఉండదు. ఇక మంత్రాల విధానానికి వస్తే అనేక సందర్భాల్లో మనకు మిగిలినవాళ్లకి తేడాలు ఉన్నాయి. కన్నడిగులవలెనే మనంకూడా సంస్కృతంలో చెప్పుకొంటాం. నేను గమనించాను. కాకపోతే దానికి మనవాళ్లు అంత ప్రాముఖ్యం ఇవ్వరు. తమిళనాడులో ఈపోకడ ఇటీవలికాలంలో కొంత ఉధృతం ఐంది. అంతకుముందు తమిళంపాళ్లు చాలా తక్కువ అని విన్నాను.
మనకంటే ముందు వలసవాదుల్ని నెత్తిన పెట్టుకొన్నవాళ్లు తమిళులు. ఆ సంగతి మరచిపోయారా? కాబట్టే అప్పటివరకు తెలుగువాళ్ల చేతిలోని చెన్నపట్నంలో వాళ్ల ఆధిక్యత మొదలైంది. మనకంటే ముందు వలసవాదుల ముంగిట సాగిల పడినవారు తమిళులు, మలయాళీలు. ఈవిషయంలో కన్నడీగులే నయం.
ఈద్రవిడ ఉద్యమం ఏఫలాన్ని ఆశించి చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఇమ్మంటే సన్నాయినొక్కులు నొక్కినవాళ్లు ఏముఖం పెట్టుకొని ద్రవిడ ఉద్యమం అన్నారో నాకు అర్ధంకాదు. వాళ్ల పోరాటనికి మనమే కాదు సాటి ద్రవిడులైన కన్నడిగులు, మలయాళీలు మద్దతివ్వలేదు. అసలు ఇలాంటి వేర్పాటువాదాన్ని ఎలా సమర్ధిస్తారు ఎవరైనా. మనకు సౌలభ్యంకోసం ప్రాంతీయభాషల్ని గుర్తించారుగానీ దానిపేరుతో ఇక్కడి సమాఖ్యవ్యవస్థను దెబ్బతీసేందుకుకాదు. మాతృభాషను మాట్లాడమ మనహక్కు, ఆంగ్లం మన అవసరం(ఉద్యోగాలురావు అంటే ఒక్క నాకొ** నేర్చుకోడు.) కానీ హిందీ మనబాద్యత. ఒకసారి దాన్ని జాతీయభాషగా గుర్తించినతరువాత దానిపై తగువులాడటాం అనవసరం. అందులోను దానికి సరైన పాత్యామ్నాయం ఎవరూ చూపించలేదు. చివరికి ద్రవిడ ఉద్యమకారులు కూడ.
చివర్లో అసలు తెలుగును కనుక్కోవడమేతప్పు అన్నరీతిలోఉంది మీరు రాసింది. పుట్టినకొత్తల్లో ఎక్కువగా ఉన్న సంస్కృతం రానురాను తగ్గింది. నన్నయ్య రచనలొ ముప్పాతిక భాగం ఉన్నది, తిక్కనగారి కాలానికి మూడొవంతుకు పడిపోయింది. మీరుచెప్పినదానికి ఏ భారతీయభాషా అతీతంకాదు. ఆమాటకువస్తె ఉర్దూలో అరబిక్ వాసనలు లేవా? ప్రాశ్చాత్యభాషల్లో గ్రీక్,ళాటీన్‌ల ప్రభావంలేదా? మనగుర్తింపుకోసం పోరాడటం తప్పుకాదు.కానీ అందుకోసం మూలాలను మర్చిపొమ్మనటం ఎలా?
ఆలోచించాల్సిన విషయాలు.
ఎక్కడో చదివాను తెలుగులో ఉన్న ఎనభై శాతం పదాలు సంస్కృతంనుంచి వచ్చాయట. అంతెందుకు మీ మొదటి వాక్యంలో ముక్కాలు సంస్కృతపదాలే :-)
దౌర్భాగ్యం కాకపోతే అన్నమయ్య పాటలలో వాడిన ఎన్నో అచ్చతెలుగు పదాలకు అర్ధాలు తెలియక బుర్రబద్దలుకొట్టుకొంటున్నాం. that is the plight of telugu now. we are born in it. ఈ కోణంలో ఆలోచిస్తే తెలుగు పరిరక్షణ వాదం ఒక్కోసారి నాకు నవ్వుతెప్పిస్తూంటుంది.
ఇక సాహిత్యానికి వస్తే, అవి ఆయాకాలాలకు అనుగుణంగా వ్రాయబడినవే తప్ప ఒక ప్రిప్లాన్డ్ ప్లాట్ తో వ్రాసినవి కాకపోవచ్చునని నా అభిప్రాయం.
ఎందుకంటే మన సినిమాలలో ఒక్కోదశకంలో కుటుంబసినిమాలు, ద్వందార్ధ సినిమాల , యాక్శను సినిమాలు, విప్లవ సినిమాలు ఉన్నట్లే. ఎందుకలాగ ఉన్నాయంటే ఏం చెప్పగలం? {మీరేమైనా చెపితే వినాలని ఉంది. :-)}
సమాజపు అన్నికోణాలలోని కరుణ, మానవత్వాలను ప్రతిబింబించే సాహిత్యానికి చావు ఉండదు. తెలుగులో అయితే వేమన పద్యాలు మంచి ఉదాహరణ.
బొల్లోజు బాబా
@సుబ్రహ్మణ్య చైతన్య: టపా మూల ఉద్దేశాన్ని గ్రహించకుండా you have lost in its details.
కాకపోతే ఇంకో చిత్రమేమిటంటే నాకు counter argument గా మీరు ఉదహరిస్తున్న విషయాలు నా వాదనను బలపరిచేవిగానే ఉండంటం. అందుకు నా ధన్యవాదాలు. మన తెలుగు వాళ్ళలోని ఉదాసీనతకు అద్దంపట్టే ఉదాహరణల్ని గర్వంగా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు.
ఇప్పుడు కొన్ని నాతరఫున్నుంచీ details. తెలుగు సంస్కృతం నుంచీ పుట్టలేదు. తెలుగు అనే జనపదుల భాషను సంస్కృతభూఇష్టం చేసి కొందరు కావ్యభాషని చేశారు. కాబట్టి తెలుగు సంస్కృతీకరణ ఒక ప్రయత్నపూర్వక యత్నమేగానీ "సహజం" కాదు.
తమిళులు ఆగమశాస్త్రాన్ని స్థాపించారని నేను చెప్పలేదు. తమదైన ఆగమశాస్త్రాన్ని సృష్టించుకున్నారన్నాను. ఆగమశాస్త్రం ఆలయనిర్మాణానికేకాదు విధివిధానాలనుకూడా శాసిస్తుంది.
బ్రిటిష్ పాలనలో ట్రాంవెకూర్ సంస్థానం, మైసూరు సంస్థానాలు మళయాళ, కన్నడ భాషను ఆలోచననూ వలసవాద ధోరణుల్నుంచీ కొంత దూరంగా ఉంచగలిగాయి. వలసవాదం తప్పని నేను చెప్పడం లేదు I am a product of that ideology and process, కానీ ఆ కారణం యొక్క తీవ్రత ఆంధ్రజాతిలో ఉన్నదని మాత్రం చెబుతున్నాను. ముఖ్యంగా కొన్ని వర్గ్గాల కారణంగా అది బలపడిందని మాత్రమే చెబుతున్నాను.
ద్రవిడ ఉద్యమాం గురించి దానిలోని సమస్యల గురించీ తెలుగు,కన్నడిగులు ఎందుకు దూరంగా ఉన్నారో, ముఖ్యంగా తెలుగువాళ్ళు ఎలా వెన్నుపోటుపొడిచారో చెప్పాలంటే అదో పెద్ద కథ. అది తరువాత చెప్పుకుందాం.
చివరిగా నా టపా తెలుగు ఆలోచన గురించి. ఒకసారి మొదటి పేరా చదువుకొని మళ్ళీ వ్యాసం చదవండి. తరువాత ఆ framework లో ఏమైనా issues ఉంటే చర్చిద్దాం.
@సత్యసాయి కొవ్వలి:
What a coincident, without reading your comment, after reading the first two paragraphs, I felt exactly the same feeling :-)
If you can't think on your own, you can never (is an overstatement?) whether you are living in Telugu or English or some other language. It is your intellectual capability rather than a function of language, just my thoughts ;)
చాలా అలోచింపజేసే టపా! ఐతే తెలుగుపై సంస్కృత ప్రభావం ఉండడానికీ, తెలుగువారికి ఒక ప్రత్యేకమైన అలోచనా విధానం లేకపోవడానికీ మధ్య నిజంగానే లంకె ఉందా అన్నది చర్చనీయాంశం. ఆధునిక మలయాళంలో అధునిక తెలుగుభాషతో పోలిస్తే ఎక్కువ సంస్కృత ప్రభావం ఉంది. వయలార్ రామవర్మ లాంటి వారు వ్రాసిన కవితలు సంస్కృత భూయిష్టమైనవి. కానీ వాటిల్లోని అలోచనలు మాత్రం మలయాళంవే. తెలుగువారి ఆలోచనల్లో స్వతంత్రత లోపించడానికి భాష symptomatic cause మాత్రమేనని నా ఉద్దేశ్యం. మూలకారణాలు చరిత్రలో వేరెక్కడో ఉన్నాయి. వెదకాలి!
ఇంతకూ మీ టపా రేరాజుగారి వాదానికి సమర్థనా, ఖండనా, లేక కొనసాగింపా :)
Rallapalli Ananthakrishna Sarma has some 'similar' comments in the first few pages of "Vemana" available from the Digital Library of India:
http://dli.iiit.ac.in/cgi-bin/Browse/scripts/use_scripts/advnew/allmetainfo.cgi?barcode=9000000000008
Unfortunately in many pages the print is faint. Currently, it says that the service is not available.
@గద్దేస్వరూప్: చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. బహుశా చిన్నప్పుడు నేను ఈ పుస్తకమే చదివానేమో (ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు).అప్పటి నుంచీ వేమనలోని మానవత్వం,తెలుగుతత్వం నన్ను విపరీతంగా ఆకర్షించాయి. ఈ మధ్య వస్తున్న ఫ్రొఫెసర్ ఎన్.గోపిగారి వ్యాఖ్యానంకూడా చాలా బాగుంటొంది.మళ్ళీ ఈ పుస్తకం దొరికితే చదవాలి.
@చంద్రమోహన్: రేరాజు "తెలుగు ఆలోచన" కొన్నాళ్ళుగా ఇబ్బంది పెడుతూనే ఉంది. నాకు తెలిసిన కారణాలన్నీ వెతుకుతున్నాను. అందులో కొన్ని ఇప్పటివరకు చెప్పాను. ఇవి మరికొన్ని. ఇంకా వెతకాలి. ఇంకా "ఆలోచించాలి".
మహేష్ గారూ,
>>"కన్నుగానని వస్తుతత్వము/ కాంచనేర్పురు లింగిరీజులు/కల్లనొల్లరు; వారి విద్యల/కరచి సత్యము నరసితిన్" అనుకున్న మన "ఆది" వలసమేధావులు ఎవరో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వారిప్పుడు తెలుగును కాపాడి, తెలుగు ఆలోచనను పుట్టిస్తామని ఉర్రూతలూగితే శంకించడంలో తప్పేముంది?
ఇక్కడ మీరంటున్నది ఎవరిగురించో కొంచెం వివరిస్తారా, నాకు బోధపడలేదు.
>>తెలుగు అనే జనపదుల భాషను సంస్కృతభూఇష్టం చేసి కొందరు కావ్యభాషని చేశారు. కాబట్టి తెలుగు సంస్కృతీకరణ ఒక ప్రయత్నపూర్వక యత్నమేగానీ "సహజం" కాదు.
ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? దీని గురించి కొన్ని వివరాలు ఇస్తారా? వీలైతే ఆ వివరాలు మీరెక్కడ చదివారో ఆ పుస్తకాలు కోట్ చేస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుంది.
తెలుగులో original ఆలోచనలు రావు గాక రావు. ఎందుకంటే original తెలుగు పదం కాదు కనుక. :-D
*** *** ***
Gags apart the post is good, if not gr8.
Most of the people go for the things which are easily attainable. They donn' wan'to think. BTW that's what they hate to do 'cas for that they oughtta use their brain, which unfortunately is extinct. :-)
""ఆంధ్రజాతి" కోసం ఒక్క సొంత ఆలోచనని కూడా సృష్టించని ఈ మేధావులు తెలుగు పరిరక్షణకోసం పూనుకుంటే, ఒరిజినల్ థాట్ వస్తుందా అనేది నాకు సందేహమే."
RoghttO!
There are two other books about Vemana that I found recently in Kolkata, both by Arudra. One is called "mana Vemana" and the other "Vemana Vedam". I could not find them in book shops in Hyderabad but they may ve available in libraries. My knowledge of Telugu literature is very limited but I found Vemana and Gurajada Apparao ver interesting and original.
In sciene, Andhras did produce some world class scientists like Yallapraggada Subbarao and Kalyampudi Radhakrishna Rao.
@భైరవభట్ల కామేశ్వర రావు: మీ మొదటి ప్రశ్నకు సమాధానం నేను ఉటంకించిన పద్యంలోనే ఉంది. రచయిత ఎవరో తెలుసుకుంటే మీకు సమాధానం తెలిసిపోతుంది. నేనిక్కడ సమాధానం చెప్పకపోవడానికి కారణం,అది చెబితే చర్చ ఖచ్చితంగా తప్పుదోవ పడుతుందనే నమ్మకం/భయం.
మహామహులు చెప్పిన వేల విషయాలలోని ఒకదాని క్రెడిబిలిటీని ప్రశ్నించినా, నేనేదో వారి మేధనూ వ్యక్తిత్వాన్నీ కించపరుస్తున్నానన్న అపోహలో వాదించి వేధించేవారి సంఖ్య పెరిగింది. కాబట్టి ఈ విషయంలో నన్ను క్షమించెయ్యండి.
ఇక మీ రెండోప్రశ్నకు సమాధానం పరవస్తు చిన్నయసూరి రాసిన బాల వ్యాకరణంలో దొరుకుతుంది. ఈ వ్యాకరణానికి ప్రమాణం కవిత్రయం. ఈ వ్యాకరణం తరువాతే "లిగ్విస్టిక్ పోలీసింగ్" (as described by శ్రీశ్రీ) తెలుగులో తయారయ్యిందని నమ్మే స్కూల్ ఆఫ్ థాట్ ఒకటుంది. మాండలిక/ప్రాదేశిక భాషల్ని "సహజభాషలు"గా భావించే చాలా మంది,ఈ వ్యాకరణాన్ని సంస్కృతాంధ్ర స్ఫూర్తిని "standardize" చేసిన కుట్రలో భాగంగా భావిస్తారు.
ఈ ఆలోచనలన్నీ ఎప్పుడోఎక్కడో చదివిన పుస్తకాల్లోంచీ random గా పుట్టినవేతప్ప ఒక పద్ధతి ప్రకారం "పరిశోధన" చేసి చెబుతున్నవి కావు. కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకాలు అని చెప్పలేనుగానీ, ఈ ఆలోచనలు విరివిగా ఉన్నాయనిమాత్రం చెప్పగలను.
మహేష్ గారు,
మొదటి ప్రశ్నగురించి: ఆ పద్యం గురజాడదని తెలుసండి. మీరన్న "వారిప్పుడు తెలుగును కాపాడి, తెలుగు ఆలోచనను పుట్టిస్తామని ఉర్రూతలూగితే శంకించడంలో తప్పేముంది?" అన్నది ఎవరి గురించో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గురజాడ లేరు కదా!?
రెండో ప్రశ్నగురించి: మీరిచ్చిన జవాబు సరిగా అర్థం కాలేదు. మీరన్న తెలుగును సంస్కృత భూయిష్టం చేసింది, ప్రయత్నపూర్వకంగా దీనికి యత్నం చేసింది చిన్నయ్యసూరా? కవిత్రయమా?
మీరు "ఆలోచనా/భావ ధార" కన్నా factsకి ఎక్కువ విలువనిచ్చేమాటైతే, భాషా శాస్త్రవేత్తలు రాసిన తెలుగు భాషా చరిత్రని ఒకసారి చదివితే ఈ విషయమై కొంత స్పష్టత ఏర్పడుతుంది. మీరు ప్రత్యేకించి పరిశోధించనక్కరలేదు. నన్నయ్యకి ముందు దొరికిన తెలుగు శాసనాల్లో కూడా విరివిగా సంస్కృతభూయిష్టమైన భాషే ఉంది.
@భైరవభట్ల కామేశ్వర రావు: నా సూచన "ఆది వలసమేధావుల" గురించి. మొట్టమెదటిసారిగా ఇంగ్లీషు చదువులకు ఎగబాకిన కొన్ని వర్గాల గురించి.వలసవాద భావజాలాన్ని చేజేతులారా తెలుగుజాతి మీద రుద్ధిన వర్గాల గురించి.
రెండో ప్రశ్న:ఎప్పటి నుంచో సంస్కృతాంధ్రాన్ని నెత్తినపెట్టుకున్నది పాలకవర్గం,పండితవర్గం. చిన్నయసూరి చేసిందల్లా ఆ సంస్కృతాంధ్రాన్ని ఆధునిక ధారలో కలపడం. తను ప్రమాణంగా తీసుకున్నది కవిత్రయాన్ని. అందుకే వారి ప్రస్తావన చెయ్యవలసి వచ్చింది.
అప్పటికీ ఇప్పటికీ మాండలిక/ప్రాదేశిక జనపద భాషలకు స్థానం ఇవ్వకుండా కేవలం రెండు వర్గాల "తెలుగు"కు మాత్రం పట్టంగట్టడంవల్లే "తెలుగు ఆలోచన" కరువయ్యిందని నా భావన.
""తెలుగు జాతి" భావపరతంత్రత బ్రిటిష్ పాలనకన్నా ముందునుంచే మొదలయ్యిందేమో అనేది నా ఆలోచన. ఎందుకంటే, బ్రిటిష్ వారికి పూర్వంకూడా (వేమన తప్ప) మనవంటూ కొన్ని తెలుగు ఆలోచనలు పుట్టినట్టుగా కనిపించవు."
తెలుగువారికి ప్రత్యేకంగా ఒరిజినల్ థాట్ లేదనేది బహుశా నిజం కావచ్చు. ఎందుకంటే ముందు సనాతన ధర్మం, ఆ తరవాత జైన బౌద్ధాలు, అటుపైన అద్వైతం, దాని తరవాత శైవ వైష్ణవాలు .. ప్రజాజీవితాన్ని నిర్దేశించిన ప్రతి తాత్త్విక దృక్పథమూ దేశంలోని ఇతర జాతులతో పంచుకున్నదే .. ఏ వొక్క జాతీ ఇది మాది మాత్రమే అని చెప్పుకునే పరిస్థితి కాదు. బహుశా అటువంటి అవసరం రాలేదు కూడా.
సాంస్కృతిక సామాజిక చరిత్రకీ తాత్త్విక సాంప్రదాయానికి మీరేసిన ముడి సరికాదని నా అభిప్రాయం. నన్నయ దగ్గర్నించీ, అన్నమయ్య నించీ, మొన్నటి విశ్వనాథ సత్యనారాయణదాకా, ప్రేరణ సంస్కృతమైనా తెలుగుజాతికి సొంతమైన అనేక జీవితానుభవాలు అచ్చమైన తెలుగుభాషలో రూపుదిద్దుకుని ఉన్నాయి. ఇది కాక మౌఖిక సాహిత్యం.
ఆ మాటకొస్తే వేమన వెలిబుచ్చిన "తెలుగు ఆలోచనలు" ఏమిటి? అవి మాత్రం shared values కాదా?
మీరు ఈ టపాలో వెలువరించిన diatribe మొత్తం ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి కట్టమంచి రామలింగారెడ్డి గారితో మొదలై, వారి అనుయాయుల (దారితప్పిన) ఆలోచనా ధోరణిని ప్రతిఫలిస్తోంది తప్ప వేరు కాదు. ఇందులో చర్చించిన వస్తువు (material) తో మీకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఈ వాదనలూ ప్రతివాదనలూ ఎక్కడో ప్రచురించిన చర్చల్లోంచి తెచ్చినవి. నాకు ఒక్క మాట సూటిగా చెప్పండి, హైస్కూలు తెలుగు వాచకంలో తప్పించి మీరు ఏ సాంప్రదాయ తెలుగు రచన చదివారు?
నాకున్న ఇంకో అభ్యంతరం తమిళులు నడిపిన ద్రవిడా ఉద్యమం గురించి .. ఎక్కడ ఎప్పుడు ఎవరు నడీపారు ఈ ద్రవిడ ఉద్యమం? తెలుగు వాళ్ళు ద్రవిడ ఉద్యమంలో చేరాల్సిన అవసరం ఏమిటి? ఏవిధంగా తెలుగు వారు ద్రవిడ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచారు?
గురజాడ ఆంగ్లోఫిలియా జగద్విదితం. అందులో దాచుకున్నదేమీ లేదు, మీరు కొత్తగా చెప్పిందేవీ లేదు. అదే పద్ధతిలో గురజాడ తెలుగు రచనకి, తెలుగు విద్యకి చేసిన మహోపకారం కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ రెండు లక్షణాలూ పరస్పరం వ్యతిరేకం (mutually exclusive) అన్న అనుకోలున్నది మీ వాదనలో. ఆ అనుకోలు తప్పు. మీరు గురజాడని ఏదో అనేస్తున్నారని నాకేం బాధ లేదు.
బైదవే, ఇదే వాదన మీరు కొకు గురించీ, శ్రీశ్రీ గురించీ కూడా చేస్తారా ఈ విషయంలో?
@కొత్తపాళీ: నేను పదోతరగతి తరువాత క్లాస్ రూం తెలుగు చదవలేదు. కానీ తెలుగు రచనలు చదివాను. మీరు చెప్పే "సాంప్రదాయ రచనలు" అంటే ఏమిటో నాకు తెలీదు. నాకు దొరికినవి, నాకు నచ్చినవి, ఎవరో చెప్పినవీ అన్నీ చదివాను. మీరు మీ ఉద్దేశంలో ఏవి సాంప్రదాయరచనలో చెబితే, ఆ లిస్టులోంచీ నేను ఏం చదివానో ఏవి చదవలేదో మాత్రం చెప్పగలను.
నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు. అలా చెప్పే జ్ఞానం నాదగ్గర లేదు. నాకు తెలిసినవి ఎక్కడో ఒకదగ్గర తెలుసుకున్నవీ, చదివినవీ, చర్చల్లో గ్రహించినవే. సొంతంగా నేను ఇంతవరకూ ఏ ఆలోచనా జీవితంలో చెయ్యలేదు. ఉన్న ఆలోచనల్లో కొన్నింటిని సొంతం చేసుకున్నాను అంతే.So I never claim proposing any thing NEW.
గురజాడ ఆగ్లోఫీలియాని చెప్పడం ద్వారా నేను ఆయన వ్యక్తిత్వాన్నో లేక ఆయన contribution మొత్తాన్నో ప్రశ్నించినట్లు మీకెందుకనిపించింది? Great people can be foolish at times. Some times TIME will make them look like fools. ఇదీ అంతే. కొకు,శ్రీశ్రీ అందుకు మినహాయింపు ఎందుకవుతారు? They have their own moments of madness.
నిజానికి colonization - వలసవాదం యొక్క విస్తృతికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఇప్పుడు నైతికం-నైతికం అంటున్న హిందుత్వ విలువలు విక్టోరియన్ విలువలు కాదా! మన విద్య,వైద్యం,చట్టం వలసవాద మూసలు కావా! మన ఆలోచనా సరళి,సైద్ధాంతిక జ్ఞానం వలసమేధ వి కావా! "ఆధునికత" పేరుతో మనం చేస్తున్న అభ్యుదయం వలసవాదమనస్తత్వపు నిశానీ కాదా!
కాకపోతే, మీరు రజనీకాంత్ లాగా "నాదారి రహదారి" అని అనేసుకుని, మిగతావాళ్ళ ఆలోచనా సరళిని "దారితప్పిన" అని నిర్ణయించారు చూడండి...ఆ తరహా మనస్తత్వంతోనే నా విరోధమంతా. దీన్నొక alternate ideology గా గుర్తించక ఒక aberration చేసిననాడు ఈ చర్చలు తప్పవు. They will continue.
ద్రవిడ ఉద్యమం గురించి ‘మే’లో నేనొక టపా రాశాను. ఒకసారి చూడండి. అందులో కొన్ని వివరాలున్నాయి.
hey man we already learnt how to do a software job. This is just telugu is it not?
Maheshkumar-gaaru,
My apologies in advance if I sound harsh. Prior to my decision to comment on your blog, I did read your other messages on "Telugu, Modernity, Language and Dravidian movement" as well.
What a mess!
I sincerely and strongly urge you to do some serious reading and/or inform yourself better before coming up with such grand conclusions/opinions.
When I read a sentence like: "అప్పటికీ ఇప్పటికీ మాండలిక/ప్రాదేశిక జనపద భాషలకు స్థానం ఇవ్వకుండా కేవలం రెండు వర్గాల "తెలుగు"కు మాత్రం పట్టంగట్టడంవల్లే "తెలుగు ఆలోచన" కరువయ్యిందని నా భావన.", I wonder if you have the slightest clue about this subject.
or a sentence like: "వీరు బహుజనుల ఆలోచనల్ని క్రోడీకరించకపోవడం, అక్షరరూపంలో భవిష్యత్తుకోసం భద్రపరచకపోవడంతో ఈ మౌఖికజ్ఞానం హరణకు గురయ్యింది."
or, your comment on Chinnaya Suri's text, and so on.
Once again, my apologies for being harsh, but with such arguments you are doing more damage to yourself and the "sciences" itself. I for one take you no more seriously!
Regards,
Sreenivas
P.S. I do admire and respect your clear stance on various other subjects and I seriously mean it. This comment is strictly restricted to your ramblings on above subject.
@పరుచూరి శ్రీనివాస్: My (present)conclusions are based on what I have read, learnt and imagined.If you have any suggested reading references on this subject, please do share it with me. I am ready to de-learn and re-learn.
This topic is bothering me. If anybody is able to answer that question, then I would be very grateful :) Then what do you think ? What happens if leprosy is left untreated? Thank you very much for valuable response :)
__________________
[url=http://fiverr.com/worldofseo/create-8000-20-000-30-000-40-000-50-000-100-000-500-000-and-1-million-verified-forum-profiles-with-xrumer-unlimited-keywords-not]xrumer service[/url]
Post a Comment