Tuesday, July 14, 2009

పాఠకుడు - విమర్శకుడు - బ్లాగులు


"నాలో పాఠకుడూ, సాహితీ విమర్శకుడు వేరు వేరు కాదు" అన్నారు కొత్తపాళీ గారు.

నిజమే. విమర్శకుడు కూడా మొదట పాఠకుడే. చదివేదీ ఆ మనిషే, విమర్శాత్మకంగా విశ్లేషించేదీ అదే మనిషి. కానీ "ఉద్దేశాలు" వేరువేరు. బహుశా అదే వారిద్ధరినీ ఒకే మనిషి నుంచీ ఇద్దరిగా విడదీస్తుందని నా ఆలోచన.

విమర్శకుడెప్పుడూ సగటు పాఠకుడికన్నా ఒకపాలు భిన్నంగానే ఉంటాడు. విమర్శకుడి ఉద్దేశం కేవలం చదవటం కాదు. చదివే పాఠకుడికి మార్గనిర్దేశన చెయ్యడం. ఒక పుస్తకాన్ని ఎలా చదవాలో చెప్పడం. అలా చెప్పాలంటే కొంత నిర్ధిష్టమైన జ్ఞానం - చరిత్ర ఉండాలి. దానికి తగిన భాష ఉండాలి. కొన్ని కొలతలూ, కొలమానాలూ, ధృక్కోణాలూ,సిద్ధాంతాలూ, నియమాలూ తెలిసుండాలి. అలా ఒకస్థాయిలో తెలిసిన క్షణాన విమర్శకుడు పాఠకుడిగా "మాత్రమే" ఉండజాలడు. He/She becomes a 'critical reader' from that point in time. అదే పైత్యం మరికొంత ముదిరితే పూర్తిస్థాయి విమర్శకుడు అవుతాడు. దాన్నే వృత్తి చేసుకుంటే professional critic అవుతాడు.

నాకు సినిమా పిచ్చిపట్టిన కొన్నాళ్ళకు మా అన్నయ్యతో కలిసి ఒక సినిమాకెళ్ళాను. సినిమా ముగియగానే "సినిమా ఎలా ఉంది?" అని మా అన్నయ్య అడిగిన పాపానికి, ఆ మూడు గంటల సినిమా గురించి మరో మూడు గంటల విశ్లేషణ చేసిపారేసాను. అప్పుడు మా అన్నయ్య సందేహంగా "ఇన్ని ఆలోచిస్తూ నువ్వు నిజంగా సినిమాని ఎంజాయ్ చేశావా?" అనే ఒక యక్షప్రశ్న సంధించారు. చాలా సహేతుకమైన ప్రశ్న. అప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయాను. కానీ బహుశా ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉందనుకుంటాను. ‘ప్రేక్షక విమర్శకుడు’ "ఎంజాయ్" చేస్తాడు. కానీ కేవలం చూసి రసస్పందన పొందడంతో వదిలెయ్యకుండా, అదే సమయంలో విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ ఎంజాయ్ చేస్తాడు. సాధారణ ప్రేక్షకుడికన్నా ఒకపాలు భిన్నంగా ఆ work of art ను అనుభవించి ఆనందిస్తాడు. అదే పాఠకవిమర్శకుడికీ వర్తిస్తుంది.

విమర్శకు కొన్ని తూనికలూ,కొలమానాలూ,పద్ధతులూ,శాస్త్రీయతా ఉన్నా చిట్టచివరకూ objectivity మాత్రం ఉండదు. అక్కడే వస్తుంది తేడా అంతా. ఒకే మూసలోంచీ విమర్శను నేర్చుకొచ్చిన విమర్శకుల్లోకూడా, ఒక పుస్తకం గురించి ఏకాభిప్రాయం కుదరకపోవడం సాధారణం. ఒకే కొలమానం వాడినాకూడా భిన్నంగా విశ్లేషించడం సర్వసాధారణం. ఇలాంటి వాతావరణంలోకూడా, ఇంత భిన్నమైన స్వరాలకు అవకాశం ఉన్నాకూడా "ఇలా ఉంటేనే ఉత్తమం. లేకుండే మధ్యమం లేక అధమం" అనే జడ్జిమెంటులు ఎలా చెల్లుతాయి అనేది చిదంబర రహస్యం. దాని గురించి చర్చించినా పెద్ద ఉపయోగం లేదు.

పాఠకుడి సహజ స్పందనకు సాహితీ విలువలేని, పాఠక-విమర్శకుడికి సాహితీ విమర్శలో స్థానం లేని, విమర్శకుల్లో సమన్వయం లేని ఈ నేపధ్యంలో, పరిణితి చెందిన సాహితీవాతావరణాల్లో "reader-response criticism" చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పాఠకులే తగ్గిపోతున్న మన తెలుగులో పాఠకస్పందనని బేరీజుచేసే పరిశోధనలు లేవు సరికదా, కాస్తోకూస్తోగా ఉన్న "పాఠక-స్పందనవిమర్శ" విమర్శకుల కరుడుగట్టిన ప్రమాణాల మధ్య పరిమళించకుండానే వాడిపోతోంది. ఇక తెలుగు సాహిత్యానికి మిగిలిందల్లా రచయితలూ-విమర్శకులూ మాత్రమే. స్పందించే పాఠకులూ, స్పందనను చెప్పగలిగే పాఠకవిమర్శకులూ లేకుండా ఎంత కాలం సాహిత్యం నడుస్తుంది? కేవలం రచయితా - విమర్శకులతో సాహిత్యం ఎంతకాలం పరిమళిస్తుంది? అవి సమాధానం లేని ప్రశ్నలు. కానీ ప్రశ్నించాల్సిన విషయాలు.

ఈ తెలుగు సాహితీ కలికాలంలో కమలంలా వికసించిందే బ్లాగుల్లో "పాఠక-స్పందనవిమర్శ"లు. ఇక్కడ నచ్చిందీ, నచ్చందీ అచ్చంగా చెప్పెయ్యొచ్చు. ఆపేవాడూ అడ్డుచెప్పేవాడూ, హద్దులు నిర్ణయించేవాడూ ఎవరూ లేరు. ఇదే మూసలో నువ్వు కథను చూడాలి, నవలను చదవాలి, కవితల్ని ఆస్వాదించాలి అని నిర్దేశించేవాళ్ళు తక్కువ. అలా ఎవరైనా నిర్దేశించినా పట్టించుకోకపోవడమో, పక్కకు తప్పుకెళ్ళడమో లేక ఏదో ఒక వివరణ ఇచ్చుకోవడమో మనచేతిలో పని. ఏదోఒక స్థాయిలో informed readers ఇక్కడ ఉంటారుకాబట్టి ఇంతకు మించిన ప్రజాస్వామిక సాహితీవిమర్శ మరెక్కడా కుదరదు. ముఖ్యంగా రచయిత తెలుసనో లేక విమర్శిస్తే ఏమనుకుంటారనో మొహమాటపడో, భయపడో మసిపూసి మారేడుకాయ చెయ్యనఖ్ఖరలేదు. When you have nothing to lose, there is nothing to fear for అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది.

అయినా, ఒక రచయితకు ఆత్మతృప్తి సహృదయుడైన పాఠకుడి విమర్శలో లభిస్తుందేతప్ప ఒక విమర్శకుడి జడ్జిమెంటులో కాదనేది నా అభిప్రాయం. బ్లాగుల్లో ఆ direct interface లభిస్తుంది. అప్పుడప్పుడూ విమర్శల్లో సూటిపోటి మాటలూ, ఎత్తిపొడుపులూ తప్పవు. ఎంతైనా మన ప్రజాస్వామ్య స్ఫూర్తి కొంచెం "అతి"కదా!

ధియరీ అంతా తిరిగొచ్చి అసలు కథకొస్తే, "పాఠకుడూ, సాహితీ విమర్శకుడు వేరు వేరు కాదు" అన్నా,అనుకున్నా ‘కేవలం పాఠకుడు’ - ‘కేవలం విమర్శకుడు’ మధ్యలో "పాఠకవిమర్శకుడు" ఒకడున్నాడు. వాడు ఛస్తే ఊరుకోడు. పాఠకుల్ని కేవలం పాఠకులుగా ఉండనీడు.

పాఠకుడు స్పదనకు ప్రతిస్పందనని, ఉత్తేజానికి ఉద్వేగాన్నీ, వివరణల్లో విషయాన్నీ, విషయంలోతులో స్ఫూర్తినీ వెతుక్కుంటాడే తప్ప విమర్శకుడిలా పోటీలు నిర్వహించడు. విమర్శకుడు చదువుతున్న పుస్తకాన్ని తనకు తెలిసిన జ్ఞానంతో పోటీపడమంటాడు. అప్పటికే నిర్ధారింపబడిన మూసలతో పోరాటం చెయ్యమంటాడు. "ఉన్నతం" అని అప్పటికే నిర్ణయించుకున్న శైలి, శిల్పం,రీతి,రివాజు (critical traditions)లతో కత్తులు దూసి రచయిత "స్థాయి"ని ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించడం ద్వారా తన అవగాహనను స్థాపించి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటాడు. ఆ ఆధిపత్యాన్ని అడ్డంపెట్టుకుని పాఠకుడ్ని సాధికారకంగా నిర్దేశించాలని చూస్తాడు.ఇక్కడ ఉద్దేశం పాఠకుడ్ని నిర్దేశించడం వరకైతే ఫరవాలేదు. కానీ అప్పుడప్పుడూ విమర్శకులు తమ ఆధిపత్యాన్ని రచయితపైనా, పాఠకుడి భావాలపైనా రుద్దాలని చూస్తారు. అది బహుశా సహజం కూడా. అక్కడే సమస్య మొదలౌతుంది.

"పాఠకవిమర్శకుడి" ఉద్దేశం, స్ఫూర్తి అది కాదు. ఒక విధంగా చూస్తే విమర్శకుడు యజమాని అవ్వాలని ప్రయత్నిస్తే పాఠకుడు పుస్తకానికి దాసొహం అంటాడు. కానీ పాఠకవిమర్శకుడు రచయితకు/పుస్తకానికీ సమస్థాయిలో నిల్చి ఒక అర్థవంతమైన చర్చకు ప్రయత్నిస్తాడు. This is more of an equal relationship in that sense. ఇక్కడ దాసోహం, ఆధిపత్యం రెండూ లేవుకాబట్టి "విశాలత్వానికి" అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర పాఠకుల ధృక్కోణాల్ని సహానుభూతితో (సానుభూతి కాదు), సమగౌరవంతో, సహృదయతతో చూసే అవకాశం ఉంది. రచయితతో సమానులుగా ప్రవర్తిస్తున్నాం గనక స్నేహభావానికి ఆస్కారముంది.

కాబట్టి Let's be democratic. But still responsible. Let's be critical. But still be resiprocative. సాహిత్యాన్ని ప్రజాస్వామికం చేసే మహత్తర ప్రక్రియగా బ్లాగులున్నప్పుడు వాటిని పాతమూసల్లో కుదించడానికి ప్రయత్నించడంకన్నా, ఎంత సృజనాత్మకంగా వాటి బాధ్యతల్ని విస్తరించాలి అని ఆలోచించడం ముఖ్యం.

****

13 comments:

జ్యోతి said...

మంచి విశ్లేషణ..

విశ్వామిత్ర said...

కత్తి వారూ మీ వివరణ బావుంది. కానీ మీరు చెప్పిన పరిస్తితి రచయితకు ఎందుకు ఎదురవుతుందో చెప్పలేదు. చెప్పిన విషయంలో స్పష్టత లేనప్పుడు, చెప్పిన విషయంలో మారు అర్ధాలు కనిపిస్తున్నప్పుడు మాత్రమే ఈ పరిస్తితి వస్తుంది. మీరు రాసిన విషయంలోనె వాక్యాలు ఒక చోట చేర్చి చూడంది.

"నాలో పాఠకుడూ, సాహితీ విమర్శకుడు వేరు వేరు కాదు" అన్నారు కొత్తపాళీ గారు.
ఒకస్థాయిలో తెలిసిన క్షణాన విమర్శకుడు పాఠకుడిగా "మాత్రమే" ఉండజాలడు.
అదే పైత్యం మరికొంత ముదిరితే పూర్తిస్థాయి విమర్శకుడు అవుతాడు.
దీని అర్ధం ఏమి తిరుమలేశా?

ఇది మరో యుద్ధం కాదా?

Kathi Mahesh Kumar said...

@విశ్వామిత్ర: మీరు చేసిన విన్యాసాన్ని quoting out of context అంటారు.

ఇదేవ్యాసంలోని ఈ వాక్యాల సమాహారాన్ని చూడండి;

"అలా ఒకస్థాయిలో తెలిసిన క్షణాన విమర్శకుడు పాఠకుడిగా "మాత్రమే" ఉండజాలడు. He/She becomes a 'critical reader' from that point in time.అదే పైత్యం మరికొంత ముదిరితే పూర్తిస్థాయి విమర్శకుడు అవుతాడు."

"నాకు సినిమా పిచ్చిపట్టిన కొన్నాళ్ళకు మా అన్నయ్యతో కలిసి ఒక సినిమాకెళ్ళాను."

"‘ప్రేక్షక విమర్శకుడు’ "ఎంజాయ్" చేస్తాడు. కానీ కేవలం చూసి రసస్పందన పొందడంతో వదిలెయ్యకుండా, అదే సమయంలో విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ ఎంజాయ్ చేస్తాడు. సాధారణ ప్రేక్షకుడికన్నా ఒకపాలు భిన్నంగా ఆ work of art ను అనుభవించి ఆనందిస్తాడు. అదే పాఠకవిమర్శకుడికీ వర్తిస్తుంది."

ఇప్పుడు మీకు ఇంకా మరో యుద్ధం కనబడుతోందా! ఐతే చివరి పేరాగ్రాఫ్ మళ్ళీ చదువుకోండి.

ఇక మీరు మొదటిగా లేవనెత్తిన ప్రశ్న. మారు అర్థాలు కనిపించడం గురించి; రచన mathematical formula కాదు అర్ధాలు మారకుండా ఉండటానికి.
రచయిత ఉద్దేశంకన్నా, పాఠకుడు చదువుతూ చేసుకునే అర్థంలో "కొత్త అర్థాలు ఏర్పడుతాయి".

వాటికి రచయిత బాధ్యుడు కాదు. రచన రచయిత నుంచీ విడిపడి ఒక స్వతంత్ర్య వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది.ఆ identity తో పాఠకుడు engage అవుతాడు. ఒకొక్కప్పుడు రచయితను రచనతో విడిగాచూడని పాఠకులూ తగుల్తారు. రచయిత land/mind scape తెలియని పాఠకులూ దాన్ని చదువుతారు. ఎవరి అర్థాలు వారివి. అన్ని అపార్థాలకూ రచయిత అస్పష్టత కారణం కాకపోవచ్చు. కొన్ని అర్థాలకి పాఠకుల మన:స్థితి కారణం కావచ్చు. లేక రచనకు మరిన్ని కొత్త అర్థాలు పాఠకుల పఠనం వల్ల కలగొచ్చు.

అందుకే reader is ultimate.

కొత్త పాళీ said...

Interesting.
I may even agree with many suppositions and conclusions in this piece.
However, let me also say the following:

1. Yes, let's be democratic. However, in my experience so far, democracy did not produce great art! I would love to be corrected on this.

2. Where was I non-democratic in my previous arguments.

3. ప్రస్తుతం తెలుగులో సాహిత్య విమర్శ అసలు ఎక్కడుంది?

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ గారు:
1.సాహిత్యం సమిష్టివ్యవసాయం కాదు ప్రజాస్వామ్య పద్దతిలో "పుట్టించడానికి". అందులో ఏ మాత్రం సందేహం లేదు. Art will not be produced democratically, but art thrives only on democratic spirit for sure. That is increasingly decreasing in Telugu blog space.

2.వ్యాసం మీ statement తో ప్రారంభించినా there were lot of other thoughts that came to my mind while discussing "democracy". మీరు క్రితం వ్యాసంలో undemocratic గా ఉన్నారని నా ఉద్దేశం అస్సలు కాదు.కొన్ని జడ్జిమెంట్లు మాత్రం ఇచ్చారు.I had issues with them and I explained them over there itself.

ఇక్కడ నేను వెలిబుచ్చింది కొన్ని చర్చల్లో నేను చూసిన autocratic ధోరణుల గురించి మాత్రమే. పాఠకవిమర్శకుడి వ్యాఖ్యానాన్ని కించపరిచి వ్యక్తిగత దాడి చేసిన వైనాన్ని గురించి మాత్రమే.

3.తెలుగులో సాహితీ విమర్శ...దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనుకుంటాను. కానీ బ్లాగులు ఒక alternate space ఇచ్చాయి, కనీసం దాన్నైనా judicious గా వాడొచ్చని నా ఆలోచన. అందుకే వ్యాసాన్ని అలా ముగించాను.

విశ్వామిత్ర said...

Mahesh you narrates a story about some thing (like buffalo) and you dictate the readers to feel it some thing else (like COW). If it is pointed out, you say I am not responsible for your misunderstanding.

రాధిక said...

"ఒకే మూసలోంచీ విమర్శను నేర్చుకొచ్చిన విమర్శకుల్లోకూడా".....నేర్చుకొచ్చిన విమర్శకులా ?

Kathi Mahesh Kumar said...

@రాధిక: అవునండీ! సాహితీవిమర్శ ఒక అకడమిక్ అధ్యయనం. విమర్శను యూనివర్సిటీల్లో నేర్పిస్తారు.

@విశ్వామిత్ర: రాంధ్రాన్వేషణతప్ప మీరు విషయచర్చకు ఎటువంటి ప్రయత్నమూ ఇంతవరకూ చెయ్యలేదు. మీ ఉద్దేశం అదే అయితే I can only pity you.

గీతాచార్య said...

"పాఠకుడు స్పందనకు ప్రతిస్పందనని,.........అక్కడే సమస్య మొదలౌతుంది."
*** *** ***

ఇదే విషయాన్ని మనం ఒకసారి వేరే విషయంలో చర్చించాం కదూ!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

శంకరాభరణం సినిమాచూసే ఉంటారు మీరు. అందులో "అమ్మా" అనే పిలుపును ఎన్నిరకాలుగా చెప్పొచ్చో వివరిస్తాడు. అల్లగే రచయిత ఒకే వాక్యాన్ని అనేక సందర్భాల్లో అనేకవిధాల్లో ఉపయోగిస్తుంటాడు. ఐతే అది చదివేవాడికి అర్ధం కానప్పుడు సమాచారలోపం తలెత్తుతుంది. మామూలుగా ఐతే పెద్దసమస్య ఉండదుగానీ బ్లాగుల్లో వాళ్లిచ్చే వ్యాఖ్యలు రచయితను కొన్నిసార్లు బలంగా తాకే అవకాశం ఉంది. కాబట్టి ఆపరిస్థితి తలెత్తకుండా, అంటే చదివేవాళ్లను కొద్దిగా తికమకపెట్టి గందరగోళంలో పడకుండా చెయ్యాల్సిన బాధ్యత రచయితదే. వీలైనంత సరళమైనభాషను ఉపయోగించడం ద్వార ఈపరిస్థితిని తొలిగించవచ్చు.

వేమన said...

@ మహేష్

మీరు చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు. కానీ ఇందులో కొన్ని గమనించాల్సిన విషయాలున్నాయి.

1. మీరు పాఠక విమర్శకుడు అనేవాణ్ణి తీసుకొచ్చి విమర్శకుడిని విలన్ని చేసి పారేశారు. A critic need not be necessarily negative always.

2. రచయతని Judge చేసే వాడికంటే మంచో చెడో రచనని Judge చేసేవాడే నయం, విమర్శకుడైనా సరే, ఏమంటారు ?

3. మంచి రచనని విమర్శించడం కంటే ఆ విమర్శ అవసరమా కాదా అని డిసైడ్ చెయ్యడమే ఎక్కువ undemocratic.

Kathi Mahesh Kumar said...

@వేమన:చాలా మంచి బిందువుల్ని లేవనెత్తారు.

1.ఈ వ్యాసంపరిధి ‘సాహితీవిమర్శన’కాదు కాబట్టి విమర్శకుడ్ని పక్కనపెట్టానేకానీ, విలన్ని చెయ్యాలనే ఉద్దేశం లేదు. నిజానికి విమర్శకుడు సాహిత్యంలో కొంత విలన్ మరి కొంత దర్శకుడి పాత్ర పోషిస్తాడు. విమర్శన,విమర్శకుడి గురించి చర్చించుకోవాలంటే మ్యాథ్యూ ఆర్నాల్డ్ నుంచీ మన బూదరాజు గారి వరకూ చాలా విషయాలు చెప్పుకోవాలి.

విమర్శకు విమర్శనకూ కూడా తేడా తెలీని విమర్శకులున్న రోజులివి. అందుకే పాఠకవిమర్శకుడు అవసరమయ్యాడు. He/She is not a substitute for critic. But surely a useful and much needed compliment for the sake of literature.

2.ఇక్కడొచ్చిన సమస్యకూడా అదే అని బహుశా మీరు గ్రహించారనుకుంటాను. రచన స్ఫూర్తిని,ఉద్దెశాన్ని కాకుండా రచయిత అజెండాని,ఆపాదిత ఉద్దేశాన్ని వెతికే విమర్శకుడికీ పాఠకవిమర్శకుడికీ అట్టే తేడా ఉండదు. రెండూ uncalled for and not appreciable.

3.విమర్శయొక్క అవసరాన్ని ఎప్పుడూ డిస్మిస్ చెయ్యడం కుదరదు. దాని రూపం మార్చమనే కోరిక మాత్రం ప్రజాస్వామికమే. విమర్శకున్న వివిధరూపాల్ని గుర్తించమనడం ఖచ్చితంగా ప్రజాస్వామికమే.నా ప్రయత్నం అదే.

@సుబ్రహ్మణ్య చైతన్య: రచయిత రాసేప్పుడు ఎంతమందికి వీలైతే అంతమందికి అర్థమవ్వాలనే రాస్తాడు. తన ఉద్దేశం సూటిగా తెలపాలనే రాస్తాడు. కానీ చదివే ప్రతిపాఠకుడి స్థాయికీ వెళ్ళి ఆలోచించాలంటే కుదురుతుందంటారా? ఇక కావాలని అర్థాలుకాక అపార్థాల్ని వెతికే పాఠకుల గురించి ఏమని చెప్పాలి!

రమణ said...

చాలా ఆసక్తికరమైన చర్చ. అపార్ధాలకు తావున్నపుడు, వాదన సరియైనదా? కాదా? అనేది అందరూ మరొక్కసారి తరచి చూసుకోవాలి. ఇది అందరి మీద ఉన్న బాధ్యత