Friday, July 4, 2008

పోలీసులకు మానవ హక్కులు లేవా?

జూన్ 29 న చిత్రావతి రిజర్వాయర్ దగ్గర, సీలేరు నది దాటుతున్న గ్రేహౌండ్స్ దళాలపై నక్సల్స్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 35 మంది పోలీసులు గల్లంతయ్యారు. వీరిలో కొందరు జలసమాధి అయ్యుండొచ్చనీ, మరి కొందరు నక్సల్స్ కు బందీలుగా చిక్కిఉంటారని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో చదువరి గారు తమ బ్లాగులో చాలా సంవేదనాత్మకమైన టపారాసి, కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు.
వారు లేవనెత్తిన ఒక ముఖ్యమైన ప్రశ్న"వాళ్ళకు (పోలీసులకు) లేవా హక్కులు? అని. ఈ ప్రశ్నతోపాటూ, నక్సల్స్ పట్ల ఇలాంటి హింస జరిగితే సర్వత్రా వాపోయే మానవ హక్కుల సంఘాల దృక్పధాన్నీ, పంధానీ ప్రశ్నించడం కూడా జరిగింది. నిజానికి ఇవి చాలా సహేతుకమైన ప్రశ్నలూ, బహుశా చాలా మంది మనసుల్లో ఎప్పటినుండో మెదిలే ప్రశలుకూడా. కాకపోతే, ఈ ప్రశ్నల గురించి అర్థవంతమైన చర్చ ‘రాజ్య హింస - మానవ హక్కులు’ అనే విషయం గురించి కూలంకషంగా తెలిస్తేగానీ, అంత సులభంగా జరపలేం. ఎందుకంటే మనలో చాలా మందికి అభిప్రాయాలు ఉంటాయేగానీ, దానికి తగిన సమాచారం ఉండదు. అందుకే, నాకు తెలిసిన కొంత భారతదేశంలో మానవహక్కుల పరిణామక్రమం యొక్క సమాచారాన్ని స్థూలంగా ఇక్కడ పొందుపరుస్తూ, చర్చని కొనసాగిస్తాను.1936లో మొదటిగా మన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
Indian Civil Liberties Union (ICLU) ని స్థాపించారు. దీని యొక్క ఉద్దేశ్యం వీరి మాటల్లోనే చెప్పాలంటే, The question of civil liberties arise not when the people of a country obediently carry out the orders of a government. It arises only when there is a conflict between the people and the executive authority. The idea of civil liberties is to have the right to oppose the government". ఈ మూల సిద్ధాంతం ఇప్పటికీ వర్తిస్తుంది.ఈ ఉద్యమ పరిణామాన్ని తీసుకుంటే, దాన్ని మూడు దశలుగా సామాజిక శాస్త్రవేత్తలు విభజించారు. స్వాతంత్ర్యానంతరం నుండీ 70 ల ఆరంభం వరకూ ఈ ఉద్యమానికి ఒక విస్తృత రూపం లేదు. అందుకే దీని మొదటిది విస్తృత దశ 70లలో మొదలైందని చెప్పొచ్చు. దీన్ని ‘civil liberties phase’గా అనుకోవచ్చు. ఈ దశలో, రాజ్యం (State) తో కలిసి పౌరహక్కుల ఉల్లంఘన కాకుండా, ఒక సామరస్యమైన పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం మార్గాలు వెదకడం జరిగింది.ఈ దశలో ప్రాధమిక హక్కుల కోసం ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలతో పాటూ, చట్టం న్యాయం వంటి వ్యవస్థల స్వయంప్రతిపత్తి కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యింది. ‘State ఈ వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది’ అన్న అభిప్రాయం ఈ ఉద్యమ స్ఫూర్తికి మూలం.1975-77 ఎమర్జన్సీ సమయంలో, రాజ్యం యొక్క విశృంఖల రూపాన్ని చూసిన ఉద్యమకర్తలు 80లలో మరో పంధాను ఎంచుకున్నారు. అదే ప్రజా హక్కుల కోసం పోరాడడం, ‘rights based civil society’. ఇది రెండో దశ. ఇందులో చాలా స్పష్టంగా sate Vs civil society కోణం కనబడుతుంది. పౌర హక్కుల పరిధి, రాజ్యపరిధికి వెలుపలనున్న ఒక స్వతంత్ర్య పరిధి (realm of freedom) గా నిర్వచించడం జరిగింది. అప్పుడే రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధపోరాటాల్ని ఈ ఉద్యమం క్రిందకు తీసుకురావడం జరిగింది. నక్సలిజం అందులో ఒకటి.మూడో దశ 90లలో మొదలైంది, ఇది మానవ హక్కులకు (human rights phase) సంబంధించినది. ఈ దశలో పౌర సమాజం, రాజకీయ వ్యవస్థను తమకు విరోధిగా గుర్తించింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందని చెప్పొచ్చు. రాజకీయ వ్యవస్థ తెలివిగా, సామాజిక జీవనంలో ఉన్నటువంటి నక్సలిజం లాంటి సాయుధపోరాటాల్ని కూడా హక్కుల ఉల్లంఘనగా ఎంచి, వాటిని ఖండించడంతో పాటూ, విజయవంతంగా అణగదొక్కడానికి ప్రజా అంగీకారాన్ని కూడగట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ పరిణామాలకు ఏమి చెయ్యాలో పాలుపోని ఉద్యమకారులు, నైతిక విలువలు అనే abstract కోణంలో తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. అందుకే వారు ఇప్పుడు చెప్పేవి మనకు కాస్త ఆమోదయోగ్యం కాకుండా అనిపిస్తాయి.ఇక ప్రస్తుతం ఉన్న సమస్య కొస్తే, చనిపోయిన పోలీసులకు సంతాపం ప్రకటించడం, దానితో పాటూ నక్సల్స్ దుశ్చర్యల్ని ఖండించడం మనుషులుగా మనమందరం చెయ్యాల్సిన పని. కాకపోతే, మానవహక్కుల అద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని, ప్రభుత్వంతో పోరాడుతున్న మానవ హక్కుల సంఘాలను "మీరు నక్సల్స్ కి మాత్రమే వత్తాసు పలుకుతారా? పోలీసులకు మానవహక్కులు లేవా?" అని ప్రశ్నించడం అంత తార్కికం కాదు. ఎందుకంటే, ప్రభుత్వం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న పోలీసుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించి ఈ దారుణానికి పరోక్షంగా కారణమైన ప్రభుత్వ అలసత్వాన్నీ, నిరాసక్తతనీ, మితిమీరిన నమ్మకాన్నీ మనం కలసికట్టుగా గర్హించాలి. ఈ మానవ హక్కుల సంఘాలుకూడా, నక్సల్స్ చేతిలో ఉన్న అమాయక పోలీసులను విడిపించడంతో పాటూ, చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సరైన ప్రభుత్వ సహాయం అందేలా చూడాలి.పోలీసులకూ మానవ హక్కులున్నాయి. వాటి పరిరక్షణ బాధ్యత ఉద్యోగమిచ్చి వారి తరఫున పోరాడమని చెబుతున్న ప్రభుత్వానిది. మానవ హక్కుల సంఘాలు పని, ప్రభుత్వ పరంగా మానవ హక్కుల ఉల్లఘన జరగకుండా పోరాడటం . ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తేనే మన సమాజంలో శాంతి నెలకొనేదీ, మనం సుఖంగా మనగలిగేదీ. ఈ సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి....

సురాజ్య మవలేని
స్వరాజ్య మెందుకని?
సుఖాన మనలేని
వికాస మెందుకని?
అడుగుతోంది అదిగో...
ఎగిరే భరతపతాకం.

--------జై హింద్------
9 comments:

oremuna said...

1/5

bojja.vasu said...

మీరు కూడా కొంచెం పౌరహక్కుల సంఘం వారిలాగా మాట్లాడుతున్నారు.
ఒక వైపు "మీరు నక్సల్స్ కి మాత్రమే వత్తాసు పలుకుతారా? పోలీసులకు మానవహక్కులు లేవా?" అని ప్రశ్నించడం అంత తార్కికం కాదు. ఎందుకంటే, ప్రభుత్వం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న పోలీసుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించి ఈ దారుణానికి పరోక్షంగా కారణమైన ప్రభుత్వ అలసత్వాన్నీ, నిరాసక్తతనీ, మితిమీరిన నమ్మకాన్నీ మనం కలసికట్టుగా గర్హించాలి అంటూ అందమయిన పదాలతో మీరు వ్రాసిన ఈ టపావల్ల మీరు ఎవరిని సమర్ధిస్తున్నారో అర్ధం అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికీ అన్యాయం జరిగినా వారివైపు వుండి పోరాడలేకపోయిన కనీసం మద్దతుగా మాటసాయం చేయటం, అన్యాయాన్ని ఖండించటం కనీస మానవత్వం. సిద్దాంతాలు, గత చరిత్రలు ఉటంకిస్తూ వాదనలు చేయటం ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా చెప్పుకోవాలనే మానవ హక్కుల సంఘం వారి నిర్లజ్జపూర్వకమయిన హేయమయిన వైఖరి.

దానికి మీరు కొంత వత్తాసు పలకటం నాకయితే బాధేసింది.అదీ మీరు చేయటం.

పోలీస్ వాళ్ళ భాద్యత ప్రభుత్వం వారిది అయితే మనం ఎవరం. రోడ్డు మీద ఎవరికయినా ఆక్సిడెంట్ అయితే మనం కనీసం 108 కి ఫోన్ చేయటం మన భాద్యత, అవునా ఒక వేళ రక్తం అత్యవసరం(అది మన గ్రూప్ అయితే) అయితే ఆ సమస్య బ్లడ్ బాంకులది, ప్రభుత్వానిది అని మనం సిద్దాంతాలు, భాద్యతల గురించి చర్చలు చేస్తామా, రక్త దానం చేస్తామా.
నేను మిమ్మల్ని విమర్శించటం లేదు.
ప్రస్తుతం మన కర్తవ్యమ్ ఏమిటి? భాదితులు ఎవరయినా వోదార్చటమా!? సంఘీ బావం తెలపటమా !? లేదా సిద్దాంతాలు,చరిత్ర , గ్రూపులు చూసుకుని ( ఘనత వహించిన పౌర సంఘాల మాదిరి) వ్యక్తిగత లాభాలు, కీర్తి గురించి అలోచించి ఒక వైపు మాట్లాదటమా !!!

కత్తి మహేష్ కుమార్ said...

@వాసు గారు, నేను చెప్పింది సైద్దాంతిక నేపధ్యం గురించి, దానిద్వారా మానవ హక్కుల సంఘాలలో ఏర్పడిన శూన్యత (ఉద్యమకారులు, నైతిక విలువలు అనే abstract కోణంలో తమ పోరాటాన్ని సాగిస్తున్నారు)గురించి. ఇంత విపులంగా నేను రాసినా, మీకు నేను ఒకవైపుగా మాట్లాడుతున్నాను అనిపిస్తే నేను చేయగలిగింది ఏమీలేదు.


ఇక మీరు సెలెక్టివ్ గా కొన్ని వాక్యాలు తీసుకుని, నేనూ వారికి మద్దత్తునిస్తున్నారనే నిర్ణయానికొచ్చారు. నేను చెప్పదలచింది ఈ పరిస్థితికి గల నేపధ్యం గురించి. కాకపోతే, even by the definition (pls. see Nehru's definition) వారు పోలీసుల మరణానికి సంతాపాన్ని తెలుపగలరేకానీ, సైద్ధాంతిక పరంగా ప్రభుత్వాన్ని సమర్ధించలేరు. మరణించిన పోలీసులు ప్రభుత్వం తరఫున నక్సల్స్ ని వెతికి చంపడానికి కూంబింగ్ ఆపరేషన్ చేస్తూండగా మరణించారు. As a principle సంఘాలు ఈ విధానాన్నే వ్యతిరేకిస్తాయి. అలాంటప్పుడు వారినుండీ vehement ఖండన ఆశించడం మన తప్పు అంటున్నాను.


ప్రజలుగా ఇప్పుడు మన సానుభూతి మరణించిన పోలీసుల కుటుంబాలకూ,విమర్శ ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి వైపు ఉండాలి. ఈ పరిస్థితుల్లో inconsequential హక్కుల సంఘాలపై కాదు.


@ఒరేమునా, నన్ను 5 కి 1 మార్కు ఇచ్చి ఫెయిల్ చెయ్యడానికి మీ కారణం మీకుండొచ్చు. కానీ ఆ కారణాన్ని చెప్పుంటే ఇంకా బాగుండేది.

చదువరి said...

"ఆ బాధ్యతను విస్మరించి ఈ దారుణానికి పరోక్షంగా కారణమైన ప్రభుత్వ అలసత్వాన్నీ, నిరాసక్తతనీ, మితిమీరిన నమ్మకాన్నీ మనం కలసికట్టుగా గర్హించాలి." - నిజానికి ఇక్కడ ఎవరినీ విమర్శించనక్కరలేదు. ఎందుకంటే ఇది యుద్ధం. కార్గిల్లో మన సైనికులను చంపారని పాకిస్తాను వాళ్ళను, వాళ్ళను చంపారని మనాళ్ళనీ విమర్శిస్తారా? యుద్ధం చేసేదే చంపేందుకు! మళ్ళీ చంపారని విమర్శ ఎందుకు? (పోలీసులు, మావోయిస్టులూ చేసే పనులు రెండూ ఒకటే - తప్పైతే ఇద్దరిదీ తప్పే, ఒప్పైతే ఇద్దరిదీ ఒప్పే!) ప్రశ్నేంటంటే.. యుద్ధంలో ఒక పక్షాన్ని చంపినందుకు రెండోవాళ్ళని విమర్శిస్తారెందుకు.. వాళ్ళు వీళ్ళని చంపినపుడు నోరువిప్పరెందుకు? చంపడం ఒకరు చేస్తే తప్పు మరొకరు చేస్తే ఒప్పూనా? మారణకాండను సమర్ధించేందుకూ / వ్యతిరేకించేందుకూ వంకలా?

ఇవన్నీ మాకు తెలవదు, మేం రూలు ప్రకారమే పోతామంటారా, మా.హ. కార్యకర్తలు మాట్టాడేందుకు కారణం ఒకటి ఉండి తీరాలనే అంటారా.. అయితే, యుద్ధ సమయంలో అమానుషకాండకు వ్యతిరేకంగా మాట్టాడొచ్చు - చేతులు విరిచికట్టి నదిలోకి తోసెయ్యడం, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిపై దాడి చెయ్యడం - ఇవి అమానుషమే! కాదంటే చెప్పండి.

Dil said...

చదువరి గారు,

మావోయిస్టులకు, పోలీసులకు నదుమ నడుస్తున్న యుద్ధానికీ, రెండు దేశాల మధ్య యుద్ధానికీ చాలా తేడా ఉంది. ఇక్కడ తెను ఏర్పాటు చేసుకున్న న్యాయ వ్యవస్థ, చట్టవ్యవస్థ స్వయంగా ప్రభుత్వమే అతిక్రమించి, గ్రే హౌండ్స్ వంటి వేటగాళ్లను తయారు చేసే విధానాలను ముందు ప్రశ్నించాలి మనం.

Why are young Indians being made Cannon Fodder? తలలకు వెలలు కట్టి మొదలుపెట్టిన ఈ వేటకు ప్రత్యామ్న్యాయం లేదా?

ఇవీ ఇప్పుడు మనబోటి వారు అడగాల్సిన ప్రశ్నలు...

కొణతం దిలీప్

కత్తి మహేష్ కుమార్ said...

@చదువరి, ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపితే ‘హత్య’, ఒక సిద్ధాంతంకోసం ఆయుధం పట్టి హింసకు ప్రతిహింస చేస్తే ‘విప్లవం’, రాజ్యమే (State) తను ఏర్పరుచుకున్న న్యాయచట్ట వ్యవస్థల్ని మీరి extra/anti constitutional methods లో హింసించడానికో లేక చంపడానికో పూనుకుంటే దాన్ని ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంటారు.

పైన చెప్పిన నిర్వచనాలు ప్రపంచవ్యాప్తంగా అంగీకరింపబడిన అర్థాలు. వాటిని ఆధారం చేసుకునే నేను ఈ వ్యాసం రాయటం జరిగింది.మరణించిన ప్రతి మనిషి మీదా, సాటి మనుషులుగా మనకు సానుభూతి ఉండటం సహజం. కానీ ఇలాంటి సైద్ధాంతిక పోరాటాలనడున వ్యక్తులు మరణించినపుడు ఈ సిద్ధాంతాని ఇటోవైపూ, అటోవైపూ కొన్ని భిన్నాభిప్రాయాలున్నట్లే, ప్రతిస్పందించే విధానం కూడా వేరుగా ఉంటుంది.

వారి ప్రతిస్పందన ‘వేరుగా’ ఉన్నంత మాత్రానా, వారు ఈ అమానుష చర్యల్ని సమర్థిస్తున్నారని భావించడం సరికాదని మాత్రమే నా నివేదన.ఇక మీరు చేసిన పాకిస్తాన్ యుద్దం పోలికకు, దిలీప్ సమధానం appropriate గా ఉందనుకుంటాను, చూడగలరు.

చదువరి said...

దిలీప్ గారూ,
నాక్కాస్త తిరకాసుగా ఉంది.. చట్టాన్ని అతిక్రమించింది ప్రభుత్వమా? మావోయిస్టులా? సమాజంలో తుపాకీ పట్టుకు తిరిగే వాళ్ళా చట్ట వ్యతిరేకులు? వాళ్ళను ఎదుర్కొనే ప్రభుత్వమా? మావోయిస్టులు అసలీ వ్యవస్థనే నమ్మరు అని అంటారా.. వ్యవస్థపై తిరుగుబాటు చేసి తుపాకీలు పట్టుకుని తిరిగేవాళ్ళను ఏవిధంగా ఎదుర్కోవాలి?

దీనికి జవాబు మీరు చెప్పారు -"..ఈ వేటకు ప్రత్యామ్న్యాయం లేదా?": మీరు రాజకీయ పరిష్కారం గురించి మాట్టాడుతున్నట్టుంది. అది ఇక్కడ చేరిస్తే చర్చా పరిధి పెద్దదౌతుంది. (ఆ పరిష్కారాన్ని ఆలోచించకపోవడం మన రాజకీయ నాయకత్వ లోపం. నిజానికి మనకంతటి సమర్ధత, విశ్వసనీయతా కలిగిన నాయకులు లేరని నా ఉద్దేశ్యం..)

మావోయిస్టులను తుపాకీని తమ తుపాకీ ద్వారానే ఎదుర్కోవాలని ప్రభుత్వం ప్రయత్నించినంతకాలం అది గెరిల్లా యుద్ధమే! రెండు పక్షాలకూ యుద్ధనీతి ఒక్కటే!

యుద్ధాల్లోనైనా ఎదరి పక్షంపై చూపించే పాశవికత మానవహక్కుల ఉల్లంఘనే గదా! (నేను చెప్పిన సందర్భాన్ని కూడా గమనించగలరు... మానవహక్కుల కార్యకర్తలు 'ప్రభుత్వ దమననీతి'ని మాత్రమే ఎదుర్కొంటారని అంటే.. అలా అన్నాను.)

సరే ఇది యుద్ధం కాదని మీరన్నట్టే అనుకుందాం.. మా.హ సంస్థలు మందుపాతరలకు కూడా వ్యతిరేకంగా గొంతెత్తుతారని నేను విన్నాను. మరి మావోయిస్టుల మందుపాతరల సంగతేంటి?

మహేశ్ గారూ, మరో మాట.. మా.హ. సంఘాలు ప్రభుత్వ దమన నీతే కాక, కార్పొరేట్ల వ్యవహారశైలి పట్ల, సామాజిక పరిస్థితుల పట్ల (ఉదా: అంటరానితనం) కూడా చురుగ్గా ఉంటాయి కదా!

arvindrishi said...

నిజంగా మానవ హక్కుల సంఘం ఈ సంధర్భంలో ఏమన్నా అన్నా కూడా పెద్దగా ఒరిగేదేమీ ఉండకపొవచ్చు..! పోలీసుల కౌంటర్ ఎటాక్కి కొద్దిగా నైతిక బలం పెరిగేదేమో అంతే. మనం ఏ పేరు పెట్టుకున్నా ఇది యుద్ధమే..!
ఈ దేశంలో రాజ్యాధికారం ప్రజాస్వామ్య బద్ధంగానే రావాలీ అని అనుకుని ఒక పద్ధతి పెట్టుకున్నప్పుడు ఆ పద్ధతుల మీద ఏ మాత్రం నమ్మకం లేని వాళ్ళతో చర్చలు అన్టే ఎలా? ఈ సిస్టమ్ లో ఇలాంటి శక్తులని చర్చలతో ఎలా కంట్రోల్ చేయగలం.

మావోఇస్ట్లు కుడా రాజ్యాధికారం ముందు దేశా ప్రగతి తరువాయి అనుకుని తెగించినట్టే యుద్ధం చేస్తున్నారు .

ISP Administrator said...

కరీంనగర్ జిల్లాలో భూస్వాములు ఎక్కువగా ఉన్న సిరిసిల్లా, కోనరావుపేట ప్రాంతాలలో పోలీసులు చేసే అత్యాచారాలు చూస్తే తెలుస్తుంది "మానవ హక్కులు" పోలీసులకి వర్తిస్తాయో లేదో. ఇంద్రవెల్లి, వాకపల్లి లాంటి ఘటనల గురించి చాల మంది పేపర్లలో చదివే ఉంటారు. ఈ మధ్య చత్తీస్ గఢ్ లో సల్వా జుడుం కార్యకర్తలు అమాయక గిరిజనులని కిడ్నాప్ చేసి చంపి ఎంకౌంటర్ కథ అల్లారు. చనిపోయిన గిరిజనులు పక్కన నాటు తుపాకులు ఉన్నాయి కానీ ఏ.కే.47 లాంటి ఆయుధాలు లేవు. వారు నక్సలైట్లు కారు, అమాయక గిరిజనులని స్పష్టంగా ఋజువైనా పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. ఇలాంటి రాక్షస కార్యాలు చేసేవారికి మానవ హక్కులు అవసరమా?