కాలేజిలో ఉండగా, ప్రతి వారాంతరంలో దూరదర్శన్ లో ప్రసారమయ్యే హిందీ సినిమాల పరంపరలో భాగంగా గురుదత్ దర్శకనిర్మాతగా తనే నటించిన ‘ప్యాసా’ (प्यासा) సినిమా చూడ్డం జరిగింది. మొదటి ఫ్రేమ్ నుంచే ఈ సినిమా నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.
నాయకుడి భావుకత, కవిహృదయం, రాజీపడలేని మనస్తత్వం నాకు గౌరవప్రదంగా అనిపించాయి. ప్రేమికురాలిగా నటించిన ‘మాలాసిన్హా’ అందం ఆ సినిమాలో ముఖ్యంగా "హమ్ ఆప్ కె ఆంఖొంమే ఇస్ దిల్ కో సమాలెతో" అనే పాటలో కళ్ళతో నటించిన తీరును చూసి అర్జంటుగా ప్రేమించానని చెప్పొచ్చు. ‘వహీదా రెహమాన్’ "జానెక్యా తూనే కహె, జానె క్యామైనే సునే" అని చిలిపికళ్ళతో కథానాయకుణ్ణి ఆహ్వానిస్తుంటే, నన్నేనేమో అని భ్రమించానుకూడా. "జానెవొ కైసే లోగ్ థె జిన్కొ ప్యార్ సె ప్యార్ మిలా" అని భగ్నప్రేమికుడిగా ‘గురుదత్’ ఆలపిస్తుంటే, బాధగా మూల్గిన నా హౄదయ స్పందన నిన్నజరిగినట్లుగానే ఇప్పటికీ అనిపిస్తుంది. ఇక "ఎ దునియా అగర్ మిల్ భి జాయేతొ క్యాహై" అని చివర్న నాయకుడు ఈ ప్రపంచాన్ని ప్రశ్నించి త్యజిస్తున్న పాటను చూసి, నేను భరించలేని ఆవేశంతో లేచి నిలబడిన క్షణం ఇంకా నా మదిలో తాజాగా ఉంది. ఆ SD బర్మన్ గారి పాటలు ఆ సినిమాలో చిత్రీకరించిన విధానం అటువంటిది. ఇక నటీనటుల నటన అద్వితీయం.
సంగీతం, నటనతోపాటూ చిత్రకథ, కథనం, సినెమటోగ్రఫీ అన్నీ...అన్నీ నాకు ఈ సినిమాలో ఉత్తమం అనిపించాయి. ఈ మధ్య నేను ‘ముళ్ళపూడి రమణ’ గారి ‘సినీరమణీయం 1’ చదువుతుండగా ఈ చిత్రసమీక్ష కనబడింది. కానీ నా అభిప్రాయానికి భిన్నంగా రమణ గారి విమర్శ ఉండంతో, కొంత ఆలోచించి కారణాలను వెదకుతూ ఒక వ్యాసాన్ని నవతరంగం కోసం రాసాను. ఆ వ్యాసాన్ని ఈ లంకె ద్వారా చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.
Saturday, July 12, 2008
ముళ్ళపూడి రమణ ‘ప్యాసా’ చిత్రసమీక్షపై నా సమీక్ష
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
మీ సమీక్ష బాగుంది మహేష్,ఆర్సన్ వెల్స్ తీసిన సిటిజెన్ కేన్ కూడా మొదటి రిలీజ్ లొ ఫ్లాపట, కానీ ఇప్పుడదొక క్లాసిక్. అన్ని ఫిల్మ్ స్కూల్స్ లోనూ మొదటి ఛాప్టర్. మల్లెపూవు సినిమా గుర్తు చేసినందుకు ధన్యవాదలు. చిన్నప్పుడు చూసాను, "నువ్వు వస్తావనీ బృందావని" అని వాణీ జయరాం గారు పాడిన పాట ఉంది కదా.
మన మనస్సుకి బాగా నచ్చిన దాన్ని మనకి అంతే నచ్చినవాళ్ళు విమర్సిస్తే ఒక సారి పునస్సమీక్ష చేసుకోవటం మనల్ని మనం కొత్త వెలుగులో చూసుకోవటం లాంటిదే. మీ ప్రయత్నం బాగుంది.గురుదత్ కి మీరన్నట్టుగానే భారతీయ సినిమాలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
Post a Comment