బహుభాషా నటుడైన రమేష్ అర్వింద్ (రుద్రవీణ, సతి లీలావతి Etc.) ఈ మధ్య ‘యాక్సిడెంట్’ అనే కన్నడ సినిమాలో హీరోగా చేస్తూ, రేడీయోజాకీ పాత్రని పోషించాడు. టీవీలో ఛానళ్ళు నొక్కుతున్న నాకు తన ఇంటర్వూ ఒకటి కనబడింది. "అసలు రేడియోజాకీ పాత్ర ఎందుకు పోషిస్తున్నారు?" అన్న ప్రశ్నకు అతడి సమాధానం, "ఈ మధ్య యువత చాలా విన్నూతనమైన ఉద్యోగాలు చేస్తోంది. వాళ్ళతో ఐడెంటిఫై చెయ్యబడితే బాగుంటుందని, ఈ పాత్రను అలా తీర్చిదిద్దాం. అంతేకాక, ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక రేడియో స్టేషన్ కి వెళ్ళిన నేను, వ్యక్తిగతంగా ఈ ఉద్యోగశైలిపట్ల ఆకర్షితుడ్నయ్యాను. అందుకే ఇలా ప్రయత్నించాం" అన్నాడు.
ఈ ఇంటర్వ్యూ చూసిన మరునాడు థియేటర్లో ‘రేస్’ అనే హిందీ సినిమా చూసాను. ఈ సినిమాలో హీరో,హీరోయిన్, విలన్, కామెడియన్ అనే భేధం లేకుండా అందరూ మోసగాళ్ళు, దొంగలూ, డబ్బుకోసం హత్య చెయ్యడానికి కూడా వెనుదియ్యని మహామహులూ కనబడ్డారు. అన్నాతమ్ముడా, ప్రియురాలాపెళ్ళామా, పోలీసాదొంగా అన్న తేడాలేకుండా ఒకర్నొకరు దగా చేసుకుంటూ దర్జాగా నడిచిన కథయిది. పైపెచ్చు ఒక పేద్ధ కమర్షియల్ హిట్ కూడా. ఈ సినిమాచూసిన తరువాత నాకర్థమయ్యిందేమిటంటే, BAD BOY is the new HERO అని.
ఈ సినిమాచూసి నేను తెలుసుకున్న పరమ సత్యాన్ని నామిత్రుడొకడికి అర్జంటుగా ఫోన్ చేసి చెప్పాను. అటునుంచీ ఒక్క క్షణం నిశ్శబ్ధం తరువాత విలన్లా నవ్వుతూ, "ఓరి మూర్ఖుడా! ఆంధ్రాలో లేక నువ్వు బతికిపోయావుగానీ, తెలుగు హీరో ఎప్పడో దొంగగా మారిపోయాడ్రా ఫూల్" అని నా కళ్ళు తెరిపించాడు. ఆ తరువాత కళ్ళుమూసుకునొక్కసారి మననం చేసుకుంటే, ఆల్రెడీ కళ్ళుతెరిచిన నా కళ్ళలో నీళ్ళుతిరిగాయి. 2007 లో పెద్దహిట్లైన పాప్యులర్ హీరొల సినిమాలన్నింటిలోనూ కథానాయకుడు దొంగో,ఫ్యాక్షనిస్టో, హంతకుడో,మోసగాడో లేక అంతకన్నా బరితెగించేవాడోగానే కనిపించి ప్రేక్షకులకి విందులు చేసారు. 2006 సంవత్సరమూ అందుకు మినహాయింపుకాదు.ఇక 2008 లోనూ పెద్ద మార్పొచ్చినట్లు అనిపించడం లేదు. అంటే, మొత్తానికి మన సినిమాలల్లో సాధారణ మనుషులో, మర్యాదగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో, కళాకారులో హీరోలుగా కనబడే అవకాశం అస్సలు లేదన్నమాట.
ఇంత జ్ఞానోదయమైనా నిరాశ చెందక అవిశ్రామంగా వెతికి రెండు సినిమా పట్టుకున్నా, మొదటిది ‘ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే’, రెండోది ‘హ్యాపీడేస్’. ‘ఆడవారి మాటలకు...’లో హీరో(వెంకటేష్) ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇదేమాట నా సాఫ్ట్వేర్ మిత్రుడికి చెబితే, వాడు తిట్టిన తిట్లు వినలేక నా చెవిపోటొచ్చింది. "వాడు చేసే ప్రాజెక్టేమిటి, వాడు జాయినైన కంపెనీ ఏమిటి, ఒక్కరాత్రిలో వాడు సాల్వ్ చేసే ప్రాబ్లమెమిటి, వాడ్ని తేరగా ఫారిన్ ఎందుకు పంపుతారు" అంటూ నానా ప్రశ్నలూ వేసి, నా ఆనందాన్ని కాస్తా "తుస్సు" మనిపించాడు. అంటే తేలిందేమిటయ్యా అంటే, పాత్ర ఉన్నా అది నిజంగా నిజానికి చాలా దూరం అని.
ఇక మిగిలిన ‘హ్యాపీడేస్’ని పట్టుకుని నేను హ్యపీగా ఉండగా, ఆ ఆనందమూ నిలవలేదు. దానిమీదా నాకు చాంతాడంత జ్ఞానాన్ని ఇంజనీరింగ్ చదివిన నా మిత్రులు అందిస్తే, అసలు ఆ సినిమాలోని పాత్రల పాంతీయత, భాష, భావాలపై ఒక తీవ్రమైన లెక్చర్ నా ఇంకో ఔత్సాహిక సినిమా ప్రేమికుడి ద్వారా వినక తప్పింది కాదు. అంతా వినిపించాక, "అయినా గుడ్డిలో మెల్ల అనుకుని ఈ సినిమాను ఒక సారి చూసి, ప్రయత్నాన్ని ప్రశంసించొచ్చుగానీ, ఏముందని అవార్డులమీద అవార్డులిస్తున్నారో ఈ అమెచ్యూర్ ఫిల్మ్ కు" అని సూత్రీకరించేసాడు. చివరాఖరికి నామీద దయతల్చి, "నీ బాధ దొంగ హీరోలగురించి కాబట్టి, ఈ రెండూ సినిమాల్నీ మినహాయించుకుని సంతోషించు" అని స్వాంతన పలికాడు.
ఏదిఏమైనా, ఇంత శోధన తరువాత నేను సాధించిన నిజం మాత్రం, మన ఖర్మకు ప్రస్తుతానికి ‘దొంగలే మంచి హీరోలు’ అని.
Thursday, July 17, 2008
‘దొంగ’ హీరోలు
----------------------------------------
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
"రిక్షాలో వెళ్ళేవాడి కోసం సినిమా తీస్తే.. నువ్వు బెంజ్ లో తిరగచ్చు. అదే బెంజ్ లో తిరిగేవాడికోసం తీస్తే.. నువ్వు రిక్షా తోలుకోవాల్సి వస్తుంది" అన్న లైను విన్నాకా.. నేను సినిమాల్లో ఆనందాన్ని వెతుక్కోవటం మానేసాను. అది ఒక వ్యాపారం.. ఇంత పెట్టాము.. అంత వచ్చిందా? అనే లెక్క!! అది దొంగ వల్ల వచ్చే లాభమా?? దొర వల్ల రాదా అంటే.. ఏమీ చెప్పలేను.
అన్నట్టు... గుల్జార్ సాబ్ ఒకానొక ఇంటర్వ్యూలో... "సినిమా అంటే అరవై నాలుగు కళలనీ కలిపి చూపించే మహత్తర అవకాశం" అంటూ ఏదో చెప్పారు. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ.. మీరేదైనా రాయచ్చు కదా.. దాని మీద?
Cool blog. If hero is noble, no Nobel will be awarded for the film. If Hero is a scoundrel, awrds will be given with rewards.
మహేశ్ గారు..నిజమే కదా...మరి..ఇప్పుడు వచ్చె సినిమాలన్నింట్లో..
హీరో ఒక రౌడి,లేక,దొంగ,మోసగాడు..ఇలాగె ఉంటున్నారు...కదా..
ఇక పోతే...ఆడువారి మాటలకు అర్దాలె వేరులే...ఆ సినిమాలో ఓ రెండు పాటలు తప్ప నాకు ఏమి నచ్చలేదు..ఇంకా..ఆ తొక్కలో సినిమాకి నేను ,మా బబ్బీ గాడు..బ్లాక్ టికెట్ కొన్నుక్కుని మరీ వెల్లాం..అసలు ఆ సినిమా కి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్దం కాలేదు..అసలు..ఆ వెంకటెశ్ కి అలా జాబ్ ఎలా వస్తుందొ,ఒక్క రాత్రిలో ఆ తొక్కలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చెస్తాడో అసలు ఏంటో అర్దమై చావదు..ఎంతైన హీరో కదా...చెసేస్తాడంతే....
మీరు చెప్పినట్టే హీరోలు దొంగలు...గానె కనపడుతున్నారు ఈ మధ్య..
ఆ దొంగ హీరొ లనె హీరొయిన్ ప్రేమిస్తుంది..అంతే ,అదే కథ..
మీరు వెతుకుతున్న సినిమా నేను చెబితే మిస్తారు!!
"మిస్టర్ మేథావి"
చాలా బాగుంది సినిమా.
చెప్పడం మరిచా...ఆ సినిమాలో హీరో పేరు చెబితే..హాశ్చర్యపోతారు..
"విష్వక్సేనుడు"
మీరు చదివింది కరెక్టే...విష్వక్సేనుడు. త్వరలో దీని మీదో రివ్యూ వ్రస్తా.
హీరోలందరూ మద్యం తాగుతూ కనపడుతున్నారు సినిమాలలో.. .
ఆనంద్ (2004) , గోదావరి (2006) : ఈ రెండు చక్కటి సినిమాలు మీరు దూరప్రాంతంలో ఉండటం వలన మిస్ అయినట్లున్నారు.
హీరో రఫ్ & టఫ్ గా ఉండాలి, అప్పుడే యూత్ కి నచ్చుతుంది అనే ఆలోచన దోరణిలో బహుశ అలాంటి హీరో పాత్రలను సృష్టిస్తున్నారు అని నా అభిప్రాయము.
'ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే’ లో
1. ఈ సినిమాలో హీరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వడం
2. విశ్వనాద్ కేరెక్టెర్ ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తించడం నాకు బొత్తిగా అర్థంకాలేదు.
'గమ్యం' కధానాయకుడు దొంగ కాదు (ఇందులో ఉప కధానాయకుడో చిల్లర దొంగ; కానీ తను చేస్తున్న పనికి సిగ్గు పడి అది మానేసేలాగా తీర్చిదిద్దారా పాత్రని)
'బొమ్మరిల్లు' లో దొంగల్లేరు. ఉందంతా ఎమోషనల్ డ్రామా.
'అనుకోకుండా ఒక రోజు', 'ఆంధ్రుడు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'మంత్ర', 'రెడీ' .. ఇంకా ఇలాంటివి బోలెడున్నాయి. నిజానికి హిందీ సినిమాలతో పోలిస్తే తెలుగులోనే దొంగల బెడద తక్కువ.
మహేశ్ గారూ,
ఎన్‌టీఆర్ చెప్పినట్లు ("...ఏనాడో కులహీనమైనది..కాగా నేడు కులము కులము") + ఉషశ్రీగారన్నట్లు ("ఈ దొంగలు, దొరలు అనేవాళ్ళు మన రామాయణకాలంనుంచీ ఉన్నారు"), తెలుగు సినిమాల్లో దొంగ హీరోలు ఎప్పటినుంచో ఉన్నారు. కాకపోతే అది ప్రస్తుత కాల పరిస్తితులనుబట్టి కొంచం ఎక్కువ మోతాదులో ఉంది.
ఉదా.కి, సీతారామకళ్యాణం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం వంటి సినిమాల్లో హీరోలు ఎలాంటివాళ్ళంటారు?
K గారూ
సీతారామకళ్యాణం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం కధల్లో ఎన్.టి.ఆర్ పోషించినవి విలన్ పాత్రలే.. ఆయన పొషించడం వల్ల అవి హీరో పాత్రలు ఎలా అవుతాయి..మనకలా అనిపిస్తే అది ఎన్.టి.ఆర్ పై అభిమానం వల్లే కానీ కధాపరంగా ఆ పాత్రలు ఎప్పటికీ హీరోలు కాదు. కాని ఇప్పుడు మహేష్ గారు చెప్పిన సినిమాల్లో దొంగపనులు చెసేవాళ్ళే హీరోలుగా చూపిస్తున్నారని... ఇక్కడ వీళ్ళు ఎంతమందినైనా చంపేస్తారు. ఇష్టమొచ్చినట్టు ఎవర్ని పడితే వాళ్ళను మొసం చేసేస్తారు... కానీ ఎక్కడా చేసిన తపుకు శిక్ష పడ్డట్టు కానీ , కనీసం పశ్చాత్తప్ పడ్డట్టు కానీ చూపించకపోయినా మనం అంగీకరిస్తున్నం. అదే ఆనాటి సాంఘిక చిత్రాల్లో హీరో మొదట్లో కొన్ని తప్పుడు పనులు చేసినా తర్వాత మంచిగా మారి తన తప్పులు సరిదిద్దుకుంటాడు. ఇప్పట్లో కొత్త కొత్త తప్పులు చేయడానికీ, చివరి రీలు వరకు ఎదురొచ్చినవాణ్ని వినూత్న ఆయుధాలతో చంపడానికే టైం సరిపోవట్లేదు మన కధానాయకులకి, ఇంక నేరమూ శిక్ష లాంటి కాన్సెప్టులకి చోటెక్కడా..
అబ్రకదబ్ర గారు ఇంకొందరు పైన చెప్పినట్లు తెలుగు లో ఈ బెడద కాస్త తక్కువేనండీ... హిట్ ఫ్లాప్ ని పక్కన పెట్టి చూస్తే మరీ ఈ దొంగల బెడద అంత గా ఏమీ కనిపించదు. ఆడవారి మాటలకి సినిమాలో హీరో చేసిన పనులకి వాడు Bad boy ఎందుకు అయ్యాడు. మోసం చేసినట్లు గా ఏమీ చూపించ లేదు కదా. సినిమా unrealistic గా ఉంది అంటే సరే... అన్నీ నిజాలే ఉంటే దానికి డాక్యుమెంటరీ అనో ఆర్ట్ ఫిల్మ్ అనో పేరు పెట్టి జనం అస్సలు సినిమా చూడరు.
సో మంచి హీరో లు ఉన్నారు కాని అలాంటి సినిమాలని జనం చూడటం లేదు అందుకే అవి మెగా హిట్ లు అవడం లేదు అంతే.... దొంగలున్న సినిమాలని చూసి ప్రోత్సహించే కొద్దీ అలాంటి సినిమాలే ఎక్కువ వస్తాయ్...
@పూర్ణిమ; నిజమే సినిమా ఒక వ్యాపారం. కానీ ఇంత శక్తివంతమైన మీడియాకి కొంత సామాజిక బాధ్యత అంటూ ఉందని నా నమ్మకం. బాక్సాఫీస్ సక్సెస్ కావాలంటే దొంగలే హీరోలుగా ఉండాలంటే,కాస్త ఇబ్బందిగా ఉంది. లేదూ, ఇదే మన సినిమా కథ భవిష్యత్తనుకుంటే మన ఖర్మ.
ఇక సినిమాగురించి సుదీర్ఘమైన చర్చలు www.navatarangam.com లో జరుగుతాయి. అక్కడికెళ్ళి నేను రాసిన సినిమా వ్యాసాలూ చదవగలరు.
@గీతాచాల్ర్య గారూ నెనర్లు. మీ బాధే నాబాధకూడా!
@మీనాక్షీ; ఈ సినిమానీకు బాగా గుర్తుందే!"ఆ దొంగ హీరొ లనె హీరొయిన్ ప్రేమిస్తుంది" నిజమే హీరోఇన్లకూ పెద్ద option ఉన్నట్లు కనబడ్డం లేదు.
@నవీన్ గార్ల; మీరు చెప్పిన తరువాత ‘మిస్టర్ మేధావి’ అంతర్జాలంలో డౌన్లోడ్ చేసి చూసా. బాగుంది. ఒక సాధారణ మనిషి కథకు సైకలాజికల్ ట్రీట్మెంట్ బాగుంది.నెనర్లు.
@శివ;వారు నరికే తలలూ, చేసే వెధవపనుల్తో పోల్చుకుంటే, మందుతాగడం మంచినీళ్ళు తాగినట్టే.
@CB రావు:ఆనంద్,గోదావరి చూశానండి. బహుశా గుడ్డిలో మెల్ల కాబట్టే శేఖర్ సినిమాలన్నిటికీ అంత ఆదరణ. హ్యాపీడేస్ అందుకు మరో ఉదాహరణ అనుకుంటా!
@చైతన్య;యూత్ కు నచ్చే రఫ్ & టఫ్ నిజంగా ఇదేనా అని నాకొక సందేహం. కనీసం ఖచ్చితంగా తెలుసుకుందామంటే, మన దగ్గర పద్దతైన పరిశోధనకు (audience research) అవకాశం లేదు. హేమిటో ఎవడివో విమ్స్&ఫ్యాన్సీల మీద సినిమా తీసే మనం టికెట్టుకొనుక్కుని మరీ బలవ్వాలి.
@అబ్రకదబ్ర;నిజమే హిందీ సినిమాలలో ఈ పోకడలు మనకన్నా ఎక్కువే. కానీ they have a reason to be uprooted. వాళ్ళు తీసేది హిందీ సినిమా ఉండేది మహరాష్ట్రలో,సినిమా చూసే ప్రేక్షకులకీ తీసేదర్శకులకీ ఎటువంటి కనెక్షన్ లేదు. కానీ మనకు కనీసం అ అవకాశం ఉంది కదా...we have political,social and human happenings happening around us that can be made in to films.
కొన్ని దొంగహీరోలు లేని సినిమాల లిస్టిచ్చినందుకు నెనర్లు.కానీ మంత్రలో హీరో కూడా దొంగని విన్నాను!!
@K; నెనర్లు. మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి కొంతసమయం పట్టింది. తరువాత శంకర్ రాసిన సమాధానం చదివి మీ పాయింట్ అర్థమయ్యింది.
@శంకర్;నిజమే కదా!
@వేణూ శ్రీకాంత్; ఆడువారి మాటలులో హీరో Bad boy కాదు, కానీ నిజానికి చాలా దూరం అని మాత్రమే నాకు తెలియజెప్పబడిన నిజం.ఇక మనం మంచి సినిమాలు చూడనంతవరకూ అవి హిట్లూ కావు మళ్ళి అలాంటి సినిమాలు రావు.
@
@
వాళ్ళు తీస్తున్నారని కాదు గాని, ఒకసారి పాత బ్లాక్&వైట్ సినిమాల్లో గుడ్ బాయ్ క్యారెక్టర్స్ చూడండి, ఇప్పట్లో మనకి అస్సలు నచ్చవు. చాలా చచ్చు పాత్రల్లా వుంటాయి. ఒకప్పటి సినిమాల్లో హీరోలు ’రాముడు మంచి బాలుడు’ టైప్ పాత్రలు. ఈ good boy syndrome హీరోలతో జనాలు విసిగిపోయి దొంగల్ని, ఫ్యాక్షనిస్టలను చూస్తున్నారు. సమాజాన్ని, దాని రూల్స్ ని లెక్కచెయ్యని వాడే ఇప్పటి హీరో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో లోపల అలా వుండాలని వుంటుంది. కాస్త చెడు, కాస్త మంచి, నిలువెత్తు ధిక్కారము అన్ని కలిసినట్టు వుండే ఇప్పటి హీరోలు, జనం ఎక్కడో అక్కడ తమతో ఐడెంటిఫై చెసుకోటానికి ఇష్టపడే విధంగా వుంటారు.
మీరు మరీనూ... రియలిస్టిక్‍గా ఉంటే అవి తెలుగు సినిమాలెందుకవుతాయి?? 90% telugu movies can easily be put into FANTASY category :)
రాకేశ్వరరావు అన్నట్టు మనం తెలుగు సినిమాలు చూసేది "Emotional Masturbation" కోసం.
@శంకర్ గారూ,
హీరో అంటే కథానాయకుడు అని నా ఉద్దేశ్యం. అంటే, యే పాత్ర గురించి కథలో emphasis చేసి చెప్పదలుచుకుంటామో, ఆ పాత్ర అన్నమాట. ఆ హీరో, మంచి పనులు చెయ్యనక్కర్లేదు. 10మంది రౌడీలని, విలన్లని ఒంటిచేత్తో కొట్టనక్కర్లేదు.
"రాముడు మంచి బాలుడు" అనే సినిమా తీస్తే అందులో రాముడే హీరో. అదే కథని "రావణుడు చెడ్డవాడు" అనే టైటిల్ తో తీస్తే, అందులో రావణుడు హీరో అవుతాడు కాని రాముడు కాదు. మహేశ్ గారి వాదన ఏంటంటే, పూర్వం "రాముడు మంచి బాలుడు" అనే సినిమాలు వస్తూండేవి, ఇప్పుడు తారుమారయి, "రావణుడు చెడ్డవాడు" అనేవే అన్నీ వస్తున్నాయని. (మహేశ్‌గారూ, correct me if I am wrong). నేను చెప్పినదేమిటంటె, పూర్వం కూడ ఇలాంటి చిత్రాలు వచ్చాయని.
సీరాకళ్యాణం, దావీశూకర్ణ, శ్రీవిపర్వం లాంటి చిత్రాలలో ఎన్‌టీఆర్ వేసినవి హీరో పాత్రలే కాని, విలన్ గా కాదని ఇప్పటికీ నేనంటాను. మీరు చెప్పినట్లు పూర్వపు చిత్రాలలో హీరో దొంగ అయినా తరువాత మారి మంచివాడవుతాడు. అందుకే నేనలాంటి చిత్రాలని (దొంగరాముడు, భలేరాముడు) ఉదహరించలేదు.
Donga Hero anedi ee madhya vachina Pityam kaadandi, Mana Mega Chiru to start ipoyayi... "Manchi Donga", "Jebu Donga" ila chaalane unnayi
మీరు చెప్పింది పాక్షిక సత్యమే.నిజానికి ఇక్కడ తీస్తున్నవి"రావణుడు చాలా చెడ్డవాడు" అని కాక "రావణుడు మంచివాడు" అని చెప్తున్నాయి.నిజానికి ఇప్పటి సినిమాలతోపాటూ ఎన్.టీ.ఆర్ "దాన వీర శూర కర్ణ","సీతా రామ కళ్యాణం" ప్రమాదకరమే.ఎందుకంటే మన పురాణాలు "ఎంత శాస్త్ర పారంగతుడైనా,స్నేహ శీలి ఐనా పరస్త్రీలతో మర్యాదగా ఉండడం,అరిషడ్వర్గాల్ని అదుపుచేసుకోవడం లాంటి ధర్మాలు తప్పితే అధఃపాతాళానికి చేరతారు" అని చెప్తున్నాయ్.దాన్ని వక్రీకరించారు.కర్ణుణ్ణి,దుర్యోధనుణ్ణి హీరోల్ని చెయ్యడానికి ద్రౌపది కర్ణుణ్ణి కోరిందని పాత్రౌచిత్యాలు పాడు చేసారు.(ద్రౌపది మహాపతివ్రత కలలో కూడా పరపురుషుణ్ణి కోరకపోవడం పతివ్రతా ధర్మం.మన హిందు పురణాల ప్రకారం మానసికంగ ఒకతప్పు చెయ్యాలనుకోడానికి శారీరికంగా చేయడానికి తేడా లేదు).
Post a Comment