Thursday, July 24, 2008

సినిమా ‘భాష’

మొన్న నేను వెళ్ళిన బెంగుళూరు UNDPవారి Water forum లో ఒక ఆసక్తికరమైన సంవాదం జరిగింది. ఢిల్లీకి చెందిన WASH Institute అనే సంస్థ, తెలుగులో పారిశుధ్యం (sanitation) గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో ‘పారిశుధ్య మార్గదర్శి’ అనేది గ్రామ స్థాయిలో ఉన్న సమాజసేవకులు/సేవికలూ ప్రజలకు మరుగుదొడ్లను నిర్మించుకుంటే వచ్చే లాభాలను,ఆరోగ్యంపై పారిశుధ్యం యొక్క ప్రభావాన్నీ తెలియజెప్పే పుస్తకం ఇది. ఉత్సాహంగా ఆ పుస్తకాన్ని అందిపుచ్చుకున్న నాకు ఒక్క క్షణం కాస్త ‘షాక్’ తగిలిందని చెప్పొచ్చు.




మొదటి పేజీలోనే మరుగుదొడ్ల ఉపయోగం గురించి బెబుతూ ఇలా ఉంది, "మలమూత్ర విసర్జన అనంతరం, శౌచాలయంలో తగినంత నీరు ప్రోయవలయును". నాకు మొదట వచ్చిన అనుమానం "ఈ భాష మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడవాడతారా ?" అని. అదేమాట ఆ సంస్థ ప్రతినిధిని అడిగాను. అతను ఒక తమిళుడు, పేరు కలిముత్తు. "ఈ పుస్తకాన్ని అనువాదానికని తెలుగు మీద మంచి పట్టున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ కు ఇచ్చాము. తను అనువాదాలలో దిట్ట. మీకు దీనిమీద ఏమైనా అభ్యంతరాలున్నాయా?" అని చాలా మర్యాదగా అడిగారు. "అనువాదం సంగతి సరే కానీ మీరు ఈ మార్గదర్శిక ఉద్దేశించిన జనాలకు ఈ భాషనిజంగానే అర్థమవుతుందనుకుంటున్నారా?" అని అడిగాను.




దానికి అతను, "ఈ మార్గదర్శికని ప్రింట్ చేసేముందు విజయవాడలోని ఒక స్లమ్ లో ప్రయాగించాము, అక్కడ అందరికీ అర్థమయ్యిందన్న తరువాతే పెద్దస్థాయిలో పబ్లిష్ చేసాము" అని నాకు సమాధానం లభించింది. చాలా సహేతుకంగా అనిపించినా, మనసులో ఏదొ అనుమానం నన్నుపీడిస్తూనే ఉంది. అంతలో నాతోపాటూ వచ్చిన ఒక హిందీ మిత్రుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక ఉత్తరువు చదువుతూ కనిపించాడు. ఆ హిందీకూడా నా మిత్రుడు ‘మాట్లాడే’ హిందీకాదు. కానీ దాన్నొక ప్రామాణిక హిందీగా (ప్రభుత్వం వాడుతోంది కాబట్టి) అంగీకరించాడు. "బహుశా మన ప్రామాణిక తెలుగు పరిస్థితీ అదేనేమో!" అనిపించింది.




కాకపోతే ఇది ప్రభుత్వాధికారులకు ఉద్దేశించిన పుస్తకం కాదు. ఈ మార్గదర్శి ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రజల్లో పారిశుధ్యం పట్ల అవగాహనా, వారి ‘పొద్దున్నే చెంబెత్తుకుని పోలాలెమ్మటవెళ్ళే’ అలవాటునుంచీ ముక్తి పొందడానికి ప్రేరణాఇవ్వవలసిన కొందరు సాధారణ యువతీయువకులు వాడాల్సిన పుస్తకం. "దీనిలో ఈ భాషా ప్రామాణికత అవసరమా?" అనేది మరొ సందేహం. దీనికితోడు "ఇది చదివిన విజయవాడ జనులు అర్థమైపోయిందని అంత గట్టిగా ఎలాచెప్పారా?" అనేది మరొక అనుమానం.



ఇదే సందేహాలతో మళ్ళీ తనని పట్టుకుపీడించేసరికీ విసుగెత్తిన ఆ మనిషి వెటకారంగా "మీ తెలుగులో మూడు మాండలికాలున్నాయి. వాటన్నింటులో మేము రాయించి ప్రింట్ చెయ్యాలంటే...ఆరిపోతాం" అన్నాడు. తను చెప్పింది నిజమే! ప్రామాణికత అనేది ఒకటుండాలి. కాబట్టే, మనం ‘రాసే భాషని’ ఇలా standardize చేసాము. కానీ ఇక్కడ నా సమస్య ‘మాట్లాడే భాష’ ను Standardize చెయ్యటం గురించి. మాట్లాడే భాష వాడకుంటే, ఆ చదివే సామాన్యులకు అర్థం కాదు అనేది నా గట్టినమ్మకం. "వాడేవారికే అర్థం కానప్పుడు, అది చదివి ప్రజలకెలా తెలియజెబుతారు?" అనేది నా మూల ప్రశ్న. If the purpose is to communicate an idea..the language used in the booklet surely doesn't help.



దీనిమీద నేను చర్చకు తెరతీసేసరికీ అక్కడ ఒక పెద్ద గుంపొకటి తయారయ్యింది. అంతలో మళ్ళీ నేనే "మీ తమిళనాడు పరిస్థితేమిటి?" అనడిగాను. దానికతను "మాకూ మధురై తమిళ్, కన్యాకుమారి తమిళ్ అలాగే చెన్నై తమిళ్ ఉన్నాయి" అన్నాడు. "ఐతే అందరికీ అర్థమయ్యే భాష...!" అంటే దానికి "సెందమిళ్" అంటూ అదే పుస్తకాల తమిళ్ విషయం చెప్పాడు. అప్పుడు నాకు తట్టిందొక ఆలోచన. "మరి సినిమాల భాష అందరికీ అర్థం కాదా?" అనడిగాను. ఒక్క క్షణం ఆలోచించి, "ఆ..సినిమా భాష అందరికీ అర్థమవుతుంది. అక్కడక్కడా యాస ఉన్న పాత్రలు తప్ప సినిమా అంతా దాదాపు సాధారణ వాడుక భాషలో ఉంటుంది" అన్నాడు.



"మరైతే...సినిమా భాషని మాట్లాడే భాషకి ప్రామాణికమనుకుని దాంట్లో ఎందుకు రాయకూడదూ?" అనేసాను. ఒక్క క్షణం నిశ్శబ్ధం. "అలాగైతే...మరి భాష సంకరమైపోదా?" అన్నాడు. దానికి నా సమాధానం ఒక్కటే "ఇక్కడ ఉద్దేశం భాషని ఉద్దరించడం కాదు. విషయాన్ని తెలియజెప్పడం. If the purpose is to communicate, use the language that will do the best job of it."



ఆ క్షణంలో చెబుతున్నప్పుడే నాకూ అనిపించింది. "నిజమే కదా!" అని. కానీ, "నిజంగా నిజమేనా? మీరే చెప్పాలి".



*****


5 comments:

rākeśvara said...

మరీ నోటి తెలుగు సినిమాలోని తెగులు భాష కాకపోయినా. గ్రాంథికమైనది కాకుండా సరళ మైన తెలుగులో వ్రాయవచ్చు.
ఉదా - మన బ్లాగర్ల తెలుగు.
అందులో వ్రాస్తే సరిపోయే. ఏఁవంటారు ;-)

Kathi Mahesh Kumar said...

@రాకేశ్: నిజమే! కానీ మనవాళ్ళు రాయటం,అదీ ముఖ్యంగా ప్రింటింగ్ కోసం రాయడం మొదలెట్టేసరికీ సరళత "హుష్ కాకి!" అయిపోతుంది.ఆ పుస్తకం యొక్క అవసరం కాస్తా మరుగుపడి, తమ భాషాప్రావీణ్యాన్ని చూపడం మెదలెడతారు.ఈ సంఘటనలో నాకు అలాగే అనిపించింది.

MURALI said...

భాషాప్రావీణ్యాన్ని చూపడం అనేది అక్షరాలా నిజం.సినిమా భాష కి ప్రామాణికత ఉందో లేదో గానీ అందరికి అర్ధమవుతుంది అనేది సత్యం.

రానారె said...

"If the purpose is to communicate, use the language that will do the best job of it." అనేది నిజంగా నిజమని నేనూ అనుకుంటున్నాను.

ఒక తెలుగుభాషావేత్త అన్నారు (భద్రిరాజు కృష్ణమూర్తిగారు అనుకుంటాను. ఈ నెల 'ఈమాట' లో 'శబ్ద తరంగాలు' వినండోసారి): ప్రామాణిక భాష అనేది సాధారణంగా ఆ ప్రాంతపు పరిపాలనా కేంద్రమైన నగరంలో వాడబడే భాష అయివుంటుంది. పారిస్ లో మాట్లాడే ఫ్రెంచి ఫ్రాన్సు ప్రజలకు ప్రామాణికం. లండన్ ఇంగ్లీషు ఇంగ్లండు ప్రజలకు ప్రామాణికం. 'ప్రామాణిక తెలుగు భాష' అనేది లేకపోవడానికి కారణం తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాజధాని కింద దీర్ఘకాలం పరిపాలనలో లేకపోవడమే కావచ్చు.

కొత్త పాళీ said...

@రానారె .. మంచి పాయింటు. అలాగే తెలుగు ప్రజలకి తమ భాష గురించి ఒక అభిమానంతో కూడిన స్పృహ లేకపోవడానికి కూడా ఇదో కారణమని నాకో అనుమానం.

సినిమా భాష ప్రామాణికమా, అది అందరికీ అర్ధమవుతుందా అనేవి కూడా నేను చెప్పలేను. వినోదానికి వాడే భాష, ఏదన్నా విషయం చెప్పడానికి వాడే భాష ఒకటి కాదని సులువుగానే గ్రహించొచ్చు. ఈ పారిశుద్ధ్యం గురించి తెలుసుకోవలసిన ప్రజలు ఆ కరపత్రాలని "చదివే" స్థితిలో ఉన్నారూ అంటే వారికి బహుశా అందులో వాడిన భాష అర్ధమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. సరదా పేజీల్లో "సిక్సర్ కొట్టుగురూ, కేక కెవ్వు" లాంటి శీర్షికలు పెట్టే దినపత్రికలు కూడా ఇలాంటి విషయాల గురించి రాయాల్సి వచ్చేప్పటికి ఇలాంటి భాషే వాడుతారు గదా? ఆంధ్రదేశపు నలుమూలల పల్లెటూళ్ళలోనూ దినపత్రికలు చదివి అర్ధం చేసుకోవడం లేదని అనుకోగలమా?