Sunday, July 13, 2008

(నేను) అసలెందుకు రాయాలి?

ప్రముఖ బ్లాగరి వి.బి.సౌమ్య గారు తన బ్లాగులో ‘ఎందుకు చదవాలి?’ అనే టపా క్రితం నెల రాస్తే, ఈ సారి కొత్తగా ‘తెలుగెందుకు చదవాలి? అని బహుచక్కగా టపాలు రాసేసారు. ఈ టపాల స్ఫూర్తితోపాటూ, ఈ మధ్య నేను రాసిన మన పెళ్ళిప్రాతిపదిక తప్పైతే? టపాపై తన అభిప్రాయం రాస్తూ ‘అర్వింద్’ అనే మిత్రుడు, నీ టపాల ఆవేశంచూస్తే "సమాజంపై కోపాన్ని, విపరీతమైన ద్వేషాన్నీ నింపుకున్నట్టు అనిపిస్తోంది" అని అన్నాడు. అప్పుడొచ్చిన ఆలోచనే, "అసలెందుకు రాయాలి?" అన్న సందేహం. ఈ టపాలో నా సందేహాన్ని పంచుకోవడంతో పాటూ, నేనెందుకు ఇలా రాస్తానోకూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.



చరిత్రను తీసుకుంటే, రాతలల యొక్క ప్రాచీన ఆధారాలు గుహల చిత్రాలలో (cave paintings) గుర్తిస్తారు. వాటిల్లో చాలావరకూ వేట, ఉత్సవాలు,రోజువారీ దినచర్యల చిత్రాలు బొమ్మల రూపాలలోనూ, కొన్ని సంజ్ఞలరూపంలోనూ భద్రపరిచినట్లు అనిపిస్తాయి. అంటే, జీవితంలోని కొన్ని ముఖ్యమైన,గుర్తుపెట్టుకోదగిన చర్యల్ని ఇలా లిపిబద్ధంకానీ, చిత్రబద్ధంకానీ చెయ్యడం సహజమానవ లక్షణంలా అనిపిస్తుంది. ఇదే ప్రాచినప్రవృత్తి (primordial instinct) లిపి పుట్టుకకూ, మనం రాయడానికీ, సాహిత్య సృజనకూ కారణభూతమైఉండవచ్చు.



మనుషులు తాము నేర్చుకున్న అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ, జ్ఞానాన్నీ అక్షరబద్ధం చేస్తారు. దాని ఆశయం గుర్తుంచుకోవడం కావచ్చు, లేదా ఇతరులకు తెలియజెప్పడం కావచ్చు లేక కేవలం మనసు,మెదడులోని భావాల్నీ ఆలోచనల్నీ రాయడం ద్వారా వ్యక్తపరచి, కొంత మానసిక వత్తిడి నుంచీ ముక్తిపొందడమూ కావచ్చు. ముఖ్యంగా సాహిత్య సృజన, మనిషి తనకు తెలిసిన, ఉత్తమం అనిపించిన విషయాల్ని చెప్పడానికి ఉపయొగిస్తాడని భావిస్తారు. అందుకే, "best that is been thought and said is available in literature" అంటారు. బహుశా మనం బ్లాగులు కూడా ఇందుకోసమే రాస్తామేమో కదా!



రెండునెలల క్రితం నేను ఈ బ్లాగు రాయడం మొదలెట్టకముందు, దాదాపు 15 సంవత్సరలుగా తెలుగులో రాయడం మానేసాను. 10 వతరగతి తరువాత (1992) ఇప్పటి వరకూ,కనీసం ఒక ఉత్తరమైనా తెలుగులో రాసిన పాపాన పోలేదు. అప్పుడప్పుడూ ఉద్యోగరీత్యా కొన్ని విషయాల్ని ఆంగ్లం నుండీ తెలుగులోకి తర్జుమా చేసినా, అది కేవలం భాధ్యతగా చేసినవే తప్ప మనసుపెట్టి చేసిన జ్ఞాపకం అస్సలు లేదు. కానీ నా ‘I think in తెలుగు’ టపాలో వివరించినట్లు, నా ఆలోచనలూ, భావాలూ మాత్రం చాలావరకూ తెలుగులోనే జరిగేవి. అవి బయట మాత్రం హిందీ, ఆంగ్లంలో రూపాంతరం చెంది నిత్యజీవనంలో ఉపయోగపడేవి. కాబట్టి తెలుగులో రాయడం అనే ప్రక్రియ నా జీవితంలో పూర్తిగా మరుగుపడిపోయిందని చెప్పుకోవచ్చు.



బ్లాగులో టపాలు రాయడం మొదలుపెట్టిన తరువాత, అప్పటికే నవతరంగంలో నేను సినిమాలు గురించి రాయడం మొదలుపెట్టి ఉండటం చేత, వాటినే ఇక్కడా పెట్టడం జరిగింది. కానీ, ‘ఎలాగూ సినిమాల గురించి నవతరంలో రాస్తున్నానుకదా, నాకు నిజంగా స్పందించాలనిపించిన సామాజిక,ఆర్థిక,రాజకీయ మరియూ వ్యక్తిగత విషయాలను ఎందుకు బ్లాగులో రాయకూడదూ’ అన్న ఆలోచనవచ్చి వాటిని రాయడం మొదలెట్టాను. అలా క్రమక్రమంగా టపాలు పెరిగాయి. బహుశా గత 15 సంవత్సరాల నా ఆలోచనల్నీ, భావాలనీ అక్షరరూపం ఇవ్వాలన్న తపన, ఈ ఉదృతానికి ఒక కారణం కావచ్చు. ఇంతకాలంలో నేను తెలుసుకున్నవీ, అనుభవించినవీ, నేర్చుకున్నవీ, అభిప్రాయాలు ఏర్పరుచుకున్నవీ చెబుతుంటే, వాటికి వచ్చిన స్పందనని చూసి, నా పిచ్చి సొంతరాతల్ని అన్వయించుకుని అభినందించేవాళ్ళూ, విమర్శించేవాళ్ళూ ఇంత మంది ఉండటం ఆనందాన్ని కలిగించింది.



టపాల ఉదృతం ఎక్కువయ్యేకొద్దీ నా ఆలోచనలలో, నా వ్యక్తిత్వం ఛాయలు బలంగా కనబడడం మొదలయ్యాయి. వాటితోపాటూ టపాలకొచ్చే విమర్శలలో నిరసనలుకూడా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, మనం మనస్ఫూర్తిగా నమ్మిందో లేక వ్యతిరేకించేదో లేకపోతే రాయడం వృధా, అని నా నమ్మకం. What is the point in writing, if we have nothing to believe in or nothing to rebel against? అందుకే నా టపాలలో చాలావరకూ, నేను బలంగా నమ్మినవీ లేక తీవ్రంగా వ్యతిరేకించే విషయాల్ని రాస్తాను. కాకపోతే ఆ భావనలు నా జీవితంలో వచ్చిన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొంత తార్కికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. దీన్ని చదివిన కొందరు ఎందుకు అంత వ్యతిరేకం? ఎవరిమీద నీ కోపం? అంటే, "నామీద నాకే" అని చెప్పగలనేకానీ, వీరిమీద అని ఖచ్చితంగా సూచించలేను. ఎందుకంటే I rebel against issue, ideas, concepts, social norms, individual hypocrisies వాటిని స్థూలరూపంలో చూడాలంటే కష్టమే, నిర్థిష్టంగా వివరించాలంటే అసాధ్యమే.



ఈ మధ్యనా మిత్రుడు కొన్ని విమర్శల్ని చదివి "ఈ బ్లాగర్లు టైంపాస్ చెస్తున్నార్రా! నువ్వెందుకు ఇంత కష్టపడి ఈ టపాల్ని రాయడం" అన్నాడు. దానికి నేను చెప్పిన సమాధానం ఒక్కటే, "నేను కష్టపడి కాదు, ఇష్టపడి రాస్తున్నాను. నేను రాస్తున్న విషయాల్ని టైంపాస్ కైనా చదివేవాళ్ళు దొరకడం అదృష్టమే" అన్నాను. I really believe in what I said to my friend. రాసేవాడెవరూ దీన్నిచదివి అందరూ గుర్తించాలి అన్న ఉద్దేశంతో రాయరు, కానీ గుర్తింపు వస్తే అది వ్యతిరేకార్ధకమైనా ఆనందంగానే ఉంటుంది. అందుకే తీరిగ్గా పొగడ్తలతో పాటూ విమర్శలకూ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాను.



నన్ను వ్యతిరేకించేవారు కూడా అంత పొడవైన ప్రశ్నలూ, విమర్శలూ సమయం వెచ్చించి చేసేది, నేను మనస్ఫూర్తిగా నమ్మిన మూల సిద్ధాంతం కోసమే అని బలంగా అనిపిస్తుంది. They believe in different values and rebel against what I say. అందుకే మనమందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనిపిస్తుంది. కాకపోతే నిజజీవితంలో మనం వాదోపవాదాల్లో చేసినట్లే, ఇక్కడా సామ,దాన,భేద, దండోపాయాల్ని ఉపయోగించి వాదనల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించినపుడు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.



నేను బలంగా నమ్మినవీ, తీవ్రంగా వ్యతిరేకించే విషయాలే చాలావరకూ ఈ బ్లాగులో కనబడతాయి. వాటిని అంగీకరించేవారికి స్వాగతం. చదివి అందిపుచ్చుకుని, అభినందించేవారికి సుస్వాగతం. అందిపుచ్చుకుని, ఆలోచించేవారికి మహాస్వాగతం. ఖండించి, విమర్శించేవారికి అద్వితీయ స్వాగతం.


-------------------------------

20 comments:

Purnima said...

Super post.. ఒక్క క్షణం Why I write అనే George Orwell essay గుర్తు వచ్చింది.
http://www.k-1.com/Orwell/index.cgi/work/essays/write.html

నేనెందుకు రాస్తున్నాను.. రాసే ప్రతీ సారి నన్ను నేను వేసుకునే ప్రశ్న అది. అది నా ఆత్మానందంకోసం మాత్రమే అని తెలిసినప్పుడు మాత్రమే నేను బ్లాగు చేస్తున్నాను. నిజమే.. టైంపాస్ కన్నా చదివేవారు ఉండడం అదృష్టమే.. కానీ నేనింకా నా కోసమే రాసుకుంటున్నాను. ఎవరైనా చదువుతుంటే.. అది బోనస్ మాత్రమే!!

ఇక నన్నూ నా ఫ్రెండ్ నిలదీసింది నా ఇంగ్లీష్ బ్లాగు గురించి.. "నువ్వు రాసేవి అన్నీ సమాజిక విషయాలు.. నీవంటూ ఎందులో కనిపించడం లేదు. ఇవే విషయాల మీద నీకన్నా బాగా రాసేవాళ్ళనే చదువుతారు గాని, నీ పోస్ట్స్ ఎందుకు చూస్తారు? అలాంటప్పుడు నువ్వు రాసి ఏం లాభం" అని.

దానికి నా సమాధానం చాలా సింపుల్.. "ఇప్పుడు నా దగ్గరకి ఎవరైనా వచ్చి దెబ్బ తగిలింది.. ఇలా తగిలింది.. ఇక్కడ తగిలింది.. అని చెప్తుంటే.. ఆసాంతం వింటాను. నేను డాక్టర్ ని కాదు, నేనా నొప్పిని తగ్గించలేను.. కానీ ఆ బాధను అర్ధం చేసుకోగలను" నేను బ్లాగుతున్నా అంటే వేరొకరిని అర్ధం చేసుకోగలగుతున్నాననే అర్ధం!! మీరూ అంతే.. మీ అన్ని టపాలలో.. నచ్చినవి.. నచ్చనవి అన్నీ ఉన్నాయి.. అయినా అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు వాటి గురించి.

Keep blogging and enjoy your stay here!!

Kottapali said...

బావుంది మహేష్ గారూ.
ఊరికే లొల్లాయి కబుర్లు కాకుండా కొంచెం సీరియస్ గా రాసే ప్రతి వారూ ఈ ప్రశ్న వేసుకోవాలి. కనీసం తమకి ఆత్మ తృప్తి కలిగే సమాధానం చెప్పుకోవాలి. సీరియస్ గా రాయడం అంటే సమస్యలు, సమాజ రుగ్మతలు అనే కాదు, చిత్తశుద్ధితో రాసేదేదైనా.
పూర్ణిమ గారి వ్యాఖ్య కూడా చాలా బావుంది.

మీనాక్షి said...

మహేశ్ గారు....ఇక నే రాసేప్పుడు అనుకుంటాను..నేను ఎందుకు రాయాలి అని....నిజం చెప్పాలంటే మన మనసులోని భావాలను..ఇలా అక్షరబద్దం చేయడం లో ఉన్న ఆనందం ఎందులో ఉండదేమో..అని నా అభిప్రాయం...ఇక పోతే మనం రాసేవి చదివి ఇంత మంది ప్రతిస్పందిస్తున్నారు...అని తెలిసినప్పుడు ఎంత హ్యాప్పి గా ఉంటుందో..ఇంత మంది ఫ్రెండ్స్ ఉండడం నిజంగా మన అదృష్టం..కాదంటారా..!నేను రాసేవి చదివి కనీసం ఒక రెండు నిమిషాలు అందరు నవ్వితే నాకు అది చాలు..ఎదుటివారిని సంతోష పెడుతున్నాం అనే భావన చాలు..ఎందుకంటె,,,నవ్వు ,సంతోషం అనేవి ఏ షాప్ లో దొరకవు కదా...
నేను మాత్రం చాలా హ్యాప్పి గా ఉన్నాను..ఎందుకంటే నేను ౩ మంత్స్ బ్యాక్ ఇలా ఉండేదాన్ని కాదు..ఎప్పుడు ఏదో కోల్పోయిన దానిలా ఉండేదాన్ని..ఇక్కడ మీరు..ఇంకా మన బ్లాగ్ ఫ్రెండ్స్ రాసే టపాలు చదివాక నాకు రాయాలి అనిపించింది...
రాయడం మొదలెట్టాను.....నా మనసు లోని భావాలు,నా గోడు చదివే వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు కలిగిన సంతోషం నేను మాటల్లో చెప్పలేను...ఇక నేను ఎందుకు రాయాలి అన్నారు కదా..దానికి నా సమాధానం ...మీరు రాయాలి.ఎందుకంటే అవి చదువుతున్న వాళ్ళు ఎందరో..కొందరు..చదివి..ప్రతిస్పందిస్తారు..కొందరు..ఆలోచిస్తారు..కొందరు విమర్శిస్తారు..కొందరు అభినందిస్తారు..ఇక పోతే మనకి సంతోషాన్ని కలిగించే పని చేయడం కన్నా..కావాల్సింది ఏముంది..చెప్పండి..ఒకరిని నొప్పించనంతవరకు...కదా..!!

మీనాక్షి said...

మరో విషయం మీరు రాసేవి ఉపయోగకరంగాను,ఆలోచనలను రేకిత్తించేవి గాను ఉంటాయి...అవి చదివి కొత్త విషయాలు తెలుస్తాయి.అలాంటప్పుడు మీరు తప్పకుండా రాయాలి ...
అందరు, నేను ఎందుకు రాయాలి అనుకుంటే మనకి ఈ రోజు చాలా విషయాలు తెలిసేవి కావేమో మీరన్నట్టు..ఈ మధ్య నాకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది..నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావ్ అని...ఇవన్ని పిచ్చి రాతలు ఎందుకు రాస్తున్నావ్ అని, అన్న వాళ్ళు ఎంతమందో..కాని వాళ్ళకేం తెలుసు..రాయడం లో ఉన్న ఆనందం అనుకున్నాను..ఇక మనం రాసే పోస్ట్ లకు వచ్చే కామెంట్స్ చూసినప్పుడు వచ్చే అనందం ..అంతా ,ఇంత కాదు..ఎందుకో చాలా తృప్తిగా అనిపిస్తుంది..

పెదరాయ్డు said...

మహేష్ గారూ, మీరన్నట్లు ఇది ఎక్కువ ఆత్మ సంత్రుప్తి కలిగించే విషయం. అంతేకాదు, కొన్ని సందర్భాలలో ఇది ఇతరులను ఆలొచింపచేసేదిగా కూడా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేస్తే మరింత గొప్ప విషయం. ఇవన్నీ జరిగినా జరుగక పోయినా, మీ అలోచనలను అక్షరబద్దం చేయటం కనీసం మీకోసమైనా మంచిదే. కాకపోతే బ్లాగు ద్వారా బహిరంగంగా ప్రదర్శించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మంచిది. ఇలాగే అదురగొడుతూ ఉండండి.

Srividya said...

చాలా మంచి వ్యాసం. ఒక్కోసారి నాకు అదే అనిపిస్తుంది, నేను ఎందుకు రాయాలి అని. రాస్తే ఏదో వచ్చి మన ఒళ్ళో పడుతుందని కాదు.కానీ నా మనసుని, ఆలోచనల్ని కాగితం మీద పెడుతుంటే మాటల్లో చెప్పలేని అనుభూతి.

జ్యోతి said...

నన్ను కూడా ఎంతో మంది అడిగారు. ఇంత టైమ్ వెచ్చించి రాస్తున్నావు నీకేమొస్తుంది అని.. నేను చేప్పే సమాదానం అర్ధం చేసుకునే సంస్కారం అందరికీ ఉండడు. అందుకే ఊరికే టైమ్ పాస్ అంటాను. అంతకంటే ఎక్కువ చెప్పినా వేస్ట్ కనుక. కాని నేను నా అభిరుచులన్నీ నా బ్లాగుల రూపంలో పెట్టుకుని ఆనందిస్తున్నాను. నేను రాసేది నా కోసమే , దాని వల్ల వచ్చే కష్టనష్టాలు నాకే అని డిసైడ్ ఐపోయా. కాని ఈ బ్లాగుల వల్ల నా ఆలోచన, ఆవగాహన శక్తి మాత్రం చాలా పెరిగింది. అంతకు ముందు నీలాగే ఆలోచనలన్నీ మనసులోనే జరిగేవి (తెలుగులోనే) కాని బ్లాగు మొదలెట్టాక ఆ ఆలోచనలకు అక్షరరూపం వచ్చింది. అది చదివిన వారి ప్రోత్సహం హెచ్చింది. ఇది చాలు నాకు.. కాని మనం ఎంచుకునే విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పొగిడేవాళ్ళు, తెగిడేవాళ్ళూ ఉంటారు. ఎదుర్కోక తప్పదు మరి.

Sankar said...

అసలు మీరెందుకు రాయాలంటే... మాలాంటివాళ్ళకోసం అని చెప్తా. కామెంట్లు కొన్నే(కొన్నే అంటే మీ టపా స్ధాయికి తక్కువని) ఉన్నాయని మీ పాఠకులు తక్కువనుకోకండి. ఉదాహరణకు నన్నే తీసుకుంటే నాకు మీ టపా ఏదన్నా నచ్చకపోతేనో , అర్ధంకాకుంటేనో మాత్రమే కమెంటు రూపంలో నా ఉనికిని తెలియచేస్తా.. అదే బాగా నచ్చిందనుకోండి బుద్దిగా చదివి ఆనందిస్తా... ఎందుకంటే నాకు నచ్చినవాటిపైనా చాలాసార్లు నాకంటే ముందే కత్తి,కేక లాంటి ప్రయోగాలు చెసేసాక ఇంక నాకు చెప్పడానికేమి మిగలక స్పందించడం లేదంతే. కొన్నిసార్లు విభేదించాల్సిన సమయాల్లో కూడా అబ్రకదబ్రగారి లాంటివాళ్ళు ముందే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేయడం వల్ల అంతకంటే గొప్పగా నా అభిప్రాయాల్ని చెప్పలేక విరమించుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్ననంటే నాలాంటి మితస్పందకులు మీ బ్లాగ్‌కి చాలామంది ఉండుంటారనే విషయాన్ని గ్రహించి మీ ప్రశ్నకు జవాబు దొరకబుచ్చుకుంటారని.

oremuna said...

తక్కువ కాలంలో ఎక్కువ కామెంట్లను కంటిన్యూస్ గా ఆకర్షించే బ్లాగుగా మీ బ్లాగు కు లక్షణ నిర్వచనం ఇస్తున్నాను. :)

Anyhow u write well, though I don't read line to line of them :)

వేణూశ్రీకాంత్ said...

మంచి టపా మహేష్... ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని లౌక్యం పేరుతో సర్దుకు పోయే చాలా మంది లా కాకుండా... పదునైన మీ టపాలతో మార్పు ని కోరుకుంటూ social issues ని ఎత్తి చూపడం సాహసమే. అలా ప్రశ్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఇంకా చాలా మంది మీ ఆలోచన తో ఏకీభవిస్తుండచ్చు కానీ భావానికి నిర్దుష్టమైన అక్షర రూపం ఇవ్వ గలగడం కూడా ఒక కళ, అది మీ టపాలలో ప్రత్యక్షం గా కనిపిస్తుంది. మీ టపా ద్వారా రేకెత్తించిన ఆలోచన తో కనీసం ఒక్కరు అయినా ప్రభావితం కాగలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించిన వారు అవుతారు. కనుక మీ ఆత్మతృప్తి కోసమే కాదు ఆ ఒక్క పాఠకుడి కోసమైనా మీరు తప్పకుండా వ్రాయాలి.

Purnima said...

chava kiran gaari comment అదిరింది. ఇక నేనూ ఇలా sensational stuff వ్రాయల్సిందే famous కావాలంటే!! ;-)

మోహన said...

మహేష్ గారూ..

మీరు మీ కోసం రాసుకుంటున్నారు. అలా అని ఎదో ఒకటి కాకుండ, దానిని బాధ్యతగా, విపులంగా రాస్తూన్నరు. అంతకంటే ముఖ్యంగా స్పందించి ప్రశ్నలడిగిన వారికి ఓపికగా సమాధానాలు అందిస్తున్నారు.

ఇంతకన్నా ఏం లక్షణం ఉండాలి, ఏ కారణం కావాలి, రాయటనికి..!

Kathi Mahesh Kumar said...

@పూర్ణిమ; నువ్వు చెప్పిన లింకు చదివాను. రాయడానికి మరిన్ని కారణాలు తెలిపినందుకు నెనర్లు. రాయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన తరువాత, అదొక అద్భుతమైన వ్యసనంగా తయారవుతుంది. అదొక అనిర్వచనీయమైన నిషా.

@కొత్తపాళీ;నిజమే, ఆత్మతృప్తి లేనిదే రాతల్లో చిత్తశుద్ది ఎలావస్తుంది! మీ ప్రోత్సాహానికి నెనర్లు.

@మీనాక్షీ; నా మీమాంశలో నీకూ కొన్ని సమాధానాలు దొరకడం ఆనందంగా ఉంది. ఇక నీ ప్రోత్సాహంతో పాటూ, కొన్ని పొగడ్తలకీ నెనర్లు.సిగ్గుతో నా ముఖం కాస్త ఎర్రబడింది...

@పెదరాయ్డు;నా ప్రయత్నం,ఆలోచనని అక్షరబద్దం చెయ్యడం వరకే.బహిరంగంగా ప్రదర్శించేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే అయినా, ఎక్కడ అలా ఆలోచించి essence పోగొట్టుకుంటానో అని దానిగురిచి పెద్దగా పట్టించుకోను. అందుకే గట్టి విమర్శల్నికూడా స్వీకరించడానికి సిద్ధపడతాను.

@శ్రీవిద్య; నెనర్లు. రాయడంలో ఉన్న తృప్తే వేరు.

@శంకర్; మీరు మితంగా స్పందించినా, చాలా అర్థవంతంగా స్పందిస్తారు. ఇలాంటి పాఠకులు దొరకడమే అదృష్టం. నెనర్లు.

@ఒరేమునా; నా బ్లాగు లక్షణాన్ని నిర్వచించినందుకు నెనర్లు. మీరు line to line చదివే రోజుకోసం ఎదురుచూస్తాను.

@వేణూ శ్రీకాంత్; మీరన్న ఒక్క పాఠకుడు కాదు, ఇక్కడ చాలా సహృదయులున్నట్టున్నారు వారందరికోసమైనా రాయాలి.నెనర్లు.

@పూర్ణిమ; ఇప్పుడు నువ్వు రాస్తున్నది sensational stuff కాదని ఎవరన్నారు?

@మోహన; నా స్పందనకి ప్రతిస్పందించేవారికి జవాబివ్వడం ఒక భాధ్యతగా భావిస్తాను. అది ఒక రకంగా నా టపా చదివి తమ అభిప్రాయం తెలిపినవారికి, నేను తెలిపే కృతజ్ఞత. మీ ప్రోత్సాహానికి నెనర్లు.

Unknown said...

ఎందుకు అనేది ఎవరికి వారు వేసుకుని ఆలోచించాల్సిన ప్రశ్న...

నిజం చెప్పాలంటే నేను ఇది అని ఒక పరమార్థం కోసం రాయడం మొదలుపెట్టలేదు. కానీ మొదలుపెట్టిన కొన్ని రోజులకే అర్థమయింది. నాకిష్టమయిన భావాలను, ఆలోచనలను అర్థవంతంగా రాయవచ్చని.

ఒక కాయిన్ కి రెండు వైపులూ ఎప్పుడూ ఉండాలి కాబట్టి మీ ఆవేశం, ఆలోచనలు నాకు నచ్చుతాయి.

ఇలాగే రాస్తుండండి.

S said...

బాగుందండీ మీ టపా...
సో... నేనెందుకు రాస్తున్నాను? అని నేను కూడా వివరిస్తూ రాస్తా ఏమో బహుశా ఓ రోజు... నిన్ననే ఓ స్నేహితురాలు అడిగింది ఈ ప్రశ్న... ఎందుకు బ్లాగ్ రాస్తావ్ నువ్వు? అని. :)

మీనాక్షి said...

అందరికి ఈ సందేహం వచ్చిందన్నమాట..కాని అందరూ బ్లాగ్స్ రాయాలి ,రాస్తూనే ఉండాలి...
మీ త్రుప్తి కోసం కాదు ...నా(మా) లాంటి వాళ్ళ కోసం ..ఇక పోతే చెప్పడం మరిచా..మీరు విమర్శలకు.అభినందలకు కూడా అంత ఓపిగ్గా సమాధానం ఇస్తారు చూడండి...అది అందరికి సాధ్యం కాదేమో..
వేణూ గారు అన్నట్టు మీ టపాలు ఒక్కరిలోనైనా మార్పును తీసుకొస్తాయి.
...................
చూసారా మహేశ్ గారు..మీ అభిమానుల సంఖ్య...ఇప్పటికైనా
మీకు సమాధానం దొరికిందనుకుంటా...నేనెందుకు రాయాలి అనే ప్రశ్నకు..

కల said...

చాలా అర్ధవంతమైన టపా, ఆలోచించేలా చెయ్యగల టపా, మనల్ని debug చేసుకొనేలా చెయ్యగల టపా.
మహేష్, ఇంత మంచి post రాసినందుకు ముందుగా మీకు అభినందనలు.
ఈ కామెంట్స్ అన్నీ చూస్తుంటే అందరూ తమ తృప్తి కోసమే రాస్తున్నామని చెబుతున్నారు. నిజంగా అలానే ఐతే చాలా సంతోషం.
నేనెక్కడో (నిజంగా గుర్తులేదు, ఈ theses కి P.hd కూడా వచ్చిందని) చదివాను. "మనిషి ఏ పని చేసినా తన కోసం, తనకంటూ ఒక గుర్తింపు కోసమే ఆ పని చేస్తాడని". నేను ఈ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తాను.
నిజంగా మనకోసమే రాసుకోవడం ఐతే, ఆ రాసుకోవడం అనేది ఎక్కడన్నా చెయ్యొచ్చుగా (అంటే ఒక డైరీ లోనో, ఒక పుస్తకం లోనో)?. లేదూ, కాదూ ఇక్కడ బ్లాగుల్లో ఇలా రాయడం వల్ల మనభావాలని వేరేవాళ్ళతో పంచుకోవచ్చు అనుకొందాం, అలా చెయ్యడం వల్ల మనకు వచ్చేది ఏమిటి? అది కూడా ఒక రకమైన స్థాయి గుర్తింపే కదా? ఇంకా మన టపాలని చదివి అవతలి వారు మనకు ప్రోత్సాహం ఇస్తారు, వాళ్ల భావాలు, అభిప్రాయాలు మనకు తెలుస్తాయి. మంచిదే ఇలా జరగడం వల్ల మనకేమి వస్తుంది అంటే knowledge, ఇంకా చాలా చాలా, ఇవన్నీ ultimate గా మనకోసం ఉపయోగపడేవి.
కాకపొతే సమాజ సమస్యల మీద రాసేవాటి గురించి ఏమిటీ అనే కదా మీ ప్రశ్న? వాటి గురించి రాసే వారి నడగండి. వారెందుకు రాస్తున్నారో. అలా రాసి వారేం పొందుతున్నారో. yes, నిజం ఆత్మసంతృప్తి. అవును కొంత మందినన్నా అలోచింపచెయ్యగలిగాం అనే ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తి ఎవరికోసం? వారికోసమే కదా? మన రాతలు ఎవరన్నా చదివి వారి వారి అమూల్యమైన అభిప్రాయలు తెలియచేస్తే వచ్చే ఆనందం కూడా ఇలాంటిదే. suppose ఒక్కరు కూడా మనం రాసే posts చదవకుండా మానేస్తే, మనం ఇలానే రాస్తూ ఉండగలమా? రాయలేం, మనకూ interest తగ్గి పోతుంది. అలా ఎందుకు interest పోతుంది అనేది ఎవరికీ వారు వేసుకోవలసిన ప్రశ్న. వేసుకుంటే సమాధానం మీ దగ్గిరే మీకు దొరుకుతుంది.

నాకో ఫ్రెండ్ ఉండే వాడు. వాడి ఆలోచన ఎలా వుండేదో చూడండి.
"నేను బావుండాలి."
"ఎందుకు రా అంత స్వార్ధం?" అనేది నా ప్రశ్న?
"దీనిలో స్వార్ధం ఏముంది? నేను బావుంటే నా ఫ్యామిలీ బావుంటుంది. నా ఫ్యామిలీ బావుంటే (అందరూ వాడిలా బావుంటే) society బావుంటుంది. society బావుంటే country బావుంటుంది.
కదా?" అనే వాడు. వాడి వాదనలో ఏంటో కొంత నిజం ఉంది అని అనిపించేది నాకు. కాని ఎక్కడో లోపం కూడా ఉండేది అని కూడా అనిపించేది. అదేమిటో కూడా అర్ధం అయ్యేది కాదు. మీకేమన్నా అర్ధం ఐతే నాకు చెప్పగలరని ఆశిస్తూ..
(ఇదే ఓ చిన్న సైజు టపా లాగ అయింది. దీని మీద ఖచ్చితంగా ఒక పోస్ట్ రాయాల్సిందే. తొందరలోనే రాస్తాను.)

Kathi Mahesh Kumar said...

@కల; టపా దానితోపాటూ అందరి అభిప్రాయాలూ నచ్చినందుకు నెనర్లు.

మొదటగా నీ మిత్రుడి విషయాన్ని తీసుకుందాం. ప్రతి మనిషీ తను బాగుండాలి అనుకుంటే, అది చాలా సహజం.దాన్ని selfishness(స్వార్థం) అనుకోవచ్చు. కానీ, ‘నేనూ నావాళ్ళూ మాత్రమే బాగుండాలి, ఇతరులు ఏమైనా ఫరవాలేదు’అనుకుంటే దాన్ని ఆంగ్లంలో self centredness అంటారు.అది చాలా ప్రమాదకరం.

మనిషి తన చిన్నచిన్న స్వార్థాలవల్ల సమాజానికి పెద్ద నష్టమేమీ లేదనుకుని, మొత్తం సమాజాన్ని రుగ్మతలపాలు చేస్తున్నాడు. అక్కడే ఉంది అసలు సమస్య.కొన్ని వేలకోట్ల ప్రాజెక్టులో ఒక 10లక్షలు లంచం తీసుకోవడం వల్ల పెద్దనష్టం రాదని ఒక IAS అధికారి అనుకుంటాడు...కానీ ఆ ప్రాజెక్ట్ నాణ్యత నశించి పదేళ్ళలో కూలిపోతే!

అంటే, ఆ అధికారి తన కుటుంబం బాగానే ఉన్నారు. తద్వారా సమాజం,దేశం బాగున్నాయా? బహుశా అందుకే మీకు మీ మితృడి వాదన అసంతృప్తి కలిగించుండోచ్చు.

ఇక ‘రాయడం’గురించి మీరు చెప్పిన విషయాలు చాలా వరకూ ఆమోదయోగ్యాలే. కాకపోతే మొదట ఆత్మతృప్తి...దానితోపాటూ గుర్తింపూ వస్తే రాసే ఎవరికైనా బాగానే ఉంటుంది.రాతలు తృప్తినిస్తే, పాఠకుల ప్రశంస లేక తెగడ్త ఇంకారాయడానికి తగిన కారణాల్నీ,ప్రేరణనీ ఇస్తాయి.

ఈ విషయంపై మీ టపాకై ఎదురుచూస్తాను.

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్; నెనర్లు. మన ఆలోచనలకి అక్షరరూపం వస్తే దానిలో కలిగే ఆనందం వర్ణనాతీతం. కనీసం ఆ ఆనందాన్ని అనుభవించడానికైనా రాయాలి.

@సౌమ్య;మిమ్మల్నీ ఈ ప్రశ్న అడగటం జరిగిందీ! మరింకెందుకాలస్యం? టపా రాసెయ్యండి. ఎదురుచూస్తాను.

@మీనాక్షీ; నిజమే!నెనర్లు

సత్యసాయి కొవ్వలి Satyasai said...

బాగుంది మీ అంతఃవీక్షణం. చాలామంది బ్లాగర్లకి ఈప్రశ్న రావడం సహజమేననుకుంటా. ఈవిషయంమీద నేనెందుకు బ్లాగుతున్నాను (http://poddu.net/?p=36) అని పొద్దు లో వ్యాసం రాసా. చెప్పిన విధానం తేడా కానీ, సారం మీరు చెప్పినదే.