నేను ఈ నెలలో కట్నం, పెళ్ళి ప్రాతిపదిక మరియూ ఈవ్ టీజింగ్ గురించి రాసిన టపాలకు వచ్చిన స్పందనను చూసి, నాశైలి గురించి కొంత పునరాలోచనకు గురయ్యాను. ఆ ఆలోచనల్ని (నేను) అసలెందుకు రాయాలి? అనే టపాలో పంచుకున్నాను. కాకపోతే, నా అనంత ఆలోచనా స్రవంతిలో భాగంగా, ఈ మధ్య మరికొన్ని లోతులు గోచరించాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే తన other side of the spectrum వాదనతో నన్ను నిరంతరం ప్రశ్నించే అబ్రకదబ్ర మాటలు కూడా ఈ ఆలోచనకు కారణమయ్యాయి.
నేనురాసిన టపాలు చాలావరకూ నా అభిప్రాయాలు,ఆలొచనలేకాబట్టి అవి నాపరంగా చేసిన వాదనలుగా అనిపించి కొంతమంది పాఠకులు వాటితో అంగీకరిస్తే, మరికొందరు విభేదించారు. కానీ, నేను నిజంగా ఆశించిన "చర్చ" జరగలేదని భావించాను. అంతేకాక, ఇలా జరగడానికి చాలా సహేతుకమైన కారణంకూడా ఉందనిపించింది. అదేమిటంటే, "ఒక విషయాన్ని నిస్పక్షపాతంగా పరిచయం చేస్తే, దానిపై చర్చకు అవకాశం ఉందేతప్ప , మన తరఫునుండీ ఒక వాదనను ప్రదర్శిస్తే, దానికి ప్రతికూలవాదమో లేక అనుకూలవాదమో మాత్రమే ఎదురయ్యే అవకాశం మాత్రమే ఉంది". బహుశా ఈ టపాల విషయంలో అదే జరిగిందనిపించింది.
అంతేకాక, నా ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ఒక నేపధ్యం, చరిత్ర, అనుభవాలు, నేర్చుకున్న విషయాలులాంటి ఎన్నో విషయాల ప్రభావం ఉంటుంది. కనుక, ఆ నేపధ్యం పరిచయం లేని చదువరులకు అంగీకరించడమో లేక విభేధించడమో తప్ప సామరస్యంగా అర్థవంతమైన చర్చకు పూనుకునే అవకాశం తక్కువగా ఉంటుందని మిత్రుడు అర్వింద్ రుషి కూడా తన వ్యాఖ్యల్లో ఎత్తిచూపారు.
ఇవన్నీ చూస్తే నాకర్థమయ్యిందేమిటయ్యా అంటే, చర్చను ఆశించాలి అంటే టపాలు క్లాసులో చెప్పే పాఠంలా నిస్పక్షపాతంగా రాయాలి అని. కాకపోతే, నాలాంటి ‘ఎదురీతగాడు’ అలా చెయ్యడం కష్టమే ! ఇదివరకటి టపాలో చెప్పినట్లు, "బలంగా విశ్వసిస్తేనో లేక వ్యతిరేకిస్తేనో తప్ప నాకు రాయాలనిపించదు". కాబట్టి చర్చజరగాలనే ఆశ నేను ఒదులుకోవడానికి సిద్ధపడుతున్నాను. నేను నా వాదనల్నే వినిపిస్తాను. అనుకూలవాదనలకి స్పందిస్తాను, ప్రతివాదనలకి ప్రతిస్పందిస్తాను. రెంటికీ నేనే న్యాయాధిపతిని కాబట్టి...అంతిమ విజయం నా బ్లాగులో నాదే!
Sunday, July 20, 2008
చర్చ Vs వాదన
*********
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
మీ బ్లాగులో నేను గమినించిందేంటంటే.. మీరు టపా శీర్షికలో చాలా వరకూ.. ప్రశ్నార్ధక చిహ్నం పెడతారు. అది చూసి.. అవుననో, కాదనో చెప్పడానికి నేనిక్కడికి వస్తాను. మీ టపాలో మీరు ఖచ్చితంగా ఒక అభిప్రాయాన్ని చెప్పేస్తారు.. అసలనుకున్న అవునూ..కాదూ.. పోయి, మీరన్నది నేనొప్పుకుంటానో.. ఒప్పుకోనో చెబుదామనుకుంటాను. ఈ లోపల వ్యాఖ్యలు వచ్చేసుంటాయి... ఇక నేనందులో కొట్టుకుపోవడం తప్పమిగిలేది ఏమీ లేదు. కాకపోతే ఆ విషయమై కాసేపయినా ఆలోచిస్తాను. కుదిరితే ఇంకా చదువుతాను.. గూగుల్లో!! ఇదీ మీ బ్లాగుతో నా అనుభవం.
మీ బ్లాగులో కమ్మెంటే వాళ్ళల్లో.. అందులోనూ మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా.. Interesting for me!! ;-)
"మీ బ్లాగుకి మీరే రాజు".. నిస్సందేహంగా!!!
మీ బ్లాగుల్లో, మీ కామెంట్లలో నేనూ ఓ విషయం గమనించాను. మీరు ఓ బ్లాగరు రాసినదాన్ని రిపోర్టుల్లాగ భావిస్తున్నారు. నా వుద్దేశ్యంలో బ్లాగులు కేవలం సొంత అభిప్రాయానికి తావులు మాత్రమే.
'ఒక బ్లాగరు తన అభిప్రాయాలను జనాభిప్రాయాలుగా చెప్పజూస్తున్నాడు, మిగిలిన బ్లాగర్లు ఆ అభిప్రాయన్ని వంట బట్టించుకుంటారు ' లాంటివి చిన్నపిల్లల వ్యవహారాల్లా ఉంటాయి.
మీరు చర్చ అన్నా, వాదన అన్నా, ఇరువర్గాల మధ్య ఓ యేకాభిప్రాయాం కుదరడమో, లేదూ, నేను చూచిన నిజాల ద్వారా నేను ఈ అభిప్రాయాన్ని యేర్పరచుకున్నాను మీరు 'ఫలానా ' అనుభవాలు చూచిన కారణంగా ఇలాంటి అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు అని కన్విన్సింగ్ పాయింటు కు రావడం చర్చ లేక వాదన ముఖ్యోద్దెశం కావాలి అని నా నమ్మిక.
ఒక్కోసారి మీరు వాదించే 'పద్ధతి ' కాస్త తీవ్రంగా ఉంటోంది. ఇది ఆశ్చర్యమైన విషయం.
విశ్లేషణ (analysis) గొప్పదే. అయితే సంశ్లేషణ (synthesis) ఇంకా గొప్పది.
మహేష్ గారు,
నా మటుకు నాకు
చర్చ= నిజాన్ని తెలుసుకొనేందుకు కొందరు జరిపే సంవాదం-ఇక్కడ సవాదం జరిపే వారు open mind తో ఉండాలి
వాదన= తాను నిజమని నమ్మే దాన్ని ఇతరులకు చెప్పటం/ ఇతరుల చేత ఒప్పించేలా చేసే సంవాదం ఇక్కడ mind is closed to further modificatiosn of opinion.
మీ బ్లాగులో వాద ప్రతివాదనలు జరిగినపుడు అది "చర్చే" అవుతుంది కదా, వాదన ఎందుకు అయింది? అంటే మీరు open mind తో లేరా? అలా అయితే మీరు ఆలోచించాల్సిందే దాని గురించి. మీరు బలంగా నమ్మటం/వ్యతిరేకించటం ok, కాని అవతలి వైపు వారి వాదనలో నిజాన్ని చూసేందుకు మీరు ప్రయత్నిస్తున్నంత వరకు అది చర్చే.
ఇక పొతే "పెద్ద" చర్చలు జరగకపోవచ్చు మన బ్లాగుల్లో-అందుకు చాలా కారణాలు ఉంటాయి కదండీ. మీ వైపు నుంచే కాదు, అవతలి వైపు వారి నుంచి కూడా ఉంటాయి కారణాలు. సో, అన్నీ మీ నెత్తిన వేసుకోకండెం.
కాకపొతే-పైన పూర్ణిమ గారు అన్నారే--"మీ బ్లాగుకు వచ్చి మిమ్మల్ని oppose చేయటం -mm- interesting" అన్న అర్థం వచ్చేలా - అలా మాత్రం అనుకోకూడదు. అలా అనుకోవటం కూడా చర్చకు విఘాతమే.
క్లుప్తంగా-మీరు మీ అభిప్రాయం చెప్పినా చర్చకు అది ప్రతిబంధకం కాకూడదు. సో, carry on.
రవి గారు బాగా సమ్మరైజ్ చేసారు.
మీ ఆలోచనలు బాగా పెడతారు మీ టపాలలో కానీ చర్చకి అంత అనుకూలమయిన వాతావరణం కాక వాదనకే మొగ్గు చూపేట్టుగా ఉంటాయి మీ టపాలు.
కొన్ని సార్లు మీ "వాదన"లు జనాలను రెచ్చగొట్టి వారినీ అదే వైపుకి సాగేలా చేస్తాయి. కాబట్టి ఒక చర్చ లాగా జరిగి ఇవీ అంటూ వాటిలో నుంచి చేయగలిగినవి రావడం తక్కువేమో అని నాకనిపిస్తుంది.
ఇక ఎలాగూ మీ బ్లాగుకి మీరే న్యాయాధిపతి అని ప్రకటించుకున్నారు గనక అలాగే...
@ మహేష్ గారు
చాలా వరకు మీ టపాలు చదివాను. పూర్ణిమ అన్నట్టు ఒక్కోసారి కొట్టుకుపోవడం ఇష్టంలేక,ఒక్కోసారి సమయాభావం వల్ల, ఇంకోసారి నేను చెప్పదలచుకుంది "అబ్రకదబ్ర" గారో ఇంకొకరెవరో చెప్పెయ్యడం వల్ల చెప్పదలచుకోలేదు, కొన్ని సార్లు "బలంగా విశ్వసిస్తేనో లేక వ్యతిరేకిస్తేనో తప్ప నాకు రాయాలనిపించదు"... మీ ఆ విధానం ప్రస్ఫుటంగా కనపడి విరమించుకున్నాను స్పందించ కుండా... ఎందుకంటే అంతకన్న బలంగా మనలో చాలా మంది విశ్వసించగలరు, వ్యతిరేకించగలరు. ఆ విశ్వాసాలు వారి అనుభవాల ప్రాతిపదికగా ఉంటాయి సాధారణంగా...అందరూ విశ్వసించించడం, వ్యతిరేకించడం మొదలుపెడితే...?, అలాంటప్పుడు మీరొక టపాలో కేంద్రీకరించిన వ్యక్తి స్వేచ్చ మాత్రమే మిగులుతుంది, వ్యవస్థ కాదు... మనం బలంగా విశ్వసించడం వల్ల, వ్యతిరేకించడం వల్ల చాలా సార్లు జెనరలైజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తాము, అది మీ బ్లాగులోను జరిగింది... ఎప్పుడైతే జెనరలైజ్ చేస్తామో, అప్పుడు దాని ఆమోదం కోసం కూడా మరింతగా పోరాడతాము...
కానీ నాకు చెప్పాలనిపించింది మీకు చెప్పాలి అనిపించినప్పుడల్లా, మీలో మార్పు కనపడింది... ఆ మార్పు మీరు మీకొచ్చే స్పందనలని అర్ధం చేసుకోవడంలో... అది నిజంగా అభినందనీయం. అలా కొన్ని సార్లు నేను రాసుకున్న కామేంట్తో పనిలేకుండాపోయింది... చాలా మంది, ఎప్పటికప్పుడు తమని తాము అంచనా వేసుకోలేరు. మీరు మాత్రం పది మందిలోకి వచ్చి, గళమెత్తి వచ్చిన స్పందనలకనుగుణంగా మిమ్మల్ని మీరు మెల్లగా తెలుసుకున్నారు... మీలో వచ్చిన ఆ మార్పుని పది మందికి తెలియచెయ్యడం కూడా ముచ్చటగా అనిపించింది.
ఇక్కడ నేను నీతులు చెప్పడానికి ప్రయత్నించలేదు, నా అవగాహనని మాత్రమే పంచుకున్నాను. మీరు లేవనెత్తిన ప్రతీ అంశం, వాటి గురించి నన్ను మరో సారి ఆలోచించేట్టు చేసింది. మీకు నా ధన్యవాదాలు. మీరు మరిన్ని టపాలతో రావాలని కోరుకుంటున్నాను.
మీకు ఒక సూచన. మీరు మీ టపాలకి ఎంపిక చేసుకునేవన్నీ మనసుపెట్టి ఆలోచించాల్సినవే. అవన్నీ నాకైతే నిర్లక్ష్యం చెయ్యాలనిపించదు. కానీ మరీ మీరు రెండు రోజులకొకటి అలా రాసేస్తే, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? :-( చదవకుండా వదలలేను, మనసు పెట్టి ఆలోచించేంత సమయమూ ఉండదు, చర్చలో పాల్గొనలేను కూడా... కొంచెం బాగా ఆర్గనైజ్ చేసుకోగలిగితే అంటే... వారానికి ఒకటో, రెండు వారాలకొకటో అలాంటివి రాస్తే చదువరులందరికీ మంచి నిడివి దొరుకుతుంది. మిగిలిన రోజులు మీ వ్యాపకాలు, సరదాలు, అవీ ఇవీ... దానివల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈపాటికే అది మీరు తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పకపోయిన, ఇంకో రెండు వారాల్లో మీరు ఆ మార్పుతో కనపడతారని నాకు నమ్మకం :-)
ఏది ఏమైనా మీ పర్ణశాలకి మీరే రాజు :-) మీ పర్ణశాలలో బస చేసేవాళ్ళందరూ మీ పాలనలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని...
నాకు తెలిసీ మీరు అంటున్న ఆ నిస్పక్షపాత వైఖరి వల్ల అస్సలు చర్చ జరగదు మహేష్. ఇది ఎప్పుడూ ఉన్న విషయమే కదా ఇంక దాని పై మాట్లాడటానికి ఏముంటుంది అని ఎవరికి వారు వదిలేస్తారు. చర్చ అయినా మీ అభిప్రాయాన్ని చెప్తూనే మొదలు పెట్టాలికదా... ఇప్పుడు మీరు చేస్తున్నది అదే కదా...
ఈ విషయం మీద భావకుడన్ గారు బాగా చెప్పారు. మీరూ, కామెంటే వారూ, ఇద్దరూ Open mind తో ఉన్నంత కాలం అది చర్చే అవుతుంది. come with half filled cups and leave room for other ideas and experiences. అపుడు అది చర్చ లాగానే కనిపిస్తుంది అందరికీ.
@పూర్ణిమ;‘నాతో అంగీకరించకపోయినా ఈ విషయం గురించి ఆలోచిస్త చాలు’ అని నేను టపా రాసేప్పుడు చాలాసార్లనుకుంటాను.మీరు చెప్పినదాన్నిబట్టి చూస్తే అది జరుగుతున్నట్లుంది. నెనర్లు. నేను రాసేది ఎలాగూ మారదుకాబట్టి,ఇకనుంచీ టపా శీర్షికల విషయంలో మాత్రం కాస్త శ్రద్ధపెడతాను.
@రవి; మీతో నేను ఏకీభవిస్తాను. నా సమస్యా అక్కడి నుంచే మొదలయ్యింది. ఉదాహరణకు నేను ఈవ్-టీజింగ్ గురించి టపా పెడితే, దాని మీదవచ్చిన చర్చ నేను తెలిపిన ‘sexual freedom' గురించి ఎక్కువగా జరిగిందేతప్ప అసలు విషయం మీద కాదు. అంటే అక్కడ ఉద్దేశం అక్కడ నన్ను ఖండించడమే తప్ప విషయాన్ని గురించి కాదు.
ఒక స్థాయి దాటిన తరువాత నా వాదన తీవ్రంగా ఉంటుంది. అది నిజమే,దానికి కారణం అబిప్రాయకుల ఒంటెద్దుపోకడలు మాత్రమే. నావరకూ అప్పటికీ నేను open mind తోనే ఉంటాను.లేదంటే నా తరఫున్నుండి చర్చించను కదా!
@భావకుడన్; మీ ‘synthesis’ బాగుంది."మనిషి తన అనుభవాలవల్ల మారతాడేగానీ,ఇతరుల అభిప్రాయాలవల్ల కాదు" అని నేను బలంగా నమ్ముతాను. నా ఉద్దేశం ఈ టపాలద్వారా నా అనుభవాల ద్వారా వచ్చిన ఆలోచనల్ని చెప్పడంతో పాటూ చదివేవారి జీవితాల్లోని అనుభవాల్ని తరచి చూసుకోమనడం. కాకపోతే చాలామంది అబిప్రయవేత్తలు నా ఆలోచనల్ని వారి అనుభవాలతోకాక,సామాజిక విలువలతో బేరీజుచేసి వాదనకు దిగితే నేనప్పుడప్పుడూ సంయమనం కోల్పోతుంటాను.కానీ అప్పటికీ "అది వారి అనుభవం కదా" అని open mindతో ఉంటాను. కాకపోతే రవిగారికి చెప్పినట్లు ఆ అభిప్రాయాలుకూడా విషయం మీదకాక ‘నా అభిప్రాయాలమీద వారి అభిప్రాయాలుగా ఉన్నప్పుడు మాత్రమే I try to shut my mind. కానీ అదికూడా కష్టమేనండోయ్ !
@ప్రవీణ్; నెనర్లు. మీరు చెప్పినదాని గురించి కొంత ఆలోచించాలి.
@దిలీప్;నేను విషయంపై చర్చకూ పునరాలోచనకూ ఎప్పుడూ సిద్దమే. కాకపోతే నా priority ఎప్పుడూ వ్యక్తిగత స్వేచ్చా,అనుభవాల సారమే కాబట్టి,‘సామాజిక కోణం’ అంటూ ఒక convenience కోసం వాదించినప్పుడు కాస్త కరుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే, వ్యక్తి తలుచుకుంటే సమాజంతో negotiate చేసి తన నమ్మకాల్ని జీవిస్తాడు అనేది నా విశ్వాసం.
చాలామంది తమ సౌలబ్యంకోసం సమాజాన్ని ఒక బూచోడ్లాగా చూపి తప్పించుకుంటారు.బహుశా వారు ఆ comfort zone వారివారి కారణాల వల్ల ఎంచుకునుండొచ్చు.అక్కడనాకు కాస్త అంగీకరించడానికి ఇబ్బంది అనిపిస్తుంది. I can understand them, but cannot empathize with it.
నా టపాలు చదివిన తరువాత ఆలోచించడానికి సమయం చాలటం లెదంటున్నారు కాబట్టి, ఇకనుండీ రెండ్రోజులకొక టపా రాయడానికి ప్రయత్నిస్తాను.
@వేణూ;అబిప్రాయాలు వెల్లడించినంతవరకూ అది ఎంత వ్యతిరేకమినదైనా నేను open mind తోనే స్వీకరిస్తాను, సమాధానం ఇస్తాను. కాకపోతే కొందరు దాదాపు ‘దాడి’ కి దిగినప్పుడు, నేనూ దాన్ని ఎదుర్కోవడానికి అలాంటి భాషవాడి సమాధానం చెప్పాల్సి వస్తుంది.అక్కడ బహుశా చర్చ కాస్తా యుద్దమైపోతుంది. ఇకనుంచీ I will try to be more careful about it.నెనర్లు.
I did noticed it in some of your discussions in the posts మహెష్, మీకు చర్చ అనిపించ లేదు అని అన్నారు కదా అని చెప్పాను అంతే, i didn't mean that you are not open minded :-) అన్ని సార్లు అలా మంచిగా ఉంటే కూడా కష్టం లెండి.
మొత్తానికి మహేష్ గారు తను స్థిమితంగా కూర్చోరు, మనల్ని కూర్చోనియ్యరు. ఎవరో అన్నట్టు, సందడే సందడి .. బోరన్న మాట మాత్రం ఉండదిక్కడ :)
ఆశికాలు పక్కన బెడితే .. సుమారు 13-14 ఏళ్ళ బట్టీ ఈ అంతర్జాల రణరంగంలో అనేక ప్రత్యక్ష ప్రఛ్ఛన్న ప్రత్యర్ధులతో సుదీర్ఘ జ్వాలాయుద్ధాలు సలిపి నేను తెలుసుకున్న జీవిత సత్యం ఇది .. మనం చెయ్యగలిగిందల్లా మా అనుభవాల్ని అభిప్రాయాల్నీ పంచుకోవటం. ఏ విషయం గురించైనా మనకి సాధికారమైన సమాచారం ఉంటే అవ్సరమైన మేరకు దాన్ని విశదీకరించడం. అవతలి వ్యక్తి విజ్ఞుడై మనం చెప్పిన దాంట్లో పాయింటుందని గ్రహిస్తారా, ధన్యోస్మి. లేదా మనకే అవతలి వాళ్ళు చెప్పిన దాంట్లో ఏవన్నా నేర్చుకోదగినది కనబడిందా.. డబుల్ ధన్యోస్మి. అంతేగాని, వాదన చేసి, ఋజువులు చూపించి, బల్ల గుద్ది, తల్ల కిందులుగా తపస్సు చేసి మనం అవతల వాళ్ళ అభిప్రాయాల్ని, నమ్మకాల్ని మార్చలేం. అరిస్తే కంట శోష, కీబోర్డు మీద వేళ్ళ కణుపులు శోష.
చెప్పి పంచుకో, విని అర్ధం చేసుకో. అంతే.
మహేష్ గారూ మీ శైలి చదివి0చేలా,ఆలోచి0పచేసేలా వు0టు0ది.కానీ మీరు చెప్పే విషయ0లో నేనే కరక్టు,ఇదే కరక్టు అనేలా0టి అమిత ఆత్మ విశ్వాశ0 కనిపిస్తూ ఉ0టు0ది.అక్కడే సమస్యవస్తు0ది.మీ అభిప్రాయాలు,ఆలోచనలు చెప్పుకోవడ0 వేరు,నావే సరైనవని చెప్పడ0 వేరు.అదీగాకా మిమ్మల్ని విబేధిమ్చిన వాళ్ళని తరువాతి టపాల్లో బరువయిన వ్య0గ్య మాటలతో స0బోధి0చడ0 కాస్త బాధకలిగి0చే,కామె0టు రాయడానికి భయ0 కలిగి0చే విషయ0.[నేను ఒక్క పోస్టులోనే మిమ్మల్ని విబేధి0చాను.కానీ తరువాతి టపాల్లో కూడా మీ ఆ ధోరణి కనపడి0ది.కొ0తమ0ది డైరక్టుగానే మీతో అనేసారు కూడా ఈ మాటలు[కామె0ట్స్ లో]కానీ ఒక్క మాట చెప్పితీరాలి.మీ టపాలు టపాకాయలు.కేక పెట్టిస్తాయి.
ఒకడు ఒక్కడితో గొడవ పడితే తప్పెవరిదో చెప్పడం కష్టం అంటుంది సమాజం.
అదే ఒక్కడు వంద మందితో గొడవ పడితే తప్పెవరిదో సులభంగా చెప్పొచ్చు అంటుంది ఇదే సమాజం.
కాని అదే ఒక్కడు తను నమ్ముకొన్న సిద్ధాంతం కోసం వంద మందితో విబేధిస్తే అది తప్పవుతుందా? (అయితే Copernicus కూడా తప్పు చేసాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి).
మహేష్ మీ మొదటి టపాకి, మీ ప్రస్తుతం చివరి (ప్రస్తుతపు) టపాకి ఆలోచనల్లో చాలా తేడా వుంది అదే వాదన - చర్చ. మీ మొదటి టపాలో వాదన జరిగితే చివరి టపాలో చర్చ జరిగింది. వాదన కానివ్వండి, చర్చ కానివ్వండి ఏదన్నా అభిప్రాయం చెప్పడంతోనే మొదలవుతుంది. కాకపోతే చర్చ, వాదన అనేవి దానిలో పాల్గొంటున్న వారి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటాయన్న "భావకుడన్" గారితో నేను ఎకీభవిస్తాను. నేను ప్రస్తుతానికి గమనించిందేమిటంటే మీలో సహనం పెరిగింది. మీ వాదననైనా, అభిప్రాయాన్నైనా చాలా ఓపికగా, ఎవ్వరిని నొప్పించకుండా వినిపించేదానికి ప్రయత్నిస్తున్నారు. నేనే కరెక్ట్ అన్న superiority complex మీనుంచి దూరమైతే బావుండు అన్న రాధిక గారి వాఖ్య కూడా సరిఅయినదే.
కానీ మీ టపాలన్ని నన్ను బాగా స్పందించేలా, ఆలోచించేలా చేస్తాయి. ఇలా రాయడంలో మీకు మీరే సాటి. నిస్సందేహంగా మీ బ్లాగుకి మీరే రాజు అలానే ఎవరి బ్లాగుకి వాళ్ళే చక్రవర్తులు కూడా.
@కొత్తపాళి గారూ;"చెప్పి పంచుకో, విని అర్ధం చేసుకో" అని చాలాబాగా చెప్పారు.అలా సాగితేనే జీవితంలో నేర్చుకోవడం,సంస్కరించుకోవడం జరుగుతాయి.మన అబిప్రాయాలతో ఎవరైనా వెంఠనే మారిపోతే, వారి అనుభవాలకు విలువేముంది? అందరూ తమ అనుభవాలతోనే మారతారు. మన అభిప్రాయాలతో ఖచ్చితంగా కాదు. కానీ,నా అనుభవాలూ, ఆలోచనలద్వారా వారి అనుభవాల్ని బేరీజు చేసుకుంటారని నా ఆశ అంతే.నెనర్లు.
@రాధిక; నమ్మినవి రాసేప్పుడు ఒక conviction తో రాస్తాము. బహుశా అది అప్పుడప్పుడూ ‘అతి విశ్వాసం’ లాగా అనిపించి ఉండొచ్చు. ఇక వ్యంగ్యం అంటారా,ఒకసారి తమ అబిప్రాయాన్నికాక తెలియని సమాజం యొక్క విలువల్ని కొందరు వెనకేసుకొచ్చినప్పుడు అలా విభేధించాను. ఆ తరువాత, నాకూ ఆపద్ధతి పెద్దగా నచ్చలేదు. మానుకున్నాను.కాకపోతే,సమాధానాల్లో చురక అంటించడంలో పెద్ద తప్పులేదని ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నా!
@ప్రతాప్; "నేనే కరెక్ట్" అనే superiority complex నాకు పెద్దగా లేదు. కానీ,తర్కం లేకుండా కేవలం సమాజాంగీకారమైన విలువలను తమ అబిప్రాయాలుగా కొందరు చెప్పినన్ను సంస్కరింపబూనినప్పుడు మాత్రం కాస్త irritate అయ్యినమాట మాత్రం వాస్తవం.ఈ మధ్య ఆ perspective కూడా అర్థమయ్యింది.అందుకే,సహనం పెరిగింది. మీ ప్రోత్సాహానికి నేనర్లు.
ఇప్పటికే మీరు రెండు రోజులకొకటి విషయ తీవ్రత ఉన్న అంశం గురించి రాస్తున్నారు.. నేనన్నది, అలాంటి విషయాలని వారానికొకటో, రెండువారాలకొకటో అని :-)
వాదం జరిగినప్పుడు, అవతలి వాదాన్ని ఖండించడంలో దాన్ని చులకన చెయ్యడం, చురకలు వెయ్యడం కూడా ఒక భాగమే, పెద్ద పెద్ద వాదన వేదికల పైన అంగీకరించిన పద్ధతే. అది శ్రుతి మించకుండా ఉన్నంత సేపూ, వాదనలో పార్టీలు దాన్ని వ్యక్తిగత నిందగా తీసుకోనంత సేపూ అది కొంచెం వినోదం కూడా.
మీ బ్లాగులన్నీ చదివిన తరువాత, ఇలా చెప్పాలనిపించింది:
"సంశయం" అనే పదునైన అశ్త్రాన్ని మీ అమ్ములపొదలో చేర్చి చూడండి. కాకపోతే, ఈ అశ్త్రాన్ని మనమీద ఎక్కుపెట్టుకోవాలి. దాన్ని సంధించేముందు సాధనచేయడం మరువద్దు సుమా. ఎందుకంటె, ఎంతవరకు ఎక్కుపెట్టాలి అనేది ఒక్క జీవితం మాత్రమే నేర్పగలదు. ఏ మాత్రం వికటించినా కొంపముంచగల సామర్ధ్యం దీనిది.
ఇది నాకు చెప్పగ అర్హత ఉందో లేదో, అసలు చెప్పే అవసరం ఉందో లేదో కూడ తెలీదు. ఉపయోగమనిపిస్తే స్వీకరించగలరు. నిరుపయోగమనిపిస్తే తృణీకరించగలరు.
-అసంఖ్య
Post a Comment