Saturday, July 19, 2008

ముఖానికి కొన్ని రంగులద్దుకుని...!


ముఖానికి కొన్ని రంగులద్దుకుని,
వీలైతే ఒక మాస్క్ తొడుక్కుని,
ఎదురైన ప్రతిఒక్కరినీ...పలకరిస్తాను.
ఉదయాన్నే ఒక చిరునవ్వు,
మధ్యాహ్నం ఒక ఆకలి అరుపూ,
సాయంత్రం ఒక సరదా కేక,
ఆపైన నిశిరాతిరిలో ఒక ఆవులింతమధ్య...
నిద్రకొరిగి, సేదతీరుతాను.


కానీ...జీవితమంటే ఇంతేనా?


ఆకలికోసం బ్రతకడం.
ఇతరుల అంగీకారంకోసం వెతకడం.
ఎవరోచెప్పిన జీవనసత్యాలకి ఒదగడం.
మనసును చంపి, మన్ననకై బతకడం.
వారమంతా నలిగి,
వీకెండ్ కోసం చూడడం.
జీవితమంటే ఇంతేనా?స్నేహాన్ని ఉన్నతమంటాం.
ప్రేమే శాశ్వతమంటాం.
స్నేహితుల్ని సాధించడానికీ,
ప్రేమికుల్ని శోధించడానికీ,
జీవితాన్ని వెచ్చిస్తాం.
తెలియని ప్రశ్నల్నీ,తెలిసిన జవాబుల్నీ
మళ్ళీమళ్ళీ సంధిస్తాం.
జీవితమంటే నిజంగా ఇంతేనా?ఇదే జీవితమైతే ! ఇప్పుడే తీసేసుకో !!
బిల్లు చూసి ప్రేమించడం,
వీకెండ్లకోసం జీవించడం,
నాకొద్దు.
కొలిచే స్నేహం,
కొనుక్కునే ప్రేమా...
నాకొద్దు.
ఈ మాస్కునీడలో రంగుమారిన ముఖం
అతికించిన నవ్వులూ,
తప్పనిసరై అరిచే అరుపులూ,కేకలూ
నాకొద్దు.
నిజంగా, ఈ జీవితమే నాకొద్దు.
నేను కావాలి...నాకు నేనుమాత్రమే కావాలి.
నేను నేనుగా బ్రతికే జీవితం కావాలి.*****************

ఈ మధ్య ‘కొత్తపాళీ’ గారు తన గూగుల్ చాట్ లో పెట్టుకున్న మాస్క్ చూసిన ప్రతిసారీ నాకు T.S.Eliot రాసిన ఒక కవితలోని ఈ క్రింది లైన్లు గుర్తుకొచ్చేవి;
It's Time
It's time to prepare a face
Prepare a face to meet the faces that you meet

పై పంక్తుల స్ఫూర్తితో ఈ కవితను రాసాను.


************

12 comments:

oremuna said...

Good one.

You improved a lot in writing poetry.

try to align in left to make it more readable.

ఏకాంతపు దిలీప్ said...

బాగుంది... అక్కడక్కడ ప్రవాహం గతి తప్పినట్టనిపించింది...

కానీ మాస్క్ ధరించి అలసిపోయి, ఆ అలసట తెచ్చిన చిరాకులో రాసారు గానీ, నిజంగా మీరు అడిగినవన్నీ జరుగుతాయా! రేపు ఇంకాస్త సౌఖ్యంగా ఉన్న ముసుగు ధరిస్తాము...

ఇది చదువుతుంటే మీ ప్రశ్నలతో పాటే నాకూ చాలా ప్రశ్నలు వచ్చేసాయి...

ప్రయోజకత్వం లేని స్నేహం నిలుస్తుందంటారా?
కాల పరీక్షని తట్టుకోలేని స్నేహం నిలుస్తుందంటారా?

ఆ ప్రయోజకత్వం ఎలాంటిదైనా అవ్వొచ్చు... కష్ట సుఖాలు వినడం మాత్రమే అవ్వొచ్చు, ఇంకేదైనా అవ్వొచ్చు...ఒకప్పడు మంచి స్నేహాలై ఉండి... ఒక పదేళ్ళ తరవాత వెనక్కి తిరిగిచూస్తే ఇద్దరి వృత్తిలోను, ప్రవృత్తిలోను చాలా మార్పులొచ్చి ఉంటాయి... అలాంటప్పుడు పదేళ్ళ కిందటి ఆ నేస్తం, నేను సరిగా ఉండలేకపోవచ్చు... నేను ఇక్కడ కొలుస్తున్నానేమో! ఎలా అంటే..? కాలంతో కొలుస్తున్నాను, కాలం తెచ్చిన మార్పులతో కొలుస్తున్నాను, మా ఇరివురిలో వచ్చిన మార్పులతో కొలుస్తున్నాను... ఈ మార్పులు ఊహించలేని అప్పటి నా నేస్తం, ఇప్పుడూ నన్ను అలానే ఊహిస్తే, అతను నీరస పడతాడు... నేనూ నీరసపడతానేమో, నా విషయాలు పంచుకోడానికి వెళ్ళినప్పుడు అతను అర్ధం చేసుకోలేకపోతే... ఒకప్పుడు మా స్నేహంలో ఉన్న పంచుకోలు మాధుర్యం ఇప్పుడు లేదు... ఇక్కడ ఇద్దరూ అప్పుడు ఖచ్చితంగా ఈ కవితలోలాలాంటి ప్రశ్నలు వేస్తారు...

అవసరాలు తీరనప్పుడూ ప్రేమని పంచగలరా? మనలో చాలా ప్రేమ ఉండొచ్చు... కానీ పంచే ఓపిక మనకుంటుందా? మీరు గమనించారా? మన అవసరాలు తీరనప్పుడు మన ప్రేమని పంచగలగడానికి చాలా మనో నిబ్బరం, నమ్మకంతో పాటూ, ఈ క్షణం మనపై ఉన్న భారాన్ని మరిచిపోగలగాలి... అవి అందరికీ ఉండవు... అందరినుండీ ఆశించలేము...

అవసరాలు,కోరికలు అనేవి ఒకే ఇంట్లో ఉన్న, ప్రతీ సభ్యుడికీ వేరుగా ఉంటున్నప్పుడు, నాకిష్టమైన అమ్మయికో, లేక ఇంకో అమ్మాయికి ఇష్టమైన అబ్బాయికో వారికి అవసరమైనవి వారికి ఉంటాయి... అలాంటప్పుడు, వాళ్ళ ప్రేమకి ప్రయత్నించి, విఫలమైనప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తారు... విఫలమవ్వకపోయినా, నిత్యం ఆ అవసరాలు తీర్చడంలో అలసిపోయి ఇలాంటి ప్రశ్నలు వేస్తారు... అవసరాలతో, డబ్బుతో, కోరికలతో ప్రేమని కొనలేకపోయానని, కొనలేకపోతున్నాని బాధపడతాడు... ఆ బాధ తనకి కావలసింది తనకి దక్కడంలేదనో, తనకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళ అవసరాలు తీర్చి( ప్రేమని ఎలా వ్యక్తపరచాలి అనేది ఒక పెద్ద ప్రశ్న... వందల పుస్తకాలు రాయొచ్చేమో) ప్రేమగా చూసుకోలేకపోతున్నాననో...

ఎవరికి వారు సంపూర్ణులు అయితే గానీ, మనకి విముక్తి కలగదు... కానీ మనం సంపూర్ణులు అవ్వడానికి సమయం పడుతుంది... ఈలోగా పదిమందిని కలవడం తప్పదు...వారినుండి ఆశించడం తప్పదు... ఈ ప్రశ్నలూ తప్పవేమో..!


చాలా పెద్ద వ్యాఖ్య రాసేసాను... అసలు ఏమైనా అర్ధమైతే సరే, లేకపోతే మరిచిపోండి...

మీనాక్షి said...

baundi mahesh garu........

కొత్త పాళీ said...

నిజం.

నిషిగంధ said...

చాలా బావుంది మహేష్.. నాకనిపిస్తుంది అలా నేను కాసేపన్నా మాస్క్ తీసి పక్కన పెట్టేది బ్లాగేటప్పుడు, మొక్కలని సవరిస్తున్నప్పుడని.. మిగతా సమయాల్లో పక్కన పెట్టే సమయం కూడా ఉండదు!!

కత్తి మహేష్ కుమార్ said...

@దిలీప్; ఇలాంటి కవితల్లో ప్రవాహం గతి తప్పాలి.లేకపోతే harmony కనబడుతుందేతప్ప అసహనం వినిపించదు.
ఇక నువ్వు చెప్పిన స్నేహం, ప్రేమల్లో మార్పులు సహజం. అవే చాలావరకూ నిజం కూడా. కానీ ఈ conditioned బంధాల స్థాయిని దాటి unconditional సంబంధాలను కోరుకోవడం ఒక aspiration. అదొక తీవ్రమైన కోరిక,ఆశ. అది నిజం ఎప్పుడూకాకపోవచ్చు. కానీ striving for that one unconditional relationship is the driving force. అంతే!

జీవితమంటే, సంపూర్ణత్వంకోసం మనిషిచేసే ప్రయత్నం. కానీ, మనకున్న గడువులో ఎప్పుడూ సంపూర్ణులు కాలేం. ఈ ప్రయత్నం, ప్రశ్నలే మనిషి గుర్తులుగా మిగిలేవి. అందుకే అడగాలి,అనుభవించాలి.

@మీనాక్షీ, నెనర్లు

@కొత్తపాళీ గారూ, మీతోనే ఈ కవిత మొదలయ్యింది.

@నిషిగంధ; నిజమే, అప్పుడప్పుడూ కనీసం ఏకాంతంలోనైనా, ఈ మాస్క్ తీసెయ్యకపోతే మనల్ని మనమే గుర్తుపట్టుకోలేని క్షణం వస్తుంది. తరువాత బతికినా ఒకటే చచ్చినా ఇకటే!

@ఒరేమునా; నెనర్లు. మీరు చెప్పినట్లే alignment మార్చాను.

saisahithi said...

బాగుంది,
ఉదయాన్నే ఒక చిరునవ్వుతో మొదలయ్యే ప్రయాణం..ఇది కూడా స్వార్థంతో మురిగి పోయిందే..ఆరోజు తన నటనాచాతుర్యాన్ని నెమరు వేసుకుంటూ..మిగిలిన సన్నివేశాల్ని మర్నాటికి బదిలి చేసుకుంటూ.. ముగిస్తుంది...ఇదే జీవితం. అయితే.. ఇది కొన్ని వర్గాల జీవితాల కు మాత్రమే పరిమితం అనిపిస్తుంది.ఎందుకంటే ఈ వర్గాల జీవన సమీకరణాలు ఇలానే ఉంటాయి. ఇదొక బార్టర్ జీవన విధానం. ఇక్కడ అభిమానాలు,ప్రేమలు, స్నేహాలు..అన్నీ ఇచ్చి పుచ్చు కోవడమే..
It comes to my mind.. Henry David Thoreau said..Man lived senseless and dependent lives..
(He proved in his life that a man can lead an independent life without any possessions and relations)
But beyond these layers of the society there is something..to think about.. wherein we find some people like..
Socrates who limited his life for the sake of the truth...
Martin Luther King Jr. who sacrificed his life for his fellow beings..
Yet there is a (living) legend Mother Teresa who led an unrelenting struggle for life to love people..
ఈ జీవితాలు ఏదో కొత్త నీరు నింపుతాయి..
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వారికి పని చూ పిద్దామని ప్రయత్నిస్తే.. వారు నన్నొదిలి పారిపోయిన సందర్భాలు బాధని మిగుల్చు తుంటాయి..అయినా..I am optimistic..I think hope stems from desperation.
మీ బ్లాగు చాలా బాగుంటుంది. చాలా మంచి విషయాలు చర్చిస్తారు.
keep blogging.

రాధిక said...

nijam...nenu ade koarukunaanu.just ippude ilaantide oka kavitaraasi draft lo petti ilaa raagaane mii kavita.

radhika
http://snehama.blogspot.com

బొల్లోజు బాబా said...

మీ కవిత చాలా బాగున్నది.
జీవన వైరుధ్యాలని, సంక్లిష్టతలను చక్కగా భంధించారు.
దిలీప్ గారి పెద్ద కామెంటు బాగుంది.
సాయిసాహితి గారి విశ్లేషణ బాగుంది.


పుట్టుకతోనే ఉమ్మనీటి సంచిని తొలగించి
తొడుగు తగిలించేస్తాం.
తొడుగు అటు పారదర్శకమూ కాదు
ఇటు కాంతినిరోధకమూ కాదు.
నాచూపుకూ నీకు మధ్య తొడుగు.
నాస్పర్శకూ నీకు మద్య తొడుగు.

నీకూ నాకు మద్య తొడుగు ఒక ఇనపతెరై
అమానవీయ వృక్షాన్ని మొలిపిస్తూంటుంది.
అదేకదా అందరికీ కావలసింది
అదేకదా
ఇంటిలో,బడిలో, గుడి లోను
ఇచ్చే పావ్ లోవ్ కండిషనింగ్.

జాగ్రత జాగ్రత తొడుగుకు గానా
చిల్లు పడిందా సుఖమయజీవనం కాస్తా.......


బొల్లోజు బాబా

పూర్ణిమ said...

అవునూ.. ఏ మాస్కులూ లేకపోతే.. మనం ఎంత మందికి నచ్చుతాము? మనం ఎందరిని "accept" చేస్తాం?? అందరి దగ్గరా.. మనం మనలా ఉండగలమా?? అందరూ అలా ఉంటే.. భరించే / సహించే ఓపిక మనకుందా?

"నేను నేను" గా కేవలం నాకే సొంతం.. నా ఏకాంతంలో నేను మాత్రమే చూసుకోగలను. ప్రపంచానికి ఎందుకు నాలోని అన్నింటి గురించి?

>>నేను కావాలి...నాకు నేనుమాత్రమే కావాలి... హమ్మ్.. మీ లోకంలో అది పూర్తిగా సాధ్యం. ఆ సమయాన్ని కూడా ఈ లోకంలో వెచ్చించేస్తే.. ఇలాంటి నిస్పృహ తప్పదు.
నాకీ జీవితం వద్దు అనడంలో మీ ఉద్ధేశ్యం??

ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ.. మీరు రాసినదానికి ప్రేరణ ఇంకా తెలుసుకోవాలనుంది.. అందుకే ఈ ప్రశ్నలు.

కత్తి మహేష్ కుమార్ said...

@సాయి సాహితి; మీవివరణ నా కవితకు కొత్త అందాన్ని తెచ్చింది. నిజమే, ఈ జీవితనటన అందరి మానవుల్లోనూ ఉన్నా, దీని ప్రత్యేక అవసరం మధ్యతరగతికి చాలా ఉంది. అనుక్షణం అడ్జస్ట్ అవుతూ జీవించే ఈ వర్గం అప్రయత్నంగా ఆస్కారు రేంజి నటనను తమ జీవితాలలో పొందుపరుచుకుంటారు. వారిలో నేనూ ఒకడిని.అప్పుడప్పుడూ జ్ఞానం తెచ్చిన చైతన్యంలో మనం ముఖానికి తగిలించుకున్న మాస్కులు మనసుకు గుచ్చుకుని...బాధ అనిభవానికొస్తుంది. నిజం స్ఫురణకొస్తుంది.

@పూర్ణిమ; పైనున్న పరిస్థితుల్లో గొప్పవాళ్ళం కాలేక, సాధారణంగా బ్రతకలేక విభేధించే విలువల మధ్య చస్తూబ్రతుకుతుంటే...అప్పుడప్పుడూ "నాకీ జీవితం వద్దు" అనిపిస్తుంది. కానీ అదే క్షణంలో "నేను నేనుగా బ్రతికే జీవితం కావాలి" అనిపిస్తుంది. అదే మధ్యతరగతి జీవితాల్లోని విరోధాభాసం.అలాగని అంగీకరించి బ్రతికేస్తే మనకూ చాలా మందికీ పెద్ద తేడాఉండదు. అందుకే ప్రశ్నించాలి...మన ఉనికిని మనమే ప్రశ్నించి...మార్పుకోసం ప్రయత్నించాలి. అందులో విజేతలం కాకపోవచ్చు, కానీ ప్రయత్నించిన తృప్తి చాలు జీవితానికి.

@రాధిక; మీ కవిత కోసం ఎదురుచూస్తున్నాను. నెనర్లు.

@బాబాగారూ; నెనర్లు. నా కవితకు మీకవిత మరింత లోతునిచ్చింది.తొడుగుల్లోని మర్మాన్ని ఇంత నర్మగర్భంగా చెప్పడం మీకే చెల్లు.

కొత్త పాళీ said...

బాబా గారూ .. తొడుగుకి గానీ చిల్లు పడిందా ...??
బాగుంది
మహేష్ .. అవును .. ఆయనంతా నర్మ "గర్భమే" మరి :)