Thursday, July 31, 2008

గోడలు


నీ చుట్టూ ఆరడుగుల అభిప్రాయాల గోడ.
అయినా, తలుపు తెరిచి ఆహ్వానించావు.
రావాలో వద్దో నాకు తెలీదు.
ఒకవేళ వస్తే...మళ్ళీ బయటపడగలనా?
అదీ తెలీదు!
నా కోటకన్నా ఎత్తైన భావాలతో కదలి వచ్చినా...
నీ అభిప్రాయాల గోడజాడనైనా మిగులుస్తానా!?
లేక...మన ఇద్దరి రాపిడి కలయికకు గోడలు బీటలువారి
నిజాలు గోచరిస్తాయని ఆశపడనా!
లేదూ... ఇద్దరి అభిప్రాయాలూ,భావాలూ మన కలయిక తీవ్రతకి
పగిలి శిధిలమై, కేవలం అనుభూతులే మిగులుతాయని కోరుకోనా!!
అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను.
మనం కలవాలి.
కలిసి తెలుసుకోవాలి.
తెలిసి అనుభవించాలి.
బంధింపబడటమో!
జాడైనా మిగలకపోవడమో!!
నిజాలు గ్రహించడమో!!!
లేక శిధిలమై...భావాభిప్రాయ రహితులై
కేవలం అనుభూతుల్నే మిగుల్చుకోవడమో జరగాలి.
మనం తప్పక కలవాలి.
ఈ గోడల్నిదాటి ఆ కలయిక జరగాలి.



*****

Sunday, July 27, 2008

'Male'కొలుపు Part 2


మనిషి శరీరంలో హార్మోన్లూ వాటి రాజకీయాలు



ఆడా, మగా మధ్య అంత సులువుగా మార్చడానికి వీలులేని భౌతిక మరియూ మానసిక తేడాలు, భేధాలూ ఉన్నట్లు మనం Part 1 లో చర్చించాం. ఈ మార్పుల్ని తమతమ శరీరాల్లో నిర్విరామంగా reinforce చేసే, ‘హార్మోన్ల’ గురించి ఈ భాగంలో తెలుసుకుందాం.



ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో మగవారి శరీరంపై ఆధిపత్యాన్ని చలాయించే హార్మోన్ గా టెస్టోస్టెరాన్ (Testosterone) ని గుర్తించారు. ఈ హార్మోన్ కున్న రెండే రెండు లక్షణాలు. ఒకటి అనుభవించడం. రెండు నాశనం చెయ్యడం. కొంచెం ఘాటుగా చెప్పాలంటే, "Fuck it or Kill it" అనేవి ముఖ్యలక్షణాలన్నమాట. ఇంత తీవ్రమైన శారీరక అవసరాల్ని ప్రేరేపించే హార్మోన్లని మోస్తున్న మగాడి ప్రవర్తన చిత్రంగానూ, అప్పుడప్పుడూ ఎబ్బెట్టుగానూ ఉండటంలో పెద్ద వింతలేదనుకుంటా! ఈవ్ టీజింగ్ గురించి జరిగిన చర్చలో మగాళ్ళలో ఎక్కువ sexual frustration ఉంటుందని చెప్పడానికి కారణం కూడా ఈ హార్మోనే.



ఈ మగ హార్మోన్లని, ఆడవారిలో జడత్వం (Frigidity) పోగొట్టడానికి చేసే చికిత్సలో భాగంగా వాడతారుకూడా. అంతేకాక, ఈ హార్మోల్ ప్రభావం వల్ల మగవారిలో సున్నితత్వం పాళ్ళు తగ్గడంతో పాటూ, sex కు ‘అవసరాలే’ తప్ప ‘భావనలతో’ చాలావరకూ సంబంధం లేకుండాపోతుంది. ఆడవాళ్ళల్లో ఈ పరిస్థితికి విపరీతంగా ఆలోచనలుంటాయి. ప్రేమించే మనిషితోతప్ప ఆడవారు సంబంధాలు ఏర్పరుచుకోలేరు. కానీ మగవారు అందుకు కొంత మినహాయింపు. ఈ ప్రవృత్తికి ముఖ్యకారణం ‘టెస్టోస్టెరాన్’ అనే హార్మోన్.



మగవారి హార్మోన్ కు ఇంచుమించు సరిసమానమైన ఆడ హార్మోన్ పేరు, ఆక్సీటోసిన్ (Oxytocin). దీన్ని“రెలేషన్ షిప్ డ్రగ్’ లేదా ‘హార్మోన్ ఆఫ్ లవ్’ అని పిలుస్తారు. ప్రేమ, సంరక్షణ, మానవసంబంధాలపట్ల నిబద్దతలాంటి విలువల్ని ఆడవారి శరీరంలో నిత్యనూతనంగా స్రవించే హార్మోన్ ఇది. మగవారిలాగా "slam-bam-thank-you-ma'am" వంటి ఇన్స్టెంట్ సంబంధాలపైపు కాక ఒక నిర్ధుష్టమైన సుదీర్ఘసంబంధాలపట్ల ఆడవారిలో అనుకూలత ఉంటుంది. అందుకే మాతృత్వం వంటి సంబంధాలను కేవలం ఆడవారే పోషించగలరు వీరిలో మాతృత్వానికి(mothering) కావలసిన ఓపిక, నిబద్ధత, ఫోకస్ వీరిలో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు హఠాత్తుగా మగవారిలో రావాలంటే కష్టమే!



కాకపోతే, ఇప్పుడు మారిన ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా మగవాడు మిస్టర్ సెన్సిటివ్ (Mr.Sensitive) అవతారం ఎత్తాల్సిందే. లేకుంటే చాలాచోట్ల నిరసించబడటంతో పాటూ, రిజెక్ట్ చెయ్యబడతాడు. ఆడవాళ్ళుకూడా ఈ పరిస్థితుల దృష్ట్యా తమకు అసహజలక్షణాలైన స్వతంత్ర్య అధికారాన్ని అందిపుచ్చుకోవడంతోపాటూ, తమ జీవితాల్ని సంబంధాల ప్రాతిపదికే కొలమానంగా చూడటాన్ని త్యజిస్తున్నారు. అంటే తమల్ని కూతుళ్ళుగా,భార్యలుగా,కోడళ్ళుగా,తల్లులుగా చూడటాన్ని నిరసించి, ఒక స్వతంత్ర్య భావాలున్న మహిళగా గుర్తించాలనే ప్రయత్నం చేస్తున్నారు.



సధారణంగా సమాజంలోని మార్పుని జీవితంలో ఒక భాగంగా చేసుకున్న మహిళకు ఈ మార్పుని జీర్ణించుకోగలిగిన శక్తి ఉంది. కూతుర్నించీ కోడలిగా, కోడల్నించీ తల్లిగా మారే క్రమంలో సమాజంతో తన వ్యక్తిత్వాన్ని negotiate చెయ్యగలిగిన స్త్రీకి, ఈ మార్పుని అందిపుచ్చుకోవడం సులువయ్యింది. అంతేకాక, సామాజికంగా స్త్రీవాద ఉద్యమాలూ, ఆలోచనలూ ముందే కొంత దారిని ఏర్పరిచాయి. కానీ మగాడి పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు సాంప్రదాయక విలువలూ-నమ్మకాలూ, మరోవైపు అతని శరీరంలోని హార్మోన్లూ ఈ మార్పుని అంగీకరించడానికి అడ్డంకులు ఏర్పరుస్తుంటే కాలానుగుణంగా త్వరితగతిన మారలేక, మారే దారెలాగో తెలీక అనుక్షణం నిరసింపబడి, "తనే కారణం" అని నిందలు ఆపాదించబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.



అందుకే ఈ పరిణామక్రమంలో మగవాడ్ని మేల్కొపడం ఎంతైనా అవసరం. ఫెమినిస్టుల నిరసనలనుంచీ, ఆడవారి అర్జంటు expectations నుంచీ తనని కాపాడి తెలియజెప్పడం, మార్పుకి తయారు చెయ్యడం అత్యంత అవసరం. అలా తయారు చెయ్యడానికి గల మార్గం మేమిటో? ఈ సమాజం యొక్క పరిణామక్రమంలో ఆడామగా ఇద్దరూ ఎలా తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఈ మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించొచ్చో Part 3 లో చర్చిద్దాం.




‘మార్పులో మర్మాలు’ Part 3 త్వరలో


********

‘Male’కొలుపు Part 1

"మగాడు మారాలి ! ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. సెన్సిటివ్ గా ఉండాలి. సంబంధాలకి విలువనివ్వాలి. ఇంటిగురించి పట్టించుకోవాలి." ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చాలాసార్లు వినిపించేమాటలే ఇవి. ఈ మాటల తాత్పర్యం ఏమిటయ్యా అంటే! "మగాడు ఆడవారిలోని ఉత్తమలక్షణాలన్నీ పుణికితెచ్చుకుని అర్జంటుగా మారిపోవాలి" అని. మారుతున్న అవసరాలూ, కాలమాన పరిస్థితుల దృష్ట్యా చాలా సబబైన మార్పే అని అంగీకరించినా, ఇది అంత సులువుగా అయ్యేపనేనా? ఒకవేళ జరిగినా, ఈ మార్పుకుగల మార్గాలేమిటి అనేది million dollar question.



తెలుగులో సాధారణంగా వాడే పదాలు ఆడా,మగా. ఈ పదాలకి లింగపరమైన తేడా ఉందేతప్ప వ్యవహార మరియూ లక్షణపరమైన భిన్నత్వంలేదు. దీన్ని ఇంగ్లీషులో ‘Sex’ అంటారు. కానీ లక్షణపరమైన తేడాని తెలియజెప్పే 'Gender' అన్నపదానికి తెలుగులో ఎటువంటి సమానార్థకమూ లేదు. ఇందులో ఒకటి శారీరక నిర్మాణానికి సంబంధించిన సూచకమైతే, రెండవది సామాజిక, సాంస్కృతిక లక్షణాలకి సంబంధించినది. సింపుల్గా చెప్పాలంటే మగాడికీ - పురుషత్వానికీ, ఆడదానికీ -స్త్రీత్వానికీ ఉన్న తేడాయే Sex కి Gender కీనూ.



లింగ(sex)పరమైన భేధాలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే! మగాడు శుక్రకణాల్ని విడుదలచేస్తే, ఆడవారు అండాన్ని విడుదలచేసి తద్వారా పిల్లల్నికని పాలిస్తారు. ఈ తంతుకు అనకాపల్లైనా, అమెరికా అయినా ఒక్కటే, ఏమాత్రం భేధం లేదు. కాకపోతే స్త్రీత్వం (feminine), పురుషత్వం (masculine) లాంటివి ఇదివరకూ చెప్పినట్లు సామాజిక,సాంస్కృతిక సంబంధమైనందువల్ల తేడాలు ప్రతి ప్రాంతానికీ కొట్టొచినట్లు కనిపిస్తాయి.



ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జెండర్ పాత్రను మార్చాలనుకున్నా, సంస్కరించాలనుకున్నా, సవరించాలనుకున్నా మార్పుతేలేని లింగభేధాలలోని మౌళిక అంశాలని నేపధ్యంలో ఉంచుకోవాలి. అలాకాకుండా, మొత్తంగా ఆడామగల్లోని ‘తేడా’లను మార్చాలనుకుంటే, మొదటికే మోసమొచ్చే అవకాశం ఉంది. కాకపోతే,ఆడామగా మధ్యగల బౌతిక తేడా ప్రాతిపదిక ఎంత గట్టిగాఉందంటే, అవి విశ్వవ్యాప్తంగా కొన్ని సమానాంతర సాంస్కృతిక విధాల నిర్మాణానికి (parallel cultural phenomenon) దోహదమయ్యిందనిపిస్తుంది. అంటే, ఈ జెండర్ వివక్షకు (gender discrimination) గల కొన్ని రూపాలు అమెరికాకూ, అనకాపల్లికీ ఒకటిగా తయారయ్యయన్నమాట. Making it all the more complicated.



ఇప్పుడు మన సమాజంలో ఉన్న సమస్యల్లా, ఇన్ని తరాల conditioning వలన ఏర్పడిన లక్షణాల్ని,కాలానుగుణంగా మార్చడానికి ప్రయత్నించడం. అంతేకాక, వీటితోపాటూ ఉన్న కొన్ని అపోహల్నికూడా నిజాలుగా భ్రమించి సమూలంగా మార్చడానికి యత్నించడంకూడా ఈ turmoil కి కారణం కావచ్చు. ఉదాహరణకు," శారీరక నిర్మాణం ప్రకారం మగాడు బలవంతుడూ, స్త్రీ సున్నితమైనదీ అయినంతమాత్రానా, ప్రతి మగాడూ ధృడంగానూ, ప్రతి మహిళా సున్నితంగానూ ప్రవర్తించాలి" అంటే సమస్య ఖచ్చితంగా వచ్చినట్లేకదా ! ఈ మార్పుల్లోని ఆశయాల్ని కాస్త తీవ్రభావజాలం(extreme ideology) గా మార్చి ,అటు ఫెమినిస్టులూ (feminist) ఇటు మేల్ చౌవ్వనిస్టులూ (male chauvinist) ఒక జెండర్ యుద్దాన్ని సృష్టించేశారు.



ఈ సంక్లిష్టమైన సామాజిక సమస్యను ఒకేకోణంలోంచి చూసి "నిర్మూలించాలి" అనుకోవడం సమర్థనీయం మాత్రం కాదు. "తప్పంతా మగాడిదే!" అనే ఎద్దేవాకూడా సరైనది కాదు. He has a reason to be the way he is. మార్పు అవసరం అని అంగీకరించిన నాడు, ఆ మార్పును ఇరువేపులనుంచీ కూలంకషంగా అర్థం చేసుకుని, అప్పుడు దాని దిశగా ప్రయత్నాలు చెయ్యాలి. అలాక్కాకుండా యుద్ధాలు చేస్తే మిగిలేది క్షతగాత్రులేతప్ప, మారిన సమాజం మాత్రం కాదు. అందుకే, మార్పు నేర్పిస్తే వస్తుందేతప్ప నిరసిస్తేకాదు అంటారు.



విశ్వవ్యాప్తంగా స్త్రీవాదులు కూడా అంగీకరించే కొన్ని నిజాలేమిటంటే, సెక్స్ జెండర్ అనే భేధం లేకుండా, ఆడా మగల విలువల పరిధి (value sphere)లో చాలా బలమైన తేడాలున్నాయి. మగాడు మితిమీరిన వ్యక్తిత్వం, స్వతంత్ర్య అధికారం, హక్కులూ, న్యాయం మరియూ వ్యవస్థలమీద ఎక్కువగా తన సహజమైన అనుకూలతని చూపుతారు. ఆడవాళ్ళు మానవ సంబంధాలూ, సంరక్షణ వంటి విలువల పరిధిని కలిగిఉంటారు. అంతేకాక, మగాళ్ళు మానవసంబంధాల పట్ల స్వతహాగా భయాన్ని కలిగిఉంటే, ఆడవారు స్వతంత్ర్య అధికారానికి (autonomy) దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ సిద్ధాంతాన్ని evolutionary psychology అంటారు. మానవ పరిణామ క్రమంలో,సహజ భౌతిక లక్షణాలవల్ల ఏర్పడిన మానసిక మార్పులను ఈ శాఖ/విభాగం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట.



కాబట్టి, ఇక్కడ సమస్య మగ ఆడగా మారడమో లేక ఆడ మగగా మారడమో కాదు. ఇద్దరికీ ఉన్న విలువల్ని ‘సమానంగా గౌరవించబడడం’. ఇద్దరి మధ్యనున్న తేడాను చెరిపివేయడం కాదు. రెంటిలోనూ సమానతని తీసుకురావడం. కాబట్టి, ఈ మార్పుతీసుకురావడానికి అవసరమైన మార్గాలు వెదకడం ఇద్దరికీ అవసరం. ముఖ్యంగా ఇది మగాడికి చాలా అవసరం ఎందుకంటే, ఈ విలువలు మార్చుకునే దశలో ఎక్కువ trauma కి గురయ్యేది మగాడే కాబట్టి!. ఎందుకంటే ఆడవారిలో సహజంగా ఉన్న assimilating శక్తి మగాడిలో తక్కువగా ఉండటంతో పాటూ, ఖర్మగాలి మగాడి హార్మోన్లు కూడా అతనికి సహకరించని పరిస్థితిలో ఉన్నాయి.



మగాడి హార్మోన్లూ, వాటి పాలిటిక్స్ గురించి Part 2 లో చర్చిద్దాం.


******

Thursday, July 24, 2008

సినిమా ‘భాష’

మొన్న నేను వెళ్ళిన బెంగుళూరు UNDPవారి Water forum లో ఒక ఆసక్తికరమైన సంవాదం జరిగింది. ఢిల్లీకి చెందిన WASH Institute అనే సంస్థ, తెలుగులో పారిశుధ్యం (sanitation) గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో ‘పారిశుధ్య మార్గదర్శి’ అనేది గ్రామ స్థాయిలో ఉన్న సమాజసేవకులు/సేవికలూ ప్రజలకు మరుగుదొడ్లను నిర్మించుకుంటే వచ్చే లాభాలను,ఆరోగ్యంపై పారిశుధ్యం యొక్క ప్రభావాన్నీ తెలియజెప్పే పుస్తకం ఇది. ఉత్సాహంగా ఆ పుస్తకాన్ని అందిపుచ్చుకున్న నాకు ఒక్క క్షణం కాస్త ‘షాక్’ తగిలిందని చెప్పొచ్చు.




మొదటి పేజీలోనే మరుగుదొడ్ల ఉపయోగం గురించి బెబుతూ ఇలా ఉంది, "మలమూత్ర విసర్జన అనంతరం, శౌచాలయంలో తగినంత నీరు ప్రోయవలయును". నాకు మొదట వచ్చిన అనుమానం "ఈ భాష మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడవాడతారా ?" అని. అదేమాట ఆ సంస్థ ప్రతినిధిని అడిగాను. అతను ఒక తమిళుడు, పేరు కలిముత్తు. "ఈ పుస్తకాన్ని అనువాదానికని తెలుగు మీద మంచి పట్టున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ కు ఇచ్చాము. తను అనువాదాలలో దిట్ట. మీకు దీనిమీద ఏమైనా అభ్యంతరాలున్నాయా?" అని చాలా మర్యాదగా అడిగారు. "అనువాదం సంగతి సరే కానీ మీరు ఈ మార్గదర్శిక ఉద్దేశించిన జనాలకు ఈ భాషనిజంగానే అర్థమవుతుందనుకుంటున్నారా?" అని అడిగాను.




దానికి అతను, "ఈ మార్గదర్శికని ప్రింట్ చేసేముందు విజయవాడలోని ఒక స్లమ్ లో ప్రయాగించాము, అక్కడ అందరికీ అర్థమయ్యిందన్న తరువాతే పెద్దస్థాయిలో పబ్లిష్ చేసాము" అని నాకు సమాధానం లభించింది. చాలా సహేతుకంగా అనిపించినా, మనసులో ఏదొ అనుమానం నన్నుపీడిస్తూనే ఉంది. అంతలో నాతోపాటూ వచ్చిన ఒక హిందీ మిత్రుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక ఉత్తరువు చదువుతూ కనిపించాడు. ఆ హిందీకూడా నా మిత్రుడు ‘మాట్లాడే’ హిందీకాదు. కానీ దాన్నొక ప్రామాణిక హిందీగా (ప్రభుత్వం వాడుతోంది కాబట్టి) అంగీకరించాడు. "బహుశా మన ప్రామాణిక తెలుగు పరిస్థితీ అదేనేమో!" అనిపించింది.




కాకపోతే ఇది ప్రభుత్వాధికారులకు ఉద్దేశించిన పుస్తకం కాదు. ఈ మార్గదర్శి ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రజల్లో పారిశుధ్యం పట్ల అవగాహనా, వారి ‘పొద్దున్నే చెంబెత్తుకుని పోలాలెమ్మటవెళ్ళే’ అలవాటునుంచీ ముక్తి పొందడానికి ప్రేరణాఇవ్వవలసిన కొందరు సాధారణ యువతీయువకులు వాడాల్సిన పుస్తకం. "దీనిలో ఈ భాషా ప్రామాణికత అవసరమా?" అనేది మరొ సందేహం. దీనికితోడు "ఇది చదివిన విజయవాడ జనులు అర్థమైపోయిందని అంత గట్టిగా ఎలాచెప్పారా?" అనేది మరొక అనుమానం.



ఇదే సందేహాలతో మళ్ళీ తనని పట్టుకుపీడించేసరికీ విసుగెత్తిన ఆ మనిషి వెటకారంగా "మీ తెలుగులో మూడు మాండలికాలున్నాయి. వాటన్నింటులో మేము రాయించి ప్రింట్ చెయ్యాలంటే...ఆరిపోతాం" అన్నాడు. తను చెప్పింది నిజమే! ప్రామాణికత అనేది ఒకటుండాలి. కాబట్టే, మనం ‘రాసే భాషని’ ఇలా standardize చేసాము. కానీ ఇక్కడ నా సమస్య ‘మాట్లాడే భాష’ ను Standardize చెయ్యటం గురించి. మాట్లాడే భాష వాడకుంటే, ఆ చదివే సామాన్యులకు అర్థం కాదు అనేది నా గట్టినమ్మకం. "వాడేవారికే అర్థం కానప్పుడు, అది చదివి ప్రజలకెలా తెలియజెబుతారు?" అనేది నా మూల ప్రశ్న. If the purpose is to communicate an idea..the language used in the booklet surely doesn't help.



దీనిమీద నేను చర్చకు తెరతీసేసరికీ అక్కడ ఒక పెద్ద గుంపొకటి తయారయ్యింది. అంతలో మళ్ళీ నేనే "మీ తమిళనాడు పరిస్థితేమిటి?" అనడిగాను. దానికతను "మాకూ మధురై తమిళ్, కన్యాకుమారి తమిళ్ అలాగే చెన్నై తమిళ్ ఉన్నాయి" అన్నాడు. "ఐతే అందరికీ అర్థమయ్యే భాష...!" అంటే దానికి "సెందమిళ్" అంటూ అదే పుస్తకాల తమిళ్ విషయం చెప్పాడు. అప్పుడు నాకు తట్టిందొక ఆలోచన. "మరి సినిమాల భాష అందరికీ అర్థం కాదా?" అనడిగాను. ఒక్క క్షణం ఆలోచించి, "ఆ..సినిమా భాష అందరికీ అర్థమవుతుంది. అక్కడక్కడా యాస ఉన్న పాత్రలు తప్ప సినిమా అంతా దాదాపు సాధారణ వాడుక భాషలో ఉంటుంది" అన్నాడు.



"మరైతే...సినిమా భాషని మాట్లాడే భాషకి ప్రామాణికమనుకుని దాంట్లో ఎందుకు రాయకూడదూ?" అనేసాను. ఒక్క క్షణం నిశ్శబ్ధం. "అలాగైతే...మరి భాష సంకరమైపోదా?" అన్నాడు. దానికి నా సమాధానం ఒక్కటే "ఇక్కడ ఉద్దేశం భాషని ఉద్దరించడం కాదు. విషయాన్ని తెలియజెప్పడం. If the purpose is to communicate, use the language that will do the best job of it."



ఆ క్షణంలో చెబుతున్నప్పుడే నాకూ అనిపించింది. "నిజమే కదా!" అని. కానీ, "నిజంగా నిజమేనా? మీరే చెప్పాలి".



*****


Monday, July 21, 2008

నా బ్లాగుకు వారం రోజులు శెలవు


మిత్రులారా,

ఒక అఫిషియల్ పనిమీద నేను వారం రోజులపాటూ బెంగుళూరు నగరానికి వెళ్తున్నాను.
United Nation Development Programme (UNDP) వారు ఏర్పాటుచేసిన India Water Forum, Annual meet కోసం ఈ వారాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది.
భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు.
27 వతేదీ మళ్ళీ బ్లాగులోకంలో ప్రత్యక్షమై బెంగుళూరు విశేషాలతోపాటూ, ఈ అశంపై మరిన్ని విషయాలు పంచుకుంటాను.

ఇట్లు
కత్తి మహేష్ కుమార్



*****

Sunday, July 20, 2008

చర్చ Vs వాదన

నేను ఈ నెలలో కట్నం, పెళ్ళి ప్రాతిపది మరియూ ఈవ్ టీజింగ్ గురించి రాసిన టపాలకు వచ్చిన స్పందనను చూసి, నాశైలి గురించి కొంత పునరాలోచనకు గురయ్యాను. ఆ ఆలోచనల్ని (నేను) అసలెందుకు రాయాలి? అనే టపాలో పంచుకున్నాను. కాకపోతే, నా అనంత ఆలోచనా స్రవంతిలో భాగంగా, ఈ మధ్య మరికొన్ని లోతులు గోచరించాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే తన other side of the spectrum వాదనతో నన్ను నిరంతరం ప్రశ్నించే అబ్రకదబ్ర మాటలు కూడా ఈ ఆలోచనకు కారణమయ్యాయి.



నేనురాసిన టపాలు చాలావరకూ నా అభిప్రాయాలు,ఆలొచనలేకాబట్టి అవి నాపరంగా చేసిన వాదనలుగా అనిపించి కొంతమంది పాఠకులు వాటితో అంగీకరిస్తే, మరికొందరు విభేదించారు. కానీ, నేను నిజంగా ఆశించిన "చర్చ" జరగలేదని భావించాను. అంతేకాక, ఇలా జరగడానికి చాలా సహేతుకమైన కారణంకూడా ఉందనిపించింది. అదేమిటంటే, "ఒక విషయాన్ని నిస్పక్షపాతంగా పరిచయం చేస్తే, దానిపై చర్చకు అవకాశం ఉందేతప్ప , మన తరఫునుండీ ఒక వాదనను ప్రదర్శిస్తే, దానికి ప్రతికూలవాదమో లేక అనుకూలవాదమో మాత్రమే ఎదురయ్యే అవకాశం మాత్రమే ఉంది". బహుశా ఈ టపాల విషయంలో అదే జరిగిందనిపించింది.



అంతేకాక, నా ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ఒక నేపధ్యం, చరిత్ర, అనుభవాలు, నేర్చుకున్న విషయాలులాంటి ఎన్నో విషయాల ప్రభావం ఉంటుంది. కనుక, ఆ నేపధ్యం పరిచయం లేని చదువరులకు అంగీకరించడమో లేక విభేధించడమో తప్ప సామరస్యంగా అర్థవంతమైన చర్చకు పూనుకునే అవకాశం తక్కువగా ఉంటుందని మిత్రుడు అర్వింద్ రుషి కూడా తన వ్యాఖ్యల్లో ఎత్తిచూపారు.



ఇవన్నీ చూస్తే నాకర్థమయ్యిందేమిటయ్యా అంటే, చర్చను ఆశించాలి అంటే టపాలు క్లాసులో చెప్పే పాఠంలా నిస్పక్షపాతంగా రాయాలి అని. కాకపోతే, నాలాంటి ‘ఎదురీతగాడు’ అలా చెయ్యడం కష్టమే ! ఇదివరకటి టపాలో చెప్పినట్లు, "బలంగా విశ్వసిస్తేనో లేక వ్యతిరేకిస్తేనో తప్ప నాకు రాయాలనిపించదు". కాబట్టి చర్చజరగాలనే ఆశ నేను ఒదులుకోవడానికి సిద్ధపడుతున్నాను. నేను నా వాదనల్నే వినిపిస్తాను. అనుకూలవాదనలకి స్పందిస్తాను, ప్రతివాదనలకి ప్రతిస్పందిస్తాను. రెంటికీ నేనే న్యాయాధిపతిని కాబట్టి...అంతిమ విజయం నా బ్లాగులో నాదే!


*********

ఆంగ్లమే అధికార భాషగా ఉండాలి!


అంగ్లమంత సౌలభ్యం ఇంకేభాషలో అయినా ఉందా!? !

ఏమీ చెప్పకుండా, కనీసం వందపేజీలు రాయొచ్చు.
‘అవును’, ‘కాదు’ అనే పదాలు ఉపయోగించకుండా, నిర్ణయాన్ని వాయిదా వెయ్యొచ్చు.
ఒకే పదానికి కనీసం మూడు,నాలుగు అర్థాలు చెప్పొచ్చు.
ఆదర్శాన్ని మాటల్లో మాత్రంమే చెప్పి, అసలు నిజాన్ని మరుగుపర్చొచ్చు.

ఇంతకంటే అర్హత అధికారభాషకి ఇంకేంకావాలి?



మన తెలుగు భాషలో ఇన్ని సౌలభ్యాలున్నాయా అసలు!?!

మన తెలుగు ప్రజల్లో ఉన్న లౌక్యం మన తెలుగు భాషలో ఉందా ?
ఖచ్చితమైన అభిప్రాయాలూ,ఆలోచనలూ,నిర్ణయాలూ చెప్పకుండా కనీసం ఒక పేరా అయినా తెలుగులో రాయగలమా?
ఇది తప్పు,ఇది రైటు అనే అభిప్రాయాలేతప్ప maybe, probably,most probably,most likely,possibly లాంటి అసృష్టమైన సమాధానాలు మనదగ్గర అసలున్నాయా?
తెలుగులో ఏదైనా విషయం చెప్పేస్తే, ఇరుక్కుపోకుండా తప్పించుకోగలిగే 'possible deniability' అవకాశం ఉంటుందా?
ప్రతిపదార్థాలూ, తాత్పర్యాలేతప్ప, మన భాషలోని పదాలకి నానార్థాలు తక్కువే...ఇలాంటి భాష అధికారభాషగా పనికొస్తుందంటారా?
కరుకు కార్యాల యంత్రాంగం పనిలో, కమ్మనితియ్యని తెలుగెవరికి కావాలి?
"దీని భావమిదే తిరుమలేశా!" అని ఫాలో అయిపోతామేగానీ, "మరోటెందుకు కాదు వెంకటేశా?"అని ప్రశ్నించడమే నేర్చుకోని భాష, అధికారభాషా గోదాలో మట్టిగర్తుస్తుందేగానీ బతికి బట్టకట్టేనా?



అందుకే అధికారభాషగా ఆంగ్లమే ఉండాలి.

ప్రభుత్వాలూ,లాయర్లూ, అదికారులూ దర్జాగా బతకాలి.
ప్రజలకు ప్రభుత, యంత్రాంగం, చట్టాలూ అర్థంకాకుండానే ఉండాలి.
మనం ఇలాగే కళ్ళకి గంతలు కట్టుకుని, విజయవంతంగా బతకాలి.
అందుకే...అధికారభాషగా ఆంగ్లమే ఉండాలి.


********

Saturday, July 19, 2008

ముఖానికి కొన్ని రంగులద్దుకుని...!


ముఖానికి కొన్ని రంగులద్దుకుని,
వీలైతే ఒక మాస్క్ తొడుక్కుని,
ఎదురైన ప్రతిఒక్కరినీ...పలకరిస్తాను.
ఉదయాన్నే ఒక చిరునవ్వు,
మధ్యాహ్నం ఒక ఆకలి అరుపూ,
సాయంత్రం ఒక సరదా కేక,
ఆపైన నిశిరాతిరిలో ఒక ఆవులింతమధ్య...
నిద్రకొరిగి, సేదతీరుతాను.


కానీ...జీవితమంటే ఇంతేనా?


ఆకలికోసం బ్రతకడం.
ఇతరుల అంగీకారంకోసం వెతకడం.
ఎవరోచెప్పిన జీవనసత్యాలకి ఒదగడం.
మనసును చంపి, మన్ననకై బతకడం.
వారమంతా నలిగి,
వీకెండ్ కోసం చూడడం.
జీవితమంటే ఇంతేనా?



స్నేహాన్ని ఉన్నతమంటాం.
ప్రేమే శాశ్వతమంటాం.
స్నేహితుల్ని సాధించడానికీ,
ప్రేమికుల్ని శోధించడానికీ,
జీవితాన్ని వెచ్చిస్తాం.
తెలియని ప్రశ్నల్నీ,తెలిసిన జవాబుల్నీ
మళ్ళీమళ్ళీ సంధిస్తాం.
జీవితమంటే నిజంగా ఇంతేనా?



ఇదే జీవితమైతే ! ఇప్పుడే తీసేసుకో !!
బిల్లు చూసి ప్రేమించడం,
వీకెండ్లకోసం జీవించడం,
నాకొద్దు.
కొలిచే స్నేహం,
కొనుక్కునే ప్రేమా...
నాకొద్దు.
ఈ మాస్కునీడలో రంగుమారిన ముఖం
అతికించిన నవ్వులూ,
తప్పనిసరై అరిచే అరుపులూ,కేకలూ
నాకొద్దు.
నిజంగా, ఈ జీవితమే నాకొద్దు.




నేను కావాలి...నాకు నేనుమాత్రమే కావాలి.
నేను నేనుగా బ్రతికే జీవితం కావాలి.



*****************

ఈ మధ్య ‘కొత్తపాళీ’ గారు తన గూగుల్ చాట్ లో పెట్టుకున్న మాస్క్ చూసిన ప్రతిసారీ నాకు T.S.Eliot రాసిన ఒక కవితలోని ఈ క్రింది లైన్లు గుర్తుకొచ్చేవి;
It's Time
It's time to prepare a face
Prepare a face to meet the faces that you meet

పై పంక్తుల స్ఫూర్తితో ఈ కవితను రాసాను.


************

కత్తిరింపు సేవలు...

గమనిక : ఈ వ్యాసం యొక్క అసలు శీర్షిక "కత్తిరిద్దాం రా!" కు సెన్సారువారు అభ్యంతరం తెలిపిన కారణంగా మార్చడమైనది. దేన్నికత్తిరిస్తారో... శీర్షికలో లేకపోవడం వలన, ప్రేక్షకులు తమ ఆలోచనాశక్తిని ఉపయోగించి పెడర్థాలు, ముఖ్యంగా బూతు ప్రధానమైన అర్థాలు తీస్తారేమోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.



‘కంత్రీ’ సినిమాలోని ఒక దృశ్యం వలన దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ‘గోరింటాకు’ లోని డైలాగుతో వికలాంగులు కలతచెందారు. ‘రెడీ’ సినిమాలో సునిల్ పాత్రద్వారా కూచిపూడి కళాకారులు మనస్థాపంపొందారు. ఈ ఘటనల నేపధ్యంలో ప్రాంతీయ సెన్సార్ మండలి కొత్త నియమాల్ని సృష్టించి అమలు చేసింది. ఆ కొత్త నియమాల్ని కొంత తెలుగులో మార్చి ఇక్కడ ఇస్తున్నాను చూడండి;

  1. ఏదైనా కులాన్ని,మతాన్నీ,ప్రాంతాన్నీ లేక వృత్తిని సూచించే దృశ్యాలనూ లేక సంవాదాలు be scrupulously avoided.
    Should refrain from using words like “కుంటోడా, గుడ్డోడా, చెవిటోడా, మూగోడా,నత్తి,”
  2. Words like “నీయమ్మ, నీయమ్మ, నాకొడుకా, దొంగనాకొడుకు, దొబ్బెయ్యడం, తొక్కలో, etc may be removed.
  3. Lampooning or portraying or making mockery of their caste/religious status must be avoided. Should refrain from showing physically challenged as villains and comedians and showing them in bad light.
  4. కులపర మతపరమైన పేర్లు should not be used. ప్రాంతీయ యాసల్నీ, మాండలికాల్నీ విలన్లకూ, కామెడియన్ల చిత్రీకరణలో may not be used
  5. పోలీసు, వైద్యం మరియూ టీచర్ల వంటి వృత్తులను should not be show in poor light as they would demoralize the respective professions.
  6. Extra care should be taken not to film violent scenes and objectionable scenes at places of worship. The sanctity of the place of worship should be kept in mind.


పైనున్న నియమాలు సెన్సారు చిత్తశుద్దినేకాక, వారి తెలియని తనాన్నీ, చేతకాని తనాన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కావాలనే నేను అనువదించని ఆంగ్ల వాక్యాలు ఎంత అర్థరహితంగా, డొంకతిరుగుడుగా ఉన్నాయో చూడండి. ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటిస్తే ఏదైనా సినిమా తియ్యగలమా? అసలు ఉద్దేశమేమిటో...ఈ నియమావళి ఎందుకో దీనికి రూపకల్పన చేసినవాళ్ళకైనా తెలుసోలేదో సందేహమే! ఇలాంటి అమలు చెయ్యలేని రూల్స్ వల్ల నిజంగా ఎవరికి లాభమో తెలియడం లేదు.


ఇప్పుడే అందిన వార్త: ‘కత్తిరింపు సేవలు’ అని ఉన్న నా టపా శీర్షిక, ‘నాయీబ్రాహ్మణుల’ వృత్తిని కించపరిచేలా ఉందని ఆ సంఘాలు ఆందోళన చెయ్యడం వలన సెన్సారువారు నా టపా సర్టిఫికేట్ ని లాగేసుకుని, బ్లాగునుండీ గెంటేసారు. కాబట్టి అర్ధాంతరంగా టపాకు సెలవుతీసుకోవలసి వస్తోంది. ఈ వివాదం నుండీ బయటబడితే, తీరిగ్గా ఈ విషయం మీద మరో టపా సవివరంగా రాస్తాను.



--------------

Thursday, July 17, 2008

నా జ్ఞాపకాల పొరల్లో, బాల్యప్రేమల గుభాళింపులు

మా ఐదేళ్ళ అవినాష్ కళ్ళు, ‘కత్రీనా కైఫ్’ మోము కనపడగానే వెలిగిపోతాయి. అదేమి బాల్యచాపల్యమో తెలీదు.నిజంగా, "అంత చిన్నపిల్లాడి మనసులో తెలీయని ప్రేమభావాలుంటాయా?" అంటే అంత సులభంగా సమాధానం చెప్పలేం. సరదాగా అడిగితే, "అఛ్ఛీలగ్తీహై!" అని హిందీలో సిగ్గుపడతాడు. ఈ రోజు మావాడు , "సింగ్ ఈజ్ కింగ్" అనే కత్రీనా పాట టీవీలో కళ్ళప్పగించి చూస్తుంటే, తఠాలున నా జ్ఞాపకాల పొరల్లోంచీ, బాల్యప్రేమల గుభాళింపులు గుప్పుమన్నాయి.



నిజమే! ఊహతెలీని రోజుల్లోకూడా నా మదిలో వగలరాణులుండేవారు. పక్కింటి అమ్మయో, ఎదురింటి అందమైన ఆంటీయో కారు సుమండీ. నాబాల్యప్రేమల ఊహల్లో తెరనేలే తారామణులే, నా ప్రేమను వెలిగించిన తారాదీపాలయ్యేవారు. చెప్పడానికీ, అదీ బాహాటంగా చెప్పడానికి ఇబ్బందిగా అనిపించినా ఇది మాత్రం నిజం. నా ఈజ్ఞాపకాల తోరణాలు సద్యోజనితం.



అప్పుడు నావయసు నాకేతెలీదు, కానీ ఏదో పేరుతెలీని బ్లాకన్డ్ వైట్ సినిమాలో, చేతిలో బ్యాంట్మింటన్ బ్యాటూ,తెల్ల టీషర్టూ,పొట్టి నిక్కరూ వేసుకున్న లలనామణి ‘కాంచన’నుచూసి మనసుపారేసుకున్నాను. ఆ సినిమాలో కృష్ణ హీరో అనుకుంటా ! కాంచనపక్కన తను నిలబడి ప్రేమించినప్పుడల్లా, నా హృదయం వేయిముక్కలైన వైనాన్ని ఎట్లాచెప్పేది? ఆ తీవ్రత, అర్థంకాని అలజడీ అనుభవిస్తేనే తెలుస్తుంది. తనే నా మొదటి గ్లామర్ క్వీన్...



ఒక శుభదినాన, కేవలం పాతసినిమాలు పొద్దునపూట మాత్రమే ధియేటర్లో వేస్తున్న తరుణాన, "ఓ హలా..నాగినీ" అంటూ నా హృదయక్షేత్రంలో నగారామోహించిన ముగ్ధమోము సుందరి, ముద్దుమాటల తొలకరి బి.సరోజాదేవి. అప్పటికి నాకు కన్నడ భాషతెలీదుగానీ, తన తెలుగులో ఉన్న కన్నడయాసని మనస్పూర్తిగా ఆరాధించి, అభిమానించేసాను. ‘జగదేకవీరుని కథ’లో రామారావు అంతమంది అమ్మాయిల్ని భార్యలుగా కోరి తండ్రిచేత దేశబహిష్కృతుడు కాబడతాడుగానీ, నేనైతే ఒక్క సరోజాదేవితో సరిపెట్టేవాడినే అనుకున్నాను. ఇప్పటికీ అనుకుంటానుకూడా!



నలుపుతెలుపులు దాటి వెండితెర పంచరంగులుపులుముకున్నా, ఆ ఈస్ట్మన్ రంగుల జమానాలో నా కంటికింపైన నారీమణెవ్వరూ లేరనే చెప్పుకోవాలి. వాణిశ్రీ, శారదలు రాజ్యాలేలినా, నాహృదయ సామ్రాజ్యం పొలిమేరల్లోకికూడా వీరు ప్రవేశార్హతనోచుకోలేదు. జమునా,జయలలిత, చంద్రకళ తమ జాణతనాన్ని పండించినా, నా జామురాతిరి కలల కొనలనికూడా తాకలేకపోయారు.



చిన్నపాప పెద్దదై, ‘పదహారేళ్ళ’కే కొన్నివేల శతఘ్నుల్ని పేల్చిన శ్రీదేవిని ఆ సినిమాలో చాటుగా చెయ్యడ్డంపెట్టుకుని వేళ్ళసందుల్లోంచీ చూసిన క్షణం ఇంకా నాకు బాగా గుర్తు. ఒక్కటికెట్టుపై రెండాటల రోజున చూసిన సినిమా ఇది. దీనితోపాటూ మరో సినిమా చూపుతారన్నా, చూసింది పదాటలతో సమానం అనిపించిన ఆ అనుభవం, చెప్పినా అర్థమయ్యేనా? వేళ్ళ సందుల్లోంచీ, "ఎవరేమనుకుంటారో" అని చాటుగా చూసిన అందాలు కళ్ళనిదాటి, ఎప్పుడో గుండెల్లో నిండాయంటే, ఎట్లా వివరించేది?



"మౌనమేలనోయి...ఈ మరపురాని రేయి" అంటూ పవిత్రమైన సినిమాల దర్శకుడే ప్రేమలోపడితీసిన పాటలో, షవర్ కింద జయప్రదని చూసి చలించని హృదయం ఉంటుందా? నా వయసప్పుడు...ఎందుకులెండి, విని మీరిబ్బందిపడతారు. నాకు సౌందర్య దృష్టిని ప్రసాదించిన దేవతలకు నమస్సులర్పించడం, జయప్రదనారాధించడం తప్ప అప్పుడు నేను చెయ్యగలిగింది ఏమీ లేదనిపించింది. స్త్రీత్వపు మధురస్పర్శని మనసుకి చూపిన మందగమనకు నా మన:సుమాంజలి.



ఫోటోలో ఉన్న అగ్నిని తను ప్రేమిస్తున్నా, విజయశాంతి వన్నెల్ని వలచిన నాకనులు ‘అగ్నిపర్వతా’లైన తీరు నాకుతప్ప అన్యులెవ్వరికీ తెలీదు. "ఈ గాలిలో...ఎక్కడొ అలికిడి...అక్కడే అలజడి" అన్నపాటలోని పదాలకు అర్థం పూర్తిగా తెలియకున్నా, భావం మాత్రం మళ్ళీ ఇంకోసారి సినిమా చూడమని చెప్పిన. మూడోరోజు మళ్ళీ ధియేటర్ కెళ్ళిన నేను, ఆ పాటకోసం అంకెలు లెక్కపెట్టుకుని ఎదురుచూసిన ఆత్రాన్ని, ప్రేమనికాక మరేమనుకోవాలి? నిజమే, ప్రేమించాను ఫోటోలో ఉన్న కృష్ణని చంపాలన్నంత ఈర్షపుట్టేంతగా ఆ క్షణాన ప్రేమించాను.



‘అహనా పెళ్ళంట’, ‘మజ్ను’ ఇంకాఎన్నో సినిమాల్లో తెరమీద తను ప్రత్యక్షమైతే, నా మనసు ఆకాశంలో నక్షత్రమై మెరిసిన ఘడియలెన్నో. "కళ్యాణ వైభోగమే...ఈ సీతారాముల కల్యాణమే..." అని తను సిగ్గుపడుతుంటే, "నాకోసమేనేమో!" అని భ్రమించిన తరుణాన, నన్నునేను అభినందించుకున్న పిచ్చినెలా మర్చిపోవాలి? రజని తన పేరు, పక్కింటి అమ్మాయిలాంటి సింప్లిసిటీ తనతీరు. చాలా మందిని ప్రేమించినా, పెళ్ళికోసం మాత్రం ఎవరైనా రజనిని కోరాల్సినవారే! వారిలో నేనూ ఒకడిని. చెప్పాపెట్టకుండా తను చిత్రసీమని వదిలిన నాడు, సినిమా సినిమాలో తనకోసం వెదకి వేసారిన నా మనసెంత బాధపడిందో చెబితే మాత్రం తెలుస్తుందా? ఇప్పటికీ నా కనులు తనకోసం వెదుకుతాయి. తన సమాచారం కోసం చెవులు తరుస్తాయి.



ఆ తరువాత నాకు వయసొచ్చింది. క్లాసులోని కవితా, పక్కింటి పంకజాలు కూడా అందంగా అనిపించారు, తెరతారామణుల్ని మరిపించారు. "కానీ ఏంలాభం?", ఆ ఆనందాలు, అనుభవాలూ, ఆలోచనలూ,ఆరాధనలూ, అద్వితీయ ఆకర్షణలూ లేవు. కేవలం నిజాలూ, నీరసాలూ, నీకూ-నాకూ అనే లావాదేవీలే తప్ప మురిపాలూ,లాలిత్యాలూ ఎక్కడ?



మరిప్పుడు!?! శ్రియ పెదవుల్లో సిరామిక్ చదును తప్ప మనసుగిల్లే మహత్యాలెక్కడ. ఇలియానా వొంపుల్లో ఇత్తడిబిందె నిలుస్తుందేమోగానీ, నా మనసుమాత్రం పక్కకే జారిపొతుంది. అసిన్ చూపుల్లో ఆకర్షణున్నా, అందిపుచ్చుకుందామని అణుమాత్రంగానైనా అనిపించదే! నయనతార నగుమోము నాకేంతక్కువన్నా, నీకన్నా నయాగరాజలపాతం అక్షరాలా నయమని సమాధానం చెప్పాలనిపిస్తుంది. త్రిష చింతాకు కళ్ళు చూసి చిర్రెత్తుకొస్తుందిగానీ, చెంపాచెంపారాసి చెలిమిచెయ్యబుద్దవుతుందా?



ఆ చిన్ననాటి ప్రేమల్లో చాలా బలముందనుకుంటాను. అందుకే మావాడి సెలెక్షన్ను మెచ్చుకుంటారు. బహుశా ఇవే వాడికి మిగిలే నిజమైన ప్రేమ జ్ఞాపకాలవుతాయేమో! నా జీవితంలో నేను తెలుసుకున్న నిజాలు వాడికి ప్రేమని నేర్పే పాఠాలవుతాయేమో! చూడాలి...చూసి ఆనందించాలి.


------------------------------

‘దొంగ’ హీరోలు

బహుభాషా నటుడైన రమేష్ అర్వింద్ (రుద్రవీణ, సతి లీలావతి Etc.) ఈ మధ్య ‘యాక్సిడెంట్’ అనే కన్నడ సినిమాలో హీరోగా చేస్తూ, రేడీయోజాకీ పాత్రని పోషించాడు. టీవీలో ఛానళ్ళు నొక్కుతున్న నాకు తన ఇంటర్వూ ఒకటి కనబడింది. "అసలు రేడియోజాకీ పాత్ర ఎందుకు పోషిస్తున్నారు?" అన్న ప్రశ్నకు అతడి సమాధానం, "ఈ మధ్య యువత చాలా విన్నూతనమైన ఉద్యోగాలు చేస్తోంది. వాళ్ళతో ఐడెంటిఫై చెయ్యబడితే బాగుంటుందని, ఈ పాత్రను అలా తీర్చిదిద్దాం. అంతేకాక, ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక రేడియో స్టేషన్ కి వెళ్ళిన నేను, వ్యక్తిగతంగా ఈ ఉద్యోగశైలిపట్ల ఆకర్షితుడ్నయ్యాను. అందుకే ఇలా ప్రయత్నించాం" అన్నాడు.



ఈ ఇంటర్వ్యూ చూసిన మరునాడు థియేటర్లో ‘రేస్’ అనే హిందీ సినిమా చూసాను. ఈ సినిమాలో హీరో,హీరోయిన్, విలన్, కామెడియన్ అనే భేధం లేకుండా అందరూ మోసగాళ్ళు, దొంగలూ, డబ్బుకోసం హత్య చెయ్యడానికి కూడా వెనుదియ్యని మహామహులూ కనబడ్డారు. అన్నాతమ్ముడా, ప్రియురాలాపెళ్ళామా, పోలీసాదొంగా అన్న తేడాలేకుండా ఒకర్నొకరు దగా చేసుకుంటూ దర్జాగా నడిచిన కథయిది. పైపెచ్చు ఒక పేద్ధ కమర్షియల్ హిట్ కూడా. ఈ సినిమాచూసిన తరువాత నాకర్థమయ్యిందేమిటంటే, BAD BOY is the new HERO అని.



ఈ సినిమాచూసి నేను తెలుసుకున్న పరమ సత్యాన్ని నామిత్రుడొకడికి అర్జంటుగా ఫోన్ చేసి చెప్పాను. అటునుంచీ ఒక్క క్షణం నిశ్శబ్ధం తరువాత విలన్లా నవ్వుతూ, "ఓరి మూర్ఖుడా! ఆంధ్రాలో లేక నువ్వు బతికిపోయావుగానీ, తెలుగు హీరో ఎప్పడో దొంగగా మారిపోయాడ్రా ఫూల్" అని నా కళ్ళు తెరిపించాడు. ఆ తరువాత కళ్ళుమూసుకునొక్కసారి మననం చేసుకుంటే, ఆల్రెడీ కళ్ళుతెరిచిన నా కళ్ళలో నీళ్ళుతిరిగాయి. 2007 లో పెద్దహిట్లైన పాప్యులర్ హీరొల సినిమాలన్నింటిలోనూ కథానాయకుడు దొంగో,ఫ్యాక్షనిస్టో, హంతకుడో,మోసగాడో లేక అంతకన్నా బరితెగించేవాడోగానే కనిపించి ప్రేక్షకులకి విందులు చేసారు. 2006 సంవత్సరమూ అందుకు మినహాయింపుకాదు.ఇక 2008 లోనూ పెద్ద మార్పొచ్చినట్లు అనిపించడం లేదు. అంటే, మొత్తానికి మన సినిమాలల్లో సాధారణ మనుషులో, మర్యాదగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో, కళాకారులో హీరోలుగా కనబడే అవకాశం అస్సలు లేదన్నమాట.



ఇంత జ్ఞానోదయమైనా నిరాశ చెందక అవిశ్రామంగా వెతికి రెండు సినిమా పట్టుకున్నా, మొదటిది ‘ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే’, రెండోది ‘హ్యాపీడేస్’. ‘ఆడవారి మాటలకు...’లో హీరో(వెంకటేష్) ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇదేమాట నా సాఫ్ట్వేర్ మిత్రుడికి చెబితే, వాడు తిట్టిన తిట్లు వినలేక నా చెవిపోటొచ్చింది. "వాడు చేసే ప్రాజెక్టేమిటి, వాడు జాయినైన కంపెనీ ఏమిటి, ఒక్కరాత్రిలో వాడు సాల్వ్ చేసే ప్రాబ్లమెమిటి, వాడ్ని తేరగా ఫారిన్ ఎందుకు పంపుతారు" అంటూ నానా ప్రశ్నలూ వేసి, నా ఆనందాన్ని కాస్తా "తుస్సు" మనిపించాడు. అంటే తేలిందేమిటయ్యా అంటే, పాత్ర ఉన్నా అది నిజంగా నిజానికి చాలా దూరం అని.



ఇక మిగిలిన ‘హ్యాపీడేస్’ని పట్టుకుని నేను హ్యపీగా ఉండగా, ఆ ఆనందమూ నిలవలేదు. దానిమీదా నాకు చాంతాడంత జ్ఞానాన్ని ఇంజనీరింగ్ చదివిన నా మిత్రులు అందిస్తే, అసలు ఆ సినిమాలోని పాత్రల పాంతీయత, భాష, భావాలపై ఒక తీవ్రమైన లెక్చర్ నా ఇంకో ఔత్సాహిక సినిమా ప్రేమికుడి ద్వారా వినక తప్పింది కాదు. అంతా వినిపించాక, "అయినా గుడ్డిలో మెల్ల అనుకుని ఈ సినిమాను ఒక సారి చూసి, ప్రయత్నాన్ని ప్రశంసించొచ్చుగానీ, ఏముందని అవార్డులమీద అవార్డులిస్తున్నారో ఈ అమెచ్యూర్ ఫిల్మ్ కు" అని సూత్రీకరించేసాడు. చివరాఖరికి నామీద దయతల్చి, "నీ బాధ దొంగ హీరోలగురించి కాబట్టి, ఈ రెండూ సినిమాల్నీ మినహాయించుకుని సంతోషించు" అని స్వాంతన పలికాడు.



ఏదిఏమైనా, ఇంత శోధన తరువాత నేను సాధించిన నిజం మాత్రం, మన ఖర్మకు ప్రస్తుతానికి ‘దొంగలే మంచి హీరోలు’ అని.


----------------------------------------

Wednesday, July 16, 2008

ఒక మెతుకు పట్టుకునిచూస్తే చాలా !?!

"అన్నం ఉడికిందోలేదో చెప్పడానికి ఒక మెతుకుపట్టుకు చూస్తే చాలదా!" అనేది మనం sweeping generalization చెయ్యడానికి చాలా కన్వీనియంట్ గా వాడే సామెత. ‘నిజంగా ఒక మెతుకుని పట్టుకునిచూస్తే చాలా?’, అన్నది ఇక్కడ చర్చించాల్సిన సమస్య.



నా ఇదివరకటి టపా ‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి’లో, తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ శంకర్ అనే పాఠకుడు చాలా వివేకవంతమైన ప్రశ్నను, సోదాహరణంగా లేవదీసారు. తను "గోరింటాకు సినిమా విషయంలో నేను మంద కృష్ణని సమర్ధిస్తా, ఆంధ్రజ్యోతి విషయంలో వ్యతిరేకిస్తా" అన్నారు. ఒక్క క్షణం నాకు అర్థంకాలేదు, కానీ తరువాత ఆలోచించి చూస్తే "నిజమేనేమో!" అనిపించింది. ఒకసారి ‘కంత్రి’ సినిమాపై మందకృష్ణ మాదిగ లేవదీసిన దుమారం రాజకీయ ప్రేరేపితం అనుకుని నిరసించినా, ‘గోరింటాకు’ సినిమా విషయంలో వికలాంగులని కించపరిచేలాఉన్న డైలాగుపై సాగిన సంవాదం చాలావరకూ అంగీకారాత్మకంగా అనిపిస్తుంది.



జూనియర్ ఎన్.టి.ఆర్ తోనున్న రాజకీయవిభెధాన్ని దృష్టిలో పెట్టుకుని ‘కంత్రీ’పై ధ్వజమెత్తినా, ఇప్పుడే కాంగ్రెస్లో చేసిన రాజశేఖర్ సినిమాపై దండెత్తడానికి సహేతుకమైన కారణం నాకు కనిపించలేదు. ఒక బ్లాగు మిత్రుడు వ్యంగ్యంగా, ‘ఇదొక నడవని సినిమాకి ప్రమోషనల్ పబ్లిసిటీ’గా చెప్పబూనినా, ఒక దగ్గర నెగెటివ్ పబ్లిసిటీ అయిన పంధా ఇంకో సినిమా ప్రమోషన్ కి ఎలా పనికివస్తుందో కాస్త ఆలోచించాల్సిన విషయమే సుమా! అంతెందుకు, ఆంధ్రజ్యొతి విషయంలో మూర్ఖంగా ప్రవర్తించిన మంద కృష్ణ, అంతకుమునుపే వికలాంగులతోకలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి, వారి హక్కుల్ని కాపాడాడన్న విషయం మనలో చాలామంది (నేను కూడా) కన్వీనియంట్ గా మర్చిపోయాం.



ఈ మందకృష్ణ ఈ ఒక్క ఘటనలో వేసిన తింగరివేషాన్ని అడ్డంపెట్టుకుని కొందరు బ్లాగర్లు ఏకంగా, "దళితులంతా ఇంతే" అనే సిద్దాంతాన్నికూడా ప్రతిపాదించేసారు. ఈ sweeping generalization ఎంత హాస్యాస్పదమంటే, "మా చిన్నప్పటి ఇల్లు మురికికాలువ పక్కనుండేది కాబట్టి, ఆ తరువాత నేను మారిన ఇళ్ళన్నీ మురికి కాలువ పక్కనే ఉంటాయి" అని ప్రతిపాదించినంత. అందుకే బహుశా, ఒక మెతుకుపట్టుకుని చూస్తే, మొత్తం అన్నం కొన్ని విషయాలలో ఉడికినట్లు కాదు అనిపిస్తుంది.



ఒక చర్యకి లక్షలాది మనుషుల మనోభావాలు ఒకేసారి దెబ్బతినెయ్యడం ఎంత విచిత్రమో, ఒక మతం, కులం, వర్గంలోని ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తే, మొత్తం జాతిని తప్పుబట్టడం అంతే విచిత్రం కాదూ!

బాలథాకరే, ప్రవీణ్ తోగాడియా లాంటివాళ్ళు "ముస్లింలను పాకిస్తాన్ పంపెయ్యండి" అంటే, మొత్తం హిందువులంతా అలాగే అనుకుంటారని అంగీకరిద్ధామా?

"హిందువులు ముస్లింలను అణగదొక్కేస్తున్నారు" అని జామామసీద్ పెద్ద అంటే, దేశంలో ఉన్న ముస్లింలందరూ అలాగే భావిస్తున్నారని ప్రతిపాదించేద్ధామా?

కొందరు మహిళలు, అత్యాచార నిరోధకచట్టాన్నో లేక కట్నవ్యతిరేక చట్టాన్నో కక్షసాధింపుకోసం వాడుతున్నారని, అందరూ దుర్వినియోగ పరుస్తున్నారని భావించి దాన్ని రద్దుచేద్దామా?

SC/ST అత్యాచార నిరోధక చట్టాన్ని కొందరు దళితులు స్వప్రయోజనాలకోసం వాడుతున్నారని, అగ్రవర్ణాల అణచివేతకై దీన్ని ఆయుధంగా వాడుతున్నారని సిద్ధాంతీకరించేద్దామా?



అందుకే కొన్ని పరిస్థితులూ, విషయాలలో మెతుకుపట్టుకుని చూసి, మొత్తం సంగతిని అవగాహనచెయ్యడం మాని, కొంత ముందువెనకల తార్కికాన్ని ఆసరాతీసుకుని నిర్ణయాలూ చేద్దాం ! సిద్ధాంతాల్ని ప్రతిపాదిద్దాం!!


-----------------

‘సప్తపది’ - కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం !


జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980).




ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.



1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన సామాజిక వాతావరణంకూడా ఒక defense mechanism లాగా ఏర్పడిన తరుణం అది. ఇలాంటి సున్నితమైన సామాజిక పరిస్థితి మధ్య ఇలాంటి సినిమా తియ్యడం ద్వారా విశ్వనాధ్ గారు సినిమాకున్న సామాజిక బాధ్యతతోపాటూ, ఒక దర్శకుడిగా తన సామాజిక నిబద్ధతనూ పరిచయం చేసారు.


పూర్తి విశ్లేషణని ఇక్కడ చదవండి.



---------------------

Tuesday, July 15, 2008

నా మనోభావాలు దెబ్బతిన్నాయ్!

Breaking News: ‘రెడీ’ సినిమాలో సునిల్ పాత్రద్వారా రాష్ట్రవ్యాప్తంగా, కూచిపూడి నాట్యాచార్యుల మనోభావాలు దెబ్బతిన్నాయ్!



పోయిన సంవత్సరం ఎమ్.ఎఫ్.హుస్సేన్ హిందూ దేవతల్ని నగ్నంగా పెయింట్ చేసాడు.
"హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని దేశం నుండీ తన్ని తగలేసాం.



బరోడాలో ఒక విధ్యార్థి పరీక్షకు తన బొమ్మల్ని ప్రదర్శనకు పెడితే...
ఒక రాజకీయనాయకుడు విధ్వంసం చేసి "హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని ఆ విధ్యార్థిని జైలుకి పంపాడు.



బుష్ ప్రభుత్వంతో న్యూక్లియర్ ఒప్పందం చేసుకుంటే...
భారతీయ ముస్లింల "మనోభావాలు దెబ్బతింటాయ్" అని కొన్ని రాజకీయపార్టీలు అంటున్నాయి.



మొన్న ఒక పత్రిక కొన్ని అవాకులు రాస్తే...
"దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని భౌతికదాడికి దిగేసారు.



నిన్న ఒక పత్రికలో జీసస్ బొమ్మ అభ్యంతరకరంగా అచ్చైతే...
క్రైస్తవుల "మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని ఆఫీసు ద్వంసం చేసారు.



నిజంగా దేవుళ్ళూ, మతాలూ, కులాలూ గత ఐదు సంవత్సరాలలో ఇంత సున్నితంగా తయారయ్యారా...!?!



సుదీర్ఘ ముస్లిం పరిపాలనలో, బ్రిటిష్ రాజ్యంలో చెక్కుచెదరని హిందూ మతం, దేవుళ్ళూ ఒక్క పెయింటింగ్ తో ప్రమాదంలో పడిపోతారా? "హిందూ మతం ఒక మతంకాదు, అదొక జీవన విధానం" అనిచెప్పుకునే ప్రజల మనోభావాలు ఈ మాత్రానికే గాయపడతాయా?



ప్రపంచవ్యాప్తంగా బుష్ ప్రభుత్వం ముస్లింలపై చేస్తున్న దారుణాలకు భారతీయ ముస్లింలు వ్యతిరేకమేగానీ, భారత ప్రభుత్వం, దేశ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే ముస్లిలు ఎందుకు వ్యతిరేకిస్తారో? వారి మనోభావాలు ఎందుకు గాయపడతాయో?



దళితనాయకులలో పెరుగుతున్న వ్యాపారధోరణిని ఒక పత్రిక ఎత్తిచూపినంత మాత్రానా, మొత్తం దళితుల మనోభావాలెలా దెబ్బతింటాయ్? అప్పుడప్పుడూ చాటుగా, అక్కడక్కడా బాహాటంగా దళితులు ఇదే మాటలు అనుకోవడం లేదా? నాయకుడు జాతి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం వహిస్తాడేగానీ, వారి మనోభావాల్ని భుజానేసుకుని తిరుగుతాడా...కొన్ని కోట్ల దళితుల మనోభావాల గురించి క్షణంలో తెలిసి, దాడికి పాల్పడడానికీ?



ప్రేమ, కరుణ, క్షమ మూల సిద్ధాంతలుగా గల క్రైస్తవమతం మనోభావాలు. ఒక్క సిగరెట్, బీర్ క్యాన్ పట్టుకున్న యేసు ప్రభువు బొమ్మతో దెబ్బతినేసాయ్. తెలియక చేసిన తప్పును యేసు ఖచ్చితంగా క్షమిస్తాడేమో గానీ, ఈ విధ్వంసాన్ని క్షమిస్తాడా? అయినా క్రైస్తవ ప్రచార వ్యాసం పైన ఇలాంటి బొమ్మ ఎవడైనా ఉద్దేశపూర్వకంగా వేస్తారా? వేసినా యేసు ముళ్ళకిరీటం పెట్టి కొరడాలతో కొట్టినా చలించలేదే, సిగరెట్టూ బీర్ క్యానూ చేతిలో పెడితే కోపగిస్తాడా? మరి క్రైస్తవుల మనోభావాలు అంత అర్జంటుగా ఎందుకు దెబ్బతిన్నాయో?



నేను హిందువుని, నేను ముస్లింని, నేను దళితుడ్ని, నేను క్రైస్తవుణ్ణి జరిగినవాటికన్నా, ఈ మనోభావాలు దెబ్బతినే నాటకాల్నిచూసి, నా మనోభావాలు దెబ్బతిన్నాయ్...నేనేం చెయ్యాలి?




----------------

Monday, July 14, 2008

ఈవ్ టీజింగ్ & కట్నం గురించి కొన్ని నిజాలు

ఈవ్ టీజింగ్ గురించి జరిగిన చర్చలో కొందరు మెట్రో సిటీలలో ఈ సంస్కృతి తగ్గినట్లుగా చెప్పడం జరిగింది. వారికోసం ఇక్కడ నాలుగు ప్రముఖ మెట్రో సిటీలలోని గణాంకాలను ఇస్తున్నాను.


కేవలం మార్చి, 2003 (ఒక్క నెలలో) లో ఈవ్ టీజింగ్ కేసులు

ముంబై : 27
కొలకత్తా : 30
ఢిల్లీ : 744
చెన్నై : 143

మన దేశ రాజధానికి ఈవ్ టీజింగ్ లోనూ రాజధానే!


ఆంధ్రప్రదేశ్ లో కేవలం 6 నెలల్లో (జనవరి 2002 - జూన్ 2002) రిజిస్టెరైన ఈవ్ టీజింగ్ కేసులు 1,807
మధ్యప్రదేశ్ 2,906 తో మొదటి స్థానంలో ఉండగా, మనది సగౌరవమై రెండవస్థానం.



కట్నం గురించి జరిగిన చర్చలో, "కట్నం కోసం పీడించకుంటే చాలు" అన్నారు.

మన ఆంధ్రప్రదేశ్ లో 2001 వ సంవత్సరంలో కట్నం కారణంగా మరణించిన ఆడపడుచుల సంఖ్య అక్షరాలా 535. అంటే కనీసం రోజుకి ఒక మహిళైనా కట్నానికి బలై ప్రాణం కోల్పోతోందన్నమాట.



ఇక మహిళల్ని గౌరవించి పూజించే మన మహత్తర దేశంలో, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల 2000 సంవత్సరం లెక్కలు కాస్త చూడండి;

1. రేప్ : 16,496
2.కట్నం మరణాలు : 6995
3. గృహ హింస : 45,778
4. ఈవ్ టీజింగ్ : 32,940
5. సెక్సువల్ హెరాస్ మెంట్ : 11,024

మార్పు మనదేశంలో త్వరగా రాదు కాబట్టి, ఆ మార్పొచ్చే రోజుకోసం ఎదురుచూద్దామా? లేక మార్పు తీసుకురావడానికి ఇప్పుడే మనకు చేతనైన ప్రయత్నాన్ని చేద్దామా? Nobody have to wait for change to happen. If you believe in change THIS IS THE TIME TO CHANGE.



(పైన తెలిపిన సంఖ్యలు Center for Social Research అనే సంస్థవారి Eliminating the violence against women : some facts అనే డాక్యుమెంట్ లోనుండీ తీసుకోబడినవి)


------------------

Sunday, July 13, 2008

(నేను) అసలెందుకు రాయాలి?

ప్రముఖ బ్లాగరి వి.బి.సౌమ్య గారు తన బ్లాగులో ‘ఎందుకు చదవాలి?’ అనే టపా క్రితం నెల రాస్తే, ఈ సారి కొత్తగా ‘తెలుగెందుకు చదవాలి? అని బహుచక్కగా టపాలు రాసేసారు. ఈ టపాల స్ఫూర్తితోపాటూ, ఈ మధ్య నేను రాసిన మన పెళ్ళిప్రాతిపదిక తప్పైతే? టపాపై తన అభిప్రాయం రాస్తూ ‘అర్వింద్’ అనే మిత్రుడు, నీ టపాల ఆవేశంచూస్తే "సమాజంపై కోపాన్ని, విపరీతమైన ద్వేషాన్నీ నింపుకున్నట్టు అనిపిస్తోంది" అని అన్నాడు. అప్పుడొచ్చిన ఆలోచనే, "అసలెందుకు రాయాలి?" అన్న సందేహం. ఈ టపాలో నా సందేహాన్ని పంచుకోవడంతో పాటూ, నేనెందుకు ఇలా రాస్తానోకూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.



చరిత్రను తీసుకుంటే, రాతలల యొక్క ప్రాచీన ఆధారాలు గుహల చిత్రాలలో (cave paintings) గుర్తిస్తారు. వాటిల్లో చాలావరకూ వేట, ఉత్సవాలు,రోజువారీ దినచర్యల చిత్రాలు బొమ్మల రూపాలలోనూ, కొన్ని సంజ్ఞలరూపంలోనూ భద్రపరిచినట్లు అనిపిస్తాయి. అంటే, జీవితంలోని కొన్ని ముఖ్యమైన,గుర్తుపెట్టుకోదగిన చర్యల్ని ఇలా లిపిబద్ధంకానీ, చిత్రబద్ధంకానీ చెయ్యడం సహజమానవ లక్షణంలా అనిపిస్తుంది. ఇదే ప్రాచినప్రవృత్తి (primordial instinct) లిపి పుట్టుకకూ, మనం రాయడానికీ, సాహిత్య సృజనకూ కారణభూతమైఉండవచ్చు.



మనుషులు తాము నేర్చుకున్న అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ, జ్ఞానాన్నీ అక్షరబద్ధం చేస్తారు. దాని ఆశయం గుర్తుంచుకోవడం కావచ్చు, లేదా ఇతరులకు తెలియజెప్పడం కావచ్చు లేక కేవలం మనసు,మెదడులోని భావాల్నీ ఆలోచనల్నీ రాయడం ద్వారా వ్యక్తపరచి, కొంత మానసిక వత్తిడి నుంచీ ముక్తిపొందడమూ కావచ్చు. ముఖ్యంగా సాహిత్య సృజన, మనిషి తనకు తెలిసిన, ఉత్తమం అనిపించిన విషయాల్ని చెప్పడానికి ఉపయొగిస్తాడని భావిస్తారు. అందుకే, "best that is been thought and said is available in literature" అంటారు. బహుశా మనం బ్లాగులు కూడా ఇందుకోసమే రాస్తామేమో కదా!



రెండునెలల క్రితం నేను ఈ బ్లాగు రాయడం మొదలెట్టకముందు, దాదాపు 15 సంవత్సరలుగా తెలుగులో రాయడం మానేసాను. 10 వతరగతి తరువాత (1992) ఇప్పటి వరకూ,కనీసం ఒక ఉత్తరమైనా తెలుగులో రాసిన పాపాన పోలేదు. అప్పుడప్పుడూ ఉద్యోగరీత్యా కొన్ని విషయాల్ని ఆంగ్లం నుండీ తెలుగులోకి తర్జుమా చేసినా, అది కేవలం భాధ్యతగా చేసినవే తప్ప మనసుపెట్టి చేసిన జ్ఞాపకం అస్సలు లేదు. కానీ నా ‘I think in తెలుగు’ టపాలో వివరించినట్లు, నా ఆలోచనలూ, భావాలూ మాత్రం చాలావరకూ తెలుగులోనే జరిగేవి. అవి బయట మాత్రం హిందీ, ఆంగ్లంలో రూపాంతరం చెంది నిత్యజీవనంలో ఉపయోగపడేవి. కాబట్టి తెలుగులో రాయడం అనే ప్రక్రియ నా జీవితంలో పూర్తిగా మరుగుపడిపోయిందని చెప్పుకోవచ్చు.



బ్లాగులో టపాలు రాయడం మొదలుపెట్టిన తరువాత, అప్పటికే నవతరంగంలో నేను సినిమాలు గురించి రాయడం మొదలుపెట్టి ఉండటం చేత, వాటినే ఇక్కడా పెట్టడం జరిగింది. కానీ, ‘ఎలాగూ సినిమాల గురించి నవతరంలో రాస్తున్నానుకదా, నాకు నిజంగా స్పందించాలనిపించిన సామాజిక,ఆర్థిక,రాజకీయ మరియూ వ్యక్తిగత విషయాలను ఎందుకు బ్లాగులో రాయకూడదూ’ అన్న ఆలోచనవచ్చి వాటిని రాయడం మొదలెట్టాను. అలా క్రమక్రమంగా టపాలు పెరిగాయి. బహుశా గత 15 సంవత్సరాల నా ఆలోచనల్నీ, భావాలనీ అక్షరరూపం ఇవ్వాలన్న తపన, ఈ ఉదృతానికి ఒక కారణం కావచ్చు. ఇంతకాలంలో నేను తెలుసుకున్నవీ, అనుభవించినవీ, నేర్చుకున్నవీ, అభిప్రాయాలు ఏర్పరుచుకున్నవీ చెబుతుంటే, వాటికి వచ్చిన స్పందనని చూసి, నా పిచ్చి సొంతరాతల్ని అన్వయించుకుని అభినందించేవాళ్ళూ, విమర్శించేవాళ్ళూ ఇంత మంది ఉండటం ఆనందాన్ని కలిగించింది.



టపాల ఉదృతం ఎక్కువయ్యేకొద్దీ నా ఆలోచనలలో, నా వ్యక్తిత్వం ఛాయలు బలంగా కనబడడం మొదలయ్యాయి. వాటితోపాటూ టపాలకొచ్చే విమర్శలలో నిరసనలుకూడా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, మనం మనస్ఫూర్తిగా నమ్మిందో లేక వ్యతిరేకించేదో లేకపోతే రాయడం వృధా, అని నా నమ్మకం. What is the point in writing, if we have nothing to believe in or nothing to rebel against? అందుకే నా టపాలలో చాలావరకూ, నేను బలంగా నమ్మినవీ లేక తీవ్రంగా వ్యతిరేకించే విషయాల్ని రాస్తాను. కాకపోతే ఆ భావనలు నా జీవితంలో వచ్చిన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొంత తార్కికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. దీన్ని చదివిన కొందరు ఎందుకు అంత వ్యతిరేకం? ఎవరిమీద నీ కోపం? అంటే, "నామీద నాకే" అని చెప్పగలనేకానీ, వీరిమీద అని ఖచ్చితంగా సూచించలేను. ఎందుకంటే I rebel against issue, ideas, concepts, social norms, individual hypocrisies వాటిని స్థూలరూపంలో చూడాలంటే కష్టమే, నిర్థిష్టంగా వివరించాలంటే అసాధ్యమే.



ఈ మధ్యనా మిత్రుడు కొన్ని విమర్శల్ని చదివి "ఈ బ్లాగర్లు టైంపాస్ చెస్తున్నార్రా! నువ్వెందుకు ఇంత కష్టపడి ఈ టపాల్ని రాయడం" అన్నాడు. దానికి నేను చెప్పిన సమాధానం ఒక్కటే, "నేను కష్టపడి కాదు, ఇష్టపడి రాస్తున్నాను. నేను రాస్తున్న విషయాల్ని టైంపాస్ కైనా చదివేవాళ్ళు దొరకడం అదృష్టమే" అన్నాను. I really believe in what I said to my friend. రాసేవాడెవరూ దీన్నిచదివి అందరూ గుర్తించాలి అన్న ఉద్దేశంతో రాయరు, కానీ గుర్తింపు వస్తే అది వ్యతిరేకార్ధకమైనా ఆనందంగానే ఉంటుంది. అందుకే తీరిగ్గా పొగడ్తలతో పాటూ విమర్శలకూ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాను.



నన్ను వ్యతిరేకించేవారు కూడా అంత పొడవైన ప్రశ్నలూ, విమర్శలూ సమయం వెచ్చించి చేసేది, నేను మనస్ఫూర్తిగా నమ్మిన మూల సిద్ధాంతం కోసమే అని బలంగా అనిపిస్తుంది. They believe in different values and rebel against what I say. అందుకే మనమందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనిపిస్తుంది. కాకపోతే నిజజీవితంలో మనం వాదోపవాదాల్లో చేసినట్లే, ఇక్కడా సామ,దాన,భేద, దండోపాయాల్ని ఉపయోగించి వాదనల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించినపుడు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.



నేను బలంగా నమ్మినవీ, తీవ్రంగా వ్యతిరేకించే విషయాలే చాలావరకూ ఈ బ్లాగులో కనబడతాయి. వాటిని అంగీకరించేవారికి స్వాగతం. చదివి అందిపుచ్చుకుని, అభినందించేవారికి సుస్వాగతం. అందిపుచ్చుకుని, ఆలోచించేవారికి మహాస్వాగతం. ఖండించి, విమర్శించేవారికి అద్వితీయ స్వాగతం.


-------------------------------

Saturday, July 12, 2008

ముళ్ళపూడి రమణ ‘ప్యాసా’ చిత్రసమీక్షపై నా సమీక్ష

కాలేజిలో ఉండగా, ప్రతి వారాంతరంలో దూరదర్శన్ లో ప్రసారమయ్యే హిందీ సినిమాల పరంపరలో భాగంగా గురుదత్ దర్శకనిర్మాతగా తనే నటించిన ‘ప్యాసా’ (प्यासा) సినిమా చూడ్డం జరిగింది. మొదటి ఫ్రేమ్ నుంచే ఈ సినిమా నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.



నాయకుడి భావుకత, కవిహృదయం, రాజీపడలేని మనస్తత్వం నాకు గౌరవప్రదంగా అనిపించాయి. ప్రేమికురాలిగా నటించిన ‘మాలాసిన్హా’ అందం ఆ సినిమాలో ముఖ్యంగా "హమ్ ఆప్ కె ఆంఖొంమే ఇస్ దిల్ కో సమాలెతో" అనే పాటలో కళ్ళతో నటించిన తీరును చూసి అర్జంటుగా ప్రేమించానని చెప్పొచ్చు. ‘వహీదా రెహమాన్’ "జానెక్యా తూనే కహె, జానె క్యామైనే సునే" అని చిలిపికళ్ళతో కథానాయకుణ్ణి ఆహ్వానిస్తుంటే, నన్నేనేమో అని భ్రమించానుకూడా. "జానెవొ కైసే లోగ్ థె జిన్కొ ప్యార్ సె ప్యార్ మిలా" అని భగ్నప్రేమికుడిగా ‘గురుదత్’ ఆలపిస్తుంటే, బాధగా మూల్గిన నా హౄదయ స్పందన నిన్నజరిగినట్లుగానే ఇప్పటికీ అనిపిస్తుంది. ఇక "ఎ దునియా అగర్ మిల్ భి జాయేతొ క్యాహై" అని చివర్న నాయకుడు ఈ ప్రపంచాన్ని ప్రశ్నించి త్యజిస్తున్న పాటను చూసి, నేను భరించలేని ఆవేశంతో లేచి నిలబడిన క్షణం ఇంకా నా మదిలో తాజాగా ఉంది. ఆ SD బర్మన్ గారి పాటలు ఆ సినిమాలో చిత్రీకరించిన విధానం అటువంటిది. ఇక నటీనటుల నటన అద్వితీయం.



సంగీతం, నటనతోపాటూ చిత్రకథ, కథనం, సినెమటోగ్రఫీ అన్నీ...అన్నీ నాకు ఈ సినిమాలో ఉత్తమం అనిపించాయి. ఈ మధ్య నేను ‘ముళ్ళపూడి రమణ’ గారి ‘సినీరమణీయం 1’ చదువుతుండగా ఈ చిత్రసమీక్ష కనబడింది. కానీ నా అభిప్రాయానికి భిన్నంగా రమణ గారి విమర్శ ఉండంతో, కొంత ఆలోచించి కారణాలను వెదకుతూ ఒక వ్యాసాన్ని నవతరంగం కోసం రాసాను. ఆ వ్యాసాన్ని ఈ లంకె ద్వారా చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.

ఏది తప్పు? (కవిత)


తప్పుచేసి, తప్పును తెలుసుకుని,
తప్పుని తప్పని తెలియజెప్పితే తప్పా?
నిజాన్ని నిఖ్ఖచ్చిగా నిగ్గుదేల్చక
నీరసంతో నివురుగప్పితే తప్పా!?!
తప్పుని "తప్పు" అనడానికి కావలసింది
నిజమెరిగిన చైతన్యమే తప్ప,
నిగడదీసిన నైతికత కాదుగా!
మరి తప్పన్న వారి
నైతికతపై ప్రశ్నచిహ్నాలెందుకు?
నివురుగప్పిన నిజాన్ని నిగ్గుదేల్చినందుకా!
లేక,
నీ మనసు నలుపుని నలుగురిలో నిలిపినందుకా?
ఏది తప్పు?
మూర్తీభవించిన చైతన్యమా!
ముసుగుతన్నిన మాలిన్యమా!!

Friday, July 11, 2008

మన పెళ్ళి ప్రాతిపదికే తప్పైతే?

కట్న గురించి రాసిన టపాలో, మన సాంప్రదాయ వివాహాల గురించి కూడా చాలా చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో ఠకాల్న మా కాలేజీలో ప్రొఫెసర్ రఘునాధ్ చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. తను అనేవారు, "in India marriages happen for wrong reasons" అని. తరచి చూస్తే అది చాలా నిజమని చాలా మంది అభిప్రాయాలు చెప్పకనే చెప్పాయి.



‘పెళ్ళి’ అనే ఒక వ్యవస్థ మానవమనుగడకి చాలా అవసరం అనేది అందరూ అంగీకరించే నిజం. ఇక్కడ సమస్య పెళ్ళి అవసరమా? కాదా? అన్నది కాదు. ప్రశ్న కేవలం ఈ విధానంలో అంగీకరించబడే పెళ్ళిల్లు అవసరమా? అన్నది మాత్రమే. సాంప్రదాయాలూ, కట్టుబాట్లు, ఆచారాల పేర్లతో కొన్ని పరిధులు అప్పటి కాలానికి అనుగుణంగా ఎర్పరుచుకుని వాటినే గుడ్డిగా ఇప్పటికీ ఆచరిస్తూ, అన్యాయమని అనిపించినా, ఆదరించడం అవసరమా అన్నదే మూల సమస్య.



అసలు పెళ్ళెందుకు? అని ప్రశ్నించికుంటే వచ్చే సరళమైన సమాధానం, సహచర్యం, సహజీవనం, సాంఘిక గౌరవం, సామాజిక ప్రగతి. ఈ నాలుగు విధానాలనూ/లాభాలనూ వివరంగా చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అందునా అర్థం చేసుకోవడానికి అవి మరీ బ్రహ్మపదార్థాలు కావు గనక, మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యత తెలిసినవే గనక ఎక్కువ వివరణ లేకుండా, కేవలం పేర్లు మాత్రమే ఉటంకించాను. మొదటి రెండు లాభాలూ వ్యక్తిగతమైతే, తరువాతవి మొత్తం సమాజానికీ, ప్రపంచ ఉనికికీచాలా అవసరం. కాబట్టి పెళ్ళి ప్రాముఖ్యతా, కొందరి దృష్టిలో పవిత్రతా ప్రశ్నార్థకాలు అస్సలు కావు.



కానీ పెళ్ళి మాటల మొదలు, చూపులూ, బేరసారాలూ, ఏర్పాట్లూ, విధివిధానాలూ, ఆచార సాంప్రదాయాలూ, హంగులూ, హంగామాలూ, ఆర్భాటాలూ, పలకరింపులూ, ప్రదర్శనలలోఎంత డొల్లతనం కనబడుతుందో తలుచుకుంటే, గుండె బేజారెత్తిపోతుంది. ఇక అనుభవిస్తే మెదడు మొద్దుబారిపోవడం ఖాయం. నిజానికి పెళ్ళిచేసుకుంటున్న మగాడు ఆడదానికి ఈ చాలా విషయాలలో అస్సలు సంబంధమే ఉండదు. ఇక ఈ ముఖ్యమైన నిర్ణయాలకి ప్రాతిపదిక తెలుసుకుంటే, హస్యంగా అనిపించినా చాలా అసహ్యమైన తంతు అని అంగీకరించాల్సిందే!



అందుకే మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో పెళ్ళికి ఎంచుకోబడుతున్న ప్రాతిపదిక మరియూ కారణాలను (అందరికీ తెలుసుగనక) కాస్త తలుచుకుందాం.

1. పరువూ - ప్రతిష్ట: మహా అయితే తాత, లేదూ ముత్తాత పేర్లు తప్ప కుటుంబ చరిత్రకూడా మనకెవరికీ తెలీదుగానీ, పరువూ ప్రతిష్ట అనేవి సినిమా డైలాగుల్లా ప్రతి పెళ్ళి తంతుముందూ బేరీజు చేసుకునే అతి ముఖ్యమైన విషయాలు. వాళ్ళ తాతలు నేతులు తాగారు కాబట్టి ఇప్పుడు మూతుల వాసన బాగానే ఉండొచ్చన కొండొకచో నిర్ణయాలు. మళ్ళీ ఎమైనా అంటే, "అటు ఏడుతరాలు, ఇటు ఏడు తరాలూ చూడకుండా పెళ్ళే!" అని బీరాలు. ఏడుసముద్రాల అవతల అమెరికాలో ఉంటే మాత్రం వాడెలాంటివాడో కూడా తెలీనవసరం లేకుండా పెళ్ళి మాత్రం ఖాయం చేసేస్తారు. అయినా ఇదొ గొప్ప కారణం. కులం ఇందులో ఒక మహత్తర భాగం పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పఖ్ఖరలెదనుకుంటా!


2. ఈడూ -జోడూ: ఇదొక పెద్ద హాస్య ప్రహసనం. సహజీవనానికీ, సాహచర్యానికీ అవసరమైన స్వారూప్యత(compatibility) ఎవరికీ అఖ్ఖరలేదు కానీ, ఎండకు మారిపోయే వంటి రంగూ, హీల్స్ వేసుకుంటే పెరిగిపోయే ఎత్తూ, కాస్త ఎక్కువ తింటే పెరిగిపొయే బరువూ వీళ్ళకు చాలా ముఖ్యం. ఇక అమ్మాయికి కళ్ళజోడుంటేనో, అబ్బాయికి బట్టతలుంటేనో ప్రపంచయుద్ధాలే జరిగిపోగలవు. అంటే పైపైమెరుగులు తప్ప, పెళ్ళికి అవసరమైన మానసిక హంగులు అస్సలు అవసరం లేవు. వీటికోసం జరిగే పెళ్ళిచూపుల తంతు గురించి ఆ టార్చర్ కు బలైన అమ్మాయినీ, ఆ విధానంలో ఇబ్బందిగా, దర్జాని వెలగబెట్టే అబ్బాయినీ అడిగి తెలుసుకోవాలి.


3. డబ్బూ - దస్కం: అబ్బాయికి సరైన ఉద్యోగం, అమ్మాయి తరఫున నుండీ సరితూగే కట్నం. ఇవి తరువాత వచ్చే ముఖ్యకారణం. ఇవి తెగితేకానీ పూజారి ముహూర్తం పెట్టడన్నమాట. ఇక్కడ ఎలాగూ మార్కెట్ ధరలు నిర్ణయించడం జరిగిపోయింది కాబట్టి అమ్ముకోవడానికీ, కొనుక్కోవడానికీ ఇక్కడ ఎలాంటి సిగ్గుబిడియాలూ కుటుంబాలకి ఉండవని ఇదివరకటి టపాలోనే తెలుసుకున్నాం.



పై మూడు ముఖ్య విధానాలు కాక ఇంకా చాలా ఉండొచ్చు కాని దాదాపు అన్నీ పై మూడింటిలో ఏదో ఒక భాగంలో చేరేవే అని నాకు అనిపిస్తుంది. అంటే పెళ్ళి అనే గమ్యం సరైనదేగానీ, దాన్ని చేరడానికి మన సమాజం ఎంచుకుంటున్న ప్రాతిపదిక (basis) తప్పులతడకగా అనిపించట్లేదూ? Though end can justify its means in many cases, what if the means is so mean? ప్రాతిపదిక ఇంత అర్థరహితంగా ఉంటే పెళ్ళిల్లు సుఖంగా ఉంటాయా అన్నది అడగవలసిన ప్రశ్న.



"కొన్ని తరాలుగా ఇలాగే జరిగింది, అందరూ సుఖంగా సంసారాలు చేసుకోవట్లేదూ?" అనేది చాలా మంది పెద్దల వాదన. నిజమే మా తాతయ్య-బామ్మల తరం, నాన్నా-అమ్మల తరం సుఖంగానే జీవించామన్న నమ్మకంలో ఉన్నారు. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాక భరించాలి, బాధ్యతను సహించాలి అన్న విశ్వాసం ఆ తరంవారి సొత్తు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయా? అందుకే ఈ దారి...సుఖమయ పెళ్ళి అనే గమ్యానికి నిజంగా పూలబాట కాకపోవచ్చు అనిపిస్తుంది.


If our present means or reasons for marriage are doubtful, Its our duty and responsibility to look for better ones.


---------------------

Thursday, July 10, 2008

కట్నానికి మరో వైపు

ఈ మధ్య యూనివర్సిటీలో కలిసి చదువుకున్న ఒక మితృడిని కలిస్తే కొన్ని వింత విషయాలు చెప్పాడు. అతని పేరు ప్రస్తుతానికి ‘శంకర్’ అనుకుందాం. వయసు 28, మంచి ఉద్యోగంకూడా చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతను వేరే రాష్ట్రంలో ఉన్నాడు. కానీ తన కుటుంబం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. గత రెండు సంవత్సరాలుగా అతనికి పెళ్ళి చేసే ప్రయత్నాలలో వారి కుటుంబం తలమునకలై ఉంది.



ఫోటో దశలోనే చాలా మంది అమ్మాయిల్ని జాతకం బాలేదనో, కుటుంబ పరపతనొ, అమ్మాయి పొడవనో, కురచనో,సరైన రంగుకాదనో సంబంధాలు ముందుకు సాగలేదు. అసలే అబ్బాయి చాలా దూరంలో ఉంటాడు కాబట్టి, ఆ రిజెక్షన్ల పర్వంలోకూడా తన మాట చెల్లింది కాదు. ఇంటికి ప్రస్తుతాని పెద్దదిక్కైన అక్కగారు ఈ విషయంలో తమ అధారిటీని, పవరాఫ్ అటార్నీనీ చాలా చక్కగా ఉపయోగించేసుకున్నారు.



మొన్న వేసవి శెలవుల్లో ఇంటికెళ్ళిన అబ్బాయికి (అదే మా శంకర్ కి), వచ్చిన ఫోటోల్లో ఒకమ్మాయి తెగ నచ్చేసి హఠాత్తుగా ప్రేమలో పడ్డాడు. బహుశా ఇంకో రెండేళ్ళు పోతే ముప్ఫై ముంచుకొచ్చి, ముదురు బెండకాయ అయిపోతాననికూడా భయమేసిందట పాపం. ఎమైతేనేం ! తన తర్క జ్ఞానం, నాస్తికత్వం మొదలగు ప్రావీణ్యాలతో జాతకాల్నీ, అమ్మాయి కుటుంబ ప్రతిష్టల్నీ తన కుటుంబ సభ్యులచేత పక్కనబెట్టించి, పెళ్ళిచూపులవరకూ లాక్కొచ్చాడు.



పెళ్ళిచూపుల్లో విజయవంతంగా అమాయిని "నచ్చింది" అనిపించాడు. ఇక అమ్మాయికూడా ‘మౌనం అర్థాంగీకారం’ అన్నఛందంలో సరేనంది. ఇక్కడ మొదలైంది అసలు వ్యవహారం. అసలే కట్నం తీసుకోకూడదని ఒక ఆదర్శం తగలడిన మా శంకరుడు, మనసాపుకోలేక, ఆ అమ్మాయితో తన హీరోయిజం నమూనా ప్రదర్శించలేక, మొదటగా వాళ్ళక్క చెవిలో ఈ ఆదర్శం గుళ్ళికని వేసాడు. అంతే! పెళ్ళిచూపులకొచ్చిన పెద్దలతో సహా అందరినీ వాళ్ళక్క అర్జంటుగా బయల్దేరదీసి, "ఇంటికెళ్ళి చర్చించి ఫోను చేస్తామండీ" అని పెళ్ళికూతురి తరఫు వాళ్ళకు చెప్పి ఇంటికి చక్కావచ్చేసారు.



ఇప్పుడు మొదలైంది అసలు కథ.

"కట్నం ఎందుకొద్దు?" అనే ఒక యక్ష ప్రశ్న మావాడి కళ్ళెదుట కనబడ్డ ప్రతివారిచేతా అడిగించేసారు.


"దానికి నేను వ్యతిరేకిని" అని వీడి పంతం.


"ఎందుకు వ్యతిరేకం?" అని వారి రెట్టింపు.


"అదొక సామాజిక దురాచారం" అని వీడి నీతిబోధ.


"అందరూ తీసుకుంటుంటే, నీకేంటి రోగం?" అని కొందరి అక్కసు.


"అందరూ తీసుకుంటే నేనూ ఆ వెధవపని చెయ్యాలా?" అని వీడి కోపం.


"కట్నం తీసుకున్నవాళ్ళంతా వెధవలనా నీఉద్దేశం?" అని, బోలెడు కట్నం తీసుకున్న మహామహుల పేర్లూ వారి గొప్పతన్నాన్నీ ఏకరువుపెడుతూ వీడిమీద అక్షింతలూ.... రంకెలూ.... ఎకసెక్కాలూ...ఎన్నో...ఎన్నెన్నో.



ఇవన్నీ భరించలేక వీడు పెట్టాబేడా సర్దుకుని రైలెక్కి చక్కా వచ్చేసాడు. తీరా వీడు తను పనిచేసే చోటుకు చేరగానే ఏడుస్తూ వాళ్ళక్కగారి ఫోను. "సరేలేరా! నీ కట్నం వద్దంటే వద్దన్నావ్, నాకు మాత్రం ఆడబడుచు కట్నం కావాలి. అది మాత్రం వద్దనకే" అని. వీడికి మతిపొయినంత పనైంది.



వెనువెంఠనే ఒక మేనమామగారి ఫోను. "కట్నం వద్దంటే, నీ మగతనాన్ని శంకిస్తార్రా వెధవా! ఇలాంటి తింగరి వేషాలు వెయ్యకు" అని ఆయన ప్రేమపూరిత సలహా. కట్నానికీ మగతనానికీ ఈ బీరకాయపీచు సంబంధం ఎలా కలిసిందో తెలీక వీడి ఖంగారు. అక్కడినుంచీ పారిపోయైతే వచ్చాడుగానీ, ఈ సమస్యల మధ్యన పనీ చెయ్యలేక, ఆ అమ్మాయిఫోటో చూసుకుంటూ, చిన్నసైజు దేవదాసులా ఒక కొత్తవాలకంగా తయారయ్యాడు. ఈ సమాధానం లేని సమస్యను మరోవైపునుండీ నరుక్కొద్దామన్న నిర్ణయానికొచ్చి, కాబోయే పొటెన్షియల్ మామగారికి ఒక ఫోనుగొట్టాడు.



ఎలా మాట్లాడాలో, అదీ కట్నం విషయం ఈ పెద్దాయనతో ఎలా చర్చించాలో తెలీక, కొంత అఖ్ఖరకు రాని లోకాభిరామాయణం తరువాత మెల్లగా, "అసలు కట్నం తీసుకునే ఉద్దేశం నాకు లేదండీ" అని కుండబద్దలు కొట్టకుండానే అసలు విషయం తెగేసాడు మా శంకరుడు. దానికాయన ఎస్.వి. రంగారావు గారిలా పెద్దరికంతో నవ్వి, "మీరడక్కపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది నాయనా. మాదానికి ఇంత అని ఆల్రెడీ బ్యాంకులో వేసే ఉంచాను" అని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఈ ముక్కతో మావాడి ఆదర్శానికికొక ఆకాశమంత చిన్న గండి పడింది. కొన్ని ధర్మ సందేహాలూ అర్జంటుగా పుట్టుకొచ్చాయి. "అడక్కుండా ఇస్తే దాన్ని కట్నం అంటారా?", "నేను వద్దన్నా వాళ్ళిస్తే, నా అదర్శానికొచ్చిన ఢోకా ఏమైనా ఉందా?", అనేవి ఆ సందేహాల్లో కొన్ని మాత్రమే.



ఎలాగూ కాబోయే మామగారితో ఈ విషయం చర్చించాడుగనక, మిగిలింది అమ్మాయే అనుకుని ఆ కొరతా మా శంకరుడు తీర్చుకున్నాడు. నానాతంటాలు పడి వాళ్ళింటి ఫోనులో ఆ అమ్మాయి గొంతున ప్రేమగా వింటూ తన ఆదర్శాన్ని కాస్త గర్వంగా చెప్పుకొచ్చాడు. దానికి ఆ అమ్మాయి సంతోషించకపోగా "అలా అంటే ఎలాగండీ? మా అక్కకి పది లక్షలిచ్చారు. అదీ టీచరుకి. మీరైతే ఏకంగా లెక్చరర్ ఆమాత్రం ఇవ్వకపోతే విలువేముంటుంది" అని బాధగా అన్నదట. అంతే ఈ దెబ్బకి మావాడు ఢమాల్! వాడి పని టకాల్, టకాల్ అయికూర్చుంది.



కట్నానికి కాకపోయినా ఆడబడుచు కట్నానికి సై అనాలి. పూర్తిగా ఏమీ వద్దంటే తన మగతనానికి నీళ్ళొదులుకోవాలి. ఆడగకపోయినా ఆడపెళ్ళివారు డబ్బిస్తే దాన్ని కట్నమే అనుకోవాలి. వద్దంటే ఇటు కాబోయే మామగారికీ, కాబోయే పెళ్ళాం సామాజిక గౌరవానికొక దెబ్బ. ఇలా తన ఆదర్శం వల్ల సాఫీగా పెళ్ళి జరక్కపోగా. మరిన్ని సమస్యలొచ్చిపడ్డాయి.



ఈ సమస్యలన్నీ నాకు ఏరువుపెట్టి, "సలహా ఇవ్వరా గురుడా" అంటే, "తాట తీస్తా వెధవా! కుటుంబంకోసం పెళ్ళికావాలంటే, కట్నం తీసుకుని సుఖపడు. ఆదర్శంగా పెళ్ళాడాలంటే, చుట్టుపక్కల దొరికినమ్మాయిని దొరికినట్టు ప్రేమించేసి పెళ్ళికి సరే అనిపించూ, మీ పెళ్ళి హైదరాబాదు ఆర్యసమాజ్ లో జరిపించడానికి పరుగు సినిమాలో అల్లుఅర్జున్ లాగా ఇంకొంతమంది స్నేహితుల్ని తీసుకొచ్చి అరెంజిమెంట్లు చేసి ఆశీర్వదించేస్తా" అని చెప్పా.



పాపం ఇప్పుడు మా శంకరుడు ఏనిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి!

-----------------------------------

Tuesday, July 8, 2008

జ్ఞాపకాల్ని అక్షరబద్ధం చేద్దాం రండి !


ప్రియమైన బ్లాగరులారా, సాధారణంగా చావా కిరణ్ గారు బ్లాగుల్లో రాయవలసిన ‘ఈ పక్షం విషయం’ సూచించేవారు. కానీ ఈ సారి నాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది.



"Memory is a way of holding on to the things you love, the things you are, the things you never
want to lose"
అంటారు. అంటే, మననుండీ ఎప్పటికీ విడిపోని, కోల్పోని, ప్రియమైన గుర్తులే జ్ఞాపకాలు అని. ఎంత అందమైన ఆలోచన!



జ్ఞాపకాలే లేకపోతే మన జీవితం ఇంత అద్భుతంగా అనిపించేదా? అందుకే అనుకుంటా బహుశా, "A memory is what is left when something happens and does not completely unhappen" అంటారు. ప్రతి మనిషి జీవితంలో ఈ జ్ఞాపకాలుంటాయి. కొన్ని తీపి, కొన్ని చేదు, కొన్ని వగరు, కొన్ని అద్భుతం, కొన్ని అతిశయం మరికొన్ని ఆనందాన్ని తమలో ఇముడ్చుకుని మన హృదయాంతరాలల్లో నిక్షిప్తంగా ఉండిపోతాయి.



వాటిని తట్టిలేపుదాం... ఆకారాన్నిద్దాం.... అక్షరాల్లో ఇముడ్చుదాం...అందరితో పంచుకుందాం.



"Every man's memory is his private literature" మన బ్లాగులు మన భావవ్యక్తీకరణ ప్రపంచాలే కనుక, మన జీవన సాహిత్యాన్ని మనదైన శైలిలో పంచుకుందాం.



అందుకే, ఈ పక్షం (15 రోజుల) విషయం "మర్చిపోలేని జ్ఞాపకాలు". ఈ రోజు 8 జూలై నుండీ 23 జూలై వరకూ మనమన బ్లాగుల్లో ఈ విషయంపై టపాలు రాద్దాం. ఎక్కువ స్పందనను పొందిన టపాను ఉత్తమ టపాగా ఎంచి గౌరవిద్దాం.



-------------------------------------

Monday, July 7, 2008

మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారు ? Part 2

‘ఈవ్ టీజింగ్’ పైన ఇంతకు మునుపు నేను రాసిన టపా పై జరిగిన చర్చ దాదాపు మొరాలిటీ (morality) పై ఉండటం కాస్త ఆశ్చర్యంతో పాటూ బాధని కలిగించింది. దానితో పాటూ సెక్స్ గురించి ఉన్న సామాజిక విలువల పట్ల మన భారతీయుల్లో ఉండే over obsession విస్మయానికి గురిచేసింది. కొన్ని ఆలోచనల తీవ్రత ఎలా ఉందంటే, ‘మనుషుల్ని చంపైనా సరే దేవాలయాన్ని నిర్మిస్తాం’ అనే తీరులో, ‘ఈవ్ టీజింగ్ ఉన్నా ఫరవాలేదుకానీ మన సమాజ విలువల్ని మాత్రం ప్రశ్నించకూడదు’ అన్నట్లుగా అనిపించాయి.

మూలకారణం ఇదీ అని కొన్ని పరిశోధనలు చెబుతున్నా, ఆ పరిశోధనల్ని ప్రశ్నిస్తున్నామేగానీ, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని కనీసం తమకు తోచిన పరిష్కారాన్ని చెప్పలేకపోతున్నాం. కొందరు కొన్ని పరిష్కారాలు చెప్పడంకూడా జరిగింది. ఆ చర్చల్ని క్రోడీకరించి ఇక్కడ అసలు సమస్య తీవ్రతని విపులంగా చర్చించడానికి ప్రయత్నిస్తాను. పరిష్కారాలు ఈ టపాకు వచ్చిన స్పందనల్ని దృష్టిలో ఉంచుకుని తరువాత భాగంలో వివరిస్తాను.

‘ఈవ్ టీజింగ్’ అనే పదం ఈ సమస్య తీవ్రతను మరుగుపరుస్తోందని నా అనుమానం. అసలు ఈ పదానికి అర్థమేమిటి? థెసారస్ డిక్షనరీ ప్రకారం, ఈ పదం native English పదం కాదట, దీని పుట్టుక మన భారతదేశంలోనే జరిగింది. దీని అర్థం "harassment of women". ఈ అర్థం యొక్క అమానుషత్వం ఆ పదంలో కనబడుతోందా, అన్నది ప్రశ్నార్థకమే! అంటే, ఈ పదం ప్రయోగమే సమస్యను సాంకెతికంగా మరుగుపరిచడానికి (euphemism) చేసిన ప్రయత్నమన్న మాట.

ఇక సమస్య తీవ్రత గురించి చెప్పాలంటే, చాలా మంది మహిళలు...కాదు కాదు...అందరు భారతీయ మహిళలూ ఈ సమస్యను ఏదోఒక స్థాయిలో అనుభవించినవారే.మరి ఇంత విస్తృతమైన ఉన్న ప్రాబ్లమ్ గురించి కనీసం పెద్దస్థాయి చర్చకూడా ఎందుకు జరగదంటే, ‘ఇలాంటివి జరుగుతూ ఉంటాయ్, వీటి గురించి మర్చిపోవాలి’ అనే నిరాసక్తత. మానభంగం జరిగినా ‘she might have asked for it' అనే మగదృక్కోణం (ఇది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది). ‘ఇది మామూలే’ అనే అలవాటుపడినతనం. ‘ఇలాంటివి బయటకి చెప్పుకుంటే, సిగ్గుచేటు’ అనే సామాజిక కండిషనింగ్. వెరసి ఇదొక వికృత సామాజిక రుగ్మత అన్న నిజం మరుగునపడిపోయి, స్వేచ్చగా ఆడవాళ్ళని ఈ సమస్యను అనుభవించడానికి వదిలేసాం. చాలా గొప్ప "యత్ర నార్యస్తు పూజ్యంతే" సంస్కృతి కదా మనది! ఆ మాటే నిజమయ్యుంటే, ఈ దేశంలో దేవతలు కాదు దెయ్యాలు వాసం చేస్తుండాలి.

ఈ సమస్య యొక్క రూపాల్ని కొంత చూద్దాం.

చూపులు
: దీనికి ముద్దుగా దీన్ని ‘సైట్ కొట్టడం’ అని పేరు. యుక్తవయసులో అమ్మాయి అబ్బాయిల్నీ, అబ్బాయిలు అమాయిల్నీ చూసుకోవడం సహజం. కానీ ఇది ‘సమస్యగా’ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తయారవుతుంది. కాలేజిలో నా స్నేహితురాలు ఈ విషయంగా బాధపడుతుంటే, "అబ్బాయిలు చూడకపోతే, చూడలేదంటారు. చూస్తే ఇలా బాధపడతారు" అని నేన్నదనికి తను , "looking is OK with us, but preying at us is not very acceptable" అంది. తన భావం తెలుగులో చెప్పాలంటే, "చూడ్డం వరకూ మాకు సమస్యలేదు, కాని తినేసాలా చూస్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది" అని. ఈ విషయాన్ని కాస్త పొడిగిస్తే, ‘కొందరి మగాళ్ళచూపులు, కళ్ళతోనే బట్టలు ఊడదీసినట్టుగా అనిపించి అసహ్యం వేస్తుంది’ అని. ఇప్పుడీ చూపులకి మొబైల్ కెమెరాలూ, రివ్యూ మిర్రర్ లూ తోడయ్యాయి.అంటే సమస్యని ఎంత లోతుగా అర్థంచెసుకుంటే అంత అసహ్యం వేస్తుందని నాకు తెలిసింది. అసలు సమస్యే లేదు, ఇదొక accepted culture అనుకుంటే, అసలు సమస్యే లేదు అని కూడా అర్థమయ్యింది. కానీ I prefer to understand the issue rather than keeping it under the carpet.


కూతలు :
ఇంగ్లీషులో cat calling అనే ఒక పదం ఉంది. ఈ విధానానికి తగిన పదం అదే అనుకుంటా. అమ్మాయిలను చూడగానే అరుపులూ, కేకలూ,ఈలలూ వెయ్యాలనిపిస్తుంది కొందరికి. ఈ కామెంట్లు అమ్మాయి డ్రస్సుతో మొదలై అంగాల వర్ణన వరకూ వెళ్తాయి. ఇక్కడ హద్దులు కొన్నిసార్లు ఎంతగా మితిమీరిపోతాయంటే, ఈ ప్రబుద్ధులు చిన్నపిల్లల్ని కూడా వదలరు. "పిల్లే ఇంత బాగుంటే, తల్లెలా ఉంటుందో" అనికూడా తమ సృజనాత్మకతనూ, extended imagination ను ప్రదర్శిస్తారు.ఈ వికృతం సాధారణంగా గుంపులుగా ఉండే మగవాళ్ళు చేస్తారు. ఒంటరిగా ఉంటే నోరు కూడా పెగలని మగాడు, మంది తోడుంటే మృగమైపోతాడన్నమాట. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ఈ సంస్కృతి ‘మెజారిటీ’కి అంగీకారమైనది అని. మన ప్రజాస్వామ్యం ప్రకారం దీనికి లైసెంస్ ఇవ్వాల్సిందే. కొందరిని ఇలా ఎందుకు చేస్తారని అడిగితే "just for fun" అన్నారట. ఎదుటివాళ్ళు ఎంత బాధపడతారో కూడా తెలీకుండా అనుభవించే ఆనందాన్ని fun అనాలా, లేక పైచాచికత్వం అనాలా? ఆడాళ్ళుపడే బాధకి కొలమానాలు లేవుగనక, let them have fun అనుకుని సరిపెట్టుకుందామా?

చేతులు - చేతలు:
బస్టాపుల్లో,బస్సుల్లో, వర్క్ ప్లేస్ లో, బజార్లో , షాపింగ్ మాల్లో, లోకల్ ట్రైన్ లో, సినిమా హాల్లో ప్రతిచొటా ‘యాక్సిడెంటల్’ గా తగిలే చేతులు, ఆ చేతులు అప్పుడప్పుడూ మితిమీరి చేసే చేతలు. ఇది, ఈ సంస్కృతిలో మరోస్థాయి. ఎందుకు చేస్తారూ అంటే, "I get a guilty pleasure out of it" అన్నాడత ఒక పట్టుబడిన ఈవ్ టీజర్. తప్పని తెలుసు, కానీ అలా చెయ్యడంలో ఆనందం అనుభవిస్తాడట. అది ఒక మానసిక రుగ్మతలాగా వినిపించడం లేదూ? అంటే, మన చుట్టుపక్కల చాలా మంది ఇలాంటి మానసి రోగులున్నారన్నమాట.మరి వీరిని చికిత్స చేసి బాగు పరుద్దామా? పోలీసులకు పట్టిచ్చి శిక్ష వేయిద్దామా? లేక మూలాలని తెలుసుకుని పరిపూర్ణగా సమాజాన్ని శుద్ది చేద్దామా?పైన చెప్పిన అన్ని దశలూ sexuality కి సంబంధించినవైతే, మరి సమాధానం ఎక్కడ వెదకాలి ? పరిష్కారం ఎక్కడ చూడాలి? సమస్య లేదనుకుని కళ్ళు మూసుకుందామా? ఉన్నా అది మన ఆడవాళ్ళకి రాలేదని తృప్తిపడదామా? సమస్యకు సమాధానంగా పరిశోధనలు చెప్పినవాటిని "నేతి నేతి"(ఇది కాదు ఇది కాదు) అని వాయిదా వేద్దామా? తప్పించుకు తిరుగుదామా? మన సామాజిక విలువల్ని గట్టిగా పట్టుకుని మహిళల్ని మాత్రం ఈ పైచాచికానికి బలిచేద్దామా?చర్చ జరగాలి. సమాధానాలు కావాలి. అవి తప్పుడు అపోహలనుంచీ కాక విజ్ఞత, వివేచన కూడిన ఆలోచననుంచీ రావాలి.

----------------

Saturday, July 5, 2008

మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారూ?

కాలేజిలో ఉండగా, మా హాస్టల్ ఎదురుగానే ఒక పోస్టఫీస్ ఉండేది. ప్రతిరోజూ కాలేజికి వెళ్ళే ముందు, కొంత మంది అమ్మాయిలు తాము ఇళ్ళకు రాసిన ఉత్తరాలు అక్కడ పోస్ట్ చేసి వెళ్తుండేవారు. ఒక రోజు నేను బయటకు రాగానే, గేట్ దగ్గర పేపర్ చదువుతున్న జూనియరొకడు ఉత్తరం పోస్ట్ చెయ్యడానికొచ్చిన అమ్మాయి డ్రస్సు గురించి పెద్దగా ఆ అమ్మాయికి వినపడేటట్టు కామెంట్ చెయ్యడం వినిపించింది. సాధారణంగా ఈ విషయం చికాకుని కలిగించినా, ఆ అమ్మాయి నాకు తెలిసినదవ్వటం వల్ల కొంత కోపంకూడా వచ్చింది. అయితే మా జూనియర్ అన్నది "ఒహో! కత్తి లాంటి డ్రస్" అని మాత్రమే. అప్పుడే నాకొక ఆలోచనొచ్చింది. వెంఠనే ఆ అమ్మాయిని అక్కడే ఆగమని చెప్పి, మా జూనియర్ని పట్టుకెళ్ళి తనకి introduce చేసాను. పరిచయం చేస్తూ, "he was appreciating your dress today" అని ఆ అమ్మాయితో అన్నాను. దానికి ఆ అమ్మాయి వీడ్ని చూసి ఆనందంగా, "thank you" అంది. ఆ తరువాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు లెండి! అది వేరే విషయం.



కానీ ఈ సంఘటన జరిగిన తరువాత ‘ఈవ్ టీజింగ్’ గురించి కొంత ఆలోచించటం జరిగింది. ఈ వికృత సంస్కృతి, డ్రస్సు గురించి కామెంటడంతో మొదలై, అమ్మాయిల శరీరాంగాల వర్ణన నుంచీ, అసభ్య పదజాలంతో ‘పిలవడం’తో పాటూ, అభ్యంతరకరంగా తాకడం వరకూ ఎన్నో రూపాల్లో ఉంటోంది. మహిళల్ని గౌరవిస్తామని చెప్పుకునే మన భారతదేశంలో 1993వ సంవత్సరంలోనే దాదాపు 84,000 కేసులు రిజిస్టెర్ అయ్యాయి. ఇక రిజిస్టర్ కానివి లక్షల్లో ఉంటాయని అస్సలు సందేహం లేదు. ఇక మరో ఆసక్తికరమైన కోణం ఏమిట్రా అంటే, ఈ కేసుల్లో అరెస్టు చెయ్యబడిన కుర్రాళ్ళలో 32% కాలేజీలకు వెళ్ళే గౌరవప్రదమైన కుటుంబాల నుంచీ వచ్చిన వాళ్ళు. ఈ విపరీతాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం 1998లో ఒక ఆర్డినెన్స్ ఈ విషయంగా పాస్ చేసింది. దీని ప్రకారం ఇలాంటి నేరాలకి పాల్పడినవాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటూ 10,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇలాంటి చట్టాలు తమిళనాడుతో పాటూ దాదాపు దేశమంతా చేయబడ్డాయి. అయినా ఈ చట్టాలు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకమే.



ఈ విషయం మీద జరిగిన కొన్ని పరిశోధనల్ని తీసుకుంటే, మన సమాజంలోని అణగద్రొక్కబడిన లైంగిక విధానం (suppressed sexual life style) నుండీ, సినిమాలు, అమ్మాయిల ఆహార్యం (dressing pattern) , మగాళ్ళలో తమ మగతనం పట్ల ఉన్న అపోహలూ లాంటి చాలా కారణాల్ని గుర్తించారే తప్ప, వాటిని మార్చడానికి చెయ్యాల్సిన ప్రయత్నాల పట్ల దృష్టి నిలిపినట్లుగా అనిపించదు. చట్టాన్ని చెయ్యటం అనే ఒక చిన్న భాగాన్ని మాత్రమే చెయ్యగలిగిన ప్రభుత్వం, మిగతా కారణాలలో కనీసం నామ మాత్రంగానైనా మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడటం లేదు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య, దీన్ని సమూలంగా మార్చాలంటే, మన సమాజ నిర్మాణాన్ని fundamental గా alter చెయ్యాలి అనిపిస్తుంది. అంటే, ఇప్పట్లో ఆడవారికి ముక్తి లేదన్నమాట! కానీ, కనీస ఇందుకోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఇటు సమాజం, అటు ప్రభుత్వం కనపడకపోవడం మరింత ప్రమాదకరంగా కనబడుతోంది.



సెక్స్ ఎడ్యుకేషన్ అంటే, అదేదో పాపంలా చూసే సమాజం-రాజకీయాలూ ఉన్నంత వరకూ అపోహలు దూరం కావు. అమ్మాయిలూ అబ్బాయిలూ టీనేజి -కాలేజి వయసుల్లో గౌరవప్రదమైన సంబంధాలు నెరిపే అవకాశం ఇవ్వనంత కాలం, పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వీరికి రాదు. లైంగిక సంబంధాలకి, నైతికం ముసుగులు తొడిగి రహస్య వ్యభిచారానికి ప్రోత్సాహం ఇచ్చినంత కాలం, అణగద్రొక్కబడిన లైంగిక జీవితాలు బాగుపడవు. ఇక సినిమాలంటారా, హీరో "పచ్చి పచ్చిగా" హీరోయిన్ని ప్రేమిస్తేగానీ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టర, మనకు హిట్ సినిమా రాదు. ఇక ఉన్న చట్టాన్ని సక్రమంగా ఉపయోగించి శిక్షలు పడేటట్లు చెయ్యనంతకాలం ఈ విఛ్చలవిడితనం ఎలాగూ కొనసాగుతుంది.




అంటే ఈ విషయాన్ని గురించి చర్చించడం, వీలైతే కొంత బాధపడటం, లేదా చూసీచూడనట్టు నటించడం, మన ఇంట్లోని ఆడవాళ్ళకి ఇలా కాకూడదని ప్రార్థించడం మినహా మనం చెయ్యగలిగింది ఏమీ లేదన్నమాట!



(ఇప్పుడే గ్రహించాను ! ఇది నా 50 వ టపా....అంటే అర్థ శతకం దాటానన్నమాట )

-----------------------------------

కొన్ని అద్భుతమైన ఛాయాచిత్రాలు, మీకోసం!






ఈ మధ్య మా ఆఫీసులో ఏవో ఫోటోల కోసం కంప్యూటర్లో వెదుకుతుండగా, ఈ ఫోటోలు దొరికాయి. అద్భుతంగా అనిపించిన ఈ మధ్యప్రదేశ్ లోని గిరిజనుల ఫోటోలను మీకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను. చూసి ఆనందించండి !

Friday, July 4, 2008

పోలీసులకు మానవ హక్కులు లేవా?

జూన్ 29 న చిత్రావతి రిజర్వాయర్ దగ్గర, సీలేరు నది దాటుతున్న గ్రేహౌండ్స్ దళాలపై నక్సల్స్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 35 మంది పోలీసులు గల్లంతయ్యారు. వీరిలో కొందరు జలసమాధి అయ్యుండొచ్చనీ, మరి కొందరు నక్సల్స్ కు బందీలుగా చిక్కిఉంటారని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో చదువరి గారు తమ బ్లాగులో చాలా సంవేదనాత్మకమైన టపారాసి, కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు.




వారు లేవనెత్తిన ఒక ముఖ్యమైన ప్రశ్న"వాళ్ళకు (పోలీసులకు) లేవా హక్కులు? అని. ఈ ప్రశ్నతోపాటూ, నక్సల్స్ పట్ల ఇలాంటి హింస జరిగితే సర్వత్రా వాపోయే మానవ హక్కుల సంఘాల దృక్పధాన్నీ, పంధానీ ప్రశ్నించడం కూడా జరిగింది. నిజానికి ఇవి చాలా సహేతుకమైన ప్రశ్నలూ, బహుశా చాలా మంది మనసుల్లో ఎప్పటినుండో మెదిలే ప్రశలుకూడా. కాకపోతే, ఈ ప్రశ్నల గురించి అర్థవంతమైన చర్చ ‘రాజ్య హింస - మానవ హక్కులు’ అనే విషయం గురించి కూలంకషంగా తెలిస్తేగానీ, అంత సులభంగా జరపలేం. ఎందుకంటే మనలో చాలా మందికి అభిప్రాయాలు ఉంటాయేగానీ, దానికి తగిన సమాచారం ఉండదు. అందుకే, నాకు తెలిసిన కొంత భారతదేశంలో మానవహక్కుల పరిణామక్రమం యొక్క సమాచారాన్ని స్థూలంగా ఇక్కడ పొందుపరుస్తూ, చర్చని కొనసాగిస్తాను.



1936లో మొదటిగా మన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
Indian Civil Liberties Union (ICLU) ని స్థాపించారు. దీని యొక్క ఉద్దేశ్యం వీరి మాటల్లోనే చెప్పాలంటే, The question of civil liberties arise not when the people of a country obediently carry out the orders of a government. It arises only when there is a conflict between the people and the executive authority. The idea of civil liberties is to have the right to oppose the government". ఈ మూల సిద్ధాంతం ఇప్పటికీ వర్తిస్తుంది.



ఈ ఉద్యమ పరిణామాన్ని తీసుకుంటే, దాన్ని మూడు దశలుగా సామాజిక శాస్త్రవేత్తలు విభజించారు. స్వాతంత్ర్యానంతరం నుండీ 70 ల ఆరంభం వరకూ ఈ ఉద్యమానికి ఒక విస్తృత రూపం లేదు. అందుకే దీని మొదటిది విస్తృత దశ 70లలో మొదలైందని చెప్పొచ్చు. దీన్ని ‘civil liberties phase’గా అనుకోవచ్చు. ఈ దశలో, రాజ్యం (State) తో కలిసి పౌరహక్కుల ఉల్లంఘన కాకుండా, ఒక సామరస్యమైన పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం మార్గాలు వెదకడం జరిగింది.ఈ దశలో ప్రాధమిక హక్కుల కోసం ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలతో పాటూ, చట్టం న్యాయం వంటి వ్యవస్థల స్వయంప్రతిపత్తి కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యింది. ‘State ఈ వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది’ అన్న అభిప్రాయం ఈ ఉద్యమ స్ఫూర్తికి మూలం.



1975-77 ఎమర్జన్సీ సమయంలో, రాజ్యం యొక్క విశృంఖల రూపాన్ని చూసిన ఉద్యమకర్తలు 80లలో మరో పంధాను ఎంచుకున్నారు. అదే ప్రజా హక్కుల కోసం పోరాడడం, ‘rights based civil society’. ఇది రెండో దశ. ఇందులో చాలా స్పష్టంగా sate Vs civil society కోణం కనబడుతుంది. పౌర హక్కుల పరిధి, రాజ్యపరిధికి వెలుపలనున్న ఒక స్వతంత్ర్య పరిధి (realm of freedom) గా నిర్వచించడం జరిగింది. అప్పుడే రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధపోరాటాల్ని ఈ ఉద్యమం క్రిందకు తీసుకురావడం జరిగింది. నక్సలిజం అందులో ఒకటి.



మూడో దశ 90లలో మొదలైంది, ఇది మానవ హక్కులకు (human rights phase) సంబంధించినది. ఈ దశలో పౌర సమాజం, రాజకీయ వ్యవస్థను తమకు విరోధిగా గుర్తించింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందని చెప్పొచ్చు. రాజకీయ వ్యవస్థ తెలివిగా, సామాజిక జీవనంలో ఉన్నటువంటి నక్సలిజం లాంటి సాయుధపోరాటాల్ని కూడా హక్కుల ఉల్లంఘనగా ఎంచి, వాటిని ఖండించడంతో పాటూ, విజయవంతంగా అణగదొక్కడానికి ప్రజా అంగీకారాన్ని కూడగట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ పరిణామాలకు ఏమి చెయ్యాలో పాలుపోని ఉద్యమకారులు, నైతిక విలువలు అనే abstract కోణంలో తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. అందుకే వారు ఇప్పుడు చెప్పేవి మనకు కాస్త ఆమోదయోగ్యం కాకుండా అనిపిస్తాయి.



ఇక ప్రస్తుతం ఉన్న సమస్య కొస్తే, చనిపోయిన పోలీసులకు సంతాపం ప్రకటించడం, దానితో పాటూ నక్సల్స్ దుశ్చర్యల్ని ఖండించడం మనుషులుగా మనమందరం చెయ్యాల్సిన పని. కాకపోతే, మానవహక్కుల అద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని, ప్రభుత్వంతో పోరాడుతున్న మానవ హక్కుల సంఘాలను "మీరు నక్సల్స్ కి మాత్రమే వత్తాసు పలుకుతారా? పోలీసులకు మానవహక్కులు లేవా?" అని ప్రశ్నించడం అంత తార్కికం కాదు. ఎందుకంటే, ప్రభుత్వం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న పోలీసుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను విస్మరించి ఈ దారుణానికి పరోక్షంగా కారణమైన ప్రభుత్వ అలసత్వాన్నీ, నిరాసక్తతనీ, మితిమీరిన నమ్మకాన్నీ మనం కలసికట్టుగా గర్హించాలి. ఈ మానవ హక్కుల సంఘాలుకూడా, నక్సల్స్ చేతిలో ఉన్న అమాయక పోలీసులను విడిపించడంతో పాటూ, చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సరైన ప్రభుత్వ సహాయం అందేలా చూడాలి.



పోలీసులకూ మానవ హక్కులున్నాయి. వాటి పరిరక్షణ బాధ్యత ఉద్యోగమిచ్చి వారి తరఫున పోరాడమని చెబుతున్న ప్రభుత్వానిది. మానవ హక్కుల సంఘాలు పని, ప్రభుత్వ పరంగా మానవ హక్కుల ఉల్లఘన జరగకుండా పోరాడటం . ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తేనే మన సమాజంలో శాంతి నెలకొనేదీ, మనం సుఖంగా మనగలిగేదీ. ఈ సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ వాక్యాలు గుర్తుకొస్తాయి....

సురాజ్య మవలేని
స్వరాజ్య మెందుకని?
సుఖాన మనలేని
వికాస మెందుకని?
అడుగుతోంది అదిగో...
ఎగిరే భరతపతాకం.

--------జై హింద్------




Thursday, July 3, 2008

‘శాం’ మానెక్ షా కి నివాళి

భారతదేశ మొదటి ఫీల్డ్ మార్షల్, అందరూ ప్రేమగా "శాం బహదూర్" అని పిలిచే,  ‘శాం హార్ముస్జీ  ప్రేమ్జీ జంషెడ్జీ  మానెక్ షా’ గారికి నివాళిగా,  ఒక అజ్ఞాత సైనికుడి ఆంగ్ల కవితని ఇక్కడ పొందు పరుస్తున్నాను. 



మానెక్ షా గారి అంతిమయాత్రలో చాలా మంది రాజకీయ ప్రముఖులూ, ప్రభుత్వ ప్రతినిధులూ పాల్గొనకపోవడం, నాకు చాలా బాధ కలిగించిన విషయం. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పర్యటనలో ఉండగా, ప్రధాని మన్మోహన్ సింగ్ మరియూ రక్షణ శాఖామంత్రి ఏ.కె. ఆంధొని ఢిల్లీలో ఉండికూడా హాజరుకాకపోవడం విచారకరం. 1971 లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరు చూపిన ధైర్యం, సాహసం, ముందుచూపూ మనకు విజయాన్ని తెచ్చిపెట్టిందన్న నిజం తోపాటూ, తరువాత కాలంలో చాలా పదవులు నిర్వహించి భరతమాత సేవ చేసిన ఈ వీరుడికి, మరణానంతరం  తగిన గౌరవం అందలేదు అనిపించింది.


అందుకే, ఒక  అజ్ఞాత  సైనికుడి ఆవేదనను ప్రతిఫలించే కవితని ఇక్కడ పొందు పరుస్తున్నాను.


What I am worth…



I hear, we have crossed the sixtieth year,
Standing guard without any fear,
Another day in the desert sun,
Or a night at height, with a freezing gun,
Tell me my India 'What I am worth.'

For the Battles and Wars that I fight,
Never asking which one is right,
From Dawn to Dusk and then to Dawn,
Your Bishop, Your Knight Your Eternal Pawn,
Tell me my India 'What I am worth.'

While you fill your coffers today,
Wondering where and how to make,
Another fortune, another buy,
Your aspirations are now touching the Sky,
Tell me my India' what I am worth.'

You make a mention on your political line,
Come to my post, wine and dine,
Then run to your stock, while I stand your guard,
Killing and dying but still fighting hard,
Tell me my India' what I am worth.'

The other day I was on TV too,
You came up to me with your educated crew,
Told me to speak cos you seemed to care,
Wrote your story stripped me bare.

I was so naive I didn't know,
For you it was the nine o'clock show,
The country wants to hear some line,
Before they sleep, knowing they are fine,
Tell me my India' what I am worth.'

My Men tell me, that they are strong,
Would fight for their country, for all that's wrong,
While I tell them to stand and fight,
You ignore my existence, my very right,
Tell me my India' what I am worth.'

I thought I would tell my children in time,
How I fought for this country, this love of mine,
I wonder, if I should mention it though,
Don't want them embarrassed, while they start to grow,
Tell me my India' what I am worth.'

I was your ambition, your child hood dream,
Your Pilot, Your Sailor your Jawan in green,
Where did we part as friends, our ways
I never let you down a single day,
Tell me my India' what I am worth.'



---------------------------------

Wednesday, July 2, 2008

రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) - ఒక సామాజిక విశ్లేషణ

రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది ఏమైనా, ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా చరిత్ర శకాల్ని మార్చిన ఈ దర్శకుడు, ముంబై వచ్చి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించి భారతీయ సినీజగత్తులో కూడా ఒక కలకలాన్ని రేపాడన్నది కాదనలేని నిజం.



ఈ పరిణామక్రమంలో చాలామంది గౌరవించదగ్గ సినీదర్శకుల లాగే, తన సినిమాలలో వర్మ తనకు తెలిసిన సమాజ పార్శ్వాన్ని తెరబద్ధం చేసాడని నా విశ్వాసం. కల్పిత కథలూ, ఏడుపుగొట్టు చిత్రాలు, నిజానికి దూరమైన చిత్రీకరణ పరంపరల నడుమ, వర్మ సమాజంలోని ఒక చీకటి కోణాన్ని సహజమైన చిత్రీకరణల మధ్య విజయవంతంగా తెలుగు, భారతీయ సినిమాలకు పరిచయం చేసాడు. మనం ఎంత అసహ్యించుకున్నా, చీకటి ప్రపంచం (underworld) ఒక నిజం. మన సమాజంలో ఉన్న ఒక ముఖ్యమైన కోణం. సమాజంలో ఈ కోణం యొక్క అంచలంచల ఎదుగుదల పరిణామ క్రమం తన సినిమాల రూపంలో, తన కధానాయకుల రూపంలో "రికార్డ్" చేసాడు అనిపిస్తుంది.



అందుకే తన మొదటి సినిమా ‘శివ’, తనదంటూ ఒక శైలిని ఏర్పరిచిన ‘గాయం’ , వర్మ స్టైల్ ను ఒక శిఖరాగ్రానికి చేర్చిన ‘సత్య’ సినిమాలను తన త్రిచిత్రాలు (Trilogy)గా ఎంచి, ఒక సామాజిక విశ్లేషణ చెయ్యడం జరిగింది. ఆ విశ్లేషణ "ఈ మాట" నెట్ పత్రికకోసం రాసాను. ఈ లంకె ద్వారా ఆ విశ్లేషనాత్మక వ్యాసాన్ని చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.




---------------------------------------------