Thursday, July 10, 2008

కట్నానికి మరో వైపు

ఈ మధ్య యూనివర్సిటీలో కలిసి చదువుకున్న ఒక మితృడిని కలిస్తే కొన్ని వింత విషయాలు చెప్పాడు. అతని పేరు ప్రస్తుతానికి ‘శంకర్’ అనుకుందాం. వయసు 28, మంచి ఉద్యోగంకూడా చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతను వేరే రాష్ట్రంలో ఉన్నాడు. కానీ తన కుటుంబం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. గత రెండు సంవత్సరాలుగా అతనికి పెళ్ళి చేసే ప్రయత్నాలలో వారి కుటుంబం తలమునకలై ఉంది.



ఫోటో దశలోనే చాలా మంది అమ్మాయిల్ని జాతకం బాలేదనో, కుటుంబ పరపతనొ, అమ్మాయి పొడవనో, కురచనో,సరైన రంగుకాదనో సంబంధాలు ముందుకు సాగలేదు. అసలే అబ్బాయి చాలా దూరంలో ఉంటాడు కాబట్టి, ఆ రిజెక్షన్ల పర్వంలోకూడా తన మాట చెల్లింది కాదు. ఇంటికి ప్రస్తుతాని పెద్దదిక్కైన అక్కగారు ఈ విషయంలో తమ అధారిటీని, పవరాఫ్ అటార్నీనీ చాలా చక్కగా ఉపయోగించేసుకున్నారు.



మొన్న వేసవి శెలవుల్లో ఇంటికెళ్ళిన అబ్బాయికి (అదే మా శంకర్ కి), వచ్చిన ఫోటోల్లో ఒకమ్మాయి తెగ నచ్చేసి హఠాత్తుగా ప్రేమలో పడ్డాడు. బహుశా ఇంకో రెండేళ్ళు పోతే ముప్ఫై ముంచుకొచ్చి, ముదురు బెండకాయ అయిపోతాననికూడా భయమేసిందట పాపం. ఎమైతేనేం ! తన తర్క జ్ఞానం, నాస్తికత్వం మొదలగు ప్రావీణ్యాలతో జాతకాల్నీ, అమ్మాయి కుటుంబ ప్రతిష్టల్నీ తన కుటుంబ సభ్యులచేత పక్కనబెట్టించి, పెళ్ళిచూపులవరకూ లాక్కొచ్చాడు.



పెళ్ళిచూపుల్లో విజయవంతంగా అమాయిని "నచ్చింది" అనిపించాడు. ఇక అమ్మాయికూడా ‘మౌనం అర్థాంగీకారం’ అన్నఛందంలో సరేనంది. ఇక్కడ మొదలైంది అసలు వ్యవహారం. అసలే కట్నం తీసుకోకూడదని ఒక ఆదర్శం తగలడిన మా శంకరుడు, మనసాపుకోలేక, ఆ అమ్మాయితో తన హీరోయిజం నమూనా ప్రదర్శించలేక, మొదటగా వాళ్ళక్క చెవిలో ఈ ఆదర్శం గుళ్ళికని వేసాడు. అంతే! పెళ్ళిచూపులకొచ్చిన పెద్దలతో సహా అందరినీ వాళ్ళక్క అర్జంటుగా బయల్దేరదీసి, "ఇంటికెళ్ళి చర్చించి ఫోను చేస్తామండీ" అని పెళ్ళికూతురి తరఫు వాళ్ళకు చెప్పి ఇంటికి చక్కావచ్చేసారు.



ఇప్పుడు మొదలైంది అసలు కథ.

"కట్నం ఎందుకొద్దు?" అనే ఒక యక్ష ప్రశ్న మావాడి కళ్ళెదుట కనబడ్డ ప్రతివారిచేతా అడిగించేసారు.


"దానికి నేను వ్యతిరేకిని" అని వీడి పంతం.


"ఎందుకు వ్యతిరేకం?" అని వారి రెట్టింపు.


"అదొక సామాజిక దురాచారం" అని వీడి నీతిబోధ.


"అందరూ తీసుకుంటుంటే, నీకేంటి రోగం?" అని కొందరి అక్కసు.


"అందరూ తీసుకుంటే నేనూ ఆ వెధవపని చెయ్యాలా?" అని వీడి కోపం.


"కట్నం తీసుకున్నవాళ్ళంతా వెధవలనా నీఉద్దేశం?" అని, బోలెడు కట్నం తీసుకున్న మహామహుల పేర్లూ వారి గొప్పతన్నాన్నీ ఏకరువుపెడుతూ వీడిమీద అక్షింతలూ.... రంకెలూ.... ఎకసెక్కాలూ...ఎన్నో...ఎన్నెన్నో.



ఇవన్నీ భరించలేక వీడు పెట్టాబేడా సర్దుకుని రైలెక్కి చక్కా వచ్చేసాడు. తీరా వీడు తను పనిచేసే చోటుకు చేరగానే ఏడుస్తూ వాళ్ళక్కగారి ఫోను. "సరేలేరా! నీ కట్నం వద్దంటే వద్దన్నావ్, నాకు మాత్రం ఆడబడుచు కట్నం కావాలి. అది మాత్రం వద్దనకే" అని. వీడికి మతిపొయినంత పనైంది.



వెనువెంఠనే ఒక మేనమామగారి ఫోను. "కట్నం వద్దంటే, నీ మగతనాన్ని శంకిస్తార్రా వెధవా! ఇలాంటి తింగరి వేషాలు వెయ్యకు" అని ఆయన ప్రేమపూరిత సలహా. కట్నానికీ మగతనానికీ ఈ బీరకాయపీచు సంబంధం ఎలా కలిసిందో తెలీక వీడి ఖంగారు. అక్కడినుంచీ పారిపోయైతే వచ్చాడుగానీ, ఈ సమస్యల మధ్యన పనీ చెయ్యలేక, ఆ అమ్మాయిఫోటో చూసుకుంటూ, చిన్నసైజు దేవదాసులా ఒక కొత్తవాలకంగా తయారయ్యాడు. ఈ సమాధానం లేని సమస్యను మరోవైపునుండీ నరుక్కొద్దామన్న నిర్ణయానికొచ్చి, కాబోయే పొటెన్షియల్ మామగారికి ఒక ఫోనుగొట్టాడు.



ఎలా మాట్లాడాలో, అదీ కట్నం విషయం ఈ పెద్దాయనతో ఎలా చర్చించాలో తెలీక, కొంత అఖ్ఖరకు రాని లోకాభిరామాయణం తరువాత మెల్లగా, "అసలు కట్నం తీసుకునే ఉద్దేశం నాకు లేదండీ" అని కుండబద్దలు కొట్టకుండానే అసలు విషయం తెగేసాడు మా శంకరుడు. దానికాయన ఎస్.వి. రంగారావు గారిలా పెద్దరికంతో నవ్వి, "మీరడక్కపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది నాయనా. మాదానికి ఇంత అని ఆల్రెడీ బ్యాంకులో వేసే ఉంచాను" అని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఈ ముక్కతో మావాడి ఆదర్శానికికొక ఆకాశమంత చిన్న గండి పడింది. కొన్ని ధర్మ సందేహాలూ అర్జంటుగా పుట్టుకొచ్చాయి. "అడక్కుండా ఇస్తే దాన్ని కట్నం అంటారా?", "నేను వద్దన్నా వాళ్ళిస్తే, నా అదర్శానికొచ్చిన ఢోకా ఏమైనా ఉందా?", అనేవి ఆ సందేహాల్లో కొన్ని మాత్రమే.



ఎలాగూ కాబోయే మామగారితో ఈ విషయం చర్చించాడుగనక, మిగిలింది అమ్మాయే అనుకుని ఆ కొరతా మా శంకరుడు తీర్చుకున్నాడు. నానాతంటాలు పడి వాళ్ళింటి ఫోనులో ఆ అమ్మాయి గొంతున ప్రేమగా వింటూ తన ఆదర్శాన్ని కాస్త గర్వంగా చెప్పుకొచ్చాడు. దానికి ఆ అమ్మాయి సంతోషించకపోగా "అలా అంటే ఎలాగండీ? మా అక్కకి పది లక్షలిచ్చారు. అదీ టీచరుకి. మీరైతే ఏకంగా లెక్చరర్ ఆమాత్రం ఇవ్వకపోతే విలువేముంటుంది" అని బాధగా అన్నదట. అంతే ఈ దెబ్బకి మావాడు ఢమాల్! వాడి పని టకాల్, టకాల్ అయికూర్చుంది.



కట్నానికి కాకపోయినా ఆడబడుచు కట్నానికి సై అనాలి. పూర్తిగా ఏమీ వద్దంటే తన మగతనానికి నీళ్ళొదులుకోవాలి. ఆడగకపోయినా ఆడపెళ్ళివారు డబ్బిస్తే దాన్ని కట్నమే అనుకోవాలి. వద్దంటే ఇటు కాబోయే మామగారికీ, కాబోయే పెళ్ళాం సామాజిక గౌరవానికొక దెబ్బ. ఇలా తన ఆదర్శం వల్ల సాఫీగా పెళ్ళి జరక్కపోగా. మరిన్ని సమస్యలొచ్చిపడ్డాయి.



ఈ సమస్యలన్నీ నాకు ఏరువుపెట్టి, "సలహా ఇవ్వరా గురుడా" అంటే, "తాట తీస్తా వెధవా! కుటుంబంకోసం పెళ్ళికావాలంటే, కట్నం తీసుకుని సుఖపడు. ఆదర్శంగా పెళ్ళాడాలంటే, చుట్టుపక్కల దొరికినమ్మాయిని దొరికినట్టు ప్రేమించేసి పెళ్ళికి సరే అనిపించూ, మీ పెళ్ళి హైదరాబాదు ఆర్యసమాజ్ లో జరిపించడానికి పరుగు సినిమాలో అల్లుఅర్జున్ లాగా ఇంకొంతమంది స్నేహితుల్ని తీసుకొచ్చి అరెంజిమెంట్లు చేసి ఆశీర్వదించేస్తా" అని చెప్పా.



పాపం ఇప్పుడు మా శంకరుడు ఏనిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి!

-----------------------------------

53 comments:

Suresh Kumar Digumarthi said...

మనం చేరిన స్తాయికి అందరు చేరాలని ఎప్పుడు అనుకోకూడదు. అంందరూ వెళ్ళిన దారిలో వెళ్ళినట్టు వుంటూనే మన గమ్యం మనం చేరితే మంచిది లేకపోతే సమాజం మనల్ని అంగీకరించదు. "మార్పే తప్పయితే ఆ తప్పు చేయడానికి నేను సిద్దం" అని యండమూరి చెబుతాడు. పెళ్ళి తప్పదు కాబట్టి ఇచ్చిన డబ్బులు అమ్మాయిని తీసుకోమని, మీ వాడు నిబద్దతగా దాని వైపు చూడకుండా వుండగలిగితే, పున్యం పురుషార్ధం రెండూ వస్తాయి.

మోహన said...

em chepparu sir! :)

"naku katnam teesukunevaadu vaddu talli" ante..., "ala ante.. neeku pelli ela avutunde.." antundi maa amma.. emonandi.. adedo ayyedaaka.. ee suspense inte.. devudu naaku gattiga undagalige saktini, dhairyanni iste bagundu.. na principles O pakka, family sentimentlu O pakka.. hmmmm....

naakemaina suggestions istara mahesh garu? :-)

ika suresh garu, abbayiki salaha icharu. mari naa laanti ammayilaki emani istaru..? ichedi vaaru puchukunedi veeru.. ani choostu oorukovalantara ?

మేధ said...

హ్హహ్హ బావుంది... ఇలాంటి సంఘటన(అచ్చు ఇదేనేమో!) మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగింది.. కట్నానికి పెళ్ళికొడుకు ఏమీ ఇబ్బంది పెట్టకపోయినా అమ్మయే నా భాగం మీరు ఏమి చేసుకుంటారు అని బలవంతంగా ఇప్పించింది.. ఆమేమో పెళ్ళి చేసుకుని అమెరికాలో హాయిగా సెటిల్ అయ్యింది.. వాళ్ళేమో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు...

Anonymous said...

వరుడు తన మావగారి నుంచి వస్తువులు,డబ్బు తీసుకుంటే అది కట్నం అవుతుంది.

తన మావ తన కూతిరికి వస్తువులు,డబ్బు , ఆస్తి ఇస్తే అది కట్నం అన్కూడదు. దాన్ని పసుపు-కుంకుమ లేదా సారె లేదా స్త్రీ ధనం ఆంటారు.

తను అన మావగారినుండి ఏమి ఆషించకుండా పెళ్లి చేసుకుంటే అది కట్నం లేని పెళ్లే. తన పేల్లాం స్త్రీ ధనం తెచ్చుకున్నా సరే!

P S Ravi Kiran said...

బావుందండి. నాది కూడా ఓ :-)

పెదరాయ్డు said...

ఈ ఆదర్శానికి నేనూ బాధితుడినే. నాకెప్పుడు పెళ్ళవుతుందో ఏమో!! నాకో మంచి కట్నం తెచ్చుకోని అమ్మాయిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.

Bolloju Baba said...

ఈ కట్నం విషయంలో చాలా ఆర్ధిక విషయాలు దాగున్నాయనిపిస్తూంటుంది.
1. ఒకప్పుడు ఆస్థిహక్కు స్త్రీలకు లేకపోవటం వల్ల కట్నం రూపంలో ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగిఉండవచ్చు.
2. కొత్తసంసారానికి కావల్సిన హంగులు, అవసరాలకోసం కట్నం అవసరమే అవ్వచ్చు.
3. పెళ్లనేది ఒక సామాజిక వేడుక. అది జరిపించాలంటే ధనమనే ఇంధనం అవసరమే. ఒక రకంగా ఫాల్స్ ప్రిస్టేజ్ ను మెయింటైను చెయ్యాలంటే.

కానీ కట్నం పేరుతో దోపిడీ, పీడింపు అవాంఛనీయమే.
స్త్రీలకు కూడా ఆస్థిహక్కు ఇవ్వబడిన తరువాత కట్నంపై పట్టింపులు అన్యాయం గానే తోస్తాయి.
బహుసా అందుకనే కొన్ని కుటుంబాలలో పెళ్లి కాలంలోనే ఆడ పిల్లలచే ఆస్థి హక్కు విడుదల పత్రాలు రాయించుకొని మరీ కన్యాదానం చేస్తున్నారు.

అలా కాని సందర్భాలలో, " నీక్కూడా వాటా ఉంది అడుగు మరి " అంటూ ఉసిగొల్పగా, కోర్టులకెక్కి వీధిన పడ్డ కుటుంబాలు చూస్తూనే ఉన్నాము.
ఈ విధంగా సొమ్ముపోయె, దుమ్మూ కొట్టె రీతిలో చితికిపోయిన ఓ కుటుంబం నాకు తెలుసు.
ఆడపిల్లలు స్త్రీ ధనం గా తెచ్చుకొన్న వాటిని తాకనన్నా తాకని మగవారూ ఉన్నారు. అలా తెచ్చుకొన్న దానిని కట్నమని పిలవక్కరలేదనుకుంటా.

ఇద్దరూ సంపాదిస్తే కానీ జీవిక లభించని ఈ రోజుల్లో కట్నకానుకలకంత ప్రాధాన్యత ఇవ్వటం అనవసరమే. ఐచ్చికంగా ఇచ్చింది తీసుకోవటమూ తప్పుకాదు.
ఇక కట్నం కోసం వేధించే వారికి కట్నం అనేది వారికున్న చాయిస్ లలో ఒకటి మాత్రమే. ఇదికాక పోతే మరొకటి తెరమీదకు రాగలదు.
బొల్లోజు బాబా

కుసుమ said...

సురెశ్ గారు చాలా బాగా చెప్పారు. మహెశ్ గారు చెప్పిన దాన్న్ని బాట్టీ ఛూస్తీ ఇదన్తా మగ పుంగవులు అడవారిని వుద్దరిన్చె టట్టే వుంది కాని మహిలల వయపునుమ్చి కూదా అలొచన పెడితె మన్చిది.అసలు కట్నం తీసుకొకుండా అన్టే ఏంటీ?
కుసుమ

చైతన్య కృష్ణ పాటూరు said...

పైన శివగారు చెప్పినట్లు వరుడు మామగారి నుంచి తన కోసం తీసుకునేది కట్నం అంటారే గాని, ఆయన తన కూతురికి ఇచ్చుకునే ఆస్తిని స్త్రీ ధనం అనే ఆంటారు. ఆమె తెచ్చుకునే ఆస్తి పైన ఆమె ఇష్టాలకు వ్యతిరేకంగా హక్కులు చెలాయించనంత వరకు మీ స్నేహితుడి ఆశయానికి ఏమీ నష్టం లేదు.

తమ అమ్మాయికి ఏమి ఇచ్చుకోలేని చోట డిమాండ్ చెయ్యకుండా పెళ్ళి చేసుకోటం ఆదర్శం అనిపించుకుంటుందే కాని, తమకున్నంతలో తమ పిల్లకు వాళ్ళేదో ఇచ్చుకుంటే, దానికి మీ స్నేహితుడు బాధ పడాల్సిన అవసరం లేదు.

Suresh Kumar Digumarthi said...

మోహన గారు: సలహా ఉచితమే కద! నేనెప్పుడూ ఇవ్వడానికి రెడీ. శంకర్ విషయంలో ఒక అమ్మాయి వుంది, అతని సమస్య ఆమె, ఆమె తండ్రి చుట్టూఊ తిరుగుతుంది. కాబట్టి అతని ప్రత్నమ్నయాన్ని ఎన్నుకోవాలి. మహేష్ గారి చొరవ ద్వార ఇప్పటికే మీకొక విషయం తెలిసిపోయింది, అదేమంటే అబ్బయిలందరూ కట్నం కావాలనేవారే ఉండరని. తప్పకుండా మీ కోరిక తీరుతుంది, కాకపోతే మీరు కొంచెం కష్టపడాలి. మీలాంటి వాడిని మీరు satillite తో వెతకాలి. మీరు www.idontwantdowry.com లో చూడండి. ఈ మధ్య కాలంలో జరిగిన సభలో ఈ సైట్ వాళ్ళందరూ కట్నాన్ని వదిలేస్తాం కాని కులాన్ని వీడలేమని చెప్పారు. మీరు ఎంతవరకూ సాహసించగలరో చూడండి.

Sujata M said...

మహేష్ గారు. నాకు మీ టపా చదివాకా.. కాసేపు మెదడు బ్లాంక్ అయింది. ఇలాంటి సంఘటన నా లైఫ్ లో కూడా ఎదురైంది. (అంటే, నేను మా నాన్నగారితో డబ్బులిమ్మని పోరాడలేదు లెండి..) ఇది దురాచారమే. కానీ.. ఈ ''పెద్దలు కుదిర్చిన పెళ్ళి '' అనే కాన్సెప్ట్ కూడా అనాగరికమైనదే. కాదంటారా ? అందుకే నేమో.. అమ్మాయిలు కూడా.. వాళ్ళ అమ్మా నాన్నల మీద హక్కు చెలాయిస్తున్నారు. ఎవడినో చూపించి, వీడిని పెళ్ళాడి, పిల్లల్ని కను, వీడి తల్లికీ, తండ్రికీ, తమ్ముళ్ళకీ, అక్కలకీ సేవ చెయ్యు అంటే, అమ్మాయిలకి సహజం గానే, ఆ ప్రొసెస్ లో తమకు సంక్రమించ బోయే, ఆస్తి, అధికారం (బాధ్యత, బరువు తో పాటూ.. సుమండీ) మీద ఎంతో కొంత కన్సెర్న్ ఉంటుంది. నేను తీవ్ర భావాలు వ్యక్త పరిస్తే క్షమించండి.


ఇంకో మాట. ఇప్పుడు అత్త మామలు కూడా చాలా తెలివి మీరి ఉన్నారు. ఉద్యోగం చెయ్యని అమ్మాయి అయితే, ఫిక్సెడ్ డిపొసిట్ (కట్నం రూపంలో) ! అదే, నా లాంటి ఉద్యోగం వెలగబెట్టే బాపతు అయితే, రెకరింగ్ డిపొసిట్. ఇవీ, ఇప్పటి లెక్కలు.

కుసుమ said...

@సురేశ్ గారు మీరు చెప్పిన కమెంటు తో నాకు ఎమనిపిస్తుందంటే కట్నం తీసుకొవడం ఒక దురాచారం అయితె "కట్నాన్ని వదిలేస్తాం కాని కులాన్ని వీడలేమని" అనడం దానికన్నా పెద్ద దురాచారం. ఈ విశయాన్ని వ్రాసినందుకు మీకు ద్యాంక్యు.

@మహేశ్ గారు మీ శంకరుడికి కులం తో ఫ్రొబ్లం రాలేధా? అతని ఆదర్శం ఒక్క డబ్బు విశయం లొనేనా? శలవివ్వగలరు.
కుసుమ

వేణూశ్రీకాంత్ said...

పైన చాలా మంది చెప్పినట్లు మామ గారిని కట్నం గురించి పీడించ కుండా, ఇంకా స్త్రీధనం ముట్టుకునే ఆలోచన చేయనంత వరకూ మీ శంకరుడు బాధ పడాల్సిన అవసరం లేదండీ. ఆడపడచు కట్నం అంత హాస్యాస్పదం లేదు నన్నడిగితే, అసలు ఆవిడకెందుకు ఇవ్వాలి...

@కుసుమ గారు, నిజం గా ఆదర్శభావాలు ఉండి కట్నం వద్దనుకునే యువత కులం గురించి పెద్ద గా పట్టించుకుంటారు అని నేననుకోనండీ కాని కట్నం వ్యక్తిగతం అయితే కులం కుటుంబ వ్యవహారం, కుటుంబాన్ని వదులుకో లేక కులం గురించి పట్టించుకుంటున్నారు అని నా అభిప్రాయం.

Kathi Mahesh Kumar said...

@సురేష్ కుమార్,మీరు చెప్పిన యండమూరి మాటలు "మార్పే తప్పయితే ఆ తప్పు చేయడానికి నేను సిద్దం" అన్నవే నేనూ నా మిత్రుడికి చెప్పాను. కాకపోతే మీలాగా compromise formula కాక నిజంగానే (వీలైతే ప్రేమించి ఆర్యసమాజ్ లో పెళ్ళిచేసుకోవడం ద్వారా)"తప్పు" చెయ్యమన్నాను.

నా స్నేహితుడు చెప్పినదాంట్లో నాకు ‘వెర్రి ఆదర్శం’ కాక,కట్నం తీసుకోకపోవడం అనేది ఒక ఆత్మగౌరవ విషయంగా తను భావిస్తున్నట్లు అనిపించింది. టపాలో నేను ఏంజరిగిందో రాశానేగానీ, నేను దాని గురించి ఏమనుకుంటున్నానో రాయలేదు. కానీ ఇక్కడ అభిప్రాయాలు రాయచ్చుగనక ఈ విషయం చెబుతున్నాను.

అయినా నమ్ముకున్న ఆదర్శాన్ని నట్టేటముంచి, ఆమ్ముడైన ఆత్మగౌరవంతో కుటుంబ సభ్యులను ఉద్దరించడం అర్థరహితం, అందుకే నేను కాస్త radical root చెప్పాను.

@మోహన, మార్పు అందరికీ కావాలి. కానీ వారుకాని వారి ఇంట్లో వారుగానీ మారకూడదు. అదే మీ అమ్మగారి సమస్యకూడా.ఆ జనరేషన్ వారు ‘ఏర్పడిపోయారు’ కాబట్టి వారితో వాదన నిరర్థకం. ఇక మీరు స్వతంత్రించి నిర్ణయం తీసుకోగలిగితే సురేష్ చెప్పిన www.idontwantdowry.com చూడండి.

@మేధ; కట్నం అన్నది మగాళ్ళు సృష్టించి సమస్యగా కాక ఇప్పుడు అదొక విస్తృత వ్యవస్థగా ఏర్పడిపోయింది. దానికి మన సాంప్రదాయాలూ, కుటుంబ గౌరవాలూ కొమ్ముకాస్తున్నాయి.వాటిని వదలమంటే కష్టం, వాటిల్లోనే ఉంటే తీవ్రమైన నష్టం.

@శివ: స్త్రీధనం అనే విధానం మహిళలకు ఆస్తిహక్కు లేనప్పటి పరంపర.అయినా పెళ్ళప్పుడే ఈ స్త్రీధనాన్ని ఎందుకివ్వాలి? ఎందుకంటే, ఇంతిచ్చామని ఆడపెళ్ళివారూ, ఇంత పుచ్చుకున్నాం అని మగపెళ్ళివారూ చెప్పుకోవడానికే కదా!Its an obnoxious form of expressing social pride.నిజంగా ఇవ్వాలనుకుంటే, అవసరానికో లేక ఎప్పటినుంచో అమ్మాయి పేర్న బ్యాంకులోనో వేసిఉంచచ్చు.

@పెదరాయ్డు; మీరూ www.idontwantdowry.com సైటు చూసి పనిలోపని రిజిష్టర్ చేసేసుకోండి. మంచి ఆదర్శం అర్జంటుగా ఆచరించవలసిన ఆదర్శం.

@బాబా గారు; మీరు చెప్పిన నేపధ్యం సరైనదే కావచ్చు. ఇప్పటి విశృంఖలత్వం మీరు చెప్పినట్లుగా హేయమైనదే. కట్నం కూడా ఒక సామాజిక మాఫియాగా తయారయ్యి, వ్యవస్థీకృతం అయిపోయింది. మన వివాహవ్యవస్థ, కుటుంబ విధానం, సామాజిక కట్టుబాట్లూ అన్నీ ఈ వ్యవస్థకు కొమ్ముకాస్తున్నాయి. మరి మార్పు ఎక్కడి నుంచీ వస్తుంది? మా స్నేహితుడి "అమ్ముడు కాకూడదు" అన్న ఆత్మగౌరవ నినాదం మూగబోవలసిందేనా?

@కుసుమ గారూ మహిళల్ని ఉద్దరించడానికి కట్నం తీసుకోను అని నామిత్రుడు అనటం లేదు. అది అతని ఆత్మగౌరవ సమస్య. తను నమ్మిన ఆదర్శం సమస్య. ఈ విధానంలో తనని తను సంస్కరించుకుంటున్నాడు తప్ప మహిళల్ని కాదు. అయినా "అమ్ముడుపోవడం మా హక్కు" అనుకునే మగాళ్ళకి ఆ డబ్బులు మాత్రం ఎందుకివ్వాలండీ? ఇస్తేగిస్తే ఎదురుకట్నం మహిళలకివ్వాలి. వంట,ఇల్లూ,పిల్లలూ,చాకిరి ఇవన్నీ free గా చెయ్యడానికా వాళ్ళని పెళ్ళిపేరుతో ఉద్దరిస్తున్నదీ?

@చైతన్య; మా స్నేహితుడి ఆదర్శం, ఒక్కపైసా కూడా అమ్మాయి తరఫు నుండీ తీసుకోకపోవడం. తను సంపాదించిన డబ్బుతో తను గౌరవంగా తన భార్యతో బ్రతకడం. ఈ చిన్న స్వతంత్ర్యం కూడా అనుభవించడానికి కుటుంబం,సమాజం ఒప్పుకోకపోతే ఎలాగండీ? మా స్నేహితుడి ఆదర్శం తప్పా? లేక ఈ సమాజ పోకడలు సందేహాస్పదమా? ఈ సమస్యకు కావలసింది ఎలా సర్దుబాటు అవుతుంది, అని కాదు. ఎందుకిలా జరుగుతోంది? అని.

@సుజాత గారూ, మీరు చెప్పినవాటితో నేను నూరు శాతం ఏకీభవిస్తాను. కానీ స్వతంత్రించి నిర్ణయం తీసుకోవాలి అని నేను చెబితే "విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నావా?" అంటారు.

10-20 మంది ఎదుట సంతలో ఆవులా పెరేడ్ చెయ్యబడి, బేరసారాల తరువాత మీ కుటుంబానికి బేరంకుదిరినవాడితో పెళ్ళి చెయ్యబడి, దానిలో పవిత్రత ఉందని బ్రతికెయ్యడంలో చాలా మందికి సుఖముంది.దాన్ని నేను ప్రశ్నించే సాహసం చెయ్యలేను.

@కుసుమ, నా స్నేహితుడికి కులం పట్టింపులు లేవు. కాని ఇప్పుడు సంబంధాలు కుటుంబం చూస్తోంది గనక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కులంలోనే చూసుంటారు.

@వేణు గారూ, ఆడపడచు కట్నం అనేది ఒక సాంప్రదాయం. స్త్రీధనం అన్నదాన్ని పాటిస్తానుగానీ, ఆడపడుచు కట్నం పాటించనంటే ఎట్లా? సాంప్రదాయబద్ధమైన పెళ్ళిలో అన్నీ పాటించాలి. లేదూ,మనిష్టమొచ్చినట్లు పెళ్ళి చేసుకోవాలి. దీంట్లో కాంప్రమైజ్ కావడమంటే, ఎంతొ కొంత ఆత్మగౌరవాన్నీ, వ్యక్తిత్వాన్నీ కోల్పోవడమే అని నా ఉద్దేశం.

Purnima said...

నా ఈ (http://oohalanni-oosulai.blogspot.com/2008/03/blog-post.html) టపాకి కిరణ్ గారు ఇచ్చిన వాఖ్యనే.. మీ ఈ టపాకు వ్యాఖ్యగా ఇస్తున్నాను

కట్నం ఇవ్వడం, తీసుకోడం నిజంగా అసహ్యం.....కదూ....!!
కానీ అదే చెల్లుతోంది మన సమాజంలో....ఇవ్వకుండా,తీసుకోకుండా బ్రతకడం అసాధ్యమేమీ కాదు... ధైర్యం ,పట్టుదల కావాలి అంతే..!!

మీనాక్షి said...

మహేశ్ గారు....మొన్న మీ టపా చదివి నేను నిర్ణయించుకున్నా..
కట్నం తీసుకోని అబ్బీని చేసుకుంటానని.....ఆ విషయమే మా అమ్మతో అంటే ఈ రోజుల్లో కట్నం తీసుకోకుండా చేసుకునే వాళ్ళు ఎవరు లేరు...
అని అంది...లేదమ్మ ఉన్నారు చాలా మంది అని నేను....
ఈ విషయం పై ఇద్దరం కాసేపు వాదించుకున్నాం...
ఏది ఒక్క అబ్బాయిని చూపెట్టు అని అంటే ..ఒక్క అబ్బాయి ఏమ్ ఖర్మ అమ్మా ..బోలెడు మంది ఉన్నారు..అన్నాను...అదంతా ఉత్తిదే..నిన్ను కట్నం తీసుకోకుండా ఎవరు చేసుకోరు....అందులోను మన దాంట్లో కట్నం ఎక్కువా...అంది..అమ్మా నువ్వు ఎన్ని చెప్పు నేను మాత్రం కట్నం తీసుకోని అబ్బాయిని చేసుకుంటాను...అన్నాను..
కానీ ఇది జరిగే పనేనా...నేను ఈ రోజు ఇలా మాట్లాడినందుకే అమ్మ నన్ను విచిత్రంగా చూసింది..చిన్న పిల్ల ఏదో తెలీక మాట్లాడింది అని కొట్టిపారేసింది....

చైతన్య కృష్ణ పాటూరు said...

మహేశ్ గారు,
అమ్మాయి వైపు నుంచి ఏదీ డిమాండ్ చెయ్యకూడదన్నది మీ స్నేహితుడి ఆశయమైతే, దానికి వాళ్ళు తమ పిల్లకు తమకున్నదాంట్లో కాస్త ఇచ్చుకోటం ఏ విధంగా భంగకరం అని నా అనుమానం. మీ స్నేహితుడేమి కట్నం ఇస్తేనే చేసుకుంటానని అనట్లేదుగా. నేను వచ్చే అమ్మాయి ఆస్తిలో చెయ్యి పెట్టను, మీకు కూడా దానితో సంబంధం లేదు, అది తన ఇష్టం అని మీ స్నేహితుడు తన ఇంట్లో వాళ్ళకి (తన అక్కకి) మొహం మీద చెప్పగలిగితే చాలు, తన ఆశయం నెరవేరినట్లే. అమ్మాయికి ఏమన్నా ఇవ్వటం, ఇవ్వకపోవటం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం. దాంట్లో అబ్బాయికి అభ్యంతరం ఎందుకుండాలి?

స్త్రీ ధనమన్నది, తమ పిల్ల అత్తవారింట్లో ప్రతి చిన్న విషయంలో ఎవరి మీదా (అవసరమైతే భర్త మీద కూడా) ఆధారపడకుండా బ్రతకటానికి తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చే ఆస్తి గాని అది ఎవరి డిమాండ్ మీద ఇచ్చేది కాదు. అది వాళ్ళ అమ్మాయి పేరు మీద వుంటుందే కాని అత్తవారింట్లో ఎవరికి దాని పైన హక్కులుండవు. ఆ అమ్మాయి కట్టుబట్టలతో వచ్చేసి ప్రతి చిన్న విషయానికి భర్త మీద ఆధారపడాలా? నిజంగా అలా వచ్చిన అమ్మాయిని ప్రేమగా చూసుకోటం ఆదర్శం అనిపించుకుంటుంది గాని, వాళ్ళింట్లో వాళ్ళు మా అమ్మాయికి మేమిచ్చుకుంటాం అంటే మన ఆదర్శానికి వచ్చే నష్టం ఏముందండి.

తల్లిదండ్రులు అమ్మాయికి ప్రేమతోనో, లేక అత్తవారింటి మీద అపనమ్మకంతోనో, తమ పిల్ల ఇంకొకరి పై ఆధారపడకూడదనో ఇస్తున్నప్పుడు, అబ్బాయి కాని అతని ఇంటివారు కాని దాన్ని డిమాండ్ చెయ్యనప్పుడు, దాని పేరు కట్నమైనా, స్త్రీధనమైనా, ఏదైనా అది అంత అభ్యంతరకరమైన విషయం కాదని నా అభిప్రాయం.

శ్రీ said...

మంచి ఆదర్శవంతుడు మీ స్నేహితుడు "శంకర్" గారు.నా అభిప్రాయం చెప్పేముందు శంకర్ కి నా అభినందనలు చెప్పండి.

శంకర్ ఆదర్శాలు బాగనే ఉన్నాయి.కట్నం అనేది ఒక దురాచారం!మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణంలో,చదివిన పుస్తకాల్లో దీని వలన కలిగిన దారుణాలు చాలానే చూసాం.స్వతహాగా ఎవడన్నా తలమాసిన వాడు ఊరికే డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఉండడు.కొంచెం ఆదర్శభావాలు కలిగిన వాడు "కట్నం తీసుకోను" అని చెప్పడం నిజంగా హర్షణీయం!

ఇక అక్కగారి గురించి మాట్లాడాలంటే "ఆడపడుచు కట్నం" ఆశించడం సిగ్గుచేటు.దీనికి కారణం అక్కగారికి ఇలా వచ్చే కట్నం తో ఏమన్నా సొంత పనులు చేసుకోవాలని కోరికలు ఉండడం.తను ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంకా డబ్బులు "ఆడపడుచు కట్నం" రూపంలో కావాలనుకోవడం మరీ దారుణం.తమ్ముడు ఎవరిని పెళ్ళి చేసుకున్న సుఖంగా ఉండాలని అక్క కోరుకోవడం ఒక "ఆదర్శ అక్క" అనిపించుకుంటుంది.

ఇక మామగారి విషయానికి వస్తే అల్లుడు "కట్నం ఒద్దు,మొర్రో" అంటున్నా మా అమ్మాయి పేరా ఇంత డబ్బులు వేసానండీ అనడం విచారకరం!తన కూతురి కాపురంలో అమ్మాయికి ఆర్ధిక ఇబ్బందులు ఉండ కూడదు అని ఈ పిచ్చి తండ్రి ఆలోచన.కూతురి పేరా డబ్బులు లేవంటే అమ్మయిని చిన్న చూపు చూస్తాడేమో అని వెర్రి అనుమానం కుడా ఉండచ్చు ఈ వెర్రి తండ్రికి.మామగారు ఇటువంటి విషయాలలో ఎదగాలి,అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను.

చివరాకరిగా అమ్మాయి గురించి,"మా అక్కకి ఇంత ఇచ్చారు,నాకు ఇంకొంచెం ఎక్కువయినా కావాలి" అని అమ్మాయే చెప్పడం చింతించాల్సిన విషయం!కట్నంకి ప్రధాని సమస్య "ఆడవాళ్ళలో ఆర్ధిక స్వతంత్రం లేకెపోవడం" నా ప్రగాఢ అభిప్రాయం!రేపు ఏమన్న అయితే నేను ఎలా బతకాలి? అన్న అలోచనకి ముందుచూపే ఈ కట్నం!

ఈ సందర్భంగా ఆడవాళ్ళకి నా సండేశం ఏమిటంటే "అమ్మాయిలూ!మీరు చదువుకుంటున్నారు,ఉద్యోగం కుడా చేసుకుంటున్నారు!మీ కాళ్ళ మీద మీరు నిలబడండి!మీరు పెళ్ళి చేసుకోవడానికి ఎవరికీ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు!మీరు మిమ్మల్ని పోషించుకోగలరు,అలాగే ఇంకొకరిని పోషించగలరు!చదువుకున్న మీరు ఇలా ఆదర్శ భావాలను ప్రదర్శిస్తే మిమ్మల్ని చూసి మిగతా ప్రజలు స్పూర్తి పొందగలరు!"

అలాగే అబ్బాయిలూ!మీరు కుడా మీ ఆదర్శాలకు కట్టుబడి ఉండండి!ఇది అర్ధం చేసుకోని వాళ్ళకి అర్ధమయేటట్టు చెప్పండి!

Kathi Mahesh Kumar said...

@పూర్ణిమ;కట్నం ఇవ్వకుండా తీసుకోకుండా ఉండటానికి "ధైర్యం ,పట్టుదల" కావాలని బాగా చెప్పారు. ఇక్కడ నా మిత్రుడి సమస్య అది ఉండటమే. చిత్రమైన విషయం ఏమిటంటే తన ఆదర్శాన్ని గుర్తించి అభినందించకపోగా, ఈ సమస్యని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన కోణంలో ఉన్నవాళ్ళే ఇతని ప్రయత్నానికి అడ్డుతగలడం. అంటే మన సమాజం ఎంతగా కట్నానికి ‘అలవాటు పడిపోయిందో’ చూడండి. ఇక కట్నాన్ని అసహ్యించుకునేది ఎవరూ?

@మీనాక్షి; మన అమ్మనాన్నల తరం వారు ఈ కట్నాన్ని వ్యవస్థీకరించేశారు. వారు సృష్టించిన ఈ సాంప్రదాయం మీద వారికి గౌరవం, మర్యాదా,ఆదరణా ఉండటంలో తప్పు లేదు. కానీ నీకు ఈ కట్నం ఒక దురాచారంగా అనిపిస్తే వారితో చర్చించడం లేక విభేధించడం మాని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఆచరించెయ్.

పది మంది పొటెన్షియల్ పెళ్ళికొడుకుల ముందు పెరేడ్ అవడం కన్నా, నీ చుట్టూ ప్రదక్షిణ చేసే ఇరవై మందిలో ఒకణ్ణి దర్జాగా సెలెక్ట్ చేసుకుని(ఇక్కడ కులగోత్రాలు చూసుకున్నా అస్సలు అభ్యంతరం లేదు), వాడ్ని కట్నం లేకుండా పెళ్ళి వరకూ తీసుకురావడం చాలా గౌరవప్రదమని నా అభిప్రాయం.

@చైతన్య కృష్ణ; మీ వాదనలో చాలా బలముంది.కాకపోతే అంతే బలంగా "అడక్కపోతే చాలు, ఎంతిస్తే అది వారిష్టం" లేదా "కట్నం సంసారం మొదలెట్టడానికి ఇచ్చే మూలధనం (capital)" లాంటివికూడా చెయ్యొచ్చు.

ఇక తల్లిదండ్రులు ప్రేమగా అమ్మాయికి ఇచ్చే ఆస్తులు వేరు. అది తమ (సామాజిక)భాధ్యతగా భావించి ఇచ్చే డబ్బో ఆస్తో వేరు. ఇక్కడ జరుగుతోంది రెండవది. అందుకే నా స్నేహితుడికి కాస్త ఇబ్బందిగా ఉంది.

@శ్రీ;మీ అభినందనల్ని శంకర్ కి అందజేస్తాను.మీ విశ్లేషణ బాగుంది.

Kottapali said...

బ్లాగ్వీరులారా, వీరనారీమణులారా!
కత్తి మహేశుడు మామూలోడు గాదు, పేరులో కత్తి ఉన్నందుకు ఏదో ఒక పుండుకి సర్జరీ మొదలు పెట్టకుండా ఉండడు.
ఈ టపానీ, దానిమీద వచ్చిన వ్యాఖ్యల్నీ చదివి నా రక్తం ఎలా సలసలా మరిగి పోతోందంటే .. ఇంకేసపట్లో నా మాడు మీద సేఫ్టీ వాల్వు ఓపెనయ్యేలా ఉంది.
ఎవరి అభిప్రాయాలు వారివిలే అని ఏదో నాదారిని నే పోతుంటాను. కాని ఇది చదివాక ఈ రెండు ముక్కలూ అనకుండ ఉండలేక పోతున్నాను, మీరేమనుకున్నా సరే. అరెరే, ఇతగాడు మనమెరిగిన కొత్తపాళీ కాదే అని ముక్కున వేలేసుకున్నా సరే! నా మీద ధ్వజమెత్తి వచ్చినా సరే, నన్ను బహిష్కరించినా సరే!
అసలు ఏమాలోచిస్తున్నాం మనం? ఏ యుగంలో ఉన్నాం? అసలు పెళ్ళంటే ఏంటి? నీ చేత్తో నువ్వు సంపాయించని ధనం మీద మోజేంటి? దాన్ని పెళ్ళిద్వారా రాబట్టడమేంటి? ఆ మాటకొస్తే తండ్రి తాతలు సంపాయించిన ఆస్తి నా చేతులో కెప్పుడొస్తుందా అని చూడ్డం కూడా కట్నమంత హేయమైనదే నా దృష్టిలో. మన కుటుంబాలు, మన వివాహ వ్యవస్థ, అసలు మన సమాజమే ఒక దారి తెలియకుండా గుడ్డిగా కుళ్ళిపోతుండటానికి మూల కారణం ఇలాంటి కాలం చెల్లిన భావాలే! అసలు పెళ్ళంటే ఏంటి? ఎందుకు చేసుకుంటారు పెళ్ళి? ఆ స్త్రీపురుషులు ఒకర్నించి ఒకరు ఏం కోరుకుంటున్నారు? పెళ్ళి చేసుకోడానికి కావల్సిన అర్హతలేవిటి? ఎవరు పెళ్ళి విషయాల్ని నిర్ణయించాల్సింది? అసలు ఏవన్నా అవగాహన ఉందా? అర్ధమవుతోందా? ఈ వ్యాఖ్యలు చదువుతుంటే నాకు ఎంత కంపరంగా ఉందంటే .. పైగా నాకు కట్నం తీసుకోడం ఇష్టం లేదండీ అని నసుగుళ్ళూ నంగిరి ఆదర్శాలూనా? వేరే పేరిట తీసుకుంటే కట్నం కాదా? ఎందుకండీ చెబుతారు? మొగాడివైతే నా కుటుంబాన్ని పోషించగలను అని గుండె మీద చెయ్యేసి చెప్పుకుని మరీ పెళ్ళి చేసుకో. ఆడదానివైతే ఛ, నన్ను ఇంకోళ్ళు పోషించేదేంటి అని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మరీ పెళ్ళి చేసుకో. అబ్బే నాకంత ఓపికా, శక్తీ లేవు అంటావా. సుబ్బరంగా నోరుమూసుకుని పెద్దల చెప్పిన పెళ్ళి చేయించిన విధంగా చేసుకుని గమ్మునుండు.
I am DISGUSTED!!!

వేణూశ్రీకాంత్ said...

ఆడపడుచు కట్నం పెద్ద అమౌంట్ ఉండక పోవచ్చు కనుక అంత గా చర్చ అనవసరమేమో, ఆ సాంప్రదాయం వెనుకున్న అనాలిసిస్/లాజిక్ ఏంటో మరి నాకు తెలీదు. కానీ అది ఎంతైనా అమ్మాయి తల్లి తండ్రుల్ని పీడించి వసూలు చేయడం మరీ అన్యాయం. ఇక నేను స్త్రీధనం అని చెప్పింది సంప్రదాయం అని కాదు, అది ఒక రకం గా అమ్మాయి తల్లితండ్రులకి వచ్చే అల్లుడి శక్తి సామర్ధ్యాల మీద నమ్మకం లేక అమ్మాయి క్షేమం కోరి చేసే సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది. అందులో అబ్బాయి ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కినట్లే అన్న విషయం లో ఎలాంటి సందేహం లేదు. ఇదీ ఆ అమ్మాయి కూడా తీసుకోవాల్సిన నిర్ణయం. కట్నం అనే పేరు పక్కన పెడితే ఇది కూడా మన తల్లిదండ్రుల ఆస్థి కోసం మనం ఎదురు చూడటం అనే విభాగం లోకి వస్తుంది. దాని కోసం ఎదురు చూడకూడదు, ఇవ్వలేదని బాధ పడకూడదు ఇవ్వమని పీడించ కూడదూ అలానే ఇచ్చిన దాన్ని సంరక్షించి వారి కోరిక మేరకు వినియోగించడమూ మన బాధ్యతే.

వేణూశ్రీకాంత్ said...

కొత్త పాళీ గారు మీ పాళీని ఝళిపించి కత్తి కన్నా పదునైనది అనిపించారండీ... కానీ మీరు చెప్పిన రెండు extremes కన్నా మధ్యే మార్గం గుడ్డిలో మెల్ల లాటిది కాదంటారా... మార్పుకు అదే పునాదేమో... ఇప్పుడు పెద్ద వాళ్ళ తరం కట్నాల లో మునిగి తేలుతుంటే యువతరం వ్యతిరేకం గా ఆలోచిస్తుంది కాని పెద్ద వాళ్ళకి పూర్తిగా ఎదురు చెప్పి నొప్పించటం ఇష్టం లేక ఇలాంటి మధ్యే మార్గాలని ఆశ్రయిస్తున్నారు. రేపు ఈ తరం వాళ్ళ పిల్లలకి పెళ్ళి చేసే సమయానికి అంతా కట్నానికి వ్యతిరేకం గా ఒకే resonance లో ఉంటారు అప్పుడు ఈ దురాచారం పూర్తి గా సమసి పోతుంది కదా... అందుకే ఇలాంటి ఆలోచనల్ని ప్రోత్సహించడం మంచిదేనేమో అని నా అభిప్రాయం.

Purnima said...

కొత్తపాళీ గారు:
మీ కమ్మెంట్ చదివి ముందు నవ్వుకున్నా.. రాసిన విధానానికే సుమా!! ఇప్పుడు ఆలోచిస్తున్నా.. మీ disgust లో అర్ధం ఉంది. కానీ "ఇది నా జీవితం.. దీని పూర్తి బాధ్యత నాదే.. నా చదువు, నా సంస్కారం నాకు నేర్పినంతటిలో నేను ఇలా ఉంటాను" అని యువత ఒక ఇడెంటిటీ ఇచ్చుకోనంత కాలం.. ఇలా మూలగాల్సిందే!! మనకేమి కావాలో మనం నిర్ణియించుకునే ప్రతీ సారి పక్కవాడు ఏమనుకుంటాడా అని ఆలోచించే ధోరణి ఉన్నంత కాలం.. you'll hav to take that. కట్నం సమాజిక సమస్య కాదు.. it has to be tackled at every individual's level. మన చదువులు మనకా ధైర్యం ఇవ్వవు!! :-(

rākeśvara said...

కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకునే చాలా మంచి అబ్బాయి నాకు తెలిసిన ఒకతను ఉన్నాడు.
చాలా చాలా మంచి వ్యక్తి.
ఆదర్శ వాది.
మీకు ఆదర్శాలు చిరాకైతే, వాటిని అంగవస్త్రాల్లా దలచి ఇట్టే తీసి ప్రక్కన కూడా పెట్ట గలుదు.
బాగా చదువుకున్నవాడు
పలు అభిరుచులు గలవాఁడునూ.
మంచి మనసు, హాస్య చతురత గలవాడు.
కులమతాతీతుడు.
సురూపి, సుగాత్రి.
బహుముఖ ప్రజ్ఞాశాలి (ఇటీవలి ఉద్యోగాలు రాజకీయనాయకుఁడు, పాత్రికేయుఁడు)
కష్టసుఖాలెరిఁగిన వాఁడునూ..
పేరు 'రానారె కాశాశెగమొ'(పూర్తి పేరు - రాకేశ్వర రెడ్డి నాయిడు కాపు శాస్త్రి శెట్టి గవడ మొదలగునవి). పేరులో రెండు మూడు కులం వున్న మనసు మాత్రం గోకులం.


చాలా చాలా మంచి వ్యక్తి.
ఆదర్శ వాది.
ఆదర్శాలతోఁ చిరాకేస్తే, వాటిని అంగవస్త్రాల్లా దలఁచి ఇట్టే తీసి ప్రక్కన కూడా పెట్ట గల.
బాగా చదువుకున్న
పలు అభిరుచులు గల.
మంచి మనసు, హాస్య చతురత గల.
కులమతాతీతి.
సురూపి, సుగాత్రి.
బహుముఖప్రజ్ఞాశాలి.
కష్టసుఖాలెరిఁగిన ఒక అమ్మాయి కోసం చూస్తున్నాడు .
వెంటనే సంప్రదించండి.

చైతన్య కృష్ణ పాటూరు said...

మహేశ్ గారు,
మనం నోరు తెరిచి అడగకపోతే చాలు, వాళ్ళిచ్చింది అప్పనంగా తీసేసుకోవచ్చు అని అనిపించేలా నా ఇంతకముందు వ్యాఖ్య అనిపించుంటే, నేను సరిగ్గా చెప్పలేకపోయానని అర్ధం. నేనంటున్నది, అబ్బాయికి కట్నం పట్టింపు లేకపోతే, ఆ విషయం తన ఇంట్లో ఒప్పించి ఆ విషయం ప్రకటిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కూడా అమ్మాయి తల్లిదండ్రులు, తమ పిల్లకు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే మానేస్తారు. ఆ అమ్మాయి కావాలంటే తీసుకుంటుంది, లేదంటే లేదు. అది ఇమ్మనటానికి, వద్దనటానికి అబ్బాయికేం పని. అబ్బాయి తనకు పట్టింపులేదన్నాక కూడా ఇస్తే అది తమ పిల్లమీద ప్రేమతోనే గాని, మరోటి కాబోదు. మీరన్నట్లు, మీ మిత్రుని విషయం వేరే. నేను తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చే విషయమే చెప్తున్నాను.

let me be more clear. నా మాటలు కట్నం తీసుకోవాలనుకునే ఒక అబ్బాయి సమర్ధింపులా కాక, తన ఇంటి ఆడపడుచు అత్తవారింట్లో ఒకరి పై ఆధారపడకూడదనుకునే వ్యక్తి అభిప్రాయంలా చూడండి. తేడా తెలుస్తుంది. ఒకప్పుడు ఎంత కట్నం తీసుకుంటే అంత గొప్ప. ఇప్పుడో కొత్త ట్రెండ్ మెదలయ్యింది. కట్నం వద్దనే ట్రెండ్. సీన్ ఎలా వుంటుందంటే, అబ్బాయి పెళ్ళిచూపులకి వచ్చి, తను ఆదర్శవాదినని, కట్నం పైసా అక్కరలేదని, ఆస్తులేవి ఇవ్వక్కర్లేదని, అమ్మాయిని కట్టుబట్టలతో పంపేస్తే, తనే ఆమెను పోషించేస్తానని గర్వంగా ప్రకటించే ట్రెండ్. ఇదెలా ఉంటుందంటే, తనకు న్యాయంగా రావలసిన ఆస్తిని, జాలిపడి వదులుకుంటున్నట్లు ఇచ్చే బిల్డప్ లా వుంటుంది. పెళ్ళి చూపులకు వచ్చి ఇలా సంస్కర్త కటింగ్లు ఇచ్చే వాళ్ళని చాలా చోట్ల చూస్తున్నా ఈ మధ్య. అసలు డిమాండ్ చెయ్యటం తప్పంటుంటే, దాన్ని తీసుకోకపోవటం గొప్పలా చెప్పటం చూస్తే ఎక్కడో కాల్తుంది. అబ్బాయికి కట్నం విషయంలో ఆదర్శంగా వుండాలనిపిస్తే సంతోషమే. తీసుకునేది తను, తన కుటుంబమే కాబట్టి, వాళ్ళని ఒప్పించి, డిమాండ్ చెయ్యకుండా ఇతర విషయాలు, మనస్తత్వాలు చూసుకుని పెళ్ళి చేసుకుని, ఒక వేళ అమ్మాయి వాళ్ళు అమ్మాయికి ఏమన్నా ఇచ్చుకుంటే, దాని మీద హక్కు ప్రదర్శించకుండా వుంటే చాలు. అంతేగాని, అతని ఆదర్శం చూపించుకోటానికి, అమ్మాయి దిక్కులేనిదానిలా రావాలా? ఆమెకు తన స్వంత ఆలోచనలో, కోరికలో వుంటే, దాన్ని తీర్చుకోటం కోసం అతని మీద ఆధారపడాలా? అవసరంలేని చోట చూపించే అనవసరపు జాలి కూడా, ఒక రకమైన ఆధిక్య ప్రదర్శనే.

ఇక కొత్తపాళిగార అన్నట్టు ఇద్దరూ తమ తాత తండ్రుల ఆస్తులు వద్దనుకుంటే ఏ గొడవా వుండదు. కాని ఒకరు తీసుకుని ఇంకొకరు వద్దనుకుంటే, ఆధారపడటమూ, ఆధిక్యత చూపించటమూ వుంటాయి.

Srinivas said...

అడక్కుండా తీసుకుంటే కట్నం కాకుండా పోదు. అప్పుడేమవుతుందంటే అడక్కుండా కట్నం ఎక్కువ ఎవరిస్తారా అని చూచి చూచి మరీ ఏ ధనవంతుడి కూతురినో చేసుకుంటారు. అది అమ్మాయి మీద ప్రేమతో ఇచ్చినదయినా ఆమె పేరు మీద ఆస్తిరూపంలో ముందే ఉన్నా సమస్య రూపం మారదు. డబ్బుకు విలువనిచ్చేవారు అన్ని సమీకరణాలూ వేసుకుని మరీ చూస్తారు. అమ్మాయిలయినా అంతే, తన తండ్రి ఇవ్వగలిగినదానితో వచ్చేవాళ్లలో మెరుగైన వాడినే ఎన్నుకుంటారు.

పెళ్ళి ఒక వ్యాపారమయినప్పుడు ఇలాగే ఉంటుంది. పెద్దలతో సంబంధం లేకుండా తన జీవిత భాగస్వామిని తను ఎన్నుకోగలిగే స్థాయికి అంతా చేరినప్పుడయినా ఎవరు డబ్బు కోసం (నీ పేరున ఉన్న ఆస్తి, నువు సంపాదించబోయే జీతం) చేసుకుంటున్నారో, ఎవరు నిన్ను చూచి చేసుకుంటున్నారో ఎలా తెలుస్తుంది? పెళ్ళిలో ప్రేమ తప్ప డబ్బు ప్రసక్తి లేని రోజు వస్తుందా?

కొత్తపాళీ గారు చెప్పినట్టు కట్నం తీసుకోవడం, మీ తాతతండ్రుల ఆస్తి తీసుకోవడం రెండూ హేయమైనవే! అయితే మీలో ఎంత మంది మీ తల్లిదండ్రుల ఆస్తిని తీసుకోబోవడం లేదు? ఆస్తి హక్కు రద్దుకు ఎంతమంది వోటేస్తారో చేతులెత్తండి! ఆ ఆదర్శస్థాయికి ఎప్పుడయినా చేరగలమా?

అప్పటిదాకా తల్లిదండ్రులు వాళ్లకి తోచినంత పిల్లలకిస్తారు. చుట్టూ ఉన్నవారికోసం కాక తాము ఇబ్బంది పడకుండా ప్రేమ కొద్దీ ఇచ్చింది తీసుకోవడం, తీసుకోకపోవడం ఆ అమ్మాయి ఇష్టం. (తల్లిదండ్రుల్నీ పీడించేవారు ఉంటారని తెలుస్తుంది.) అబ్బాయికి ఎంత ఆస్తి హక్కు ఉందో అమ్మాయికీ అంతే ఉంది. ఆమెను చేసుకోబోయేవాడు అది తన ఆదర్శానికి భంగం అనుకోవడం తెలివితక్కువతనం. ఇప్పుడు మీ స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించాక, ఆర్య సమాజ్‌లో మీరు వాళ్ళకి వీరోచితంగా పెళ్ళి చేయించాక ఆ అమ్మాయి బ్యాంక్ ఎకవుంట్‌లో భారీ మొత్తం ఎప్పుడో జమ అయి ఉందని తెలిస్తే ఏం చేస్తారు?

Bolloju Baba said...

గోకులం ఏం కులమబ్బా?
సరదాగా
బొల్లోజు బాబా

నిషిగంధ said...

అసలి మీకీ ఐడియాలు ఎలా వస్తాయి మహేషా! బాగా నాని ఎండిపోయిన పాయింట్ నే మళ్ళీ ఉతికి గంజి పెట్టేలా చేస్తారు మీరు! ఖచ్చితంగా ఇది మీ భాషా ప్రావీణ్యమే! :-)

కట్నం ఇవ్వడం, తీసుకోవడం గురించి ఇక్కడ మిగతావారు చెప్పినదానికంటే తేడాగా ఏమీ చెప్పలేను కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి పెట్టే ఖర్చు వింటుంటే కళ్ళు తిరుగుతున్నాయి.. పైగా ఫలానా ఎల్లయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఇంత బాగా చేశారు కాబట్టి మీరూ అలానే చెయ్యండి అనే కండిషన్లు!! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉన్నవాడు హడావిడి చేస్తే అది చూసి లేనివాడు కూడా అంతే రేంజ్ లో చేయాలం(నుకుం)టున్నారు! ఎన్నో సంవత్సరాలు తినీ తినకా దాచిన డబ్బు ఆ ఒక్కరోజులో హుష్ కాకి! అమ్మాయిలు/అబ్బాయిలు కట్నాల విషయంలో తమ మాట చెల్లకపోయినా ఈ అనవసర ఆడంబరాలైనా తగ్గించేలా చేస్తే బావుంటుంది..

నిషిగంధ said...

కొత్తపాళీ గారు, మీ కామెంట్ బహుబాగు :-)

sneha said...

మహేష్ గారు, మంచి టాపిక్ చర్చ కు పెట్టారు. కొత్తపాళి గారు మీరు చెప్పిన విషయాల తో 100% ఏకీభవిస్తున్నానండి. అసలు ఆత్మవిశ్వాసం వుండలండి. అది లేకపొతె రాజిపడి బ్రతకాలి అండి. కాని ఇలా మాకు ఇష్టం లేదు కాని మా ఇంట్లొ వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే మేము చెస్తున్నాము అనడం బాలేదు.

I fought with my parents. I told them clearly they should not give me anything for my marriage. I told them that i am working i can earn money i don't need it from them. my parents got me a proposal and to that guy i told my parents don't give any dowry. He replied that he(his family) need money for his brother's business. I was disgusted. I told him it is his reposnsiblity to support his family but it is not my parents. Finally i got married without any dowry.

sneha said...

I forgot to add i didn't get married to that silly guy.

teresa said...

కాస్త lateగా వచ్చాను.నేను add చేసేది పెద్దగా లేకపోయినా Here's my two cents- వరకట్నమనే దురాచారాన్నిరూపు మార్పాలన్న ఆలోచన మన తల్లిదండ్రులూ, తాతముత్తవల కాలం లోనే చెదురుగా ప్రారంభమైంది. 50 సంవత్సరాల క్రితం కట్నం లెకుండా పెళ్ళి చేసుకున్న మా నాన్నగారు college graduate అయిన మా అమ్మగార్ని ఉద్యోగం చేయించకుండానే పువ్వుల్లో పెట్టిచూసుకున్నారు. "మన పిల్లలు పెద్దయ్యేటప్పటికి కట్నాలు అనే concept ఉండనేఉండదు"అనుకున్నారట! నేను med school చదివేటప్పుడు అబ్బాయిలు strategic గా వెనకాల ఆస్తులున్న అమ్మాయిల్నో, అన్నలో అక్కలో అమె్రికాలో ఉన్న అమ్మాయిల్నో వెతుక్కుని ప్రేమిస్తుండే వాళ్ళు. నేనూ,మా చెల్లీ కట్నాలివ్వకుండానూ, మా అన్నకట్నం తీసుకోకుండానూ పెళ్ళీళ్ళు చేసుకున్నాము. మాకెవ్వరికీ సామాజిక గౌరవం తగ్గిపోలేదు, మేము వధూవరుల్ని వెతుక్కుంటూ ఇబ్బందులు పడలేదు!భారీకట్నాలు,కానుకలు, పెట్టుపోతలు మా extended family లో రోజూ జరిగే విషయమైనా మా choice కి ఎవరూ అడ్డు పెట్టలేదు!
కుటుంబ గౌరవం కోసమో , సామాజిక విలువల కోసమో కట్నం తీసుకోవల్సిన,ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లెదు. It's totally an indivdual's own choice. you have to rise above your 'raising'.

మేధ said...

@వేణూ శ్రీకాంత్ గారు: ఆడపడుచు కట్నం పెద్ద ఎమౌంట్ కాదా...?! నేను చూసిన కొన్ని పెళ్ళిళ్ళలో కట్నం ఏమీ లేదు, కానీ ఆడపిల్లకి ఇవ్వాలి అని దగ్గర దగ్గర 2/3 లకారాలు తీసుకున్నారు!

వేణూశ్రీకాంత్ said...

అవునా.. మరీ కట్నం లేని పెళ్ళి లో కూడా ఆడపడుచు కట్నం, అదీ అంత అమౌంట్ తీసుకుంటారని నాకు తెలీదండీ.. అది దారుణం... అలా డిమాండ్ చేయడం అన్యాయం...

రాధిక said...

agree with చైతన్య క్రిష్ణ .
ఆడపడుచు కట్నం 2/3 లకారాలు ... yes its true
కొత్త పాళీ 100% agree
"ఇప్పుడో కొత్త ట్రెండ్ మెదలయ్యింది. కట్నం వద్దనే ట్రెండ్".......yes yes its a trend.venakaala aastipaastulu vunna kuTumbaanni cuusukuni kaTnam vaddani edava kaburlu.aa maaTaki murisipoayi inkoa 3 lakshalu ekkuva ichcheastaaru viiLLu.

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ గారూ;చాలా బాగా చెప్పారు.కాకపోతే మెజారిటీ యువత మొదటి కామెంటులో సురేష్ చెప్పినట్లు "అందరూ వెళ్ళిన దారిలో వెళ్ళినట్టు వుంటూనే మన గమ్యం మనం చేరితే మంచిది లేకపోతే సమాజం మనల్ని అంగీకరించదు" అనే అపోహలో,తెలియని సమాజంకోసం బతుకుతున్నారే గానీ తమ అత్మగౌరవం,ఆనందం కోసం కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో బలమైన వ్యక్తిత్వాలు ఏర్పడి స్వతంత్రించి నిర్ణయం తీసుకోవడానికి వీరు తయారుగా లేకపోవడం వలనే ఇన్ని compromising formula లు వెదకి, వెనకేసుకొస్తారు. నలుగురితోపాటూ నారాయణా! అనుకోక తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన మా శంకర్ లాంటివాళ్ళు కొంత మానసిక క్షోభకు గురయినా,తలెత్తుకు బ్రతకగలిగే చాలా కొద్దిమంది సరసన చేరుతారనుకుంటాను.

@వేణూ;స్త్రీధనం "తల్లితండ్రులకి వచ్చే అల్లుడి శక్తి సామర్ధ్యాల మీద నమ్మకం లేక అమ్మాయి క్షేమం కోరి చేసే సెక్యూరిటీ డిపాజిట్" అయినట్లైతే, its all the more insulting. అలా అయితే ఆది అస్సలొద్దనిపిస్తోంది.ఇక కట్నం విషయంలో ‘పీడించకపోవడం’గౌరవించదగ్గ అర్హత అని అనిపిస్తే, అది subjective అని గమనించగలరు. ఒకడికి ఇవ్వని/తక్కువిచ్చిన కట్నంకోసం భార్యను మానసిక హింసకు గురిచెయ్యడం కూడా పెద్దగా పీడించకపోవడం కాకపోవచ్చు.

@పూర్ణిమ; చాలా బొల్డ్ స్టేట్మెంట్ ఇచ్చావ్. అలా నువ్వు ఉండగలవని ఆశిస్తాను,కోరుకుంటాను.ప్రార్థిస్తాను కూడా. సమాజం మారాలి అంటే, ప్రస్తుతం ఉన్న యువత ఆ మార్పుని వ్యక్తిగతస్థాయిలో అందిపుచ్చుకోవాలి అనేది నా నమ్మకం.

@చైతన్య కృష్ణ; "కట్నం వద్దు" అనేది ఒక ట్రెండ్ లేక బిల్డప్ ఇవ్వడానికి కొందరు మొదలుపెట్టినా దాన్ని నేను స్వాగతిస్తాను. కాని ఆ అపోహలోనే అందరూ ఉన్నారంటేనే నమ్మలేను.‘మహిళల్ని ఉద్దరించడానికి’ కట్నాలు వద్దనడం కాదు, ఇది మనిషిగా మన ఆత్మగౌరవానికి సంబంధించింది అని అందరూ (ఆడామగా) అనుకున్నప్పుడే ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. కట్నం అడగడం ఎంత నీచమో, కట్నం ఇవ్వడం కూడా అంత నీచమని నా భావన.

@శ్రీనివాస్;మీ వాదనకు రెండు వైపులా పదునుంది. నా సమాధానం మీ ప్రశ్నలొనే ఉంది.

@నిషిగంధ;నెనర్లు. భాషాప్రావీణ్యం సంగతి తెలీదుగానీ కొందరు మిత్రులు నా point of view ని "వక్రదృష్టి" అని ముద్దుగా పిలుచుకుంటారు. ఏ విషయంపైనైనా నా వక్రదృష్టి పడందే దానికి పరిపూర్ణత లభించదని వారి నమ్మకం.

ఇక పెళ్ళిళ్ళ సంగతి,వాటిల్లో పెట్టే అనవసరపు exhibitionist ఖర్చులకి నేను సర్వదా వ్యతిరేకినే. కానీ ఒక సాంప్రదాయక వివాహాన్ని ఒప్పుకున్న తరువాత కుక్కిన పేనల్లే ఈ బాదరబందీల్ని అంగీకరించక తప్పదు.ఎందుకంటే, వీటిల్లో అమ్మాయి/అబ్బాయి ఎంపిక మొదలు దేనిలోనూ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు, ఇక ఆదర్శాలూ ఆశయాలూ గంగపాలే!

@స్నేహ; అభినందనలు.

@తెరెసా గారూ:మీరు చెప్పింది బాగుంది. కానీ వ్యక్తిగతస్థాయిలో జరుగుతున్న raising above raising లో సమాజానికీ,కుటుంబానికీ కలుగుతున్న irritation గురించి కూడా ఇక్కడ చర్చజరుగుతోంది.దాని మీద మీ ఆలోచన చెప్పగలరు.

@మేధ, రాధిక; సమాచారానికి ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రాలేదు లెండి! కొత్త పాళీ గారికి వోటెయ్యడానికొచ్చాను. వెన్నెముక లేని యువత(ఆడా, మగా ఇద్దరూ) ఉన్నంత కాలం ఇలాంటి 'ఇవ్వాలా వద్దా, తీసుకోవాలా వద్దా ' అనే ఊగిసలాటలు తప్పవు. మీ జీవితాల గురించి అవగాహన, మీ మీద మీకు భరోసా లేనంత కాలం 'కట్నం ' అనే మాటని మీ డిక్షనరీ లోంచి తీసి పారేయలేరు! 'పెళ్ళి ' అనేది మీ ఇద్దరికీ కాక మీ కుటుంబాలకూ, వారి ఆస్థి పాస్థులకూ కూడా సంబంధించింది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో, మీది వ్యాపార బంధమే కానీ సహజీవనం కాదు!

ఇవాల్టి రోజుల్లో చదువులు, ఉద్యోగాలు, జీతాలు అన్నీ అభివృద్ధి చెందినట్టే కట్నాలు కూడా అభివృద్ధి చెందాయి.మా ఇంటి పక్క అబ్బాయి పెళ్ళి ఆగస్టు పదిన! వాడికి కట్నం ఎంతో తెలుసా, కోటిన్నర! చదువుతో పాటుగా ఎదగాల్సిన జ్ఞానం, బుద్ధి వగైరాలు ఎక్కడికెగిరిపోతున్నాయో అర్థం కావడం లేదు.

ఇక ఆడపడుచు కట్నం సంగతి! బ్రాహ్మల్లో ఆడపడుచుతో పాటు అత్తగారికి కూడా కట్నం ఇవ్వాలి తెలుసా! ఆర్య వైశ్యుల్లో అయితే (నాకు తెలిసి మా గుంటూరు జిల్లాలో)అబ్బాయి కి ఇచ్చే కట్నం మీద ఇంత శాతం ఆడపిల్లకి(విడిగా) అని వసూలు చేస్తారు. (ఎవర్నీ ఎత్తి చూపాలని కాదు, డేటా కోసం చెప్తున్నా)

అడిగినా, అడక్కుండా ఇచ్చినా కట్నం ఒక నీచమైన వసూలు!

రానారె కాశాసెగ గారూ, జోకా, సీరియస్సా?

Suresh Kumar Digumarthi said...

నిజం. నిజంగా వెన్నుముకలేని యువతే. తమ నిర్నయాల మీద తమకే నమ్మకం లేని యువత. తను నమ్మిన సిద్దాంతాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియని యువత. తన సిద్దాంతాన్ని తన వారికే అర్థమయ్యేటట్టు చేయలేని యువత. మీ 'వెన్నుముక ' నా జ్ఞాపకాల తుట్టని రేపింది. నాకు తెలిసిన ఒకడు, తన ప్రేమకోసం కులాన్ని, కట్నాన్ని జయించాడు. మా ఇంట్లో ఇంతవరకూ 'సంకరం' లేదు అంది వాళ్ళమ్మ. సంకరం లేక పోతే ఆ అమ్మాయి నిన్ను సరిగ్గా చూడక పొయినా, నీ కోడుకుతో సరిగ్గా వుండకపోయినా సరేనా అన్నాడు. వాళ్ళమ్మ మాట్లాడలేదు. కుటుంబంలో ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడు, తన భావాలు వ్యక్తం చేసాడు, అందరి మనసు గెలిచాడు. తరువాత వాళ్ళ ప్రేమాలయంలో తన ప్రియురాలు కూడ భాగమై పోయింది.
తలచుకుంటే శంకర్ కూడా చేయగలడేమో

Anonymous said...

కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకు కూర్చోవటం ఒక విధమైన శాడిజం.ఇటువంటి వారు తామేదో గొప్పవారిమని పోజులు కొడుతుంటారు. ఇటువంటి ఆదర్శవాదులమని చెప్పుకునే వారి వల్ల చీటికీ మాటికీ వారి బార్యలు ఇబ్బంది పడాల్సుంటుంది. స్త్రీకి కొంత ధనం ఉండటం వల్ల ఆమెకు స్వతంత్రమ్ ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

@శివ స్పీక్స్; ‘కట్నం తీసుకోమని భీష్మించేవాళ్ళు సాడిస్టులు’ అనేది చాలా వింతైన కొత్త ప్రతిపాదన. మీ ప్రతిపాదన యొక్క ప్రాతిపదిక నాకు అర్థం కాలేదు. ఈ విషయం మీద మీరు కొంచెం వివరణ ఇస్తే చర్చని ముందుకి సాగించవచ్చు.

@సురేష్, మంచి ఉదాహరణనిచ్చారు. ఇలాంటి మానసిక ధైర్యం శంకర్ కి కలగాలని నేనూ కోరుకుంటాను.

@సుజాత గారూ; నీచమైన కట్నం, ఒక సామాజిక గుర్తింపు గౌరవంగా మారడం చాలా హేయమైన విషయం. పైపెచ్చు ఇదొక చట్టవ్యతిరేకమైన పని కానీ పరిస్థితి ఇలా ఉంటే మార్పు ఎక్కడినుండీ రావాలి అన్నదే ముఖ్యమైన సమస్యలాగా ఉండి. కొత్తపాళీ గారు చాలా బాగా సమాధానం సూచింఛారు.

మోహన said...

సమాజం ఏమనుకుంటుందో.. అనే బెంగ నాకు లేదు.. ధైర్యానికీ లోటు లేదు. ఇక నా పై నాకు నమ్మకం అంటారా అది నా చిరునామా అని నేను ఎప్పుడూ ఫీలవుతూ ఉంటాను. నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. నా బాధ అల్లా తల్లి తండ్రులను నొప్పించకుండా, ఒప్పించాలనేనండీ. తెగేసి చెప్పచ్చు. కానీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు ఏ పిల్లలు మాత్రం సహించగలరు చెప్పండి? అలా అని తగ్గే ప్రశక్తి లేదు. వీటన్నిటి మధ్యా బేలెన్స్ చేసుకుంటూ మనకు కావాల్సింది సాధించటమే కదా పెద్ద చాలెంజ్?

ఇక్కడ చాలా మంది చాలా విషయాలు చెప్పారు. నేను హైస్కూలులో ఉన్నప్పటి నుంచి ఎన్ని డిబేట్ లు, ఎన్నెన్ని వాదనలు, గొడవలు.. ఇప్పటికీ ఇది ఓ హాట్ టాపిక్. కొత్తపాళీ గారు రక్తం సల సల కాగుతుంది అన్నది చదివి, నాకో సందర్భం గుర్తికి వచ్చింది.

6 నెలల క్రితం సంగీతం క్లాసులో ఒక కొత్త అబ్బాయి చేరాడు. క్లాస్ అయ్యే సమయానికి నిర్మలగారు[మేడం], నేనూ, ఆ అబ్బాయి మాత్రమే ఉన్నాం. కొత్త అబ్బాయి కదండీ, టీచరు ఏవో ప్రశ్నలు వేస్తున్నారు. అది అలా కట్నాల వరకూ వచ్చింది. అప్పటి వరకు మాట్లాడని నేను, వీర రేంజిలో చాకి రేవు మొదలుపెట్టాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వేరే 100 కారణాలు ఉంటాయి లాంటి సాకులు చెప్తుంటే నాకు వళ్ళూ మండి, చెవ్వుల్లోంచి పొగలు మొదలయ్యాయి.. మేడం మాత్రం అలా చూస్తూ ఉన్నారు. కాసేపటికి ఆ అబ్బాయి మొహమాటం వల్లనో, మరి మొహం చెల్లకనో బిక్క మొహం ఐతే పెట్టాడు. అప్పటికి గాని నే తేరుకోలేదు. మీ ఇష్టం. కానీ నాలాంటి అమ్మాయి ఐతే అలా అమ్ముడు పోయే వారిని గౌరవించలేదు అని చెప్పి ముగించేశాను. అంత మాట, ఒక తెలియని వ్యక్తిని అదీ టీచరు ముందు ఎలా అనేసానా అని తర్వాత అనిపించింది. కానీ ఏవరేమనుకుంటే నాకేంటి? నేను అనుకున్నది నిర్భయంగా చెప్పను అని సంతృప్తి చెందాను.

సురేష్ గారూ ఒక నెల క్రితం idontwantdowry.com సైటు చూసాను. సరదాగా అసలు ఇక్కడ జనాలు ఎలా ఉన్నారా అని కుతూహలం కొద్దీ.... ఆశ్చర్యం ఏమిటి అంటే, అక్కడా చదువుకున్న అబయిలు చల తక్కువ మంది ఉండటం.. గుడ్డి కన్న మెల్ల మేలని.. సంతొషించాను.

మహేశ్ గారూ.. సంత లో ఆవులా అని చాలా మృదువుగా అన్నారు. నిజానికి పశువుల మల్లేనే అమ్మాయిలు ఒక పది మంది మధ్య నడిచే పద్ధతి. వేలం పాటాలో అమ్ముడు పోయే వస్తువుల్లా అబ్బాయిలూ... అమ్మాయి నలుపైతే 2 లక్షలు ఎక్కువ [అప్పుడు నల్లమ్మాయి కాస్తా నల్ల బంగారం అయిపోతుంది మరి], అబ్బాయి ఇంత చదివాడు కాబ్బట్టి ఇంకో రెండు, బాగా ఆర్జిస్తున్నాడు కాబట్టి ఇంకోటి.... ఘోరాతి ఘోరమైన విషయం ఏమిటి అంటె.. కొంత మంది కొదుకులను, ఇలా కట్నాల కోశం న్.ర్.అయి సీటు కొని మరీ చదివించటం. నాకైతే, ఈ పద్ధతుల పై ఏవగింఫు, అసహ్యం పుడుతోంది. ఒక్కో సారి పెళ్ళీ పై విరక్తి కూడా...
దానికి సాక్షంలా ఉంది నా కామెంట్ పొడవు. ఇంత లెంత్ పోష్ట్ నేను స్వ-బ్లాగులో కూడా రాసుకోలేదు సుమండీ...

ఎక్కడో ఒక చోట ఆపలి కాబట్టి ఇక్కడ ఆపుతున్నాను.

మీ ఫ్రెండ్ శంకర్ గారికి, ఇక్కడ తమ మనసుల్లొని బాధను, ఆశయాలను వెల్లడించుకున్న ఆదర్శవంతులకి నా తరపున 'ఆల్ ది బెష్ట్'. సమాజం ఇంకా ఆదర్శాలకు, ఆదర్శవంతులకి వట్టి పొలేదన్న ఆలోచన తో వెళ్ళి హాయిగా నిద్రపోతాను.

జ్యోతి said...

శివ గారు,
కట్నం తీసుకున్న వాళ్ళు మంచివాళ్ళు అంటారా? తీసుకుని మొత్తమ్ లేదా కొంచమన్నా వారి భార్యలకు ఇస్తున్నారా?

మహేశ్
నీ ఫ్రెండ్ ని , నిర్ణయించుకోమను ఆదర్శాలకు పోకుండా పెళ్ళి చేసుకుని నచ్చిన అమ్మాయితో కట్నంతో హాయిగా ఉండమను, లేదా అందరిని ధైర్యంగా ఎదిరించి కట్నం లేకుండా పెళ్ళీ చేసుకోమను. ఎప్పటికి తన వెంట ఉండేది, భార్య కాని, అక్క, అమ్మా కాదు.
నాకు కూడ ఈ విషయమై ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. ఎందుకంటే నేను ఇపుడు అమ్మాయి, అబ్బాయి ఇద్దరి పెళ్ళి విషయంలో ఆలొచించాలి కాబట్టి. మా పిల్లలతో ఈ కట్నం విషయమై ఎన్నో సార్లు చర్చ జరుగుతుంది. అది వివరంగా టపా రాయాల్సిందే.

మహేశా!!
నువ్వు టపా రాయడమేమో కాని దానికి వ్యాఖ్య బదులు మరో టపా రాసేట్టు చేస్తున్నావు.

Sujata M said...

కొత్త పాళీ గారూ.. మీరు డిస్గస్ట్ కావొచ్చు. కానీ ఇన్నాళ్టికి ఒకబ్బాయి కి కట్నం తీసుకొకూడదూ అన్న ఆలోచన రావటం - దాన్ని అమలు పరచబొయేంతలో అతనికున్న ఫ్రేం లో (షెల్) లో అతనికి ఎదురైన సమస్యలూ, ఇక్కడ ప్రస్తావించారు. కాణీ కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్న కజిన్లు, పెళ్ళి ఖర్చు తో సహా పూర్తిగా భరించిన వధూ వరులూ నాకు తెలుసు. కట్నం అనే ద్రవ్యాకర్షణ (ఈసీ మనీ) సాధనం ఎదురుగా ఉండగా వొద్దనే వాడు ఎంతో గొప్ప వాడు. (మీరు ఇంకా ఎక్కువ డిస్గస్ట్ ఔతున్నారా ?) అలాంటి చోటా మోటా గొప్పతనం పాపం యువత తలల్లో మొలవటం (మార్పు ఒకేసారి సంభవించడం కష్టం.. నెమ్మది నెమ్మది గానే మార్పులు జరుగుతాయి) గురించే కదా ఈ చర్చ. వీళ్ళు (ఒకరిద్దరు కాదు.. మొత్తం అందరూ..) ఎవరికి వారు వ్యక్తిత్వ వికాసం పొంది, సామాజిక మార్పు కు గురి కావడం నెమ్మది గా జరిగే వరకూ మీరు సూచించిన రెండు ఉదా.. కాకుండా, మధ్యే మార్గంలో.. అసలు కొంచెం అయినా మార్పు కు రెసెప్టివ్ గా ఉన్న వాళ్ళను ఆ పని ఆపెయమని చెప్పడం ... మంచిది కాదు.

teresa said...

@mahesh- "rising above your raising" is an individual effort and custom tailored. Like a lot of things in life, individual growth does not come with an instruction manual and there is always struggle involved in the process. A bit of challenge in life is what makes it interesting :)

Ramakrishna Bysani said...

నాకైతే మా మామగారు ఒక్క రూపాయి ఇవ్వలెదుకానీ, నా ఇల్లాలికి ఏవో హారాలు, గాజులు, వడ్డాణం అని బంగారం పెట్టారు, తనకి కూడా స్థిరాస్తి కానీ దబ్బులు కానీ ఏమీ ఇవ్వలేదు, ఇంతకీ నెను ఇప్పుడు కట్నం తీసుకున్నట్టా? కాదా?

ramya said...

నిషి గారు చెప్పింది నిజం విషయానికి గంజిపెట్టి చర్చ లేవదీసేస్తారు:)
నాకు ఇక్కడ ఒక విషయం అర్ధంకాలే ఆ అమ్మాయి తన నాన్న దగ్గర డబ్బు తీసుకుంటే ఆ విషయానికి ఆ అబ్బాయి ఎందుకు తిరస్కరించటం:) ఇతనూ అతని నాన్న దగ్గర డబ్బు తెచ్చుకుంటే పోయే:) దాంట్లోచే అక్కకీ బహుమతి ఇవ్వొచ్చు:)(సరదాగానే)

ఇక వరకట్నం సంగతంటారా, ఇప్పుడు ట్రెండ్ కాస్త మారిపోయింది లెండి, అబ్బాయి ఫారిన్‌ లో ఉన్నాడు పెళ్ళికి వస్తాడు మాకు పైసా కట్నం వద్దు .. ఇలా మొదలౌతున్నాయి పెళ్ళి మాటలు ఆ తరువాత అబ్బాయి ఇండియాకి వచ్చినప్పటి నుండీ పెళ్ళి చేసుకుని తిరిగివెళ్ళే టికెట్టు వరకు పాపం కట్నం తీసుకోని అబ్బాయి ఖర్చులన్నీ(ఈ రెండునెలలూ తిరగడానికి ఓ పెద్ద కారూ పెట్రోలూ, డ్రైవర్ తో సహా) ఇక అమ్మాయి తండ్రి వే! కట్నం ఎలాగూ తీసుకోవట్లేదు కనక గ్రాండ్ గా పెళ్ళి జరిపించాలంటారు, అబ్బాయి తరఫు వారికి ఏసీ హోటల్ గదులూ గట్రా.. కానుకలూ.. ఇలా వాళ్ళ జన్మలోని కోరికలన్నీ తీర్చుకుని, కట్నం లేని పెళ్ళి చేసుకుని వాళ్ళు వెళతారు, వెనక పదిహేను ఇరవై లక్షలదాకా పిచ్చి ఖర్చు చేసేసుకుని ఆ అమ్మాయి ఆ నగలూ చీరెలూ ఇక్కడే వదిలేసి చేతులేలాడదీసుకుని భర్తవెంట ఆ దేశం వెళుతుంది.. (తరువాత మామూలే అక్కడ డబ్బుకోసం ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ..అంట్లు తోముకుంటూ ఆ అమ్మాయి:)

Kathi Mahesh Kumar said...

@మోహన; తల్లిదండ్రుల కళ్ళలో నీళ్ళే ఒక emotional blackmail.దాన్తో మన ఆదర్శంకాస్తా కరిగి ఆవిరైపోతుంది.వాళ్ళెలాగూ తమ జీవితాల్ని రాజీపడి బ్రతికేసారు. ఇక మిగిలిన మనల్నికూడా వాళ్ళు నమ్మిన విలువలకి గౌరవప్రదంగా బలిచేసి, మిమ్మల్నీ ఒక ‘సామాజికజీవి’ని చేస్తారు.అంతే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మీ వ్యక్తిత్వం హాం...ఫఠ్.
ఇకమీరి చెప్పిన NRI గామారి మరీ పెద్దకట్నం తీసుకునేవారి సంగతి ప్రత్యేకంగా చాకిరేవు పెట్టిమరీ ఉతికెయ్యాలి.ఇంకా ఆదర్శవంతులు,కాస్తోకూస్తో స్వాభిమానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉన్నారు. మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

@జ్యోతి గారూ; నేను నా మిత్రుడికిచ్చిన సలహా కూడా దాదాపు అలాంటిదే! ఇంకెందుకాలస్యం, మీరూ ఈ విషయం మీద ఒక టపా కట్టండి. ఒక మహిళగా,తల్లిగా ఈ విషయంపై మీ దృక్కోణం చాలా అవసరం.

@సుజాత గారు; కొత్తపాళీ గారి ఆవేదన "ఆ మార్పుకు సమయం ఎప్పుడు?" అని. ఇలాంటి మార్పులు నిదానంగా వస్తాయంటే...అవి ఎప్పుడు 10సంవత్సరాలు... 1 సంవత్సరం... రేపు.. ఎప్పుడొస్తుంది మార్పు?!? మార్పు అవసరం అని అందరూ అంగీకరించినపుడు దానికొక time frame అవసరమా? If change is needed, this is the time to change. Now is moment to change.

@తెరెసా; I agree

@రామకృష్ణ; బాగుంది మీ middle path.
@రమ్య, నువ్వు చెప్పిన NRI పెళ్ళిల్లు చూస్తే కట్నం కన్నా హీనంగా ఉన్నాయ్..ఎవరైనా తెలిసినవాళ్ళు దాని గురించి ఒక టపా రాయాలి.

ramya said...

@మహేష్ నువ్వు రాసినంత బాగా రాయలేనేమో! వీలైతే నేనే రాస్తా ఇలాంటి పెళ్ళిళ్ళు నాకు తెలుసు.

Anonymous said...

@కత్తి మహేష్ కుమార్,@జ్యోతి

నా ఉద్దేశ్యం భీష్మించుకు కూర్చునే వాళ్లలో ఒక విదమైన శాడిజం ఉంటాది.కట్నం తీసుకోక పోవడం మంచి పద్దతే కాని స్త్రీ ధనం వద్దనడం శాడిజమే!. ఇటువంటి వారు బార్య పై జులుం ప్రదర్శిస్తారు చీటికి మాటికి.

నా ప్రెండ్ ఒకడు ఈ టైపే! వాడి ఆదర్శాలు తట్టుకోలేక వాడి లవర్ , లెక్చరరుతో వెళ్లిపోయింది..

ఇటువంటి వారికి ప్రేమ వివాహం సరి అయినది, కాని వీరు ఎవరినీ ప్రేమించలేరు.

మీ స్నేహితుడు ఏ బీద అమ్మాయినైనా చేసుకొంటే గొప్ప గాని డబ్బున్న అమ్మాయిని స్త్రీధనం వద్దనడం ఏం గొప్ప.

ఇలా ఆదర్శాలు వల్లివేసే వారి వల్ల వారి భార్యలు, కుమారులు చాలా నష్టపోవటం జరుగుతుంది. గాందీ గారి బార్య,పుత్రులు ఏమి సుఖపడ్డారు?

Shiva Bandaru said...

గాందీ గారు తనభార్యతో,కుమారులతో ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు కదా ? . ఇలాంటి ఆదర్శవాదులమనే చెప్పుకునే వారికి సర్దుకుపోయే మనస్తత్వం తక్కువ.ప్రచార్భాటం ఎక్కువ. తామె గొప్ప అని ఫీలింగ్.ఇటువంటి వారికి పిల్లనిచ్చేముందు ఒకటికి రెండిసార్లు ఆలోచించాలి.

ఆడపిల్లలూ కట్నం తీసుకోను అని అనగానే పరిగెత్తుకెల్లిపోకండి.
అతని గత చరిత్ర పరిశీలించండి.

కేవలం కొన్ని ఆదర్శాలున్నంత మాత్రాన గొప్పవారు కాలేరు.
మానవ సేవ చేసే వారే గొప్ప అని నా ఉద్దేశ్యం.

Kathi Mahesh Kumar said...

@శివ; ఆదర్శవాదులను ‘శాడిస్టులు’ అని ముద్రవేయడం మీ అమాయకత్వం అనుకున్నా ఇప్పుడు గాంధీని ఉదాహరణగా చూపి అమాయకత్వాన్ని కాస్తా మూర్ఖత్వంగా అనిపించేలా చేస్తున్నారు. మీరు కేవలం వాదన కోసం ఇలా చెబుతున్నారంటే సరే! అనికోవచ్చు. కానీ ఇది మీ నమ్మకమైతే, మీ దగ్గరున్న సమాచారం అసమగ్రమైనా అయ్యుండాలి లేదా తప్పైనా అయ్యుండాలి.

గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోవచ్చు అంత మాత్రానా శాడిస్ట్ అని నిర్ణయించేసుకోవడం మీ ఎదగని బుద్దికి ఉదాహరణ. లేదా మీకు శాడిస్ట్ అన్న పదానికి అర్థమన్నా తెలీకపోయుండాలి.

ఇక ఆదర్శాలున్నవాళ్ళ జీవితాలలో సాధారణంగా బ్రతికేవారికన్నా కొన్ని ఎక్కువ సమస్యలుంటాయి.అది సహజంకూడా ఎందుకంటే, they are challenging the conventional path.అన్నింటినీ అంగీకరించి హాయిగా బతికేస్తే అసలు ఆదర్శాలెందుకు?

కట్నాలు ఒద్దన్నవాళ్ళు, చాలా మండి చరిత్రహీనులై ఉంటారని మీ assumption లా ఉంది?

ఆదర్శాలకూ మీరు చెప్పిన మానవసేవకూ...పైన మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకూ, భారవైరుధ్యముంది గమనించగలరు.

Anonymous said...

@కత్తి మహేష్ కుమార్
1.నేను గాంధీ గారిని శాడిస్ట్ అనలేదు.
(గాంధీ గారు మొదట్లో భార్యను కష్టపెట్టేవాడు. తరువాత మారాడు. మహాత్ముడైనాడు. )

"నా ఉద్దేశ్యం భీష్మించుకు కూర్చునే వాళ్లలో ఒక విదమైన శాడిజం ఉంటాద"
ఇది మీ ప్రెండ్ విషయంలో చెప్పాను.

నేను చెప్పేవి పుస్తకాలు చదివి కాదు. నేను చూసిన అనుభవాలతో..
అందుకే పెద్దలు ఇటువంటి వారితో వియ్యమందటనికి బయపడతారు. పెద్దలు ఆలోచిస్తారు కాని మనం ఆవేశపడతాం..

పెళ్లికి మిఖ్యమైనది "సర్దుకుపోయే మనస్టత్వం".అదిలేనప్పుడు ఎన్ని ఆదర్శాలున్నా వేస్ట్.ఇదీ మీ ప్రెండ్ విషయంలో

2.నేను కట్నాన్ని పై కామెంట్లలో ఎక్కడా సమర్దీంచ లేదు. చూడండి.

Kathi Mahesh Kumar said...

@శివ; నీ వయసునాకు తెలియదు. కానీ మీ వాదన వింటుంటే చాలా amateurish గా ఉంది.ఇక నా స్నేహితుడి భీష్మించుకుని కూర్చోలేదు. తన నమ్మకాన్ని తనవాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మొండిగా వాదించేవాడైతే ఈ పాటికి కుటుంబంతో తెగదెంపులైనా చేసుకునుండాలీ లేక (కాబోయే) మామగార్నీ,భార్యనూ ఆ మాటలన్నందుగు తెగిడైనా ఉండాలి. He won't be trying to reason them out.

ఇప్పటికీ మీకు శాడిజం అంటే ఏమిటో తెలిసినట్లు లేదు. దయచేసి ఈ లంకెను చదవండి. http://en.wikipedia.org/wiki/Sadistic_personality_disorder దయచేసి అర్థం తెలియని పదాలు వాడడం తగ్గించండి.

పెళ్ళి జరిగిన తరువాత ఇద్దరు వ్యక్తులు సర్ధుకుపోవడం వేరు, పెళ్ళికోసం వ్యక్తిత్వాన్ని వదిలి రాజీపడటం వేరు. మీ వాదన ప్రకారం చూస్తే, (I am sorry for say this) ఈ విషయాలు అర్థం చేసుకునే పరిపూర్ణత మీలో ఇంకా ఏర్పడినట్లు అనిపించడం లేదు.