Saturday, July 12, 2008

ఏది తప్పు? (కవిత)


తప్పుచేసి, తప్పును తెలుసుకుని,
తప్పుని తప్పని తెలియజెప్పితే తప్పా?
నిజాన్ని నిఖ్ఖచ్చిగా నిగ్గుదేల్చక
నీరసంతో నివురుగప్పితే తప్పా!?!
తప్పుని "తప్పు" అనడానికి కావలసింది
నిజమెరిగిన చైతన్యమే తప్ప,
నిగడదీసిన నైతికత కాదుగా!
మరి తప్పన్న వారి
నైతికతపై ప్రశ్నచిహ్నాలెందుకు?
నివురుగప్పిన నిజాన్ని నిగ్గుదేల్చినందుకా!
లేక,
నీ మనసు నలుపుని నలుగురిలో నిలిపినందుకా?
ఏది తప్పు?
మూర్తీభవించిన చైతన్యమా!
ముసుగుతన్నిన మాలిన్యమా!!

12 comments:

జ్యోతి said...

మహేశ్,,

నిజమే నిజం చెప్తే నేరమే ఈ రోజుల్లో. కాని కొందరు మాత్రం నిజం చెప్తే సంతోషిస్తారు. తమ తప్పులు ఎత్తి చూపినందుకు మనలను అభినందిస్తారు. అందుకే నిజం చెప్పేటప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎదురుదెబ్బలు తప్పవు.

Bolloju Baba said...

తప్పుని తప్పని ఖండించటం తిలక్ మాటల్లోని " తోకతెగిన కలుగుల్లోని ఎలుకలు" చేయలేని ఒక పనే.
మీ ప్రశ్నలు బాగున్నాయి.

నిగడదీసిన నైతికత కాదుగా అనే చోట నెత్తికెత్తుకున్న నైతికత కాదుగా అని ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.

బొల్లోజు బాబా

Bolloju Baba said...

అక్కడ నిగడతీసిన నైతికత అనేచోట లేని నైతికత అని అర్ధమా?
బొల్లోజు

Kathi Mahesh Kumar said...

@బాబాగారూ;నెనర్లు. ‘నిగడదీసిన’ అన్నపదం బలవంతంగా నిలబెట్టిన నైతికత అనే అర్థంలో వాడాను. అంతేకాక చైతన్యానికి స్థిరత్వం, అందునా కటువుగా నిలబడిన స్థిరత్వం చుక్కెదురుగనక అలా చెప్పాను. మీరు సజెస్ట్ చేసిన ‘నెత్తికెత్తుకున్న’ అనే పదం వాడితే మరీ direct comments లా ఉంటుందని వాడలేదు.

@జ్యోతి గారు;నెనర్లు. అప్రియమైన నిజం మానవ ప్రగతికి అవసరం అనిపిస్తే చెప్పక తప్పదు అని నా భావన. అందునా కనీసం నా లోకంలో (నా బ్లాగులో)నేనున్నప్పుడు నిజాన్ని నిలువుటద్దంలో చూడాలని నా ముచ్చట. ఇక ఇతరుల అభినందనలూ,నిందలూ ఏంచేసినా ఉండేవే. వాటికి వెరవడం అంటే మనం మనల్ని కోల్పోవడమే కదా!

మీనాక్షి said...

మహేశ్ గారు..!ఎప్పుడు ఏం రాస్తారో తెలీదు..అటు..టపాలు..ఇటు..కవితలు...ఇంకా సినిమా రివ్యూస్..
ఎలా ఎలా ఎలా...రాస్తారు...గురుదేవా..ఇవన్నీ...
ఆ పదాలు ఎక్కడ పట్టుకొస్తారు..మీరు.
..నీ మనసు నలుపుని నలుగురిలో నిలిపినందుకా..?..ఈ లైన్ నచ్చింది నాకు..చాలా బా రాసారు...

Sankar said...

తప్పొప్పులు relative క దా .... ఒకరికి తప్పనిపించింి ఇంకోళ్ళకి ఒప్పుగా ఉండొచ్చేమో.. అంతమాత్రానికే ఇలా వాపోవడం ఎందుకో అర్ధం కావడం లేదు.

' నిజాన్ని నిఖ్ఖచ్చిగా నిగ్గుదేల్చక
నీరసంతో నివురుగప్పితే తప్పా? '

దీనిని ఏ అర్ధంలో వాడారో కొంత వివరించగలరు...

Unknown said...

సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్
న బ్రూయా త్సత్య మప్రియం
ప్రియం చ నా2నృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతనః మను-4-138
సత్యమునే పలుకుము.ప్రియమునే మాటాడుము.సత్యమైనను అనృతము నాడకుము.ఇదే సనాతన దర్మము.

సత్యం వద ధర్మం చర.-త్తైత్తిరీయం
సత్యము పలుకుము.ధర్మము ననుష్ఠించుము.
సత్యం మాతా పితా జ్ఞానం.-మను స్మృతి
సత్యం మృదు ప్రియం ధీరో వాక్యం హితకరం వదేత్
ఆత్మోత్కర్షం తథా నిందాం పరేషాం పరివర్జయేత్.-ఆర్య ధర్మ
మృదువుగా, ప్రియముగా,ధైర్యముగా,హితకరముగా,సత్యమునే పలుకుట అభ్యసించుము.ఆత్మోత్కర్షమును పరనిందను విసర్జించుము.
సత్యం శౌచం తప శ్శౌచం శౌచ మింద్రియనిగ్రహం-ఆర్య ధర్మ.
సత్య మేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః-రామా.
సత్య మేవ జయతే నా2నృతం.
సత్యస్య వచనం శ్రేయః
సత్యా న్నాస్తి పరో ధర్మః

శ్రీ said...

తప్పా..కాదా?అని ఒకసారి అడిగితే పోయేదానికి తిప్పించి,మళ్ళించి ఏమి కొట్టారండీ మహేష్ గారు!

రానారె said...

మీ బ్లాగులో ఈ భావంతో కవిత వస్తుందని నేనూహించాను. ముసుగు తన్నిన మాలిన్యమున్నచోటికి దాన్ని కదిలించే చైతన్యం వచ్చిన ప్రతిసారీ మనసుల్లోని నలుపుకు ఉలికిపాటే. బాగా రాశారు - అని నాకనిపించింది - కవితల డిపార్టుమెంట్లో మనం బాగా వీకు :)

మోహన said...

మహెశ్ గారూ..

మీరు రాసింది చదివాక, నాకు ఈ విషయమై ఒక చిన్ని టపా రాయాలనిపించింది.
http://venugaanam.blogspot.com/2008/07/blog-post_13.html

చూసి మీ అభిప్రాయం తెలుపగలరు.

Kathi Mahesh Kumar said...

@సహిత; నెనర్లు

@మీనాక్షి,ఎప్పుడు ఏదితోస్తే అది రాసెయ్యడమే! ఇక పదాలంటావా అవి మనం చదివిన పుస్తకాల్లోంచీ మొదడులోకొచ్చి, ఆలోచనవచ్చినప్పుడు ఆటోమేటిగ్గా కూర్పుకుగురై ఇలా తయ్యారై వచ్చేస్తాయనిపిస్తుంది.ఆ వాక్యం నచ్చినందుకు నెనర్లు.

@శంకర్; తప్పొప్పులు రిలేటివ్వే...కానీ నిజాలు కాదు! అయినా రిలేటివ్ అయితే ఇరువైపుల వారూ ఈ కవితని ఒకరికొకరు వినిపించేసుకోవచ్చు. వాపోవడం కూడా ఒక legible human expression దానికున్న విలువ దానికుంది.

ఇక రెండో పాదానికి మీరడిగిన అర్థం, మొదటి పాదానికి contrast గా గుర్తించగలరు.

@నరసింహ;శాస్త్రాలనుండీ సత్యం గురించి ఇన్ని వివరాలు తెలిపినందుకు నెనర్లు."సత్యమైనను అనృతము నాడకుము" అన్న శాస్త్రోక్తి కీ నాకూ కాస్త చుక్కెదురు లెండి. అందుకే అప్రియాలైన చాలా సత్యాలు చెప్పేస్తూ,కొంత మందికి బాధనికూడా కలిగిస్తూఉంటాను.

@శ్రీ; కవితంటే తిప్పించి మల్లించీ కొట్టడమే కదా! నిజంగా విడమర్చి చెప్పాలంటే కనీసం 10 టపాలు రాయాలి.అందుకే ఈ ‘ఆసాన్ రస్తా’.

@రానారె; గారూ నెనర్లు. మనం వీక్ అంటూనే, నా వీక్ కవితలోని మర్మాన్ని చెప్పేసారు. నేను చెప్పాలనుకుంది దాదాపు అదే!

@మోహన;మీ కవిత చదివి నా అభిప్రాయాన్ని రాసాను చూడండి.

Anonymous said...

ఇక్కడేదో "తప్పు" జరిగినట్టుందే!

సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయాత్
న బ్రూయా త్సత్య మప్రియం
ప్రియం చ నా2నృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతనః

నాకు ఇలా అర్ధమయ్యిందే! :

సత్యమునే పలుకుము.ప్రియమునే మాటాడుము.
సత్యమైనా అప్రియంగా చెప్పవద్దు
ప్రియంగా ఉంటుందని అబద్ధము ఆడవద్దు
ఇదే మరల మరల నూతనముగా తెలియు ధర్మము