Tuesday, July 15, 2008

నా మనోభావాలు దెబ్బతిన్నాయ్!

Breaking News: ‘రెడీ’ సినిమాలో సునిల్ పాత్రద్వారా రాష్ట్రవ్యాప్తంగా, కూచిపూడి నాట్యాచార్యుల మనోభావాలు దెబ్బతిన్నాయ్!



పోయిన సంవత్సరం ఎమ్.ఎఫ్.హుస్సేన్ హిందూ దేవతల్ని నగ్నంగా పెయింట్ చేసాడు.
"హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని దేశం నుండీ తన్ని తగలేసాం.



బరోడాలో ఒక విధ్యార్థి పరీక్షకు తన బొమ్మల్ని ప్రదర్శనకు పెడితే...
ఒక రాజకీయనాయకుడు విధ్వంసం చేసి "హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని ఆ విధ్యార్థిని జైలుకి పంపాడు.



బుష్ ప్రభుత్వంతో న్యూక్లియర్ ఒప్పందం చేసుకుంటే...
భారతీయ ముస్లింల "మనోభావాలు దెబ్బతింటాయ్" అని కొన్ని రాజకీయపార్టీలు అంటున్నాయి.



మొన్న ఒక పత్రిక కొన్ని అవాకులు రాస్తే...
"దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని భౌతికదాడికి దిగేసారు.



నిన్న ఒక పత్రికలో జీసస్ బొమ్మ అభ్యంతరకరంగా అచ్చైతే...
క్రైస్తవుల "మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని ఆఫీసు ద్వంసం చేసారు.



నిజంగా దేవుళ్ళూ, మతాలూ, కులాలూ గత ఐదు సంవత్సరాలలో ఇంత సున్నితంగా తయారయ్యారా...!?!



సుదీర్ఘ ముస్లిం పరిపాలనలో, బ్రిటిష్ రాజ్యంలో చెక్కుచెదరని హిందూ మతం, దేవుళ్ళూ ఒక్క పెయింటింగ్ తో ప్రమాదంలో పడిపోతారా? "హిందూ మతం ఒక మతంకాదు, అదొక జీవన విధానం" అనిచెప్పుకునే ప్రజల మనోభావాలు ఈ మాత్రానికే గాయపడతాయా?



ప్రపంచవ్యాప్తంగా బుష్ ప్రభుత్వం ముస్లింలపై చేస్తున్న దారుణాలకు భారతీయ ముస్లింలు వ్యతిరేకమేగానీ, భారత ప్రభుత్వం, దేశ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే ముస్లిలు ఎందుకు వ్యతిరేకిస్తారో? వారి మనోభావాలు ఎందుకు గాయపడతాయో?



దళితనాయకులలో పెరుగుతున్న వ్యాపారధోరణిని ఒక పత్రిక ఎత్తిచూపినంత మాత్రానా, మొత్తం దళితుల మనోభావాలెలా దెబ్బతింటాయ్? అప్పుడప్పుడూ చాటుగా, అక్కడక్కడా బాహాటంగా దళితులు ఇదే మాటలు అనుకోవడం లేదా? నాయకుడు జాతి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం వహిస్తాడేగానీ, వారి మనోభావాల్ని భుజానేసుకుని తిరుగుతాడా...కొన్ని కోట్ల దళితుల మనోభావాల గురించి క్షణంలో తెలిసి, దాడికి పాల్పడడానికీ?



ప్రేమ, కరుణ, క్షమ మూల సిద్ధాంతలుగా గల క్రైస్తవమతం మనోభావాలు. ఒక్క సిగరెట్, బీర్ క్యాన్ పట్టుకున్న యేసు ప్రభువు బొమ్మతో దెబ్బతినేసాయ్. తెలియక చేసిన తప్పును యేసు ఖచ్చితంగా క్షమిస్తాడేమో గానీ, ఈ విధ్వంసాన్ని క్షమిస్తాడా? అయినా క్రైస్తవ ప్రచార వ్యాసం పైన ఇలాంటి బొమ్మ ఎవడైనా ఉద్దేశపూర్వకంగా వేస్తారా? వేసినా యేసు ముళ్ళకిరీటం పెట్టి కొరడాలతో కొట్టినా చలించలేదే, సిగరెట్టూ బీర్ క్యానూ చేతిలో పెడితే కోపగిస్తాడా? మరి క్రైస్తవుల మనోభావాలు అంత అర్జంటుగా ఎందుకు దెబ్బతిన్నాయో?



నేను హిందువుని, నేను ముస్లింని, నేను దళితుడ్ని, నేను క్రైస్తవుణ్ణి జరిగినవాటికన్నా, ఈ మనోభావాలు దెబ్బతినే నాటకాల్నిచూసి, నా మనోభావాలు దెబ్బతిన్నాయ్...నేనేం చెయ్యాలి?




----------------

25 comments:

Rajendra Devarapalli said...

మనోభావాలు దెబ్బ తినటం అనేది పత్రికలు సౄష్టించిన ఒక పడికట్టు పదం,మరి కొందరు నాయకులకు ఊతపదం.మనోభావాలు దెబ్బతినటం అంటే ఏమిటో ఎవరన్నా సహేతుకంగా వివరిస్తే అందుకు పరిష్కారాలు కూడా అప్పుడే దొరుకుతాయి.

మేధ said...

నాకూ ఎప్పుడూ అర్ధం కాదు, ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయి అంటారు.. అసలు ఎక్కడ దెబ్బతిన్నాయి, ఎందుకు దెబ్బ తిన్నాయి, ఎలా దెబ్బతిన్నాయి అని కూడా వ్రాయచ్చు కదా..

Kranthi M said...

avunu oka manishi manishini tamalo okadiga gurthincha galiginappudu manobavaala prashana endukosthundi.dalitudevadu,christ evaru.andaram kalise kada untunnam.

Kolluri Soma Sankar said...

మహేష్,
బాగా రాసారు.
"మనోభావాలు దెబ్బతిన్నయి" అనేది స్వార్ధపరుల చేతిలో ప్రమాదకరమైన ఆయుధంగా తయారవుతోంది. Well Said
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com

S said...

ఈ టపా...నా మెదడుకు మేత!

సుజాత వేల్పూరి said...

మనోభావాలంటే ఏమిటో స్పష్టత లేకుండానే ఈ పదాన్ని విస్తారంగా వాడేస్తున్నారు చాలామంది. ఎందుకు, ఎలా దెబ్బ తిన్నాయో చెప్పండంటే జవాబు అడ్డదిడ్డంగా ఉంటుంది. నిజానికి రాజేంద్ర గారు చెప్పినట్టు, ఇది పత్రికలు సృష్టించిన మాటే!

హైదరాబాదులో కొందరు మత పిచ్చి గల అతివాదులు దీన్ని అడ్డంగా పెట్టుకుని సరిగా చౌరస్తాలో హిందూ దేవతల గుళ్ళు కట్టేస్తారు రాత్రికి రాత్రే! వాటికి తొలగించడానికి ఎన్ని దమ్ములున్న పోలీసైనా పనికి రాడు. వాటిమీద చెయ్యేస్తే హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయి కాబట్టి.

అమీర్ పేట్ చౌరస్తా సమీపంలోని కనకదుర్గ గుడి, చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరుండే మరో దేవత గుడి, ఖైరతాబాదు చౌరస్తాలో ఉండే ఏడుగురు దేవతల గుళ్ళూ, నిజాం కాలేజీ ముందున్న భూదేవి(లేక మరో దేవో) గుడి, ఇవన్నీ ట్రాఫిక్ కి ఎంత అంతరాయాం కలిగిస్తాయో కామన్ సెన్స్ ఉన్న ప్రతి మనిషికీ తెలుసు. వాటిని తీయడానికి మాత్రం హిందూ మనోభావాల బెడద.

హాలీవుడ్ సినిమాల్లో చాల చోట్ల శిలువ తగలబడినట్టు, క్రీస్తు పోస్టర్లు చించినట్టు చూస్తాం . వాళ్లెవ్వరికీ లేని మనో భావాలు మనకే!డావిన్సీ కోడ్ సినిమా విషయంలో కూడా ఎంతో గోల జరిగింది.

హుస్సేన్ కాకుండా ఎవరన్నా హిందువు ఆ బొమ్మలు వేస్తే ఏమై ఉండేదో?

బాల్ థాకరే, (ఆయనంటే ఆయనొక్కడే కాదు)ప్రవీణ్ తొగాడియా,మంద కృష్ణ వంటి నాయకులున్నంత వరకూ ఇంతేనండీ! ఈ మధ్యనే గోరింటాకు సినిమాలో రిక్షా దిగని హీరోయిన్ తో హీరో 'ఏం కుంటి దానివా, దిగలేవా?' అన్నాడని వికలాంగులని కించపరిచారని మంద కృష్ణ వికలాంగుడు కానప్పటికీ వారి తరపు నుంచి ఆందోళన చేపట్టి, ఆ డైలాగులు తొలగించేవరకు శ్రమించారు పాపం! ఇహ చెప్పండి ఈ దేశాన్ని, ఈ ప్రజలను ఎవరు బాగుచేయగలరో?

Naga said...

దెబ్బ తిన్నవి అందరి మనోభావాలు కావు - కొందరి మదోభావాలు.

Purnima said...

ఈ టపా...నా మెదడుకు మేత! -- Same feeling!!

avunu ramsethu vaaradhi goDavalO koodaa evarivO manObhaavaalu debba tinnai!! appati nundee nenoo aalochistunna.

arvindrishi said...

ఐడెంటిటి క్రైసిస్ అయ్యుండచ్చునేమో..!
తమ ఐడెంటిటి గురించి బోలెడు డౌట్స్ ఉన్నప్పుడే పక్కవాడు ఏమన్నా చాలా అతిగా రియాక్ట్ అవుతారు. ఒక బొమ్మ వల్లనో, ఒక మాట వల్లనో, ఒక సినిమా వల్లనో తమ ఐడెంటిటీ కి ఏమీ కాదు అనే కాన్ ఫిడెన్స్ లేనప్పుడే ఏదో ఒక గలటా చేసి మేమూ ఉన్నాం అని అందరికీ జ్ఞాపకం చేయాల్సిన అవసరం వస్తుందనుకుంటా .

Kathi Mahesh Kumar said...

@రాజేంద్ర; ఈ పడికట్టు,ఊతపదాలతో అసలు విషయాల్నిముసుగుపెట్టి మభ్యపెడుతూ తమ పబ్బంగడుపుకుంటున్న ఈ నాయకులు అర్థాల్ని వివరించి పరిష్కారాల్ని వెదుకుతారంటారా? హేమిటో!మన ఆశ.

@మేధ; అవన్నీ రాసేస్తే ప్రజలకు అర్థమైపోయి తాట వలిచెయ్యరూ! ఇలా abstract గా మాట్లాడితేనే వారికి మనుగడ.

@క్రాంతి; చాలా లోతైన existential ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా ప్రమాదమండోయ్! ప్రెజుడిస్ పై నేను జూన్ లో రాసిన టపా మీరు అర్జంటుగా చదివెయ్యాలి.

@సోమశేఖర్; నెనర్లు. నిజమే ఈ ఆయుధాన్ని చాలామంది తమ స్వార్థానికి విజయవంతంగా ఉపయోగించేసుకుంటున్నారు.

@సౌమ్య;మీ మెదడుకి మెత పెట్టిన తరువాత, మీనుండీ టపా ఒకటి ఆశిస్తామండోయ్!

@సుజాత; టపాకు మరిన్ని ఉదాహరణలు జోడించి విలువని పెంచారు. నెనర్లు. ఈ దేశప్రజలైన మనల్ని ఎవరూ కాపాడలేరు. మనల్ని మనం తప్ప...!

@నాగరాజా; మదోభావాలు పదప్రయోగం బాగుంది. నెనర్లు

@పూర్ణిమ; నీ మెదడుకీ మేతే! అయితే దీనిపై టపా ఎప్పుడూ? అవునుకదూ రామసేతు కూడా ఒక మనోభావాల సమస్యే.

@అర్వింద్ రిషి; నిజమే కావచ్చు. మతాలు, కులాలూ, సంస్కృతీసాంప్రదాయాలూ అన్నిటికీ ఈ ఐడెంటిటీ క్రైసిస్ పట్టుకున్నట్లే ఉంది.

శిశిర said...

మహేష్ గారూ, మీరు ఈ చర్చ పెట్టినందుకు ఎంతమంది మనోభావాలు దెబ్బతిని వుంటాయో. తమను తాము కొన్ని కోట్లమంది మనోభావాలకి ప్రతినిధులుగా భావించుకునే వీరులెవ్వరూ ఇంకా మీ మనోభావాలను చదివివుండరు. లేకపోతే ఈపాటికి మీ పని అయిపోయేదే. జాగ్రత్త. బయట తిరగకండి. ఎక్కడైనా కనిపిస్తే మీరు క్షమాపణలు చెప్పాలని మిమ్మల్ని ఘొరావ్ చేసినా చెయ్యచ్చు.

Jagadeesh Reddy said...

ఇవే కాదండి.. క్రితం సంవత్సరం డెన్మార్క్‌లో ఒక పత్రికలో మహమ్మద్ ప్రవక్త కార్టూన్ ప్రచురించారని ప్రపంచం మొత్తం ముస్లింలు ఆందోళన చేసారు. ఈ వ్యవహారమంతా ఒకరి విశ్వాసాలని ఒకరు గౌరవించుకోకపోవడం వల్లే వస్తుంది. నా దృష్టిలో సరిగా అనిపించింది మరొకరికి సరికాక పోవచ్చు. అంత మాత్రం చేత అవతలి వారి విశ్వాసాలని, నమ్మకాలని చులకన చేయడం, అపహాస్యం చేయడం తగని పని. ఐడెంటిటి క్రైసిస్ అనేది ఎప్పుడూ ఉంది. కాకపోతే ఈ మద్య మీడీ చురుకుగా (?) పనిచేయడం వల్ల ప్రజలకి చాలా విషయాలు చాలా తొందరగా తెలిసిపోతున్నాయి.

Anil Dasari said...

మహేష్,

ఇందులో సెన్సేషనలిజం అనబడే ఇంకో కోణమూ ఉంది. ఏదో ఒక తింగర పని చేసి నాలుగు రోజులు వార్తల్లో ఉండాలనే ధోరణి ఈ మధ్య చాలామందిలో ప్రబలింది. హిందూ దేవతల నగ్న చిత్రాలు గీయక ముందు ఎం.ఎఫ్.హుస్సేన్ ఎంతమందికి తెలుసు (అన్నట్లు, అది పోయినేడాది జరిగింది కాదు. చాలా ఏళ్ల క్రితం సంఘటన)? అప్పటిదాకా high circles లో మాత్రమే తెలిసిన ముసలాయన రాత్రికి రాత్రి దేశమంతా పాపులర్ ఐపోలేదా? సాల్మన్ రష్దీ ఐనా, తస్లీమా నస్రీన్ ఐనా, పోసాని కృష్ణమురళి ఐనా, శశిలాల్ నాయర్ ఐనా .... చాలామందికి వంటబట్టిన సూత్రమిది. ఏదో ఓ వంకతో గొడవలు మొదలెట్టటానికి కొన్ని గుంపులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఆ గుంపుల్ని పనిగట్టుకుని రెచ్చగొట్టే వ్యక్తులు ఇంకొంతమంది ఉంటారు. మనబోటి మామూలు జనాలు వీళ్లందరి నాటకాలు చూస్తూ తరించిపోతుంటారు.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర; మీరు చెప్పిన attention seeking ఒక కారణం కావచ్చు. కానీ మీరు ఎంచినకొందరు మాత్రం ఆ గౌరవానికి అర్హులుకారేమో! హుస్సేన్ ఈ కాట్రవర్సీలకు ముందే చాలామందికి తెలుసు.నేను చెప్పింది అతన్ని దేశంనుండీ వెళ్ళగొట్టిన ఘటన.కాంట్రవర్సీ ఎప్పటినుండో అతని వెంట ఉన్నదే. సాల్మన్ రష్దీనీ, పోసానినీ ఒకేగాటకట్టారు!
మూల సమస్య ఆ రెచ్చిపోయే గుంపులు ప్రజాస్వామ్యాన్ని ఇరకాటంలో పెట్టడం.అదీ కొన్ని trivial విషయాల్ని తీసుకుని.

@జగదీష్; ఒకరు చులకనచేస్తే మన నమ్మకాలు సడలిపోతే ఎలా? మీడియా ఐనా,మనుషులైనా ఏంచేసినా assimilating శక్తి ఉన్నదే కలకాలం నిలుస్తుంది. నమ్మకమైనా, మతమైనా,కులమైనా,సాంప్రదాయమైనా.

@లాస్య; నేను రెడీ...

Sankar said...

కృష్న మాదిగ గారు ఏ ప్రయొజనాలని ఆశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇస్టమొచ్చినట్టు నోరుపారేసుకొనేవాళ్ళు ఓ సారి ఆలోచించుకొనే అవసరం వచ్చింది. గోరింటాకు సినిమా విషయంలో నేను మంద కృష్ణని సమర్ధిస్తా( ఆంధ్రజ్యోతి విషయంలో వ్యతిరేకిస్తా).. ఈ విషయంలో నాకు జంధ్యాలగారి మీద కూడా కొంచం కినుక ఉండేది ( ఆయన సినిమాల్లో కొన్ని అవలక్షణాల్ని హాస్యం పేరుతో అవహేళన చేయడం అందరికీ తెలిసిందే). అడిగేవాళ్ళు లేకపోతే రేపు ఇంకేం చేయడానికైనా తెగిస్తారు. ఎంత కాదన్న ఆ సినిమాలో ఆ సన్నివేశం చూసేప్పుడు అందరికీ కాకపోయినా కొందరు వికలాంగులకైనా చిన్నతనంగా అనిపించడం ఖాయం(అందరు పెద్ద మనసున్నోల్లే ఉందరు కదా)..
ఎవరో ఒకరు మా మనోభావాలు దెబ్బతిన్నాయనేవరకూ ఆ వర్గానికి చెందినవాళ్ళెవరికీ ఈ నొప్పి తెలియదు. ఎందుకంటే ఇది మనల్ని కించపరచడం అని ఎవరొ విడమరచి చెప్బితేనేగానీ తెస్లుకోలేనంతగా వాడుకలోకి వచ్చేసాయి కొన్ని. మీరు ఉదహరించినవాటిలో కొన్నిటి విషయంలో ఈ నిరశన తప్పనిసరని నా అభిప్రాయం. ఐతే ఈ మధ్య ప్రతీ విషయంలోనూ మనోభావాల్ని దెబ్బ తినిపించేయడం వల్ల మీకీ ప్రశ్న స్ఫురించి ఉండొచ్చు... ఒక్కసారి మీ ఉదాహరణల్ని పున:సమీక్షించుకోండి అందులో కొన్ని ఈ వ్యాస పరిధిలోకి రావని నా అభిప్రాయం ( నా అభిప్రాయం మాత్రమే)
----------------------------------------------------------------
ఇక అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్ పార్టీలు ఎప్పటినుండో అది భారత దేశ సార్వభౌమత్వానికి చెడు చేస్తాయని మొత్తుకుంటూన్నా పట్టించుకోలేదుకానీ BSP మాయావతిగారు ముస్లిం మనోభావాలకి దెబ్బతీసేలా ఉన్నాయనగానే అన్ని పార్టీలలో ఒక రకమైన కుదుపు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌కి విశ్వాస పరీక్ష నెగ్గాల్సిన పరిస్దితి, అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఈ అణు ఒప్పందం ఏమిటో తెలుసుకోవాలని సామాన్యులకు(అందులో నేనూ ఒకన్ని) కూడా అనిపిస్తొంది. ఇంత జరుగుతున్నా ఆ ఒప్పందంలో ఏముందనేదీ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరన్న విషయం తెలిసినవాళ్ళు కూడా లేరు. ఎవరన్నా ఈ ఒప్పందం గురించి విపులంగా ఒక వ్యాసం రాస్తే చదివి తెలుసుకుంటాం. ఏదో ప్రాచుర్యం పొందిన బ్లాగ్ కదాని ఇక్కడ సమాచారం కోసం వెతుక్కుంటున్నా, క్షమించాలి మహేష్‌గారూ మీరు.

Kathi Mahesh Kumar said...

@శంకర్; మీ నిరసన సహేతుకం. ఇక్కడ వ్యక్తపరుస్తున్నవి అభిప్రాయాలేకాబట్టి తప్పులు జరగడం లేక కొంత మోతాదు మించడం సహజం.

ఇక నా ఉదాహరణల్లో ఈ వ్యాసం పరిధిలోరానివి చెబితే పున:సమీక్ష గురించి ఆలోచించవచ్చు.

అణుఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా పబ్లిక్ డొమెయున్లో లేదనుకుంటాను. ఉన్నా it comes under officials secrets act. ఆ రహస్య పత్రాల వివరాలు తెలిస్తే అటు పాకిస్తాన్ కో ఇటు చైనాకో చేరవేసే అవకాశం ఉందిగనక చాలా కొద్దిమందికే పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి.ఈ వివాదాలన్నిటికీ మూలకారణం పూర్తివివరాలు ఎవరికీ తెలియకపోవడమే అని నా ఉద్దేశం.

అయితే International Atomic Energy Agency (IAEA)సంబంధించిన వివరాలు ఈ క్రింది లంకెలో ఉన్నాయి చూడగలరు. మీకు పూర్తిగా అవగతమైతే ఒక టపా రాయండి.
www.indiademocracy.org/news/view/id/3088

Sankar said...

మీరు మరోసారి క్షమించాలి . నేను మీ వ్యాసాన్ని కామెంట్లనీ, వాటికి మీ స్పందననీ ఒకేసారి చదవడం వల్ల సుజాత గారు వ్రాసిన గోరింటాకు విషయాన్ని మీదిగా భ్రమించాను ( ఒకవేళ ఆ ఉదాహరణల్ని మీరు సమర్ధించడం వల్లేమో). ఇది కేవలం నా తొందరపాటు వల్ల మాత్రమే... ఇక మీ వ్యాసంలో సాక్షి విషయంలో నాకెందుకో అది సరైన నిరసనగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యాసం ఒరిజినల్‌గా జీసస్‌కి అనుకూలమైన వ్యాసమనీ, ప్రచురణలోనే ఎక్కడో లోపం వల్ల ( ఆ ఫొటొ ఇంటెర్నెట్ నుండి download చేసి చూసుకోకుండా పబ్లిష్ చేసారనీ చదివాను) ఈ తప్పిదం జరిగిందనీ చెప్పుకొచ్చారు. ఇది వ్యూహాత్మక తప్పిదం కాకున్నా ఆ నిరసన ద్వారా మరోసారి ఇలాంటివి ప్రచురించేప్పుడు ఒకటికి రెండుసార్లు ఎడిటర్‌లు చెక్ చేసుకుంటారు. ఇక మీ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, సినిమాల్లో ఈ రోజుల్లో ఇలాంటివి మామూలైపోయి మనం అదే కామెడీ అనే స్ధాయికి వచ్చేసాం కాబట్టీ నాట్యాచారులు విముఖత తెలపడం సబబంటే నన్ను ఏమంటారో.... ఇలా చెప్పుకుంటూ పోతే నేనేదొ నా వాదనని సమర్ధించుకున్నట్టు ఉంటుంది కానీ ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నిరసనకారుల్లో కొంతమందికి ఏదో ఒక విధంగా ఇబ్బంది కలగడం వల్లనే ఇదంతా అని. అందుకే ఎవరన్న మా మనొభావలకి దెబ్బతగిలినంటే ఒకసారి వాళ్ళవైపునుండి ఆలోచించి respond ఐతే మంచిదని నే చెప్పేది. ఎవరేమంటే మనకేంటిలే అని పట్టించుకోకుండా ఉంటే ఇంక వాల్ల ఆగడాలకు హద్దేముంటుంది... మెత్తగా ఉన్నోన్ని చూస్తే మొట్టబుద్దేస్తుందంట. దేశంలో ఇన్ని సమస్యలుండగా వీటికెందుకో ఇంత ప్రాధాన్యత అనొచ్చు. అవి మనకి సంబందించిన సమస్యలు కాకపోవచ్చు కానీ, సమస్యలే కదా... మీరడిగిన లిస్టులో ఆంధ్ర జ్యోతీ, బరోడా విద్యార్ది తప్పించి మిగతావన్నీ చేర్చొచ్చనుకొంటా... ఎమో మళ్ళీ ఎవరన్న వచ్చి ఆ రెండు ఎందుకొదిలేసావ్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అలా అని మొత్తం చేర్చమంటే మీ వ్యాసం ఉండదు .. చివరికి మీరు ఏ కన్‌ఫ్యూజన్ స్ఫూర్తిగా ఈ వ్యాసం వ్రాసారో అందులోనే నన్ను పడేసారు ... సామాన్యులు కారు తమరు.

మరోసారి కామెంటు రాసేప్పుడు ఈ తప్పిదం జరగదని వై.యస్.జగన్ తరహాలో హమీ ఇస్తున్నా...

spandana said...

మంచి విషయమ్మీద చర్చ మొదలెట్టారు.
"అతి సర్వత్ర వర్జయేత్" అన్నది సర్వకాలాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ సత్యమైనది. అయినదానికీ కానిదానికి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వీధుల్లోకి వచ్చి గొడవచేయడమూ తప్పే.
అలాగని స్వేఛ్ఛ వుందిగదాని నోటికొచ్చినట్లు ప్రేలడమూ, చేతికొచ్చినట్లు గీకడమూ తప్పే. మన ఎదుటివాడి భార్య లేచిపోయిందన్నది సత్యమే అయినా "నీ భార్య లేచిపోయిందా?" అని అడగడం కదా? సభ్య సమాజంలో సభ్యత అని దేన్నంటామో దాని హద్దులు దాటకుండా ప్రవర్తిస్తే చాలు.
ఏది మన మనసులనీ మనోభావాలనీ గాయ పరుస్తుందో అది మనం ఎదుటివాడికి చేయకపోతే చాలు. అయితే ప్రస్తుతం నా మనసు గాయపడిందీ అంటూ ఎదుటివాడి మనసుకూ గాయం చేస్తున్నారు. ముల్లును ముల్లుతో తీయొచ్చేమొ గానీ తప్పును తప్పుతో సరిదిద్దలేం.

--ప్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

నాకసలు మనోభావాలు, పొట్టభావాలు, వీపు భావాలు, ఇంకా మోకాటి భావాలు కూడా చాలా దెబ్బతిన్నాయని తెలుపుకుంటున్నాను అధ్యక్షా!

రవి వైజాసత్య said...

offenditis అనీ అమెరికాలో ఎప్పన్నించో బాగా ప్రబలంగా ఉన్న జబ్బే ఇది..ఇప్పుడిప్పుడు భారతీయుల్లో కూడా పొడసూపుతున్నట్టుంది..

వేణూశ్రీకాంత్ said...

ఈ మనోభావాల బేచ్ లో వాళ్ళు చెప్తున్న విషయం పట్ల చిత్త శుద్ది కన్నా గుర్తింపు కోసం పాకులాడటమే ఎక్కువ కనిపిస్తుందండీ. కాక పోతే చాలా వరకు అర్ధం లేనివైనా... కొన్నిటి వల్ల కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడకుండా ముందు కాస్తైనా ఆలోచించుకునేలా influence చేస్తుంది అని అనుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

@శంకర్; ఫరవాలేదు తప్పు మానవ సహజం. నా మూల సందేశాన్ని కొంత మిస్ చేసినట్లున్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తికి నచ్చని విషయాలని చెప్పే హక్కుంది. కానీ ఒక మనిషి లేక ఒక వర్గంలోని ఒక వ్యక్తి తన సొంత అభిప్రాయాన్ని మొత్తం జాతికి అన్వయించి అందరి మనోభావాలూ గాయపడాయని over simplify చేసి, దానికి అనవసర ప్రాధాన్యత కల్పించడం ఎంత సమంజసం అనిమాత్రమే! ఈ తంతు మరీ మితిమీరుపోతోంది కాబట్టే,దీనికొన తార్కికమైన హద్దుకావాలని నా భావన.

‘నాు నచ్చలేదు’, ‘నేను నొచ్చుకున్నాను’, ‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అన్నది నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. అంతెందుకు ‘మా అందరి మనోభావాలూ గాయపడాయి’ అని లక్షమంది ఎదురు నిలబడితే అదులో అస్సలు తప్పులేదు. కానీ దీన్ని ప్రస్తుతం ఒక ఆయుధంలా వాడుతున్న తీరుచూస్తే నిజమైన సమస్యలుకూడా మరుగునపడిపోతాయేమో అనిపిస్తుంది.

@ప్రసాద్; మీరన్న ముల్లుతో ముల్లే ప్రస్తుత సమస్య అని నా ఉద్దేశం. నెనర్లు.

@కొత్తపాళి; ఇన్నిచొట్ల భావాలుంటాయని నాకూ ఇప్పుడే తెలిసిందధ్యక్షా!

@రవి వైజాసత్య; అమెరికా అయినా ఇండియా అయినా ఇదొక ప్రజాస్వామ్య తంతు. కానీ ఇప్పుడిప్పుడే ఇదికాస్త "అతి" గా తయారయ్యింది.

@వేణూ శ్రీకాంత్; అవ్వాకావాలీ బువ్వాకావాలీ అంటే ఎలా! కొంత తార్కికత ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా అవసరం.

GKK said...

సుజాత గారు : మీ వాక్య చదివి నా మనో బావాలు దెబ్బ తిన్నాయి అన్నట్టు. జర్నోలకి హిందు గుళ్ళే కంటికి అడ్డం అగుపిస్తాయి. ఒక్కపారి టేంక్ బండు ఏ కట్టడంతోని సింహేంద్రమధ్య అయ్యిందో యాది తెచ్చుకోవాలె. ఇర్గి పోయిన మౌలాలి కమాన్ వెడల్పు చేయనీకి ఎవ్వలు అడ్దుపడుతున్నారో యాది మర్సిపోతే ఎట్లా అక్కగారు. బతికున్నోల్లకి జాగాలేక అవస్థ పడుతుంటే స్మశానాలు తొవ్వలోన ఎవ్వలు పెడ్తున్నారో జర చూడండి.

గీతాచార్య said...

ఎవరి మనోభావాలు ఎందుకు దెబ్బ తింటున్నాయో కానీ, మన వాళ్ళకి ఏదో ఒక గొడవ చెయ్యకుండా నిద్ర పట్టదేమో. రామసేతు మీద నేనో టపా వ్రాయాలని మీ బ్లాగు చూసింతర్వాత అవిడియా వచ్చింది. పాపం ఏసుక్రీస్తు మీద ఎన్నెన్నో జోకులు వచ్చాయి. అలాగే చెప్పుల మీద మన దేవుళ్ళ బొమ్మలు వేయటం... చేసేవాళ్ళు సాధారణంగా రెచ్చాకొట్టేందుకు చేస్తారు. (సాక్షి విషయం ఇందుకు భిన్నం. జగన్ వివరణ బాగుంది).

అసలు మనోభావాలు అంటే ఏమిటో వారికి తెలుస్తుందా. మనో భావాలు దెబ్బ తిన్నాయి అనే వారు అలా దాడి చేసి ఎదుటి వాళ్ల మనో భావాలు దెబ్బ తినేలా చేస్తే మరి జస్టిఫికేషన్ ఏమి ఉంది?

"నేను హిందువుని, నేను ముస్లింని, నేను దళితుడ్ని, నేను క్రైస్తవుణ్ణి జరిగినవాటికన్నా, ఈ మనోభావాలు దెబ్బతినే నాటకాల్నిచూసి, నా మనోభావాలు దెబ్బతిన్నాయ్...నేనేం చెయ్యాలి?"

మీ ప్రశ్నకి సమాధానం లేదు.

మీకు ఒక రిక్వెస్ట్: నెనెర్లు అంటే ఏమిటి?

టైమ్లీ బ్లాగు వ్రాసినందుకు జేజేలు.

Kathi Mahesh Kumar said...

@గీతాచార్య; ముందుగా, నెనరులు లేక నెనర్లు అనేది ‘ధన్యవాదానికి’ అచ్చతెలుగు రూపమని ఈ బ్లాగులోకంలోకి వచ్చాకనే తెలిసింది.అందుకే మీ ప్రోత్సాహానికి నా ‘నెనర్లు’.