Sunday, July 20, 2008

ఆంగ్లమే అధికార భాషగా ఉండాలి!


అంగ్లమంత సౌలభ్యం ఇంకేభాషలో అయినా ఉందా!? !

ఏమీ చెప్పకుండా, కనీసం వందపేజీలు రాయొచ్చు.
‘అవును’, ‘కాదు’ అనే పదాలు ఉపయోగించకుండా, నిర్ణయాన్ని వాయిదా వెయ్యొచ్చు.
ఒకే పదానికి కనీసం మూడు,నాలుగు అర్థాలు చెప్పొచ్చు.
ఆదర్శాన్ని మాటల్లో మాత్రంమే చెప్పి, అసలు నిజాన్ని మరుగుపర్చొచ్చు.

ఇంతకంటే అర్హత అధికారభాషకి ఇంకేంకావాలి?



మన తెలుగు భాషలో ఇన్ని సౌలభ్యాలున్నాయా అసలు!?!

మన తెలుగు ప్రజల్లో ఉన్న లౌక్యం మన తెలుగు భాషలో ఉందా ?
ఖచ్చితమైన అభిప్రాయాలూ,ఆలోచనలూ,నిర్ణయాలూ చెప్పకుండా కనీసం ఒక పేరా అయినా తెలుగులో రాయగలమా?
ఇది తప్పు,ఇది రైటు అనే అభిప్రాయాలేతప్ప maybe, probably,most probably,most likely,possibly లాంటి అసృష్టమైన సమాధానాలు మనదగ్గర అసలున్నాయా?
తెలుగులో ఏదైనా విషయం చెప్పేస్తే, ఇరుక్కుపోకుండా తప్పించుకోగలిగే 'possible deniability' అవకాశం ఉంటుందా?
ప్రతిపదార్థాలూ, తాత్పర్యాలేతప్ప, మన భాషలోని పదాలకి నానార్థాలు తక్కువే...ఇలాంటి భాష అధికారభాషగా పనికొస్తుందంటారా?
కరుకు కార్యాల యంత్రాంగం పనిలో, కమ్మనితియ్యని తెలుగెవరికి కావాలి?
"దీని భావమిదే తిరుమలేశా!" అని ఫాలో అయిపోతామేగానీ, "మరోటెందుకు కాదు వెంకటేశా?"అని ప్రశ్నించడమే నేర్చుకోని భాష, అధికారభాషా గోదాలో మట్టిగర్తుస్తుందేగానీ బతికి బట్టకట్టేనా?



అందుకే అధికారభాషగా ఆంగ్లమే ఉండాలి.

ప్రభుత్వాలూ,లాయర్లూ, అదికారులూ దర్జాగా బతకాలి.
ప్రజలకు ప్రభుత, యంత్రాంగం, చట్టాలూ అర్థంకాకుండానే ఉండాలి.
మనం ఇలాగే కళ్ళకి గంతలు కట్టుకుని, విజయవంతంగా బతకాలి.
అందుకే...అధికారభాషగా ఆంగ్లమే ఉండాలి.


********

18 comments:

Purnima said...

నిజమే... తెలుగులో రాస్తే మనల్ని మనం కాస్త ఎక్కువుగా "రివీల్" చేసుకున్నట్టే ఎమో!! నేనూ దీని గురించే ఆలోచిస్తున్నాను. మీరెటూ టపా పెట్టారు కావున.. ఇక కమ్మెంట్లకై వేచి చూస్తాను..

సుధాకర బాబు said...

ఈ టపా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ కోణంలో నేను ఇదివరకెపుడూ చూడలేదు. తెలుగులో చెబితే తిన్నగా అర్ధమవుతుంది. unlikely coincidence, come to an understanding on the need to develop consensus on this vital but not sufficiently investigated issue of significant impact వంటి సుత్తి పదజాలం తెలుగులో ఇంకా అభివృద్ధి చెందలేదు. అందుకే తెలుగు అధికార భాషగా వాడడానికి "ఉన్నతోద్యోగులు" సంసిద్ధగా లేకపోవచ్చును.

అయితే ఈ సమస్యను మనం అధిగమిస్తున్నామనుకొంటాను. ఈ మధ్యకాలంలో టి.వి. వార్తల ఛానళ్ళలో (యాక్. థూ.) ఒక ముక్కలో చెప్పగలిగిన విషయాన్ని ఒక గంటసేపు చెప్పగలుగుతున్నారు. అందుకే అవి 24 గంటల న్యూస్ ఛానళ్ళగా మనగలుగుతున్నాయి. అంటే 24 వాక్యాలను 24 గంటల్లో చెబుతారన్న మాట.

సూర్యుడు said...

I fully endorse your view on English as the official language, the rest, I am not very sure of ;)

Rajendra Devarapalli said...

మీ ఆవేదన అర్ధమౌతుంది కానీ,ఆవేశం దాన్ని అధిగమించి పరిపక్వతకు దూరం చేసింది.నా భావనలో తెలుగువారందరికీ తెలుగు చదవటం,రాయటం,వచ్చేవరకూ ఆంగ్లమే అధికారభాషగా ఉండాలి.ఇవ్వాళ వాడుకలో ఉన్న ప్రభుత్వతెలుగు పదాలు,పారిభాషిక పదకోశాలు,వాటిని రూపొందించిన పండితులవారికన్నా అర్ధమౌతాయేమో ఒక్కసారి అడిగి చూడండి.మొగలుపాలన,బ్రిటీషువారి ఏలుబడీ ఇవ్వాళ ఉన్న ఇంగ్లీషు భాషా సామ్రాజ్యాలలో దుబాసీలుగా,అనువాదకులుగా,కార్యనిర్వహణాధికారులుగా చలామణీ అవుతూ చెలరేగిపోతున్న పండితుల ప్రభావపర్యవసానాలను మనం అనుభవిస్తున్నాం,అంతే!!

ఊకదంపుడు said...

మహేష్ గారు, సెంటు పర్సంటూ ఏకీభవిస్తాను, ఐనా ఇప్పుడు అధికారభాషగా "ఇంగ్లీషు" ను ఎవరు తీసేస్తానన్నారని మీరు ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? నా బండి మీద నమోదు సంఖ్య ( Registration Number) తెలుగులో రాయమని అడిగితే ఫైనేస్తారుసార్ అని ఇంగ్లీషు లో రాశాడు..
తెలుగు ని అధికార భాషగా కనీసం కాగితం మీద నైనా నిలబెట్టటానికి అధికార భాషా సంఘం పడుతున్న అవస్థలు ఎవరికి ఎరుక?

Kranthi M said...

తెలుగుని కావాలన్నా ఎవరూ అధికార అధికారభాషగా చెయ్యరులె౦డి.మీ కోరిక తీర్చే వారు,మీ వెనక నడిచే వారు చాలా మ౦దే ఉ౦టారు.మన బ్లాగులోక౦ మొత్త౦ కలిసి కాళ్ళా వేళ్ళా పడ్డా maybe we can try for it అని సరి పెట్టేస్తారు.ఆవును ఇ౦తకీ నాకో స౦దేహ౦ మీరు ఇంగ్లీషుని తిట్టారా?పొగిడారా?...........????????

Kathi Mahesh Kumar said...

@పూర్ణిమ; అదే ఇక్కడ రహస్యం. ఆంగ్లంలో రాగలిగిన ambiguity,vagueness తెలుగులో రాలేవు. అందుకే పాలకులు ఆంగ్లాన్ని prefer చేస్తారు. అదీ ముఖ్యంగా చట్టాలు, పరిపాలన విషయంలో.ఎంత open ended గా ఉంటే పాలకులకు అంతలాభం.

@సుధాకర్ బాబు; కొత్త కోణంలో చూడటమే నా ధ్యేయమండోయ్! తెలుగు అధికారభాషగా ఒప్పుకోవడానికి ఉన్నతోద్యోగులకు (IAS,IPS,IFS)ముందుగా తెలుగు రావాలిగా? నాకు డౌటే.
ఇక మీరు చెప్పిన పత్రికలు,TV వార్తల తెలుగుకీ, పరిపాలనా తెలుగుకీ చాలా తేడా ఉంది. మనోళ్ళు బ్రిటిష్ నుంచీ పరిపాలనా పద్దతులు నేర్చుకోవడం వలన,భాషకూడా ప్రజలకి అర్థం కానిదే వాడుతారు. అదే వారికి సౌలభ్యతతో పాటూ,కావలసినంత power ఇస్తుంది.

@సూర్యుడు; నేను ఆంగ్లమే అధికారభాషగా కొనసాగాలని శీర్షికే పెట్టాను...మీరు పూర్తి వ్యాసం చదవండి.

@రాజేంద్ర: నాది ఆవేశమూ కాదు, అపరిపక్వతా కాదు. కేవలం ఎత్తిపొడుపంతే!
ఇక మన తెలుగుకు ఆంగ్లమంత administrative sophistication రాకపోవడానికి రెండు ముఖ్యకారణాలున్నాయి.
1.తెలుగును ప్రామాణికం చేసినవారు చాలా వరకూ "మాకే అన్నీ తెలుసు" అనుకునే బ్రాహ్మణులు (ఇది కులం కాదు భావజాలం) చెయ్యటం వలన value judgmental భాషను సృష్టించారేగానీ diplomatic భాషని కాదు.

2.ఆంగ్లేయులు వలస ఆధారిత వ్యాపారాలు చేసేవారు కాబట్టి, వారి అవసరానికి అనుగుణంగా భాషలో ‘అవసరమైన సొగసు’ వచ్చేసింది.

అంటే మన భాషకి ఆ సొగసు వచ్చే ఆవకాశం ఇప్పట్లో లేదు.

ఇక తెలుగువారందరికీ తెలుగు వచ్చేవరకూ ఆగాలని చెప్పారు..మరి తెలుగువాళ్ళకి ఇంగ్లీషుమాత్రం ఇప్పుడొస్తుందంటారా? మరి అధికారభాషగా ఆంగ్లం దర్జా వెలగబెట్టట్లేదూ!

@ఊకదంపుడు;నా టపా ఉద్దేశం ఇంగ్లీషు ఎందుకు వాడుతున్నారో చెప్పడం మాత్రమే. ఆకర్షణీయంగా ఉంటుందని శీర్షిక మాత్రం అలా పెట్టా. అంతకు మించి నాకు ఆవేదన ఎక్కడా లేదు. అధికారభాషా సంఘం ఒక కంటి తుడుపు. వారికీ అంకెలు అర్థంకాని తెలుగులో రాయాలనే తిక్క ఐడియాలు వస్తాయేతప్ప, ఉపయోగపడేవి చేసిన దాఖలాలైతే లేవు.

@ క్రాంతి; నేను ఇంగ్లీషుని తిట్టలేదు..పొగడాలేదు కొన్ని నిజాల్ని చెప్పానంతే. ఇక మీరు మీ ఇష్టమొచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

Sujata M said...

భలే అండీ మీరు. మీలాంటి వాళ్ళు రాయాలే గానీ తెలుగులో కూడా 'అర్ధం' కాకుండా రాయొచ్చు. కావాల్సింది భాష మీద పట్టు గానీ భాష ఏదైనా భావం ఒక్కటే ! ఉదా : మీరు నేను 'పొగిడానూ !' అంటే గానీ కొన్ని పోస్టులు ఒక పొగడ్త లానా అనిపించవు, 'తెగిడేనూ !' అని స్పష్టపరచక పోతే, కడిగి పారేసినట్టూ ఉండవు. మనకి కన్వీనియంట్ గా అర్ధం చేసుకొనే సౌలభ్యం తెలుగు లో కూడా ఉంది మరి. ఇక ఇంగ్లీషు అధికార భాష అన్న విషయం గురించి - దేశ, కాల మాన పరిస్థితుల ప్రకారం, ఇప్పుడు ఇంగ్లీషే మనకు కాస్త పనికొచ్చే భాష. ఇంగ్లీషు వల్ల మన నిరుద్యోగం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంగ్లీషు మనకి కొత్త రెక్కల్నిచ్చింది. పైగా ఇంగ్లీషు ని అభిమానించడం మన 'కొలోనియల్ ' మనస్తత్వానికి సరిపోయింది. తెలుగు అధికార భాష అంటే, తప్పేమున్నది. మీరు గ్రాస్ రూట్ లెవెల్ కు వెళ్ళి ఆలోచించండి - పల్లెల్లో ప్రజల్తో ప్రభుత్వం ఇంగ్లీష్ లోనే సంభాషిస్తుందా - లేదు కదా ! ఎక్కడి కక్కడ ఎప్పటి కప్పుడు అధికార భాష మారిపోవాలి ! దేని సౌలభ్యం ప్రకారం.

Rajendra Devarapalli said...

ఇక్కడ ఇబ్బంది అదే మహేష్,ఎత్తిపొదుపులా అనిపించటం లేదు.సుజాత గారన్నట్లు మీ భావావేశాలను--ఎత్తిపొడుపు,ఆవేశం ఇలాంటి లేబుళ్ళు పెట్టాలి మరి :)

krishna said...

సుజాత గారు చెప్పినట్టు భాష ఏదైనా భావం తెలియజెప్పడమలోనె వుంది.చెప్పడం రావాలి కాఅనీ ,ఉదాహరణకు మీ పై వ్యాసం.పాఠ కు లకె వదిలేసారుగా మీరు పొగడుతున్నారో తిడుతున్నారో తెలుగులో వ్రాసి .

Kathi Mahesh Kumar said...

@సుజాత; నెనర్లు.ఇంగ్లీషు ప్రాముఖ్యతని అస్సలెవరూ శంకించలేరు. అది ఈ సమయంలో గాలీ,నీరు,భోజనం తరువాత అత్యంత అవసరం.నాలాగా తెలుసు రాసేవళ్ళ అవసరం ప్రస్తుతానికి మనోళ్ళకి లేదు లెండి.ఇంగ్లీషుతో సరిపెట్టేస్తారు.

తెలుగువాడటానికీ,యంత్రాంగం భాష ఆంగ్లమవ్వడానికీ చాలా భేధం ఉంది. ఉదాహరణకు ప్రభుత్వం GO లు తీసుకొండి. మొదటగా ఇంగ్లీషులోనే వస్తాయి. తరువాత తెలుగులో అనువదించి ఉపయోగించబడ్డా,వాటికి కోర్టుల్లో విలువలేదు.based text అయిన ఆంగ్ల GOకే విలువ.ఇదొక conscious conspiracy for administrative convenience.

@రాజేంద్ర; మొత్తానికి లేబులిస్తేగానీ నేనేంచెప్తున్నానో తెలియడం లేదంటారు! హ్మ్...ఇంకోసారి మరింత సూటిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

@కృష్ణుడు;భాషలో ఏదైనా చెప్పడానికి ప్రయత్నించొచ్చు. కానీ ఇంగ్లీషులో ఉన్న distancing character మనభారతీయ భాషల్లో చాలా తక్కువ అని మాత్రమే నా ఉద్దేశం.

కామేశ్వరరావు said...

మహేశ్ గారు ఒక కొత్తకోణంలో (బహుశా వ్యంగ్యంగానేమో, లేకపోతే నిజంగానేనో) చెప్పడం బాగానే ఉన్నట్టుంది కానీ ఇందులో ఆలోచించాల్సిన విషయం కూడా ఉన్నట్టు అనిపిస్తోందనడంలో ఎలాటి సందేహం ఉండక్కరలేదనుకొంటాను. నా అభిప్రాయమైతే ఇదీ అని ఖరాఖండీగా చెప్పలేకపోవచ్చు కానీ అందులో నిజానిజాలు పరిశీలించాల్సిన అవసరం మాత్రం ఉందనుకొంటాను. పూర్ణిమగారన్నట్టు నన్ను నేను బయటపెట్టేసుకోవడం ఇష్టం లేక నిజానికీ "కామెంటు" ఇంగ్లీషులోనే రాద్దామనుకొన్నాను కానీ సుధాకరబాబుగారన్న మాటల్లో దాగిన అంతరార్థం గ్రహించాననే అనుకొని, తెలుగ్లో మాత్రం ప్రయత్నించలేమా అన్న అనుమానం వచ్చి, సరే అదేదో కాస్త పరీక్షిద్దామని ఇలా తెలుగులోనే రాస్తున్నాను. ఇంతకీ అసలు విషయానికి వస్తే, రాజేంద్రగారన్నట్టు, తెలుగువాళ్ళకి తెలుగు వచ్చేవరకూ అధికారభాషగా ఇంగ్లీషు కొనసాగడం ఉచితమనే అభిప్రాయానికి నా పూర్తి అనంగీకారాన్ని చెప్పలేకుండా ఉన్నాననే చెప్పాలి. ఒకవేళ తెలుగువాళ్ళకి తెలుగు నేర్పడం కష్టమైన పక్షంలో, అధికార అనధికార భాషగా కూడా ఇంగ్లీషునే కొనసాగించడానికి కొంతమంది అభ్యంతరం చెప్పవచ్చు కానీ, బహుశా ఆ వర్గం అల్పసంఖ్యాకమే అయిన కారణంగా దానిని పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉండకపోవచ్చుననే అనిపిస్తోంది.
ఇక ఊకదంపుడుగారు అధికారభాషాసంఘాన్ని ప్రస్తావించి మంచిపనే చేసారో లేదో నాకు తెలీదు కాని, వారన్న నమోదు సంఖ్య విషయమై నేనెందుకో మరి ఒప్పుకోకుండా ఉండలేకపోతున్నాను.
ఇక మిగతావారి కామెంట్ల గురించి నా అభిప్రాయాలు ప్రకటించే ముందు వాటిని మరింత లోతుగా నేను పరిశీలించాల్సి ఉందని నా అనుమానం. ముఖ్యంగా మహేశ్ గారు రాసిన కామెంట్లో చర్చించిన కారణాలు రెండూ చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడవలసిన సంగతులు కాబట్టి ప్రస్తుతం దానిగురించి నేను నోరుమెదపడం కష్టమే అవుతోంది. అలా అని నేను వాటిని సమర్థిస్తున్నానని కానీ, ఖండిస్తున్నానని కానీ మీరనుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. దయచేసి మీరు కూడా దానిగురించి మరింత ఆలోచించి అతనన్నదానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో, మరీ సూటిగా కాకపోయినా మధ్యేమార్గమైనా సరే, తెలియచేస్తే బాగుంటుందేమో అని నేననుకొంటున్నాను.
ఇంత రాసీ నేను చెప్పదలచుకొన్నది నాకు పూర్తిగా అర్థమయ్యిందని నేను చెప్పలేను కానీ, మీకు కొంత చూచాయగానైనా బహుశా అర్థమయ్యుంటుందని నా ఊహ.
:-) దీని అవసరం ఉందంటారా?

durgeswara said...

nijamgaa bhaashamIda daani bhavusyattu mIda mIkunna aavEdana prasamsa nIyamu.

చిన్నమయ్య said...

టపా, దాని మీది వాదోపవాదాలు ఎలా వున్నా, మీ తపాలా బిళ్ల సేకరణ అద్భుతం. ఇది మొదటి ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు విడుదల చేసేరనుకుంటాను. అప్పట్లో, మూసిన కవరుకి పావలా బిళ్ల అంటించవలసివుండేది. వాడని బిళ్ల ఇంకా మీ దగ్గరుండడం అపురూపం.

Bolloju Baba said...

భైరవభట్లగారు మొత్తం వాదనని పూర్వపక్షం చేసేసినట్లున్నారు.
బొల్లోజు బాబా

asankhya said...

ఇది చదివిన తరువాత కొంచం గర్వంగానూ, కొంచం భారంగానూ ఉంది. గర్వం ఎందుకంటె, 'తాత్సారం చెయ్యడం', 'విషయలేమిని వ్యక్తపరచడం' అనేవి తెలుగు సహజ లక్షణాలు కావు అన్నందుకు. భారంగా ఎందుకు ఉంది అంటే, దాన్ని లోపంగా చూసినందుకు (అంటే ఆ లోపాన్ని, ఒకవేళ ఉన్నట్టయితె, వ్యక్తపరిచే మనది అని కాకుండ, వెసులుబాటులేని భాషది అన్నందుకు)...

మీరు "ఇంగ్లీషు" లొ అలోచించి దానికి తెలుగు అనువాదం కాకుండా, తెలుగులొ అలోచించండి. పదాలు దొరక్కపోవు! కాకపోతె అది తెలుగు లౌక్యం అవుతుందె కాని "ఇంగ్లీషు" లౌక్యం కాజాలదు

మీ ఎత్తిపొడుపులోని అర్ధం అర్ధమయినట్టుగాఉంది. కాని, పొడిపించుకోబడాల్సిన మనం తప్పించుకున్నట్టుగా తోచింది. బహుశా, ఇది తెలుగులొలేని "possible deniability" వల్లనేమో కదా!

oremuna said...

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/20main62

saisahithi said...

మీ టపాలోని మీ ఆవేదనని రెండు భాగాలుగావిభజిస్తే...ఒకటి.. తెలుగు భాషలో లౌక్యం లేదని...ఇది భాష పట్ల అత్యంత
అభిమానంతో మీరన్నదన్న భావనలో నేపొందిన ఆనందం కంటే, బహుసా..మీరీవిషయమ్లో మరి కొంచెం ఆలోచించి వ్యాఖ్యానించి ఉండి ఉంటే నేను మరింత ఆనందించేవాడినని తెలియ చేయడానికి చాలా చింతిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆంగ్లమ్లో చెపితే ఇంత అందం రాదనేది నిర్వివాదాశం అనుకుంటున్నాను. కనీసం తర్జుమా చేయడం ఎంత కష్ట మో ఆలోచించండి. ఇదీ తెలుగు భాష కున్న సొబగు... కాదనగలమా..తెలుగు పద్యానికున్న మీటర్ ప్రపంచమ్లో ఏ భాషకీ లేదు.అంతేకాదు గద్యాన్ని తీసుకుంటే మన భాషలో ఉన్న చమత్కారాలు, చలోక్తులు ,నానుడులు , సామెతలు, వ్యుత్పత్తి అర్థాలు మరే ఇతర ప్రపంచ భాషల్లోనూ లేవని భాషావేత్తలు ఘంటాపదంగా చెప్పారు. ఇంకానా..కవిత అనే ప్రక్రియకి సరితూగగలిగే ప్రక్రియ ఆంగ్లం లో ఇది అని దేనిని చెప్పగలం. అతి ఎక్కువ సాహితీ ప్రక్రియ లు కలిగిన ఏకైక భాష అని కూడా అంటారు. మహేష్ గారు మీ ఆవేదన ని నేను ఎంత వరకూ అర్థం చేసుకున్నానో తెలియదుకాని తెలుగు భాష గురించి చాలాత క్కువే చెప్పాననిపిస్తూంది.
మరో విషయ మండోయ్ ..ఇక్కడ అంతర్లీనంగా సాగిన కొంత possible deniability ప్రస్తావన గమనించండి.
ఇక రెండవది..
Telugu can not be used as official working knowledge. You are right.. ఇది మనం ఇంగ్లీషు పట్ల ఎంత పరాధీనతకు లోనయ్యామో తెలియ చేస్తుంది. ని జానికి చాలావరకు మన పొరుగు రాష్ట్రాల్లో ఈ పరాధీనతకు తిలోదకాలకు ఎపుడో శ్రీకారం చుట్టారు. ఇలా మనమెందుకు చేయలేం.మీరన్నట్లు ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం. ప్రయత్నిస్తే.. పురిటి నొప్పు లు సహజమే కదూ..
No doubt this is a slow but sure process. నిదానంగానైనా ఖచ్చితమయిన ఫలితాల్నిస్తుంది.
చివరగా..." మాతృభాష కళ్ళు వంటిది . పరభాష కళ్ళజోడు వంటిది."
మంచి అంశం...మీనుండి మరిన్ని అంశాలు ఆశిస్తూ..