Thursday, July 17, 2008

నా జ్ఞాపకాల పొరల్లో, బాల్యప్రేమల గుభాళింపులు

మా ఐదేళ్ళ అవినాష్ కళ్ళు, ‘కత్రీనా కైఫ్’ మోము కనపడగానే వెలిగిపోతాయి. అదేమి బాల్యచాపల్యమో తెలీదు.నిజంగా, "అంత చిన్నపిల్లాడి మనసులో తెలీయని ప్రేమభావాలుంటాయా?" అంటే అంత సులభంగా సమాధానం చెప్పలేం. సరదాగా అడిగితే, "అఛ్ఛీలగ్తీహై!" అని హిందీలో సిగ్గుపడతాడు. ఈ రోజు మావాడు , "సింగ్ ఈజ్ కింగ్" అనే కత్రీనా పాట టీవీలో కళ్ళప్పగించి చూస్తుంటే, తఠాలున నా జ్ఞాపకాల పొరల్లోంచీ, బాల్యప్రేమల గుభాళింపులు గుప్పుమన్నాయి.



నిజమే! ఊహతెలీని రోజుల్లోకూడా నా మదిలో వగలరాణులుండేవారు. పక్కింటి అమ్మయో, ఎదురింటి అందమైన ఆంటీయో కారు సుమండీ. నాబాల్యప్రేమల ఊహల్లో తెరనేలే తారామణులే, నా ప్రేమను వెలిగించిన తారాదీపాలయ్యేవారు. చెప్పడానికీ, అదీ బాహాటంగా చెప్పడానికి ఇబ్బందిగా అనిపించినా ఇది మాత్రం నిజం. నా ఈజ్ఞాపకాల తోరణాలు సద్యోజనితం.



అప్పుడు నావయసు నాకేతెలీదు, కానీ ఏదో పేరుతెలీని బ్లాకన్డ్ వైట్ సినిమాలో, చేతిలో బ్యాంట్మింటన్ బ్యాటూ,తెల్ల టీషర్టూ,పొట్టి నిక్కరూ వేసుకున్న లలనామణి ‘కాంచన’నుచూసి మనసుపారేసుకున్నాను. ఆ సినిమాలో కృష్ణ హీరో అనుకుంటా ! కాంచనపక్కన తను నిలబడి ప్రేమించినప్పుడల్లా, నా హృదయం వేయిముక్కలైన వైనాన్ని ఎట్లాచెప్పేది? ఆ తీవ్రత, అర్థంకాని అలజడీ అనుభవిస్తేనే తెలుస్తుంది. తనే నా మొదటి గ్లామర్ క్వీన్...



ఒక శుభదినాన, కేవలం పాతసినిమాలు పొద్దునపూట మాత్రమే ధియేటర్లో వేస్తున్న తరుణాన, "ఓ హలా..నాగినీ" అంటూ నా హృదయక్షేత్రంలో నగారామోహించిన ముగ్ధమోము సుందరి, ముద్దుమాటల తొలకరి బి.సరోజాదేవి. అప్పటికి నాకు కన్నడ భాషతెలీదుగానీ, తన తెలుగులో ఉన్న కన్నడయాసని మనస్పూర్తిగా ఆరాధించి, అభిమానించేసాను. ‘జగదేకవీరుని కథ’లో రామారావు అంతమంది అమ్మాయిల్ని భార్యలుగా కోరి తండ్రిచేత దేశబహిష్కృతుడు కాబడతాడుగానీ, నేనైతే ఒక్క సరోజాదేవితో సరిపెట్టేవాడినే అనుకున్నాను. ఇప్పటికీ అనుకుంటానుకూడా!



నలుపుతెలుపులు దాటి వెండితెర పంచరంగులుపులుముకున్నా, ఆ ఈస్ట్మన్ రంగుల జమానాలో నా కంటికింపైన నారీమణెవ్వరూ లేరనే చెప్పుకోవాలి. వాణిశ్రీ, శారదలు రాజ్యాలేలినా, నాహృదయ సామ్రాజ్యం పొలిమేరల్లోకికూడా వీరు ప్రవేశార్హతనోచుకోలేదు. జమునా,జయలలిత, చంద్రకళ తమ జాణతనాన్ని పండించినా, నా జామురాతిరి కలల కొనలనికూడా తాకలేకపోయారు.



చిన్నపాప పెద్దదై, ‘పదహారేళ్ళ’కే కొన్నివేల శతఘ్నుల్ని పేల్చిన శ్రీదేవిని ఆ సినిమాలో చాటుగా చెయ్యడ్డంపెట్టుకుని వేళ్ళసందుల్లోంచీ చూసిన క్షణం ఇంకా నాకు బాగా గుర్తు. ఒక్కటికెట్టుపై రెండాటల రోజున చూసిన సినిమా ఇది. దీనితోపాటూ మరో సినిమా చూపుతారన్నా, చూసింది పదాటలతో సమానం అనిపించిన ఆ అనుభవం, చెప్పినా అర్థమయ్యేనా? వేళ్ళ సందుల్లోంచీ, "ఎవరేమనుకుంటారో" అని చాటుగా చూసిన అందాలు కళ్ళనిదాటి, ఎప్పుడో గుండెల్లో నిండాయంటే, ఎట్లా వివరించేది?



"మౌనమేలనోయి...ఈ మరపురాని రేయి" అంటూ పవిత్రమైన సినిమాల దర్శకుడే ప్రేమలోపడితీసిన పాటలో, షవర్ కింద జయప్రదని చూసి చలించని హృదయం ఉంటుందా? నా వయసప్పుడు...ఎందుకులెండి, విని మీరిబ్బందిపడతారు. నాకు సౌందర్య దృష్టిని ప్రసాదించిన దేవతలకు నమస్సులర్పించడం, జయప్రదనారాధించడం తప్ప అప్పుడు నేను చెయ్యగలిగింది ఏమీ లేదనిపించింది. స్త్రీత్వపు మధురస్పర్శని మనసుకి చూపిన మందగమనకు నా మన:సుమాంజలి.



ఫోటోలో ఉన్న అగ్నిని తను ప్రేమిస్తున్నా, విజయశాంతి వన్నెల్ని వలచిన నాకనులు ‘అగ్నిపర్వతా’లైన తీరు నాకుతప్ప అన్యులెవ్వరికీ తెలీదు. "ఈ గాలిలో...ఎక్కడొ అలికిడి...అక్కడే అలజడి" అన్నపాటలోని పదాలకు అర్థం పూర్తిగా తెలియకున్నా, భావం మాత్రం మళ్ళీ ఇంకోసారి సినిమా చూడమని చెప్పిన. మూడోరోజు మళ్ళీ ధియేటర్ కెళ్ళిన నేను, ఆ పాటకోసం అంకెలు లెక్కపెట్టుకుని ఎదురుచూసిన ఆత్రాన్ని, ప్రేమనికాక మరేమనుకోవాలి? నిజమే, ప్రేమించాను ఫోటోలో ఉన్న కృష్ణని చంపాలన్నంత ఈర్షపుట్టేంతగా ఆ క్షణాన ప్రేమించాను.



‘అహనా పెళ్ళంట’, ‘మజ్ను’ ఇంకాఎన్నో సినిమాల్లో తెరమీద తను ప్రత్యక్షమైతే, నా మనసు ఆకాశంలో నక్షత్రమై మెరిసిన ఘడియలెన్నో. "కళ్యాణ వైభోగమే...ఈ సీతారాముల కల్యాణమే..." అని తను సిగ్గుపడుతుంటే, "నాకోసమేనేమో!" అని భ్రమించిన తరుణాన, నన్నునేను అభినందించుకున్న పిచ్చినెలా మర్చిపోవాలి? రజని తన పేరు, పక్కింటి అమ్మాయిలాంటి సింప్లిసిటీ తనతీరు. చాలా మందిని ప్రేమించినా, పెళ్ళికోసం మాత్రం ఎవరైనా రజనిని కోరాల్సినవారే! వారిలో నేనూ ఒకడిని. చెప్పాపెట్టకుండా తను చిత్రసీమని వదిలిన నాడు, సినిమా సినిమాలో తనకోసం వెదకి వేసారిన నా మనసెంత బాధపడిందో చెబితే మాత్రం తెలుస్తుందా? ఇప్పటికీ నా కనులు తనకోసం వెదుకుతాయి. తన సమాచారం కోసం చెవులు తరుస్తాయి.



ఆ తరువాత నాకు వయసొచ్చింది. క్లాసులోని కవితా, పక్కింటి పంకజాలు కూడా అందంగా అనిపించారు, తెరతారామణుల్ని మరిపించారు. "కానీ ఏంలాభం?", ఆ ఆనందాలు, అనుభవాలూ, ఆలోచనలూ,ఆరాధనలూ, అద్వితీయ ఆకర్షణలూ లేవు. కేవలం నిజాలూ, నీరసాలూ, నీకూ-నాకూ అనే లావాదేవీలే తప్ప మురిపాలూ,లాలిత్యాలూ ఎక్కడ?



మరిప్పుడు!?! శ్రియ పెదవుల్లో సిరామిక్ చదును తప్ప మనసుగిల్లే మహత్యాలెక్కడ. ఇలియానా వొంపుల్లో ఇత్తడిబిందె నిలుస్తుందేమోగానీ, నా మనసుమాత్రం పక్కకే జారిపొతుంది. అసిన్ చూపుల్లో ఆకర్షణున్నా, అందిపుచ్చుకుందామని అణుమాత్రంగానైనా అనిపించదే! నయనతార నగుమోము నాకేంతక్కువన్నా, నీకన్నా నయాగరాజలపాతం అక్షరాలా నయమని సమాధానం చెప్పాలనిపిస్తుంది. త్రిష చింతాకు కళ్ళు చూసి చిర్రెత్తుకొస్తుందిగానీ, చెంపాచెంపారాసి చెలిమిచెయ్యబుద్దవుతుందా?



ఆ చిన్ననాటి ప్రేమల్లో చాలా బలముందనుకుంటాను. అందుకే మావాడి సెలెక్షన్ను మెచ్చుకుంటారు. బహుశా ఇవే వాడికి మిగిలే నిజమైన ప్రేమ జ్ఞాపకాలవుతాయేమో! నా జీవితంలో నేను తెలుసుకున్న నిజాలు వాడికి ప్రేమని నేర్పే పాఠాలవుతాయేమో! చూడాలి...చూసి ఆనందించాలి.


------------------------------

42 comments:

krishna said...

chudagalige kallundaali kaani andaanni arrdhinchadaaniki vayasuku pani ledanukuntaanu.

paata cinemaa heroinese andangaa vuntaarani chakkagaa ,mettgaa chepparu.

baagundi.

Kottapali said...

penultimate paragraph super.

ఇన్ని ప్రేమావస్థలూ అనుభవించి కూడా బాల్య ప్రేమ బలాన్ని నమ్మలేకపోతున్నారా?
అవినాషుది మంచి టేస్టు! :)

బీ సరోజ జిందాబాద్ .. జగదేక వీరుని కథ జిందాబాద్ .. జలకాలాటలలో జిందాబాద్!!!

అన్నట్టు P.G. Wodehouse ది ఒక Jeeves కథ ఉంటుంది. అందులో ఇద్దరు కజిన్సు (సుమారు 12 ఏళ్ళ కుర్రాళ్ళు)కి తమ తమ అభిమాన హాలీవుడ్ తారలమీద ఉండే చెదరని ప్రేమ కీలక పాత్ర వహిస్తుంది.

తెలుగు'వాడి'ని said...

చాలా అందంగా చక్కగా ప్రతి ఒక్కరూ వారిని చూసుకునేలా (నాయికల పేర్లు మారతాయేమో .. అంతే) చెప్పారు. జ్ఞాపకాలు, స్మృతులు అందమైనవి, మధురమైనవి అయితే సరిపోదు వాటిని అందంగా, మధురంగా అందించకపోయినా ఫర్వాలేదు కానీ సమగ్రంగా/సవివరంగా అందించగలగాలి .. అప్పుడే ఇవన్నీ అజరామరం అనిపించేది ... అధ్భుతంగా, అదృష్టంగా మీలో, ఈ టపాలో అవన్నీ కలబోసి ఉన్నాయి ... అభినందనలు.

'సీతారామయ్య గారి మనమరాలు' లో 'మీనా' ను వదిలేశారు ఏమిటి? కొంచెం అశ్చర్యంగా ఉందే !

కొత్తపాళీ గారు అన్నట్టు ఆ పేరా చాలా బాగుంది. కాకపోతే రేపటి తరం వారు రాయబోయే టపాలో ఇవే పేర్లు ఈ టపాలోని పై పేరాలలోకి, ఆ పేరాలోకి మరో కొత్తరకం పేర్లు వచ్చి చేరతాయి. అదే చరిత్ర.

సూచన : ప్రతి కొత్త నాయిక పరిచయంలో అదే పేరా పక్కన ఆ నాయిక చిత్రాన్ని పెట్ట వలసింది (ఒకటి కుడి వైపుకి మరొకటి ఎడమ వైపుకి) ... అప్పుడు ఈ టపాకు ఇంకా భౌతికమైన అందం వచ్చేది .. మా కనులకు కొంత సేపైనా ఆ అందాలు ఇసుమంతైనా ఆనందాన్ని అందించేవేమో ... కొత్త వెలుగులు కనిపించేవేమో :-)

Sankar said...

మీ లిస్ట్ చాలా చిన్నగా ఉంది. నాకు నచ్చని హీరొయిన్స్ ని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అసలు ఇలాంటి టాపిక్‌తో పోస్ట్ రాయాలని మీకు ఐడియా భలేవచ్చింది. ఆ క్రెడిట్ అంతా మీ ముఖుందుడికే ఇచ్చేయండి. రజనీ గురించి ఈ మధ్యనే ఒక న్యూస్ చదివాను ఈనాడులో. మిమ్మల్ని చేసుకోలేకపోయానన్న బాధ కొంచంకూడా వ్యక్తం చేయ్యలేదు ;). ఈ మధ్య బ్రహ్మానందం డ్రామా కంపెనీ సినిమాలో ఇలియానాని కామెంట్ చేసారని ఆమెగారి ఫ్యాన్స్ నిరసన తెలిపారంట మీరు జాగ్రత్త...

వేణూశ్రీకాంత్ said...

ఈ తరం కధానాయికలని పొగడకనే పొగిడినట్లు నాకనిపిస్తుంది :-) అయినా అందం చూసే వారి కళ్ళలో కొండకచో మనసులో వుంటుంది అన్నట్లు, అప్పటి మీ అమాయకత్వం ఆరాధించేలా చేస్తే ఇప్పటి మీ వివేకం అందని ద్రాక్ష పుల్లన అనిపిస్తుందేమో :-)

సుజాత వేల్పూరి said...

వామ్మో! మీ ఆవిడకు తెలుగు రాకపోబట్టి గానీ, వచ్చుంటేనా....?(సరదాకి)

'ఇత్తడిబిందె ' 'చింతాకు కళ్ళు ' సూపర్.

spandana said...

ఆ వయసు అలాంటిది. ఆ వయసూ మళ్ళీ రాదు ఆ మధురోహలూ మళ్ళీ రావు.

ఇప్పుడు వయసులో వున్న కుర్రకారు నడిగితే తెలుస్తుంది, త్రిష చింతాకు కళ్ళ గురించీ, ఇలియానా నడుమొంపుల గురించీ...

--ప్రసాద్
http://blog.charasala.com

Kranthi M said...

ఓహో ఇదన్న మాట స౦గతి నాకు కూడా ఆ హీరోయిన్స్ ని చూసినప్పుడు ఎలాగో ఉ౦డేది.బాల్య ప్రేమాఆఆఆఆఆఆఆ?అర్దమై౦ది.కానీ నాదొక్కటే బాధ ఆ పాత హీరోయిన్స్ టై౦లో లేనే అని.ఇప్పుడు నేను చూసేవన్ని కొనుక్కొచ్చిన అ౦దాలే కదా.అప్పుడప్పుడు film nagar లో చూసినప్పుడు అనిపిస్తు౦ది.
తారల్ని వె౦డి తెర పైనే చూడాలి గానీ తెర(makeup)లేనప్పుడు కాదు అని.బాగు౦ది బాగా చెప్పారు.

చైతన్య.ఎస్ said...

బాగుంది మీ లిస్ట్. ఇలియాన,నయనతార గురించి మీ కామెంట్స్ అదుర్స్.

చైతన్య కృష్ణ పాటూరు said...

మీరెంచుకున్న టాపిక్ భలే వుంది. టపా చదివాక తెలిసింది, హీరోయిన్ల విషయంలో మీది నాది ఒకే టెస్ట్ అని. నాదీ దాదాపు సేమ్ లిస్ట్. బి.సరోజాదేవి-శ్రీదేవి-జయప్రద-రజని. బ్లాక్&వైట్ లో దేవిక కూడా ఇష్టం నాకు.

పెదరాయ్డు said...

adirindi. peddayyAka mI vADitO marO TapA rAyinchanDi..telugulO :)

జ్యోతి said...

మహేష్
నిజంగా మీ ఆవిడకు తెలుగు రాదు కాబట్టి బ్రతికిపోయావు. ఐనా ఇప్పటి హీరోయిన్లు నీకు నచ్చలేదంటే నీకు వయసైపోయిందని అర్ధం.. ఇప్పటి కుర్రాళ్లనడుగు. శ్రియ అంటే పడిచచ్చిపోతారు. అమ్మాయిలేమో ?? వద్దులే మీ మగాళ్ళకు ఆ లిస్ట్ ఎందుకు?

జాన్‌హైడ్ కనుమూరి said...

మహేష్

చిరుగాలికి వూగే కొమ్మల్లోంచి వినిపిస్తున్న కోయిల కూజితంతో వసంతాగమనాన్ని తెలియజేస్తున్నట్టు ప్రేమ పలుకులుపలికే వయస్సును, పేర్లు ఏవైనా మీటిన మధుర క్షణాలను గుదిగుచ్చి టపా కట్టినందుకు అభినందనలు.
మీ అనుభూతుల కన్నా వాటిని తెలియజెప్పిన తీరు మరింత అందంగా వుండటం విశేషం.
యాంత్రికంగా పనిచేసుకుంటూ పరుగెత్తుతున్న నాకూ కొన్ని ముఖాలు కళ్లముందు కదలాడాయి.

ఏకాంతపు దిలీప్ said...

మీరూ నాలాగానే అన్నమాట! :-)

నా లిస్ట్లో రజని కూడా ఉంది.. ఇంకా విజయశాంతి, భాను ప్రియ, మీనా... ఇంకెవరబ్బా... చాలా మందే ఉండి ఉంటారు... కానీ మా లోయాలిటీ ఎక్కువ రోజులున్న వాళ్ళు వాళ్ళే :-)

Kathi Mahesh Kumar said...

టపా నచ్చి మెచ్చుకొని, తమ అనుభవాల్ని తట్టిచూసుకున్న సహృదయులందరికీ ధన్యవాదాలు.

@కొత్తపాళి;ఒక జీవనదశలో అనుభవం ముగిసాక అవి మనసుపొరల్లో దాగుండిపోతాయి. వాటి తీవ్రత,జ్ఞానం ప్రస్తుతం చైతన్యస్థితిలో జ్ఞాపకం రావు. మా అవినాష్ తన బాల్యచాపల్యాన్ని ప్రామాణికంగాచూపి,నా జ్ఞాపకాల్ని చైతన్యవంతం చేసాడు.

ఇలాగే తమ ప్రేమకథలు మరచిన తల్లిదండ్రులు పిల్లల ప్రేమలకు అడ్డుతగులుతూనో లేక క్రమశిక్షణ పేరుతో వారు ఆ వయసులో అసహ్యించుకున్న వాటినే perpetuate చెయ్యడం మనకు తెలిసిందేకదా!

అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి జ్ఞాపకాల్ని జీవంతం చేసుకోవడం అవసరం.

@తెలుగు'వాడి'ని:నిజమే రేపటితరం ఇప్పటి నాయికల్ని ప్రేమిస్తారు. ఇది నిత్యజీవన స్రవంతి. ఫోటోలు వెతికాను.రజని ఫోటో దొరకలేదు.కొందరివి దొరికినా నా ఊహకు నప్పేవి దొరకక పెట్టలేదు.

@శంకర్; మీ లిస్టుతో ఒక టపా రాసెయ్యండిక! ఇలియానా అభిమానులతో మనకిక్కడ బెంగలేదులెండి.

@ వేణూ శ్రీకాంత్; నిజమే నంటావా?

@ సుజాతగారూ; నా అన్ని crush ల గురించీ మా ఆవిడకి తెలుసులెండి. ఒక్కోసారి నాకు తెలీకపోయినా, నా చూపుల్నిబట్టే పట్టేస్తుంది. నెనర్లు.

@ ప్రసాద్; నిజమేనండోయ్, ఏమాత్రం సందేహం లేదు.

@ క్రాంతి; అవును తెరమీదే చూడాలీ, కలల్లోనే ప్రేమించాలి అదే బాగుంటుంది.

Pradeep Palem said...

"ఇలియానా వొంపుల్లో ఇత్తడిబిందె నిలుస్తుందేమోగానీ, నా మనసుమాత్రం పక్కకే జారిపొతుంది."...చితకొట్టెశారండి..

ఏకాంతపు దిలీప్ said...

నన్ను క్షమించు మాధురీ దీక్షిత్... అసలు ఎప్పుడూ నిన్ను మరిచిపోతాననుకోలేదు... అందుకే గుర్తుకు రాగానే ఇక్కడ వ్యాఖ్య రాసి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను...

మీనాక్షి said...

మహేశ్ గారు..బాఉంది .చాలా బా రాసారు....
శ్రీదేవి గురించి రాసిన లైన్స్ చాలా బాఉన్నాయి...ఇక పోతె ఇలియాన,మీద రాసిన లైన్ తెగ నచ్చేసింది..పెద్ద లీస్టేనండి మీది..అమ్మో..!!!

నిషిగంధ said...

హన్నా! ముకుందుడా మజాకానా!! :) చుట్టూ మీ బాల్యప్రేమల గుబాళింపుతో నింపేసారు.. చాలా బావుంది.. మీ లిస్ట్ లో సౌందర్య లేదేంటబ్బా!?

నేను 4 వ తరగతిలోనో, 5 వ తరగతిలోనో ఉన్నప్పుడు ఒకనాటి మధ్యాహ్నం నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ హాల్లోకి రాగానే టివిలో వస్తున్న 'దేవర్ ' సినిమా వస్తుంది.. అంతే ఢామ్మని పడిపోయా.. గుమ్మం అడ్డం వచ్చి కాదు, ఆ సినిమాలో ఉన్న 'ధర్మేంద్ర ' ని చూసి! మళ్ళీ కలర్ ధర్మేంద్ర అంత నచ్చడు..

అలా ఆఖరిసారి పడింది ప్రభాస్ ని చూశాక :-)

Kathi Mahesh Kumar said...

@చైతన్య; నెనర్లు

@చైతన్య క్రిష్ణ;మొత్తానికి మనిద్దరి టేస్టులు కలిశాయన్నమాట. నాకూ దేవిక కళ్ళంటే ఇష్టం.

@పెదరాయ్డు; పెద్దయ్యాక మావాడు ఏకంగా ఇష్టమైన హీరోఇన్లతో సినిమానే తీస్తాడేమో!

@జ్యోతి గారూ;శ్రియ ‘సంతోషం’ తరువాతవచ్చిన ఏసినిమాలొనూ పెద్దగా గొప్పగా నాకైతే అనిపించలేదు.అయినా నేనూ కుర్రాడ్నేనండోయ్! దయచేసి అమ్మాయిల లిస్టుకూడా చెబితే మాకూ పనికొస్తుంది.

@దిలీప్; హిందీ ఇంకా ఇతర భాషల హీరోయిన్ల గురించి ఇంకోటపా రాసుకుందాం!

@చంద్ర; నెనర్లు

@మీనాక్షి;కేవలం తెలుగు హీరోయిన్ల లిస్టిది ఇంకా బాలీవుడ్డూ,కోలీవుడ్డూ,హాలీవుడ్డూ ఉన్నాయి.

@నిషిగంధ; మీనా,సౌందర్య నాటైపు కాదులెండి.హమ్మయ్య!మొత్తానికి ఒకమ్మాయి తన లిస్టు చెప్పింది.నెనర్లు.

కొత్త పాళీ said...

అమ్మాయిల లిస్టు .. నిషియే కాదు, రాధిక ఎప్పణ్ణించో చెప్తూనే ఉన్నారు .. ఒకసారి ఇలాగే కమెంట్లలో హైరార్కీ కూడా చెప్పారు :)
అసలు అబ్బాయిల లాయల్టీ కంటే అమ్మాయిల లాయల్టీయే మహా బలమైనదని నాకో పరమ అనుమానం :)
అన్నట్టు నిషిగంధ గారూ, మీ టేస్టు మెచ్చాను. నలుపు తెలుపుల ధర్మేంద్ర బావుంటాడు. పాపం గుడ్డీలో జయ కూడా అలాగే పడింది కదా! అందులో ధర్మంఏద్రది ఒక పాత సినిమా చూపిస్తారు .. అసలు సినిమా ఏంటో గుర్తు లేదు. ధర్మేంద్ర పియానో దగ్గర కూర్చుని హేమంత్ కుమార్ గొంతుతో "యా దిల్ కి సునో దునియా వాలో" అని పాదతాడు.

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ గారూ,ధర్మేంద్ర ఆ పాటపాడే సినిమా హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘అనుపమ’(1966). షర్మిలా ఠాగూర్ ఆ చిత్రంలో హీరోయిన్.చాలా మంచి చిత్రం..its a psychological family drama.

Anil Dasari said...

అందరూ మూకుమ్మడిగా కొత్తవాళ్ల జాబితాలోంచి స్నేహని ఒగ్గేశారేంటి?

సుజాత వేల్పూరి said...

జ్యోతి గారు,

హహహ!

దిలీప్,
మీరు మరీ సూపర్!

నిషి,
ఆ పొడుగు చూడు, లైట్ హౌస్ లాగా అనేసుకున్నారా మీరు కూడా ప్రభాస్ ని చూసి. ప్రభాస్ నోరు తెరవకుంటే ఓకె, తెరిచాడా ధూల్ పేట్ తెలంగాణా భాషని కూడా వెస్ట్ గోదావరి యాసలో చించెయ్యగలడు. అదీ నా భయం. అయినా మీరు ఏ హారిసన్ ఫోర్డ్ కో పడకుండా ప్రభాస్ ఏంటండీ? (నేను ఇండియానా జోన్స్ సిరీస్ చూసి ఫోర్డ్ గారి కి పడిపోయాను, అదీ పెళ్లయ్యాక.)

బ్లాక్ అండ్ వైట్ ధర్మేంద్ర అంటే ఎవరు పడరు చెప్పండి? ముఖ్యంగా నూనె రాసి దువ్వినా ఆ క్రాఫింగ్ కి..? ప్చ్!
జ్యోతి గారు,

హహహ!

దిలీప్,
మీరు మరీ సూపర్!

నిషి,
ఆ పొడుగు చూడు, లైట్ హౌస్ లాగా అనేసుకున్నారా మీరు కూడా ప్రభాస్ ని చూసి. ప్రభాస్ నోరు తెరవకుంటే ఓకె, తెరిచాడా ధూల్ పేట్ తెలంగాణా భాషని కూడా వెస్ట్ గోదావరి యాసలో చించెయ్యగలడు. అదీ నా భయం. అయినా మీరు ఏ హారిసన్ ఫోర్డ్ కో పడకుండా ప్రభాస్ ఏంటండీ? (నేను ఇండియానా జోన్స్ సిరీస్ చూసి ఫోర్డ్ గారి కి పడిపోయాను, అదీ పెళ్లయ్యాక.)

బ్లాక్ అండ్ వైట్ ధర్మేంద్ర అంటే ఎవరు పడరు చెప్పండి? ముఖ్యంగా నూనె రాసి దువ్విన ఆ క్రాఫింగ్ కి..? ప్చ్! ముఝె ఇస్ రాత్ కి తన్ హాయి మే ఆవాజ్ న దో ఆవాజ్ న దో అని ముఖేష్ గొంతు పాడే ధర్మేంద్ర కూడా బాగుంటాడు.(ఇంతకీ ధర్మేంద్రేనా పాడేది)

Purnima said...

నాలుగు గంటలు క్రితం చదివిన ఈ టపాలోనే నా అభిమాన హీరో లందరి గురించి రాయాలనుకుని.. పేర్లు గురించి ఆలోచిస్తే.. ఎవరెవరో వస్తున్నారు.. పోతున్నారు.. ఒక్కరూ స్థిరంగా నిలవటం లేదు. కొద్దో..గొప్పో.. "అభినందన" హీరో (కార్తీక్??) .. అలా కాసేపు ఆగాడు. తను నాకసలు హీరోలా అనిపించడు అందుకేనేమో!! సినిమాను "అంతలా" ఎంజాయ్ చేయలేదు నేనెప్పుడూ!! ;-)

బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో నాకు అసలు ఏ హీరోయిన్ అయినా "Wow" అనిపిస్తారు. "జయప్రద" అంటే.. నేనే మాటలు రాక నోరు వెళ్ళబెడతా.. she's beauty personified.

కాకపోతే.. మగవారి నటనా చాతుర్యం కన్నా.. ఆటకీ, పాటకీ నేను మంత్రముగ్ధురాలైన సందర్బాలు కోకొల్లలు. కిశోర్ కుమార్ గొంతులో ఏముందో కానీ.. he takes to the worlds I've never seen. ఇక ఆటలు విషయానికొస్తే.. రాతులు-తెల్లవార్లూ టీవీలకి అత్తుక్కుపోవాలంటే.. ఆ మాత్రం "మొటివేషన్" ఉండద్దూ చెప్పండి.. ;-)

తాజా సమాచారం: టపా చదివి ఐదు గంటలు కావస్తుంది. :-)

మోహన said...

@Mahesh

మీరు భలే చిత్రం గా చెప్తారండీ.. :)

History repeats.. అని.. రేపు తరం వాళ్ళు రాసేటప్పటికి ఇప్పటి తరంలో మెల్లగా నిన్నటి తరం కథానాయికలు లాంటి వాళ్ళు వస్తారేమో చెప్పలేం కదా..!

ఆల్రెడీ పాత కథానాయికల లిస్ట్ ఇక్కడ అంతా దుమ్ము దులిపేశారు కాబట్టి నేను కొత్త వాళ్ళా లిస్ట్ చెప్పుకొస్తున్నా..

నాకు కమలినీ నచ్చుతుంది మాస్టారూ.. స్వతహాగా బెంగాలీ కావటం వల్లేమో నోరు విప్పి తెలుగు మాట్లాడితే తట్టుకోలేం! స్నేహ సహజం గా నటిస్తుందని ఒకింత అనిపించినా, 'శ్రీ రామ దాసు' చుశాక అభిప్రాయం మార్చుకోక తప్పలేదు. అలాగే హిందీలో నాకు విద్యా భాలన్ నచ్చుతుంది.

ఎవరో అన్నారు సీతా రామయ్యగారి మనవరాలులో లొ మీనా అని. నిజమే మీనా అంటే నాకూ ఇష్టం.

ఇక హీరోలంటె, సినిమాకి తగ్గట్టు ఒక్కో రోల్ లో ఒక్కొక్కరు నచ్చుతారు. జస్ట్ ఆ సినిమా వరకే..
కానీ నిలిచిన వారిలో హ్రితిక్ లో sincerety ki, మన తెలుగు లో గోదావరి చూశాక సుమంత్ కి అయ్యానండి ఫాన్ ని.

ఎంత కాదనుకున్నా, పాత వాళ్ళా గురించి రాయకుండా న వ్యాఖ్య పూర్తి కాదనిపిస్తోంది.
సావిత్రి గారు, స్.వి. రంగారావుగారంటే నా కిష్టం. ఎంత సేపైన అల చూడగలిగే సహజత్వం వాళ్ళాది. ఆ తరువాత అలా నచ్చింది జయసుధ మాత్రమే... !

జ్యోతి said...

చెప్పడం మర్చిపోయా. మా అబ్బాయి ఇలియానా ఫాన్.ఎప్పుడూ డెక్స్ టాప్ మీద ఇలియానా బొమ్మ పెట్టడం నేను తీసేయడం. అలా కాదని వాడిమొబైల్ లో పెట్టుకున్నాడూ. ఇక ఐశ్వర్య వాడి గర్ల్ ఫ్రెండ్ అని ఫిక్స్ ఐపోయాడూ. అభిషేక్ వచ్చి తంతాడూ నీ ఫిగర్ చూసుకో అని నేను చెప్పినా వినడూ..

శ్రీ said...

భలే ఉందండీ మీ లిస్టు!ఇపుడు అందమయిన హీరోయిన్లని మీరు మర్చిపోయారు.నాకు ప్రియమణి బాగా అనిపిస్తుంది "పెళ్ళయిన కొత్తలో" సినిమా నుండి.తర్వాత యమదొంగలో చాలా అందంగా ఉంటుంది.కమలినీ ముఖర్జీ అందమయిన నడుము మిమ్మల్ని కవ్వించలేదా?నాకయితే కమలినీ చాలా నచ్చుతుంది!మళయాల సుందరి కళ్యాణి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది.ఈమె కుడా సంప్రదాయబద్ధంగా చక్కగా ఉంటుంది.

Anil Dasari said...

మహేశుడికంటే, వాళ్లావిడ తెలుగు చదవలేదు కాబట్టి భయంలేదు. మిగతావాళ్లు ఇంత ధైర్యంగా రాసేస్తున్నారేమబ్బా - నా హార్ట్‌త్రోబ్ ఫలానా హీరో/హీరోయిన్ అని!! అదే నేనైతే, రాణీముఖర్జీ అంటే పడిచస్తానని చెప్పనంటే చెప్పను.

Niranjan Pulipati said...

మస్తు రాసావు.. కానీ.. త్రిష చింతాకు కళ్ళు చూస్తే చిర్రెత్తుకొస్తుందా ? ఖండిస్తున్నాం.. ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫాన్ ఇక్కడ.. :)
ఇంకా సౌందర్య మిస్సింగు..

babu said...

This is fantastic.
I enjoyed reading.
probably we were thinking same
thanks

babu said...

This is fantastic.
I enjoyed reading.
probably we were thinking same
thanks

Unknown said...

ఒక్క దెబ్బతో అన్ని రకాల హీరోయిన్లనీ కవరు చేసేసారుగా...
మీ వాడు ఈ వయసులోనే ఇలా ఉంటే రేపు మీకంటే పెద్ద గ్రంథ సాంగుడవుతాడు.

Kottapali said...

శ్రీ, శ్రీ, శ్రీ .. మీరిట్లాంటి కాంట్రవర్షియల్ స్టేటెమంట్లు పబ్లిక్లో చేసేముందు కొంచెం .. సంయమనం పాటించాలని ప్రార్ధన .. ఎంతైనా మనం మనం ఒక ఊరోళ్ళం కదా? :)
మీకు ఎంత పరశురామక్షేత్రాంగనలమీద అభిమానం ఐనా .. ప్రైయమణి ఓకే .. ఆ మధ్య చందమామలో మెరిసిన సింధూ మీనన్ ఓకే .. మరీ కళ్యాణి యా? You break my heart!!!

రాధిక said...

revati
mahesh babu :)

radhika
http://snehama.blogspot.com

రాధిక said...

bhanumati garu,krishnakumari garu
NTR,SVR

Rajendra Devarapalli said...

ఏమిటో కొందరు మగవారి స్వార్ధం :) మరి కొందరు మహిళల అమాయకత్వం :)ఒక్క ఇలియనానో,త్రిషో బాగుందని చెప్పి కొన్ని వందలమందిని అవమాన పరుస్తున్నారు అధ్యక్షా!!నేను ఈసంకుచిత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నా. చూడబోతే ఒక పేద్ధ భారీ టపా రాయాల్సొస్తుందేమో అని భయంగా ఉంది.

Bolloju Baba said...

మహేష్ గారూ
ఇది చాలా అన్యాయం.
బాబాయ్ అబ్బాయ్ చిత్రంలోని అనితారెడ్డిని వదిలేసారు.
ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
నా మనో భావాలు దెబ్బతిన్నాయ్.
(దేముడా దేముడా ఈ కామెంటు మా ఆవిడ చూడకుండా చేయ్ దేముడా)

సరదాగా కాదు నిఝంగా
బొల్లోజు బాబా

Srividya said...

:) too good..

కల said...

ఇదేంటి అమ్మాయిలందరూ పవన్ కళ్యాణ్ ని వదిలేసారు. నాకైతే తన కళ్లు తెగ నచ్చేస్తాయి. లిస్టు చెప్పాలంటే అమ్మో చాలా పెద్దది. ఈ సంగతి మా నాన్నకి కాని తెలిసిందా తాట తీస్తాడు. ఎవ్వరూ చెప్పకండోయ్.

Krshychait said...

EE adbuthamaina tapa chadivina taravatha vachina anandam antha intha kaadu...Entamandi bhamalu mana balyam lo manapaina cheragani mudra vesaro....Oka Rajani, Sridevi, Jayaprada, meena, tabu, farah ila list chebuthu pothe, chantadu kooda chinnadavuthundi...mee vaadiki naa dhanyavadalu. Vaadiki ilanti oohalu ravali, meeku vadi chiru momu ilanti tapalu rase prerana kaliginchali....

Bala said...

Nice one........

Chalam never dies in our blood.