పంద్రాగస్టు వేడుకల మధ్యన ఒక న్యూస్ ఛానల్లో కాశ్మీర్ లోజరుగుతున్న అమర్నాథ్ భూవివాదం గురించి చూపిస్తుంటే, ఆ విజువల్స్ నేపధ్యంలో ఎక్కడో ఒక పాకిస్తాన్ జెండా కనబడింది. ఒక్క క్షణం నాకు పిచ్చికోపమొచ్చింది. కానీ మరొక్క క్షణంలో, "ఏమిటి మనకీ ఖర్మ" అనిపించింది. ఈ ఒక్క ఘటనకాదు 1990 లనుంచీ అక్కడ ఏర్పడిన(నా కర్థమైన) పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుంటే, "మనకు నిజంగా ఇంత జంఝాటం అవసరమా?" అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.
ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న సమస్య అక్కడి ప్రభుత్వ చేతగానితనం, భారతప్రభుత్వ అలసత్వం, సంఘ్ పరివార్ రాజకీయ ఎత్తుగడే అయినా, అదక్కడ ఆగక ఒక అంతర్జాతీయ సమస్య రూపంలో మళ్ళీ కాశ్మీర్ ను నిలిపింది. ఇక ఈ అవకాశంకొసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కాకపోతే, ఈ సంఘటను ఒక సాధారణ ఘటనగా పరిగణించక, దీన్ని అవకాశంగా చేసుకుని మన కాశ్మీర్ stratagey ని పునర్నిర్వచించడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అది భారతదేశ భవిష్యత్తుకు చాలా కీలకం కూడా.
ఇలాంటి వేర్పాటువాద భావనలతో మనం ప్రజాస్వామికంగా ఇదివరకూ ‘డీల్’ చేసాముకూడా. కానీ కాశ్మీర్ రోజురోజుకీ ఇంకా సమస్యాత్మకంగా పరిగణిస్తోందేతప్ప సమస్య అంతమవటం లేదు. నాగాలాండ్, అస్సాం, మిజోరాం లాంటి రాష్ట్రాలు ఇదివరకూ విడిపడాలనే ప్రయత్నం చేసినా "సామ,దాన,భేధ, దండోపాయాలు" ఉపయోగించి విజయవంతంగా ఆ ఉద్యమాలను అంతం చేసాం. పంజాబ్ రాష్ట్రం కూడా ఖలిస్తాన్ కావాలని తీవ్రప్రయత్నం చేసి భారతదేశ విధానాలకు లొంగిపోవాల్సి వచ్చింది.
ఈ అన్ని ఉద్యమాలలో మనం ఉపయోగించిన విధానాన్ని మూడు వ్యూహాల్లో చెప్పాలంటే, 1) నిర్దాక్షిణ్యంగా హింసాత్మక వేర్పాటూవాదుల్ని అణగదొక్కడం. 2) సానుకూలంగాఉన్న వేర్పాటువాదుల్ని రాజకీయప్రక్రియలో భాగం చేసి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. 3) కేంద్రప్రభుత్వం అత్యధిక ఆర్థిక వనరులు సహాయం చేసి శాంతితోపాటూ ఆర్థికంగా ఆప్రదేశాన్ని పునర్నిర్మించడం. ఈ మూడు విధానాలనూ కాశ్మీర్ లో కూడా ప్రయోగించినా ఫలితం మాత్రం శూన్యం మిగిలింది.
ప్రస్తుతం అక్కడి వేర్పాటువాదులు కోరుతున్న కోరికల్లో అర్థం లేదు. భారతప్రభుత్వం చేస్తున్న పనుల్లో తర్కం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యూహాలు దెబ్బతినడం సహజమేకదా! వేర్పాటువాదులు కాశ్మీర్ కు "అటానమీ" కావాలంటారు. 370 ఆర్టికల్ మూలంగా వాళ్ళకు సిద్దించిందంతా అటానమీనే...మరి ఇంకా ఏంకావాలో నాకైతే అస్సలర్థంకాదు. మన పార్లమెంటు పాస్ చేసిన చట్టాలుకూడా, వారు తమ రాష్ట్రంలో మళ్ళీ అంగీకరిస్తేతప్ప అమలుకావు. ప్రెసిడెంట్ తన అధికారాన్ని కాశ్మీర్ లో ఉపయోగించలేడు. కాశ్మీరీలు భారతీయులేగానీ, భారతీయులు మాత్రం కాశ్మీరీలు కాజాలరు. అక్కడ మనం ఆస్థినికూడా కొనలేంకదా! ఇంతకంటే అటానమీ కావాలా ఎవరికైనా?
ఇక ఆర్థిక సహాయం అంటారా...భారతప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు అందించే తలసరి ఆర్థిక సహాయం 1000- 1500 రూపాయలుకాగా (అదీ చాలా వరకూ అప్పురూపంలో), కాశ్మీర్ లో ఇచ్చేదిమాత్రం దాదాపు 10,000 రూపాయలు. అంటే దాదాపు పదింతలెక్కువ. అదీ ఫ్రీగా. ఇదిపోనూ ఇక ప్రధానమంత్రి నిధి, ప్రత్యేక నిధి అని మరికొన్ని వందలకోట్లు ప్రతి ఏటా మన డబ్బు తీసుకెళ్ళి కాశ్మీర్ లో ‘మండిస్తున్నాం’. ఇక్కడ మనడబ్బు అని ఎందుకంటున్నానంటే, కాశ్మీర్ లో ట్యాక్స్ ద్వారా లేక వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం నగణ్యం.
ఇక మనం కాశ్మీరాన్ని బలవంతంగా మన భూభాగంలో ఉంచుకోవడానికి పెడుతున్న ఖర్చు కొన్ని వేలకోట్లు దాటుతుంది. పార్లమెంట్ దాడి తరువాత జరిగిన "ఆపరేషన్ పరాక్రం" కోసం భారతీయ ఆర్మీ(10 నెలలలొ) పెట్టిన ఖర్చు అక్షరాలా 6,500 కోట్లు...800 మంది సైనికుల ప్రాణాలు.
కాస్త ఎమోషన్ ని పక్కనపెడితే, ఇవన్నీ నిజంగా మనకవసరమా? "మేము భారతదేశంతో ఉండం మొర్రో" అటుంన్నవాళ్ళని బలవంతంగా పట్టి ఉంచడం, కేవలం "కాశ్మీర్ నుంచీ కన్యాకుమారివరకూ మాది ఒకేదేశం" అని చెప్పుకోవడానికి బాగుంటుందనేనా! అందుకే ఒక్కసారి "మీ ఖర్మ" అని కాశ్మీరాన్ని వదిలేస్తే ఎలావుంటుందా అనే ఆలోచన వస్తుంది.
కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన దేశం అయితే ఆర్థిక వనరులు లేక క్షీణించి మళ్ళీ మన కాళ్ళ బేరానికి వస్తారు. సమస్య తీరిన తరువాత, భారతదేశాన్ని ఇరుకున పెట్టలేదు గనక అసలే అమెరికా దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్న పాకిస్తాన్ పెద్ద సహాయం చెయ్యకపోవచ్చు. ఒకవేళ కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్లో చేరితే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం, అంతగా కోరుకుంటున్న అటానమీ రెండూ పోయి ‘గతవైభవాన్ని’ తలుచుకుని ఏడవడం తప్ప చెయ్యగలిగిందేమీ ఉండదు. ఇంతా జరిగితే భారతదేశానికొచ్చే నష్టం, మనం ఏమోషనల్ గా నమ్ముతున్న "కాశ్మీర్ భారత్ లో ఒక భాగం" (నిజానికి మ్యాప్ లో చూసే కాశ్మీరం కూడా సగమే మనదగ్గరుంది) అన్న అపోహ మాత్రం ఛిన్నాభిన్నమవడం. రాజకీయనాయకుల ఉపన్యాసాలూ, ఉగ్గుపాలతో నేర్పిన దేశభక్తీ కొంచెం గింజుకుని కృశించడం.
తార్కికంగా మనకు జరిగేనష్టం పెద్దగా లేకపోగా, ఇంకా మనకు ఆర్థికంగా, మిలటారీ పరంగా చాలా లాభాలున్నాయి. కానీ మనలో బలంగా నాటుకుపోయిన "భావనలు" అలా చెయ్యనివ్వటం లేదు. దీనికి అంత త్వరగా సమాధానకూడా లేకపోవచ్చు. అయినా J&K లో జమ్మూ, లడాక్ లను తీసేస్తే (అక్కడ ఈ వేర్పాటువాదం లేదు. సాంస్కృతికంగా కూడా వీటికీ కాశ్మీర్ లోయకీ సంభంధం లేదు) కాశ్మీర్ లోయలో ఉన్న జనం మన విజయవాడ జనాభా అంతమంది మాత్రమే ఇక భూభాగం కనీసం గోవా రాష్ట్రమంత కూడా ఉండదేమో...కానీ దానికి మనం చెల్లిస్తున్న మూల్యం...ఇది మనకు నిజంగా అవసరమా?!?
అందుకే ఈ కాశ్మీరం నాకొద్దు...
****
*some of the statistics in above article are taken from 'Vir Sangvi' .
13 comments:
నేను పుట్టి బుద్ది తెలిసిన దగ్గరనుండి కాశ్మీర్ సమస్య ఉంది..నాకింత వరకు ఆ సమస్య ఏమిటో అంతు పట్టలేదు..
మీరన్నది చాల వరకు కరెక్ట్ ,
మన ప్రభుత్వానికి ఈ మాత్రం అవగాహన లేకపోవటం విచారకరం . మీరన్నట్టు అంట సొమ్ము వృధాగా పోనివ్వటం కంటే వేరే పథకాలకి ఉపయోగించు కోవచ్చు. కాశ్మిరుని వదులుకుంటే తీవ్రవాదం సద్దుమనుగుతుంది అనుకుంటే ఆ పని చేయటం ఉత్తమం.
ఈ కల్లోలం వద్దని కాష్మీరాన్ని వదులుకుంటే, ఏ మణిపూర్ వారో మాకో ప్రత్యేక దేశం కావాలంటే ఎట్లా? Article 370 గురించి మరికాస్త విపులంగా రాస్తే బాగుండేది; లేక దాని పై ప్రత్యేక టపా రాయవచ్చు మీరు. వ్యాసం లో వెలిబుచ్చిన ఆవేదన సహేతుకమే.
చాలా తీవ్రమైన వాదన ఇది. చైనాను పూర్తిగా మర్చిపోయిన వాదన. మన నెత్తిన ఉన్న లంపటంగా మాత్రమే కాశ్మీరును చూస్తున్నారు గానీ.. విడిపోతే అది మన పక్కలో బల్లెమో మరొకటో అవుతుందని చూస్తున్నట్టు లేదు.
మీరన్నట్టుగానే కాశ్మీరును పాకిస్తానులో కలిసేందుకో, ప్రత్యేకదేశంగా ఏర్పడేందుకో ఒప్పుకున్నామనుకుందాం (అలాంటి అగత్యమే ఏర్పడితే ప్రత్యేకదేశమే మనకు మేలు) ఆర్థికంగాను, సామాజికంగాను కాశ్మీరు బాగా క్షీణిస్తుంది. అటువంటి క్షీణత పొరుగుదేశంగా మనకెంత కీడో ఆలోచించండి. తినేందుకు తిండి లేనివాడు పక్కింటి మీద పడడా? ఇప్పటికే పీవోకేలో ఉగ్రవాదం మంచి ఉపాధి అవకాశమైపోయింది. విడిపోయాక, కాశ్మీరు కూడా అలాగే తయారవుతుంది. పైగా కాశ్మీరు సైనిక వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినది. పీవోకే తమ చేతిలో ఉండటానే కదా పాకిస్తాను వాళ్ళు తమకూ చైనాకు మధ్య కారకోరమ్ రహదారిని నిర్మించుకున్నారు ఖుంజేరబ్ కనుమ మన చేతిలో ఉంటే వాళ్లలా చెయ్యగలిగేవారా? కాశ్మీరును వదులుకోవడం పీవోకేను వదులుకోవడం కంటే పెద్ద తప్పవుతుందని నా ఉద్దేశ్యం. ఉగ్రవాదం ఇప్పటికంటే అప్పుడు బాగా పెరిగిపోతుంది.
మరి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిములు కూడా విడిపోతామంటూ ఉగ్రవాదానికి పాల్పడితే ఆ ముక్కలను కూడా తెగ్గోద్దామా?
అసలు వీటన్నిటికంటే ముఖ్యం..
దాదాపుగా ఇలాంటి వాదనే అప్పుడెప్పుడో పార్లమెంటులో నెహ్రూ అక్సాయిచిన్ గురించి చేస్తే మాలవ్యా వాత పెట్టిన సంగతి మీకు తెలియంది కాదు.
@చదువరి గారూ, మీరు చెప్పిన `strategic importance’ తెలియక కాదు.కాకపోతే ఈ వ్యూహాత్మక ప్రాముఖ్యత కేవలం పాకిస్తాన్ అనే బూచినో లేక చైనా అనే భూతాన్నోచూపించి ఇప్పటివరకూ నడుపుకొస్తున్న విధానమని నా కనిపిస్తుంది.
ఆర్థికంగా సంబంధాలు విస్తృతంగా మెరుగుపడితే "సైనిక యుద్దాలు" జరగని ప్రపంచం త్వరలో వస్తుందని నా నమ్మకం. ఈ భవిష్యత్తుకు మనం భయం లేకుండా తయారవ్వాలి.At present our policy is determined by fear of China or Pakistan, not with greater common good our people.ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాల మధ్య మనకెక్కడ "అవమానం" జరిగిపోతుందో అన్న ధోరణిలో మనం ప్రవర్తిస్తున్నామేతప్ప నిజంగా సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోవడం లేదు."వాయగొట్టే దేవుడ్ని వీపెక్కించుకుని తిరగడం ఎందుకు" అని మాత్రమే నా ప్రశ్న.
నిజానికి కాశ్మీర్ సమస్యకూ భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రవాదానికీ ఈ మధ్యకాలంలో పెద్ద లంకెలేదు.దాని వివరాలకు నా "తీవ్రవాదానికి లాజిక్ దొరికితే" వ్యాసం చదవగలరు.
@రావుగారూ,Article 370 గురించి రాస్తే చాలా పెద్ద వ్యాసమే రాయాలి. త్వరలో ప్రయత్నిస్తాను.ఇక (మణిపూర్ లాంటి)వేరే వారు వేరుపడతామంటే ఎలా? అనే మీప్రశ్న చాలా సహజం. ఇలాంటి వేర్పాటువాదాన్ని అణచడానికి మనకు కొన్ని పద్దతులున్నాయి. అవన్నీ కాశ్మీర్ లో విఫలమైపోయి,సమస్య ఇంకా జటిలమైనాకూడా మనం నిర్ధుష్ట్యమైన విధానపర నిర్ణయాలు చెయ్యక, సమస్యని పొడిగించి దేశ సార్వభౌమత్వానికీ, రక్షణకే ఎసరు పెడుతున్నాం కాబట్టి అంతకన్నా,వారిని వారి ఖర్మకొదిలెయ్యడం మంచిదని నా కనిపించింది.
Its better to get rid of the problem than to nurture it for further loss అని అనిపించడం సహజంకదా!
@చక్రి గారూ,మన కాశ్మీర్ విధానాన్ని పునరాలోచించుకునే సమయం ఏర్పడింది.అది విజ్ఞులు కలిసి నిర్ణయించవలసిన దారి.మన పద్దతి ఆ possibilities ని చర్చించడం మాత్రమే అనుకుంటాను.
ఆలోచింపచేసేలా ఉన్నాయి మీ భావాలు.
బొల్లోజు బాబా
మనకు సొంత తెలివి లేనప్పుడు కనీసం పక్క వాడిని చూసి నేర్చుకోవడం వల్ల కొన్ని సార్లు లాభాన్ని పొందవచ్చు. ఈ విషయంలో, పక్కనే ఉన్న (టిబెట్‌లో) చైనాను చూసి మనం ఎంత నేర్చుకుంటే మంచిది. రాజకీయాలను, ఓట్లను పక్కనబెట్టి ఆలోచిస్తే ఏమైనా సాధించే అవకాశం ఉండవచ్చు.
ఆర్టికిల్ 370 గురించి ఎక్కువమంది చాలా తప్పుగా ఆలోచిస్తుంటారు. దాన్ని రద్దు చేయాలని నానా యాగీ చేసిన బిజెపి వాళ్లు ఏడేళ్లు అధికారంలో ఉండీ ఆ పనెందుకు చెయ్యలేదు? అసలు మనకి కావలసింది ఆర్టికిల్ 370 ని దేశమంతటికీ వర్తించేలా చెయ్యటం, ఆ రకంగా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని తగ్గించటం. అదీ, నిజమైన ఫెడరల్ స్పూర్తి.
ఆర్టికిల్ 370 సంగతి కాసేపవతల పెడదాం. నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవేశానికి ఇతర రాష్ట్రాల నుండొచ్చే భారతీయులకి ప్రత్యేక అనుమతులు (permits) కావాలి. ఈ సంగతి మనలో ఎందరికి తెలుసు? మరోలా చెప్పాలంటే, ఈ రాష్ట్రాల్లో అడుగు పెట్టాలంటే వీసాలు కావాలన్న మాట! ఎప్పుడో 1873లో బ్రిటిష్ జమానాలో చేసిన శాసనం స్వతంత్రమొచ్చి అరవయ్యేళ్లు దాటిపోయినా ఇప్పటికీ అక్కడ అమల్లోనే ఉంది. దీన్ని గురించి పట్టించుకోని వాళ్లు ఆర్టికిల్ 370 గురించి గొడవ చెయ్యటంలో అర్ధం లేదు.
కాశ్మీర్ లోయ మొదటినుండి మనది కాదు. కాశ్మీర్ ప్రజలు భారత్ లో విలీనం కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. పాకిస్తాన్ లో అంతర్భాగం కావడాన్నే వారు ఇష్టపడ్డారు. వారి ఆకాంక్షలకు విరుధ్ధంగా కాశ్మీర్ రాజు హరి సింగ్ భారత్ లో విలీనం చేయడానికి అంగీకార పత్రాన్ని ఇచ్చాడు. ఆ పత్రాన్ని సాకుగా చూపి ఒకరకంగా చెప్పాలంటే భారత్ కాశ్మీరు ను ఆక్రమించుకుంది. అదే హైదరాబాదు రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో విలీనం చేయడానికి నిజాం ప్రయత్నిస్తే అది ప్రజాభీష్టానికి వ్యతిరేకమని పోలీసు చర్య జరిపి నిజాంను పదవీచ్యుతుణ్ణి చేసి హైదరాబాద్ ను భారతదేశం లో కలిపేసుకున్నాం.
'దేశభక్తి ', ' నా దేశం ఏం చేసిందో అదే సరియైనది ' అనే భావనల ముసుగులు తొలగించి చూస్తే రెండు సందర్భాలలోనూ భారతదేశం రెండు విధాలుగా వ్యవహరించిందన్నది అర్థమౌతుంది. దేశభక్తి పేరుమీద గుడ్డిగా వాదించడం జిహాదీలు చేసే పని. ప్రజాస్వామ్య దేశ పౌరులు చేసేది కాదు. నిజంగా కాశ్మీరీలు భారత్ లో ఉండడానికే ఇష్ట పడుతుంటే మనం ఐరాస తీర్మానం ప్రకారం 'ప్లెబిసైట్' ను జరిపించడానికి ఎందుకు భయపడుతున్నాం?
కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేసి, మీ ఇష్టం వచ్చినట్లు బ్రతకండని వదిలేయడమే మంచిది. వారు పాకిస్తాన్ లో కలవాలనుకుంటే కలిసిపోనివ్వాలి. పాకిస్తాన్ నుండి ఇండియా సౌహార్దంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న బాంగ్లాదేశ్ యే మనపట్ల ఈనాడు ఇసుమంతైనా కృతజ్ఞతను చూపించడంలేదు. "మీతొ ఉండడం మాకిష్టం లేదు మొర్రో" అని మొత్తుకుంటున్న వాళ్ళు రేపు విడిపోయాక సమస్యాత్మకంగా మారుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు చెప్పినట్లు డబ్బులు ఖర్చు పెట్టి మరీ సమస్యను కొనితెచ్చుకోవడం కంటే, వదిలేసుకొని ఆ డబ్బును రక్షణకు వెచ్చించడం మేలు కాదా?
@బొల్లోజు బాబాగారు,"If you can't solve the problem, get rid of it" అనే సింపుల్ లాజిక్ ఆధారంగా మాత్రమే ఈ ఆలోచనలు రాయడం జరిగింది.
@నాగన్న గారూ; అసలు సమస్య మన రాజకీయనాయకుల చేతగానితనం. దేశ రక్షణ గురించి ఇన్నిమాట్లాడతారుగానీ నిజంగా అవసరమైన విధానపర నిర్ణయాలదగ్గరకొచ్చేసరికీ ఓటు బ్యాంక్ రాజకీయాలు గుర్తొచ్చి మొత్తాన్నీ నీరుగార్చేస్తారు.
@అబ్రకదబ్ర గారూ: నేను సిక్కిం రాష్ట్రంలో రెండు సంవత్సరాలున్నాను. అక్కడ ప్రవేశించడానికి భారతీయులకు గుర్తింపు కార్డులవసరమేగానీ పర్మిట్టులు కాదు. కాకపోతే అక్కడ మనం భూమి కొనడానికీ (అసలు కొనలేం) వ్యాపారం చెయ్యడానికీ చాలా రూల్స్ అడ్డొస్తాయి.
ఆర్టికల్ 370 మీరన్నంత సులువుకూడా కాదు. అందులో చాలా లోసుగులున్నాయి. మీరు నిజంగా రాష్ట్రాల స్వయంప్రతిపత్తి పెంచాలంలే,దీనిలో చాలా మార్పులవసరం. అలాగే taxation పరమైన విధానాలలోకూడా చాలా వెసులుబాటు కల్పించాలి. ఇప్పట్లో అది జరిగేటట్టైతే లేదు. కాకపోతే పెరుగుతున్న తీవ్రవాదం దృష్ట్యా ఫెడరల్ పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏర్పాటుమాత్రం జరగొచ్చు. అది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది.
@చంద్రమోహన్: నా ఆలోచన మీకూ వచ్చినందుకు సంతోషం. అప్పుడప్పుడూ అలా అనిపించేవాళ్ళున్నారన్నమాట!
మహేష్,
సిక్కిం గురించి కాదు; నేను నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల గురించి చెప్పాను. వీటిలో ప్రవేశానికి special permits కావాలి - గుర్తింపు కార్డులు కాదు. ఆ permits జారీ కోసం ప్రత్యేకమైన కార్యాలయాలు కూడా ఉన్నాయి.
ఆర్టికిల్ 370 లో లొసుగులు లేవని కాదు. నా అభిప్రాయం, అవసరమైతే అటువంటి దాన్ని దేశమంతటికీ వర్తింపచెయ్యాలని - అవసరమైన మార్పులు చేర్పులతో.
మీ ఆలోచన సబబే కాని...
నేను సియాచిన్ గ్లేసియర్ గురించి విన్నప్పుడుకూడా అలానే అనుకున్నాను ... నివాసయోగ్యం కాదు పర్యాటక యోగ్యంకాదు ఆమాత్రం దానికి దానిమీదా అంత ఖర్చు ఎందుకా అని ... కాని తరువాత చదువరి గారు చెప్పినట్టి అపాయాలు కొన్ని తోచాయి ....
ఇక పోతే ...
"కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన దేశం అయితే ఆర్థిక వనరులు లేక క్షీణించి మళ్ళీ మన కాళ్ళ బేరానికి వస్తారు" - ఇది ఎంతవరకు సాధ్యం అని మీరు నమ్ముతున్నారు .....? అలా రావటం అనేది జరగదు... విలీనం అవ్వాల్సిన గత్యంతరం వస్తే... పాకిస్తాన్లో అవుతుంది ....
బంగ్లాదేశ్ లో తరిమినట్టు ... కాశ్మీరంలో నాన్ ముసల్మానులను తర్మివెయ్యటం ఖాయం ..మళ్ళీ... హిస్టరీ రిపీట్ అవుతుంది ...?
కాశ్మీర్ విషయంలో నాకు కూడా మహేష్ గారిలానే అనిపిస్తుంది. మనం దాన్ని బలవంతాన నిలుపుకోటానికి ఇప్పటికే చాలా పోగొట్టుకుంటున్నాం. కాకపోతే చదువరిగారి మాటలు కొట్టిపారెయ్యలేనివి. ఒక్కసారి వెనకడుగు వేస్తే, తర్వాత వరసగా వెనకడుగులు వెయ్యాల్సి వస్తుంది. భారతదేశం బోర్డర్ లోని చాలా రాష్ట్రాలు, మనం వదిలేస్తే మనకు శత్రుదేశాలుగా మారటానికి తయారుగా వున్నాయి. కాశ్మీర్ వదిలిన మరుక్షణం అంతర్జాతీయ వేదికెక్కడానికి, seven sisters గా పేరుబడ్డ తూర్పు రాష్ట్రాలు తయారుగా వున్నాయి. ఇలాంటి పని వేర్పాటువాదులకు ప్రోత్సాహమిచ్చినట్టు అవుతుంది.
మార్చాల్సింది...కాశ్మీర్‌ను కాదు... పాలకులను. సమస్యను తీర్చాలన్న ఉక్కు సంకల్పం ఉంటే, కాశ్మీర్ సమస్య తొందరగానే తీర్చెయ్యచ్చు.
Post a Comment