Thursday, August 21, 2008

మనిషి - మార్పు

"The only person who always likes change is a wet baby" అంటారు. నిజమే, తడిచిన న్యాపీప్యాడ్ నుంచీ చిన్నపాప కోరుకునే మార్పేతప్ప, నిత్యజీవితంలో మనిషి ‘మార్పుని’ అంత మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకోడు. కారణం, మార్పు మన ప్రస్తుత జీవనవిధానాన్ని సవాలు చేస్తుంది. మన ఆలోచనాధోరణి మారాలంటుంది. మార్పు జరిగిన కొంతకాలం మనల్ని అయోమయానికి గురిచేస్తుంది. అలవికాని మానసిక వత్తిడిని గురిచేస్తుంది. అంతేకాక, ఈ మార్పు అసలు ఎలా జరుగుతోందో, దీనివలన మనకొచ్చే నిర్ధుష్ట్యమైన లాభాలేమిటో, మార్పుకు అవతలి ఒడ్డున ఏముందో తెలియకపోవడం జరుగుతుంది.అందుకే మనిషికి మార్పంటే భయం. మనిషి తన స్థిరత్వంలో ఉన్న ఆనందాన్ని ఎప్పుడూ అభిలషిస్తాడు, ప్రేమిస్తాడు, కాంక్షిస్తాడు. వాటి తీవ్రత మనిషి మనిషికీ మారినా, మూలం మాత్రం statusquo. మార్పులేని హాయైన జీవితం. న్యూటన్ మహాశయుడు తన first law of motion లో చెప్పినట్లు ఈ జఢత్వాన్ని కాంక్షించే ఏవస్తువైనా, కొంత "external unbalanced force" పడందే కదల్దు. మనుషులూ అంతే, కొంత తోస్తేగానీ మార్పువైపు కదలరు. అది వ్యక్తిగతమైన మార్పైనా సరే, సామాజికమైనదైనా ఇదే తంతు, ఇదే పంధా.ఈ ఆధునిక జీవితంలో మార్పుల తీవ్రత చాలా అధికంగా ఉంది. మారుతున్న భౌతిక, ఆర్థిక మార్పులతో మనుషులూ వారి అభిప్రాయాలూ, ఆలోచనలూ, విలువల తోపాటూ సమాజం యొక్క ధోరణి మారాల్సినంత మారకపోవడం, మనిషి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తోందేతప్ప ఏవిధంగానూ సహాయపడటం లేదు. ఈ పరిస్థితుల్లొ ప్రభుత్వాలూ, ఇతర సంస్థలూ, ఉద్యోగాలూ, పరిశ్రమలూ మొదలగు అన్ని రంగాలలో అవసరమౌతున్న దశ ప్రారంభమయ్యింది. అసలే fear of changeని బలంగా తన జీవనవిధానంలో పొందుపరుచుకున్న మనిషి ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. అందుకే ఎక్కడ చూసినా 'change management', 'organizational change' అంటూ బోర్డులుకట్టి మరీ, మార్పుని కార్పొరేట్ బోర్డురూముల్లోకి ముఖాముఖి తెచ్చిపెడుతున్నారు."మార్పు ఒక జీవన సత్యం". "నేతి నేతి" (not this... not this) అనుకుంటూ, నిరంతరం ప్రశ్నించుకుంటూ,అనుక్షణం మారాలని చెప్పే  వేదాల్ని మనం హాయిగా అటకెక్కించేసి, కేవలం ఛాందస భావాల్నీ, మార్పుని వ్యతిరేకించే మూసలోపోసిన వ్యవస్థీకృత మతాన్నీ వాటి విలువల్నీ అందిపుచ్చుకుని, వెనుకబడుతున్నామేగానీ మార్పు దిశగా మనస్ఫూర్తిగా ప్రయాణించలేకపోతున్న సమాజంగా మిగిలిపోతున్నాం. ఎంత విచారించినా, మార్పు అందరిలోనూ ఒక్కసారే రాదనే నిజాన్నికూడా గుర్తెరిగి ప్రవర్తించాలన్నది చాలా ముఖ్యమైన విషయం.సామాజిక శాస్త్రవేత్తలు, మార్పు సమాజంలోని మనుషుల్లో ఏవిధంగా వస్తుందో, ఆ వివిధ దశల్లో మారే మనుషులు ఎలా ఉంటారో వారి లక్షణాలేమిటో చాలా విశదంగా వివరించడం జరిగింది. వ్యక్తిగతమైన మార్పు ‘తెలియని మూర్ఖత్వం’ నుంచీ ‘తెలిసిన మూర్ఖత్వం’ వైపుగా జ్ఞానసమపార్జనద్వారా పయనించి, తన ‘తెలియని శక్తుల్ని’ చైతన్యవంతం చేసుకుని అంతర్గత శక్తుల్ని కూడగట్టుకుని ‘చైతన్యావస్థ’లొ మార్పుకు సిద్దమవుతాడట. కానీ మన దగ్గర సమస్యల్లా "జ్ఞానసమపార్జన"లో వస్తుంది. మార్పుకు అవసరమైన జ్ఞానం సత్యశోధనా, తార్కిక అవగాహన ద్వారా లభిస్తే, మనలో చాలా మంది మూఢనమ్మకాలలో, సహజంగా మార్పుని వ్యతిరేకించే మతాచారాలలో, out dated సామాజిక కట్టుబాట్లలో వెతుక్కుంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు సులభంగా రాదు. కానీ మార్పు ఎవరు ఆపినా ఆగే ప్రవాహం కాదుగనక, అది వచ్చి మన మూలాల్ని కదిలించేసిన తరువాత కుప్పకూలిపోవడాలూ, గుండెపోట్లు తెచ్చుకోవడాలే మిగులుతాయి.ఒక సమూహంలో మార్పు ఏ విధంగా వస్తుందో, ఆ మారే మనుషుల్ని ఏవిధమైన కేటగరైజ్ చెయ్యొచ్చో తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మార్పు నేఫధ్యంలో ఒక సముహాన్ని ఐదురకాలుగా విభజించొచ్చు. మొదటి రకాన్ని ఆద్యులు (innovators) అంటారు. అసలు మార్పుకు మూలమే వీరన్నమాట. సమాజాన్ని ప్రభావితంచేసే లేక సమూలంగా మార్చే సాంకేతిక పరికరాల్నీ, సైద్ధాంతిక ప్రతిపాదనల్నొ, సామాజిక నిర్మాణాన్నో ఒక ఆలోచనగా లేక వస్తువుగా తయారు చేసే రకంగా వీరిని చెప్పుకోవచ్చు. గెలీలియో, కార్ల్ మార్క్స్, మన చలం ఇలాంటిరిలో వస్తారన్నమాట. వీరు సృష్టించినవి లేక ప్రతిపాదింఛినవి అంత సాధారణంగా మింగుడుపడవు. కాకపోతే కాలక్రమేణా ఇవే మానవ జీవిత ఆదర్శాలుగా మారతాయి.రెండవరకం వార్ని ఆరంభకులు (early adopters) అని పిలుచుకోవచ్చు. మార్పు సంభవించిన వెంఠనే, దాన్ని అందిపుచ్చుకోవడంలో వీరు ముందుంటారు. ఆలోచనతోపాటూ అవసరమైన ఆర్థిక బలిమికూడా ఇలాంటి వారికి ఉంటుంది. ఈ మార్పువలన ఎక్కువ లాభం పొందేవారు వీరే. వ్యాపారస్తులూ, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఈ శ్రేణిలోకి వస్తారు. సామాన్య జనం ఈ మార్పుని అర్థం చేసుకోలేక, తమ విలువల కొలమానంతో వీరిని కొలవలేక, "ఇదొక ఫ్యాషన్ అంతే" అనుకుని తృప్తిపడుతూ ఉంటారు. ఈ శ్రేణిలో ఉన్నవారిని మిగతా సమాజం ఎట్టిపరిస్థితుల్లోనూ అందుకోలేరు. వీరెప్పుడూ రెండడుగులు ముందేవుంటారు.మూడోరకం వారు అర్థం చేసుకుని ఆహ్వానించేవారు (early majority). మేధావులూ, ఆలోచనాపరులూ ఈ కోవలోకి వస్తారు. అవసరమైన ఆర్థిక బలిమి లేకపోయినా తమ మేధతో మార్పుని, దానివల్ల రాబోయేమార్పుల్ని భౌతికంగా చూడకపోయినా, అర్థం చేసుకుని, జీవితాలకి అన్వయించుకుని ఆచరించేవాళ్ళు వీరు. వీరి సంఖ్య చాలా ఉండటం వలన ఈ శ్రేణి నుండే సామాన్యులకి ఈ మార్పుని దగ్గరగా చూసే అవకాశం, అర్థం చేసుకునే సౌలభ్యత లభిస్తాయి. అంటే, innovation in practice ఇక్కడ కనబడుతుందన్నమాట.నాలుగో రకం, అంతుచూసి అవలంభించేవారు (late majority). వీరు ఎవరైనా మార్పుని మొదట అందిపుచ్చుకుని, అనుభవించి, అప్పటికీ హాయిగా ఉండటం చూస్తేగానీ ఈ మార్పుదిశగా అడుగులెయ్యరు. మార్పుని చూసినా, వీరు అంత సులభంగా ఇప్పుకోరు. "అది ఇక్కడ సాధ్యం కాదులే", "వారినైతే ఎవరూ అడగరు, కాబట్టి ఏమైనా చేస్తారు" లాంటి స్టేట్ మెంట్లిస్తూ మార్పుని దాట వేస్తుంటారు. మార్పు గుమ్మందాకా వచ్చినా, వీరిలో లెక్కలేనన్ని అనుమానాలుంటాయి. వీరు అపోహలూ సందేహాల ఆధారంగా మార్పుని తమదైన శైలిలో సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో మార్పు తీవ్రత చేతిలో ఓడిపోయో లేక మార్పులో ఉన్న లాభాన్ని గ్రహించో మొదట రహస్యంగా మార్పుని జీవితాల్లోకి తీసుకొచ్చి, తరువాత బాహాటంగా, ఆపైన గర్వంగా అవలంభిస్తారు. మధ్యతరగతి మనుషులంతా దాదాపు ఈ శ్రేణిలో వచ్చేవారే.ఆఖర్నవున్న ఐదవ రకం వ్యతిరేకులు (Resistors).  వీరికి మార్పు అనగానే చిర్రెత్తుకొస్తుంది. స్థిరత్వాన్ని అమితంగా ప్రేమించి, మార్పుని తీవ్రంగా నిరసించి, ద్వేషించే రకం. మార్పు ఎటువంటిదైనా అది సమాజాన్ని నాశనం చెయ్యడానికే బయల్దేరుతుందని మనసా,వాచా,కర్మణా నమ్ముతారు. వీరి దగ్గర, మార్పుకు వ్యతిరేకంగా కట్టలుకట్టల సమాచారం లభిస్తుంది. వేదాలనుంచీ, పక్కింట్లో జరిగిన విపరీతాలవరకూ వీరి చిట్టాలో మార్పుకి వ్యతిరేకంగా ఉదాహరణలు కనబడతాయి. వీరు మారరు, ఎవరైనా మారుతుంటే తీవ్రమైన అభ్యంతరాలు లేవదీసి పూర్తి సమాజాన్ని కొన్ని తరాలు కాకపోయినా కొన్ని సంవత్సరాలైనా వెనుకబాటుతనం ఉండేలా చూడటం వీరి నిత్యకృత్యం. వీరెప్పుడూ moral high ground లో ఉన్నట్టుగా భావిస్తూ, తక్కిన సమాజాన్ని నిరసిస్తూ అడుగడుగునా తీవ్రభావజాలాన్నీ, మార్పుపట్ల ద్వేషాన్నీ వెళ్ళగక్కుతూ ఉంటారు. గుండెపోట్లూ, అల్సర్లూ, బీపీ వీరికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. తర్కం, లాభం, ఉపయోగం, ప్రగతి లాంటి పదాలంటే వీరికి విరక్తి.ఇలా వివిధరకాలుగా మనుషులుంటే, ప్రతి మార్పులోనూ మనం ఒకే శ్రేణిలో కాకుండా వివిధ శ్రేణుల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి సెల్ ఫొన్ విషయంలో నేను ‘అంతుచూసి అవలంభించే వారి’ శ్రేణి, అదే కంప్యూటర్ విషయంలో ‘అర్థం చేసుకుని ఆహ్వానించే’ శ్రేణి ఇలా అన్నమాట.ఏది ఏమైనా మార్పన్నది సహజం. అది జరిగి తీరవలసిందే. ఒక్కోసారి మారకపోతే మన మనుగడ అస్థిత్వం రెండూ నశించే ప్రమాదం వస్తుంది. అంతవరకూ వేచి చూడక ఎంత త్వరగా ఈ మార్పుల శ్రేణుల్లో మెట్లెక్కగలమన్నది మనం సంపాదించే జ్ఞానం, మనకున్న విద్వత్తు మీద ఆధారపడివుంటుంది.చివరగా మార్పు గురించిన ఒక ప్రకృతి సత్యం చెప్పి ముగిస్తాను. పక్షుల్లో గ్రద్ద (Eagle) కి అత్యంత ఎక్కువ జీవన సమయం ఉంది. దాదాపు 70 సంవత్సరాలు అది బ్రతుకుతుంది. కానీ 40 ఏళ్ళొచ్చేసరికీ తన రెక్కలు బరువై, ముక్కు (Beak) సుడితిరిగిపోయి అటు ఎగరలేక, వేటాడినా ఆ వంకరతిరిగిన ముక్కుతో తినలేక అష్టకష్టాలూ పడుతుంది. ఇలా కొనసాగితే కొన్నాళ్ళకి ఆకలిని భరించలేక చనిపోవడం ఖాయం. అప్పుడు గ్రద్ద ఒక పని చేస్తుంది... ఎక్కడో దూరంగా ఉన్న కొండమీదకెక్కి, అక్కడున్న రాతితో తన ముక్కుని తనే ఊడగొట్టుకోవడం మొదలుపెడుతుంది. అలా నరకయాతన అనుభవిస్తూ ఊడగొట్టబడిన ముక్కు మళ్ళీ కొత్తగా రావాలంటే, దాదాపు 150 రోజులు పడుతుంది. అలా వచ్చిన కొత్త ముక్కుతో అది తన ఎగరలేని రెక్కలలోవున్న ముసలిఈకల్ని పెకిలించడం మొదలెడుతుంది. ఇలా దాదాపు ఐదునెలల కాలంలో తను "పునర్జన్మ" ఎత్తి మళ్ళీ విజయవంతంగా మరో 30 ఏళ్ళు బ్రతుకుతుంది.ఇలా బ్రతకడం కోసం మనజీవితాల్లోనూ మార్పు తప్పదు. ఈ మార్పు కారణంగా కొన్ని పాత చిహ్నాల్ని, ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, అచారాల్నీ, వదులుకోకతప్పదు. ఈ "భారాల్ని" ఒదులుకుంటేతప్ప మార్పు అనే పునర్జన్మ మనకు కలగదు. ఉన్నదాంట్లో సుఖంగావున్నామని మనం అనుకున్నా, change is an eternal force, దాన్నుంచీ తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అందుకే మార్పు మిమ్మల్ని బలవంతంగా మార్చే ముందే, ఆ మార్పుని ఆహ్వానించడం, అందిపుచ్చుకోవడం లాభదాయకం అన్నిటికన్నా ముఖ్యంగా ఆనందదాయకం కూడా.ఒక సారి ఆలోచిద్దాం. మార్పుని జీవితంలో భాగం చేసుకుందాం. Change is a way of life and change is the only permanent thing in life.


****

16 comments:

జ్యోతి said...

నువ్వు చెప్పింది నిజమే మహేశ్.. కాని ఎంతమంది మారడానికి ప్రయత్నిస్తారు ??

జాన్‌హైడ్ కనుమూరి said...

This is a good subject.
Subjects cannot be easly digested.
If at all digested it boosts energy.


Its good to read subjects some times.

Anonymous said...

అన్నా! నీవు చెప్పిన ఐదవరకం ఎరుపు చొక్కాలకు సరింగ సరిపోతుంది. వ్యాసం బాగున్నది.

కొత్త పాళీ said...

I used to have t-shirt that read ..
"People change not because they see the light but because they feel the heat."

Interestingly, A recurring thought in Indian philosophy is that of continuous change, and hence the unending quest for "sat" - that eternal, non-changing element.

బొల్లోజు బాబా said...

good analysis
bolloju baba

Chivukula said...

In chess we used to have a quote "The new is the long forgotten old". As much as I know the Japanese Philosophy believes that world is a full circle. We run to reach the same place. But let us keep running - because at the end - that is what matters.

Cheers!

నిషిగంధ said...

Good article!!
అప్పుడెప్పుడో మా బిజినెస్ మానేజ్మెంట్ క్లాస్ లో చదివిన Change management గుర్తొచ్చింది.. కానీ అది ఇంత ఆసక్తికరంగా లేదు!
గ్రద్ద గురించి చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది!

మీ బ్లాగ్ కొత్త లుక్ సూపర్ కూల్ :-)

ప్రసాద్ said...

""నేతి నేతి" (not this... not this) అనుకుంటూ, నిరంతరం ప్రశ్నించుకుంటూ,అనుక్షణం మారాలని చెప్పే వేదాల్ని మనం హాయిగా అటకెక్కించేసి, కేవలం ఛాందస భావాల్నీ, మార్పుని వ్యతిరేకించే మూసలోపోసిన వ్యవస్థీకృత మతాన్నీ వాటి విలువల్నీ అందిపుచ్చుకుని, వెనుకబడుతున్నామేగానీ మార్పు దిశగా మనస్ఫూర్తిగా ప్రయాణించలేకపోతున్న సమాజంగా మిగిలిపోతున్నాం."

పదివేల వరహాల మాట చెప్పారు. చక్కటి విశ్లేషణ. ఇంతకీ గద్ద విషయం చాలా ఆలోచింపజేసేదిగా వుంది. నిజమా అని అబ్బురంగా వుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

అబ్రకదబ్ర said...

ఆరో రకం వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లకంటూ ప్రత్యేకంగా ఏ అభిప్రాయాలూ ఉండవు (మారాలా వద్దా అనే విషయంలో) కానీ గుంపులో గోవిందయ్యల మాదిరిగా మిగతావాళ్లతో పాటే వీళ్లూ మారిపోతారు. చాలా సందర్భాల్లో తాము మారుతున్న సంగతి తమకే తెలియదు. అసలు సమాజంలో ఇలాంటి వాళ్లదే మెజారిటీ.

వ్యాసం మరీ పెద్దదైపోయింది. అది ఘోరమేమీ కాదు కానీ కూసింత సైజు తగ్గితే చదవటం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయేవాళ్లు తగ్గుతారు, మీ ఆలోచనలు మరింతమందికి చేరతాయి.

బ్లాగు కొత్త రూపు బాగుంది కానీ టపా శీర్షిక కనిపించటం లేదు!

Purnima said...

మార్పు గురించి నా ఆలోచనలు త్వరత్వరగా మారిపోతుంటాయి. అందుకే ఈ టపాకి కమ్మెంటడం ఆలస్యమైంది. ;-) మార్పు గురించి నేను రాద్దామనుకుంటూనే ఉన్నా, your post would be base for it!! త్వరలో రాస్తా!!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

భావ సాంద్రతతో కూడిన టపా! కాస్త భారమనిపించిన టపాకూడా !:) ఇక్కడ అడక్కపోయినా ఒక ఉచితసలహా(తర్వాత డబ్బులిచ్చినా కాదన్ను )ఇలాంటి సుదీర్ఘమైన టపాలకు మధ్యమధ్య లో మాంఛి ఆసక్తి కరమైన యానెక్ డోట్స్ ఇస్తూ ఉంటే,ఇక్కడ గద్దపునర్జన్మ లాగా యమా క్యూరియాసిటీ కలిగిస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఆమధ్య ఎక్కడో చదివా ప్రతి పదేళ్ళకూ మన జీవితములో సమూలమార్పులు చోటు చేసుకుంటాయని.అవి బహుశా నేను అనుకోవటం మానసికమైనవని అని,శారీరకమైనవి ఎటూ తప్పవనుకోండి,ఎదుగుతున్నకొద్దీ భావాలు,వాటి వెనుక ఉన్న వాస్తవాల పట్లా మనం వద్దన్నా అవగాహన పెరుగుతుంది,వాటిని మనం ఆమోదిస్తామా లేదా అన్నది తర్వాతి సంగతి,నావరకూ వయసుతోబాటు అవగాహన పెరిగిందన్నది మాత్రం నిజం.
ఆకారణం వల్లనేకాబోలు ఈమధ్య బ్లాగు రాతలు కూడా బాగా తగ్గించా:)

శ్రీవిద్య said...

చాలా బావుంది. గ్రద్ద ఉదాహరణ ఇన్స్పైరింగ్ గా అనిపించింది.

Naveen Garla said...

బాసు.. మీ బ్లాగుకు కొత్త టెంప్లేట్ అస్సలు బాగలేదు. వ్యాసంకు కనీసం స్క్రీన్ వెడల్పులో 60% ఉంటే బాగుంటుంది. చదువరి మౌస్‌కు ఎంత తక్కువ పని కల్పిస్తే అంత బాగుంటుంది. మీ వ్యాసం చదవటానికి మౌస్‌వీల్‌ ఎన్ని సార్లు బర బరా తిరుగుతుందో తెలుసా?
ఇలాంటి పాపులర్ బ్లాగుల టెంప్లేట్లను సడన్‌‌గా మార్చకపోతేనే బాగుంటుంది. బాగా ఆలోచించి, మాంచి టెంప్లేట్ ఎంచుకోండి.

కత్తి మహేష్ కుమార్ said...

@జ్యోతి: నిజమే, కాకపోతే ఏదో ఒక స్థాయిలో ప్రజలు మారుతూనే ఉన్నారు. అది ఎవరూ కాదనలేని నిజం. మార్పుని కొంత resist చేసినా, ఈ ప్రవాహం ఎవరినీ ఒకేచోట ఉండనివ్వటం లేదులెండి.

@జాన్ హైడ్ కనుమూరి: ధన్యవాదాలు.

@అనామకుడు: కొంత ఎర్రచొక్కాలవారికీ కొంత కాషాయాలకీ కూడా వర్తిస్తుంది తమ్ముడూ!

@కొత్తపాళి: well said Sir!

@బాబాగారూ: ధన్యవాదాలు.

@చివుకుల: మనమూ ఒక గుడ్రం చుట్టుకొద్దాం. మళ్ళీ మొదటికేవచ్చినా ప్రయాణం తప్పదు కదా!

@నిషిగంధ:ధన్యవాదాలు.మళ్ళీ బ్లాగు టెంప్లెట్ మార్చానండోయ్.."a fish apart from crowd...but still in a bowl"

@ప్రసాద్: ధన్యవాదాలు.

@అబ్రకదబ్ర: ఆరోరకం బాగుంది. దీంట్లో కలిపేసుకోవచ్చు. వ్యాసం రాసి పోస్టు చేసినతరువాత దాని నిడివి గమనించాను. కానీ తరువాత రెండు భాగాలు చెయ్యడానికి మనసొప్పలేదు.

@పూర్ణిమ: మొత్తానికి మార్పుని జీవితంలో పాటించేస్తూ మారిపోతున్నారన్నమాట. మీ టపా కోసం ఎదురు చూస్తాను.

@రాజేంద్ర: ఇకనుంచీ మీరు చెప్పిన సలహాలు పాటించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

@శ్రీవిద్య: ధన్యవాదాలు.

@నవీన్ గారు: మార్పు కావాలని ఇలా టెంప్లెట్ మార్చాను. మీరు చెప్పిన స్క్రీన్ వెడల్పుకి అనుగుణంగా మరో టెంప్లెట్ పెట్టాను చూడండి. మీ సలహాకు నా ధన్యవాదాలు.

kRsNa said...

చాల మంచి ఆర్టికల్. The only way that is static in our lives is the CHANGE. Lets welcome it, accept it, adapt it and move on.

Anonymous said...

చాలా మంచి పోస్టు; కాకపోతే నేనిదవరకు చెప్పినట్టు, మీరు వాడినట్టు - ఇదీ ఫైనల్ అని చెప్పలేం; వృత్తం అని అంతకన్నా చెప్పలేం; మనం ఆ చోట్లకి వెళ్దాం. మీతో ప్రయాణం నాకు చాలా బావుందని చెప్పగలను.