Wednesday, August 6, 2008

మా నాయన నేర్పిన మతం

పుట్టుకతో హిందువునే అయినా, ప్రతి సంవత్సరం తిరుపతి కొండెక్కి, తలనీలాలు సమర్పించిన చిరాకుతో బహుశా నా తొమ్మిదవ తరగతిలో అనుకుంటాను మతమంటే విసుకొచ్చేసింది. అర్థంకాని పూజలూ, పూజయ్యేంతవరకూ పస్తులూ, తాళ్ళు కట్టుకోవడాలూ, బొట్లుపెట్టుకోవడాలూ అంటే ‘టీనేజ్ రెబెలియన్’ కలిగిన కాలమది. ఐతే మాత్రం పండగలన్నా,పిండివంటలన్నా, గుంపులు లేని గుళ్ళన్నా, తియ్యటి కొబ్బరిముక్కన్నా ఇప్పటికీ ఆరాధిస్తాను ఆస్వాదిస్తాను. కాకపోతే, దేవుడికీ నాకూ మాత్రం చుక్కెదురే. "If God exists, that's his business" అనుకునే మనస్త్వత్వం నాది.చిన్నప్పటినుంచీ కాస్త తర్కం మరిగిన బుర్ర మనది. అదెక్కడినుంచీ వచ్చిందో నాకే తెలీదు. బాల్యంలో చదివిన బాలమిత్ర, చందమామ కథలనుంచో లేక కాస్త బాల్యానికి బైబై చెప్పేరోజుల్లో చదివిన డిటెక్టివ్ పుస్తకాల మహిమో తెలీదుగానీ, నచ్చని విషయాన్ని తర్కించి తోలుతీస్తేగానీ ఒప్పుకునేవాడ్ని కాదు. ఈనా తర్కానికి మా అమ్మ చిరాకుపడి తలపై ఒకటంటిస్తే, ‘మా నాయన’ మాత్రం ఓపిగ్గా జవాబివ్వడానికి ప్రయత్నించేవారు. ఇక మా అన్నయ్య చాలా సిన్సియర్ గా చెప్పినవి ఫాలో అవ్వడమేతప్ప ప్రశ్నించి ఎరుగడు. ఈ విషయంలోతను ‘రాముడు మంచి బాలుడు’ కంటే సిన్సియరన్నమాట. ఇక మా చెల్లెలు గారాలపట్టికాబట్టి, కన్సెషన్లన్నీ తనకే. ఉపవాసం రోజుకూడా, "పాపం చిన్నపిల్ల" అని ప్రత్యేకంగా పులిహోర తినిపించి మరీ తన చేత ఉపవాసం చేయించేవారు. మనకే ఇక్కడ ఆకలితో నకనకలు, అనవసరపు అనుమానాలూ, తర్కాలూనూ...ఇలా నా తార్కిక ప్రశలు సందించి మా నాయన దగ్గర సమాధానం రాబట్టే ప్రయత్నంలో, నాకు తెలీకుండా ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయింది. మతమంటే ఒక తార్కిక దృక్కోణం ఏర్పడింది. అదేలాగో చెబుదామని ఈ టపా కడుతున్నాను.
నాకు ఊహతెలిసిన తరువాత మతం గురింఛి నేనడిగిన ప్రశ్న దేవుడున్నాడా? అని. ఆ ముక్క అడగ్గానే ఎప్పుడోఒకప్పుడు నేనడుగుతాననే సందేహం మానాయనకు ముందే కలిగినట్లు నవ్వి, "దేవుడున్నాడో లేదో నాకు తెలీదు. ఉంటే మంచిదేగదా?" అన్నారు. "నిజమే కదా !" అనిపించింది. "దేవుడంటే శివుడో విష్ణువో కాదు. అదొక శక్తి అంతే. జీవితానికి అన్వయించి చెప్పాలంటే అదొక ‘నమ్మకం’. మనిషికి తనకన్నా పెద్ద శక్తొకటి తనను కాపాడుకొనుందనే నమ్మకం చాలా అవసరం. అదే దేవుడంటే. ఇప్పుడు చెప్పు, ఉంటే మంచిదా, కాదా?" అన్నారు. ఇక నిజంగా నా దగ్గర ఆ విషయం గురించి అడగడానికేమీ మిగల్లేదు. దేవుడు అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నకాదు. తన వ్యక్తిత్వం మీద, క్షమత మీద ఆధారపడే మనిషికి దేవుడు అవసరం లేదు. తమను తాము కాపాడుకునే సత్తా ఉన్నప్పుడు, ఎదో శక్తి కాపాడుతుందనే ‘నమ్మకం’ యొక్క అవసరం లేదు. ఆక్షణంలో నేను దేవుడ్ని త్యజించాను. కొందరు సరదాగా అంటారు కదా, "I was an atheist till I realized I was GOD" అని. ఆ తర్వాత నేనూ అలాగే ఫీలయ్యాను. Yes, I am God.నేనడిగిన రెండో ముఖ్యమైన ప్రశ్న, పూజలూ పునస్కారాలు అవసరమా? అని. దానికి మా నాయన చెప్పిన సమాధానంతొ నాకు పుజచెయ్యాలనే బూజు ఈ జీవితకాలానికి వదిలిపొయింది. ఆయనంటారు "దేవుడు నమ్మకమైతే, పూజాపునస్కారాలు ఆ నమ్మకాన్ని మళ్ళీమళ్ళీ పెంపొందించుకొవటానికి చేసే సాధన. ఒక practice. అందుకే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తారు. ప్రసాదాలూ, పళ్ళూఫలాలూకూడా అంతే! దేవుడే సృష్టింఛిన ఈ చక్కెర పొంగలీ, పులిహోరా, దద్దోజనం ఆయనకే అర్పించి మనమేదో ఘనకార్యం చేసేసామనుకుంటే ఎలాగా? ఇక మంత్రతంత్రాలంటావా...అవి అర్థం కాకపోతే వాటికీ సినిమా పాటలకీ పెద్ద తేడా లేదు. అర్థంచేసుకుంటే వాటిల్లో భగవంతుణ్ణి పొగిడేవో లేక ఆయన ప్రసాదించిన జీవితాన్ని అమూల్యమనేవే ఉంటాయితప్ప, మాయలూ మంత్రాలతో దేవుడ్ని ప్రత్యక్ష్యం చేసేవికావు" అని. అంతే, ఆ తరువాత నేను పూజకోసం కడుపు మాడ్చుకోవడం, మంత్రాలకు అర్థం తెలీకుండా తలఊపడం మానేసాను. వీలైతే పూజారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. తను అర్థం చెప్పకపోతే పక్కకి తప్పుకుంటాను. నాకు తెలిసిన కాస్తోకూస్తో సంస్కృతంతో కొన్ని మంత్రాలకు అర్థంతీసే ప్రయత్నం చేసానుకూడా. చాలా వరకూ మంత్రాలు దేవుడి గుణగణాలూ, బంధుత్వాలూ లేక ఆయన సౌదర్యాన్నో శక్తినో తెలిజజెప్పేవేతప్ప పనికొచ్చేవి చాలా తక్కువ కనిపించాయి. నా అదృష్టంకొద్దీ నా పెళ్ళి ఆర్యసమాజ్ లో జరగటం వలన పెళ్ళి మంత్రాలకి అర్థాలు చెప్పిమరీ నా పెళ్ళి కానిచ్చారు . అందుకే, "I had most meaningful marriage" అనుకుంటూ ఉంటాను.తన సమాధానాలు విన్నతరువాత నాకు అసలు మా నాయనకు మతం మీద నమ్మకముందా అనే సందేహం వచ్చింది. ఆమాటా ఒక సారి ఆడిగేసాను. "ఇంత తార్కికంగా మతాన్ని చూసే నువ్వు, అమ్మవెంట గుళ్ళు గోపురాలకెందుకు తిరుగుతావు? మమ్మల్ని ప్రతి సంవత్సరం తిరుపతి ఎందుకు తీసుకెళతావు?" అని. దానికాయన ఆశ్చర్యంగా చూసి "నాకు మతంకన్నా కుటుంబ బంధాలు ముఖ్యం. మీ అమ్మకు దేవుడంటే భక్తి. కాబట్టి, తనకోసం గుళ్ళూగోపురాలు చుడతానేతప్ప, దేవుడి కోసం కాదు. ఇక ప్రతి సంవత్సరం తిరుపతంటావా...అదొక ఫ్యామిలీ ఔటింగ్. ప్రతి శలవుల్లో కుటుంబంతోసహా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి. తిరుపతి దగ్గర, తెలిసిన ఊరు,పెద్ద ఖర్చు లేదు పైపెచ్చు పుణ్యంపురుషార్థం రెండూనూ" అని చెప్పి నవ్వారు. ఉండబట్టలేక అక్కసుగా అదిగేసాను, "మరి గుండో?" అని. దానికాయన, సమ్మర్లో గుండును మించిన సుఖంముందంటావా? దానికి తోడు, ఇలా కత్తెరపడిన తలకు వెంట్రుకలు బాగా మొలుస్తాయని చెబుతారు అంతే!" అని మా గుండు రహస్యాన్ని వెళ్ళడించారు. అప్పటి నుండీ నేను గుండు కొట్టుకుంటే ఒట్టు. కాకపోతే ఈ వివరణవల్ల నేను నేర్చుకున్నవి రెండు విషయాలు. మొదటిది, మనం నమ్మకపోయినా కుటుంబంకోసం కొన్ని పనులుచెయ్యకతప్పదు. భగవంతునికన్నా, మానవసంబంధాలు విలువైనవి. మన తర్కంకన్నా, పెళ్ళాంపిల్లల ప్రేమ గొప్పది. రెండో విషయం, ప్రతి ఆరు నెలలకో లేక సంవత్సరానికో ఒకసారి కుటుంబంతోకలిసి ఒక ఔటింగ్/హాలిడే వెళ్ళడం. ఇవిరెండూ ఇప్పుడు నా జీవితంలో ముఖ్యమైన భాగాలు.ఇంత జ్ఞానోదయమైనా అప్పుడప్పుడూ కొన్ని చిన్నవీ,చిలిపివీ అయిన ప్రశలు అడుగుతూనే ఉండేవాడిని. ఒక సారి, "దేవుడికి టెంకాయే ఎందుకు కొట్టాలి? అది దేవుడికి ఇష్టమనా లేక ఆయన ఇదే కావాలని కోరాడా?" అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, "అన్నింటినీ సృష్టించిన దేవుడు తనకు ఇది కావాలి అని ఎప్పుడూ కోరడు. టెంకాయ మానవుడి అహానికి గుర్తు(బయటనున్న టెంక).దాన్ని పగలగొడితేగానీ లోపలున్న ఆత్మ(మెత్తటి కొబ్బరి) సాక్షాత్కారమవదు. అహాన్ని పగులగొట్టి దేవుడికి మన ఆత్మల్ని అర్పించడమే దీని పరమార్థం" చెపారు. ఇప్పటికీ నేను కొబ్బరికాయ కొట్టాల్సొస్తే గుర్తుచేసుకునేది ‘నా అహం (ego) తగ్గిందా, లేదా?’ అని మాత్రమే.ఇలా మా నాయన నాకు విశ్వరూపదర్శనమిచ్చి, నా మతాన్ని మలచారు. అందుకు మా నాన్నకి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మూఢాచారాలనుంచీ, అర్థరహిత మంత్రాలనుంచీ, ఉబుసుపోకచేసే పూజాపునస్కారాలనుంచీ విముక్తి ప్రసాదించిన నాతండ్రికి ధన్యుడిని. తార్కికత్వానికి మానవత్వం నేర్పి, మానవసంబంధాల విలువను తెలియజెప్పిన జనకునికి నేను సర్వదా కృతజ్ఞుడిని .అందుకే ఇప్పుడు, తర్కంలేని విలువా, మానవత్వం లేని మతం నిరర్థకం అని మనస్ఫూర్తిగా నమ్ముతాను.


****

19 comments:

జ్యోతి said...

hmmmm..

బాగు బాగు.. పెద్దల మాట చద్దిమూట.

గీతాచార్య said...

మీరీ సారి ఈ రూట్ లోకి వచ్చారా? బాగుంది. ఈవెన్ ఇఫ్ ఐ కాంట్ అగ్రీ విత్ యు ఇన్ సం పాయింట్స్, మోస్ట్ ఆఫ్ యువర్ వ్యూస్ ఆర్ గుడ్.

"ఇప్పటికీ నేను కొబ్బరికాయ కొట్టాల్సొస్తే గుర్తుచేసుకునేది ‘నా అహం (ego) తగ్గిందా, లేదా?’ అని మాత్రమే."

ఈ మాట చాలా బాగుంది.

"అందుకే ఇప్పుడు, తర్కంలేని విలువా, మానవత్వం లేని మతం నిరర్థకం అని మనస్ఫూర్తిగా నమ్ముతాను."

It is one of the best lines I read in the telugu blogs.

Ayn Rand తన ఐడియల్ మాన్ గురించి చెపుతూ అంటుంది... 'Reason as his only absolute'. అదెప్పుడూ మనిషికి చాలా అవసరం. దశావతారం లో కమల్ అన్నట్లు 'దేవుడుంటే చాలా బాగుంటుంది.'

This is my rational side. But I follow the religious principles as strict as possible. But the condition is 'after I understand with my logic.' నా రీసన్ కి అందినంత వరకే ఏపనైనా.

otherwise, I won't be I.

మీ బ్లాగులు మెదడుకి మేత లాగా ఉన్నాయి. అసలు ఎలా వ్రాయ గలుగుతున్నారలా?

గీతాచార్య said...

మానవత్వం గురించి మంచి విషయాలు చెప్పారు. " మనం నమ్మకపోయినా కుటుంబంకోసం కొన్ని పనులుచెయ్యకతప్పదు. భగవంతునికన్నా, మానవసంబంధాలు విలువైనవి. మన తర్కంకన్నా, పెళ్ళాంపిల్లల ప్రేమ గొప్పది. రెండో విషయం, ప్రతి ఆరు నెలలకో లేక సంవత్సరానికో ఒకసారి కుటుంబంతోకలిసి ఒక ఔటింగ్/హాలిడే వెళ్ళడం. ఇవిరెండూ ఇప్పుడు నా జీవితంలో ముఖ్యమైన భాగాలు."

Very good.

బొల్లోజు బాబా said...

i feel you hit the nail perfectly.
bollojubaba

saisahithi said...

మహేష్ గారు ,
మంచి టపాలు అందించడమ్లో మీకు మీరే సాటి.
ఈ టపాలో..
కొన్ని అర్ధం కాని విషయాలు ఏమంటే..
* మీ నాయన గారు మతాన్ని తు.చ. తప్పకుండా ఫాలో అవుతూ మీకు తార్కిక మయిన సమాధానాలు ఇవ్వడం ..నిజానికి మీరడిగిన ప్రశ్న లన్నిటికీ ఆధ్యాత్మిక కారణాలు ఆయనకి తెలియవు అని నేననుకోను. కొన్నిటిని దాటవేయడం లో..బహుసా ఆనాటి మీ మానశిక పరిణితి కి లోబడి వుండవచ్చు.
* దే్వుడంటే నమ్మకమన్న ఆయన తిరుపతి వెళ్ళడం దేవుడి కోసం కాదు మరెందుకో.. అనడం.
మతాన్ని నమ్మితే..ఆ మతం లో వున్న ఆచారాల్ని నమ్మాలి. వీటితో అను సంధానమయిన సంస్కృతిని నమ్మాలి. I have noted from your previous posts that you have boundless faith on our culture and traditions.
I donot understand why certain people (especially males members)expose their passive disobedience towards certain faiths while the other members of their family actively follow customs.
తర్కం తెలియనంత మాత్రాన విలువలకి విలువే లేదనడం సమంజసమా ?
No religion teaches hatred. Every religion teaches love, humanity, patience etc.
మానవత్వం బోధించని ఏ మతమయినా వుందా?
మీ టపాలు thought provoking గా వుంటాయిస్
సాయి సాహితి

Purnima said...

సూపర్ పోస్ట్!! ఏవో పనుల్లో పడి, ఆలస్యం చేశా చదవడానికి. మీకు నాకు చాలా పోలికలున్నాయన్న మాట!! మనకీ పూజలు పునస్కారాలు పెద్దగా నచ్చవు!! అమ్మ కోసమే అన్నీ!!

పెదరాయ్డు said...

దేవుడన్నది నమ్మకం. జనులకు మంచిని చెప్పడానికి ఉపకరించే ఒక మాద్యమం. ఇక మన మంత్రాలు, యఙ్ఞ యాగాదుల విషయానికి వస్తే కొన్నిటికి సాంకేతిక విలువలు ఉన్నాయి. మరి మిగతా వాటిగురించి నాకు తెలియదు. మన వేదాలను క్షుణ్ణంగా పరిశోధిస్తే ఎమన్నా తెలుస్తుందేమో..

మన సుప్రీం కోర్టు కూడా దేవుడిని నమ్ముతుందండోయ్.. మన దేశాన్ని ఆయన కూడా రక్షించ లేడని :)

కొత్త పాళీ said...

మంచి విషయాలు, రాయడం కూడా చాలా బాగా రాశారు.
పైన పెదరాయుడు గారి చివరి వాక్యం, ఆయన ఎందుకు రాశారో గానీ, చాలా నవ్వు తెప్పించింది.
ప్రశ్నలు అడగటం మంచి పనే. తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. కానీ సమాధానాలు అందరికీ తెలీవు, తెలిసినా చెప్పడం చేత కాకపోవచ్చు. మీ నాయన గారు మీకు చెప్పిన సమాధానాలు ఒక చిన్నపిల్లాడు లేక ఒక టీనేజరు అడిగే ప్రశ్నలని సంతృప్తి పరిచేవి మాత్రమే. ఇంతకంటే లోతైన జిజ్ఞాస కలిగినప్పుడు .. అప్పుడు అసలు పండగ మొదలవుతుంది.

అదలా ఉండగా, మతం, భక్తీ వీటికి సంబంధించిన కొన్ని విషయాలు బహు ఆనంద దాయకంగా ఉంటాయి. ఇంచుమించు క్లాసికల్ లలిత కళలు (మన దేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ) అన్నీ మత గాధలతో ప్రాభావితమైనవే. ఒక మదురై దేవాలయం, ఒక సిస్టీణ్ ఛాపెల్, ఒక జుమ్మా మసీదు, ఒక బాంగారు ఆలయం, ఒక త్యాగరాజ కృతి, ఒక అన్నమయ్య పదం, ఒక రవి వర్మ బొమ్మ ..

Raj said...

నా పూజలు మాత్రం తర్వాత వచ్చే ప్రసాదం కోసమే.

కత్తి మహేష్ కుమార్ said...

@జ్యోతి:పెద్దలు చెప్పిన అన్నిమాటలూ చద్దిమూటలు కావులెండి! ధన్యవాదాలు.

@గీతాచార్య: ప్రశ్నిస్తూ,ఆలోచిస్తూ, కారణాల్ని తరచి చూసుకుంటూ జీవితానికి తగిన విలువనిచ్చి బ్రతకడం కనీస మానవధర్మంగా నేను భావిస్తాను.అప్పుడే జీవితాన్ని ఆస్వాదించడం కుదురుతుంది. అందుకే నేను అనుభవించడంతో పాటూ ఆలోచిస్తాను.అక్కడి నుంచీ వచ్చేవే ఈ టపాలు.అందుకేనేమో కాస్త మెదడికి మేతలాగా అనిపించుండొచ్చు.

@బొల్లోజు బాబా: ధన్యవాదాలు బాబా గారూ.మీ ప్రోస్తాహం సదా నా వెంట ఉండాలి. దానితోపాటూ...విశ్లేషణ కూడా నండోయ్!

@సాయి సాహితి: మా నాన్నగారు మతాన్ని తు.చ. తప్పకుండాపాటిస్తారని నేననుకోను.తను పాటించేదాన్ని ఇంగ్లీషులో చెప్పాలంటే,"religion of convenience" అనుకోవచ్చు. పూజ చేసిన తరువాతే తినాలి అని మతం చెబితే,ఆకలితో పూజచేసినా దృష్టి దేవుడిమీదకాక నైవేద్యాలమీద ఉంటుందికాబట్టి, తినేసి పూజచెయ్యడం ఉత్తమం అంటారు. అంటే, మతాన్ని మూఢంగా నమ్మక నిత్యజీవితానికి అన్వయించుకుని బ్రతుకుతారన్నమాట.

ఇక తిరుపతి వెళ్ళడం మతమని మీరు భావించినా,చిత్తూరు జిల్లావాళ్ళమైన మాకు తిరుమలని మించిన హాలిడే హిల్ స్టేషనుంటుందా చెప్పండి! అందుకే దాన్ని "పుణ్యం పురుషార్థం" అని మా నాన్నగారనుకొని ఉండొచ్చు. నాకూ అదే చెప్పారు.

నావరకూ మతం అనేది మనిషి పురోగతికి తోడ్పడాలి. అలాంటి విషయాలు ఎక్కడున్నా నాకు అంగీకారమే. అది ఏమతమైనా నాకు పెద్ద తేడాలేదు. కాకపోతే నేను అచారాల్నీ,సంస్కృతిలోని కొన్ని సాంప్రదాయాల్నీ ప్రశ్నిస్తాను. నాకు సంతృప్తికరమైన సమాధానం దొరికితే ఆచరిస్తాను.మూఢవిశ్వాసాలను మాత్రం ఖండిస్తాను. అదే ‘నా మతం’.

తార్కికమైన ఒప్పుకోలు లేకుంటే నువ్వు నమ్మే విలువ (మూఢ)నమ్మకమైపోతుంది అని నేననుకుంటాను.నమ్మకం మూఢనమ్మకంగా మారడానికి ఒక మతకల్లోలం చాలు. అదే తర్కాఅధారితమైతే ఆవేశాలకు అతీతంగా పునరాలోచనకూ,పునర్నిర్వచనకూ అవకాశం ఉంది.అందుకే తర్కం లేని విలువ ప్రమాదకరం.

ఏమతం హింసను ప్రభోధించదు. ఈ విషయం హిందువులకూ, ముస్లింలకూ తెలియకనా ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి? మతం వేరుగా దానిపట్ల నమ్మకం వేరుగా. దాన్ని ఆచరించడం వేరుగా వర్థిల్లుతోంది.అందుకే మానవత్వాన్ని ప్రభోధించేది మాత్రమేకాదు,ఆచరించే మనుషులున్న మతమే నాకు కావాలి.

@పూర్ణిమ: సాధారణంగా నా టపాలకు కామెంటుతో శ్రీకారం చుట్టేది నువ్వే, ఈ సారి I missed you too. ధన్యవాదాలు. మొత్తానికి మనకు సిమిలారిటీ ఉందన్నమాట.

@పెదరాయ్డు: మతరహితుడైన దేవుడు నాకు ఆమోదయోగ్యమే. అతన్ని నేను పూజించకున్నా కనీసం గౌరవిస్తానేమో!యజ్ఞయాగాదుల సాంకేతికతను తెలియజెబితే నేను సదావాటిని తెలుసుకోవడానికి సిద్దమే.

@కొత్తపాళీ గారూ: మా నాన్నగారు నాకు basics చేప్పారు. ఆ తరువాత కాలంలో నేను శోధించి తెలుసుకున్నవి రాయాలంటే,అదొక పుస్తకమైనా కావచ్చు.నిజంగా ఈ ఆలోచన ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. "మతంతో నా ప్రయోగాలు" అని ఒక పుస్తకం రాసెయ్యాలనుంది!!!

లలితకళకు చాలావరకూ మతంలోని మానవత్వాన్ని పుణికిపుచ్చుకున్నాయని నాకూ అనిపిస్తుంది. అలాగే మతానికీ,పూజకూ సంబంధించినకొన్ని విధులు మనసుకు ఆహ్లాదాన్ని కల్పిస్తాయనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. లేపాక్షిలో చదివేటప్పుడు ఆలయానికి ప్రతివారం కేవలం ప్రశాంతంగా కూర్చోవడానికి వెళ్ళేవాడిని. అలాగే ధూపదీపాల సుగంధం,ప్రసాదాల రుచికి ఏవిసాటి?

@రాజ్: నేనూ కొంతవరకూ ప్రసాద ప్రేమికుడినే!

క్రాంతి కుమార్ మలినేని said...

మహేష్ గారు ,

"దేవుడంటే శివుడో విష్ణువో కాదు. అదొక శక్తి అంతే. జీవితానికి అన్వయించి చెప్పాలంటే అదొక ‘నమ్మకం’. మనిషికి తనకన్నా పెద్ద శక్తొకటి తనను కాపాడుకొనుందనే నమ్మకం చాలా అవసరం. అదే దేవుడంటే. ఇప్పుడు చెప్పు, ఉంటే మంచిదా, కాదా?"
నేను నమ్మే ఒకే ఒక విషయం ఇదండి.ఎందుకో తెలీదు కానీ నేను ఆ కనపడని పవర్ ని నమ్ముతాను.కానీ అదే దేవుడంటే ఒప్పుకోలేను.అమ్మకోసం గుడికి వెల్లినా అమ్మ దేవుడికి వెయ్యమనే డబ్బులు నేను ఖచ్చితంగా బయట అడుక్కునే వాడికే వేస్తాను.ఎందుకో ఇది చదూతుంటే నన్ను నేను చదువుకున్నట్టుంది.
మీ డిఫరెంట్ ఆలోచనలకు హ్యాట్సాఫ్.రాసిన విషయం మీద రాయకుండా భలే రాస్తారండి.

దేవన అనంతం said...

నేను కూడా బాల్యానికి గుడ్ బై చెప్పే రోజుల్లో బాలమిత్ర నుంచి డిటెక్టివ్ పుస్తకాల కు మారిపోయాను. మీకు ధన్య వాదాలు మళ్ళి నాకు నా బాల్యాన్ని గుర్తు చేసారు. మంచి వ్యాసం. ఆసాంతము ఆసక్తి గా చదివించింది.

రాదిక బుజ్జి said...

దేవుడిని నమ్ముతాను,
కాని పూజలు,వ్రతాలకు దూరం,
టెంకాయ గురించి వివరణ బాగుంది

saisahithi said...

మహేష్ గారు,
మంచి స్పందనకు ధన్యవాదములు...
తార్కికమైన ఒప్పుకోలు లేకుంటే విలువ నమ్మకం అయి పోతుంది... నిజమే ఈ నమ్మకం వలన నష్ట మేమీ లేదని మీ నాయన గారన్న మాటలో తప్పేముందని పిస్తుంది.
మీరన్నట్లు మన సత్తామీద మనకు నమ్మకముంటే...నిజమే నాకూ ఇలానే చాలాసార్లు అనిపించింది. But at times when our life becomes dreary and all our efforts ended unfruitful..this faith will never fails to strengthen our spirits and lead towards success..So is it wrong to have faith?
ఇక నమ్మకం ..మూఢ నమ్మకమంటారా..
It depends upon how you look things..అనే కొటేషను గుర్తొస్తోంది. నమ్మకం ..మూఢ నమ్మకం గామారిందంటే అది వారి మానశికఅపరిపక్వత,అవగాహనారాహిత్యం అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని నా భావన.
నమ్మే వారందరు మూఢ నమ్మకస్థులు కారనుకుంటాను.
మరి మతకల్లోలాలు..?
మతాన్ని విశ్వశించేవారిలో ఎంత శాతం
మత మౌఢ్యులుగా(religious fanatics)
మారుతున్నారు...చాలా స్వల్పం..వీరు సృష్టించే కల్లోలాలలో అధిక శాతం స్వార్ధ రాజకీయ కలాపాలు కావంటారా?
ఒకరి అస్థి త్వాన్ని మరొకరికి ప్రదర్శించే బల పరీక్షలు అనడమ్లో సందేహ మేమైనా ఉందా?
ఒకరిపై ఒకరి ఆధిపత్యపు ఆరాటమంటే కాదనగలమా?
ఇంత నేపధ్యం ఉన్న కల్లోలాలకి మతమే ప్రధాన హేతువనడం ఎంతవరకు సమంజసం?
మతాన్ని ఒక ఆయుధంగా వాడుతున్న అంశం ఆధారంగా దాదాపు 20 సం.రాల క్రితమే తీసిన బొంబాయి సినిమాలో కధానాయకుడు అడిగిన ప్రశ్నలని మనం ఎంత మంది fanatics కి సంధించాం ?
వేలుకి పుండు అయింది కదాని కాలుని కోసేసుకోం కదా?
Fanaticism అనేది ఒక మానశిక వ్యాధి. దానికి మానవత్వం అనే మందు పట్టించ డానికి మన బ్లాగుల్లో విస్తృత చర్చలు జరుపుదాం.
మీ నుండి మరిన్నిమంచి టపాలు ఆశిస్తూ...

మీనాక్షి said...

మహేశ్ గారు..
అసలు మీ టపాలు చదివినప్పుడల్లా ఏమని కామెంట్ రాయాలో అర్దం కాదు.మంచి విషాయాలు రాస్తారు.
మీ నాన్న గారు చెప్పిన చాలా విషయాలు నాకు చాలా నచ్చాయి.
దేవుడు ఉన్నాడా అని నాకు చాలా సార్లు అనుమానం వచ్చింది.
అమ్మని అడిగితే దేవుడు ఉన్నాడో లేడో కాని ఏదో ఒక శక్తి మాత్రం ఉంది.
అదే దేవుడు అని చెప్పింది.మనం వేడుకోగానే దేవుడు వరాలు ఇవ్వడు.మనం చేయాల్సింది చేసి అప్పుడు ఫలితాన్ని ఆశించాలి అని చెప్పింది అమ్మ.నేను ఇప్పటికి ఇది నిజమనె నమ్ముతాను.ఏదో ఒక షక్తి ఉందని.ఇక గుల్లల్లొ హుండి లో పైసలు వేయడం అంటే నాకెందుకో నచ్చదు.ఇక గుల్లకు గోపురాలకు తిరగడం,పుష్కరాలకు వెళ్ళడం అంటె సరదానే.కానీ లైన్ లో నిలబడడం అంటేనే చిరాకు.ఇక ఉపవాసాలు అంటారా.వామ్మో.ఒక దిక్కు బొజ్జలో ఏనుగులు పరుగెత్తుతుంటే ఆ మంత్రాలు,తతంత్రాలు వినాలి.ఒక్కముక్క అర్దమై చావదు.అవి తప్పా అన్నీ ఓకే.ప్రసాదం,తీర్థం,పూజా వాతావరణం,సందడి,హాడావుడి..
.................................
నిజంగానే మీ నాన్న గారికి మీరు క్రుతజ్ఞులే.
ఇంత మంచి విషయాలు చెప్పినందుకు.నేను కూడా మీకు క్రుతజ్ఞురాలినే.
ఇవన్నీ మాతో పంచుకున్నందుకు.

Anonymous said...

భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి L.K.G ఐతే జ్ఞానం డిగ్రీ లాంటిది. L.K.G చదువే విసుగొచ్చి పుస్తకాలు గిరాటేస్తే డిగ్రీ పూర్తిచేసేదెలా? జీవిత పరమార్థం తెలిసేదెలా?
>>నేను కొబ్బరికాయ కొట్టాల్సొస్తే గుర్తుచేసుకునేది ‘నా అహం (ego) తగ్గిందా, లేదా?’
మంచి ఆలోచన. కానీ ఎలా తగ్గించుకుంటారు? అదే జ్ఞానమంటే. భక్తిలో పాపం చెయ్యరంతే. పుణ్యం జమ అవడం ఉండదు. ఈ విషయంలో ఇంకా సూక్షంలోకి పోకుండా ఇక్కడితో ఆపుతా... మీరు ఏది నమ్మినా నమ్మకపోయినా జీవితంలో సంతోషంగా ఉన్నారు, అది ముఖ్యం.

కత్తి మహేష్ కుమార్ said...

@నవీన్; జ్ఞానసమపార్జనకి భక్తి కంటే,తర్కం సూటైన దారి అని నా నమ్మకం.ఎందుకంటే, భక్తిలో చాలామంది కేవలం విధివిధానాలకు ప్రాముఖ్యతనిచ్చి అసలు విషయాల్ని మర్చిపోతారు.అందుకే తార్కికంగా జ్ఞానం సంపాదించడానికి నేను ప్రాముఖ్యతనిస్తాను.నా జ్ఞానసమపార్జన LKG తో అగిపోయుంటే ఇంత చర్చజరిగేదేకాదు.అంటే, నేను జీవిత పరమార్ధాన్ని తెలుసుకున్ననని కాదుగానీ నా దారిలో నేనున్నాను.

@మీనాక్షి: దన్యవాదాలు.నీ పాలసీకూడా బాగుంది.

@సాయి సాహితి గారు:మతకల్లోలాల నేపధ్యంలో Fanaticism అనేది మానసిక వ్యాధి కాదు. ఆ పరిస్థితుల్లో ఎవరేంచేస్తున్నారో తెలీని ఉన్మాదం.Those are the moments when "blind faith" turns in to fanaticism. అందుకే తర్కసహితమైన విలువ కావాలంటున్నాను.

నిజానికి మితిమీరిన సగంజ్ఞానం కలిగిన హిందువులు మనలో ఎక్కువగా ఉన్నారు. పూజని భక్తి అని, ఆచారాన్ని సంస్కృతి అనుకునే ఇలాంటివారు, తమ అస్థిత్వాన్ని నిరూపించుకోవడానికి "అతివాదులు"గా అవతరిస్తుంటారు. వారే fanatics.వారు ఎప్పటికీ సమాజానికి ప్రమాదకరంగానే తయారౌతారు.

Dream boy said...

dear mahesh gaaru mee tapa chaalaa bugundi taarkikanga aalochinche vaallaki amodha yogyangas undhi.

Arao Sr said...

అందరూ అన్నీ చెప్పారు.. చాలా మంచిది, తర్కించి తేల్చడం మంచిదే.. కానీ మీరిదివరకు చూసిన దానికంటే మీ అనుభవాలకతీతంగా సూక్ష్మంలో మీరాశించే రీతిగా ఏదో ఒక స్పష్టమైన రీతిలో దైవం ప్రత్యక్షమైతే ఏమంటారు..? ఆ సమయం సందర్భం తప్పక రానే వస్తుందిలే..