Saturday, August 16, 2008

తీవ్రవాదానికి లాజిక్ దొరికితే?

ఈ మధ్య బెంగుళూరు, అహ్మదాబాదుల్లో జరిగిన బాంబుదాడుల తరువాత ప్రముఖ పత్రికలన్నీ హోరాహోరీగా ఒక వారంపాటూ బాధ్యతగా తమ కలాలు ఘుళిపించి ఇప్పుడు మరో విషయం కోసం తమ కలాలు పదునుపెడుతున్నాయి. మన తెలుగు టివీ ఛానళ్ళు ఆల్రెడీ వర్షం, వరదల వెనక, మోకాళ్ళలోతు నీళ్ళలో నిలబడి మరీ తమ కధనాల్ని వినిపించేస్తున్నాయి. అంటే, ప్రస్తుతానికి తీవ్రదాద దాడుల అధ్యాయం మన జనస్మృతినుండీ మరొక్కసారి పక్కకి తప్పుకున్నదన్నమాట.



ఈ హోరాహోరీలో అక్కడక్కడా పత్రికల్లో చాలా మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ, పరిశీలనలూ చదివాను. వారంతా ఏక కంఠంతో అంగీకరించిన విషయం ఏమిటంటే, "భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న దాడులకు పాకిస్థాన్ ప్రమేయంకన్నా, భారతీయ ముస్లింలలో పెరుగుతున్న అసంతృప్తి,అసహనం, ద్వేషం ముఖ్యకారణాలుగా కనిపిస్తున్నాయి" అని. నిజమే కావచ్చు. పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చినా, ఈ తీవ్రవాదులు మనవాళ్ళే! బాంబు చెయ్యడం పాకిస్తాన్ నేర్పినా, పెట్టింది భారతీయుడే, పెట్టబడిందీ భారతదేశంలోనే. ఈ నేపధ్యంలో తీవ్రవాదాన్ని ఎలా అరికట్టాలి అనే అత్యవసర ఆలోచనతోపాటూ, alienate అయిపోతున్న ముస్లిం యువతని అర్థంచేసుకుని, సమాధానాలు వెదకడం కూడా ఒక అవసరం అని నా భావన.



ముస్లిం యువత అని నేను చెప్పడానికి ఒక నిర్ధిష్టమైన కారణముంది. ఇప్పటివరకూ పట్టుబడిన తీవ్రవాదులందరూ యువకులే కావడం ఒక కారణమైతే, ఇప్పుడున్న ముస్లిం పెద్దలు, వృద్దులూ,రాజకీయనాయకులూ వీరికి మార్గదర్శకం ఇవ్వలేకపోవడం మరోకారణం. ముస్లిం సముదాయంలోకూడా ఈ "generation gap" తీవ్రంగా ఉండి, ఒకరినొకరు అపనమ్మకంగా చూస్తున్నారా? ఈ కారణంగానే పరిస్థితులు చేయిదాటిపోయాయా? అనేది ఒక సందేహమైతే, మరోటి ముస్లిం రాజకీయ నేతలనుకూడా ఈ ముస్లింయువత తమ శత్రువులుగా చూసి, సమస్యకు వీరూ ఒక కారణం అనుకుంటున్నారా? అనేది మరో అనుమానం.



పై ఆలోచనల నేపధ్యంలో జెనరేషన్ గ్యాప్ ని చూపిస్తూ ఒక ముస్లిం యువకుడూ, ఒక వృద్ధుడి మధ్యన తీవ్రవాదం గురించి ఒక సైద్ధాంతిక సంభాషణ జరిగితే ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాను.



యువకుడు: మీతరంవాళ్ళు ఘోరంగా విఫలమైపోయారు. మతంకోసం, మతంలోని ప్రజలకోసం ఇప్పటివరకూ ఏమీ చెయ్యలేకపోయారు.

వృద్ధుడు: ఏం చెయ్యమంటావ్? ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో డబ్బు, శక్తీ ఉన్నవాళ్ళు తప్ప, అందరూ అన్యాయానికి గురవుతున్నవాళ్ళే. ముస్లింలు అందులో ఒక భాగం మాత్రమే. ఈ కారణాన్ని చూపించి, మాకుమాత్రమే అన్యాయం జరుగుతోందని తిరుగుబాటు చెయ్యమంటావా?

యువకుడు: మీ వాదనలో నాకు చేతకానితనం, నపుంసకత్వం కనబడుతున్నాయి. అసలు ఇస్లాంపట్ల ఉండాల్సిన కనీస నిబద్ధత కొరవడినట్లనిపిస్తోంది. అన్యాయానికి ఎదురొడ్డిపోరాడటం ఒక ముస్లింగా అది మీ బాధ్యత. ఖురాన్ అసలు అన్యాయాన్ని సహించొద్దని చెప్పిందని మీకు తెలియదా?

వృద్ధుడు: నీ మాటల్లో నాకు ప్రతీకారం కనబడుతోందేతప్ప మరోటికాదు. ఈ దారిలో ఆలోచిస్తే మొత్తం ముస్లిం జాతికే నష్టంవాటిల్లుతుంది. ముస్లింలకు నిజంగా నువ్వు న్యాయం చెయ్యాలనుకుంటే వారిని విద్యావంతుల్ని చెయ్యి. అర్థికంగా ఎదగడానికి సహాయపడు. సామాజికంగా ప్రగతి సాధించడానికి చేయూతనివ్వు. శాంతి స్థాపనకు పూనుకో!

యువకుడు: గత 60 సంవత్సరాలుగా శాంతీయుతంగా మీరు ముస్లింలకోసం సాధించిన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ప్రగతి ఎంత? అంకెలు తీసుకుంటే మన మతానికి ఎక్కడైనా న్యాయం జరిగినట్లు నిరూపించగలవా? మీ పంధానే సరైనదైతే ఇవన్నీ చెయ్యకుండా మిమ్మల్నాపిందెవరు? ముస్లింలను రెండవతరగతి పౌరులుగా తీర్చిదిద్దిందెవరు? అందుకే నేను మార్పును కోరుతున్నాను. దాన్ని మీరు ప్రతీకారమన్నా, హింసాత్మకం అన్నా నా భావనలో మార్పుండదు.

వృద్ధుడు: ఇలా చేస్తే చట్ట వ్యతిరేకం, దేశద్రోహం అవుతుంది.

యువకుడు: ఏ చట్టాన్ని నేను గౌరవించాలి? 1993 అల్లర్లలో రెఢ్ హ్యాండెడ్ గా పట్టుబడిన హిందు మతవాద నేతల్ని తప్పించి, దానికి ప్రతీకారంగా జరిగిన బాంబ్ బ్లాస్ట్ తరువాత, కేవలం అనుమానం పేరుతో కొన్ని వందలమంది ముస్లిం యువకుల్ని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన ఈ చట్టాన్నా నేను గౌరవించాలి?
గుజరాత్ అల్లర్లలో ముస్లింలను ఊచకోతకోస్తుంటే, పక్కనే నిల్చుని తమాషా చూసిన ఈ చట్టాన్నా నేను గౌరవించాలి?

వృద్ధుడు:అన్యాయం జరిగినమాట వాస్తవం. కానీ, నువ్వు చెప్పిన అన్ని విషయాలపైనా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎంక్వైరీ కమిషన్లు విచారణ చేస్తున్నాయి. అవన్నీ పూర్తయితేగానీ ముస్లింలకు సరైన న్యాయం జరగదు. మనం సహనంతో వాటికోసం ఎదురు చూడాలి.

యువకుడు: అధికారం లేని కమిషన్లూ, అస్థిత్వంలేని వాటి రిపోర్టులూ...! ఇప్పటివరకూ ఏంజరిగింది? కృష్ణ కమిషన్, నానావతి కమిషన్ రిపోర్టులెక్కడున్నాయి? వారు వెలికితీసిన నిజాలూ, తెలియజెప్పిన సాక్షాలూ ఎక్కడున్నాయి? కోర్టులు వాటిని ఎందుకు ఒప్పుకోవడం లేదు. కేసులింకా ఎందుకు సాగదీస్తున్నారు. ప్రభుత్వంలో పార్టీలు మారితే పాలసీలు మారే ఈ దేశంలో, అన్యాయం జరిగినవాళ్ళకి న్యాయం నిజంగా జరుగుతొందా ఎక్కడైనా?

వృద్ధుడు: అందుకని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావా?

యువకుడు: మరి వేరేదారి?

వృద్ధుడు: మనది ప్రజాస్వామ్యం. ఓటుద్వారా నాయకుల్నెన్నుకునే అధికారం మనకున్నంతవరకూ ఆ దారిలోనే మనం మన సమస్యలకు సమాధానం వెతకాలి.

యువకుడు: ఈ హిందూ మతతత్వ రాజకీయ నేతలతోపాటూ, ఈ ముస్లిం రాజకీయ నాయకుల్నికూడా ఒకేసారి మట్టుబెట్టాలి. స్వార్థం నిండిన ఈ నాయకులు ఎక్కడున్నా తమ సంచులు నింపుకుంటున్నారేగానీ,తమ ప్రజలకోసం ఏ పనీ చెయ్యటం లేదు. పైపెచ్చు, ఈ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని తమ పబ్బాలు గడుపుకుంటున్నారంతే!

వృద్ధుడు: మారుతున్న భారతదేశ ఆర్థిక జగత్తులో మన ముస్లింల అభివృద్ధికీ చోటుంది. ఈ తీవ్రవాదం వలన ముస్లింలకు జరిగేది నష్టమేతప్ప లాభమేమీ ఉండదు.

యువకుడు: హైటెక్ భారతీయ సక్సెస్ కథలో ముస్లింపాత్రలెన్ని? ఒక్క ముస్లిం పేరు ఈ అద్వితీయ అభివృద్ధి నాటకంలో కనబడుతోందా? మరి ఇప్పటివరకూ జరగని ఈ చిత్రం హఠాత్తుగా జరిగిపోతుందని నన్ను నమ్మనంటావా? నిజానికి ముస్లింలను ఈ దారిలో భాగస్తుల్ని చెయ్యాలన్న ఆలోచనకూడా ఎవరికీ లేదు. అందుకే కమిషన్లు మనకూ రిజర్వేషన్లు హిందువులకూ కల్పిస్తున్నారు.

వృద్ధుడు: మనదేశంలో మనకు అన్యాయం జరుగుతున్నంత మాత్రానా, శత్రుదేశం సహాయంతో మన దేశంలోనే అల్లర్లు సృష్టించడం దీనికి సమాధానమా?

యువకుడు: ఇది సమాధానం కాదు. కానీ మా సహనాన్ని తెలియజెప్పడానికి ఒక మార్గం మాత్రమే. ఇక పాకిస్తానంటావా... మాకు వారికన్నా, వారికిప్పుడు మా అవసరం చాలా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఈ తీవ్రవాదానికి కారణం అని చెప్పడం మమ్మల్ని అవమానించడమే అవుతుంది. అలా ఒకవేళ భారత ప్రభుత్వం అనుకుంటే, అది వారి మూర్ఖత్వమో లేక నిజమైన సమస్యని అర్థం చేసుకుని తీర్చలేని అసమర్ధతో మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

వృద్ధుడు: ఈ పంధా వలన ముస్లింలకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతుందని నీకనిపించడం లేదా?

యువకుడు: ఒక వేళ తాత్కాలికంగా అన్యాయం జరిగినా, కనీసం ఇప్పటివరకూ ఉన్న మీలాంటివారి దాస్య ప్రవృత్తితొలగి ఒక సగౌరవ ముస్లిం సముదాయం త్వరలో ఏర్పడుతుందని నా ప్రఘాడ నమ్మకం. అన్యాయాన్ని సహించడంకన్నా, కనీసం పోరాడాలనే ఇస్లాం మత సిద్ధాంతం నాకు ఆదర్శం.

వృద్ధుడు: అందుకు హింస వాడాలని ఖురాన్ చెప్పలేదుకదా! మరి మీరు ఇలా వేలమంది ప్రాణాలు తీస్తే అల్లా మిమ్మల్ని క్షమిస్తాడా?

యువకుడు: బలవంతుడు అణచివేస్తే, బలహీనుడు తిరగబడక తప్పదు. మెజారిటీ మతం వారు తలబిరుసుగా ప్రవర్తిస్తే, మైనారిటీ హింసతో సమాధానం చెప్పకతప్పదు. ఇది తప్ప మరో దారిలేదు. మార్పుకు మరో మార్గం ప్రస్తుతపరిస్థితుల్లో మాకు లేదు.


ప్రస్తుత కాలంలో తీవ్రవాదానికి ఉపయోగపడుతున్న ముస్లిం యువతలోని అసహనానికీ, అపనమ్మకానికీ పై సంవాదం ఒక ఉదాహరణ మాత్రమే. మనం చట్టం, న్యాయాల పరిధిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన మార్పులు ముస్లిం సముదాయంలో తీసుకురానంతకాలం ఎక్కడో ఒక దగ్గర కొందరు ముస్లిం యువకులు ఈ దారినెంచుకోవడం మానరు. అలాంటి వారికి తీవ్రవాదానికి అనుకూలంగా లాజిక్ దొరికితే! ఇక మనం క్షణక్షణం భయంతో బ్రతకాల్సిందే. కాబట్టి సమస్యకు అన్ని సమాధానాలూ ఆలోచించాలి. తీవ్రవాదాన్ని అణచడానికి కేవలం భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టం చేస్తే చాలదు. The solution has to be holistic.

****

4 comments:

saisahithi said...

మహేష్ గారు,
నిజమే ఇది తప్ప మరోదారి లేదు. మార్పు కి హింసే పరిష్కారం. ఇది ఒక మతాని కి మాత్రమేకాదు . సమాజం లో ప్రతి వర్గాని కి అంటుకున్న ఓ జాడ్యమని పిస్తుంది. ఉదా: ఆంధ్రజ్యోతి పత్రికాఫీసు పై దాడి. ప్రజాస్వామ్య పరంగా చర్చ్ల ల ద్వారా సమస్య ల పరిష్క రించుకునే ఓపిక ఇపుడెవరికి వుంది ? There are many reasons to say. The procedural delay in democracy stands first among them. It takes long time to take necessary action in democratic setup. Of course People donot have patience to go for consensus. The only thing to draw the attention of the government as well as the public is violence. But they are conveniently forgetting how far they achieved their goals in this way. Have the governments in power in any instance yielded towards their demands. ఏ ప్రభుత్వం కూడా వారి డిమాండ్లకి తల ఒగ్గలేదు సరికదా వారిపై ఇంకాబలమైన ఉక్కు పాదాన్ని మోపుతూనే ఉంది. ఇది వారు నమ్మలేక పోతున్న నిజం.
నిజానికి చెప్పలంటే గత రెండు దశాబ్దాలుగాచూస్తే అన్ని రాష్ట్రాలలో హంగ్ ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.అయితే ఇవి ముస్లిం సముదాయాలకి మరింత ఫలితాలు అందే దిశలో సాగాల్సివుంది.
అసంతృప్తితో వారు సాగిస్తున్న దాడులలో వారు సాధించింది ఏమీ లేదు. కాని వారి హింసా మార్గాల ద్వారా కొన్ని వేల మంది అమాయక ప్రజలు బలయిపోతున్నారు. వారి స్వార్ధానికి ఇతరులని ఆహుతి చేసే హక్కు వారికెవరిచ్చారు? ప్రభుత్వాలు కూడ జడత్వాన్ని వదిలి త్వరితగతిన సామోజిక న్యాయం చేయాల్సి వుంది .

Anonymous said...

మహేష్ కుమార్ గారూ,

మీరు నాది extended imagination అంటారు కాని, మీది మరీ భయంకరమైన imagination సుమండీ!

మీరు చెప్పే వాదాలు వాళ్ళలో చస్తే కూడా జరగవు. అక్కడ ముసలి వాళ్ళు ఇంకా మూఢులు. కొంతలో కొంత కుర్రకారే బెటరేమో.

వినడానికి బాగున్నా, అన్ని సమస్యలకు holistic solutions అక్కర్లేదు. కొన్నిటికి simplistic solutions చాలు. ఇక్కడ కనీసం వాళ్ళ మతం, తద్వారా వచ్చిన ఐడియాలజీ, మానవుల ఉనికికే ప్రమాదమని గుర్తించడం ముఖ్యం. వాళ్ళ తీవ్రవాదం వెనక లాజిక్ వెతకడం వల్ల ఏ ప్రయోజనం లేదు.

-మురళి

Anil Dasari said...

మహేష్,

నేను రాయాలనుకున్నది మురళి ఆల్రెడీ రాసేశారు. ముస్లిం తీవ్రవాదులంతా యువకులే అన్న పాయింట్ ఆధారంగా ఇంత పెద్ద వాదన చేసేసిన మీ పటిమ గొప్పదే. కానీ ఆ రెండు పాత్రలనీ రివర్స్ చేస్తే సహజంగా ఉండేది. దేశవిభజన చేసిన గాయాల వల్లో, పెద్దతరంలో స్వతహాగా ఉండే కరడుగట్టిన చాందస భావాల వల్లనో మొత్తానికి ముస్లిం వృద్ధులలోనే అతివాద పోకడలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వారితో పోలిస్తే యువత చాలావరకూ నయం. పాకిస్తాన్‌కేసి ఓ సారి చూడండి. పదిహేను, ఇరవై ఏళ్ల నాటితో పోలిస్తే నేటి పాకిస్తాన్ యువతకి కాశ్మీర్ అనేది ఒక సమస్య కాదు. భారత దేశం వారికి శతృవూ కాదు. వారికున్నపాటి తెలివి భారతీయ ముస్లిం యువతకి లేదంటారా?

Kathi Mahesh Kumar said...

@మురళి &అబ్రకదబ్ర: వీరి(ముస్లింల) మధ్య ఇలాంటి వాదనలు జరగవని మీరనుకోవడానికి కారణం,అలాంటి వాతావరణాన్ని మీరు దగ్గరగా చూడకపోవడమే అనుకుంటాను.ఢిల్లీ లో "జామియా మిలియా ఇస్లామియా" అనే ఒక యూనివర్సిటీ ఉంది.ఒక సారి వీలైతే అక్కడ ఏదైనా చర్చవినడానికి ప్రయత్నించండి. దాదాపు ప్రతి రోజూ అక్కడ భారతీయ ముస్లింల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది.

ముస్లిం వృద్ధుల్లో మతానికి సంబంధించిన ఛాందస భావాలు ఎక్కువగాఉన్నా,భారతదేశాన్ని తమ దేశంగా భావించే దేశభక్తీ ఉన్నాయి.దేశ విభజన కొన్ని మానని గాయాల్ని మిగిల్చినా,వారిలో చాలా మందిలో మీరన్న కరుడుగట్టిన భావాలు కనపడవు. అంతేకాక,అప్పటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేరుకూడాను. ఉన్నదల్లా తరువాతి తరం మరియూ ఇప్పటి యువత. మొదటివారి జీవితాలు భారతదేశంలోనే ఉద్దరింపబడ్డాయి కాబట్టి వారిలో ఆ bitterness లేదు. ఇక యువత అందరిలోనూ తిరుగుబాటు తత్వంలేకపోయినా,ప్రస్తుత పరిస్థితుల పట్ల అసంతృప్తి మాత్రం మెండుగా ఉంది. కాకపోతే ఆ అసంతృప్తిని తీవ్రవాదంగా మలచడం పెద్ద కష్టం కాదుగనకనే చాలా మంది ఈ మార్గం వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇక్కడ ముస్లిం యువత సమస్య ’కాశ్మీర్’ కాదు..నా సంవాదంలో అసలు కాశ్మీర్ ప్రస్థావనకూడా లేదు. వీరి సమస్య జరిగిన గుజరాత్ లాంటి అన్యాయాలు, చట్టం వారిని రక్షింఛకపోవటం.ముస్లిం యువత అందరిలో దేశభక్తి లేదనికాదు, కొందరు హిందూ యువతలో పెరుగుతున్న మతతత్వవాదం లాగానే వీరి అసంతృప్తి వారిని తీవ్రవాదులుగా మారుస్తోందని మాత్రమే.

Issue is more of social and economic justice than religion.పట్టుబడిన Educated ముస్లిం తీవ్రవాదులు చెప్పిన కారణాలు నేను నా సంవాదంలో చెప్పడానికి ప్రయత్నించాను.అది నా వాదపటిమ కాదు, వారి "కారణాలు" మాత్రమే.అవి మనకు తప్పుగా అనిపించొచ్చు, కానీ అవి ముస్లింలకు చాలా సహేతుకంగా అనిపించినా ఆశ్చర్యం లేదు. అందుకనే తీవ్రవాదం పైన మనం చేసేఫోరు అమెరికాలాగా ఏకపక్షంగా కాక,holistic గా ఉండాలి అని చెప్పడం జరిగింది.

ఇప్పుడు చాలా మంది ముస్లిం తీవ్రవాదులు వారి మతంకన్నా, వారి మతంప్రజలపై జరుగుతున్న అన్యాయాల్ని కారణంగా చూపిస్తున్నారు. అదే మిగతా ప్రపంచంలోని ఇస్లాం తీవ్రవాదానికీ, భారతీయ ముస్లింతీవ్రవాదానికీ తేడా. మొన్న ఈ తీవ్రవాద సంస్థవారు హైదరాబాద్ ను టార్గెట్ చెయ్యడానికి చెప్పిన కారణం మతం కాదు,"అక్కడి ప్రభుత్వం ముస్లిం యువకులను పెద్ద స్థాయిలో అరెస్టుచేసి హింసలకు గురిచేసిందని" మాత్రమే.

కాబట్టి,సింపుల్గా ముస్లిం తీవ్రవాదాన్ని మతంగాటన కట్టి కన్వీనియంట్ గా ఉండగలిగే కాలం చెల్లినట్టే ఉంది.they are evolving convincing reasons for their behaviour,అందుకే ఆ మూల కారణాల్ని లేకుండా చెయ్యడంకూడా మన పోరులో ఒక భాగం కావాలని చెబుతున్నాను. I am not providing justification for terrorism. I am only projecting reasons that they have in offering to justfy what they are doing.

@సాయి సాహితిగారూ: మీరు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తాను. అందుకే తీవ్రవాదాన్ని మట్టిబెట్టడానికి ఒక comprehensive and holistic approach అవసరం అంటున్నాను. ఇజ్రాయెల్, అమెరికాల్లా మనమూ వ్యవహరిస్తే, క్షణక్షణం భయంభయంగా మనం భవిష్యత్తు వెళ్ళదియ్యాల్సిందే. అందుకే ఆయుధంతో సమాధానం చెప్పడంతొ పాటూ ముస్లింలలో సామాజికంగా,ఆర్థికంగా వెనుకబాటుకు గల మూలకారణాలను అంతం చెయ్యడం తోడ్పడగలదని మాత్రమే నేను సూచించింది.