Saturday, April 11, 2009

ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతేమాత్రం నాకేంటి?

ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతేమాత్రం నాకేంటి? అని ‘ప్యాసా’ చిత్రంలో గురుదత్ విజయ్ పాత్ర ప్రపంచాన్ని ప్రశ్నించినప్పుడు,ప్రేక్షకుడిగా మనమూ అంతే నిర్వేదానికి గురౌతాము. ప్రేమలో విఫలుడై, ఉద్యోగం లేక బ్రతుకులో ఓడిపోయి, తన సృజనాత్మకతకు కనీస గుర్తింపులేక త్యజింపబడి, అన్నల చేత మోసగించబడి ఇన్ని వైఫల్యాలతో మనిషిగా పరాజితుడై self pity లోకి వెళ్ళిపోయిన ఒక కవి, తన కల్పిత చావులో గౌరవాన్ని పొందుతాడు. బ్రతికుండగా మతించకపోగా మతిలేనివాడన్న ఈ ప్రపంచం, మరణించిన తరువాత పూజించి నెత్తికెక్కించుకుంటున్న ధోరణికి వ్యతిరేకంగా, వారి hypocrisy ని నిరసిస్తూ "ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతే మాత్రం నాకేంటి?" అంటాడు. లాభాపేక్ష లేకుండా అప్పుడూ ఇప్పుడూ అభిమానించి ప్రేమించిన వేశ్యతో ఈ ప్రపంచాన్ని కాదని దిగంతాలవైపుకు వెళ్ళిపోతాడు.

అలా అస్తమిస్తున్న సూర్యుడి పైపుకెళ్ళిన వంచిత నాయకీ-నాయకుల జీవితం ఎలా ఉండేది అని ప్యాసా రెండో భాగం తీసే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. ఎందుకంటే, ఆ త్యజించిన ప్రపంచం ప్రమేయం లేకుండా వారు బ్రతికే అవకాశం లేదు గనక! గురుదత్ ది ఒక కళాకారుడిగా తెలిపిన మానసిక నిరసనేకానీ, ప్రపంచాన్ని త్యజించి దిగంతాలకు వెళ్ళిపోవాలనే ఉద్భోదన అసలు కాదు. కాబట్టి ఆప్రశ్న కూడా అసంబద్ధమేమో. చాలా ప్రేమకథలు పెళ్ళితో సుఖాంతం అవుతాయి, లేదా చావుతో దు:ఖాంతం అవుతాయి. అలాక్కాకుండా పెళ్ళైన తరువాత ఈ ప్రేమ నిలిచిందా? లేక చావుతో విడిపోకుండా వీరికి పెళ్ళిజరుగుంటే ఏమయ్యుంటుంది? అని ప్రశ్నించాలంటే కొంచెం ఇబ్బందే మరి. దేవదాసు-పార్వతుల పెళ్ళిజరుగుంటే...ఛస్!! తలుచుకుంటేనే పరమ కంపరంగా ఉంది.

గురుదత్,విజయ్ ప్రపంచాన్ని త్యజించడాన్ని నేను అభినందించకపోయినా, తను చెప్పిన/చూపిన కారణాలు మాత్రం "ఈ ప్రపంచం ఎంత దారుణమో!" అనిపించేలా ఉంటాయి కాబట్టి అంగీకరించాల్సిందే. కానీ, ఈ సమస్యలకి ఫలాయనవాదమే సమాధానమా! మరింకేం చెయ్యలేమా? అన్న ఆలోచన ఎప్పుడూ వచ్చేది. ఈ మధ్య ‘గులాల్’ సినిమాలో ఇదే పాటని తీసుకుని చాలా మంచి సమాధానాలు చెప్పారు అనురాగ్ కశ్యప్ & పియూష్ మిశ్రాలు. "ఎలా ఉన్నా ఇది మన మన ప్రపంచం. మనమే దీన్ని కాపాడుకోవాలనే" యదార్ధవాద కోణం నాకు విపరీతంగా నచ్చింది. ఈ రెండు పాటలూ మీ కోసం...

చూసి...విని....నిర్ణయించుకోండి.





5 comments:

Anonymous said...

haunting music - pyaasaa

Naga said...

ఈ ప్రపంచం మన మనసు యొక్క స్థితి కన్నా గొప్పగా ఎప్పడూ ఉండదేమో...

సుజాత వేల్పూరి said...

పర్ణశాలలో పాటల సందడి!

ప్యాసా రెండోభాగాన్ని తీయాలంటే మళ్ళీ గురుదత్ లేచి రావాల్సిందే కాబట్టి వీలు పడదనుకుంటాను. ప్రేమ "కథలు" ఎప్పుడూ ప్రేమ ఉండగానే ముగిసిపోవాలి కానీ పెళ్ళయ్యాక వాళ్ల జీవితమెలాగుంటుందో అని ఊహించకూడదు. అందుకే దేవదాసు పార్వతిల పెళ్ళికి ముందు నేనొప్పుకోను.:))!

ఈ సందర్భంలో "బతికున్నా చచ్చినట్టే ఈ లోకంలో" అనే మల్లెపూవులో పాట మీకు గుర్తు చేసి మీ ఫీలింగ్ పోగొట్టను.

నెటిజెన్, సంగీతమే కాదు ప్యాసా సినిమా కూడా వెంటాడేదే కాదూ!

kasturimuralikrishna said...

మహేష్ కుమార్ గారూ,

గురుదత్ ఊహ ప్రకారం ప్యాసా అసలు ముగింపు సుఖాంతం కాదు. కానీ ఇప్పటికే సినిమా సీరియస్సయిందని అందరూ గోల పెడుతూండటంతో జానీవాకర్ కి ఓ పాట పెట్టి ముగింపును సుఖాంతం చేశారు. మీరు సినిమా ఈ సారి చూసినప్పుడు, చివరి దృష్యం హఠాత్తుగా వచ్చినట్టు గమనించండి. గురుదత్ సినిమాల్లో అరుదుగా కనిపించే జంప్ అది.

asha said...

"దేవదాసు-పార్వతుల పెళ్ళిజరుగుంటే...ఛస్!! తలుచుకుంటేనే పరమ కంపరంగా ఉంది."
పార్వతి వంట చేసీ చేసీ, విసిగిపోయి 'అంతా భ్రాంతియేనా! జీవితానా వెలుగింతేనా' అని స్టవ్ వైపు చూస్తూ పాడుకుంటూ ఉండేది.