Monday, August 18, 2008

వెధవతనంలో సిన్సియారిటీ...

చిన్నప్పుడు మొత్తం మహాభారతం కథలుగా చదివాను. ఆఖర్న స్వర్గారోహణ పర్వానికొచ్చేసరికీ నిజంగా మహాభారతం నా కళ్ళు తెరిపించిందనిచెప్పొచ్చు. కృష్ణుడు అవతారం చాలించిన తరువాత, పంచపాండవులు ద్రౌపతితో సహా రాజ్యాన్ని త్యజించి స్వర్గానికి బయల్దేరుతారు. ఈ ఆరోహణ క్రమంలో వారితో పాటూ ఒక కుక్కా అనుసరిస్తుంది. మార్గంలో ఒక్కో మజిలీలో ఒక్కొక్కరు వరుసగా కుప్పకూలిపోతే చివరకు ధర్మరాజూ, తనని అనుసరించిన కుక్కా స్వర్గద్వారాన్ని సమీపిస్తారు. స్వర్గంలో కుక్కకు ప్రవేశం లేదంటే, మన ధర్మరాజు యధావిధిగా "తప్పదు" అని భీష్మించిన క్షణాన ఆ కుక్క ‘ధర్మం’ అవతారమెత్తి ధర్మరాజుని అభినందించి తనే ధర్మరాజుకి guideగా వ్యవహరించి స్వర్గం visit చేయిస్తుంది.



స్వర్గంలో అడుగుపెట్టిన ధర్మరాజుకు ధుర్యోధనుడు నవ్వుతూ ఎదురొచ్చి కౌగిలించుకుంటే, మిగతా కౌరవులుకూడా ఆనందడోలికల్లో మునిగితేలుతూ కనబడతారు. వారిని చూసి ధర్మరాజు సంతోషించినా, తన కళ్ళు మాత్రం సహజంగా తన తమ్ములను వెదుకుతాయి. తమ్ముళ్ళ ముఖాలు స్వర్గంలో ఎక్కడా కనబడకపోయేసరికీ, ఉండబట్ట లేక వివరమడుగుతాడు ధర్మరాజు. ఈ ప్రశ్నకు ‘ధర్మం’ తాపీగా, "వాళ్ళు నరకంలో ఉన్నారుగా, వెళ్ళికలుద్దాం పద" అని ధర్మరాజుని వెళ్ళదీస్తాడు. "నా తమ్ముళ్ళు నరకంలో ఉండటం ఏమిటి?" అని మధనపడుతూ ధర్మనందనుడు నరకానికి ప్రయాణమవుతాడు.



నరకంలో నరకయాతనలనుభవిస్తున్న తమ్ములను చూసి వ్యాకులత చెందిన ధర్మరాజు ఆక్రోశంతో ధర్మాన్ని "ఇదేమి న్యాయం" అని నిలదీస్తాడు. "ఎప్పుడూ మంచికోసం పోరాడిన నా ధీరవీరులైన తమ్ములకు నరకమూ, అన్యాయం పక్షాన నిలిచి పోరాడిన కౌరవులకు స్వర్గమా?" అంటూ ఆవేదన చెందుతాడు. అప్పుడు ‘ధర్మం’ చిన్నగా నవ్వుతూ,"ధర్మనందనా! నీవు ధర్మరక్షణా దీక్షితుడవైయుండీ ‘అశ్వద్ధామా హత: కుంజరహ’ అని అబద్దమాడటం మూలంగా ఈ నరక దర్శనం చేయ్యాల్సొచ్చింది. ఇక మీ తమ్ములంటావా, వారు ధర్మం పక్షాన నిలబడిపోరాడినా, స్వార్థం, బంధుప్రీతి, కుయుక్తిని ఎప్పుడూ వారు వీడలేదు. అందుకే కొంతకాలం నరకవాసం తప్పదు" అని చెబుతాడు.



అదివిని ధర్మరాజు, "అంతా బాగుందికానీ, అన్యాయంగా కౌరవులకుమాత్రం స్వర్గసుఖాలెలా వచ్చాయ్? ముఖ్యంగా అంత అధర్ముడైన ధుర్యోధనుడు నరకానికి రాకుండా స్వర్గ సుఖాలెందుకనుభవిస్తున్నాడు?" అని తన అక్కసు వెళ్ళగక్కుతాడు. దానికి ధర్మం నర్మగర్భంగా నవ్వి, "నీకు తెలియని ధర్మమా, ధర్మనందనా! కౌరవులు తాము నమ్మినదాన్ని అక్షరాలా ఆచరించారు. వారి తలపులలోగానీ నడతలోగానీ ఇసుమంతైననూ తేడాలేదు. రాజ్యాన్నీ, అధికారాన్నీ,ధనాన్నీ మనస్ఫూర్తిగా ప్రేమించారు. తమ శత్రువులను అంతే నిష్టగా ద్వేషించారు. రెండునాల్కల ధోరణి, కపటం, కుత్సితం ఏనాడూ ఎరుగరు. అంతటి సాధకులకు స్వర్గంకాక నరకం ప్రాప్తిస్తుందని ఎలా అనుకున్నావ్?" అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చుట్టూఉన్న ‘మాయ’ విడిపడి జ్ఞానోదయం కలిగి స్వర్గానికి అర్హత సంపాదించుకుంటాడు.



అదే ‘ధర్మం’ చెప్పిన రహస్యాన్ని మన భాషలో చెప్పాలంటే, కౌరవులు తమ వెధవతనంలో చూపిన సిన్సియారిటీ మూలంగా స్వర్గానికొచ్చిపడ్డారన్నమాట. అప్పట్నుండీ స్వర్గాన్ని ఆశించి కాదుగానీ, నేను నమ్మింది మాత్రం ఆచరించడం మొదలెట్టేసాను. దాన్ని సమాజాన్ని రక్షించేవాళ్ళు "తప్పు" అని ఆడిపోసుకున్నా, మతగ్రంధాలూ, వేదాలూ అంటూ ఊదరగొట్టి ప్రజలు భయపెట్టాలనిచూసినా నాకుమట్టుకూ ‘వెధవతనమైనా నేను తర్కించి నమ్మిందే నిజమైపోయింది’.



నిజానికి, వెధవతనాన్ని సిన్సియర్గా ఆచరించేవాళ్ళు వివిధ రంగాలలో సక్సెస్ అందుకోవడంకూడా గమనించానండోయ్. ఉదాహరణకి, రాజకీయాలలో లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లను తీసుకోండి. ఎంత సిన్సియర్ వెధవలు వీరూ! నిజ్జంగా కాంగ్రెస్, బీజేపీలకు వీరి వెధవతనంలో ఉన్నంత సిన్సియారిటీ ఉందంటారా? లాలూ వచ్చి, రైల్వేని ఉద్ధరిస్తున్నానని పచ్చి అబద్ధం చెప్పినా నవ్వే అతని కళ్ళూ, తుళ్ళే తన శరీరం అతని వెధవతనాన్ని ఎంచక్కా బహిర్గతం చేసేసి "వీడింతే" అని మనం అనుకునేలా చెయ్యవూ! ఇక ములాయం సింగ్ అసలు అబద్దం చెప్పడం మీరు చూసారా? అమర సింగ్ ఎప్పుడూ అతని తరఫున చెప్పడానికి తయారుగా ఉన్నా, అప్పుడప్పుడూ ములాయం మాట్లాడితే, "వీడెంత వెధవో తెలుస్తూనే ఉంది" అని మనం అనుకోమా...! వీరి ముఖ్య ఉద్దేశం డబ్బు, పదవులూ వాటికోసం ఏమైనా చేస్తారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీ లలాగా ఆదర్శాలు వల్లెవేస్తూ అంత రెండునాల్కలూ, కుత్సితాలూ, డ్రామాలూ ఆడరుగనక ఖచ్చితంగా స్వర్గ ప్రాప్తి తప్పదని నా నమ్మకం.



ఇక మన సినిమాలలో ఈ సిన్సియారిటీ ఇద్దరికే ఉంది. ఒకరు రాంగోపాల్ వర్మ, రెండోది ఎస్.ఎస్. రాజమౌళి. "నాకు ఆటైంలో ‘కిక్’ ఇచ్చిన సబ్జెక్టి సినిమాగా తీస్తా, నాకు ప్రేక్షకులతో, సినిమాల వల్ల వచ్చే లాభాలతో సంబంధం లేదు", అని విర్రవీగి, తన వెధవతనాన్ని పబ్లిగ్గా బయటపెట్టుకునే సిన్సియారిటీ మన వర్మ సొత్తు. ఇంత దమ్మున్న దర్శకుడు అసలు భారతదేశంలో ఉన్నారా అనిపిస్తుంది. తన సినిమాని తిట్టు, బాంబెట్టి పేల్చేయ్ తను మాత్రం విజయవంతంగా తన వెధవతనాన్ని బయటపెడుతూ ఇంకో సినిమాతో తయారౌతాడు. ముఖం పగిలేలా ‘హిట్’ ఇచ్చినా ఇస్తాడుకూడా!



ఇక రాజమౌళి సిన్సియారిటీది మరో ఎత్తు. సింహాద్రి, సై, ఛత్ర్రపతి, మొన్నమొన్నొచ్చిన ‘యమదొంగ’ లాంటి నేలబారు, చెత్త సబ్జెక్టులని సైతం తను తీర్చిదిద్దిన సిన్సియారిటీ చూసికదండీ మన ఆంధ్ర ప్రేక్షకుడు నీరాజనాలు పడుతోంది. తను తీసేది పక్కా కమర్షియల్ సినిమా అని తనకు తెలుసు. అయినా మనస్ఫూర్తిగా దానికి హంగులద్దుతాడు. కథ నేలవిడిచి సాము చేసేదైనా, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు కథతోపాటూ ఆనందంగా ‘తేలిపోయేలా’ సినిమా తీసే ఇతని నిబద్ధత ధూర్యోధనుడికి తీసిపోదుకదా! మిగతా దర్శకుల్లాగా అటోకాలూ ఇటోకాలూ వెయ్యకుండా సిన్సియర్గా తాను నమ్మిన సినిమాని పచ్చిపచ్చిగా తీసే సిన్సియారిటీ ఉందిగనకనే సక్సెస్ వస్తోంది.



మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే, చేసేది వెధవ పనైనా సిన్సియర్గా చేస్తే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చేప్పేవి శ్రీరంగనీతులూ, దూరేవి .... గుడిసెలూ అన్నట్లు తయారయితేమాత్రం, ముఖం పగలడం ఖాయం, నరకానికి బార్లా గేటు తెరిచిమరీ ఆహ్వానింపబడటం తధ్యం. నమ్మింది సిన్సియర్గా చేసేయ్ సోదరా! వెధవతనంలో సిన్సియారిటీ చూపరా వీరుడా!!



****

26 comments:

Kottapali said...

so true!
BTW, సింహాద్రి లోని సిన్సియర్ వెధవతనం నాకు ఛాలా నచ్చేసింది. మిగతా వాటిల్లో కొంచెం కొరవడిందనే చెప్పాలి!

వికటకవి said...

బాగుబాగు. అవునవును. దుష్టచతుష్టయంలో ఇద్దరి పేర్లే చెప్పారు. పూర్తి జాబితా

లాలు
ములాయం
పాశ్వాన్
శిబు సొరేన్

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

You've apparently got the message in the said story wrong.

మీరు చెబుతున్నదాన్ని "వెధవతనంలో సిన్సియారిటీ" అనకూడదు. అది దౌష్ట్యానికి ప్రత్యామ్నాయాలు తెలియని, కనుగొనలేని, అర్థం చేసుకోలేని ఒక విధమైన అమాయకత్వం. అమాయకత్వానికెప్పుడూ భగవంతుడి దృష్టిలో క్షమాపణ ఉంది.

ఆ స్థితి నుంచి బయటపడగలిగే మేధాశక్తి ఉండి, అందుకు తగ్గ హంగులూ, అవకాశాలూ ఉండీ, ఆ విధంగా మార్గదర్శనం చెయ్యగలవారు లభించీ కూడా అక్కడే ఉండడానికి నిశ్చయించుకునేవారికి క్షమాపణ ఉండదు. మనకాలపు జనం (అంటే మనమే) ఈ శ్రేణికి చెందినవారు.

Anonymous said...

very nice Mahesh garu. lekhini is down now. Thats why unable repond in detail in telugu. topic is very sarcastic.

Anil Dasari said...

బాగుంది. 'వెధవలందు ఉత్తమ వెధవలు వేరయా' అన్నమాట. మీ ఉదాహరణల్ని దేశీయ వెధవలకే పరిమితం చేసినట్లున్నారు. ఈ లిస్టులో అగ్రాసనమలంకరించటానికి అంతర్జాతీయ స్థాయిలో ఓ పెద్దమనిషున్నాడు. ఇరాక్ విషయంలో ఆయన్ని సమర్ధించేవాళ్లూ, వ్యతిరేకించేవాళ్లూ కూడా అవసరాన్నిబట్టి రోజుకో రకంగా పిల్లిమొగ్గలేస్తున్నా, తను మాత్రం ఐదేళ్లుగా నా కుందేలుకి మూడే కాళ్లంటూ అదే మాటమీద నిలబడ్డ ఘనుడీయన. ఆయన పనులు నచ్చకపోయినా ఆ సిన్సియారిటీ మాత్రం తెగ నచ్చుతుంది నాకు.

అన్నట్లు, సుయోధనుడ్ని పట్టుకుని వెధవనేశారిమిటి? భారతంలో అసలు సిసలు నిఖార్సయిన వెధవాయిలు పాండవులే. రాజ్యమ్మీద ఏ హక్కూ లేకున్నా కేవలం పదవీ కాంక్షతో కాదూ ధర్మరాజు యుద్ధం తెచ్చి పెట్టింది? రాజుగారి తమ్ముడి భార్యలకి ఎవరి ద్వారానో పుట్టిన సంతానానికి రాజ్యంలో హక్కుండటం ఏ యుగంలోనూ, ఏ దేశంలోనూ లేదు నాకు తెలిసి. వంశమతా వర్ణసంకరాల మయమైన కురు వృద్ధులు నిండు సభలో కులం పేరిట కర్ణుడినవమానిస్తుంటే అతడినాదుకుని అంగరాజ్యమూ, అర్ధ సింహాసనమూ ఇచ్చిన సుయోధనుడిది నా దృష్టిలో వెధవత్వం కాదు, అమరత్వం.

Chivukula Krishnamohan said...

మహేష్ గారూ, బాగుంది. ఒక్కటే నివేదన. మీరు కొటేషన్లలో పెట్టి మరీ సంభాషణలు వ్రాస్తున్నప్పుడు మూలాన్ని అలాగే ఉంచాలి. మీ ఇంటర్‌ప్రిటేషన్‌ మీరు వ్రాయచ్చు. కానీ దానిని కొటేషన్లలో పెట్టకూడదు. ఎందుకంటే ఉషశ్రీ మహాభారతంలో మీరు అన్న డయిలాగులు అలాగ లేవు. మీరు అన్నదానిని ఖండించడానికి ఉషశ్రీ గారు రారు కానీ... మీ భావాన్ని ఆయన భావంగా ప్రచారం చేయడం సరి కాదుగా...
అబ్రకదబ్రగారూ, మీరు మన నందమూరివారి 'దానవీరశూరకర్ణ' బ్రహ్మాండంగా చూసినట్టున్నారు. ధర్మరాజుకి రాజ్యం మీద ఎందుకు హక్కుందో మరొక్కసారి మూలం చదవండి. మీరన్నదానినే పాటిస్తే దుర్యోధనుడికి కూడా ఏ హక్కూ లేదు. విచిత్రవీర్యుని మరణం తర్వాత - అతని భార్యలకి వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. విచిత్రవీర్యుని తదనంతరం రాజ్యాన్ని నిర్వహిస్తున్న సత్యవతి రాజ్యాధికారాన్ని పాండురాజుకి అప్పచెప్పింది. మరి పాండురాజు కుమారుడికి రాజ్యాధికారం ఉండక ఏమవుతుంది?

cbrao said...

ఏం టపా రాశారండీ! అమ్మోయ్. వెధవలను హీరోలను చేశారు. ద్రౌపది వస్త్రాహరణం చేసిన కౌరవులు అమాయకులెట్లవుతారు? పరమ sadists అవుతారు కాని. కపటం, కుత్సితం తప్ప మరొహటి ఏనాడూ ఎరుగరు వారు. వారికి స్వర్గ ప్రాప్తియా? ఎదో లాజిక్ తప్పినట్లుంది. ప్రజలను ఆనందపరిచే సినిమాలు తీస్తున్న రాజమౌళి స్వర్గానికెళితే, దాసరి నారాయణ రావు చివరలో ప్రేక్షకులను హింసపెట్టాడు కదా! ఆయన ఎక్కడికి వెళ్తాడు?

Kathi Mahesh Kumar said...

@చివుకుల గారూ; డబుల్ కొటేషన్లు రెండు సందర్భాలలో వాడతారు. ఒకటి వేరే దగ్గరున్న వాక్యాలను యదాతధంగా తీసుకుంటే, రెండు సంభాషణలను చెప్పేటప్పుడు. నేను చేసింది రెండోది. మొదటి పేరాలోనే నాది interpretaion అని సూచించాను. అలాంటప్పుడు ఉషశ్రీ గారి వాక్యాలు మక్కీకి మక్కీ కొట్టలేదనేగా అర్థం. పైగా నేను చదివింది చిన్నప్పుడు, ఇప్పుడా పుస్తకాలుకూడా నా దగ్గరలేవు రెఫెరెన్స్ గా పెట్టుకుని అవే వాఖ్యాలు రాయడానికి.

@రావు వారూ: కౌరవుల్ని అందుకే వెధవలన్నాను సార్! కాకపోతే వారు తాము సరైనదే అని మనస్ఫూర్తిగా నమ్మిందే చేసారు.అందుకే స్వర్గానికి చేరారు. మూల కథ మాత్రం కరెక్టే, మీరూ స్వర్గారోహణపర్వాన్ని చదివి చూడండి. మరింత లాజిక్ దొరకొచ్చు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివా. మళ్ళీ చదివితే మరింత జ్ఞానం రావొచ్చు.

@తాలబా గారూ; అసలు కథేమిటో దాని సారమేమిటో మీరు చెబితే తెలుసుకోవాలనుంది.నాకు మట్టుకూ ఇలా అనిపించింది.అందుకే రాసేసాను.

@అబ్రకదబ్ర:నాటపా ప్రస్తుతానికి దేశీ వెధవలకే స్థానం. మీరు ఒక ఇంటర్నేషనల్ వెధవని జోడించారు.సంతోషం."వెధవ" అంటే సమాజం దృష్టిలో తప్పుడు పనులు చేసేవాడని మాత్రమే ఇక్కడ అర్థం.ధుర్యోధనుడితో పాతూ నేనూ ఉన్నాన్లెండి.

@వికటకవి, మురళీధర్ & కొత్తపాళీ గారూ: ధన్యవాదాలు.

Anil Dasari said...

దానవీరశూరకర్ణ నేను చూడలేదు, దాని గురించి వినున్నా. ఈ మాత్రానికి సినిమా చూసి తెలుసుకోవలసినదేముందండీ? మహాభారతం చదివితే లక్ష ప్రశ్నలొస్తాయి. నే చేసిందీ అదే పని.

పెద్ద కొడుకు గుడ్డివాడు కాబట్టి పాండు రాజుని రాజుగా చెయ్యటం జరిగింది. ఒప్పుకుంటాను. కానీ పాండు రాజు మరణానంతరం ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం జరిగింది. ఆయన తప్పుకున్నాక ఆయన పెద్ద కొడుకు రాజవ్వక, యుధిష్టిరుడెలా అవుతాడు? యుధిష్టిరుడు కౌరవ-పాండవులందరిలోకీ పెద్దవాడు కాబట్టి ఇతడే రాజు అనే లాజిక్ ఇక్కడెలా పని చేస్తుంది? పైగా ఇతను పాండురాజుకి పుట్టినవాడు కూడా కాదాయె!

ద్రౌపది వస్త్రాపహరణం గురించి: గోపికల చీరలు దొంగిలించిన వాడిది రొమాన్స్, 'గుడ్డివాడి కొడుకూ గుడ్డివాడే' అని పళ్లికిలించిన దాసి (జూదంలో ఓడిపోయాక) చీరలిప్పటం మాత్రం నేరం!?! పాండవ పక్షపాతి మహాభారతం రాస్తే ఇలా కాక ఎలా ఉంటుంది? ఒక ఆడదాన్ని ఆస్తిలాగా ఐదుగురు పంచుకుంటే అది తల్లిమాటకి విలువివ్వటం, తాగినమత్తులో జూదమాడి భార్యనే పందెమొడ్డటం అదోరకం ధర్మం, పరాయి వాడు పెళ్లాం బట్టలు లాగేస్తుంటే నోర్మూసుకుని కూర్చున్న చేతకానితనమేమో మంచితనం, కుయుక్తులతో ప్రత్యర్ధులని చంపటం యుద్ధనీతి!!! ఈ పనులన్నీ కౌరవులు చేస్తే వీటర్ధాలు పూర్తి వ్యతిరేకంగా ఉండేవి కావా?

ఈ గోలంతా ఎందుకండీ. 'రాజ్యం వీరభోజ్యం' అన్న మాట ఉండనే ఉంది కదా. ఆ పనే సుయోధనుడు చేశాడు. అతని పాలనలో ప్రజలు అగచాట్లు పడ్డట్లు ఎక్కడా లేదు కదా. ఆ విధంగా అతను మంచి రాజే. పాండవులు పద్ధతిగా యుద్ధం చేసి రాజ్యం గెలుచుకుని ఉంటే సరిపోయేది. అంత ధీరత్వం లేకనే కదా ఈ అడుక్కోవటాలూ, అక్రమంగా యుద్ధం గెలవటాలూ. గెలిచారు కాబట్టి పాండవులు హీరోలయిపోయారు కానీ, ఓడిపోతే ఇప్పుడు నాలాంటివాళ్లంటున్న మాటలు మరింతమంది అనేవాళ్లే.

కామేశ్వరరావు said...

మహేష్ గారు,
మీ పొలిటికల్ సెటైరు బాగానే ఉంది కానీ మధ్యలో ఉషశ్రీని, భారతాన్ని, ధర్మరాజునీ, దుర్యోధనుణ్ణీ లాగడం బాగులేదండీ. ఎందుకంటే మీరన్న ఉషశ్రీ భారతంలోకాని, తిక్కన తెలుగు భారతంలోకాని, సంస్కృత భారతంలో కాని ఎందులోనూ మీరన్న విషయాలు ఏమాత్రం లేవు. అట్లా ఇంటర్ప్రెట్ చెయ్యడానికి కూడా అవకాశం లేదు.
దుర్యోధనాదులు స్వర్గంలో ఉండడానికి కారణం నారదుడు ధర్మరాజుకి చెప్పింది, వాళ్ళు క్షత్రియులై యుద్ధంలో మరణించిడం వల్ల. భీముడూ ఇతర పాండవులూ, ద్రౌపది (కర్ణుడు కూడా) నరకంలో ధర్మరాజుకి కనపడ్డానికి సరైన కారణమసలేమీ చెప్పడు ఇంద్రుడు. ధర్మరాజు నరకానికి రావడానికి కారణం మాత్రం రాజైన ప్రతివాడికీ తప్పదు కాబట్టి వచ్చాడని చెప్తాడు. మరో మాట కూడా అంటాడు. ఎక్కువ పుణ్యం చేసుకున్నవాళ్ళు ముందు నరకానికి వచ్చి తర్వాత శాశ్వతంగా స్వర్గానికి వెళతారనీ, పాపం ఎక్కువ చేసిన వాళ్ళు ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత నరకానికి శాశ్వతంగా వెళతారనీను. ఆ తర్వాత పాండవులందరూ స్వర్గంలో హాయిగా ఉండడాన్ని కూడా చూపిస్తాడు.
ఇదీ అసలు కథ! దీన్నుంచి మీరన్నవి ఎలా "interpret" చేసుకోవచ్చో నాకు బోధపడటం లేదు. మీది "interpretation" అన్న సూచనకూడా నాకెక్కడా కనిపించ లేదు మీ టపాలో.
ఉషశ్రీ వంటి వారిని ప్రస్తావించినప్పుడు ఒకసారి సరిచూసుకోవడం కనీస బాధ్యతా, మర్యాదా అనుకుంటాను. అందులోనూ మీ టపాలకి ఎంతో విలువనిచ్చి (మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా) చదివే నాలాంటి పాఠకులు మీరు చెప్పేవి నగ్న సత్యాలని భ్రమపడే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మరింత జాగ్రత్తవహించాలని నా వేడుకోలు.

మోహన said...

ఏమండోయ్.. అబ్రకదబ్ర గారూ.. ఇందులో మా కన్నయ్యను కూడా లాగేసారా? అతడు చీరలెందుకు దొంగిలించాడో తెలియనిదా ?? ఎంత అల్లరి చేసినా గొప్ప సన్యాసి, బ్రహ్మచారి కదండీ శ్రీ క్రిష్ణుడు ??

మనం ఏం చేస్తున్నాం అనేది కాక ఎందుకు చేస్తున్నాం అనేది ముఖ్యం అని నా అభిప్రాయం. త్రేతా యుగంలోని నీతులు ద్వాపర యుగంలో చెల్లవు. ఒక్కో యుగానికి ఒక్కో నీతి ఉంటుంది అని విన్నాను. బలవంతుడు అమాయకుడైనా, అజ్ఞ్ఞాని అయినా సరే యుద్ధానికి దిగితే ఎదుర్కోవటం కష్టం. అలాంటప్పుడు కొంత రాజకీయం జరపాలి తప్పదు. వేరే దారి లేదు. అది కూడా రాయబారం జరిపిన తరువాతే కదా జరిగింది ?

ఉదాహరణకి, ఈ రోజుల్లో నేను నిజాయితీగా ఉంటాను అంటే, ఎవరు ప్రశంతంగా బతకనిస్తారు ? ఒకవేళ అలా ఉండలంటే అన్నిటినీ వదిలి ౠషి లా బ్రతకటం తప్ప వేరే దారీ ఉందా ? లేదు నే సంఘంలోనె నిజాయితీగానే బ్రతుకుతాను అంటె పోరటం లేకుండా జరుగుతుందా? మౌనమో, అహింసా వాదమో ఏదైనా పోరాటమే కదా ?

నీతికి, ధర్మానికి నిలబడే రాముడే పశువులా ప్రవర్తిస్తున్న వాలిని చాటుగా మాటు వేసి మృగాన్ని చంపినట్టే చంపాడు. అది న్యాయమైనదే..కదా ? లేదు నే ఎదురెళ్ళే యుద్ధం చేస్తాను అని అంటంలో మూర్ఖత్వమే ఎక్కువ.
ఏమో.. నేను పుస్తకాలు చదవలేదు నాకు తెలిసినదానికి నా తర్కం ఉపయోగించి, నాకు తోచింది రాశాను. చనిపోయాకా స్వర్గం, నరకం ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నమ్మిన దానిని ఆచరిస్తూ దానికే కట్టుబడి ఉండటం వల్ల మనలో మానసిక సంఘర్షణలు ఉండవు. అది మాత్రం ఒకరకంగా స్వర్గమనే చెప్పుకోవచ్చేమో..!

ఇక మహేష్ గారూ... మీకు తోచిందే అయినా చాలా ఆశక్తికరంగా రాస్తారు. చూస్తే మీరు చెప్పింది కొంత వరకు నిజమే.. నమ్మింది నిలుపుకోవటానికి, నచ్చింది చేయటానికి చాలా ధైర్యం కావాలి. అలా ధైర్యం ఉన్న వారికే పేరొచ్చేది. మంచిగా అయినా, చెడ్డగా అయినా.. సామాన్యులెప్పుడు సామాన్యులుగానే ఉండిపోతారు!

చిలమకూరు విజయమోహన్ said...

కాళిదాసు కవిత్వం కొంత మన పైత్యం కొంత అన్నట్టుంది.లాలూప్రసాద్,అమర్ సింగ్ గారితో పాటు మీకు కూడ స్వర్గంలో చోటు తథ్యం.

Kathi Mahesh Kumar said...

@భైరవభట్ల కామేశ్వరరావు గారూ:నా వ్యాసం రెండో లైన్లోనే "నా కళ్ళు తెరిపించింది" అని చెప్పి తరువాత ‘నా కథ’ లో కొచ్చేసాను. కాబట్టి మీరనుకుంటున్న ఉషశ్రీ గారిపై నెపం అయ్యే అవకాశం ఎంతమాత్రం లేదు. నాకు మహాభారతం కూలంకషంగా తెలియకపోయినా, నాకు నా కథ కంటే, మీ కథలో ఎక్కువ లొసుగులు కనబడుతున్నాయి. ద్రౌపతీ,భీముళ్ళు నరకంలోవున్నా ధర్మరాజు కారణాలు అడక్కపోవడం,నారదుడు (?) చెప్పకపోవడం అసంబద్ధంగా లేవూ!

ఇక ఇంటర్ప్రిటేషన్ సంగతంటారా, ఆ విధానంలో "impressionism" కూడా ఉందండోయ్. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కథ నామీద చూపిన ఇంప్రెషన్ ఆధారంగాకూడా interpret చెయ్యొచ్చు.

@మోహన: నా వ్యాసంలోని మూల బిందువుని బాగా ఆకళింపు చేసుకున్నారు. నమ్మింది చెయ్యడాం ముఖ్యం అనేదే నా పాయింటుకూడానూ!

@విజయమోహన్ గారూ: మొత్తం వేదాలూ,పురాణాలూ, మతగ్రంధాలూ ప్రస్తుతానికి సొంత పైత్యాలే.నిజంగా వాటి ఒరిజినల్ రూపమేమిటో ఎవరికీ తెలియదు. కాబట్టి, సొంత పైత్యానికి అందునా తార్కిక పైత్యానికి దానికుండాల్సిన విలువ ఉందిలెండి. కాకపోతే ఈమధ్యదాన్ని interpretaion అంటున్నారు. అంతే తేడా.మతాన్నే పూర్తిగా నమ్మని నాకు స్వర్గం ఇక్కడే ఉంది. అది నేను నమ్మినదాన్ని ఆచరించడంలో ఉంది. మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు.

కామేశ్వరరావు said...

మహేష్ గారు,
మొదటిగా, నేను రాసినది "నా" కథ కాదు. మీరు ప్రస్తావించిన ఉషశ్రీ భారతంలోనూ, దానికి ఆధారమైన తెలుగు సంస్కృత భారతాలలోనూ ఉన్న కథ. నా మీద నమ్మకం లేనివాళ్ళు ఆ పుస్తకాలను స్వయంగా చదివి చూసుకోవచ్చు.
రెండు, లొసుగుల గురించి. వాటి గురించి మీతో నేను చర్చించదలచుకోలేదు, ఏందుకంటే అది తెలివితక్కువతనం అవుతుంది. మీకీ విషయమై కొన్ని అభిప్రాయాలిప్పటికే ఉన్నాయి. వాటిని impressions అనండి, interpretations అనండి (pre-conceived notions అని నేనంటాను). ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచించి దాని ద్వారా మీ అభిప్రాయాలని మార్చుకొనే స్థితిలో మీరు లేరు (అని మీరే నిజాయితీగా చెప్పుకున్నారు). కాబట్టి నేను వాటిగురించి మీతో వాదించి ఏం ప్రయోజనముంటుంది చెప్పండి?
మూడు, నాకొచ్చిన తెలుగుభాష ప్రకారం నేను మీ టపాని అర్థం చేసుకున్నదాన్ని బట్టి, అది ఏ కోశానా మీ interpretation అనే భావం నాకు స్ఫురించలేదు. మీ టపాని చదివి భేషన్న ఇతరులెవరికైనా, మీరు రాసింది ఉషశ్రీ భారతంలోది కాకుండా మీ సొంత interpretation అని అనిపించిందని చెపితే, ఏ పదంవల్ల లేదా వాక్యం వల్ల అలా అనుకోవచ్చో కాస్త వివరిస్తే, నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను.
అసలు ఉషశ్రీ భారతంలో ఉన్నదానికీ మీరు రాసినది ఒక interpretation అని కూడా నాకనిపించలేదని చెప్పాను. దాన్ని కూడా ఇతర పాఠకులెవరైనా కాదని చెపితే నా అభిప్రాయాన్ని మార్చుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మీద గౌరవం లేక ఇతర పాఠకులని అడగటం లేదు, ఇది communicationకి సంబంధించిన విషయం కనక మీ ఒక్కరి అభిప్రాయాలూ సరిపోవని చదివేవాళ్ళ అభిప్రాయాలని కూడా కోరుతున్నాను.

సుజాత వేల్పూరి said...

పాండవులు స్వర్గానికెందుకెళ్ళలేదు, కౌరవులు అమాయకులా కాదా ఇవన్నీ పక్కన పెడితే, "నమ్మింది ఆచరించడం" అనే సూత్రానికే నా వోటు. ఆ తర్వాత నాకు స్వర్గమైనా, నరకమైనా పర్లేదు. అయినా రాజమౌళిని తప్పించుకోవాలంటే స్వరానికెళ్ళక్కర్లేదు, నరకానికే పోదాం అనుకుంటే అక్కడా పాండవులున్నారాయెను!(వాళ్ళంటే నాకు విరక్తి).

అబ్రకదబ్ర,
పాండవుల గురించి మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి.

oremuna said...

నేను రాద్దామనుకున్నది కామేశ్ గారు వ్రాశేసారు.

Kathi Mahesh Kumar said...

మొదటి లైన్లో ‘ఉషశ్రీ’ భారతం చదివానని చెప్పడం వలన ఇన్ని అపోహలకి ఆస్కారం కలుగుతొంది కాబట్టి ఆ ఒక్క లైన్ ని తీసేస్తున్నాను.
మహేష్

Chivukula Krishnamohan said...

అబ్రకదబ్రగారూ, ప్రశ్నలు రావడం మంచిదే. కానీ వాటి సమాధానాలు కూడా వెతకడం అవసరం. పాండురాజు మరణానంతరం ధృతరాష్ట్రుడికి పట్టాభిషేకం జరగలేదు. అతడిని కురుసామ్రాజ్య సంరక్షకుడిగా నియమించారు. అప్పటికే ధర్మరాజు పుట్టిఉన్నాడు అని మీరు మరిచిపోయినట్టున్నారు. కాబట్టి పాండురాజు మరణించాక ధర్మరాజుకే రాజ్యం చెందాలి. అతడు ఇంకా అప్పటికి చిన్నవాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి సంరక్షకుడి బాధ్యత. అంతే. మీ సందేహం తీరిందనుకుంటాను.
మరొక్కమాట - అప్పటికే భరతవంశంలో రాజ్యాన్ని ఆస్తిగా కొడుకుకి అప్పగించే సాంప్రదాయం పోయింది. భరతుడు తన కొడుకుని రాజుని చెయ్యలేదు. అక్కడనుంచి భరతవంశీకులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అసలు భారతయుద్ధానికి మూలకారణం ధృతరాష్ట్రుడే - హస్తినాపురాన్ని తన సొంత జాగీరుగా అనుకొని తన కొడుకుకి కట్టబెడదామని అనుకోబట్టే కదా...

రాజ్యం వీరభోజ్యం - అందుకే కదా... చివరికి పాండవులు గెలిచి రాజ్యాన్ని పాలించారు. ధీరత్వానికి తార్కాణం యుద్ధం చెయ్యడం కాదు - శాంతిని నిలబెట్టడం...
అయినా మీకు మాత్రం ఇవన్నీ తెలియవా... ఏదో చర్చ సాగితే జ్ఞాన మధనం సాగుతుందని బహుశా మీ ఆలోచన అనుకుంటాను. కొన్ని వేల సంవత్సరాలుగా ఆ కధ అలాగే చెప్పబడుతోంది. నిజంగా అది పక్షపాతబుద్దితో చెప్పబడి ఉంటే మానవుడి వివేకత్వం ప్రశ్నించి ఉండేది. కధ మట్టిలో కలిసి ఉండేది. ఏమండీ - హిట్లరు - ఔరంగజేబు - సతీ సహగమనాలు ఇవన్నీ మట్టిలో కలిసిపోలేదూ...
సుజాతగారూ, మీకు ఒసామా బిన్‌ లాడెన్‌ ఆదర్శపురుషుడనుకుంటా. అతడు కూడా నమ్మినదే ఆచరిస్తున్నాడు. మరి కులవ్యవస్థని నమ్మి ఆచరించేవాళ్ళని ఎందుకండీ వ్యతిరేకిస్తారు? నమ్మిందే ఆచరిస్తున్నారు అని అర్ధం చేసుకోవచ్చు కదా! నిజమేలెండి - అందరూ మన అంత విస్తృతమైన, ఆలోచించే బుర్రలు ఉన్నవాళ్ళు కాదు కదా! మనం మాత్రమే కరెక్టుగా ఆలోచించగలం. అయినా మనం నిప్పు ముట్టుకుని కాలితే తెలుసుకునేవాళ్ళం. నిప్పు కాలుతుంది అని ఎవరైనా అంటే అలాంటి సుభాషితాలు వినము కదా!

మహేష్ గారూ, మీకు సున్నితంగా చెప్పాలనుకున్నా. అందుకే తప్పు కోట్ చేసారు అని వదిలేసా. మీరు భారతం చాలా రోజుల కింద చదివారనుకుంటా. అప్పటికి ఇంకా సరియైన పరిణితి రాలేదనుకుంటా. భారతానికి సంబంధించి మీలో చాలా అపోహలున్నాయి. మరొక్కసారి చదవండి. ఇక రాజమౌళి, వర్మ గురించి మీ మాటే నా మాట.

Kathi Mahesh Kumar said...

@చివుకుల గారూ: నమ్మింది ఆచరించేవాళ్ళకి వ్యతిరేకత లేదని ఎక్కడా చెప్పలేదే! మరి మీరు హఠాత్తుగా ‘కులవ్యవస్థను నమ్మిఆచరించేవాళ్ళని అర్థం చేసుకోవడం’ ఎలావచ్చింది? కులాన్ని నిరసించేవాళ్ళుకూడా తాము నమ్మిందే ఆచరిస్తున్నారు కదా. కాబట్టి ఎవరు నమ్మిందివాళ్ళు ఆచరించినంతమాత్రానా అలా చేసే ఆపోజిట్ ideology వాళ్ళని మిగతావాళ్ళు గౌరవించాలని లేదు.కాకపోతే అదికూడా, "సమయానికి తగుమాటలాడి"లాగా కాకుండా సిన్సియర్ గా ఉంటేనే బెటర్ అనిమాత్రమే చెబుతోంది. అది కూడా సజెషన్ మాత్రమే, ప్రీచింగ్ కాదు.

భారతానికి సంబంధించి నావి అపోహలే అనుకున్నా,ఏభారతాన్ని చదివి నేను "నిజం" అని నమ్మాలి? అందుకే, what I think about it might still be right.You have every reason and right to condemn me.

Chivukula Krishnamohan said...

If I sounded even remotely like condemning you, I offer my unconditional apologies because I never meant it.

ఇది కేవలం సిద్ధాంతాల సమస్య కాదు. మన సిద్ధాంతం ఏదైనా దానిని నమ్మని వాళ్ళు మనుష్యులేకాదు - వాళ్ళకి బతికే అర్హత లేదు అని నిర్ధారించడం తప్పుకదా! అంటే ఇక్కడ సిద్దాంతాన్ని నమ్మడంలోగాని, దానిని ఆచరించడంలో గాని సమస్యలేదు. సమస్య సిద్దాంత మూలాలలోనే. ఇదే ముక్క ఒసామా బిన్‌ లాడెన్‌ కి చెప్పి ఒప్పించగలమా? కుదరదు కదా! అలాగని తను నమ్మిన సిద్ధాంతాన్ని అతడు ఆచరిస్తున్నాడు అని అతడిని అభినందించలేముకదా! నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనలో కూడా అలాంటి తప్పుడు సిద్ధాంతమూలాలు ఉండవచ్చు. మనని మనం తరచి చూసుకుంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటూ మన నమ్మినవిలువలని తులనాత్మకంగా చూడకపోతే మనకీ లాడెన్‌కీ తేడా లేదు.

మీకు మీరెంత రేషనల్ గా ఆలోచిస్తారనుకుంటారో చాలామంది కూడా అంతే సార్. చూసే దృక్కోణం వేరు అంతే. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. వీలైతే ఒక టపాగా వ్రాస్తా. సమస్యలపట్ల స్పందించే మీ సున్నితత్వానికి నేనూ అభిమానినేనండి. మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు.

అయినా మీరే దీనిని వదిలి తరువాత టపాకు వెళ్ళిపోయారు. ఇక్కడకి నేను కూడా ముగిస్తే మంచిదనుకుంటాను.

Chivukula Krishnamohan said...

చివరిగా... వెధవాయితనంలో సిన్సియారిటీ చూపిస్తే పైనవచ్చే స్వర్గం మాటెలాగున్నా ఇక్కడ ప్రపంచానికి నరకం చూపించడం మాత్రం ఖాయం. ఈ ముక్క మీకు నా వ్యాఖ్యలనుంచి అందుతుందో లేదో అని క్లియర్ గా చెప్పేస్తున్నాను. రామ్‌గోపాల్‌వర్మ,రాజమౌళి సినిమాలు వదలకుండా చూసినవాళ్ళని, భీష్ముడిని, వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆ రోజు మరణించినవాళ్ళని అడగండి - నా మాటకు వత్తాసు పలుకుతారు.
ఉంటాను మరి.

Kathi Mahesh Kumar said...

చివుకులగారూ: మనలో మనకి క్షమాపణ లెందుకులెండి. ఇలాంటి చర్చలే నా టపాలకు కొత్త అర్థాల్నిస్తాయని నమ్ముతాన్నేను. నేను రాసిందాన్ని ఎవరైనా బలంగా ఖండిస్తేగానీ, నేను రాసినదానికొక purpose ఉందని అనుకోను. ఓపిగ్గా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేదీ ఆ వ్యాఖ్యాతలను గౌరవించి మాత్రమే.

నేను కొత్త టపా రాసినంత మాత్రానా పాత టపాలలోని విషయాలమీద చర్చ ఆగనఖ్ఖరలేదు.

Anonymous said...

>>నేను తర్కించి నమ్మిందే
మహేష్, చాన్నాళ్ల నుండి అడుగుదామనుకుంటున్నా. "మీ తర్కం" - "సత్యం" ఎల్లప్పుడూ ఒక్కటే అని మీరు విశ్వసిస్తున్నారా?

Anonymous said...

పాండవపత్ని పేరు ద్రౌపది - ద్రుపదుడి కూతురు కాబట్టి. అలాగే కృష్ణ - నల్లగా ఉండేది కాబట్టి. పాంచాలి - పాంచాల రాజకుమారి కాబట్టి. యాజ్ఞసేని - యజ్ఞసేనుడి కూతురు కాబట్టి. మీరు ఆమె పేరును తప్పుగా రాస్తున్నారు.

ఇక మీరు రాసిన ప్రకారం దుర్యోధనుడు నవ్వుతూ ఎదురొచ్చి కౌగిలించుకుంటే, అతడు స్వార్థాన్ని, ఓర్వలేనితనాన్ని, శతృత్వాన్నీ జయించినట్లేగా? అంతకుమించి అతడు చేసిన తప్పులేవీ లేవు. కాబట్టి అతడు స్వర్గంలో ఉండదగ్గవాడే. ఇంతకూ యుధిష్టిరుడు చేసిన ఏకైక పాపం అబద్ధమాడ్డం అంటారు? జూదంలో తమ్ములను (వాళ్ల అంగీకారం కోసం కూడా చూడకుండా), ద్రౌపదిని ఒడ్డడం అసలు తప్పులే కావు, వాటికి శిక్షే లేదన్నమాట. శభాష్!

"అంతా బాగుందికానీ, అన్యాయంగా కౌరవులకు మాత్రం స్వర్గసుఖాలెలా వచ్చాయ్? ముఖ్యంగా అంత అధర్ముడైన దుర్యోధనుడు నరకానికి రాకుండా స్వర్గ సుఖాలెందుకనుభవిస్తున్నాడు?" ఈ ప్రశ్నకు మీ స్వకపోల కల్పితమైన సమాధానం రాసి, దాన్ని ఖండించడానికి అడ్డగోలు వాదన చేస్తున్నారు మీరు. ఇదే ప్రశ్నకు నేను చదివిన సమాధానం "ఎక్కువ తప్పులు చేసినవారు ముందుగా తాము చేసిన మంచి పనులకు స్వల్ప కాలం స్వర్గసౌఖ్యాలు అనుభవించి తర్వాత నరకానికి వెళ్తారు. అలాగే తక్కువ తప్పులు చేసినవారు ముందుగా తాము చేసిన తప్పులకు స్వల్ప కాలం నరకంలో శిక్షలు అనుభవించి తర్వాత స్వర్గానికి వెళ్తారు." అందుకే మొదట కౌరవులు స్వర్గంలోను, ద్రౌపది, పాండవులు నరకంలోను ఉన్నారు. ఇక పోరాటంలో వీరమరణం పొందిన దుర్యోధనుడు వీరస్వర్గానికి అర్హుడు. ఈ సూక్ష్మం కూడా యముణ్ణి అడిగేటప్పుడు యుధిష్టిరుడికి గానీ, ఈ టపా రాసేటప్పుడు మీకు గానీ గుర్తుకు రాలేదు! పొద్దులో నేను రాసిన కౌంతేయులు అనే వ్యాసం ఒకసారి చదవండి.

లాలూ ప్రసాద్ దశాబ్దాలుగా ఎన్ని ఆరోపణలొచ్చినా బీహారీ ప్రజల అభిమానం పొందగలిగాడంటే అతడిలో మనకు తెలియని విశిష్టతేదో ఉంది అనుకోకుండా అతణ్ని ఒక్క ముక్కలో వెధవ అనడం సబబా? భారతీయ రైల్వేను అతడు కొత్తపట్టాలెక్కించడం, తన నిర్వహణాసామర్థ్యంతో అందర్నీ అబ్బురపరచి IIM అహ్మదాబాదులో మానేజిమెంట్ గురులకే మానేజిమెంటు పాఠాలు బోధించడం మీకు తెలియదా?

@ అబ్రకదబ్ర & కామేశ్వరరావు గారు, బాగా చెప్పారు.

సుజాత వేల్పూరి said...

చివుకుల గారు,
నాకు ఎవరు ఆదర్శమో నేను నిర్ణయించుకుంటాను లెండి, మీరు తొందరపడి డిసైడ్ చెయ్యకండి! నేను చెప్పాలనుకున్నది మహేష్ గారు చెప్పేసారు. కులాన్ని నిరసించే వారు కూడా నమ్మినది ఆచరిస్తున్నట్టే! నమ్మినది ఆచరించడం అంటే నెగటివ్ పాత్రలే మీకు ఎందుకు గుర్తుకు రావాలి? ఏం పాపం, నమ్మినది ఆచరించి బాగుపడ్డ వాళ్లెవరూ లేరా మీ లిస్టులో? నా బ్లాగు మీద అభిప్రాయాలు నా బ్లాగులో రాస్తే బాగుంటుంది. ఇక్కడ చర్చ పక్క దోవ పట్టడం తప్ప ఒరిగేదేమీ లేదు.

అవును, నేను వీలైనంతవరకూ అన్నీ నా అనుభవం ద్వారానే తెలుసుకోవాలనుకుంటాను. ఎదుటివారిని corner చేయాలని చెప్పే సుభాషితాలు ఎవరు చెప్పినా సరే వినను.

బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసేటపుడు వెటకారాలు మానితే బాగుంటుందని (మీకెంత knowledge ఉన్నా సరే) నా అభిప్రాయం. ఇది సుభాషితం కాదు.

స్వేచ్చ said...

మీ పొస్ట్ లన్నింటి లోకి నాకు బాగా నచ్హిన పొస్ట్ ఇది...
నీను మొదటి నుంచి చేస్తున్నది ఇదే నండి....నీను చేసే పనిని....చాల సిన్సీర్ గా చేస్తాను....నేను చాలా హాపి గా వుంటాను కూడా....
నాకు అర్దం కానిది ఒక్కటే మన Brothers అదే మన దేస పౌరులు "చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది..." లా ఎందుకుంటారో నాకు ఇంతవరకు అర్దం కాలేదు...ఎది ఎమైనా నా జీవితం లో నాకు నచినట్టు మాత్రమే వున్నాను కాని ఏనాడు కూడ రెండు పడవల మీద అడుగు పెట్టలేదు .....