Saturday, August 23, 2008

దరిద్రనారాయణుడు

నేను జిల్లాస్థాయిలో పనిచేసేటప్పుడు ఒక IAS అధికారి, కలెక్టర్ గా ఉండేవారు. తను IITలో ఇంజనీరింగ్, IIMలో మేనేజ్ మెంట్ చేసి, విదేశాలకివెళ్ళే అవకాశం వదులుకుని, సివిల్సి పరీక్షలో ర్యాంకుసాధించి ప్రభుత్వాధికారిగా మారారు. తనతో ఎప్పుడు దేనిగురించి చర్చించినా,ఎంతోకొంత నేర్చుకుని బయటపడేవాడిని. అందుకే మేధావులతో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అంటారు కాబోలు.



వీరికి ఒక చిత్రమైన అలవాటుండేది. ఎప్పుడు ముఖ్యమైన ఫైలు మీద సంతకం పెట్టాలన్నా, తన డెస్కు పై అద్దం క్రింద ఉంచిన ఒక ఫోటోని చూసుకుని ఆ తరువాత సంతకం పెట్టేవారు. నేనిది కొన్నాళ్ళు గమనించాను. ఆసక్తిగా అప్పుడప్పుడూ ఆ ఫోటో ఏమిటో చూద్దామని ప్రయత్నించినా, ఇటువైపునుంచీ కనబడేది కాదు. ఏదైనా దేవుడి ఫోటో అయ్యుంటుందని నేను తీర్మానించేసి అప్పటికి ఆ ఆలోచనకు గుడ్ బై చెప్పేసాను.



కొన్నాళ్ళ తరువాత నేను జిల్లాస్థాయి నుంచీ రాష్ట్రస్థాయి కన్సల్టెంట్ గా హైదరాబాద్ వచ్చే సమయంలో, తన ల్యాప్ టాప్ పైన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించడానికి ఆయన పిలిస్తే, వారు కూర్చున్నవైపు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు యాధృచ్చికంగా వారు తరచూ పైలుమీద సంతకం పెట్టేముందు చూసే పోటో నా కళ్ళబడింది. ఆ ఫోటో,వయసుకి ముందే వయసుడిగిపోయి అర్ధనగ్నగా ఉన్న బక్కచిక్కిన ముదుసలిది.



ఒక్క క్షణం నా ప్రతిస్పందన ఆగినట్టనిపించింది. అంటే, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ప్రతిసారీ తను తలుచుకునేది ఎక్కడో కనబడకుండా ఉండే భగవంతుణ్ణి కాదు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పేదవాడ్ని. ఒక్క క్షణం నాకు ఆ ఆలోచనే అత్యంత గౌరవప్రదంగా అనిపించింది. నిజంగా ఇదే ‘సేవ’ కు అర్థం అనిపించింది. తన నిర్ణయం ఆ ఫోటోలో నిలువెత్తుగా నిలిచిఉన్న నిజమైన దేశ ప్రతినిధికి లాభదాయకంగా ఉండాలని కోరడం...కనీసం నష్టాన్ని కలిగించకూడదని అనుకోవడంకన్నా మించిన నిబద్ధత ఉంటుందా?



భూమిపై అవతరించిన మహానుభావులందరూ బుద్ధుడూ, క్రీస్తూ, మహ్మదూ, గాంధీతో సహా సమాజంలోని అత్యంత పేదవారి క్షేమం, చైతన్యం, అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను చెప్పినవారే. ఏ సమాజానికైనా పేదల, బలహీనుల, పీడితుల అవసరాలూ హక్కులూ సంరక్షింపబడినప్పుడు మాత్రమే సంపూర్ణత్వం సిద్ధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి చారిత్రక యుగంలోనూ వివిధ కారణాలవల్ల పేదరికం సృష్టింపబడుతూనే ఉంది. ఈ పేదరిక నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ఏ అభివృద్దైనా జరగాలి అని కాంక్షించడంకన్నా మించిన భక్తి, మతం, భగవంతుడూ వుండడని ఆ అధికారి నాకు చెప్పకనే చెప్పారు.



ఈ ఆలోచన నిజానికి ఏ మతానికీ కొత్త కాదు. హిందూ మతంలో "దరిద్రనారాయణుడు" అని పేదవారి గుండెల్లో ఉండే దేవుడి గురించి ఎప్పుడో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఈ ఆలోచన యొక్క బలాన్ని తెలియజెప్పింది ఇద్దరు. ఒకరు స్వామి వివేకానంద, రెండు మోహన్ దాస్ కరంచంద్ ‘గాంధీ’. కాకపోతే, ‘దరిద్రనారాయణుడి సేవ’ అని ఒక పూజ చేసి మిన్నకుండటమో, లేక గుడిలో కొందరికి అన్నదానం చేసి తృప్తిపడటమో జరుగుతోందేతప్ప, ఈ మూల సిద్దాంతాన్ని అటు జీవితంలో, ఇటు అభివృద్ధి మూసలో మన సమాజం ఇంకా సంపూర్ణంగా అన్వయించుకోలేదు. అలా జరగనంతవరకూ మన పవిత్రతలు అపవిత్రాలే, అభివృద్ధి అర్థరహితమే !



నేను మతాన్నీ, దేవుడ్నీ నమ్మను. కానీ మానవత్వాన్ని పెంపొందించే అన్ని విధానాలనూ,ఆలోచనలనూ అత్యంత గౌరవభావంతో చూస్తాను. అందుకే మతంచెప్పే మూడాచారాలకన్నా, ఇలాంటి విలువలను అవలంభిస్తేనే సర్వమానవాళికీ మంచి జరుగుతుందని భావిస్తాను.



"DARIDRANARAYAN is one of the millions of names by which humanity knows the unnamed and unfathomable God, who is unnamable and unfathomable by human understanding, and it means God of the poor, God appearing in the hearts of the poor. Therefore, Daridranarayan seva, seva of the poor, hungry, destitute, is the worship of Sri Narayan himself."



****

16 comments:

Sujata M said...

marvellous....

పెదరాయ్డు said...

ఆ అధికారి నిబద్దతకు జోహార్లు...ఇటువంటి వారు కొంతమంది ఉన్నా మనదేశం ముందుకెళుతూనే వుంటుంది. ఆ మహానుభావుడికి నా అభినందనలు.

MURALI said...

కొందరయినా ఇలాంటి ఆఫీసర్లు ఉండటం మన అదృష్టం.

సుజాత వేల్పూరి said...

నాకు నిజంగా నచ్చే విషయం మీద టపా రాశారు. ఈ దరిద్ర నారాయణులందరికీ ఏమీ చేయలేమా అనే వేదన కొందరికైనా ఉన్నందుకు సంతోషించాలి.

కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే కాక, వ్యక్తిగతంగా కూడా మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. ఫండ్స్ అన్నింటినీ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెడుతోందో నిలదీసే హక్కే కాకుండా, అలాంటి దరిద్ర నారాయణుల్ని ఆదరించడానికి పౌరు డిగా, పోనీ మనిషిగా మన contribution ఎంత ఉందనే బాధ్యత విషయం కూడా ఆలోచించుకోవాలి మనం!

cbrao said...

ఏ భూమికో (అమ్మాయే సన్నగా, అర నవ్వే నవ్వగా) కనిపిస్తే, మీ సౌందర్య రహస్య మేమిటి అని అడగలనిపిస్తుందా మీకు? మన నడుము కొలత పెరిగాక, భూమిక నడుము ఇంత సన్నగా ఎలా ఉంది చెప్మా అంటూ ఆశ్చర్య పడటం కద్దు. అడపా, తడపా టపాలు రాసే వారు, మహేశ్ ను చూసి ఇలాగే ఆశ్చర్య పడతారు.పర్ణశాల లో కూర్చుని మహేశుడు బ్లాగు టపాలు అలవక రోజూ ఇలా, ఎలా కత్తుల్లా విసురుతున్నాడో అని అచ్చెరువంది, మొన్న హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశానికొచ్చినప్పుడు, అడిగా " ఇన్ని టపాలు, ఉల్లాసంగా, ఉత్సాహంగా రాయటానికి మీరేమి తాగుతారు?" అని. చిర్నగవే సమాధానంగా దాటవేశాడు. ఫైల్ పై సంతకం పెట్టే ముందు, కలెక్టర్ గారు చూసే చిత్రం లో ఎవరున్నారో తెలుసుకోవటానికి చిన్న పరిశోధన చేసినట్లుగా, భొపాల్ వెళ్లి మహేష్ బ్లాగు రహస్యం తెలుసుకోవాలి. పర్ణశాలలో ఒక టపా ప్రచురించబడ్డాక, వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?

Anonymous said...

సరిగ్గా ఇలాంటి అర్థం వచ్చే మాటనే గాంధీ చెప్పాడని చదివాను.. "నువ్వు చెయ్యబోయే పని ఈ దేశంలోని అత్యంత పేదవానికి ఉపయోగపడుతుందని అనిపిస్తే ఆ పని చెయ్యి" -ఇలా ఉంటుంది దాని భావం. నేతలను గురించి చెప్పాడనుకుంటా!

prasanna said...

nijamga aa IAS officer evaro chala great.chala baga raasaru mahesh garu.

Kathi Mahesh Kumar said...

@CB రావు: మీ ప్రశ్నకు సమాధానంగా నేను ఇలా రోజుకొకటపా ఎందుకు,ఎలా రాస్తున్నానో ఒక టపాగా రేపే రాసేస్తున్నాను.చూడండి.

@చదువరి:ఇది హిందూమతంలో ముఖ్యంగా వైష్ణవుల నమ్మకాలలో ఒకటి.వివేకానందుడూ, గాంధీ ఇద్దరూ ఈ మానవతావిలుల్ని నమ్మినవారే. బహుశా గాంధీ చెప్పినది తెలిసే ఆయన (కలెక్టర్) అలా చెయ్యడం ప్రారంభించారేమో!

ఏది ఏమైనా,ఇది అంతరాత్మకు సంబంధించిన విషయం.అందరూ ఇలా "దరిద్రనారాయణున్ని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే!" అనే ఆలోచనమాత్రమే నా టపా ఉద్దేశం.

@సుజాత:ప్రభుత్వం,రాజకీయనాయకులూ, అధికారులూ, మనలాంటి సామాన్యులూ అందరం ఇలా ఆలోచిస్తే ఒక సంపూర్ణప్రజాస్వామ్యం రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.ఈ బాధ్యతని మనం గుర్తెరిగి ప్రయత్నిస్తే మంచిదే!

@sujata:ధన్యవాదాలు

@పెదరాయ్డు,ప్రసన్న&మురళి: ఇలాంటి అధికారులు,రాజకీయనాయకులూ కనీసం కొందరైనా ఉండటం వల్లనే మన ప్రజాస్వామ్యం ఇంకా మనగలుగుతోంది. ఇలాంటివారు మరింత మంది ఉండాలని కోరుకుందాం.

saisahithi said...

ఇక్కడ నాకో విషయం గుర్తుకొస్తోంది.
మదర్ థెరీసా ట్రైనులో ప్రయాణం చేస్తుండగా ' దరిద్రనారాయణుడు' కి సేవ చేయమని జీసస్ ప్రభోధించాడని చదివాను. బహుసా ఆ కలెక్టర్ దీన్ని ఈ విధంగా అన్వయించుకన్నారనుకుంటాను.
చాలా బాగుంది.

Purnima said...

The world is still better place to live అని అనిపించేది, ఇలాంటి వాళ్ళ వల్లనేనేమో!

Anonymous said...

ఆ "దరిద్రనారాయణ" కి మన వంతుగా మనం ఏం చేసాం అన్నది ప్రశ్నించుకుని, నిజాయితిగా వచ్చిన జవాబుకి మనం చెయ్యగలిగింది చేస్తే ఈ దేశం బాగుబడుతుంది అనుకోవటం లో ఏమైనా సందేహం ఉంటుందా?

ఆ అధికారి పేరు వెల్లడించబోవడానికి కారణం? ఇబ్బంది ఏమి లేక పోతేనే!

Unknown said...

బావుంది.

కొత్త పాళీ said...

మామూలు జీవితంలో మామూలుగా బతికేస్తూండగా ఇలాంటి విషయం ఒకటి హఠాత్తుగా ఎదురుబడి, మనెదురుగా ఒక వింత అద్దాన్ని నిలబెట్టి అందులో .. మనం ఎప్పుడూ చూసే ప్రపంచాన్నే వేరే కోణంలో .. వేరే రంగులో చూపిస్తుంది. ఎటొచ్చీ ఆ దృశ్యాన్ని ఎప్పటికప్పుడూ మననం చేసుకుంటూండాలి.
మంచి ఉత్తేజకరమైన టపా, మహేశ్

Subba said...

Mahesh Garu,

Chala Baga Undi. Aa Officer peru konchem cheppagalara?

Kathi Mahesh Kumar said...

@నెటిజన్ & సుబ్బ: ఆ అధికారి ఆంధ్రప్రదేశ్ కేడర్ IAS ఆఫీసర్. హైదరాబాదు కలెక్టర్ గా కూడా కొన్నేళ్ళు పనిచేసారు. అందుకే పేరు పబ్లిక్ గా చెబితే ఇబ్బందిగా ఉంటుందని దాటేసాను.అయినా ఆయన ఆదర్శం మనకు ముఖ్యంగానీ పేరు కాదుకదా!

@కొత్తపాళి: నిజమే ఆక్షణంలో నాకు అబ్బురమనిపించింది.ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆ ఆదర్శాన్ని తలుచుకుంటూ నా పనుల్ని కొలుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోకొంత ఆ దరిద్రనారాయణుడి సేవ చెయ్యాలనే నా ప్రయత్నంకూడా.

@అరుణ: ధన్యవాదాలు.

@పూర్ణిమ: నిజమే అలాంటివాళ్ళు ఉన్నారుగనకనే మన దేశం కొంతైనా పురోగమిస్తోంది.జీవితల్లో ప్రశాంతత నెలకొనివుంది.

@సాయి సాహితి: మీ మదర్ థెరిసా ఉదాహరణ బాగుంది. ఈ ఆలోచన ఎక్కడి నుంచీ వచ్చినా, ఆ అధికారి ఆచరిస్తున్న తీరేనాకు అత్యంత ముఖ్యం అనిపిస్తుంది.

muralirkishna said...

మహేష్ గారు మీరు ఏమి చేస్తుంటారొ తెలుసుకొవచ్చా మీ రచనలు బట్టీ మీరు జర్నలిజంలొ ఉన్నారని అనిపిస్తుంది..ఇక పోతే నేను అదే ఫీల్దులో ఉన్నాను