Sunday, August 24, 2008

నేను రోజూ ఎందుకు బ్లాగు రాస్తాను !

సి.బి.రావు గారు నా 'దరిద్రనారాయణుడు' టపాకు వ్యాఖ్యరాస్తూ నా బ్లాగు రాతలగురించి కొన్ని సందేహాలు లేవనెత్తారు. మొదటిది "అలవక రోజూ ఇలా, ఎలా కత్తుల్లా విసురుతున్నాడో" అని. రెండవది "ఇన్ని టపాలు, ఉల్లాసంగా, ఉత్సాహంగా రాయటానికి మీరేమి తాగుతారు" అని. అంతేకాక "వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?" అంటూ నాకొక చురకకూడా అంటించారండోయ్. వారడిగినవి చాలా విలువైన ప్రశ్నలు, ఎందుకంటే ఇప్పటివరకూ ఆప్రశ్నలకు నాకూ నిర్ధిష్టంగా జవాబులు తెలియదు.



హఠాత్తుగా మనల్ని ఎవరైనా జవాబు రాని ప్రశ్నలెవరైనా అడిగితే, "good question" అని మొదట అనేసి తరువాత ఆలోచించడం మొదలెడతాం. అలాగే, వారి వ్యాఖ్యకు ప్రతిగా ఏకంగా ఒక టపా "రాసేస్తా చూడండి" అని చెప్పి, ఇప్పుడు ఆలోచిస్తుంటే కాస్త గందరగోళంగా ఉంది. ఏదిఏమైనా, మన రతన్ టాటా 'నానో' కారు రేటు గురించి "a premise is a promise" అంటూ లక్షరూపాయలకే ఇవ్వడానికి తయారైనట్టు, నేనూ వీలైనంత సిన్సియర్గా సమాధానం ఆలోచిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను.



"To understand a writer in his totality, you need to understand his life and times" అంటారు. అలాగే రావుగారడిగిన ప్రశ్నలకి సమాధానంగా కొంత నా జీవితాన్ని వివరించకతప్పదు.



ఇంట్లో నేనే చిన్నవాడిని అవటం వలన స్వతహాగా కొంత రెబల్ మనస్తత్వం కలిగింది. పుస్తకాలు చదవడం చిన్నప్పుడే మా అన్నయ్య ద్వారా అలవడింది.అలా చదివినదాన్ని ఊహించి ఆనందించడం నా చుట్టూ చాలా మంది చేస్తే, నేను కాస్త తింగరోణ్ణికాబట్టి ఆనందించడంతోపాటూ ప్రశ్నించడం మొదలెట్టేవాడిని. అప్పట్లో అది నా తరహా భాష్యం (interpretation) చెప్పుకోవడానికి నేను చేసిన ప్రయత్నమన్నమాట. ఇలా చందమామ నుంచీ యండమూరి వరకూ చదివేసాను. యండమూరి అప్పట్లో కొంత సామాజిక నిజాల్ని ప్రశ్నించే రచనలు చెయ్యడం, నేను వాటిని చదవడంతో కొంత critical thinking మొదలయ్యింది. నాకు ఇష్టమొచ్చింది నేను మనస్ఫూర్తిగా చెయ్యగలగటం, అనే ఒక విలువని అప్పట్లో చాలా అభిమానించి internalize చేసుకున్నాను. అందుకే నన్నూ ఏ ఇంజనీరుగానో,డాక్టరు గానీ చేసెయ్యడానికి మా నాన్నగారు సైన్సు తీసుకోమంటే, ఖచ్చితంగా వద్దని చెప్పి ఆర్ట్స్ తీసుకున్నాను.



నా అదృష్టంకొద్దీ తేదీలు బట్టీపట్టమనే హిస్టరీ టీచర్లూ, స్టాటిస్టిక్స్ ఫార్ములాలు వల్లెవేయమనే ఎకనామిక్స్ టీచర్లూ లేక జ్యాగ్రఫీ అంటే మ్యాపులు కొలిచే సబ్జెక్ట్ అన్నట్లు చెప్పే టీచర్లు కాక, కొంత innovative గా పాఠాలు చెప్పే ఉపాధ్యాయగణం దయవల్ల నా విమర్శనా దృష్టికి కొంత తర్కం,ఆలోచనా దొరికాయి. ఉదాహరణకి చరిత్రపాఠాలు తారీఖుల ఆధారంగాకాక, ఘటనలను ఒక పద్దతి ప్రకారం అర్థం చేసుకోవడం వలన సులభంగా నేర్చుకోవచ్చని మా హిస్టరీ మాస్టారు నేర్పారు. ఒక "3C formula" మాకు నేర్పించి జీవితంలో చాలా పెద్ద సహాయం చేసిన ఆ టీచర్ని మర్చిపోలేను. మా మాష్టారి ప్రకారం ఏ చారిత్రాత్మక ఘటననైనా మూడు భాగాలుగ విభజించొచ్చు, 1.Causes (కారణాలు), 2. Course (ఘటనాక్రమం), 3. Consequences (ఫలితాలు), నిజంగా చరిత్రకు ఇవే ముఖ్యం. తారీఖులు కాదు.ఈ ఘటనలు జరిగిన తేదీ గుర్తుంటే అది ఒక బోనస్సేతప్ప,అదే అంతంకాదు. ఈ ఒక్క ఆలోచన, నా జీవితంలోని విషయాలను అర్థం చేసుకునే విధానంలో తీవ్రమైన మార్పుని తీసుకొచ్చింది.



ఈ ఆలోచనలు నాలో అంకురించి మొక్కగా మొలిచిన దశలో, మైసూర్ కాలేజిలో గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాను. అక్కడ నేను నా సబ్జెక్టు ఆంగ్ల సాహిత్యం. అసలే సగానికిపైగా మతాన్ని వ్యతిరేకించి, వ్యక్తి స్వాతంత్ర్యానికి పట్టంకట్టే ఈ సాహిత్యం నా స్వతంత్ర్యా భావాలకు రెక్కలనిచ్చింది. అప్పుడే "ఆంగ్ల సాహిత్యాన్ని అర్థం చేసుకో, తెలుగు సాహిత్యాన్ని అనుభవించు" అని చెప్పిన మా ఫ్రొఫెసర్ మాటతో అప్పటివరకూ యండమూరి వరకూ ఆగిన నా చదువు చలం,కొడవగంటి కుటుంబరావు,చివుకుల పురుషోత్తం,చిట్టిబాబు, బుచ్చిబాబు,తిలక్ ల పరిచయంతో పరిమళించింది.దానితోపాటూ చదవిన ఆంగ్లసాహిత్యం ఎలాగూ ఉంది. ఇలా మొత్తానికి చాలా మంది జీవితాల్లా కాక, my academics always helped my "Education" అన్నమాట.



ఆపైన ఏ TV లోనో సినిమాల్లోనో చేరదామనుకున్న నేను Communicationలో పోస్ట్ గ్ర్యాడ్యుయేషన్ చేసినా, అక్కడ సామాజిక సమస్యల గురించీ వ్యక్తులుగా, మీడియా ఫ్రొఫెషనల్స్ గా, ఈ దేశ పౌరులుగా మేము నెరవేర్చవలసిన బాధ్యత గురించీ ఒక theoretical frameworkలో చెప్పారు. గ్రామీణ నేపధ్యం కలిగిన నాకు ఆ సమస్యలు తెలిసున్నా, ఈ సైద్దాంతిక ధృక్కోణం నా ఆలోచనకు కొంత ఉద్వేగాన్ని అందించింది. ఈ నేపధ్యం కారణంగా జీవితాన్నీ, చుట్టూవున్న సమాజాన్ని నాదైన రీతిలో అనుభవించడానికీ,అర్థం చేసుకోవడానికీ, ప్రతిస్పందించడానికీ ప్రయత్నిస్తూ ఉంటాను.



ఈ నా ఆలోచనలకి,స్పందనలకీ బ్లాగు మూలంగా ఇప్పుడు అక్షరరూపం వస్తున్నాయంతే. బ్లాగులేనప్పుడు మిత్రులతో,కుటుంబ సభ్యులతో మౌఖికంగా చర్చించేవాడిని ఇప్పుడు రాస్తున్నాను. అంతే తేడా. ఆలోచించిందో లేక అనుకున్నదో చెప్పటం అలవోకగానే జరుగుతుందేతప్ప అలసటన్నది దరిదాపులకి కూడా రాదు. సాహితీమూర్తులను చదివి సంపాదించుకున్న భాష, నేను ఇప్పటివరకూ తెలుసుకున్న జ్ఞానం నా ఆలోచనల మరింత పదునుపెట్టి రాసేలా పురికొల్పుతుంటే, ఉత్సాహంగా రాయటానికి ఇంకేమీ అవసరంగా అనిపించలేదు. రాసిన తరువాత, రాసింది మరోసారి చదువుతుంటే కలిగే తృప్తే నా ఇంధనం. మరింకేం తాగనవసరం లేదు కూడాను.



"వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?" అన్నదానికి మరింత విస్తృతమైన సమాధానం ఇవ్వాల్సిందే.అలాగే ఈ మధ్య తలెత్తిన కొన్ని అపోహలకూ సమాధానం ఇవ్వాల్సిందే. ఒక ఆలోచనవచ్చిన తరువాత దాన్ని సాధ్యమైనంత త్వరగా, వీలైనంత ‘మూలసహజ స్థితిలో’ అక్షరరూపం ఇవ్వాలంటే దాన్ని అర్జంటుగా రాసెయ్యాలి. అందుకే టపామీదటపా నా బ్లాగులో ప్రత్యక్షమవుతున్నాయి.ఇదివరకూ జ్యోతి గారూ, దిలీప్ గారుకూడా ఈ విషయంగా నాకు కనీసం రెండ్రోజులకొక టపా చొప్పున రాయమని సూచించారు. కానీ వల్లకావడం లేదు. నా ఆలోచనా స్రవంతి అలా తయారయ్యింది. పేపరు మీద రాసే అలవాటు లేక, డైరెక్టుగా బ్లాగులోనే రాస్తున్నందువలన "పబ్లష్" నొక్కడం చాలా temptingగా ఉండి, ఆగలేకపోతాను.


౦౦౦

ఈ మధ్య కొందరు, నేనేదో లైమ్ లైట్ లో ఉండటానే కోరికతో ఇలా రోజుకొక టపా రాస్తానని తమతమ బ్లాగుల్లో చెప్పడం చదివాను. అంతేకాక కేవలం కాంట్రవర్సీలు సృష్టించి నా పాప్యులారిటీ పెంచుకోవడం ఒక (ఇగో సంతృపి పరుచుకునే) అవసరంగా భావించి పనికిమాలిన రాతలు రాస్తానని కూడా అనుకోవడం జరిగింది. నాకు ఈ అభిప్రాయాలు (నిందలు అనికూడా అనుకోవచ్చునేమో) నవ్వునే తెప్పించాయి. ఏదోఒకటి రాస్తే ఎవరైనా లైమ్ లైట్లో ఉండగలరా? అని ప్రశ్నించుకుని సంతృప్తికరమైన సమాధానం దొరకక మానేసాను. పైపెచ్చు నన్ను రెండ్రోజులకొక టపా రాస్తే, కనీసం చెప్పిన విషయం మీద ఆలోచించి వ్యాఖ్య చెయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పే పాఠకులు నా బ్లాగుకుండగా రోజుకొక టపా "కేవలం లైమ్ లైట్ లో వుండటానికి" నేను రాయాల్సిన అవసరం ఉందా! అన్న సందేహానికి సమాధానమే దొరకలేదు.



ఇక కాంట్రవర్సీల సంగతి మరింత హాస్యాస్పదం. నా ఆలోచనలు think of the unthinkable తరహాలో వివాదాస్పదంగా ఉండవచ్చేగానీ, కేవలం టపాలద్వారా వివాదాలు సృష్టించి "పబ్బం గడుపుకోనే" అవసరం నాకైతే ఖచ్చితంగా లేదు. బ్లాగు నా emotional outletకే తప్ప ఎటువంటి ఆర్థిక లాభాలనూ అపేక్షించి కాదే ! ఇక సామాజిక (బ్లాగులోకంలో) విలువంటారా, అది వివాదాన్ని సృష్టిస్తే వచ్చే అవకాశం అస్సలు లేదు. మరి వేటికోసం నేను వివాదాలు సృష్టించాలి?



నా ఆలోచనలతో, అభిప్రాయాలతో విభేధించేవారికి నా బ్లాగులో ఎప్పుడూ సముచిత స్థానం ఉండనే ఉంది. వారు తమ విభేధాలను నిస్సంకోచంగా పంచుకోనూవచ్చు, నా అభిప్రాయాలను తీవ్రంగా ఖండించనూవచ్చు. ఇక నేను రాసింది నేను చాలావరకూ విశ్వసించి (వీలైనంత వరకూ దానికి సంబంధించిన సమాచారం సేకరించి) రాస్తానుగనక నా అభిప్రాయాలకు మద్దతుగా వాదనలు వినిపించే హక్కు నాకూ ఉందని నమ్ముతాను. ఆ హక్కును "పిడివాదం" అంటే, వారు హేతువును చూపకుండా కేవలం నమ్మకాల ఆధారంగా చేసేదికూడా అదేకదా !



మన తెలుగువారిలో, వ్యతిరేకతను అంగీకారాత్మకంగా తెల్పే (disagree agreeably) లక్షణం చాలా తక్కువన్న నా నమ్మకాన్ని చాలా మంది నిజం చేసారంతే. ఏది ఏమైనా, నా బ్లాగు నా వ్యక్తిత్వానికి ఒక అద్దం లాంటిది. నన్ను నిజజీవితంలో అందరూ అభిమానించనట్లే ఇక్కడా కొందరు ద్వేషిస్తారు, మరికొందరు అభిమానిస్తారు. అభిమానానికి సహేతుకమైన కారణం చాలావరకూ ఉంటుందికానీ, ద్వేషానికి.... ఒక్క అపోహ లేక వారు జీవితాన్ని చూసే ధృక్కోణం వ్యతిరేకమైతే చాలు. అయినా ఆలోచనలు వేరైనంతమాత్రానా వ్యక్తుల్ని ద్వేషించాలని నేను అనుకోను. అందుకే ఎప్పుడూ అంగీకారాత్మకంగా విభేధించడానికి ప్రయత్నిస్తాను. ఇక అంతకుమించి హద్దుదాటితే చురక అంటించగలిగే భాష ఎలాగూ నాదగ్గరుందని. అంతేకాక మర్యాదపుర్వకంగా నిరసించగలిగే సంస్కారం కూడా నా పెంపకం, నేను నేర్చుకున్న చదువూ నాకందించాయి అని నేను భావిస్తాను.



ఇదివరకూ ఒక టపాలో చెప్పినట్లు, నా బ్లాగులో నేను మనస్ఫూర్తిగా నమ్మినవీ లేక తీవ్రంగా విభేధించేవీ రాస్తుంటాను. If we all agree, do we really have anything to discuss? అందుకే నా అస్తిత్వం నేను నేనులా ఉండటంలో ఉందని నమ్మినట్లే, నా బ్లాగూ నా బ్లాగులాగానే ఉంటుంది. అందరికీ నా బ్లాగులో స్వాగతం...as long as you have an apatite for disagreement and difference of opinion.



***

19 comments:

Purnima said...

మీరిది రాయబోతున్నారని తెలియగానే, ఏం రాస్తారని ఊహించుకున్నానో (హమ్మ్.. నేనూ, నా ఊహలు!) దాదాపుగా అవే విషయాలు మీరు చెప్పారు. ఇన్ని రోజులుగా మీ బ్లాగు చదవతూ మీ రచనా విధానాన్ని, మీరు కమ్మెంటే తీరుని నేను అర్ధం చేసుకున్నది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది అని ఈ టపా ద్వారా తెలుసుకున్నాను. సంతోషం.

బ్లాగింగూ కూడా ఓ పెద్ద పని (నిజానికి పెద్ద పనే!) అన్నట్టు, "ఎలా రాస్తారూ? ఎలా రాస్తారు?" అని అడగడం నాకు నవ్వు తెప్పిస్తుంది. ఐదు రోజుల్లో టెస్ట్ క్రికెట్ ని నలభై గంటలు పాటు ఎలా చూడగలను? చాన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసిన ఫ్రెండ్ తో గంటల తరబడి ఎలా మాట్లాడగలను? సెలవని తెలిసిన రోజున ఎందుకంతగా నిద్రపోగలను? రొజులో ముప్పావు వంతు అంతర్జాలంలో ఎలా గడపగలను? ఆస్వాదిస్తూ చేస్తే ఏదైనా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందే తప్ప నష్టపెట్టదు. చాలా బాగా రాసేవారు కూడా నెలల కొద్దీ బ్లాగులు అప్-డేట్ చేయకపోతే "మీకు మరీ బద్ధకం" అని నేనను. అందుకంటే రాయలన్న మూడ్ వస్తే ఆపతరం కాదు. అది ఉన్నా ఒక్కోసారి కుదిరే పరిస్థుతులుండవు అని అర్ధం చేసుకోగలను కనుక. అలాగే అన్నీ కలిసొచ్చి రాసేవారిని, "ఎందుకు రాసేస్తున్నారో" అని అడిగించుకునప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అది అసలైతే పొగడ్తే ఏమో!

బ్లాగింగ్ ఒక ఎమోషనల్ ఔట్-లెట్ అని బాగా వర్ణించారు. నా మట్టుకు నాకు, ఒక స్నేహితునితో ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో, బ్లాగు కూడా అందుకే వ్రాయలనిపిస్తుంది. ఇక బ్లాగును, అందులో విషయాన్ని కాక బ్లాగు రాస్తున్న మనిషిని కూడా ఈ రాతల వల్లే అర్ధం చేసేసుకోవాలన్న తాపత్రయంతో మీరన్న కాంట్రవర్సీల, హిట్లు లాంటి థీసీస్ లు వస్తాయనుకుంటా! విషయం నచ్చిందా, లేదా? అర్ధవంతంగా ఉందా, లేదా? అన్న దగ్గర వదిలేయక, ఈ మనిషి ఇలా రాయడానికి కారణాలేంటబ్బా అని అతిగా ఆలోచించటం వల్ల వచ్చిన ఇబ్బంది, I guess.

"మీరీ విషయాలపైనే రాస్తూ ఉండండి, అవే నాకిష్టం" అన్న అభిమానులను మీరెలా బుజ్జగిస్తున్నారో చెప్పలేదు? ;-)

దీని గురించి రాస్తూ పోతే, నన్నాపటం కష్టం! కానీ నాలో ఉన్న అసహనాన్ని కొద్దిగా అయినా మీ టపాలో చూసుకోగలిగాను. ధన్యవాదాలు!!

(This comment is entirely my personal opinion. Not really expecting anyone to empathize with it. Nor any disagreements would be clarified. This is my understanding as of now, and it stands there!)

Dr.Pen said...

మీరు తెలుగు బ్లాగులలో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించే ప్రతి ఒక్కరినీ రాళ్లతో కొట్టి చంపే సమాజం మనది, అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. మీరు రాస్తూ ఉండండి...కాకపోతే వృధా చర్చలకు ఆస్కారం కల్పించొద్దు.

cbrao said...

"చదివినదాన్ని ఊహించి ఆనందించడం నా చుట్టూ చాలా మంది చేస్తే, నేను కాస్త తింగరోణ్ణికాబట్టి ఆనందించడంతోపాటూ ప్రశ్నించడం మొదలెట్టేవాడిని." -పర్ణశాల మహేష్
ప్రశ్న, మానవుడి మేధ ఎందుకు, ఎలా, ఎప్పుడు అన్న ప్రశ్నలు వేసియుండకపోతే, ఈనాడు మనము ఈ ఉత్తరాన్ని e-mail లో కాకుండా, పావురాల ద్వారా పంపివుండేవారము. చెట్టుపై నుంచి కింద పడే ఆపిల్ పండు, కిందకు కాకుండా, పైకెందుకు వెళ్లటం లేదన్న ప్రశ్న, భూమ్యాకర్షణ సిద్ధాంతం కనుగొనటానికి కారణమయ్యింది. పక్షులు ఎగరగలుగుతున్నాయి. మనమేల ఎగురరాదు అనే ప్రశ్న రైట్ సోదరులకు వచ్చి ఉండక పోతే, అమెరికాకు మనము ఓడలలోనే ప్రయాణం చేసే వారము. ప్రశ్న మానవాళి ఆలోచన, జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసిన మహత్తరమైన వజ్రాయుధం.

ఈ చరాచర ప్రపంచ సృష్టికర్త భగవంతుడని చర్చి,బైబుల్, వేదాంతాలు చెప్తాయి. దేవుడున్నాడని ఆస్తికులు బల్లగుద్ది చెప్తారు. ఇది విశ్వాసం పై ఆధారపడి ఉంది. సైన్స్ ఈ ఆలొచనా విధానానికి భిన్నంగా, పలు ప్రశ్నలు వేస్తూ, తనే సమాధానాలు కనుక్కుంటూ, ఈ నిరంతర పరిశోధనలో తనను తాను సవరించుకుంటూ, ముందుకు నడుస్తుంది. తను విశ్వసించినవాటికి ఋజువులు చూపిస్తుంది. నాస్తికులు సైన్స్ ను నమ్ముతారు. దేవుడు లేడని ప్రచారం చెయ్యరు. ఆస్తికులు ఉటంకించే దేవుడి అస్తిత్వానికి, తమ శాస్త్రీయ దృక్పధంతో, దానికి ఋజువు చూపమంటారు. శాస్త్రరీత్యా దేవుని అస్తిత్వాన్ని ఋజువు చేయటం సంభవం కాలేదు కనుక, నాస్తికులు దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు

spandana said...

కత్తి మహేశ్ గారూ,
మీ సమాధానం కత్తిలా వుంది. మీ ఆలోచనా ధోరణే నాది కూడాను.

ఏదైనా పని గట్టుకొని రాయాలనుకొంటే కష్టం గానీ, ఇలా తనంత తానుగా ఊరే స్పందనల ఊటే ఈ బ్లాగింగ్ అయితే, ఇక అది మెదడులోంచి, వేళ్ళలోకి, వేళ్ళలోంచి బ్లాగులోకి అలా అలవోకగా ప్రయాణిస్తుంది. కావల్సింది ఆ భావావేశం ఎగదన్నుకొచ్చే సమయంలో కీబోర్డు దొరకడమే!

గత కొన్ని మీ రాతల ద్వారనే మీ వ్యక్తిత్వం నాకు అభిమానపాత్రమయ్యింది. మీరు రోజుకొకటి కాక గంటకొకటి రాసినా చదవడానికి నేను సిద్దం.

--ప్రసాద్
http://blog.charasala.com

RG said...

మీరు రాయండి మాష్టారూ, కాంట్రవర్సీలంటారా, అవి లేకపోతే జీవితం చప్పగా ఉండదూ...

Naga said...

టపా నాకు చాలా బాగా నచ్చింది... రోజుకు ఒకటి ఎందుకు రాస్తారో మాత్రం అర్థం కాలేదు! :)

@రావు గారూ: "శాస్త్రరీత్యా దేవుని అస్తిత్వాన్ని ఋజువు చేయటం సంభవం కాలేదు కనుక..." అన్నారు కదా, సంభవం కాలేదు అని ఎందుకు అనుకుంటున్నారు? శాస్త్ర ప్రకారం "దేవుడు ఉన్నాడు" అనడం కంటే "దేవుడు లేడు" అన్నది ఎక్కువ కరెక్టు! లేని దానికి పేరు పెట్టి వాదాన్ని తయారుచెయ్యడమే నాస్తికత్వంలోని ప్రధాన లోపం.

రవి వైజాసత్య said...

టీవీలో ఇరవైనాలుగ్గంటలూ పోగ్రాంలు వస్తున్నాయని ఇరవైనాలుగ్గంటలూ టీవిముందు కూర్చోలేము కదా..అలాగని వాళ్లని బాబూ కాస్త ఆపండి అనలేము కదా..మనం చదివే కంటే వేగంగా పుస్తకాలు ప్రచురితమౌతున్నాయని వాటిని ఆపమనటం ఏమిటి?
కూడలిలో వచ్చినవన్నీ చదివి వ్యాఖ్యనించాలనుకోవటం ??? నదిని చేతుల్లో బంధించాలనుకోవటమే దాన్ని పిల్ల కాలువను చేసేస్తుంది. తెలుగులో బ్లాగులు కుప్పలుతెప్పలుగా రావలి. ఒక కూడలి నుండి వంద కూడళ్లు పుట్టాలి.

మహేష్ గారూ మీ ఆలోచన శ్రవంతికి ఏమాత్రం అడ్డుకట్ట వేయకుండా..టకటకలాడించాలనిపించినప్పుడళ్లా టపా వేస్తుండండి.

Anonymous said...

'love him or hate him but you cannot ignore him' అనేది మీకు సరిగ్గా సరిపోతుంది. ఇన్ని టపాలు వ్యాఖ్యలు వ్రాసే మీకు, మీ ఓపికకి జోహార్లు.

సుజాత వేల్పూరి said...

మీరు ముందొక పని చేస్తే బాగుంటుందని మీ బ్లాగు రెగ్యులర్ గా చదివే రీడర్ గా చెప్పాలనుకుంటున్నాను. మీరేమి రాయాలనుకుంటారో రాయండి. ఎవరి అపోహలు వారిని పడనివ్వండి. వాళ్లందరికీ సమాధానాలు రాస్తూ కూచోనక్కర్లేదు. ఆ సమాధానల ప్రభావం మీ తర్వాతి టపాలపై ఉంటే అవి effective గా ఉండవు. పట్టించుకోనవసరం లేని కామెంట్లకు జవాబులిస్తూ ఉంటే self defence కూడా అనుకోవలసి వస్తుంది.

మనసులోని ప్రతి భావాన్ని అందరితో పంచుకోవాలన్నంత ఆసక్తి, కోరిక, ఓపికా, అసలు ఇంత energy levels అందరికీ ఉండవు. మీరు రాయడానికి చెప్పిన ప్రతి కారణమూ బాగుంది.మీరు సినిమా ఫీల్డులోకెళ్ళి ఉంటే మంచి creative director అయ్యుండేవారేమో అనిపిస్తోంది.

ఎవరి బాధలు(అభిప్రాయాలు,ఆవేదనలు, అక్కసులు) వారికుంటాయి. మీ బాధ(మనసులో ఉప్పొంగే భావాలు) మీరు రాయండి. మీ బ్లాగుకు మీరే రాజు.

మనల్ని తిట్టేవారు లేకపోతే కొన్నాళ్లకి బోరు కొడుతుందేమో బ్లాగింగ్! ఎవర్నీ పట్టించుకోకుండా మీరు రాయండి, మేం చదువుతాం!

జ్యోతి said...

మహేష్ నువ్వు చెప్పింది నిజమే.. మనలోని ఆలోచనలను రాసి అందరితో పంచుకుని , చర్చిస్తూ ఉంటే ఆ ఆలోచనలు ఇంకా పెరుగుతాయి. అది వెంటనే రాసేయాలనిపిస్తుంది. నీ బ్లాగు నీ ఇష్టం . ఎన్నైనా, ఎలాగైనా రాసుకోవచ్చు. కాని నాదో సమస్య . ఇది నువ్వు ఒప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు రాసే టపాలన్నీ బావుంటాయి అని చెప్పలేను. ఎక్కువ శాతం ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అది చదివి అదే రోజు కామెంట్ ఇచ్చే సామర్ధ్యం, సమయం అందరికి ఉండదు కదా? అందుకే బ్లాగు చదువరులకు కూడా నీ టపాలు చదివి, ఆలోచించి, కామెంట్స్ రాసి చర్చించే అవకాశమివ్వమనేది. నేను మొదట్లో ఇలాగే రోజు ఒకటి, రెండు టపాలు కూడా రాసేదాన్ని. కాని ఎక్కువ సరదాగానే ఉంటాయి కాబట్టి అంత ఇబ్బందిగా ఉండేది కాదు. నీ టపాలు అలా కాదే?? అంతే తప్ప రెండు రోజుల కొకసారి రాయమనడానికి వేరే ఉద్దేశ్యం లేదు.

మేధ said...

మీ pic - నా కామెంట్ - "Just do it"

Jagadeesh Reddy said...

మహేష్ గారూ... ఈ ప్రపంచంలో ఎవరి ఆలోచనలను వారు మిగతావారితో పంచుకునే అవకాశం ఉంది. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించవచ్చు లేదా విబేదించవచ్చు. అది వారి వారి ఆలోచనా తీరు మీద ఆధారపడి వుంటుంది. ఎవరో ఏదో అంటారని, మీ మదిలో దాగిన మధుభావాలని వెలుగు చూపకుండా దాచడం అభిలషణీయం కాదు. మీకెప్పుడూ మాలాంటి వారి మద్దతుంటుంది. "Stop not till the goal is reached".

cbrao said...

రచయిత సున్నిత మనస్కుడు. ఒక మానసిక బలహీనత ఉంటుంది. ఆ ఋగ్మత లో,తనకు తెలిసిన విషయాలు ప్రపంచానికి తెలియ చెప్పాలన్న దుగ్ధ (urge) ఉంటుంది. ఈ దుగ్ధే అతని చేత మహత్తరమైన రచనలు చేయటానికి ఉత్తేజాన్నిస్తుంది. ఇందుకు ఉదాహరణగా కార్ల్ మార్క్స్ 'Das Capital', గోర్కీ అమ్మ వగైరా చెప్పుకోవచ్చు. నిజానికి రచయిత మానసిక ఋగ్మతే అతని బలం. ఒక విషయం పై ఆలొచిస్తూ ఉన్నప్పుడు, ఆలోచనలు, కొత్త ఊహలు జీవన ధారలా వస్తాయి. వాటిని ఆపటం కష్టం. వాటిని ఎంత త్వరగా కాగితం పైన పెడితే, అంత బలోపేతంగా ఉంటాయి. ఆలొచనలను వికసించ నీయండి. వెయ్యి భావాలు వెలుగులోకి రానీయ్యండి.

బ్లాగుకు విమర్శలు ఉప్పు లాంటివి. ఉప్పు లేని కూర ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. విమర్శలూ జిందాబాద్. బ్లాగరూ జిందాబాద్.

Kathi Mahesh Kumar said...

@పూర్ణిమ: నిజమే పుస్తకం చదవడంలో,క్రికెట్ మ్యాచ్చో సినిమానో చూడటం ఎలాగో ఆనందాన్ని కలిగిస్తే రాయడమూ అంతే సులభం.అనుభవాల్నీ,ఆలోచనల్నీ,అభిప్రాయాల్నీ రాసి దాచుకోవడానికి బ్లాగుకన్నా మంచి ప్రదేశం నాకైతే ఇంతవరకూ దొరకలేదు. ఇక అభిమానించేవాళ్ళతోపాటూ మనస్ఫూర్తిగా ఖండించేవారూ దొరకడం అంత సులభంకూడా కాదు కదా!
"మీరీ విషయాలపైనే రాస్తూ ఉండండి, అవే నాకిష్టం" అనే అభిమానులకు నేను విన్నవించుకునేది ఒక్కటే, మనిషిలో ప్రేమ,కోపం,విచారం మొదలైన భావాలున్నట్లే నాలోనూ అన్ని ఆలోచనలూ ఉన్నాయి. కాబట్టి అన్నిరకాల టపాలూ ఎదురుచూడండి.

@డా.స్మైల్: మీప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీ సూచనని పాటించడానికి ప్రయత్నిస్తాను.
@cbrao :మీరు అడిగిన ప్రశ్నలే ఈ టపాకి కారణం. మొదటగా అందుకు నా ధన్యవాదాలు.నిజమే ప్రశ్నించడం లేకుంటే ఇంత ప్రగతి జరిగేదా!
@ప్రసాద్: ధన్యవాదాలు. నాలాంటివాళ్ళు ఉంటారన్న నా నమ్మకాన్ని మీరు నిజం చేసారు.
@Falling Angel: మీరు చెప్పినట్లే కానిచ్చేస్తానండీ.
@నాగన్న:ఇంత "ఆవేశం" ఉన్ననేను రోజుకొకటిరాయడం వీలైతే మరిన్ని రాయడం సహజం కదండీ!
@రవి వైజాసత్య: ప్రోత్సాహానికి ధన్యవాదాలు
@Giri: నాకు చదవడం ఇష్టం,ఈ మధ్య రాయడంపైనకూడా చాలా ఇష్టం పెంచుకున్నాను. అందుకే ఇన్ని టపాలూ వ్యాఖ్యలూ. ధన్యవాదాలు.
@సుజాత:మీ సూచనల్ని తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తాను.ఎప్పుడో ఒకప్పుడు సినిమా తీస్తానండోయ్!ఇప్పటికీ ఆ అవకాశం ఉంది.మీలాంటి చదివేవాళ్ళుంటే అంతకంటేనా!
@జ్యోతి: మీ సూచన చాలా వివేకవంతమైనది.నిజమే,నా టపాలని చదివి అర్థం చేసుకుని స్పందించడానికి కొంత సమయం అవసరమే. కానీ రాయానే నా బలహీనతను పోస్ట్ పోన్ చెయ్యలేక మీ సూచనని పాటించలేకపోతున్నాను.అందుకే క్షమాపణ చెబుతున్నాను.వీలైతే ఖచ్చితంగా అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
@మేధ: Thank you
@ఎస్పీ జగదీష్ : ధన్యవాదాలు.
@:సి.బి.రావు: ఉప్పు నాకూ ఇష్టమేనండి. కాకపోతే ఉప్పుకోసం కూర చెయ్యంకదా..! కేవలం రుచికోసం ఉప్పేసుకుంటాం. అందుకే మోతాది మించినప్పుడు వగరుగా ఉండి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కానీ మనం మాత్రం నవ్వుతూ భరించేస్తామండోయ్. అసలే logical deduction మన పద్దతి. మీ ఆలోచనలకు (మళ్ళీ)నా ధన్యవాదాలు.

Anonymous said...

మహేశన్న బ్లాగు , అందుట్లో వాక్యలు చదివితే పొద్దు గడచిపోతుందన్నట్టు. కడ్మ బ్లాగర్లు రాసే పని లేదు. అన్న బ్లాగేస్తే మాస్. అన్న వాక్యేస్తే మాస్. మ మ మాస్.--అన్నా సరదాకి వ్రాసినా. బ్లాగులోకంల నీవు రారాజువి

Sujata M said...

బావుంది.. సో - ఇదన్న మాట రీసన్ !

నాకూ టైం ఉంటే, నేనూ రాసేద్దును - అనుకుంటాను అపుడపుడూ - కానీ నా అభిప్పిరాయాలను షేర్ చేసుకుని, వాటిని సరిదిద్దే ఒక స్నేహ హస్తం ఉంది. But though u love to blog... , బ్లాగింగ్ కు ఎడిక్ట్ అయిపోవడం వల్ల లాభాలు ఏమున్నాయి. మీలో ఆ ఆర్ట్ ఉంది. కాబట్టి మీరు నెట్టుకొస్తున్నారు. సుజాత గారన్నట్టు మీరు మీ వ్యాఖ్యల్లో 'సమర్ధన కో', 'విమర్శనాత్మక విశ్లేషణ కో' దిగి ఇంకో టపా రాస్తారు ! మీరు లైం లైట్ లో ఉంటే, ఒక విధంగా మంచిదే coz u have something good abt urself. కానీ - ఇంత బాగా రాయడానికి మీరు ఆలోచనకో, టైపింగ్ కో.. ఇంకా రక రకాల పనుల మీద ఎంత సమయం వెచ్చిస్తారో తెలుసుకోవాలనుంది. మీ లోని ఫైర్ ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. ఇంకా బ్లాగుతూ నే ఉంటారు. అయితే బ్లాగు ఉన్నదే ఇందుకు! కానివ్వండి.. మీరో పెద్ద కత్తి మే ఢమాల్ (మా ఊరి భాషలో మెచ్చుకోలు! భయపడకండి!!)

Bolloju Baba said...

yes you are right
go ahead

Kathi Mahesh Kumar said...

@sujata:బ్లాగులకి ఎడిక్ట్ అయ్యే ప్రసక్తి లేదులెండి. I have lot many things to do in the day.ఉద్యోగంతోపాటూ పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం,స్నేహితులతో మాట్లాడటం,ప్రయాణాలూ ఇలా చాలా ఉన్నాయి.

బ్లాగులకోసం నేను రోజుకి దాదాపు 2-4 గంటలు వెచ్చిస్తాను.పొద్దున్న త్వరగా లేస్తాను కాబట్టి 6 - 7.30 స్నానానికెళ్ళేవరకూ బ్లాగుతా. ఇక సాయంత్రాలు ఎలాగూ ఉన్నాయ్.రాత్రి 9.00 - 10.30 అప్పుడప్పుడూ 11 వరకూ ఇదే పనిచేస్తాను.

నిజానికి I am using this as a substitute for watching TV.ఇదివరకూ ఇంతకన్నా ఎక్కువసమయాన్ని TV చూడటానికి వాడేవాడిని.ఒక విధంగా చూస్తే నాకు బ్లాగువల్ల రెండూ లాభాలున్నాయి 1)నా ఆలోచనల్ని కనీసం రాయగలగటం 2)TV చూడకుండా ఉండగలగటం. ఒక అర్థరహితమైన అలవాటునుండీ ఒక అర్థవంతమైన అలవాటులోకి మారాను.అందుకే ఇంతగా బ్లాగడానికి వీలవుతోంది.

@బాబాగారూ: ధన్యవాదాలు.

Sujata M said...

Wonderful. I was addicted :( (to the net - not just blogging) Now, I dont watch TV at all.. (what a relief) I try to keep myself away from my laptop, as far as possible. I hate TV.

Good reply. Epudostunnaru Hyd ? I think u are still katti me dhamaa. (not jatar dhamal)