పేట్రోల్ ధరలు మండిన వార్త వినగానే "ఐతే ఏడ్లు కట్టండి" అనెక్కడన్నా వినపడుతుందేమో అని నా కనుల్నే చెవులుగా చేసి తెలుగు బ్లాగులన్ని ఆలకించేసా. తీరా చూస్తే, "పాపం మనం !" అనే బదులు సుజాత గారు ఆమోదయోగ్యమైన ప్రధానిగా మాత్రమే మిగిలిపోయి, "ఇది తప్పదు" అని చేతులెత్తేసిన మన్మోహన్ సింగ్ ను "పాపం!" అనేసరికీ, నా మెదడు మోకాల్లోకొచ్చి కొంత అతివాగుడు కామెంటెట్టి ఊరుకున్నా.
కాకపోతే నా మనసు మూలలో, "ఎందుకిలా చమురు ధరలు తగలడ్డాయా?" అన్న యక్షప్రశ్న బీజమై నాటుకుపోయింది. అది బహుశా కాస్త సారమైన మూలలో పడినట్టుంది. అందుకే ఈ రోజు హిందూస్థాన్ టైమ్స్ పేపరు లో ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర్ర ప్రభుత్వం పెట్రోలు,డీజల్ పై వేసే పన్ను మాత్రమే, లీటర్ కు 33 రూపాయలని చదివేసరికీ గుండె గుభేలుమని నానా రసాలన్నీఊరి ఆ అనుమాపు బీజాన్ని కాస్తా "ఇంతై వటుడింతై, బ్రహ్మాండంబంతై" అన్న తీరులో మహావృక్షం చేసేసాయ్.
ఈ వృక్షవిశాలాన్ని నా చిన్ని మనసులో కూర్చలేక, కుదించలేక భలే ఛావొచ్చిపడిందని తలచి కాస్త ఈ మతలబుని తెల్సుకుని నెమ్మదించుదామనుకున్నా. అనుకున్నదే తడవుగా కాస్త ఇలాంటి జ్ఞానంలో ప్రవీణుడైన మా ‘ఇంటాయన్ను’ ("నువ్వే మీ ఆవిడకో మొగుడివి, నీకింకో మొగుడా!" అని రావుగోపాలరావు లా పిదపబుద్ది చూపి అనేసుకోకండి, ఇంటాయనంటే మా ఇంటి ఓనర్ అనే సాధారణంగా) ఈ విషయమై ఆరాతీసా, కూపీలాగా.
నా సందేహ వృక్షరాజాన్ని ఆయన తేరిపారా తిలకించీ,నా మొర సాంతం ఆలకించి, సాలోచనగా "ఇలా జరగకూడదే" అన్నాడు. ఎలా జరక్కూడదో మనకస్సలు తెలియదు గనక వెర్రినవ్వొకటి విసిరి, ఇండియా మార్కు తెలిసీతెలియని తలఊపుడు ఒకటి ఇచ్చుకున్నా. నా అజ్ఞానాన్ని గ్రహించినవాడై, "పెన్నూపేపరూ తీసుకో" అన్నాడు. "సరే" అని కలంకాగితాన్ని నా అజ్ఞానాన్ని పోగొట్టే దివిటీలా, స్టాచ్యూఆఫ్ లిబర్టీ తరహాలో పట్టుకు కూర్చున్నా. "ఒక లెఖ్ఖ వెయ్" అన్నాడు మా ఇంటాయన. అసలే మనం లెఖ్ఖల్లో పెద్ద బొక్కగనక (జీరో అని గ్రహించి,ఈ శ్లేష పదాన్ని క్షమింఛగలరు) నా మొబైల్ లో ఉన్న క్యాలిక్యులేటర్ ని నిర్లజ్జగా నొక్కడానికి ప్రయత్నిస్తుండగా తనే "ఫరవాలేదు చిన్నలెఖ్ఖే" అని నోటితోనే ప్రపంచపు ఆయిల్ ఖాతాలన్నీ లెఖ్ఖగట్టిపారేసి నా విశాలవృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలించకపోయినా, ఒక కంఫర్ట్ లెవల్ కి కుదించాడు. ఈ కుదింపు లెఖ్ఖ కాస్త పంచుకుంటా!
ఒక బ్యారల్ (200 లీటర్లు) క్రూడ్ ఆయిల్ ధర, ప్రపంచ మార్కెట్టులో ఈ రోజు 125 $ అమెరికన్ డాలర్లు. అంటే ఒక లీటరు ధర మన రూపాయిల్లో ఐతే Rs 25/- అన్న మాట. ఇక మిగిలింది దానిని శుద్దిచేసే ఖర్చు. రిలయన్స్ రిపైనరీ వారి లెఖ్ఖల ప్రకారం ప్రతి బ్యారల్ కూ దాదాపు 10$ డాలర్ల ఖర్చు శుద్దీకరణకు వెచ్చించబడుతుంది. అంటే ఒక లీటరుకి కేవలం Rs 2/- ఖర్చు. అంటే, వెరసి ప్రస్తుతం ఉన్న ఖర్చులతో సహా లెఖ్ఖగడితే, మన పెట్రోలు ధర కేవలం Rs 27/- ఉండాలి. కానీ ఉందా? ఇక రవాణా, పరిశ్రమ లాభం, అతిగాలేని సేల్స్ ట్యాక్స్ కలుపుకుని పది రూపాయలనుకున్నా, Rs 37/- దాటకూడదన్నమాట. మరి ఇప్పుడు ధర...దాదాపు 60 రూపాయలు. ఇక మండదా గుండె?
ఇక నష్టం వచ్చే అవకాశమే లేనప్పుడు "పరిశ్రమ నష్టాల్లొ ఉంది" అని ఇంత హంగామా ఎందుకూ? అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. దీనికీ సమాధానం ఉంది. పోయిన సంవత్సరం క్రూడ్ ఆయిల్ రేటు ప్రకారం పరిశ్రమతో రేటు విషయమై (తనకు రావల్సిన పన్నుతోసహా) ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, ఒకవేళ ప్రపంచ మార్కెట్టులో ముడిచమురు ధర పెరిగినా, పరిశ్రమలను తన రేటు మాత్రం పెంచొద్దని చెప్పి, తనవంతు పన్ను మాత్రం దర్జాగా దండుకొని నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పన్ను మినహాయించి, లేక తగ్గించి నష్టాల్ని భర్తీ చెయ్యొచ్చు. కానీ, ఎన్నికల సమయంలో ‘అభివృద్ది చూపించడానికి’ కావలసిన డబ్బు లేకుండాపోతుంది. అందుకే పరిశ్రమ పేరు చెప్పి, ప్రభుత్వం తన జేబులూ పెట్రోలు డబ్బుతో ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని నింపుకొంటున్నదన్నమాట.
ఇవన్నీ తెలిసిన తరువాత ‘ఎడ్లు’ కాదు, ప్రభుత్వానికి పాడెగట్టాలన్నంత కోపమొస్తోంది.
Friday, June 6, 2008
పెట్రోల్ ధర మండుతోంది, ఎడ్లు కట్టండి !
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
katthi, koDavali, baaku, chaaku..
ప్రైవేటు చమురు కంపెనీలు చూపిస్తున్నవన్నీ ఇప్పటికే వచ్చిన నష్టాలు కావు. పరిస్థితి మునుపటిలా కొనసాగితే (?) రాగల నష్టాలు (notional losses) మాత్రమే. ఇది ప్రభుత్వమూ, ప్రైవేటువాళ్ళూ కలిసి అంతర్జాతీయ ధరల పేరు చెప్పి ఆడుతున్న దొంగనాటకం మాత్రమే. అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలిసి సర్ ఛార్జీలతో మనల్ని దోచారని మఱువరాదు.
వీళ్ళకి నాదొక ప్రశ్న: నిజంగా ప్రజలమీద మీకు ప్రేమే ఉంటే ప్రైవేటీకరించిన (భారతీయ) చమురుబావుల్ని జాతీయం చేయండి. అవి అందరికీ చెందుతాయి. అంబానీకో, అమెరికన్ కంపెనీలకో కాదు.
మీ ఇంటాయన తేల్చేసినంత తేలిక కాదేమో ఆ లెక్కలు?
@తెరెసా గారూ నెనర్లు.
@మీరు చెబుతున్నవి నిజాలు కావచ్చు.నాకీ విషయంలో విస్తృతమైన సమాచారం లేదు. కానీ గడచిన రెండు సంవత్సరాలలో ముడిచమురు ధర రెండింతలు పెరగటమైతే నిజం,కానీ అదేరీతిన పెట్రోల్ ధర పెంచుకునే అవకాశం కంపెనీలకు ప్రభుత్వం కల్పించలేదు.దీన్ని బట్టి మా ఇంటాయన విశ్లేషణ సబబేనేమో అనిపించింది. దీనిలో ఇంకా మతలబుంటే తెలియజెప్పగలరు.
@అబ్రకదబ్ర గారూ,నిజంగానే ఈ లెఖ్ఖలు అంత సులభం కాదని నేనూ అంగీకరిస్తాను. కాకపోతే, నాలాంటి (ఈ విషయంలో)వేలిముద్రగాడికి చెప్పటానికి మా ఇంటాయన కాస్త సరళీకరించి ఉండవచ్చు. నాలాంటి చాలామందికి బహుశా ఇది పనికొస్తుందేమో!
ఇక మన కేంద్ర మంత్రి ‘మురళి దేవ్ర’చెప్పిన "The government has to come to the rescue of oil firms - either give them some more subsidies or allow them the price raise" వ్యాఖ్య చూస్తే, నేనర్థం చేసుకున్నది కొంత సబబే అనిపిస్తోంది.
@Mahesh:
Why can't you write another article on why rice prices are so high when the paddy producer is getting only a mere portion of it
Why can't you write another article on why the pulses rates are increased almost double in recent years
and similarly on the edible oil prices increase ...
@tadepalli:
You views always baffles like hell. Don't you think nationalization is an (your beloved) erra jhenda concept?
మహేష్ గారు,
ఎన్ని లెక్కలు వేసినా, ఎన్ని బందులు చేసినా మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని దోచుకుంటుంది అని తెలిసినా పెరిగిన ధరలు చచ్చినట్టు పెట్టాల్సిందే. ఊరికే కంఠశోష తప్పితే ఒరిగేది ఏమీ లేదు..
బాగుంది మహేష్ గారు! ఇంతకీ నిన్న విపక్షాల బంద్ కి మద్దతుగా మీరు ఎడ్లబండి మీద ఆఫీసుకి వెళ్ళారా? లేక అసలు హైదరబాదులోనే లేరా? ఎందుకంటే ఈ పెట్రోల్ ధరల్కి , బస్ చార్జీల పెంపుదల కి మేమందరం నిరసనగా(నీరసంగా) "బండి కాదు మొండి ఇది సాయం పట్టండి, పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి" అని(ఎడ్లు కనిపించక పోయే సరికి) అనేసుకొని ఇంట్లో పెరగని(కొంత మాత్రమె పెంచుతాము అన్న వై.యెస్.ఆర్ గారి మాటలకి కాస్త ఊరట చెంది) గాస్ తో వేడి వేడి పకోడి చేసుకొన్నాము అందుకని.. (ఇంకా వంట నూనె పెరగలేదేంటి చెప్మా అనుకొంటూ)
@సూర్యుడు గారూ, మీరు చెప్పిన వాటి మీద కూడా రాయడానికి ప్రయత్నిస్తాను.
@జ్యోతి గారూ,మన్నించి అంగీకరించడం కన్నా గొంతువిప్పి వ్యతిరేకత తెలియజెప్పి తరువాత మార్పుకోసం మన పరిథిలో పోరాడుతూ ఉండటం బెటర్ కదా! అందుకే తెలుసుకోవడానికి ప్రయత్నం, చర్చించి నిగ్గుతేల్చడానికోయత్నం.
@రమణి గారూ, విపక్షాల బంద్ కూడా హంబక్కె! గొంతునొక్కి ప్రభుత్వాన్ని ఇప్పించలేని వామపక్షాలు గోతుచించుకుని తృప్తిపడితే ఎట్టా? మనలాంటి సామాన్యుల సంగతివేరు..కానీ వీళ్ళూ దొంగలే. తోడుదొంగలు.
ఇక నేనేం చేసారంటారా! మనమిప్పుడు కేరాఫ్ ‘భోపాల్’ అండీ,హైదరాబాద్ కాదు. ఇక్కడ బీ.జే.పీ ప్రభుత్వం ట్యాక్స్ తగ్గిస్తామంటున్నారు మరి. కాబట్టి కాస్త హ్యాపీయే.
అసంరాలో ఇప్పుడు గ్యాలన్ పెట్రోలు $4.50 చేరింది (నాన్ ప్రీమియం). రూపాయలు-లీటర్లలోకి మారిస్తే అది Rs.50 చిల్లర. డీజిల్ ధర అంతకన్నా ఎక్కువ. ఇండియాలో రకరకాల సబ్సిడీల వల్ల డీజిల్ ధర ఎప్పుడూ పెట్రోల్ కన్నా తక్కువే ఉంటుంది. పెరిగిన ధరల ప్రకారం పెట్రోల్ ధర ఢిల్లీలో Rs. 50.52, డిజిల్ Rs. 34.48 అని విన్నాను. మన ఇంధన అవసరాల్లో 80 శాతం పైగా దిగుమతి చేసుకునే నేపధ్యంలో ప్రపంచ దేశాల్లో చాలావాటితో పోలిస్తే ఇండియాలో ఇప్పటికీ ధర తక్కువే అని నా ఉద్దేశం.
@అబ్రకదబ్ర గారూ, మీరు చెప్పింది నిజమైతే మనం ప్రభుత్వానికి చాలా కృతజ్ఞులై, కిమ్మనకుండా పడుండాలి. ఎందుకో నాకు పెద్దగా రుచించటం లేదు.
ఈ విషయం పైన నాకు పెద్ద అవగాహన లేదుగనక, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం" గారిని కనుక్కోవలసిందే.
నాకు పెద్దగా తెల్దు అంటూనె మంచి విషయాలు చెప్పారు. మీ రన్నట్లు పెట్రోలు ధర లో 33 రూపాయిలు అంధ్రా పన్ను కాదు. అది కేంద్ర ప్రభుత్వ వాయింపు. అంధ్రా పన్ను లీటరు పెట్రోలు కు సుమారు 7 రూపాయిలు.
అందువల్లే ఒక్క కేంద్ర ప్రభుత్వ పన్నులు మాత్రమే ఉండే యానంలో లీటరు పెట్రోలు అంధ్రాలో కంటే 7 రూపాయిలు తక్కువగా ఉంటుంది. రేట్లు పెంచకముందు యానంలో 44 రూపాయిలు ఆంధ్రాలో 51 రూపాయిలు ఉండేది. ఈ 7 రూపాయిల తేడా ఆంధ్రా ప్రభుత్వం వాటా గా చెపుతారు.
అందువల్ల యానంలో 30 వేల జనాభా కు సుమారు 5 పెట్రోలు బంకులూన్నాయి. అవికూడా రోజుకు కొన్ని పదుల లక్షల (మిలియన్లని అనుకోవచ్చు) వ్యాపారం చేస్తాయి. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలు యానం వెళ్ళి టాంకులు నింపించుకుంటారు.
మీ రన్నట్లు సామాన్యుడికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది. అణు ఒప్పందానికి మోకాలడ్డుపెట్టడం వెనుక ఉన్న లాజికి అర్ధం కాదు. ప్రస్తుత పరిస్థితులలో అణు శక్తి ద్వారా కార్లు నడపలేకపోవచ్చు. కానీ కొంతవరకూ భారం తగ్గుతుంది గా.
మొన్న టీవీలో నాగేశ్వర్ గారు కొన్ని ప్రివేటు చమురు శుద్ధి కంపనీలు, ఇక్కడ వెలికి తీసిన చమురును , ఎగుమతిచేసుకుంటూ, విపరీతంగా లాభాలు పొందుతున్నాయి. వాటికి ముక్కు తాడువేయగలిగినట్లయితే పెట్రోలు ధరలు తగ్గించవచ్చని సూచించారు. ఎవరు వింటారు.
మీరు లేపిన దుమారంలో మరొక కోణం. మనం ప్రతినిత్యం కొనె ఉప్పులు, పప్పులు, బియ్యం, వంటి నిత్యావసరాలలో మనం చెల్లించే ప్రతి పదిరూపాయిలకు 2 నుంచి 3 రూపాయిలు ప్రభుత్వ బొక్కసానికి పోతుందట. కొన్ని విలాస వస్తువులైన సోపులు, క్రీములు, సెంట్లు వంటివాటిలో 3 నుంచి 4 రూపాయిలు పోతాయట. ఇక సిగరెట్లు, వంటి వాటివిషయంలో 4 నుంచి 5 రూపాయిలు రాజ్యం వాటా అట.
అలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఇలా వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నప్పుడు, (చాలా పధకాలు మధ్యతరగతికి దూరంగా ఉంటాయి..) ఇదంతా |టాక్స్ పేయర్స్ మనీ అని, ఇండులో మావాటా కూడా ఉంది అని అడిగే నాధుడేడీ?
బొల్లోజు బాబా
1 లీటరు క్రూడు ఆయిలు శుద్ధిచేసిన తరువాత 1 లీటరు పెట్రోలు వచ్చేస్తుందా ? రాదు. కొంత భాగం పోతుంది. శుద్ధి చేసిన పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి కారణం అది.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధర పెరగడానికి కారణం డాలరు విలువ క్షీణించడం (పెట్రోలు అమ్మకాలన్నీ డాలర్లలో నడుపుతున్నారు అమెరికా ఒత్తిడి మూలంగా).
ఫ్యూచర్ ట్రేడింగు ద్వారా పెట్రోలు ధరలని స్పెక్యులేటర్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇంకో రెండేళ్ళలో క్రూడు ధర బేరెల్ కి 200 డాలర్లు చేరుకుంటుందని ఉవాచా (అంటే పెట్రోలు ధర రెట్టింపు అవుతుందన్నమాట).
ప్రభుత్వం పన్నులన్నీ తీసిపడేసినా పెట్రోలు ధరలు పెరగడం ఖాయం. దీనికి మూలకారణం మన భూమిలో శిలాజ ఇంధన నిల్వలు చాలా పరిమితంగా ఉండడమే (మహా వస్తే పెట్రోలు మరో 60 ఏళ్ళు, బొగ్గు మరో 200 ఏళ్ళు వస్తాయి). దీనికి తోడు గ్లోబల్ వార్మింగు బెడద పొంచి ఉంది.
పెట్రోలు ధరలపై పన్ను అధికంగా ఉండడం వల్ల ఇతర ఇంధనాల వినియోగం ప్రోత్సహించగలుగుతాము. మన భవిష్యత్తుకి ఇది అత్యవసరం. పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం పెట్రోలు లాభాలని కొంత ప్రజలకి తిరిగి మళ్ళించగలుగుతోంది (అవినీతితో ఈ డబ్బులు హుళుక్కి అయిపోతున్నది వేరే విషయం). సమాజంలో ధనిక వర్గాలు పెట్రోలుని మరింత ఎక్కువగా వినియోగించుతారు. సామాన్య ప్రజానీకంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందుకని పెట్రోలు భారం పడేది ధనిక వర్గం పైనే, మధ్యతరగతి వర్గంపై కూడా కొంత పడుతుంది. కానీ పేదవర్గంపై అతి తక్కువ. థియరీలో, ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు పేదలపై ఖర్చు పెట్టవచ్చు.
బుర్ర ఉన్న కమ్యూనిస్టులు ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు డిమాండు చేస్తారు ? పేదలపై ప్రేమ ఉంటే ధనికులకి సబ్సిడీ ఇవ్వడమేమిటి ? వాతావరణాన్ని నాశనం చెయ్యమని డబ్బు బాబులకి ప్రోత్సాహం ఎందుకు ? ప్రస్తుతం అంతా సిగ్గులేని రాజకీయం నడుస్తోంది.
ప్రజలపై పెట్రోలు భారం తగ్గించాలంటే అత్యవసరమైన పని రైలు నెట్వర్కుని ఆధునీకరించడం. మొత్తం విద్యుత్తుతో నడిపిస్తే పెట్రోలు భారం సరుకుల రవాణాపై పడదు. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. ద్రవ్యోల్పణం అదుపులోకి వస్తుంది. దీర్ఘకాలికంగా, మన దేశానికి ఇది అత్యవసరం.
ఇది జరగాలంటే విద్యుత్తు ఉత్పత్తి అతివేగంగా పెరగాలి. దీనికి రెండే మార్గాలు - ఒకటి బొగ్గు, రెండు న్యూక్లియర్ విద్యుత్తు. మన దేశ అవసరాలకి లక్ష ఏళ్ళు సరిపడేంత థోరియం నిల్వలు మన దేశంలో నిమిడి ఉన్నాయి. బొగ్గు 200 ఏళ్ళు మాత్రమే వస్తుంది. మనం అతి ధనిక దేశం అన్నమాట. గ్లోబల్ వార్మింగుపై మనం నిజాయితీగా ఉంటే బొగ్గుని మనం విడిచిపెట్టి న్యూక్లియర్ విద్యుత్తుని ప్రోత్సహిస్తాము. ఈ విషయం లోనూ కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సుకి రివర్సులో పనిచేస్తున్నారు.
ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బులన్నీ (పెట్రోలుపై లక్షల కోట్లు నష్టాపోతోంది ప్రభుత్వం) సబ్సిడీలంటూ చివరకి ధనిక, మధ్యతరగతి వర్గాలకి అప్పగిస్తే ఇంక భవిష్యత్తు సంగతేమిటి ?
పెట్రోధరల గురించి మెరుపుతీగ (ray lightning) చాలా తేలికైన భాషలో వివరించారు. నేను కూడా మరికొంత జత చేస్తాను.
అంతర్జాతీయ విపణిలో పీపా ముడి చమురు ఇప్పుడున్న ధరకు చేరటానికి బీజాలు 2003లో ఇరాక్ యుద్ధప్రారంభం నాడే పడ్డాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఇరాక్ యుద్ధానికవుతున్న ఖర్చు, అదే సమయంలో సబ్ ప్రైం సంక్షోభం కారణంగా అమెరికాలో ఆర్ధిక మాంద్యం నెలకొని డాలరు బాగా దెబ్బతినింది. యుద్ధమయిపోతే ఇరాక్ లోని చమురు బావులన్నీ మనవే, అప్పుడు పెట్రో ధరలు తగ్గుతాయి అంటూ బుష్ కొంతకాలం అమెరికన్లని నమ్మిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడా మాటలు ఎవరూ నమ్మటం లేదు. 2003లో పీపా $25 ఉన్న ముడి చమురిప్పుడు పీపా $130 దగ్గరకు చేరింది. ఆ మేరకు గ్యాలను పెట్రోలు 2003లో $1.75 ఉన్నది ఇప్పుడు $4.50 కి చేరింది. అంటే వందశాతం కన్నా ఎక్కువ.
అమెరికన్ల చమురు గోల మనకెందుకనుకుంటున్నారా? అమెరికన్లు తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలని ఇప్పటికిప్పుడు తగ్గించగలరు. ఎలాగంటారా? ప్రపంచంలో చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న కొద్ది దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అయితే వాళ్లు తెలివిగా తమ చమురు నిల్వలను చాలావరకూ భవిష్యత్ అవసరాలకోసం భద్రపరచుకుని ప్రస్తుత అవసరాలకోసం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటారు. ఈ దిగుమతి ఎక్కువగా ఒపెక్ నుండే జరుగుతుంది. అమెరికా కనుక అలాస్కాలో పుష్కలంగా ఉన్న చమురు నిల్వలని తవ్వి తీయటం మొదలెడితే ఒపెక్ వాళ్ల పెట్రోలుకి డిమాండ్ తగ్గి ధరలు చచ్చినట్లు కిందికొస్తాయి. (ప్రపంచంలో అత్యధికంగా పెట్రో ఇంధనాలు వాడే దేశం అమెరికానే )
అయితే ఈ విషయంలో అమెరికన్ సెనెట్, కాంగ్రెస్ లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల ఒక రకంగా మంచిదే, దానివల్ల ప్రత్యామ్నాయ ఇంధనాల గురించి అన్వేషణ వేగవంతమవుతుంది అనేది చాలా మంది వాదన. ఇప్పటికే అమెరికాలో ఆ విషయమై ప్రయోగాలు, పరిశోధనలు ఊపందుకున్నాయి. రెండేళ్ల క్రితమే తొలిసారిగా మార్కెట్ లోకొచ్చిన హైబ్రిడ్ కార్లు ఇప్పుడు చాలా సాధారణమైపోయాయి. మరో రెండేళ్లలో హైడ్రోజన్ సెల్ ఆధారిత కార్లు కూడా రాబోతున్నాయి. మరోవంక ఇధనాల్ వినియోగం చాలారెట్లు పెరిగింది. పెద్ద పెద్ద కార్లంటే ఇష్టపడే అమెరికన్లు ఎట్టకేలకు కరోలా లాంటి చిన్నకార్లకు మొగ్గు చూపటం ప్రారంభించారు. SUV ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలు mass transportation గురించి మరింత శ్రద్ధ పెట్టనారంభించాయి.
మన దేశంలో రకరకాల కారణాల వల్ల ప్రభుత్వాలు మొదటి నుండీ సబ్సిడీ ధరలకు ప్రజలు అలవాటు పడేలా చేశాయి. పీపా ధర ఒక డాలరు సమీపంలో ఉనంప్పుడు ఈ సబ్సిడీలు ప్రభుత్వానికి అంత భారమనిపించలేదు. పైగా అప్పట్లో వినియోగమూ తక్కువే. ఇప్పుడు వినియోగమూ, ధరా రెండూ పెరిగిపోయాయి. ఒక్కసారిగా సబ్సిడీలు ఎత్తేయవలసి వచ్చేసరికి ప్రజలు గగ్గోలెత్తిపోతున్నారు. ఇదంతా ముందు చూపు లేని ప్రభుత్వాల నిర్వాకం. ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా అంటే అనుమానమే. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నానో కార్లలాంటివి రోడ్లమీదికొచ్చాక ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి.
ఈ డిస్కషను లో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. చాలా మట్టుకు రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి. సంఖ్యా పరంగా మద్యతరగతి వాళ్లు ఎక్కువకాబట్టి సబ్సిడిలు ఇస్తే మద్యతరగతి వారికే ఎక్కువ లబ్ది చేకూరితుంది. వీడెలాగూ ధనిక వర్గం కాదు, ప్రభుత్వ పధకాలు పొందటానికి పేదవాడూ కాదు.
అలాంటప్పుడు వీడి వాటా పొందటానికి ఆక్షేపణ ఏమిటి?
బొల్లోజు బాబా
"సంఖ్యా పరంగా మద్యతరగతి వాళ్లు ఎక్కువకాబట్టి సబ్సిడిలు ఇస్తే మద్యతరగతి వారికే ఎక్కువ లబ్ది చేకూరితుంది".
అదే సమస్య. మన మధ్యతరగతి జనాభా మొత్తం అమెరికన్ జనాభాకన్నా ఎక్కువ. ఎల్లకాలమూ ఇంతమందికి సబ్సిడీ ఇవ్వటమంటే ఎవరివల్లవుతుంది?
Post a Comment