ఈ మధ్య నేను రాసిన టపాలూ, విన్నవించిన అభిప్రాయాలూ సాంతం వింటూ వచ్చిన ‘అబ్రకదబ్ర’ అనే ఒక బ్లాగుకర్త, "ప్రేమ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నావ్!" అని ‘కామెంటు’ చేతబుచ్చుకుని నా మెదడును చాలా పరుగెట్టించి, ఆలోచనలతో నింపేసారు. మేము బ్లాగు కామెంట్లలొ ఇన్నాళ్ళూ హోరాహూరీగా చేసిన పొరు తరువాత, కొన్ని ప్రశ్నలు ముఖ్యమైనవి గా మొలిస్తే మరికొన్ని ఆలోచనలు భాష రూపం దాల్చాయి. వాటిని ఇక్కడ ‘వ్యక్తి స్వేచ్చా - సమాజ శ్రేయస్సు’ అనే శీర్షికన ఒక్కో ప్రశ్నను ఒక్కొ భాగంగా టపా రాసి, బ్లాగుబద్ధం చేయ్యడానికి ప్రయత్నిస్తాను.
ప్రారంభంలోనే నా వకాల్తా ప్రాతిపదికని (basis of arguement) ప్రస్తావిస్తాను. మొదటిది. వ్యక్తి (మనిషి) జీవిత గమ్యమేమిటి? ఆనందం. ఇది ఆత్మానందం కావచ్చు, పరమానందం కావచ్చు. ఏది ఏమైనా ఆనందం. అదే మానవ జీవిత గమ్యం. మనం జీవితంలో చేసే సాధన, ప్రయత్నం,ఆదర్శం అన్నింటి ఉద్దేశ్యం జీవితాన్ని ఆనందంగా గడపడం. కాదంటారా!
కాకపోతే, ఆనందానికి ఉన్న పరిధి (pre-condition) ఒక్కటే, అది "మన ప్రస్తుత ఆనందం భవిష్యత్తుకు సమస్యాత్మకం కాకుండటం"(present happiness should not lead to future shock). అంటే, మన భవిష్యత్తును సమస్యల్లో ముంచని ఏ ఆనందమైనా అనుభవయోగ్యమే, అని అర్థం. ఇది మీరు అంగీకరిస్తే నా సగం కేసు నెగ్గినట్టే!
ఇక రెండవది. సమాజం. ఒక వ్యక్తి, సమాజం కల్పించిన పరిధులతో నిరంతరం ఘర్షణ పడితే ఆనందాన్ని పొందగలడా? "కష్టమే!" అన్నదే, సరైన సమాధానం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న, సమాజ పరిధులు వ్యక్తి ఆనందానికి స్వయంగా నిచ్చెనలు వేస్తాయా? అని. దీనికి మాత్రం సూటి సమాధానం అసలు దొరకదు. ఒకవేళ జవాబు దొరికినా సమాజం అసలు వ్యక్తి ఆనందానికి ఎందుకు సహాయపడాలి? ‘ఆనందం’ అనేది వ్యక్తి కష్టపడి సాధింఛాల్సిన విషయం అనిపిస్తుంది కదూ! ఇక్కడే ఉంది అసలు కిటుకు.
మన సమాజం (దాని భౌతిక స్వరూపం తెలీదుగానీ, ఉనికి మాత్రం అందరూ అనుభవవించేదే) చాలా తెలివిగా, కన్వీనియంట్ గా తన బాధ్యతల రచనను చేసుకుంది. వ్యక్తి ఆనందానికి అది దోహదపడదుగానీ, మనిషి ఆనందాన్ని పొందే ప్రయత్నం లో ఎక్కడ తనకు భారమయ్యే పనులు చేస్తాడో అని, కొన్ని పరిధులు నిర్ణయించేసింది. అవే చాలావరకూ వ్యక్తిగత సంబంధాలు, ముఖ్యంగా ‘ప్రేమ’ విషయంలో సమాజం నిర్ణయించి, ఆమోదించి, ప్రాచుర్యం కలిగించిన ‘రూల్స్’. కాకపోతే ఈ పరిధుల్ని వ్యక్తులుగా మనం ఎంతగా జీర్ణించుకున్నా మంటే, వాటినే పవిత్ర ఆదర్శాలుగా నమ్మి భుజాలమీదికెత్తుకుని మోసేస్తూ, ఎవరైనా దానికి కాస్త వ్యతిరేకమైన స్వీయ అనుభవాన్ని ప్రస్తావిస్తే అంగీకరించలేకుండా ఉంటాం. కొందరు రాళ్ళు రువ్వి ఆనందిస్తారు. మరికొందరు సభలు పెట్టి మరీ "లోకం చెడిపోయింది" అని తీర్మానిస్తారు. ఇది కొత్తగా జరిగే వింతేమీ కాదు, ఎప్పటినుండో జరుగుతున్న తంతే!
అంటే సమాజానికి వ్యక్తి స్వేచ్చ భారాన్ని కలిగించేవరకూ పెద్ద సమస్య కాదు. కానీ సమస్యల్లా ఈ సమాజం భాధ్యత మోస్తున్నట్టుగా ప్రవర్తించే మీ ఎదురింటి సుబ్బలక్ష్మిదో లేక పక్కింటి పార్వతమ్మదో అందీగాక ఏ ఆఫీసులోని వెంకట్రావుదో. ఇలాంటి అతిఉత్సాహవంతులనే సమాజం అనుకుని ‘ఎవరేమనుకుంటారో’ అన్న అపోహతోనే సగం వ్యక్తిత్వం కోల్పోయి మనవంటూ లేని అభిప్రాయాల ముసుగులో కన్వీనియంట్ గా జీవితం గడిపేస్తాం. ఇలా జీవింఛడం లో నిజంగా ఒక వ్యక్తిగా ఆనందం ఉందో లేదో మనం ప్రశ్నించడానికి కూడా తయారుగా ఉండం. కాబట్టే ఈ వ్యాసం చదివి మారమనడం లేదు, కనీసం ఆలోచించమని చెప్పటానికి మాత్రమే ఈ ప్రయత్నం.
ఇక అసలు విషయానికి వద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానాలు చూద్దాం.
1. కామం, ఆకర్షణ, ప్రేమని ఒక్కటే అనుకోవడం: వీటిని "అంతా ఒక్కటే" అనే మూర్ఖత్వం నాలో లేదు. కానీ, ఇవన్నీ ప్రస్పర బంధం కలిగిన మానవ సంబంధాలు అని నా భావన. "ప్రేమలో కామం OK గానీ, కేవలం కామం తప్పు" అన్నది కొందరి వాదన. మెచ్యూరిటీ ఉన్న ఒక ఆడా-మగా కేవలం కామం కోసం ఒకటైతే అది "అనైతికం",అనేది మన సమాజం పెట్టిన ఒక రూలు. కాస్త ఆలోచిస్తే ఆ కండిషన్ ఎందుకు వచ్చిందో అర్థమైపోతుంది. కామం కోసం (సమాజానికి అంగీకారమైన ‘పెళ్ళి’ అనే బంధం తో నిమ్మిత్తం లేకుండా) ఏకమైన జంట ఆనందానికి ప్రతిఫలంగా ఒక బిడ్డ జన్మిస్తే, అది సమాజానికి ఒక సమస్యగా మారుతుంది. అనాధశరణాలయాలు కావాలి, ఆ బిడ్డడి ఆలనా పాలనా చూడాలి, వాడ్ని సమాజానికి కంటగింపు కాకుండా కాపాడాలి. అబ్బో...! సమాజానికి చాలా పని. అందుకే ఈ ‘నైతికం’ మంత్రం.
అందుకే, "కాంట్రాసెప్టివ్ లు(గర్భనిరోధక సాధనాలు) ఉన్న ఈ కాలంలో ఈ ఆదర్శాలకి అర్థముందా?" అని ప్రశ్నించాను. కాకపోతే చాలా మందికి అది విచ్చలవిడితనానికి ప్రోత్సాహకంగా అనిపించింది. నేను చెప్పింది అందరూ అలాగే చెయ్యాలి అని కాదు, అలా కొందరి జీవితాల్లో సంబంధాలు ఏర్పడితే, వాటిని సమాజం మీకు తగిలింఛిన ‘రంగుటద్దాల’ ల్లోంచీ చూసి గర్హించకండి అని మాత్రమే.
మరో ఆరోపణ, నేను టీనేజి ఆకర్షణని ప్రేమగా భ్రమించడం. నా వరకూ టీనేజి ఆకర్షణ అనేది ఆ వయసులో వాళ్ళకు కలిగే సహజ భావన. "అలాంటి భావనలు కలిగితే అణుచుకోవాలే గానీ, బరితెగించేస్తారా?" అని కొందరి ఉవాచ. టీనేజి ఆకర్షణని, అణుచుకొవడమో లేక రహస్యంగా బరితెగించి సమస్యలు కొనితెచ్చుకోవడమో కాకుండా, ఇంకో మర్యాద పూర్వకమైన దారి వెతుకుదాము అన్నదే నా సలహా. వారి ఆకర్షణల్ని అర్థం చేసుకుందాం, చర్చించి ఆదరిద్దాం, వారి భావనల్నిగౌరవిద్దాం, వాళ్ళని నమ్ముదాం, కనీసం ఇంట్లోనే కలిసి కూచుని మాట్లాడే అవకాశాన్నిద్దాం అంటాను. అది తప్పైతే, ప్రస్తుతం ఉన్న సమాజ పోకడలు రానురానూ ప్రమాదకరంగా మారుతాయన్నది నా ప్రఘాడ విశ్వాసం.
చాలా వరకూ ప్రేమలకు పునాది ఈ ఆకర్షణే, కాదంటారా? మరి దీనిపై ఇంత చులకన భావం ఎందుకు?
ఇక మిగిలింది ప్రేమ. నేను చర్చించిన చాలా మంది, "పెళ్ళే పరమావధిగా సాగితేనే అది ‘ఆదర్శమైన ప్ర్రేమ’" అన్న భావనలో ఉండటం నాకు విస్మయానికి గురిచేసి, సమాజపు కండిషనింగ్ కు అబ్బురపరిచేలా చేసింది.
కాబట్టి, ఎన్నిరకాల ప్రేమలు ప్రస్తుతకాలంలో ఉన్నాయో, మనం కళ్ళుమూసుకుని ఏ ఆదర్శాల్ని గుడ్డిగా నమ్మేసి, ఆవేశ పడిపోతున్నామో Part 2 లో చర్చిస్తాను.
(‘ప్రేమలూ -రకాలూ’ శీర్షికన Part -2 త్వరలో)
25 comments:
చాలా బాగా రాసారు మహేష్ గారు! వింత ఏంటంటే, నేను ఈరొజు ఇదే సబ్జెక్ట్ మీద రాసాను, అంటే నేను ఓ సంఘటన ఆధారంగా యువత ఏవిధంగా ఆకర్షణకు లోనవుతున్నారు అనేది చెప్పడానికి ప్రయత్నించాను. మీరు అర్ధవంతంగా దీని గురించి చర్చించారు. అభినందనలు.
మహేష్ మీరు చెప్పినవి కరెక్టే. కాని సమాజమంటే ఎవరు మనమే.అందులో కొందరు మీరు చెప్పిన విషయాలు సరియైనవి అంటారు.చాలా మంది తప్పు అంటారు. ప్రేమ అంటే ఇప్పటికీ చాలామందికి నచ్చదు.అందునా పెళ్ళి కాకముందు ప్రేమ,కలిసి ఉండడం అనేది చాలా మంది ఒప్పుకోరు.ఒక్కటి మాత్రం చెప్పగలను, మనము మొత్తం సమాజాన్ని ఎదిరించి ఉండలేము , ఉండగలము కూడా. అలాగని కొన్ని సార్లు మనము చేసేదే రైటు. ఎవరికి ఎందుకు భయపడాలి అని అనుకోవడం కూడా మూర్ఖత్వమేమో? .
@జ్యొతి గారూ, సమాజమంటే మనమే. కాకపోతే దీనితో మనం ఎంతగా మమేకమైపొయామంటే, వ్యక్తులుగా మనకంటూ ఏ అభిప్రాయాలూ లేనంతగా! నేను ఎత్తిచూపుతున్న సమస్య అదే.
@రమణి గారూ నెనర్లు. మీ టపా చదివి కామెంటా. చూసుకోండి.
అన్ కండీషనల్ ప్రేమలు ఎక్కడ వున్నాయి?పెళ్ళి పరమావధికాని ప్రేమకి ఆకర్షణ అని పేరు వుంది కదా.మీ కాలేజీ కధలోనే చెప్పారు కదా మీకు చాలా మంది మీద ప్రేమ కలిగిందని.మరి మళ్ళా అందరి మీదా ఆ ప్రేమాకర్షణ కలగదు అని వాదించుకున్నారెందుకు ఒక చోట.రూపాయి ఖర్చు చెయ్యాల్సిన చోట నాలుగు రూపాయలు ఖర్చు చేస్తే దాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం అంటాముకదా.మరి నలుగురిని ప్రేమించామనడం విచ్చలవిడితనమవ్వదా?పాశ్చాత్య దేశాలలో ఈ విచ్చలవిడితనానికి విసిగిపోయి అందరూ మన దేశం వైపు చూసుంటే మనం వారి గతాన్ని గొప్పగా చూస్తున్నాము.మనసుకు ఆంక్షలు లేకుండా నచ్చినట్టుగా బ్రతుకుదాము అంటారు కాదా మీరు.మరి మీ కుటుంబానికి చెందిన వివాహిత స్త్రీ ఎవరన్నా అలా అనుకుని బయటకి వెళితే మీరేమంటారు?[వ్యక్తిగతం గా వెళ్ళాలని నా ఉద్దేస్యం కాదు.కానీ నేను చేస్తాను అనుకోవడానికి,నావాళ్ళు చేసారు అనుకోవడానికి తేడాని చూపించాలని మాత్రమే]
పరిమితులు వద్దని అనుకునే అదే మనసు మనదగ్గరకు వచ్చే సరికి[మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి] పరిధుల్ని గీయమంటుంది.అనంత మయిన స్వేచ్చ ఎప్పుడూ ఆనందం ఇవ్వదు.నేను మంచిగా ఉండాలి అనుకోవడం మన వ్యక్తిత్వమయితే,పరిధుల్లో ఉండాలి,ఒకే మనిషితో బ్రతకాలి అనుకోవడం నిబద్దత అవుతుంది.టెర్రరిస్టు కైనా తను చేసేపని ఒప్పుగానే తోస్తుంది.తనవరకు చూస్తే అది సరయినదే కావచ్చు.కాని అది ఎంత మందికి తప్పుగా తోస్తుందో[బాధకలిగిస్తుందో] దాన్ని బట్టి అది పెద్ద తప్పా,చిన్న తప్పా అనేది తెలుస్తుంది.
అభిప్రాయాలనేవి ఎన్నో అనుభవాల ద్వారా,పరిసరాల ద్వారా ఏర్పడతాయి.మనకున్న అనుభవాల ద్వారా మనకు ఏర్పడ్ద అభిప్రాయాలతో పక్కవాళ్ళ ని మార్చడం చాలా కష్టం.అలా మార్చడానికి చేసే ప్రయత్నంలో ఎవరైనా మనవాదనలో తప్పులు చూపిస్తే, మన తప్పులు కప్పుకోవడానికి,వాదన బలపరచుకోవడానికి చేసే ప్రయత్నంలో కొంతవరకు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యొచ్చు.మీకు భాష మీద వున్న పట్టుతో వాదనలని సాగిస్తున్నారు తప్పించి ఇంకేమీ లేదని నాకు అనిపిస్తుంది.
బాధించి ఉంటే క్షమించండి.
చాలా విశాలమైన భావాలు, ఆదర్శవంతమైన ఆలోచనలు. కానీ ఇంతలోతుగా ఆలోచిస్తూ, బతకటం సాద్యమెనా? అది నిరంతర ఘర్షణకు, దారితీయదా? అంతే అంతే అనుకుంటూ బతికేయటం కొంచెం వీజీ ఎమో ? (మెజారిటీ జనులగురించి, వారిలో నన్నూ ఒకడిగా భావించుకుంటూ)
బొల్లోజు బాబా
@రాధిక గారు, నేను pre condition for Individual happiness గురించి ఇదే టపాలో చెప్పాను. అయినా మీకు ఇంత ఆవేశం రావడానికి కారణం, నేను ఎత్తిచూపిన సమాజపు ‘conditioning'అని గ్రహించగలరు. నేను ఇంకా "ప్రేమలూ-వాటి రకాల" గురించి చెప్పనేలేదు. కానీ మీరు నా క్రితం టపా ఆధారంగా ఏకేస్తున్నారు. నా నెక్స్ట్ టపాకై ఎదురు చూడగలరు.
@బాబా గారూ, అనుకుంటే సమస్యే! ఇలాంటి ఆలోచనలు చెబితేనే సాధారణంగా వెలివేయబడతారు అని కూడా ఒక పాప్యులర్ నమ్మకం.
కానీ ‘వ్యక్తి స్వతంత్రపూరితంగా ఆనందాన్ని అనుభవింఛడానికి, ఎప్పుడూ సమాజంతో ఘర్షణ పడుతూ ఉండాల్సిన అవసరం లేదు’. అని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.
మనలో చాలా మంది మనసులో భయపడేటంత భయంకరమైనది కాదు సమాజం. ‘ఎవరేమనుకుంటారో’ అని చాలా అనవసరంగా ఆలోచించి మనం చాలా సార్లు వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటామని నా ఉద్దేశం.అందుకే pre-condition for happiness వాదాన్ని మొదలుపెట్టాను.
మహేశ్ గారు:
మీరు రాసింది నా బుర్ర ఇంకా సరిగ్గా డీకోడ్ చేసినట్టు లేదు కాని, నా అనుభవంలో నేను గమనించిన దాంట్లో మీ వాదన కొంత వరకూ సరియైనదే.. సమాజం పెరుతో మనం ఎన్నో అక్రమాలను సహిస్తున్నాము అనే చెప్పాలి. అలా అని ప్రతి విఫలానికి సమాజానిదే భాద్యత కాదు.
మనమంతా పెళ్ళిని స్వీకరించాము, ఆదరించాము. కానీ అది ఒక Perfect Institution కాదు. అందులో లొసుగులు ఉన్నాయీ. ఉదాహరణకు
భర్యాభర్తల మధ్య సయోధ్య కుదరక, విడిపోతే సమాజం చిన్న చూపు చూస్తుందని కలిసి ఉంటూ.. జీవితాన్ని నరకం చేసుకుంటారు. అలాంటి పరిస్థితిల్లో పెరిగిన పిల్లల మానసిక సంఘర్షణ వర్ణాణాతీతం.
అలాని పెళ్ళి ఆచారం ఇంతటితో కద్దు అనలేము. భారతాన్ని చూసి అంతా ఆచరిస్తున్నారు.. నిజమే ఆయుండచ్చు. కానీ ఇండియాలో ఎత్తి చూపటానికి ఎమీ లేవు అన్నటం తగదు. With loads of culture and morals, we are not ideals. India is still a country with normal human beings!!
అందరూ గగ్గోలు పెడుతున్నంత చెడ్డతనం ప్రేమ (పోనీ ప్రేమ అని అనుకునే దాంట్లో ) లో లేదనే నేననుకుంటాను.
సంస్కారవంతమైన వాతావరణం లో పెరిగిన పిల్లలు విచ్చలవిడిగా ఉండమన్నా వుండరు, కాని ఆ వయసులో ఒక దగ్గరిస్నేహం కావాలని కోరుకుంటారు, తమకి మాత్రమే సొంతమైన స్నేహం దానికే చూసేవారంతా ప్రేమ లేబుల్ తగిలించేస్తారు మన దరిద్రపు ప్రేమ సినిమాలు అదే ప్రేమనీ పిల్లలనీ నమ్మిస్తాయి.
టీనేజ్ లో హార్మోన్స్ హడావిడి ఎక్కువగా ఉంటుంటుది కాబట్టి కాస్త ఎమోషనల్(మనసూ,మమత) గానూ ఉంటారు. స్నేహం చేసే వాతావరణం ఉంటే ఈ(సినిమా) ప్రేమల జోలికి వెళ్ళేవారు తక్కువ.
ఇక ప్రేమ పెళ్ళిల విషయానికొస్తే ప్రేమ పెళ్ళే కాదు ఏ పెళ్ళి ఐనా 24 దాటాకే మంచిది, ఆ వయసు వస్తేగాని మెదడు పూర్తిగా వికసించదు, తమకేం కావాలనేది తెలుసుకోగలరు.
ప్రేమలో చెడు వుందని అనట్లేదు దీప్తిగారు.ప్రేమ పేరు చెప్పి హద్దులు దాటి,తరువాత ప్రేమ పరమావధి పెళ్ళికాదని మాట్లాడడం,అనేక మందితో ప్రేమలో పడడం తప్పని చెపుతున్నాను.దానికి ప్రేమ పేరు పెట్టొద్దని చెపుతున్నాను.మనసులో కలిగిన కోర్కెలన్నీ తీర్చుకోవాలనుకోవడం సబబుకాదని చెపుతున్నాను.
మీరన్నట్టు స్నేహపూరిత వాతావరణం,స్నేహం చాలా మంచిది.కానీ అది ఎప్పుడు వస్తుంది?
సంస్కారవంతమయిన వాతావరణంలో పెరిగిన పిల్లలు అలా చేయరు అన్నారు.నిజమే.కానీ నిజం కూడా కాదు.సంస్కారం అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీదా ఆధారపడి వుంటుంది.మనసులో చెడుకోర్కెలు కలుగుతున్నా కూడా నేను సమాజంలో వున్నాను,నేను మంచిగా వుండాలి అనుకోవడం సంస్కారం .అదే ఎవరేమనుకుంటే ఏమిటి,నా మనసుకు తోచింది చేస్తాను అంటే అది సంస్కారం అవుతుందా?ఆ సంస్కారాన్ని వదిలేయొచ్చు అంటున్నారు కొందరు.అందుకే ఈ వాదనంతాను.ఇక్కడ జరుగుతున్న వాదనలన్నీ ప్రేమ అనే భావన్ గురించి కాదు.ప్రేమ భావనలో వున్న మనిషి ప్రవర్తించాల్సిన తీరు గురించి.
మనలాంటి వ్యక్తులు కలిసే సమాజం అయింది.అణువులో పరమాణువు కి ఎలాంటి విశిష్టత వుందో అలాగే ప్రతి వ్యక్తికీ సమాజం లో కొంత పాత్ర వుంది.ఆ పరమాణువు నేను ప్రవర్తించాల్సిన దానికి వ్యతిరేకంగా వుంటాను అంటే ఆ అణువు లో ఎలాంటి అనిశ్చిత స్థితి కలుగుతుందో సమాజానికి కూడా అలాగే చెడు జరుగుతుంది.అందరం కలిసి ఒక సంఘంగా బ్రతకాలి అనుకున్నప్పుడు మన స్వేచ్చతో పాటూ మిగిలిన విషయాలు కూడా ఆలోచించాలి.నేను అలాగే ఎందుకు వుండాలి అన్న మీమాంశ మంచిదే.కాని సమాజాన్ని తప్పుద్రోవ పట్టించేదిగా ఉండకూడదు.అయినా ఎవరు ఎలాగన్నా వుండొచ్చు.ఆ చేసేది తప్పా ఒప్పా అన్నది చూసుకుని,ఈ మార్పు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచిస్తే సరిపోతుంది.ఏ సమాజానికన్న మార్పు చాలా అవసరం.ఆ మార్పు గతి తప్పించేదిగా వుండకూడదనే నా ఆవేదన.సెలవు.
భలే చర్చ. మహేష్ తరువాతి భాగంలో ఏమి రాయబోతున్నాడో? ఎన్ని భాగాలున్నాయి మొత్తం?
@రాధిక గారూ, మీ ఉక్రోషం,ఆవేశం చూస్తుంటే ముచ్చటేస్తోంది. నేను చెబుతున్నది ‘ధర్మ శాస్త్రంమో’,‘మత గ్రంధమో’ కాదు. "తప్పకుండా పాటించు, లేకపోతే నరకానికి పోతావ్!" అని చెప్పడానికి.
ఇవి కొన్ని ఆలోచనలూ,అభిప్రాయాలూ,అనుభవసారాలు అంతే.చదివి ఆలోచించండి,తెలుసుకుని వీలైతే అర్థం చేసుకోండి,మీకూ ఇలాంటి అనుభవం ఎదురై ఉంటే "నిజమే" అనుకోండి. అంతే తప్ప నేనేదో మతమార్పిడి స్థాయిలో మనుషుల్ని మార్చెయ్యడానికి బయల్దేరినట్టుగా విరుచుకు పడకండి.
ఇక్కడ నా ఉద్దేశం ఖచ్చితంగా ఎవర్నీ మార్చడం కాదని గమనించగలరు. అంతే కాక నేను చెబుతున్నది అవకాశవాదం కాదు...అవకాశమున్నవాదం. There is a possiblity apart from conventional wisdom అంతే.This is to ponder-over and contemplate.
"ప్రేమ పేరు చెప్పి హద్దులు దాటి,తరువాత ప్రేమ పరమావధి పెళ్ళికాదని మాట్లాడడం" అని మీరు ఎద్దేవా చేశారు. ఆపైమాట నేనెక్కడన్నా అన్నానా?మీరలా అర్థం చేసుకున్నారా?
నేనెప్పుడు ‘సమాజాన్ని పక్కనబెట్టి నిర్ణయం తీసుకో’ అన్నా అవి ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలేగానీ ఏకపక్షం అస్సలు కాదు. ఏకపక్షంగా నిర్ణయించి "తప్పుకుంటే" అది మోసమౌతుందిగానీ నిర్ణయమౌతుందా?
అణువు-పరమాణువు థియరీ గుర్తుచేసి మంచి చేసారు. అదే థియరీతో సమస్యని కాస్త మీకు వివరిస్తాను.ప్రస్తుతంఉన్న మన సమాజ పరిస్థితుల్లో చాలా పరమాణు ‘ఇన్లోజన్’ లు జరిగిపోయి, మహా ‘ఎక్స్ ప్లోజన్’కి సిద్ధంగా ఉంది.వాటి లక్షణాలు చిన్న చిన్న ప్రేళుళ్ళ రూపంలో ప్రతిరోజూ అనుభవిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఈ మహాప్రేలుడు జరిగితే సమాజం మీరన్నట్టు ‘అనిశ్చితి’కి లోనవదు సరికదా నాశనమై కూర్చుంటుంది.
అందుకే వ్యక్తి విలువలలోని ఘర్షణ (ఇన్ఫ్లోజన్)ని అర్థంచేసుకోని, (అణువు)సమాజం తన విలువలు/పరిధిల (ప్రొటక్టివ్ ఔటర్ కవర్)ను బేరీజు చేసుకోవాలి అంటున్నాను.
ఇది ఒక ఆలోచన. ‘ఆర్డరు’ కాదు తప్పకుండా పాటించడానికి.
@పూర్ణిమ గారూ,నేను చెప్పింది మీ బుర్ర పూర్తిగా డీకోడ్ చేసుకున్న తరువాత విశదంగా కామెంటండి.
@దీప్తి గారూ, నేను చిప్పిందానికన్నా ఈ కామెంట్లమీద మీ కామెంటులా ఉంది. బాగుంది. ఐనా 24 సరైన వయసు (ప్రేమకైనా,పెళ్ళికైనా)అని మీరనుకున్నట్టుగా భారత ప్రభుత్వం అనుకోవడం లేదు.
ఇలాంటి విషయాలలో ఎన్ని చర్చలు జరిపినా ఒక conclusionకి రావడం అనేది అశంభవం. ఒకరికి కరెక్ట్ అనిపించింది ఇంకొకరికి అసలు అర్ధం లేనిదిగా అనిపిస్తూంది. సమాజంతోనూ, దాని నిష్టూరాలతోనూ సంబంధం లేకుండా నచ్చినట్టు జీవించడమే గొప్పనుకొనేవాళ్ళు కూడా మళ్ళి మిగతావాళ్ళు కూడా మనలానే స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం , త్వారా మళ్ళీ క్రొత్త (ఎంగిలి) విలువల్ని creat చెయ్యలనుకోవడాన్ని ఏమనాలో? ...
@శంకర్ గారూ, మిరు చెప్పింది నిజమే ఈ చర్చలకు అంతం ఉండదు, కానీ కొంత పరమార్థం ఉంటుందని గ్రహించగలరు.
ఇక్కడ కొత్త(ఎంగిలి)విలువలు ‘ప్రభోధిస్తున్నది’ ఎవరూ? దయచేసి నేను రాధిక గారికి రాసిన సమాధానం చదవగలరు.
నేనేదో తమాషాకి ఎంగిలి విలువలన్నానండి(అదీ మీ రచనల్లోనే ఎక్కడో చదివిందే, ఆ పద ప్రయోగం నచ్చి కాపీ రైట్ తీసుకోకుండా వాడేసా అలవాటు ప్రకారం.) .. మీరు దాన్ని అంత seriousగా తీసుకోవద్దని మనవి. నా ఉద్దేశ్యం ఏవీ గొప్పవీ కాదు ఏవీ చెత్తవీ కాదు అని మాత్రమే. 'పరమార్థం' విషయాన్ని నేనూ అంగీకరిస్తున్నాను కాబట్టే నా అభిప్రాయలను తెలిజేయడం ద్వారా మీ అభిప్రాయలను మీరు బలపరచాల్సిన ఆవశ్యకతని గుర్తుచేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పొచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే పరిస్ధితులని బట్టి పాటించాల్సిన విలువలు వాటి ప్రాధాన్యాలు మారుతూంటాయని. నేను కూడా చాలసార్లు మీరు చెప్పిన విలువల్నే support చేసేవాన్ని. ఇంకా చాలా సార్లు వాటిని వ్యతిరేకించేవాడిని. ఒక ఉదాహరణ చెప్తా... నాకిక్కడ ఒక ఫ్రెండ్(కొలీగ్) ఒకడున్నడు(ఇటాలియన్) . ఓరోజు వచ్చి నిన్న సాయంత్రమే నా girlfriendతో బ్రేక్ అయ్యాడని వాపోయాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరం నడుస్తోండగా ఒక అబ్బయి అమ్మాయి ఎదురయ్యరు మాకు. వీడెళ్ళి ఆ అమ్మయిని పలకరించి వచ్చాడు. తర్వాత నెమ్మదిగా నా చెవిలో 'ఈ అమ్మాయే, అప్పుడే ఇంకోన్ని పట్టేసింది ' అన్నాడు. నిన్ననే dump చేసిన అమ్మాయిని అంత ఆప్యాంగా పలకరించిన వాడి సహృదయాన్ని చాలా మెచ్చేసుకొన్నా. ఇక్కడి విలువల ప్రకారం ఒక జోడీని వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు కాబట్టే వాడంత తేలిగ్గ తీసుకోగలిగాడని , ఇక్కడి విలువలు చాలా గొప్పవని ఫీలయ్యా. అనుకొన్నట్టుగానే వాడు రెండ్రోజుల్లో ఇంకో అమ్మాయిని తగులుకున్నాడు. కొన్ని వారాల క్రితమే ఎవడ్నో వదిలేయడం వల్ల కలిగిన ఒంటరితనాన్ని పోగొట్తే medicine కోసం barకి వచ్చి పరిచయమయ్యిందంట. అహా ఒకరికొకరు అన్నట్టు ఎంత అద్భుతమైన జంట అనుకొని మళ్ళీ ఇంకోసారి మెచ్చేసుకున్నా. కానీ తర్వాత అన్నాడు ఈ అమ్మయి ఎప్పుడో వదిలేసేలా ఉందనీ, ఒక్కోసారి వీడికే వదిలేయాలనిపిస్తోందనీ. అప్పుడనిపించింది ఎన్ని ఆటుపోట్లెదురైనా మనకంటూ ఒకరుంటారనే నమ్మకం ఇక్కడ ఎవ్వడికీ లేదని. భర్తకి ఉద్యోగం పోతే ఇంట్లో భార్య విడాకులతో readyగా ఉండడం పెద్ద వింతేం కాదిక్కడ(అలా అని అందరూ అలాంటి వారని కాదు. ఇక్కడకూడ చలా నూరేళ్ళ పంట చేసుకొన్న పెళ్ళిలున్నయి లెండి). అదే కదా మన వివాహ వ్యవస్ధలో ఉన్న గొప్పదనం , కనీసం సమాజానికి భయపడో మరింకేదో కారణం చేతనైనా ఒకళ్ళకి ఒకరే అన్న ఫీలింగు గట్టిగా నాటుకుపోవడంవల్లే కదా మనకన్ని సష్టిపూర్తి జంటలు కనిపిస్తాయి indiaలో అనుకున్నా. ఈ విధంగా అపారమైన స్వేచ్చనిచ్చే ఈ సమ్మజంలోని విలువలు కొన్ని , కట్టుబాట్లతో controlలో ఉంచే మన సమాజంలో విలువలు కొన్ని కలిపి ఇంకో క్రొత్త సమాజమేమైనా ఉంటుందా అని అలోచించీ.. అలోచించి మా ఫ్రెండ్స్‌తో చర్చించీ చర్చించి నేను కనుగొన్నదేంటంటే మనం అతి త్వరలోనే ఆ transitionలోకి వెళ్లబోతున్నామనీ, ఇప్పటికే metro cityలు ఈ ఫెసిలిటీని అనుభవిస్తున్నయనీ తెలుసుకొన్నా. ఇంకొన్నాళ్ళ తర్వాత indiaలో పూర్తి స్వేచ్చా విలువలొచ్చేసి, వాటితో మెహమ్మెత్తి western worldలో మన టైపు విలువలొచ్చేసినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు. మన కొండలు వాళ్ళకి, వాళ్ళవి మనకి నునుపుగా కనిపించడంలో పెద్ద ఆశ్చర్యమేముందిలెండి. ఇప్పటికే వ్యాసమంత కమెంటినట్టనిపించి, నా గోడు ఎంతో కొంత వెలిబుచ్చాననే satisfactionతో ప్రస్తుతానికి ఇక్కడితో ముగిస్తా.
మీ టపా బావుంది, ఇక్కడ చర్చా చాలా బావుంది క్రాంతి గారు,
నవతరంగం మీదేనా చాలా బావుంటుంది
నవతరంగం
సినిమా రివ్యులు చాలా బా రాస్తారు ఉన్నది ఉన్నట్టు.
ఇప్పుడు మీరు సినిమా తీయటం గురించి రాస్తున్నారు చాలా ఆశక్తి గా ఉంది ,
నాకో చిన్న సందేహం మీరు సినిమా ప్రపంచంలో ఏమన్నా పనిచేశారా ??
సెవవియ్యగలరు
బూదరాజు ఆశ్విన్
@అశ్విన్ గారూ,నెనర్లు.
నవతరంగం ‘నాది’కాదు. మంచి సినిమా కోరుకునే తెలుగు సినీఔత్సాహికులందరిదీ. అందులో నేనూ ఒకడ్ని. వెంకట్ అనే ఒక మిత్రుడు అదే ఆశయంతో ఈ వెబ్ సైట్ ప్రారంభించాడు. మేము కూడా మావంతుగా కొంత చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. అంతే.
దీప్తి కామెంట్ కరెక్ట్ .
మహేశ్! మీరు బాగ వ్రాస్తున్నారు. మీలాంటి బావాలున్న ప్రెండ్ నాకొకడు ఉన్నాడు. వాడికి మీకు జరిగినట్టే జరిగింది. వాడి ప్రెండ్ లెక్చరర్ తో వెళ్లిపోయింది.
ఏమిటో మీ రచనలు అటో ఇటో రెచ్చగొడుతూ వ్యాఖ్య చేసేటట్టే చేస్తున్నాయి :)
ఈ విషయంలో దాదాపు నేను రాధిక గారి వైపే. అలా పెరగటం ఒక కారణమయితే, విలువల మీద ఇంకా నమ్మకం ఉండడం ఇంకొక కారణం.
మీకు ఉన్నటువంటి భావాలకి నావి భిన్నం. మీరు చెప్పేది కొంత ఎలా ఉందంటే నాకు ట్రాఫిక్ రూల్స్ నచ్చవు కాబట్టి నాకిష్టమొచ్చినట్టు నా వాహనాన్ని నడిపిస్తా... అన్నట్టు.
మనకున్న తెలిసున్నంతలో అన్ని విషయాలూ కొన్ని పరిధులకి లోబడి ఉండేవే. ఆ పరిధులు కొన్ని ఎవల్యూషను కి గురవుతాయి కాలంతో పాటు మీరన్నట్టుగానే.
కానీ పరిధులనే విధించుకోని వ్యక్తిని నేను నాకిష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే దాని పర్యావసానాలు అలాగే ఉంటాయేమో. ప్రయత్నిస్తే కదా తెలిసేది అనే మీ లాజిక్కుకి బాంబు ఎంత ప్రమాదకరం అని మీరు దాన్ని చేతిలో పేల్చి మరీ చూస్తారా ?
అలాగే మీ ఇంకో వాదన ఇద్దరికీ ఇష్టమయినప్పుడు ఏం చేసినా చెల్లుతుందని. కానీ మీరు ఇక్కడ మరచిపోతున్నది ఇది ఇద్దరి సమస్య మాత్రమే కాదు అని. ఇద్దరు కలిస్తే ముగ్గురవచ్చు. వాళ్ళ సంగతి ఆలోచించనక్కర్లేదా ?
అలాగే మీ కుటుంబాల గురించి ఆలోచించనక్కర్లేదా?
అంతా ట్రాష్ నాకా విలువల మీద నమ్మకమే లేదు అని వాదిస్తారా ? ఇక నేనేమీ చెప్పలేను.
భారతదేశం ఇంకా కొంత సుఖ శాంతులతో ఉందంటే దానికి ఇక్కడున్న కుటుంబ వ్యవస్థ కూడా బలమైన కారణమని నమ్మే వారిలో నేనూ ఒకరిని.
అలాగే అరేంజ్డ్ మారేజెస్ అయితే పనికిరావని, ప్రేమ ఉండదనీ (మీరనలేదు) కూడా అనుకోవక్కర్లేదు. అందరూ అడ్జస్ట్ అయి ఉండాల్సొస్తుందని మోడర్నిస్ట్స్ ఒపీనియన్ తప్పే.
అలాగని మీ భావాలు సరికాదని నేననలేను. Everybody is entitled an opinion. You have yours. Nothing wrong in that.
ఎవరికుండే ప్రయారిటీస్ వారికుంటాయి. మీకు ఈ సమాజానివన్నీ తప్పుడు ఆలోచనలుగా ఎలాగనిపిస్తున్నాయో చాలా మందికి మీ ఆలోచనలు అలాగే అనిపించవచ్చు.
@ ప్రవీణ్ గారూ, మన విలువలపై మనకు నమ్మకం ఉండటం నిబద్ధత అవుతుంది. "కేవలం మేము నమ్మిన విలువలే సరి, మిగతావి తప్పు" అంటే మూర్ఖత్వం అవుతుంది. మనం మూర్ఖులు కాకూడదనే నా అభిలాష. ఎవరి నిబద్ధతపైనా నేను ప్రశ్న చిహ్నాలు వెయ్యలేదు. కాకపోతే మేము మాత్రం ‘కరెక్టు’అన్న మోరల్ పొజిషన్ మాత్రం అంగీకారాత్మకం కాదు.
నాకు ట్రాఫిక్ రూల్స్ పట్టవని కారు నడిపిన వాడు పిచ్చోడైనా అయ్యుండాలి లేక ఆపైన జైల్లో పడి క్రిమినల్ గానైనా మారాలి. నా సజెషన్ అదికాదు. నీ కారుని మొదట ‘హైవే’ లో పెట్టి తరువాత రయ్..మని తోలమని మాత్రమే.
ఇక ఇద్దరు కలిసి ముగ్గురవడమే సమాజానికి పెద్ద సమస్య్త అని ముందే చెపాను. దానికి సమాధానంగానే, గర్భనిరోధకాలున్నాయ్ ఉపయోగించమని కూడా చెప్పాను చూసుకోండి.
నా ఆలోచనలన్నీ రైటు అనే సెల్ఫ్ రైచ్యుయస్ వ్యక్తిని అసలు కాను. నా ఆలోచనలు మీకు ‘ఫిల్త్’ అనిపిస్తేకూడా నాకు అంగీకారమే. I keep that open mind.
@ప్రవీణ్ - జల్లెడలో ఉన్నన్ని తూట్లు ఉన్నై మీ వాదనలో :-) అవన్నీ పనిగట్టుకుని వివరించే టైము లేదిప్పుడు. ఒక్క ముఖ్య విషయం. You said - "విలువల మీద ఇంకా నమ్మకం ఉండడం " - ఆ వాక్యం చదివితే అవేవో అబ్సొల్యూట్ విలువలు అన్నట్టు ధ్వనిస్తోంది. విలువలు సమాజ దేశ కాల పరిస్థితుల మీద ఆధారపడి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. నేను నమ్మిన విలువలు అనో, లేదా ప్రస్తుతం మన సమాజంలో సాంప్రదాయ విలువలు అనో అంటే ఏ ఇబ్బందీ లేదు. రెండో ముఖ్య విషయం .. ప్రేమకి ఉన్న ముఖ్య లక్షణాల్లో ఎడ్జస్టుమెంటు కూడా ఒకటి. ప్రేమించిన వారందరికీ ఇది స్వానుభవమే.
@ కొత్తపాళీ గారు:
నాకు విలువల మీద నమ్మకం ఉందంటే నాకున్న విలువల మీద అనే అర్థం చేసుకోండి. (నా భావాల ప్రకారం)
అంటే మన వివాహ వ్యవస్థ, పెళ్ళి, ప్రేమ వగయిరా...
విలువలు మారుతుంటాయి అని ఇంతకు ముందు నా వ్యాఖ్యలో నేను కూడా చెప్పాను.
నేనన్నది మీరు సరిగా అర్థం చేసుకోలేదనుకుంట. నేను చెప్పదలచుకున్నది ఏ విషయమయినా కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయనే...
ఆ పరిమితులే పెళ్ళి, ఒకరికొకరు, పిల్లలు అనే బంధం.
మార్పు ఉండకూడదని నా వాదన కాదు.
నాకు అర్థం కాని ఇంకో విషయమేమిటంటే అసలు మహేష్ గారు ప్రేమ అనే వాదాన్ని ఆకర్షణ తో పర్యాయపదంగా వాడి ఒకరితో ఒకరు అని ఉన్న వారిని హిపోక్రట్స్ గా ఎలా తేల్చేసారో ?
ప్రేమని పెళ్ళితో ముడివెయ్యడం తప్పెందుకవుతుంది అనేది కూడా ఆయన సరిగా వివరించలేదు.
@ప్రవీణ్ గారూ,మీ ప్రశ్నలకి విపులంగా Part 3లో సమాధానం ఇస్తాను. కాకపోతే ఇక్కడ కొంత క్లారిఫికేషన్ అవసరం అనుకుంటా.
"ఒకరితో ఒకరు అని ఉన్న వారిని హిపోక్రట్స్ గా ఎలా తేల్చేసారో ?"- నేను ఇలా ఎక్కడ తేల్చాను!?!
నేను చెబుతోందల్లా.. పై విషయం నమ్మి ఆచరిస్తే తప్పులేదుగానీ, ‘ఇదే సరైనది, మిగతావి తప్పు’ అంటేనే సమస్య అంటున్నాను.ఎవరి జీవితానికి సంబంధించిన విలువలు వాళ్ళే నిర్ణయించి (అవి సమాజం నిర్ణయించినవైనా సరే)బతికితే అసలు సమస్యే లేదు. కానీ నేను చెబుతున్నది పక్కవాడి విలువలు కూడా తామే నిర్ణయించే సంస్కృతి గురించి . అది ఖచ్చితంగా హిపోక్రసీనే..!
"ప్రేమని పెళ్ళితో ముడివెయ్యడం తప్పెందుకవుతుంది? "
నేను రాసిన ఆఖరి పేరాగ్రాఫ్ ని మరోసారి చదవగలరు. నేను చెప్పింది ‘ప్రేమే పరమావధి అయితేనే(అయితేమాత్రమే)’ ఆదర్శమైన ప్రేమ అనే వారి గురించి మాత్రమే విస్మయానికి గురైనట్టు చెప్పాను. పెళ్ళి కోసం ప్రేమ ఆమోదయోగ్యమేకానీ, కేవలం ‘అదే ఆదర్శం’ అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని చెబుతున్నా.
మహేశ్ గారూ..
బాగా రాస్తున్నరు. కాని, సున్నితమైన చాలా అంసాలను ఒకే సారి చెప్తున్నారేమో అనిపించింది నాకు. దీనివల్ల టాపిక్ డైవర్ట్ అయ్యే చాన్సెస్ ఎక్కువ. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
ప్రేమ, ఆకర్షణ... ఇవన్ని ఒకటే అనుకోవటం సహజం. స్వానుభవమొకటే ఆ ముడిని విప్పగలదు.
రాధిక గారూ..
కనిపెట్టేంత వరకు ఆణు, పరమాణు సమాచారం మనకి తెలియదు. అప్పుడు కూడా మనం వాటి గురించి చదివేన్త వరకు తెలియవు. చదివినా అర్థం కాకపోవచ్చు. న ఉద్దేశం లో అప్పటి వరకు ఎంత చర్చించినా, అనుభవానికి వస్తే కనీ కొన్ని విషయాలు అర్థం కావు. కొన్ని సార్లు అనుభవించినా అర్థం కావు. అలాంటి వాటిలో ప్రేమ మొదటిది. అన్ కండిషనల్ ప్రేమలూ అరుదే! కానీ ఉన్నాయి..!! మనం అనుభవించనంత మాత్రాన, అలాంటి ప్రేమ ఉనికి లేదు అనుకోలేము...
My opinion:
సరైన సంరక్షణ లభిస్తే కిరాతకానికి, విచ్చలవిడితనానికి చోటు లేదు కదా.. మనలోని -ve aspects [fears, insecurities] మనలో అణిచివేసుకున్న, అణిచివేయబడ్డ ఆలోచనలకు ప్రతిరూపాలు. వీటి గురించి ఓపెన్ గా మాట్లాడితే, మొగ్గలోనే రాలిపోతాయి. వెలివేయకుండా, పంచుకునే వారుంటే మనసెప్పుడూ మాటాడుతుంది. ఇందుకేనేమో స్నేహానికి అంతగా లొంగిపోతాం. కబట్టి తల్లి తండ్రులే అన్నీ పంచుకుని, చర్చించే మొట్టమొదటి మంచి స్నేహితులైతే సమాజంలో తొంబై శాతం తప్పులు జరగవు.
"With Freedom comes great Power.
With great Power comes, great Responsibility."
Post a Comment