Sunday, June 15, 2008

నేనూ, మా నాయనా, సినిమాలూ


ఈ రోజు తండ్రుల రోజని (father's Day) అన్ని టీవీల్లో ఒగటే రచ్చ. "ఏందిరబ్బా ఈ యవ్వారం? అనుకుంటుండగాన, మా ఆవిడ, "నాన్నాకో ఫోన్ కియాక్యా?" అని హిందీలో అడిగేసింది. ఎందుకో తెలిసిందిగనక తటాలున ఓ ఫోనుగొట్టి మా నాయనకు "హ్యాపీ ఫాదర్స్ డే" చెప్పేసా. చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ఎందుకో చాలా సిల్లీ గా అనిపించింది. ప్రతిరోజూ తలుచుకుని గౌరవించవలసిన అమ్మకూ, నాన్నకూ సంవత్సరానికి ఒక రోజు కేటాయించి, వీలైతే విష్ చేసి మా పనైపోయిందని తృప్తిపడదామా అనిపంచింది. కానీ ఏంచేద్దాం? వార్ని తరచూ కలసుకోకపోఅడానికి ఈ దూరం కారణమైతే, కనీసం తలుచుకోకపోవడానికి, నా బిజీ జీవితాన్ని సాకుగా చూపి నన్నునేను మోసం చేసుకున్నా. ఆ క్షణంలో, నేనిప్పుడు అమితంగా ప్రేమించే సినిమాల విషయంలో మా నాన్న చెప్పిన ఫిలాసఫీ గుర్తుకొచ్చింది.


చిన్నప్పుడు, వేసవి శెలవుల్లో తిరుమల కొండకెళ్ళి తలనీలాలు సమర్పించుకోవడం మా కుటుంబంలో దాదాపు ఒక పరంపరగా జరిగేది. మనకు ఇంటర్ మీడియట్ వరకూ ప్రతి సంవత్సరం గుండేనన్న మాట. ఆ తరువాత నామోషీగా ఫీలై మానేసా. పైగా దేవుడికి జుట్టు సమర్పించుకోవడం అనవసరం అనిపించడం కూడా ఆ ఆపెయ్యడానికి మరొ కారణం. ఇలా తిరుమల కు వెళ్ళడం ఒకెత్తైతే, తిరుపతిలో ఉన్న మా అత్తగారింట్లో ఉండి అప్పుడే రిలీజైన అన్ని సినిమాలు క్రమం తప్పకుండా చూడడం ఒక ఎత్తయ్యేది. బహుశా ఆ సినిమాల కోసమే అన్ని సంవత్సరాలూ గుండును భరించానేమో అని అప్పుడప్పుడు అనుమానం నాకు.


కొండ దిగి, అత్తోళ్ళింట్లో (మా మేనత్త, మా నాన్నగారి అక్కగారింట్లో) అడుగు పెట్టగానే కొంత డబ్బు మా చేతబెట్టి "సినిమాలు సూడండ్రా!" అనేవాడు మా నాయన. బహుశా నేను 9దో తరగతిలో ఉండగా మా అత్తోసారి "ఏం ఓబులేసూ, ఈళ్ళని సినిమాలకి పంపిచ్చి చెడగొడతాండావే" అంటే, మా నాయన నవ్వి ఊరుకున్నారు. అందరు తల్లిదండ్రులూ సినిమాలకు రాషనింగ్ పెడితే "మానాయనేంది, మమ్మల్ని ఇష్టమొచ్చినట్టు సినిమాల్జూడమంటాడూ!" అని ఒక అనుమానం కూడా కలిగింది. ఈ అనుమానాన్ని నేనే బహుశా కాలేజిలో చేరిన వెంఠనే మా నాయన్ను అడిగా. దానికి ఆయనిచ్చిన సమాధానం దాని వెనకనున్న వారి ఆలోచన చాలా అమోఘమనిపించాయి.


"చూడ్రా! సినిమా జూస్తే మహా అంటే మూడు గంటలు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకోని ఇంగో రెండు గంటలు వేస్ట్ చేస్తారు. మీకు సినిమా అంటే ఇష్టం. అలాంటిది, నేను సూడద్దు అంటే... ఆ సినిమా గురించి ఆలోశిస్తూ, నన్ను తిట్టుకుంటూ మీరు గడిపే సమయం ఇంకా ఎక్కువౌతాది. దానికన్నా సూసేస్తే ఒగ పనైపోతుందిగదా?" అన్నారు. ఒక్క క్షణం నాకు మాట రాలేదు. తనే మళ్ళీ చెప్తూ, " ఇప్పుడు రిలీజు సినిమా సూడకుండా నువ్వు కాలేజీకిబోతే, ఆడ ఎవడోఒగడు సిన్మాజూసి ఆ కబుర్లు జెప్తాఉంటే, మల్లా మీకు బాగుండదు, మీ మనసుల్లో నాకు తిట్లుదప్పవు. అవన్నీ అవసరమా?" అని నన్నుచూసి కళ్ళెగరేసారు. "నిజమే కదా!" అనిపించింది. కానీ మళ్ళీ నేనే, "సినిమా చూస్తే చెడిపోతారంటారూ.." అని నసిగా. దానికాయన ప్రేమగా నవ్వి "మూడు గంటలుజూసే సినిమా నిన్ను చెడిపేస్తే...ఇంగ మేమెందుకు? మా పెంపకమెందుకు?" అన్నారు.


ఈ విషయంలో ఆయన ఆలోచన, పిల్లల పెంపకం పట్ల నమ్మకం, వారు తనను అనవసరంగా ‘హేట్’ చెయ్యకూదదన్న తపన, మా స్నేహితుల మధ్య మేము తక్కువైపోకూడదన్న కోరికా, ముఖ్యంగా నాకు సినిమాల పట్ల ఉన్న ఇష్టాన్ని అర్థంచేసుకున్న ఉదాత్తత నన్ను ఇప్పటికీ అబ్బురపరుస్తాయి.


మా నాయన నన్ను సినిమాలు చూడమని ప్రోత్సహించకపోయుంటే, పోస్టుగ్రాడ్యువేషన్ తర్వాత హైదరాబాదులో ఉండటానికి డబ్బులు చాలకపోతే వెబ్ ప్రపంచం డాట్ కామ్ కి సినిమా రివ్యూలు రాసి డబ్బు సంపాదించగలిగే వాణ్ణేకాదు. ఇప్పటికీ "నా సినిమా జ్ఞానానికి తొలిమెట్టు మా నాయన నాకిచ్చిన ప్రోత్సాహమేకదా" అనిపిస్తుంది. నేను జీవితంలో ఒక సినిమా తీస్తేమట్టుకు అది మా నాయనకే అంకితం.


ఈ జ్ఞాపకాల్ని తట్టిలేపినందుకు Father's Day కి ఒక పెద్ద థ్యాంక్యూ చెప్పాలి.

21 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఓబులేసు గారి లాంటి వాళ్ళు ఇవ్వాళ్టి యువతకు చాలా అవసరం.

శ్రీ said...

భలే నాయనండీ మీ నాయన మహేష్ గారూ!మా నాన్న కుడా నన్ను బాగనే ప్రోత్సహించేవాడు!

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగా వ్రాసారండి మహేష్. మీ నాన్న గారి లాటి ఆలోచనా దృక్పధం ఈ తరం తల్లిదండ్రులకి ఆదర్సప్రాయం కావాలి.

bolloju ahmad ali baba said...

సాహిత్యంలో ఎందుకో తల్లికున్నంత ఫాల్లోఅప్ తండ్రికి ఉండదు. (అఫ్ కోర్స్ వ్యక్తి జీవితంపై తల్లి ఇంపాక్ట్ ఎక్కువే అనుకోండి). రచయితలు తల్లి గురించి వ్రాస్తే, రచయిత్రులు తంద్రిగురించి వ్రాయటం ఎక్కువగా జరుగుతుంది. అక్కడక్కడా మినహాయింపులు ఎలాగూ ఉంటాయి. మీలా .

ఒకటి ఒడిపస్ కాంప్లెక్స్, మరొకటి ఎలక్ట్రా కాంప్లెక్సు అనుకోవాలా?
చాలామంచి పోష్టు. మంచి భావాలు.
బొల్లోజు బాబా

arvindrishi said...

Summer lo cinemala kosam chesina hadavudi nijanga gurtunchukovalsina gnapkam.Vesavilo tirumala prayanam bhesh..!

Nayana gaai thought process thoughtful. Nice post Magesha..!

Purnima said...

"మూడు గంటలుజూసే సినిమా నిన్ను చెడిపేస్తే...ఇంగ మేమెందుకు? మా పెంపకమెందుకు?" - I admire this confidence!!

ప్రవీణ్ గార్లపాటి said...

టచింగ్...
పిల్లల మీద నమ్మకం ఉంచి, వారిని ప్రోత్సాహించే తల్లిదండ్రులు దొరకడం అదృష్టం.

S said...

బాగుందండీ మీ నాన్న ఫిలోసఫీ.
మీ కాలేజీ సీరియల్ చదవలేదు కానీ....మీ బ్లాగు చూస్తూనే ఉన్నా...పెద్ద కళ్ళేసుకునే చదువుతున్నా మహేష్ గారూ..

సుజాత said...

భలే నాన్నండీ! మీరు అదృష్టవంతులు! వారికి నమస్కారాలు!

మీరు వెబ్ ప్రపంచం కి సినిమా రివ్యూలు రాశారా! నేను వాళ్ళకి రెండు కథలు రాశాను. జలపతి అని ఒకాయన రివ్యూలు రాస్తుండే వారు కదా! మౌలిన్ రూజ్ అనే సినిమా గురించి ఆయనతో చిన్న పాటి చర్చ లాంటి వాగ్యుద్ధం జరిగినట్టు గుర్తు చాల్రోజుల క్రితం 2001 లో అనుకుంటా!

కొత్త said...

kudos to your father.

జ్యోతి said...

విదేశాలలో పదిహేనేళ్ళకే పిల్లలు తల్లిదండ్రులను వదిలి స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడతారు. ఇక వయసు మీద పడిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమలో వదిలేస్తారు. అలాంటివాళ్ళను ఏడాదికొకసారి ఇలా గుర్తు చేసుకుని, వాళ్ళకు పూలు , బహుమతులు తీసికెళ్ళి వాళ్ళతో గడుపుతారు. ఈ పనికి రాని సంస్కృతి మన దేశంలో కూడా పిచ్చగా వ్యాపించింది. ఇందులో గ్రీటింగ్స్, గిఫ్టుల కంపెనీలు చాలా లాభపడుతున్నాయి.అలా యేడాది కొకరోజు అమ్మరోజు, నాన్న రోజు, ప్రేమికుల రోజు అని జరుపుకునే బదులు ఏదైనా ఒక రోజు, ఎన్ని సార్లైనా అమ్మా,నాన్నకు ఇష్టమైనవి బట్టలు కాని, పుస్తకాలు కాని, సినిమా కాని, మిఠాయి కాని తీసికెళ్ళి ఇచ్చి వాళ్ళ మొహంలో కనపడే సంతోషం చూడండి. అది ఎన్నో మధురానుభూతుల్ని నింపుతుంది. ఇలా అందరూ చేసుకుంటున్నారు కదా అని మనమూ చేసుకుందాం అని ఆలోచించొద్దు. ప్రేమ అనేది ఆ ఒక్కరోజు మాత్రమే వ్యక్తపరచాలా. అందుకే నేను నిన్న నాకు తెలిసిన నాన్నలను ఎవ్వరినీ అభినందించలేదు. అది వేరే ఏ రోజైనా చేయొచ్చు. ప్రపంచంలో అందరు జరుపుకుంటున్నారని ఈ దినాలను చేసుకుంటారు. మీ అమ్మా నాన్న పుట్టినరోజు, పెళ్ళిరోజు వెళ్ళి వాళ్ళతో గడిపి పండగ చేసుకుందామని ఎంత మంది ఆలోచిస్తారు??

కత్తి మహేష్ కుమార్ said...

@రాజేంద్ర,శ్రీ,వేణూ గారూ నెనర్లు. మా నాన్న నాకు ఆదర్శమే. ఇప్పటికీ మా నాన్నలాగా నేను నా కొడుకుని చూసుకోగలిగితే అదొక ‘అఛీవ్ మెంట్’ అనుకుంటాను.

@బల్లోజు బాబా గారూ,నిజమే అవసరాల్ని తప్ప సాధారణంగా అనుభూతుల్ని నాన్నలు పంచుకోరుకాబట్టి, వారి గాంభీర్యం వెనుకనున్న ప్రేమ మన జీవితాల్లోనూ, సాహిత్యంలోనూ మరుగుపడిపోతూ ఉంటుంది. కానీ వ్యక్తులుగా మన ఎదుగుదలకు తండ్రులు పడ్డ తపన మనకందరికీ తెలుసు కాబట్టి, కనీసం దాన్ని గుర్తించడం చాలా అవసరం.

@అర్వింద్,పూర్ణిమ, ప్రవీణ్,s, నెనర్లు.ఈ జ్ఞాపకాలు స్ఫూర్తిదాయకాలు కాబట్టే ఇంకా గుర్తున్నాయి.మా నాన్న గారు చదివింది పాత SSLC అయినా,వారి ఆలోచనలు ఎప్పుడూ ఒక ఫ్రొఫెసర్ ని తలపించేలా ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి కూడా.

@సుజాత గారు, నెనర్లు. నేను వెబ్ ప్రపంచంలో ఫ్రీలాన్సింగ్ చేసానండి.‘సంక్రాంతి సినిమాలు’ అనే వ్యాసం, మృగరాజు,దేవీపుతృడు సినిమా సమీక్షలు ఆ సైట్లో నేను రాసినవే. ఇప్పుడవి ఉన్నాయోలేవో!

@జ్యోతి గారూ, మీరు చెప్పింది చాలావరకూ ఆమోదయోగ్యం.కాకపోతే దాదాపు అమెరికన్ సంస్కృతి అడుగుజాడల్లో కావాలనో,లేక తప్పనిసరి పరిస్థితుల్లోనో నడుస్తున్న మనం, ఇలాంటి ‘పెట్టుడు రోజు’ల్లోనైనా తల్లిదండ్రుల్ని తలుచుకుని వారితో కాస్త quality time ని గడపడమో, కనీసం ఫోన్ చేసి మాట్లాడటమో చేస్తే మంచిదే అని నా అభిప్రాయం

కృష్ణుడు said...

అదెదో సినిమాలో రజనీకాంత్ నాన్న లాగున్నారే మీ నాన్న.He was very thoughtful.

కొత్త పాళీ said...

@జ్యోతి - "ఇక వయసు మీద పడిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమలో వదిలేస్తారు."
ఎక్కడ సంపాయించారండీ ఈ సమాచారం? వృద్ధులైనా, తమ పనులు తాము చేసుకోగలిగినంత సేపూ స్త్రీపురుషులు తమ ఇళ్ళల్లో తాము స్వేఛ్ఛగా ఉండటానికే ఇష్టపడతారు. నా సహోద్యోగులు చాలా మంది తమ తలి దండ్రులకి పది పదిహెను మైళ్ళ దూరం లోపునే ఉంటారు. వారానికోసారైనా వాళ్ళ బాగోగులు కనుక్కుంటూ ఉంటారు. ఇంట్లోనో, లేక ఆరోగ్యానికి సంబంధించో ఏం సహాయం కావాలన్నా వెంటనే వెళ్ళి చేస్తారు. మీరు చెప్పండి, సిటీల్లో ఉండే మన వాళ్ళు ఎంత మంది తలిదండ్రుల గురించి ఆ మాత్రం పట్టించుకుంటున్నారో?

అబ్రకదబ్ర said...

బళ్లో చదివారో లేదో కానీ లోకాన్ని బాగా చదివినట్లున్నారు మీ నాన్న. మీరు ఆలోచించే విధానంపై ఆయన ప్రభావం చాలా ఉన్నట్లుంది. ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని (సినిమాల విషయంలో) దుర్వినియోగం చేయకపోవటం మీ వివేకం. మంచి వ్యాసం రాశారు.

సీనుగాడు said...

Mahesh, అంత తెలివైనాయన మీకు తండ్రి కావడం మీరు చేసుకున్న అదృష్టం.

@జ్యోతి గారు,
క్షమించాలి, మీరు అమెరికన్స్ అందరినీ ఒకే మూసలో కట్టేసి, తల్లిదండ్రులని వృద్దాశ్రంలో వదిలేస్తారనడం నేను ఒప్పుకోను. ఇక్కడ చాలామంది, మొగుడూపెళ్ళాలిద్దరూ కలిసి పనిచేస్తేనేగాని, ఆర్ధికంగా నిలద్రొక్కుకోలేరు. అలాంటి పరిస్థితులలో, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను మంచి కేర్ ఇవ్వగల రిటైర్ మెంట్ హోం లో ఉంచడం మంచిదంటారా? లేక, సాయంత్రం దాకా వారి మానాన వారిని వదిలి వెళ్ళడం మంచిది అంటారా? ఇంకో విషయం, రిటైర్ మెంట్ హోం లో ఉంచడం అంటే అదేదో పిచ్చాసుపత్రిలో ఫ్రీగా పడేసినట్టు కాదు. వారికి సమయానికి మందిచ్చే వాళ్ళుంటారు. మాట్లాడే ఓపిక ఉంటే, తమ లాంటివాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కనుక కాలక్షేపానికి కొదవ ఉండదు. వీలయినప్పుడల్లా ఫేమిలీ వెళ్ళి వారితో వీలయినంతసేపు కాలక్షేపం చేసి వస్తారు. ఇండియాలో సంఘానికి భయపడి తల్లిదండ్రులని ఇంట్లో పెట్టుకొని, చిన్న దానికీ పెద్ద దానికీ "నీకు మరీ చాదస్తం ఎక్కువవుతుంది" లాంటి సూటి పోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు నాకు చాలామందే తెలుసు.

సుజాత said...

కొత్త పాళీ గారన్న మాట నిజమే! మనవాళ్ళు ఎంత మంది తల్లిదండ్రుల్ని పట్టించుకుంటున్నారు? మా ఇంటి వెనకాలే ఉంటుంది ఒక హైటెక్ Old age home! చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ పేరుతో! అప్పుడప్పుడూ అక్కడికి వెళ్తాను నేను కాసేపు కబుర్లు చెప్పడానికి!

ఇక సీను గాడు గారు(పేరు మార్చుకోండి సీను గారు, ఇబ్బందిగా ఉంది) చెప్పినట్టు ఇంట్లో మాటలు పడుతూ, అక్కడే పడి వేలాడుతూ ఉండే కంటే ఇలాంటి హోం లో ఉండటమే హాయి. మన భావాలు, ఆలోచనలు పంచుకోవడానికి మనుషులుంటారు. ఒకరి స్వేచ్చకు మరొకరి అడ్డుకట్టలుండవు. డాక్టరుంటాడు(ఒకళ్లు కష్టపడి డాక్టరు దగ్గరికి తీసుకెళ్లకుండా),మంచి కాలక్షేపం ఉంటుంది. నేనైతే ఈ హోంస్ ని ఇదివర్లో సమర్ధించే దాన్ని కాదు. సి.ఆర్ ఫౌండేషన్ ని గమనించాక 100 శాతం ఒప్పేసుకుంటున్నాను. వయసు మీద పడ్డాక పిల్లలకు టైము లేక పోయినా, ప్రేమ లేకపోయినా హోం లో ఉండటమే హాయి.

Gireesh K. said...

మీ అనుభవం చదివాక, నాక్కూడా మా నాయన గుర్తుకొచ్చారు (ఆయన చనిపోయి పద్దెనిమిది సంవత్సరాలవుతోంది).

మేమప్పుడు శ్రీకాళహస్తిలో ఉండేవాళ్ళం. నేను అరో తరగతిలో ఉండగా, ఆంధ్రజ్యోతి పేపరు తెప్పించేవారు.ఆయనకు తెలుగు చదవడం రాదు. హిందూ పేపరు మాత్రమే చదివేవారు. అప్పుడు ఆంధ్రజ్యోతి విజయవాడ నుంచి మాత్రమే పబ్లిష్ అయ్యేది. పూర్తిగా సినిమా ప్రకటనలతో నిండి ఉండేది. మా యింటికి వచ్చేవాళ్ళందరూ ఈ పేపరెందుకు తెప్పిస్తున్నారు, ఒట్టి సినిమా బొమ్మలు మాత్రమే ఉంటాయని అడిగేవారు. అందుకాయన "కనీసం సినిమా కబుర్ల కోసమైనా న్యూస్ పేపరు చదవడం పిల్లలకు అలవాటవుతుందని" సమాధానమిచ్చేవారు. అలాగె అప్పటి చిన్న పిల్లల పత్రికలన్నీ తెప్పించేవారు. లైబ్రరీ కెళ్ళడానికి ఎప్పుడూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఆయనవలనే నాకు చదవడమనే అలవాటు అబ్బింది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

వృద్దాశ్రమం ప్రస్తావన వచ్చింది కనుక,అసందర్భమైనా ఒక్కమాట,వీటివల్ల అన్ని అంశాల్లో ఉన్నట్లే మంచిచెడు రెండూ ఉన్నాయి,వాటి విషయం కాస్త పక్కకు పెడితే,నగరాలు,పట్టణాలు మినహాయిస్తే చిన్నచిన్న బస్తీలు,పల్లెటూళ్ళలో ఈ సదుపాయం లెదు.పల్లెలు,కరవుపీడితప్రాంతాలు,తీవ్రవాద ప్రాబల్యమున్న చోట్లా,పనిచేసే వారంతా పట్నాలకు తరలి కేవలం ముసలివాళ్ళను మాత్రమే,అదీ ఇళ్ళకు కాపలాగా వదిలివెళ్ళిన ప్రాంతాల్లో వృద్ధులయాతనలు నరకప్రాయం.ఈమధ్య ఒక home for the aged ప్రారంభోత్శవానికి వెళ్ళాను,ధరవరల గురించి అడిగితే నిర్వాహకులు మనిషికి వైద్యసేవలతో కలిపి ఏడు వేలన్నారు.కానీ అప్పటికే అక్కడుంటున్నవారు గుసగుసగా చెప్పింది తొమ్మిది వేలుదాకా వసూలు చేస్తున్నారని.అందరూ వృద్ధులే అయినా వారివారి పిల్లల సాంఘిక అంతస్తులను బట్టి కూడా treatment లో తేడా ఉంటుందన్నారు ఒకరు.యన్నారైల తల్లితండ్రులకు మాత్రం రాచమర్యాదలని మరొకరు ఇలా చెప్పుకొచ్చారు.
గత్యంతరం లేని పరిస్తితుల్లో తప్ప అమ్మానాన్నలను ఎంతగొప్ప ఆశ్రమం అయినా అక్కడ ఉంచకూడదని నావాదన.తల్లితండ్రి విలువ వారిని పోగుట్టుకున్న నాలాంటి వారికి బాగా తెలుస్తుంది.చిన్నచిన్న ఇబ్బందులనధిగమించయినా కన్నవారి దగ్గరుండటం,లేదా వారిని మన దగ్గరుంచుకోవటం పెరగాలి.లేదంటే అది మరో రకమైన gerontocide అవుతుంది.

Srividya said...

చాలా బాగా రాసారండి. అర్థం చేసుకునే అమ్మా నాన్నా దొరకడం నిజంగా అదృష్టం.

మోహన said...

బాగుంది మహేశ్ గారు..:)

మీ నానగారి నమ్మకాన్ని అభినందించాల్సిందే!..