Thursday, June 19, 2008

మందు బాబులూ, మీకు జోహార్లు !


"మన మీద మనకు లేని శ్రద్ధ ప్రభుత్వానికి ఎందుకుండాలీ?" అని ఒక బ్లాగులో కామెంటిన ఇండియన్ మినర్వా గారి మాట లో , మద్యం లైసెంసుల వేలం పైన అందరి ఆర్గ్యుమెంట్లనీ తునాతునకలు చేసే బలముంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల బలహీనతలతో ఆడుకునే దౌర్భాగ్యానికి దిగజారకూడదు సరే, మరి మనిషికి మాత్రం కుటుంబాన్ని పణంగా పెట్టి మరీ బలహీనతకు (దర్జాగా) లోనయ్యే హక్కు ఉందంటారా?


హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న మద్యం దుకాణాల లైసెంసు కోసం చెల్లించిన ధర ప్రతి దుకాణానికీ 2 కోట్లు పైమాట. ప్రభుత్వానికి ఈ తంతు ద్వారా చేకూరిన పైకం అక్షరాలా 1649.49 కోట్లు. ఇక లేడి నెత్తురు మరిగిన పులి, గడ్డి మేస్తుందా? తెలుగుదేశం దారి చూపితే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆరులైన్ల హైవే చేసేసింది. అంతే తేడా, కాబట్టి ఈ రాజకీయ పార్టీలలో ఎవరికీ మరొకర్ని వేలెత్తిచూపే అర్హత లేదు. ఇక మన ‘ఎర్ర’ బాబులు సరదాగా ఉద్యమాలైతే చేస్తారేగానీ, విషయానికోచ్చేసరికీ వీరూ మందుగారిపోయారు. ఇక మిగిలింది, మన జయప్రకాష్ నారాయణ్ "నిబద్దత ఉంటే బ్రాందీ,సారాలు ఎన్నికల్లో ఉపయోగించం" అని రాజకీయ పార్టీల్ని మాటివ్వమని దాదాపు సంవత్సరంగా అరచి అరచీ ఇప్పుడు పాపం నోరుపడిపోయి, నోరెళ్ళబెట్టి ఈ ప్రహసనాన్ని చూసి బాధకన్నా, ఆశ్చర్యపోవడం ఇతడి వంతైంది. పాపం !


ఇక మహిళా ఉద్యమ కర్తలూ, తెలుగు మహిళా కార్యకర్తలూ (కొంత సినీ గ్లామరు మొఖానపూసి) తమవంతుగా మీడియాలో అక్కసు వెళ్ళగక్కారు. డబ్బుపెట్టి కొన్న కొన్ని సీసాల బ్రాందీ, విస్కీలని కెమెరా సాక్షిగా పగులగొట్టి చేతులు దులుపుకున్నారు. వేలం జరుగుతున్న చోట, వేలం పాడేవాళ్ళని ఐడెంటిటీ కార్డులిచ్చి మరీ పోలీసు ఎస్కార్టులు స్వాగతిస్తుంటే, మరో వైపు లాఠీ చూపించి ఉద్యమ కారుల్ని అదే పోలీసులు శాంతింపజేస్తున్నారు. ఆహా! ఏమి మనోహర దృశ్యం. అణువణువునా హాస్యం, అడుగడుగునా TV సీరియల్ని మరిపించే డ్రామా. నిజంగా అప్పుడనిపించింది, "మందు బాబులూ మీకు జోహార్లు" అని.


బ్లడ్/కాన్ఫ్లిక్ట్ డైమండ్ ఆధారిత కొన్ని ఆఫ్రికా దేశాల అర్ధిక వ్యవస్థల్లాగా మన రాష్ట్రమూ ఈ మద్యం డబ్బుతో అభివృద్ధి సాధించే దిశగా సగర్వంగా అడుగులేస్తుందేమో! మన ఆర్థిక మంత్రి రోశయ్యగారు మాత్రం చాలా హుందాగా "ఈ డబ్బుని మధ్యపాన వ్యతిరేక ప్రచారానికి వాడతాం" అని మరో తీవ్రమైన జోకొకటి పేల్చి, లుంబినీ పార్కు బాంబు విస్ఫోటాన్ని మరిపించారు. ఇన్ని జరుగుతున్నా, ఎక్కడా కనబడని జగన్నాటక సూత్రధారి మాత్రం...పేరు తెలీని మందు బాబులు.


ప్రభుత్వాలకూ,రాజకీయ పార్టీలకూ, సామాజిక ఉద్యమ కర్తలకూ వాళ్ళవాళ్ళ జెండాలూ,అజెండాలూ ఉన్నాయ్. కానీ వ్యక్తులుగా మన గమ్యం ఏమిటి? సాఫీగా జీవితం సాహించడమే కదా ! మరి ఈ మందులో జీవితాన్ని మరిపించే సుఖముందా!?! ఉంటే మాత్రం మందుకు జై ! మందు బాబులకు జై!జై! మందు బాబులూ మీకు జొహార్లు.

9 comments:

cbrao said...

ఈ మందు బాబులే ప్రభుత్వానికి మహారాజ పోషకులు. వీరు లేకుంటే మధ్య తరగతి ప్రజలపై పడే పన్నులు ఊహించలేము. మందు బాబులకు జోహార్లు.

GIREESH K. said...

ఈ మధ్యే సర్క్యులేట్ అయిన SMS జోకు:

Finally it has happened!

BEER is now cheaper than PETROL.

"DRINK" but don't "DRIVE".
-:)

Bolloju Baba said...

రోసయ్య గారలా అన్నారా? గొప్పజోకు బ్లాగులోకి లాక్కొచ్చేరే.

మద్యం ఇప్పటిదేమీ కాదు కదండి. రోమన్ ల కాలంలో ఫెర్మెంటేషను పాట్ లు, వేదాలకాలంలో సోమరసాలు. ఇప్పుడు కుండలు పోయి సీసాలు వచ్చాయి. మానవజాతిని అనాదిగా పట్టిపీడిస్తున్న ఒక జాడ్యమే.

ఆంధ్రాలో నిషేదం ఉన్నప్పుడు, మా యానానికి జిల్లాలకు జిల్లాలు దాటి వచ్చి, తప్పతాగి ఎందరో మృత్యువాత పడ్డ దారుణాతి దారుణమైన సంస్కృతిని కళ్లారా చూసినవాడిని. (అప్పట్లో వ్రాసుకొన్న కవితఒకటి ఉంది. పోష్ట్ చేస్తాను.)

ఈ నాటకాలేమీ నాకు వింతగా అనిపించటం లేదు.

బొల్లోజు బాబా

రవి వైజాసత్య said...

అప్పుడప్పుడు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం వ్యభిచారగృహాలు ఎందుకు స్థాపించట్లేదని అనిపిస్తుంది. అది కూడా లాభసాటి వ్యాపారమేగా?

Sujata M said...

Hello. I totally agree with Mr.CB Rao. It makes sense to me, why Govt wants to have its Liquor Market open. However, its as usual, a nice post to read.

Anil Dasari said...

రవి వైజాసత్య,

ఇంకొన్నేళ్లుంటే మీ ముచ్చట కూడా తీరొచ్చు. దానికో ప్రత్యేక శాఖ, ఆ శాఖని నడపటానికో తలకుమాసిన మంత్రి, ఆయన గారి నోటెంట రోశయ్యగారు చెప్పినటువంటి ఆణిముత్యాలు .... ఇవన్నీ జరిగేరోజు మరీ దూరంలో లేదేమో.

Kathi Mahesh Kumar said...

@సి.బి.రావు
నిజమే మద్యాన్ని ఒక ప్రముఖ ఆదాయ వనరుగా ఎంచుకోకపోతే, మరోదారి పన్నులు పెంచడమే. దానికి మనం తయారుగా ఉంటే మద్యాన్ని నిషేధించమని ఉద్యమించొచ్చు.

@గిరీష్, అవును నిజమే కదా!బీరిప్పుడు పెట్రోల్ కన్నా చీపే.

@బాబాగారూ,రోశయ్య గారు ఈ మాటకు ముందు గాంధీగారి ఆదర్శాలూ,కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యాలగురించి మరిన్ని జోకులు పేల్చారు. ఈ వారాంతరంలో మళ్ళీ మీకు ఏదోఒక ఛానల్లో ఈ ప్రసంగం/ప్రహసనం ఖచ్చితంగా చూసే అదృష్టం కలగొచ్చు. వేచి ‘చూడండి’.

@రవి వైజా సత్య, వ్యభిచారాన్ని పరిశ్రమగా గుర్తించి లైసెంసులు ఇవ్వాలన్న డిమాండ్ (వీరిపై పోలీసుల దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని)పరిశీలనలో ఉంది. అది త్వరలో ముందుకు వస్తే, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుంది లెండి. ఆ మాత్రం నమ్మకం మనకుంది.

@సుజాత, yes it surely makes a good business sense. However, its a disastrous welfare measure. That's the conflict out here.

@అబ్రకదబ్ర,నిజమే

Dreamer said...

Why are we making "Drinking" a big deal? ఇది జాడ్యమెలా అవుతుంది??

ఎడిక్షన్ అనే రిస్క్ ఏ అలవాటుకైనా ఉంటుంది, కాఫీతో సహా. Just "Drink Responsibly"

Kathi Mahesh Kumar said...

@ఋణవంతుడు,Sure drinking is not a big deal for few, who have enough disposable income to throw at it or to very few who enjoy it responsibly as you put it.

ఇక్కడ సమస్యల్లా,మందు వల్ల వచ్చే ఆదాయం పై ప్రభుత్వం యొక్క excessive dependency. దానికోసం Vulnerable (for addiction) ప్రజలకు విచ్చలవిడిగా మందు దొరికే అవకాశం కల్పించడం.

అయినా నా వ్యాసం మెదట్లో చెప్పినట్టు, మన ఆరోగ్యం మీద మనకు లేని శ్రద్ద ప్రభుత్వానికెందుకూ?