Monday, June 30, 2008

Prejudice కి తెలుగు పదం ఏమిటబ్బా?

ఓ రెండ్రోజులుగా "Prejudice కి తెలుగు పదం ఏంటా?" అని నా దగ్గరున్న డిక్షనరీలన్నీ తిరగదోడాను. చివరకి బ్రౌను నిఘంటువులో, "విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి" అని అర్థాలు కనపడ్డాయేగానీ సమానాంతర పదం మాత్రం కానరాలేదు. అంటే నిజంగా మన తెలుగు ప్రజల నరనరాల్లో జీర్ణించుకున్న ఈ అమూల్యమైన లక్షణానికి, ఆంగ్లంలో తప్ప తెలుగులో సరైన పదం లేదని తెలిసిపోయింది.



కానీ మన జీవితాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండోయ్! ఇదుంటే మనకు చాలా సుఖం. ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. విషయాల నిజనిర్థారణ అవసరం లేదు, తప్పొప్పుల ఆలోచన అఖ్ఖరలేదు, శ్రమలేకుండా బతికెయ్యొచ్చు. ఈ సుఖానికి మనం ఎంతగా అలవాటుపడిపోయామంటే, మనుషుల్ని వారి ప్రవర్తనతోనో, ఆలోచనలూ, అభిప్రాయాలతోనో బేరీజు చెయ్యడం మానేసాం. వారు నివసించిన ప్రదేశాన్నో, సంస్కృతినో, ఇంటిపేరునో లేక కులాన్నో తెలుసుకుని దానికి తగ్గట్టు ఒక "బ్రాండ్" తగిలించి, సుఖపడిపోతాం. "అరవోళ్ళు", "ఆంధ్రావాళ్ళు", "దళితులు" అని కొన్ని బ్రాండ్ లేబుల్లు తగిలించి, మన ప్రెజుడిస్ ని విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉంటాము.


ఒక వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కొలవడంలో గల శ్రమని తగ్గించుకుని, ఇలాంటి బ్రాండ్లు కల్పించేసుకున్నామన్న మాట. అందుకే మన సామాజిక సంబంధాలు వ్యక్తులతో కాక, వారికి ప్రెజుడిస్ తో మనం తగిలించిన లేబుళ్ళతో నెరిపేస్తూ ఉంటాం. ఇలాకాక, ప్రతివ్యక్తినీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగల మనిషిగా అర్థం చేసుకుని, ఆదరించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి ! అందుకే మన వ్యక్తిగత అనుభవాలన్నీ, ‘రంగుటద్దాల’ సగం సత్యాలేకానీ, అసలు నిజానికి ఓ అంగుళం దూరంగానే ఎప్పుడూ ఉంటాయి.



ఈ ప్రెజుడిస్ అప్పుడప్పుడూ తీవ్రరూపం దాల్చి, మన మీడియాలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడితే ఫ్యాక్షనిస్టు, తెలంగాణ యాసైతే కామెడీ ఇలాగే అవ్వలేదూ? అంతెందుకు మనం చాలా విలువల్ని ఆపాదించే "ఇజాలు" కూడా ప్రెజుడిస్ పుణ్యమే కదా! కమ్యూనలిజం (మతతత్వం), జింగోయిజం, మేల్ ఛవ్వనిజం, సర్వాంతర్యామి అయిన క్యాస్టిజం (కులతత్వం) వీటిల్లో మచ్చుకకి కొన్ని.



ఇలాంటి సుఖమైన జీవితం నుండీ బయటపడమని చెప్పడం సాహసమే ! కానీ ఇలాగే సాగితే మన మానవ సంబంధాలు అతిమహా లోతుల్లోకీ, అధ:పాతాళానికీ చేరి ఇంకా సుఖపడతాయేమో అని ఎక్కడో చిన్న సందేహం. అందుకే కనీసం నిఘంటువులో అర్థాన్ని వెదికే సాహసం చేశాను. దయతొ అందరూ క్షమించగలరు.

8 comments:

Rajendra Devarapalli said...

మాయరోగమనుకోవచ్చు ప్రస్తుతానికి

teresa said...

@rajendra- that sounds right :)

ఏకాంతపు దిలీప్ said...

దురభిమానం

పెదరాయ్డు said...

prejudice అంటే 'అపోహ ' లేక 'అపార్థం'

సుజాత వేల్పూరి said...

పైన చదివిన టపా సారాంశాన్ని బట్టి రాజేంద్ర గారు చెప్పిన అర్థం బాగానే ఉంది.

saisahithi said...

చాలా బాగుంది.
చాలా కాలం క్రితం( almost ten years ago) jane austin వ్రాసిన pride and prejudice చదివినప్పడినుండి ఈ సందేహం ఉన్నప్పటికి దీనర్ధం తెలుగులో తెలుసుకోవాలన్న సాహసం చేయలేదు. నిజమే....మనచుట్టూ మనమే సాలి గూళ్ళను కట్టుకుని అందులోంచి బయట పడలేక జీవితాల్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. నిజాల్ని నిదానంగా తెలుసుకునే తీరికలేదు. అద్దెకు తెచ్చుకున్న అభిప్రాయాలతో పులుముకున్న ప్రేమలతోను ఏదో అలా జీవితాలు సాగిపోతున్నాయి అని తెలుసుకునేదెప్పుడో...

Kathi Mahesh Kumar said...

అందరికీ నెనర్లు.
@ రాజేంద్ర బాగా చెప్పారు. నా ఉద్దేశం అదే!
@ సుజాత, నిజమే!
@సాయి సహిత,నేను suggest చేసిన భావం మీ మనసులో ఎప్పటినుండో మెదులుతోందన్న మాట.

chandramouli said...

మంకుతనం అనొచ్చేమో ...తెలుగులో