(www.navatarangam.com లో వచ్చిన కొన్ని కామెంట్లకి సమాధానంగా రాసి,ఈ మాసంలోనే ప్రచురింపబడిన వ్యాసం ఇది)
"తెలుగు సినిమా చెడిపోయిందహే!" అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి "దీన్నుంచైనా నెర్చుకోరు" అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి "కూసింత అంతర్మధనం అవసరమోయ్" అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా... కొంచం అమృతం, మరింత హాలాహలం దయచేసాయి. వచ్చినదాన్ని భరించి గొంతులోకి నెట్టెయ్యడానికి శంకరుణ్ణో, కేవలం మంచిని మాత్రం తమమధ్యనే పంచేసుకునే సురశిఖామణినో కాకపోవడంచేత, తెగించి ఆ సారాన్నిఇక్కడ బరితెగించబూనితిని.
అసలు తెలుగు సినిమా కొత్తగా ఏంచెడిందని ఇంత కోలాహలం నెరుపుతున్నారు? అని, మహబాగా అడగడం జరిగింది. నిజమే, కొత్తగా అర్జంటుపడి చెడింది ఏమీ లేదు. ఇది చాపకింద నీరులా ఎప్పుడో చెడటం మొదలెట్టింది, మనకు గుర్తించడం చేతకాక,గుర్తెరిగిన వాళ్ళకు దమ్ముల్లేక, "రైఠో !ఎలా జరిగితే అలా జరుగుతుంది" అన్న ఉదాసీనత మొదలైన మొదటిరోజే, తెలుగు సినిమా చెడిపోవడం మొదలయ్యింది. ఈ పరిణామక్రమం యొక్క తారీఖులు లెక్కగట్టడం కన్నా, మనకు కావలసింది, ‘లెక్క మార్చడం’. ఈపని "ఇండస్ట్రీ" లోని పెద్దలో,వారి గద్దెలో చేసేది కావని నా నమ్మకం. ఎందుకంటే, ఆల్ర్రెడీ సముద్రం లో మునిగినోడు మంచినీరు ఎలా ఇవ్వలేడో, వీళ్ళ భాగోతమూ అలాగే ఉంది కాబట్టి. సినిమా పరిశ్రమతప్ప బాహ్యప్రపంచం-నిజ జీవితం దాదాపు తెలియని, వంశపారంపర్య నూతిలో కప్పలు హీరోలు గా ఒకవైపు రాజ్యమేలుతున్నారు. సినిమాకి "కేప్టన్" అని భావించే దర్శకులుగా కొత్తవాళ్ళు, ‘సహాయదర్శకత్వంపు ఊడిగం’ అధమం ఐదుసంవత్సరాలైనా చేస్తేగాని అవడం లేదు. అన్ని సంవత్సరాల దాస్యం అలవడిన వాడు, ఆర్డర్లు తీసుకోగలడేగాని "సినిమా షిప్పుని" నడపగలడా? ఇంతగా స్వజాతి సంపర్కానికి అలవాటు పడ్డ సినీపరిశ్రమ జాతికి జవసత్వాలు తమంతటతాముగా వస్తాయంటారా?
మరైతే మార్పు ఎక్కడినుండి వస్తుంది? అన్నది, పెద్ద భేతాళ ప్రశ్న కానేకాదు. కాస్తోకూస్తో మార్పు అప్పుడప్పుడు ఎక్కడినుండీ వచ్చేదో, ఇప్పుడు ఎక్కడ్నుండి వస్తోందో గమనిస్తే, సమాధానం దానంతట అదే వస్తుంది. పాతమురుగు నుండి కొత్తనీరు రానట్టే, చిత్రసీమలో డెబ్భయ్యవ దశకం మొదలు ఇప్పటి వరకూ వచ్చిన నూతన ఒరవళ్ళన్నీ పరిశ్రమేతరులు తెచ్చినవే (వారిలో కొందరు ఇప్పుడు పెద్దరికం వెలగబెడుతూ,తమ మూలాల్ని మరిచారు.అది వేరే విషయం). వంశీ,జంధ్యాల,టి.కృష్ణ మొదలు కొత్తగా కలకలం రేపిన "గమ్యం" ‘క్రిష్’ వరకూ, మనకెన్నో ఉదాహరణలు.అసలు తెలుగు సినిమా చరిత్ర "శకాల"నే మార్చిన "శివ" దర్శకుడు ఎక్కడివాడు? ఏ తెలుగు దర్శకుడి దగ్గర దర్శకత్వం నేర్చాడు?
ఇక హీరోలంటారా, వారినీ చూద్దాం. అప్పటికే చిరంజీవి, రాజేంద్రప్రసాద్,మోహన్ బాబు మినహా (వీళ్ళ వారసులూ తయారయ్యారు మన ప్రాణాలకి) మిగతా వాళ్ళందరూ దాదాపు వారసత్వం బాపతే. అంటే మొదలెట్టగానే "బాబు"లన్న మాట. అందరినీ ఒకగాట కట్టలేముగానీ, అసలు ఈ ఝాఢ్యం ఎక్కడి నుండి మొదలో మాత్రం కొంత అంతు చిక్కుతోంది.ఇక ఈ పుట్టుక ‘హీరో రాజుల’ మాట ‘దాస్య దర్శకులు’ వినక చస్తారా! వారు తియ్యమన్న సినిమా తియ్యక చస్తారా!!
హీరో లను మినహయిస్తే, చెప్పుకోదగ్గ సహాయ"నటులు" మాత్రం, ఎప్పుడూ సామాన్యజనం నుండేవచ్చి తమ విలక్షణతను చాటారు. రావుగోఫాలరావు మొదలు కోట శ్రీనివాసరావు వరకు, ప్రకాష్ రాజ్ మొదలు నిన్నమొన్నటి షఫి వరకూ అందరూ జన‘ప్రవాహం’ నుంచేగాని, నూతులూ,బాత్ టబ్బులనుండీ మాత్రంకాదు. ఇల్లా వచ్చిన కొత్తనీరు ఎప్పటికప్పుడు కొంత సినీసముద్రపునీటిలో కలుస్తున్నా, ఈ పరిశ్రమ పన్నీరవడానికి మాత్రం మూలాలని కాస్త (బహుశా సమూలంగా) మార్చడం అత్యవసరం.
ఇంతస్థాయిలో మార్పురావాలంటే, ఏ అల్లాఉద్దీన్ అద్భుతదీపమో లేక అధమం ‘జై పాతాళ భైరవి’ మంత్రమో రావాలి. ఇవన్నీ రావుగనక, ‘సునామీ’ ఎలాగూ సినీపరిశ్రమలో పుట్టించలేక, ఒక చిన్న కొత్త కెరటం (నవతరంగం) తో సరిపెడుతున్నాం. ‘ఇక్కడ సభ్యుల ఉద్దేశాలు ఘనమే ఐనా, ఆచరణ సాధ్యమా?’ అని ఒక పెద్ద డౌటు ప్రజలకి. నిజమే...!!! కాకపోతే ఒక్క మాట, దుర్మార్గాన్ని కత్తిపట్టి ఎదిరించకపోయినా "ఇది అమానుషం" అని కనీసం చాటుగాఅయినా అన్నవాడే మనిషి. అదేపని మేముచేస్తున్నాం. అదీ అంతర్జాలంలో,మరీ భాహాటంగా అంతే తేడా. ఇక ఆచరణ సాధ్యాసాధ్యాల మాట మరో సంవత్సరంలో తేలిపోతుందని నా నమ్మకం. ‘మాటలనుంచీ చేతలకి మారడానికి కొన్ని చేతులు అప్పుడే సిద్ధమయ్యాయి’ అని మనవి.
నవతరంగం ఉద్దేశం, బోరుగొట్టే లాగుడు పీకుడు ఆర్టు సినిమాని ప్రమోట్ చెయ్యడం అసలుకాదు. ఎదో ‘మంచి సినిమా’ అన్నది ఎక్కడైనా (ప్రపంచం లో ఏ మూలైనా) కనపడితే, "చూడండి" అని చెప్పడం. ఇక మన తెలుగు సినిమాకూడా బాగుపడాలని కోరడం...ఒక్కోసారి పోరడం. కనీసం చెడిందని ఒప్పుకుంటేనే, బాగుపడటానికి అవకాశం ఉంది గనక డాక్టర్లుగా మారిన కొందరు పరీక్షించి, రోగాన్ని వెతుకుతున్నారే గానీ, చెడిందని చెప్పేసుకుని పాడెగట్టెయ్యడానికి మాత్రం కాదు. తెలుగు సినిమా మా అందరిజీవితం. దీనికి కాపాడుకుందామని ఒక కోరిక అంతే! తెలుగు సినిమాలో ప్రపంచసినిమాకి సాటైన సినిమాలు రాకపోయినా ఫరవాలేదు, కనీసం తెలుగు సంస్కృతికి, భాష కూ... కనీసం మనుషులకు దగ్గరగాఉన్న ‘కథ కలిగిన’ సినిమా రావాలనే మా ఆశ, తప్పంటారా?
4 comments:
మొన్న శ్రీశ్రీగారి ఇంటర్వ్యూ చదువుతున్నా.. అందులో ఆయన "మనవాళ్ళు రచయితలకు ఇవ్వదగిన స్థానం ఇవ్వరు. అలాంటప్పుడు మంచి చిత్రాలు ఎలా వస్తాయి?" అని అడిగారు. ఎప్పటినుండో ఈ సమస్య ఉందని అప్పుడు అర్ధమైయ్యింది.
నాకిప్పుడిప్పుడే.. శేఖర్ కమ్ముల, గమ్యం డైరెక్టర్, బొమ్మరిల్లు డైరెక్టర్, అల్లు అర్జున్ (ఆర్య ఒప్పుకున్నందుకు.. ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమవుతున్నందుకూ..) వీరి లాంటి మీద చిన్నగా ఆశపుడుతుంది.. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారని. ఏం చేస్తారో??
ఇక మీ వ్యాసం ఎప్పుడూ లానే ఆలోచన రేకెత్తించేలా ఉంది. తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటూ!!
చాలా బావుంది మీ వ్యాసం.. నేను సినిమాలు పెద్దగా చూడను కాని చూసిన వాటిలో చాలా వరకు insensible గా అనిప్పించాయి.
చాలా చక్కగా చెప్పారు మహేష్. ఒకప్పుడు మంచి సినిమాకి తగినంత ప్రోత్సాహం లేదు అవి ఆర్టు సినిమాలు మాత్రమే అని వాదించే వారు. కాని ఈ తరం ప్రేక్షకులు మంచి సినిమా అంటే ఇదీ అని హిట్ చేసి చూపిస్తున్నారు అయినా వీరు మారరు. మీరు అన్నట్లు వారసత్వం, భజన పరులు, సినిమాని ఒక కళ గా కాక డబ్బుంది కదా అని సినిమా చుట్టి పారేసే నిర్మాతలూ, దర్శకులూ మారనంత వరకూ ఇంతే. ఆ కోరల భారిన పడని సినిమాలని బూతద్దం తో వెతుక్కొక తప్పదు.
chala bagundi. telugu cine prapancham jallida pattinattu. Na blog kasta chusi pettandihttp://muralidharnamala.wordpress.com/(Chiru Aasha ni vadilipettandi. adi oka prayasa)
Post a Comment