Wednesday, June 25, 2008

తల్లి మనసు

సాధారణంగా లాజిక్కులూ, రీజనింగులూ అంటూ రాగాలు తీసే ఈ బ్లాగరి హఠాత్తుగా మనసుల మీద పడ్డాడేమిటా? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ శీర్షికలో ‘మనసు’ ఉందిగానీ, అసలు విషయంలో మనం తీసేవి మాత్రం, నాకు అలవాటైన (మెట్ట) లాజిక్కులే కాబట్టి పాఠకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.


పిల్లలు యుక్త వయస్సుకి రాగానే, తల్లిదండ్రులు పిల్లలపట్ల చూపే ప్రేమల్లో, పిల్లలపట్ల వారి ఆలోచనల్లో మార్పులు రావడం చాలా సహజంగా జరిగే పరిణామం. తమ జీవితంలోని అనుభవాలనూ, చుట్టుపక్కలవారి వ్యవహారాలనుంచీ వీళ్ళు గ్రహించిన దాన్నిబట్టి, కొన్ని పాఠాలను అన్వయించుకుని, పిల్లల జీవితాల్ని సరైన దారిలో పెట్టాలని చాలా తపనపడిపోతుంటారు. ముఖ్యంగా ప్రేమ-పెళ్ళి విషయానికొచ్చేసరికీ మరీనూ. ఈ విషయంలో చాలా మంది తల్లుల ఆలోచనాధోరణి లోని ఒక చిన్న విచిత్రాన్ని ఇక్కడ చూద్దాం.


కూతురి పెళ్ళి ప్రసక్తి వచ్చే సరికీ తల్లి, తన భర్త కన్నా మంచివాడైన వ్యక్తి కూతురికి మొగుడుగా రావాలని కోరుకుంటుంది. అంటే మెజారిటీ ఆడవాళ్ళకి తన మొగుడు అంత మంచివాడు కాదు అని మనసులో ఎక్కడో ఖచ్చితంగా అసంతృప్తి ఉన్నట్లు లెక్క. తల్లికి ఇంకో కొలమానం ఏమిటంటే, తనను పెంచిన తండ్రి. "తన తండ్రి అంత మంచివాడు ఎక్కడా లేడు" అనేది చాలా మంది అమ్మాయిల విషయంలో, ప్రస్తుతం ‘అమ్మ’ల విషయంలో కూడా ఒక universal fact. ‘భర్త’ ఎప్పుడూ ఆ image కి సరితూగడు సరికదా, వారి తండ్రి ఇమేజ్ ని ఒక సాధారణ భర్తగా తన ప్రవర్తనతో, ఇంకా గట్టిపడేలా చేస్తాడు. ఇక్కడే తల్లి మనసుకూ, పెళ్ళికావలసిన ‘పిల్ల’ మనసుకూ ఉన్న కాంట్రాస్ట్ తెలుస్తుంది. అమ్మాయి తన తండ్రిలాంటి భర్త కావాలి అనుకుంటే, అమ్మాయి తల్లి మాత్రం, "తన మొగుడిలాంటి మగాడు తన కూతురికి అస్సలు వద్దు" అనుకుంటుంది. ఇక సమస్య రాకుండా ఉంటుందా?


ఇక కొడుకు విషయానికి వద్దాం. ప్రతి తల్లీ తనంత మంచి భార్య ఎక్కడా లేదు అనుకుంటుంది. తనంత బాగా ఇల్లూ,పిల్లలూ, భర్తనీ చూసే ఇల్లాలు ఈ భూప్రపంచంలో అస్సలు లేరు, ఇక ఉండబోరు అని ప్రతి తల్లికీ ఒక గోప్ప విశ్వాసం. అందుకనే తనలాంటి భార్య వస్తే, కొడుకు సుఖపడతాడు అనే నమ్మకాన్ని పెంచుకుంటుంది. కొడుకుకి కూడా తల్లిపట్ల ఉండే సహజమైన ప్రేమతో అలాగే ఆశిస్తాడు. అందుకే మగాళ్ళు తమ పెళ్ళాల వంటని, అమ్మల వంటతొ పోల్చి అస్తమానం ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక తల్లి విషయానికొస్తే, ఈ expectation పెళ్ళి వరకూ బాగానే ఉంటుందిగానీ, ఆ తరువాత కోడలు "తనలాంటిది కాదు, నిజానికి ఒకరకమైన విరోధి" అన్న నిజం మెల్లమెల్లగా తెలిసొచ్చి, అతాకోడళ్ళ ఆధిపత్యం పోరు మొదలౌతుంది. ఇందులో మొదటి బలిపశువు ఆ కొడుకు/భర్తే !


ఇలా ‘తల్లిమనసు’ మన జీవితాల్లోని కొన్ని సంఘటనలకూ, మన సంసారాల్లో కొన్ని ఘటనలకూ కారణమవుతూ ఉంటుందన్న మాట! చిత్రంగా ఉన్నా, చాలామంది పిల్లల జీవితాల్లో ఇదొక నిజం అంతే.

11 comments:

ప్రదీపు said...

ఇది మీ అభిప్రాయమా, లేక అందరూ ఇలాగే ఉంటారు అని మీరు రుజువు చేయటానికి ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ రుజువు చేయాలని అనుకుంటే గనక ఏమయినా ఉదాహరణలు ఇవ్వగలరా...

సుజాత వేల్పూరి said...

ఇందులో చెప్పినవన్నీ మీ పర్సనల్ అభిప్రాయాలు, అనుభవాలు ఐతే ఓకే!
కాకపోయినట్లయితే..
1.తల్లి తన కూతురికి మంచి మొగుడు రావాలని కోరుకునేది తన మొగుడు మంచి వాడు కాదనే అసంతృప్తితో అని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇలాంటి ప్రేరణకి చుట్టూ ఉన్న సమాజంలో ఉండే అనేకమంది మొగుళ్ళు! పెళ్ళీడు కూతురున్న తల్లి ఎంతో జీవితాన్ని, సమాజాన్ని, చూసి ఉంటుంది కదా! చుట్టుపక్కల వాళ్లదాకా ఎందుకు, చుట్టాల్లోనే దొరుకుతారు ఆడపిల్లల తల్లులకు టెర్రర్ పుట్టించే భర్తలు!

2.తనను పెంచిన తండ్రి, లేదా తన తల్లి లాంటి భార్య ఇలాంటివి కూడా అందరి విషయాల్లో మీరు చెప్పినట్టు జరగవు. పొద్దుగూకులూ పోట్లాడుకు చచ్చే తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబాల్లో కోకొల్లలు. ఇలాంటి కుటుంబాల్లోని మగ పిల్లలు తన భార్య తల్లి లాగా ఉండాలని ఎలా అనుకుంటారు? ఉదాహరణలు ఒక సారి చుట్టుపక్కల ఇళ్లల్లోకి తొంగి చూస్తే బోలెడు దొరుకుతాయి.ఇక చిన్నప్పటి నుంచి అమ్మ వంటకి అలవాటైన ప్రాణం కాబట్టి వంటని పోల్చడమనేది సర్వసాధారణంగా అందరి ఇళ్లలోనూ జరిగే సంగతే! దానికీ వైవాహిక జీవితానికీ ఏ సంబంధం లేదు.

3. ఇక అత్తాకోడళ్ళ విరోధాన్ని చర్చించాలంటే మనకు బ్లాగులేం సరిపోతాయి? శిల్ప కళా వేదిక బుక్ చేసుకోవాలి ఒక వారానికి.possesive ness అనేది ఇరువైపుల వారూ ఫీల్ కావడంతో మొదలవుతుందని మాత్రం చెప్పగలను.

అన్నట్టు ఇవాళ అత్తా కోడళ్ళ సమస్య పట్టుకున్నారు ఏమిటి విశేషం?

krishna said...

తల్లులు అలానే అనుకుంటారు అందులోనూ తప్పులేదు ఎందుకంటె మగాడు/మొగుడు తల్లిని(పెళ్ళాన్ని )చూసినట్టు కూతురిని చూడడు కాబట్టి .ఉదాహరణగా కూతురిని ఎమ్మా అని ప్రేమగా ,పెళ్ళాన్ని ఎమె అని పలరించేవారు ఎంతమంది లేరు.

Anil Dasari said...

'"తన తండ్రి అంత మంచివాడు ఎక్కడా లేడు" అనేది చాలా మంది అమ్మాయిల విషయంలో, ప్రస్తుతం ‘అమ్మ’ల విషయంలో కూడా ఒక universal fact.'

Universal Fact అంటూ మళ్లీ 'చాలామంది విషయంలో' అంటారేమిటి? ఇది అందరికీ వర్తిస్తుందనా, కొదరికి వర్తించదనా?

తండ్రి-భర్త లో తండ్రివైపే మొగ్గుచూపే అమ్మాయిలు ఎక్కువమంది ఉంటారని రుజువేమిటి? తండ్రులంటే కోపగించుకునే అమ్మాయిలే ఎక్కువమంది ఉండొచ్చు కదా (ఆంక్షల్లో పెట్టి పెంచటం, తమ్ముడికీ, అన్నకూ ఇచ్చే స్వేచ్చ తనకు ఇవ్వకపోవటం, వగైరాల వల్ల) ఇలాంటి వాళ్లు తన తండ్రి లాంటి భర్త తన కూతురికీ రావాలని ఎలా కోరుకుంటారు?

మీరు చెప్పేదాని ప్రకారం ఒక మగాడు భార్యకి చెడ్డవాడుగానూ, కూతురికి చాలా మంచివాడుగానూ కనిపిస్తాడన్నమాట!

అత్తాకోడళ్ల జన్మ జన్మల విరోధానికి నాకు తెలిసిన కారణం ఆడవారిలో ఉండే అభద్రతా భావం. ఎప్పుడూ ఎవరో ఒక మగవాడిపై ఆధారపడి ఉండేలా ఆడవారిని తయారు చేసింది మన సమాజం (ఈ పరిస్థితిలో ఇప్పుడు మార్పొస్తుందనుకోండి). నిన్నటిదాకా తన చుట్టూ తిరిగిన కొడుకు ఇప్పుడు మరో అమ్మాయి కొంగు పట్టుకు తిరగటం చూసేసరికి ఆ తల్లి మనసులో కొడుకు తనని పట్టించుకోడేమోననే భయం మొదలవటంవల్ల ఆమెకి కోడలు విరోధిగా కనిపించొచ్చు. ఒక్కడే కొడుకు ఉన్న తల్లుల్లో ఈ గుణం మరింత ఎక్కువ కనిపిస్తుంది. అంతేకానీ, తనతో పోలిక తెచ్చుకుని కోడల్ని విరోధిగా చూడటమనేది ప్రధాన కారణం కాకపోవచ్చు. అవన్నీ side effects మాత్రమే అయుండొచ్చు.

రాధిక said...

నాకు ఒక్కోసారి అనిపిస్తూ వుంటుంది ఇవన్నీ నిజం గా మీ అభిప్రాయాలా లేక ఏదో ఒక చర్చ లేవనెత్తుదామని ఇలాంటి టపాలు రాస్తారా అని :)
మీరన్నట్టు తండ్రే లోకంలో గొప్ప అనుకునే అమ్మాయిలు పూర్వకాలంలో ఉండివుండొచ్చు.ఆకాలంలో ఆడపిల్లలకి మరొక మగాడు గురించి తెలిసే అవకాశాలు చాలా తక్కువగా వుండేవి.అందుకు అలా అనుకునేవారేమో?[ఒకవేళ నిజంగా తండ్రే గొప్ప అనుకుంటే] . కానీ ఈ కాలంలో అలా కాదుగా.

Bolloju Baba said...

ఎక్కడో ఏదో మసాలా తగ్గినట్లనిపిస్తుంది. ఎక్కడ తగ్గిందో తెలియటం లేదు. చాలా వెజిటబుల్ డిష్కషను లాగ తోస్తుంది.

అయినప్పటికీ నిరాశ చెందటం లేదు.

Kathi Mahesh Kumar said...

హమ్మో ఇక్కడ చాలా దుమారమే లేచినట్టుందే!

@ప్రదీప్, "అందరూ ఇలాగే" అని ఏవిషయంలో ఎవరూ సిద్దాంతీకరించలేరు. ఇక ఎవరైనా ప్రయత్న్సిస్తే మాత్రం అది వాడి ఖర్మ అనుకోవాలి. ఇక్కడ నేను చెప్పేవి కొన్ని అభిప్రాయాలూ,కొన్ని ఆలోచనలూ,కొన్ని కబుర్లు. వాటిని సోదాహరణగా ఋజువు చేస్తూపోవడం అంతగా అవసరం లేదు.

@సుజాత, when you reduce things to basics, everything looks simple అన్న సూత్రానికి నేను ప్రయత్నించిన case study ఈ వ్యాసం.
కాకపోతే ఒక్కటి మాత్రం నిజం నేను ఈ వ్యాసంలో చెప్పినవాటిని ఖచ్చితంగా అంగీకరించేవాళ్ళు (చాలా మంది) నాకు తెలుసు. కాబట్టి ఇవి కాస్త over simplified statementలు అయినా కొంతవరకూ నిజాలే అని నా నమ్మకం.

@కృష్ణుడు గారూ, నాకు తెలిసిన చాలా మందిలో మీరూ ఉన్నారు. అంటే ఒక పల్లె లోనో,లేక చిన్న పట్నం లోనో మీ వేర్లు ఇంకా పాతుకొని ఉన్నాయని అర్థం.

@అబ్రకదబ్ర గారూ, నేను మొత్తం వ్యాసం లో చెప్పదలిచింది ఒక్క ఆంగ్ల వాక్యంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలా చెయ్యడం వల్ల పదాలలో దొర్లిన నా తప్పులు మీరు పట్టేయ్యకుండా తప్పించుకోవచ్చనుకుంటా!
"Every lady hopes that her daughter will marry a better man than she did and is convinced that her son will never find a wife as
good as his father did"

@రాధిక, పూర్వకాలంలో కాదు మీరు ‘ఇండియా’లో ఉంటే...‘భారతదేశం’ లో ఇంకా ఈ టైపు ఆలోచనలున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయ్. ఇక ఇది నా స్వంత అభిప్రాయమా కాదా అన్నది...suspense లెండి!

@బాబాగారూ, మసాలా చర్చల్లో ఉంది, టపాలోకాదు. ఇప్పుడొచ్చి చూడండి.

MURALI said...

ఇవి ఖచ్చితంగా కాదనలేని అభిప్రాయాలు. ఇప్పుడంటే చదువుల సంగ్రామంలో పడి తల్లిదండ్రులకు దూరమవటం వల్ల తన స్నేహితుదు లేదా స్నేహితురాలి వంటి భాగస్వామి కావలనుకుంటున్నారు. అయినా ఇప్పటికీ మా నాన్నే నా హీరో అనే ఆడపిల్లలు కోకొల్లలు. మా అమ్మలాగే ఆలోచిస్తావు అందుకే నువ్వంటేనాకిస్టం అనే ప్రేమికులు కోటానుకోట్లు.

చేతన_Chetana said...

ఏంటండీ బాబూ, "ప్రతీ తల్లీ", "universal fact" అని వ్యాసంలోనేమో విపరీతంగా generalize చేసేసి కామెంట్లలోనేమొ "చాలామంది" "కొంతవరకు నిజం", అని తప్పించుకుంటారు. మీరు వ్రాసింది కొంతవరకే నిజమని మీకు అనిపిస్తే ముందే ఆ విషయం disclaimer పెట్టొచ్చు కదా, generaralise చేస్తూ వాడిన పదప్రయోగాలు తీసేయవచ్చు కదా. ఇంతకీ మీ ఉద్దేశ్యంలో చాలా అంటే ఎంత, కొంత అంటే ఎంత? :-)

Kathi Mahesh Kumar said...

@మురళి, నిజమే ! అందుకే ఈ వ్యాసంలో కొన్ని అభిప్రాయాలను రాయడానికి ప్రయత్నించాను.

@చేతన, చాలా మంచి ప్రశ్న అడిగారు. అన్ని arguments లాజికల్ గా ఉండాలనుకోచడంలో తప్పులేదు. కానీ అప్పుడప్పుడూ mutually contradicting వాక్యాలు(అనుభవాలు) ఉండవంటారా?

Freudian psychoanalysis లో ఆడపిల్లల father fixation ని Electra complex అంటారు. అది విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన నిజం అందుకని universal fact అన్నాను. కానీ మారుతున్న కాలంతోబాటూ కొంత మార్పులు వచ్చాయికాబట్టి వీలైనంత generalization నుంచీ తప్పుకునే ప్రయత్నంలో "చాలా మంది" ,"కోంత వరకు" లాంటి పదాలు వాడాల్సొచ్చింది.

ఇక disclaimer సంగతంటారా! నా వ్యాసం మొదట్లోనే "(మెట్ట)లాజిక్" అనేశాగా? ఇంకా సందేహమెందుకూ!

గీతాచార్య said...

>>> Every lady hopes that her daughter will marry a better man than she did and is convinced that her son will never find a wife as
good as his father did
*** *** ***

అంటే తండ్రి జడ్జ్మెంట్ బాగుందనేగా. జడ్జ్మెంట్ బాగున్న వ్యక్తి ఎప్పుదూ గొప్ప అనేగా. అంటే తన గొప్ప వాడైన భర్తకన్నా మెరుగైన వ్యక్తి తన కూతురికి భర్తగా రావాలని ఆమె కోరుకోవటం లో అసహజత్వం ఎముంది? కానొక్కటే అర్థం కానిది. తన కొడుకు తండ్రి కన్నా తక్కువనా?

పో. స్క్రి.: నేను టపాకి వ్రాసిన వ్యాఖ్య కాదు. ఆ స్టేట్మెంట్ కి వ్రాసినది.