Friday, June 13, 2008

వ్యక్తి స్వేచ్చా - సమాజ శ్రేయస్సూ - Part 2


(గమనిక: ఇక్కడ రాస్తున్నది మతగ్రంధమూ కాదు, వ్యాసకర్త మతప్రవక్త అంతకన్నా కాదు. కనక, ఇక్కడ రాస్తున్నవి ఖచ్చితంగా నమ్మాల్సిన లేక పాటించాల్సిన అవసరం అసలెవ్వరికీ లేదు. ఇవి post-modern ప్రపంచంలో మానవ సంబంధాలలో జరుగుతున్న మార్పుల గురించి కొన్ని ఆలోచనలూ,అభిప్రాయాలూ, స్వీయానుభవాలూ మాత్రమే అని గమనించగలరు)

"ప్రేమలూ -రకాలూ"


పై శీర్షిక పేరు చెప్పగానే మిత్రుడొకరు "ప్రేమలేమైనా వంకాయలా ! చచ్చువీ పుచ్చువీ ఉండటానికి?" అన్నారు. నిజమే! ‘ప్రేమలూ-రకాలూ’ ఏమిటి సిల్లీగా... కానీ ఎంచేద్దాం ఈ భాగానికి ఇదే సరైన శీర్షిక అనిపించి వదిలేశా. ఈ కాలంలో ప్రేమలు వంకాయలంత చీప్ కాదుగానీ అవి కూడా మార్కెట్ కి అనుగుణం తమ స్వభావాన్ని మార్చుకునే సంబంధాల వరుసలో చేరటం వల్ల వాటిల్లో ఉన్న వివిధరకాల గురించి చర్చ తప్పదు.






అసలు ప్రేమంటే? నిజానికి ఈ ప్రశ్నే ఒక పెద్ద సమస్య. ఎందుకంటే, దీనికి సమాధానం మనిషికొక రకంగా ఉంటుంది. అంతగా సందేహంగా ఉంటే మీరూ ప్రయత్నించండి. మీ పక్కనున్న పది మందిని అడిగి చూడండి. వాళ్ళల్లో ఏ ఇద్దరు ఒకే సమాధానం చెప్పినా...ఈ వ్యాసం ఇక్కడే చదవటం ఆపెయ్యొచ్చు. ఇంత వివిధమైన వ్యక్తిగత అర్థాలు కలిగిన ఈ భ్రహ్మపదార్థాన్ని కూడా చాలా మంది సమాజాన్ని గుత్తకు తీసుకున్న మనుషులు స్థిరీకరించి, ‘డిఫైన్’ చేసి పారేశారు. చేసిన యవ్వారం చాలక, కేవలం కలిసుంటే ప్రేమౌతుందా? కామాన్ని ప్రేమంటారా? పెళ్ళి పరమార్థం కాకుంటే పాపమే కానీ ప్రేమ కాదు కదా? హద్దులు దాటితే ప్రేమ పవిత్రత మిగులుతుందా? అంటూ తమ అక్కసు కాస్త అధికారికంగా వెళ్ళబోస్తూ ఉంటారు. వీళ్ళు సమాజాన్ని గుత్తకైతే తీసుకున్నారుగానీ, మనుషుల్ని వారి భావాల్నీ మాత్రం తమ పరిగణలోకి తీసుకుని ఎరుగరు.






అందుకే ఈ గుత్తందార్లకు తెలియని విషయం ఏమిటంటే, చాలా మంది యువత కాలేజిల్లోనూ, యూనివర్సిటీలలోనూ, పనిచేసే చోటా ప్రేమకున్న అర్థాల్నీ, దాన్ని పాటించే విధానాలనీ కొంత బాహాటంగా, మరికొంత రహస్యంగా చాలా మార్చేసారు. ఈ రహస్య మార్పులు అప్పుడప్పుడూ ఒక విప్లవాన్ని తలపిస్తాయి. ఎందుకంటే, some times it appears as if, they have changed the notion of conventional love `fundamentally'. "ప్రేమ యొక్క సాధారణ ప్రాతిపదికని వీరు సమూలంగా మార్చేసారా !" అనిపిస్తుంది. కాకపోతే ఈ సమాజమే పాపం కళ్ళు తెరుచుకునే నిద్రపోతోంది లేదా నిద్రనటిస్తోంది. ఒక వేళ మేలుకుంటే ఈ నిజాన్ని ఎదుర్కుని భరింఛే శక్తి బహుశా లేదనుకుంటా. ఇక సమాజాన్ని పరిరక్షిస్తున్నామన్న ఆపోహలో ఉన్న ఈ గుత్తందార్ల సంగతి దేవుడికే ఎరుక.




ఇప్పుడు ‘సాధారణ ప్రేమ’మొక్క ప్రాతిపదికని చూద్దాం. మన పరిధిలో అందుబాటులో ఉన్న అమ్మాయినో, అబ్బాయినో చూసి, ‘అసంకల్పితంగా’ ఇష్టపడి, ఆ ఇష్టాన్ని బ్రతిమాలో బామాలో ఆ వ్యక్తికి తెలియజెప్పి, పరస్పర అంగీకారానికి వచ్చి, కొన్నాళ్ళు పైపై తిరుగుళ్ళు (చాలా వరకూ రహస్యంగా) తిరిగి, వీలైతే ‘కొన్ని మర్యాదకరమైన హద్దులు’ దాటి ఆనందపడి ఆ తరువాత పెద్దల అంగీకారంతోనో లేక ధైర్యం చేసి లేచిపోయో పెళ్ళిచేసుకోవడం. వెంఠనే ఆ ప్రేమకో శుభం కార్డు. Then they lived happily ever after...ఇంతేనా?






ఇప్పుడు పైవాఖ్యాల్ని కాస్త నిదానంగా చదువుకోండి. చాలా ఆదర్శంగా అనిపిస్తున్నాయా? ప్రజలనుకునే "పవిత్ర ప్రేమంటే ఇదేరా!" అనిపిస్తోందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే నా శుభాకాంక్షలు. ఒకవేళ అలా అనిపించకపోతే ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్దాం.






ప్రేమకు నేను చెప్పిన మొదటి ప్రాతిపదిక కాకపోతే ఇంకోదాన్ని చూద్దాం. చిన్నప్పటి స్నేహం వయసుతొపాటూ ఎదిగి ప్రేమగా మారింది. ఘాఢంగా ప్రేమించుకునారు. పెద్దలొప్పుకోలేదు. లేచిపోయే ధైర్యం లేకపోయింది. పరిస్థితులు వికటింఛాయి. అబ్బాయి తాగుడికీ, అమ్మాయి ఇష్టంలేని పెళ్ళికీ అలవాటుపడ్డారు. కానీ మనసుల్లో ప్రేమ మాత్రం అలాగే ఉంచుకుని...ఆఖర్న మరణశయ్య మీద ఒక్కటయ్యారు. మీరు చూసి మనస్ఫూర్తిగా బాధపడిన సినిమాలా ఉందా? ఇది సినిమా కథే ‘దేవదాసు’. భారతదేశంలో ఇప్పటి వరకూ ఇంత గొప్ప ప్రేమ-త్యాగం కథ మరోటి రాలేదు. కాబట్టి దీన్ని అసలు సిసలు ప్రేమగా అంగీకరించేద్దామా?






పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకదాన్ని మీరు పవిత్ర ప్రేమగా అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఈ ప్రేమల్లోని విలువల్నే భూటద్దం పెట్టి చూపించి, మిగతావి ప్రేమలు కావని చాలామంది అధికారపూర్వకంగా ఢంకా బజాయించి మరీ చెబుతూఉంటారు.





ఈ బాజాల బుజ్జిగాళ్ళని పక్కనబెట్టి, మనం ప్రస్తుత కాలంలో ‘వ్యవహారంలో’ ఉన్న, యువత తమ పరిస్థితులకు అనుగుణంగా ‘ఆల్టర్’ చేసుసుకున్న‘రెడీమేడ్’ ప్రేమలు కొన్నింటిని తెలుసుకుందాం. ఇవి కొన్ని కొలమానాల ప్రకారం ‘తప్పు’, ‘పాపం’ కావచ్చు. కాకపోతే ఇవి ‘నిజం’ అని మీరు కాస్త మీ ఛుట్టుపక్కల తరచి చూస్తే తెలిసిపొతుంది.



1. ఆకర్షణల ప్రేమలు

2. అవసరాల ప్రేమలు

3.అందలమెక్కడానికి ప్రేమలు

4. ప్రేమ కోసం ప్రేమలు

5.పెళ్ళి కోసం ప్రేమలు




పైన చెప్పిన లిస్టులోని ప్రేమల గురించిన వివరణ మరియూ సాధారణంగా తల్లిదంద్రులకు ప్రేమంటే ఎందుకు దడా ఒణుకూ పుట్టుకొస్తాయో Part 3 లో చూద్దాం.

26 comments:

అలేఖ్య said...

మంచి టాపిక్ పట్టారు. కానివ్వండి. మీ వ్యాసాలు ఆలోచింపజేసేవిగా వుంటున్నాయ్.

నిషిగంధ said...

బాగా రాస్తున్నారు, అభినవ చలంలా! ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. మీకెప్పుడన్నా అనిపించిందా ప్రేమకి (అతి)పవిత్రత, (అతి)విలువలు ఆపాదించేది జీవితంలో ఒక్కసారన్నా ప్రేమలో పడని (జీవిత భాగస్వామితో కాదు) వాళ్ళేనని! మీ లిస్ట్ కి "ఊసుపోక ప్రేమలు " కూడా జత చేర్చవచ్చు :-)

Anonymous said...

ప్రేమ అంటే
ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరిచి పోవడం. ఇది ఇప్పటి పద్దతి.

Bolloju Baba said...

go ahead boss. i enjoy every sentence of your post. i am disappointed when i come here, because no attack has begun sofar.
bolloju baba

Purnima said...

premaloo..rakaloo.. interesting!!

mana avasaraaniki anugunamgaane inni premalu puttukochaai.. this is a good read!!

సుజాత వేల్పూరి said...

మీరు మీ అభిప్రాయాలను ఎంత పకడ్బందీగా రాస్తున్నారంటే, వాటిని ఖండించాలంటే 'అమ్మో, మనమూ మహేష్ చెప్పిన గుత్తందార్లలో చేరిపోతామేమో, వద్దులెద్దూ ' అనిపించి ఆగిపోవాలన్నంతగా! స్త్రీ పురుష సంబంధాలు ఒక నీతిలేకుండా ఇవాళ ఒకరు నచ్చి, రేపు మరొకడు నచ్చి, ఎల్లుండి ఇంకోడు(లేదా ఇంకొకతి) నచ్చి..ఇలా అందరితో సంబంధాలు(అదే లెండి ప్రేమిస్తూ)పెట్టుకుంటూ....ఏమిటిది? అసహ్యంగా లేదూ? దీని వల్ల ఏర్పడే వైపరీత్యం కేవలం అక్రమ సంతానమేనా? ఇంకేమీ కావా? మానసిక సంబంధాలకు ఇందులో ఏ మాత్రం విలువ లేదా?

'ఈ మనిషి నా వాడు ' లేదా 'ఈమె నాది ' అనుకోగలిగేంత ప్రేమ ఈ నలుగురిలో(లేదా పది మంది)ఎవరితో ఉంటుందో 'అన్ని ' ప్రయోగాలూ పూర్తయ్యాక తెలుసుకోవాలా? వీటిలో కలిగేది తాత్కాలిక ఇంకా మాట్లాడితే విశ్రంఖలమైన ఆనందం మాత్రమే కాదా! ఆనందమే జీవిత పరమార్థమైనపుడు, దానికున్న pre-condition మీరే చెప్పారు. ఈ ఆనందాలు భవిష్యత్తుకు సమస్యగా మారకూడదని! ఇలాంటివి సమస్యగా మారకుండా ఉండాలంటే ఈ ప్రేమలని 'రహస్యం'గా కొనసాగించాల్సి ఉంటుంది. రహస్యంగా కొనసాగించే ఇటువంటి శారీరక ప్రేమల్ని ఏమంటారో భాషా మాంత్రికుడు మీకు మేము చెప్పక్కర్లేదు. అది నేర్చిన వాళ్ళు ఇంకేదో నేర్చరా అని సమెత కూడా ఉంది.

టీనేజ్లో కలిగే ఆకర్షణలకు కూడా ప్రేమలని పేరు పెట్టి వాటిని గౌరవించాలని, అర్థం చేసుకోవాలని కూర్చుని మాట్లాడాలని అంటున్నారు! మంచిదే! కాని, కూర్చుని తీరిగ్గా ఈ విషయాలన్నీ అమ్మతోనో, నాన్నతోనో చర్చిద్దాం అనుకుంటా రా ఇవాళ టీనేజ్ పిల్లలు. అది వారికో అడ్వెంచర్! అంతే! దాని పర్యవసానం చేదుగా ఉంటుందని నెమ్మదిగా తెల్సుకుంటారు రమణి గారి బ్లాగులో లాగా!

ఇటువంటి అనారోగ్యకరమైన ధోరణులని నిరసించే వాళ్ళని మీరు 'సమాజ బాధ్యతల్ని మోస్తున్నారనో, అక్కసు వెళ్లగక్కుతున్నారనో(మీ పాత పోస్టు పై వచ్చిన కొన్ని అభిప్రాయాల ఆధారంగా కాబోలు) అనడం బాగా లేదు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలా వద్దా? సమాజం అంటే మనమేగా! పైనుంచేమీ ఊడిపళ్ళేదుగా!

సమాజ బాధ్యతలని ఎవరో ఒకరు , ఆ మాటకొస్తే అందరమూ కలిసి మోయాల్సిందే! (వీరేశ లింగమూ, రామ్మోహనరాయ్ ఇలాగే అనుకునుంటే మన సమాజం ఇంకా ముండమోపుల్తోనూ, ముసలి పెళ్ళి కొడుకుల్తోనూ అలరారుతుండేదేమో! )

మీరు చెప్పిన లిస్టులో ఒక్కదాన్ని కూడా నేను ప్రేమని ఒప్పుకోలేను! ప్రేమలూ-రకాలూ అని కాకుండా అసలు 'ప్రేమ ' అంటే మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ముందు! జీవితంలో స్థిరంగా నిలిచే ప్రేమ ఏదైనా ఉండాలా వద్దా? ఉండాలైతే దాని పేరు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, చర్చ మళ్ళీ కొనసాగిద్దాం!

Kathi Mahesh Kumar said...

@అలేఖ్య నెనర్లు. ఆలోచింపజెయ్యాలనే ఈ ప్రయత్నం.

@ నిషిగంధ గారూ, హమ్మో చలమే!మరీ మీరు మునగచెట్టెక్కించేసారు. నెనర్లు. ఉబుసుపోక(టైమ్ పాస్) ప్రేమల గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తాను.

@శివ & పూర్ణిమ నెనర్లు

@బాబా గారూ మళ్ళీ మీరు రెండోసారి ఈ టపాచూసే సరికీ మీ కోరిక తీరుతుంది.దాడి ఇప్పుడే మొదలైంది.

@సుజాత గారూ,మీరు చెబుతున్న విలువలు మన జనరేషన్ వి.అంటే ప్రస్తుతం 30 లలో ఉన్నవారివి. నేను వాటితో ఏకీభవిస్తాను.కానీ అదే ‘సత్యం’ అని ఒప్పుకోను అంతే తేడా.

మీరన్న ‘మానసిక విలువలు’ఈ కాలం జనరేషన్ కి వర్తించవు. ఎందుకంటే వారు తమ సంబంధాలని చాలా ఆర్గనైజ్డ్ గా ‘కంపార్టమెంటలైజ్’చేసుకుంటున్నారు. దీనిగురించి నా తరువాతి టపాలో విశిదీకరిస్తాను.

ఇక ‘గిల్ట్’అనేది, మనం చేసేది తప్పు అనిపిస్తే కలుగుతుంది. ఇక్కడ తప్పొప్పుల ప్రసక్తేలేదు.ఎందుకంటే ఇది వారికి ఒక ‘సాధారణ’ విషయం.

టీనేజి పిల్లలతో చర్చ జరిపే మానసిక ధైర్యం తల్లిదండ్రులకి లేకపోవడం (వారు మాట వినరన్న సాకుతో) ఎంతవరకూ సమర్ధనీయం. తప్పదు అన్నప్పుడు కనీసం preventive measure గురించి చెప్పగలిగే కనీస భాధ్యత తీసుకుంటే రమణిగారు చెప్పిన కథ జరిగేది కాదు. ‘అది పాపం’అన్న భావన మనలో ఉన్నంతకాలం రమణి గారి కథ పునరావృతం అవుతూనే ఉంటుంది. దీన్ని పెంచిపోషిస్తున్న కుహానా విలువలు అవసరమా? అన్నదే ప్రశ్న.

సమాజం అంటే మనమే...అందుకే మార్పుని నిరసించి మన పాత విలువల అద్దాన్ని చూపక కొత్త విలువల్ని అంగీకరించ మంటున్నాను. వీరేశలింగంగారూ,రామ్ మోహన్ రాయ్ గారు సంస్కరణ మొదలెట్టినపుడు వాళ్ళనీ "చెడిపేస్తున్నారు" అనే అన్నారు. మీకు తెలియంది కాదు.

ఇక జీవితంలో ఏదీ స్థిరమైన విలువ లేనట్టే, స్థిరమైన ప్రేమకూడా లేదు. ప్రేమ ఒక నది లాంటి ప్రయాణం, చిన్నగా పుట్టి, ఉధృతంగా మారి,కొంత సేపు స్థిరమై ప్రవహించి, వేగంగా సముద్రంలో కలిసిపోతుంది. అంటే ప్రేమకు స్థాయిలున్నాయిగానీ స్థిరాలు లేవు. మీ చిన్నప్పటి అమ్మ ప్రేమకూ ఇప్పటి ప్రేమలో మార్పులేదా? రొమాంటిక్ ప్రేమలో ‘మార్పు’ మరికాస్త ఎక్కువగా ఉంటుంది. కారణం, అవి పుట్టుకతో కాక మనం వ్యక్తిగతంగా ఏర్పరుచుకున్నవి కాబట్టి.

చర్చను కొనసాగిద్దాం.

చక్రపాణి said...

మహేష్ గారు మీ వ్యాసాల తో పాటు ఇక్కడి కామెంట్స్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉంటున్నాయి. సుజాత గారితొ నేను ఏకీభవించకపొయినా, ఆస్ట్రేలియా పిచ్ ల్లొ ఆ దేశపు ఫాస్టు బౌలర్లదే పై చేయన్నట్టు, ఈ బ్లాగులొని కామెంట్లకు తన నెక్స్ట్ బ్లాగులొ బౌన్సర్లేయడం లేక ఇంకా పకడ్బందీ గా ఫ్లో కంటిన్యూ చేస్తున్నరనడమైతే కరెక్టే.
ఇక్కడ ఈమధ్యనే చదివిన ఈజ్-ఆట్ ప్రాబ్లం గుర్తుకొస్తొంది.

http ://en.wikipedia.org/wiki/Is-ought_problem

సుజాత గారూ మీరన్న వీరేశ లింగమూ, రామ్మోహనరాయ్ లు కూడా అప్పటి సమాజపు రుగ్మతలనే ఎత్తిచూపారు. అన్న ది కూదా అలాంటి ఉద్దెశమేనేమో.

-చక్రి

కొత్త పాళీ said...

బొమ్మ అదిరింది!
అసలు గొరిల్లాలు ముద్దు పెట్టుకునే బొమ్మ ఒకటుండాలి .. అది పెడితే ఇంకా బాగుండేది :-)
మొత్తానికి దుమ్ము లేపుతున్నారు!
@సుజాత .. మీరు చెప్తున్న "మానసిక సంబంధాల విలువ" .. సెక్యూరిటీ కి కాస్త చక్కగా మరికాస్త ఉదాత్తంగా పెట్టుకున్న పేరు. మనం ప్రేమించుకున్నాం కాబట్టి నువ్వు జీవితాంతం నాతోనే ఉండు. ఎందుకంటే ఈ వెధవ ప్రేమ గోల మళ్ళి మొదలెట్టి ఈ తంతు అంతా జరిపించే ఓపిక నాకు లేదు అనుకోవడం.
ఒకటి మాత్రం నిస్సందేహంగా ఒప్పేసుకుంటా .. సమాజం బాధ్యత అందరమూ మొయ్యాలి. ఐతే దానర్ధం మన నీతుల్ని ఇతరుల నెత్తిన రుద్దటం కాదు. ఇంతట్లో మీరు భుజాలు తడుమోకోనక్కర్లేదని నా అభిప్రాయం.

Anil Dasari said...

మహేష్,

ఈ వ్యాసం రాయటానికి కారణం నేనన్నారు కాబట్టి చెబుతున్నాను. చాలా abstract గా మాట్లాడుతూ విషయాన్ని అనవసరంగా గందరగోళపరుస్తున్నారు మీరు.

నేనడిగింది రెండు చిన్న ప్రశ్నలు. 'రోజుకొకరితో తిరగడం ఏ రకమైన ప్రేమ?', 'టీనేజిలో కలిగే ఆకర్షణని ప్రేమ అని ఎలా అంటాం?'

ఇవే నా ప్రశ్నలు. దీంకి ఇన్ని రకాల డొంక తిరుగుడు వివరణలు, ప్రేమ వర్గీకరణలు అవసరమా?
జనాలకి తెలియకుండా తర తరాలుగా ఏదో secret society ప్రేమని తొక్కిపట్టే పనిలో తలమునకలై ఉంది అన్న స్థాయిలో ఉన్నాయి మీ మాటలు. మీ వాదనలోని లోపాలని ఎవరైనా ఎత్తి చూపినప్పుడు వాటిని సవరించుకోవాలే కానీ ఇలా పదాడంబరంతో పాఠకుల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయకూడదు.

సినిమాల్లోనూ, కధల్లోనూ చూపేవే అమర ప్రేమలని లోకంలో జనాలందరూ పిచ్చిగా నమ్మేస్తున్నారనేది మీ నమ్మకం లాగుంది. మీపాటి తెలివితేటలు లేవా మిగతావాళ్లకి?

'నాతో ఏకీభవించాల్సిన అవసరం ఎవరికీ లేదు' అని ముందుమాటలో చెప్పి లోపలమాత్రం నాలా ఆలోచించనివాళ్లు ప్రగతి నిరోధకులు అని అంత గట్టిగా చెప్పేస్తుంటే అర్ధవంతమైన చర్చకి తావెక్కడ? మీరు చెప్పేదేదో చెప్పండి కానీ మిగతావాళ్లని గుత్తందార్లు, బాజాల బుజ్జిగాళ్లు లాంటి మాటలతో కించపర్చాల్సిన అవసరంలేదు.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర గారూ,ప్రేమ యొక్క నిర్వచనమే కాస్త ‘షేకీ’అని నా టపాలో విశ్లేషించాను. ఇక ఆ నిర్వచనాన్ని ‘బేస్ లైన్’(పునాది)గా తీసుకుని మీ క్రింది రెండు ప్రశ్నలకీ సమాధానం ఎలా చెప్పనూ!
1. 'రోజుకొకరితో తిరగడం ఏ రకమైన ప్రేమ?',
2.'టీనేజిలో కలిగే ఆకర్షణని ప్రేమ అని ఎలా అంటాం?'

కాబట్టి మీరు మీకు తెలిసిన ప్రేమ నిర్వచనం చెప్పండి. దాన్ని బట్టి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది మీకు అంగీకారమే అనుకుంటా.

మీ ప్రశ్నలతో నాటపా మొదలై, ఇప్పుడు నా ఆలోచనలే గుర్రాలై టపా పరుగెడుతోంది.రెండు భాగాలకే అన్ని సమాధానాలూ కావాలంటే కొంచం కష్టమండీ!I am still in the process of discovery.

ప్రేమని తొక్కిపెట్టే conspiracy లు ప్రతిచోటా, ప్రతి ఇంటా జరుగుతున్నవే. వాటిని నిజంగా మనం కాదనగలమా? ఇలా అణగదొక్కే, పరిస్థితి విషమించడానికి దోహదం చేస్తున్నారు అనడం తప్పా?

ఇక్కడ నా వాదనలోని లోపాలు చాలా తక్కువ మంది ఎత్తిచూపారు. ఆలోఫాల్ని నేను అంగీకరించానుకూడా. నేను అంగీకరించనిదల్లా నేను ఏంచెప్పాను అని కాకుండా "సమాజం ఎలా ఉంటే బాగుంటుందో" తమ విలువలను బట్టి prescribe చేస్తున్న వాళ్ళతోనే.వీరు నేను రాసినదన్ని బట్టి విశ్లేషింఛకుండా, వాళ్ళు అనుకుంటున్నది చెబితే ఎందుకు అంగీకరించాలి? మళ్ళీ మీరొక్కసారి కామెంట్లను పరిశీలించి చూడండి. నేను చెప్పిన (రాసిన) దానిమీద చర్చ జరిగిందా లేక వారు అనుకుంటున్న దాని మీద చర్చ జరిగిందా అన్నది తేలిపోతుంది.


ఇక నావి డొంకతిరుగుడు వివరణలు అని మీకు అనిపిస్తే. మీ అభిప్రాయాన్ని గౌరవించడం తప్ప ఏమీ చెయ్యలేను.ఇక్కడ ‘మిగిలిన వారు’ ఎవ్వరో, వార్ని నేను ఎలా కించపరుస్తున్నానో నాకు అర్థం కావటం లేదు.ఒకవేళ ఆ పదాలు అభ్యంతర కరంగా ఉంటే వేరేవి సూచించండి.మార్చేద్దాం.

Sankar said...

నాదో చిన్న సలహా (మీకు అభ్యంతరంగా అనిపిస్తే వెంటనే delete చెయ్యమని మనవి.

మొదట్లో ఎలాంటి కామెంట్లనైనా మీ పదునైన జవాబులతో తిప్పికొట్టిన మీరు ఇలా డీలా పడిపోవడం ఎమి బాగోలేదండి. మీ బ్లాగుని regularగా fallow అవ్వడానికి ప్రధాన కారణమే మీ రచనల్లోని తెగింపు, దాన్ని సమర్ధించుకోగలననే మీ ఆత్మవిశ్వాసం. రోజుకి ఒక్కసారైనా మీ blogని brows చెయ్యాల్సిన పని కల్పించిన ఆ పట్టు గత వారం పదిరోజులుగా కొంత వదులౌతున్న ఫీలింగ్ కలుగుతోంది. మీ కాలేజీ life story వ్రాసినప్పుడు అది అందరికీ నచ్చింది కాబట్టి ( నాకు చాలా బాగా నచ్చాయి) positive responce వచ్చింది. ఇలాంటి general topics మొదలెట్టినప్పుడు కొంత( ఆ మాటకొస్తే చాలా) వ్యతిరేకత రావడం సహజం. మీరు కామెంట్లని చాలా seriousగా తీసుకొని మీ తదుపరి రచనల్లో వాటికి బదులివ్వాలని చూస్తున్నారే కానీ , వాటికి అక్కడే(కామెంటుగానే) సమాధానమిచ్చి ఇంకో క్రొత్త topicని freshగా మొదలెట్టే ప్రయత్నం చెయ్యడంలేదు. partలుగా వ్రాస్తున్న మీ వ్యాసాంగంలో ఈ కామెంట్ల ప్రభావం వాల్ల pre editing ఎక్కువైపోతుంది. దాని వల్ల మీరు మొదట చెప్పలనుకొన్న విషయం పూర్తిగా మారిపోయి మీరే సమర్ధించుకోలేని స్ధితిలో పడిపోతారేమో చూసుకోండి. అది మీరు గమనించారో లేదో కానీ, మీ పాఠకుల్లో ముందువరుసలో కూర్చొనే అధికారం కలిగిన నేను గమనించాను. మీరు ఈ వ్యక్తి స్వేచ్చ-సమాజ శ్రేయస్సుని తర్వాతి భాగంలో సంపూర్ణంగా(మీరు చెప్పలనుకొన్నదంత, కొంత time తీసుకొని అయినా సరే) ప్రచురించి ఈ చర్చని కామెంట్లకి వదిలేసి, మరో interesting topicతో ముందుకు రావాలని నా కోరిక. ఆ విధంగా మీరూ చర్చలో పూర్తి భాగస్వామ్యులు కావొచ్చు. ఇదంతా మీకు తెలియదు అని కాదు... ఒక వేళ తెలియదేమోనని మాత్రమే :)

Anil Dasari said...

ప్రశ్నకి ప్రశ్నే బదులా? సరే కానీండి. ప్రేమంటే ఇదీ అని నిర్వచించటం కష్టం కానీ అదో మధురానుభూతి - కాళ్ల మధ్యలో కాదు, హృదయంలో కలిగేది. అదీ తేడా. మీ వ్యాసాలనుబట్టి నాకర్ధమయిందేమంటే, ప్రేమకి మీ నిర్వచనం నేను చెప్పే దానికి పూర్తి వ్యతిరేకం.

ప్రేమ సెక్స్ కి దారి తీయనవసరం లేదు, సెక్స్ ప్రేమకీ దారి తీయనవసరం లేదు. అవి రెండూ వేర్వేరు విషయాలు. ఒకటి జంతువులన్నిటికీ (మనుషులతో సహా) సహజమైన విషయం. రెండవది మనసుల మధ్య విషయం - అది అందరికీ అనుభవం కాకపోవచ్చు. ఒకరి బాగోగులు ఒకరు కాంక్షించేది ప్రేమ. అది ఆడ, మగల మధ్య ఉండాల్సిన అవసరమే లేదు. శారీరక సంబంధాలకి దారి తీయాల్సిన అవసరం అసలే లేదు. ఒకరితో ఒకరు కలిసి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకరిపైనే ఉండాల్సిన అవసరమూ లేదు. తనువుల మధ్య ఆకర్షణ మీద ఆధారపడ్డ, హార్మోనుల ప్రేరేపితమైన ఆ రెండో విషయానికి ప్రేమ అనే పేరు పెట్ట వద్దు. దాన్ని కాంక్ష అనో, మరోటనో పిలవండి. మనుషులమై పుట్టినందుకు ఈ కాంక్షని హద్దుల్లో ఉంచాల్సిందే. జంతువులకీ మనకీ అదే ప్రధాన తేడా. వందమందిని ప్రేమించుకోండి, ఒకరితోనే తనువు పంచుకోండి. ఇదేమీ చట్టం కాదు. కట్టుబాటు మాత్రమే. రకరకాల కారణాలవల్ల దాన్ని దాటే వాళ్లు అనాది కాలం నుండీ ఉన్నారు. చలాలు, మైదానాలు అవసరం లేదు వీళ్లకి. కేవలం అందరిలోనూ ప్రత్యేకంగా కనపడాలనే తపనతో ఆ కట్టుబాట్లను దాటటమే ఒక గొప్పగా మీరు భావిస్తే అది మీ ఇష్టం.


ఆ కోణంలో టీనేజి ప్రేమల గురించి మాట్లాడుకుందాం. 'కాంట్రాసెప్టివ్ లు, అబార్షన్లు ఉన్నాయి, మరేం భయంలేదు. టీనేజర్లూ, మీరిక ఎడాపెడా ప్రేమించుకోండి' అని పిలుపిస్తున్నారు మీరు. ప్రేమంటే ఇదా?

కేవలం 'సహజమైన విషయాలను తొక్కిపెట్టటం తప్పు' అనే వాదనని ఆధారం చేసుకుని మీరు పుంఖానుపుంఖాలుగా రాసి పారేస్తున్నారు. ప్రేమ (మీ డెఫినిషన్ ప్రకారం) ఒక్కదాన్నే కాదు, మనం చాలావాటిని తొక్కి పెడతాము. ఎందుకంటే, if every humon being starts unleashing his/her true inner self, we'll be back to where we started from - to being animals. ఆ దిశగా పోదామా మరి?

ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీకు పెళ్లయిందో లేదో నాకు తెలీదు. మీ భార్య వేరేవారిని 'ప్రేమిస్తే' ఏం చేస్తారు? (ఆవిడని ఇందులోకి లాగుతున్నందుకు నిజంగా very very sorry. My sincere apologies). మీరు చెప్పింది పాటించే విశాల హృదయం ఉందా మీకు? మీరు ప్రవచించే నూతన భావజాలం ప్రకారం ప్రేమ పెళ్లికి దారి తీయనవసరం లేదు. ఇద్దరు అడల్ట్స్ మధ్య, ఇద్దరికీ ఇష్టమైనప్పుడు, కాంట్రాసెప్టివ్స్ ఊతంగా, 'ప్రేమ' కార్యం నడిస్తే తప్పులేదు. ప్రేమ ఒకరితో, కాపురం మరొకరితో. చొక్కాలు మార్చినట్లు మొహమ్మొత్తినప్పుడల్లా ప్రేమికులని మార్చుకోవచ్చు. కాపురం మాత్రం ఒకనితోనే. ఎలా ఉంటుందో ఊహించుకోండి. (మళ్లీ, మీరెంత ప్రమాదకరమైన భావజాలాన్ని వ్యాపింపజేసే మత్తులోపడి కొట్టుకు పోతున్నారో తెలియజెప్పటానికే ఇలాంటి ఉదాహరణ పట్టుకొచ్చాను. I'm extremely sorry for that).

అన్నట్లు, పరాయి అమ్మాయిని గురించి ఇలాంటిదేదన్నా అన్నప్పుడు వంద సారీలు చెప్పే విష సంస్కృతి కూడా పోవాలేమో ఈ సమాజం నుండి. మీ కోణంలోనుండి చూస్తే క్షమాపణలడిగేంత తప్పు నేనేమీ చేయలేదు. అయినా చెప్పటం మీరేవగించుకునే సమాజం నాకు నేర్పిన సంస్కారం. ఇప్పటికీ మీకర్ధం కాకపోతే మీకో నమస్కారం.

సుజాత వేల్పూరి said...

కొత్త పాళీ గారు,
ఇందులో నేను భుజాలు తడుముకోవలసిన పనీ, అవసరం లేదు. ఎందుకంటే సమాజం బాధ్యతలని నాకు తోచినంతగా నేను మోస్తాను, పాటిస్తాను కూడా! కానీ నా నీతుల్ని ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం చేయను. కానీ నా అభిప్రాయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పే హక్కు మాత్రం నాకుందని విశ్వసిస్తాను. వ్యక్తి స్వేచ్చ పేరుతో విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించను కూడా! అభిప్రాయాలు మారినట్టే, విలువలు ప్రతి మనిషిని బట్టీ మారుతూ ఉంటే, అసలు 'విలువలు ' అనే మాటకి ఇక అర్థమేముంది?లేక...
ప్రేమ విషయంలో విలువల గురించి మాట్లాడకూడదంటారా? టీనేజి కొడుకుతో ఇలాంటి చర్చ జరపాలని కూచుంటే మా అన్నయ్యకు ఇదే పరాభవం జరిగింది. " మీ నీతుల్ని మా మీద రుద్దుతారెందుకు?" అనడిగాడు వాడి కొడుకు! అలాగని వదిలేయలేం కదా! సమాజం ఎలా ఉందో, ఈ ఆకర్షణల వల్ల వాడి ఫ్యూచర్ ఏమవుతుందో వాడికి చెప్పాలి. మానసిక సంబంధాలకు మారు పేరు సెక్యూరిటీ అని నేను అంగీకరించలేకపోతున్నాను. ఇలా అయితే ఏ పెళ్ళి లోనూ, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్యా అవసరం తప్ప ప్రేమ లేనట్టే!

(అవధులు లేని) వ్యక్తి స్వేచ్చను సమర్థిస్తూ మాట్లాడకపోతే అది ఇవాళ ఓల్డ్ ఫాషన్! మనల్ని సంకుచిత మనస్థత్వం గలవారిగా చూస్తారేమో అని ఒక జంకు! వ్యక్తి స్వేచ్చను ఒప్పుకుంటే మార్కులు పడతాయి కాబట్టి, 'అపవిత్రః పవిత్రోవా" అనేసుకుని...నా వోటూ మీకే అనేయడం! ఇది ఇవాల్టి ట్రెండు! నేను అంత ట్రెండీ కాదు!

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర గారూ,మీ కామెంటులో చాలా అసహనం కనబడుతోంది.ఇకమీరు ‘సారీ’చెబుతూ తీసుకువచ్చిన విషయాన్ని "hit where it hurts most" method అంటారు. మీరెప్పుడైనా Debate team లో ఉండిఉంటే దీనిగురించి తెలిసే ఉంటుంది."మీ అక్కోచెల్లో ఐతే ఇలా చేస్తావా?" "మీ ఆవిడ ఇలాచేస్తే ఏంచేస్తావ్?" అనేవి ఆకోవకే చెందుతాయి. క్రితం పోస్ట్ లో రాధిక గారు ఆపనేచేసారు,మీరిప్పుడు అంతే.

ఇక్కడ చర్చ విశ్వజనీయమైన ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ,స్నేహితుల మధ్య ప్రేమ గురించికూడా కాదు .కేవలం రొమాంటిక్ ప్రేమల గురించి మాత్రమే అని గమనించగలరు.

ఇకడ నేను వ్యావహారిక ప్రేమల గురించి మాట్లాడుతూ ఉంటే మీరు పెళ్ళికోసం ప్రేమలూ, లేక పెళ్ళితర్వాత ప్రేమల గురించి అనవసరంగా ఆవేశపడుతున్నారు.

పెళ్ళి అనేది ఒక ‘సోషియల్ కాంట్రాక్ట్’దాన్ని అంగీకరించిన వ్యక్తులు తమ వ్యక్తిగత స్వేచ్చని కొంతకోల్పోవడానికి తయారై ఆ సంబంధానికి కట్టుబడి ఉండాలి.అందులో ఏ అనుమానమూ లేదు.కానీ నేను చెబుతున్నది వాటి గురించి కాదు కదా!

ప్రేమంటే మధురానుభూతే..కాదనను. కానీ ఆ హృదయం ‘ఒక్కసారే స్పందించాలి’అన్నదగ్గరే సమస్య అంతా.ఈ రూల్స్ ని ప్రస్తుతం ఉన్న యువత పక్కనపెట్టి తమ బతుకులను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.దానికి కారణాలు కాస్త తెలుసుకుందాం అనే నా ప్రయత్నం.

ఇక్కడ నేను ఎవర్నీ విచ్చలవిడితనానికి ప్రోత్సహించట్లేదు."ఉన్న విచ్చలవిడితనం మనమనుకున్నంత గర్హించదగింది కాదు" అని మాత్రమే చెబుతున్నాను.This is a descriptive note, not a prescrition for people to follow.

@శంకర్ గారూ, మీరు చెబుతోంది చాలా వరకూ నిజం.ఈ చర్చల్లో నాకు కొంత కొత్త మందుగుండు సామాగ్రి దొరికి నా రాతల్ని ఆల్టర్ చేసిన మాట వాస్తవం. అది కేవలం కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పే దిశగానే తప్ప మరేవిధంగానూ కాదని గమనించగలరు.

@సుజాత గారూ, మనలో ఇంకా ఆ ‘మోరల్ డైలమా’ఉండి ‘ట్రెండీ’ కాదు కాబట్టే ఈ చర్చలన్నీ.ఒక వేళ నా రాతల్ని నేను చెబుతున్న యువత చదివితే ఖచ్చితంగా "వీడింకా ఇక్కడే ఉన్నాడ్రా! లేటెస్ట్ ఫిలాసఫీ వీడికి ఇంకా తెలీదు" అంటారేమో!.

kasturimuralikrishna said...

మహేష్ గారు,
నా బ్లాగులో ప్రేమంటే ఏమిటి? అనే పోస్టు ఒక్క సారి చూడండి.మీ వాద ప్రతివాదాలకు సమాధానాలు దొరుకుతాయి.

రవి వైజాసత్య said...

చివరకు మిగిలేది. ఉన్నతమైనది. సార్వజనీకమైనదీ. దాదాపు అన్ని సంబంధాలకు వర్తించగలది στοργή storgē నని నాకు ఘాట్టి నమ్మకం ( Greek words for love చూడండి)

కొత్త పాళీ said...

@సుజాత - మీ సమాధానం బావుంది.
"వ్యక్తి స్వేచ్చ పేరుతో విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించను కూడ" - Now, that's an interesting statement. I am really curious (absolutely no వ్యంగ్యం) to know how you discourage such behavior.

Let me propose some basic ideas (assumptions, premises) about love. I gathered these observing society around me, and some from literature.
1. There are as many definitions of love as there are individuals.
2. If it is possible to move from one love to another, say after ten years, then it is possible to do everyday.
3. It is possible to develop love after marriage.
4. It is very possible to fall out of love after a commitment has been made (marriage or something similar).
5. It is possible to fall in love with another person while one is in a committed relationship - this is no mere attraction or passing fancy. These people experience all the symptoms of what we call love, except they are not free to attach to each other.
6. There is nothing inherently holy or permanent about love.

I am not saying this is an exhaustive list. Also, we are talking about man-woman (romantic/sexual love) - we are not talking about platonic, parental, or other kinds. Also, we are talking about the present society around us.
Are these premises acceptable or debatable? Let us go from there.

రానారె said...

మహేశ్ గారూ,

కొన్ని చౌకబారు దాడులు మినహా మంచి చర్చ జరుగుతోందిక్కడ. ప్రతిఒక్కరికీ సమాధానం చెప్పాలంటే చాలా ఆలోచన మరియు సహనం కావాలి. మీకు ఈ లక్షణాలు ఇలాగే ఎప్పటికీ వుండుగాక.

ఉన్నమాటంటే ఉలుకెక్కువన్నట్టు, కొంతమందికి మీ మాటలు వింటూవుంటే భయం కలిగినట్లుంది. మీరు చెబుతున్న 'సహజమైన' విషయాలు రోజూ చుట్టూ జరుగుతూనే వున్నా వాటిగురించి బయటకు మాట్లాడేవాళ్లంటే భయం. ఆ 'సహజత'కు పగ్గాలుండవేమోనని. ఈ పగ్గాలను తమచేతుల్లో బిగబట్టుకు కూర్చున్నవాళ్ల నుంచి విడిపించుకోవాలనుకున్న జీవులు - యేమార్చి కానీ, ఒక పోటు పొడిచిగానీ - విడిపించుకోవడం కూడా 'సహజంగా' రోజూ జరుగుతున్నదే. దొంగ ప్రేమలు, దొంగ పెళ్లిళ్లు, విఫలప్రేమల మరణాలు, హత్యలు ఇలాంటివి ఈ కోవలోవే కదా. పగ్గాలు బిగబట్టేకొద్దీ, గుప్పిట మూసేకొద్దీ ఈ పరిణామాలు తగ్గవు సరికదా సమాజంపై విషం చిమ్మడమే ఎక్కువౌతుందని నాకనిపిస్తుంది.

కందుకూరి, రామ్మోహనరాయ్ వీళ్ళు కోరింది కూడా మీరన్న 'బాజాల బుజ్జిగాళ్ల' నుంచి మామూలు మనుషులకు (ముఖ్యంగా ఆనాటి ఆడవారికి) స్వేచ్ఛ కావాలనే! విధవావివాహాలతో విచ్చలవిడి తనాన్ని పెంచి సమాజాన్ని నాశనం చేస్తున్నారంటూ వీళ్లను కూడా అదిలించి బెదిరించి నోరుమూయించాలని చాలా ప్రయత్నాలే జరిగాయి అప్పటి బాజాల బుజ్జిగాళ్ల వైపు నుండి. ఒక మనిషి తాననుకున్నమాటను సహేతుకంగా చెబుతూవుంటే కోపగించుకొనే జనాలు, నొప్పింపజూసే జనాలూ అప్పటికీ ఇప్పటికీ ఉండనే వున్నారు. :)

Anil Dasari said...

మహేష్,

నా బాణం లోతుగా దిగినట్లుంది. It hurts, doesn't it? 'మీరు బోధిస్తున్న నూతన విలువలు మీ ఇంట్లోవాళ్లకీ వర్తిస్తాయా' అన్న ప్రశ్నకి ఉన్నపళాన మీ సంస్కరణల పరిధి కుదించుకుపోయిందేం? చెరువు గట్లు తెగ్గొడదామనే ఆవేశం కాస్తా వరద మీ ఇంటి గుమ్మం తాకేసరికి చల్లబడిందా?

'పెళ్లనేది ఓ సోషల్ కాంట్రాక్ట్, దాన్నంగీకరించిన వాళ్లు ఆ సంబంధానికి కట్టుబడి ఉండాలి' అంటూనే 'అయితే నేను వాటి గురించి చెప్పటం లేదు' అన్నారు. కానీ నేను అడుగుతున్నాను. ఆడ-మగ సంబంధాల విషయంలో సమాజపు కట్టుబాట్లని దాటాలని ఉద్భోధించే మీరు మీ వరకూ వచ్చేసరికి అవే కట్టుబాట్లని అడ్డుపెట్టుకుని తప్పుకోజూడటమేమిటి? 'ఇరువురు పెద్దలు పరస్పరాంగీకారంతో ఒకరినొకరు ఇష్టపడినప్పుడు అవసరమైతే సమాజం విధించిన హద్దులు మీరైనా ఏకమవచ్చు' అనేది మీరు పదే పదే వల్లెవేసిన విషయం కాదా? ఇప్పుడు నాలుక మడతేసి 'అబ్బే, పెళ్లయినవారి విషయం నేను మాట్లాడటంలేదు' అనటమేమిటి? 'సాంఘిక ఒడంబడిక' అనే ఛత్రపు ఛాయలో ఒడుపుగా ఒదిగిపోయి నే విసిరిన ప్రశ్నని కాచుకుందామనుకున్నారు కానీ ఆ తొందరలో మీరు ప్రశ్నిస్తున్న విలువలనే రక్షణ కవచంగా వాడుకోబోయారన్న సంగతి మర్చిపోయారు.

ప్రేమనేది ఒక సహజమైన విషయం. అదెప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలీదు. దాన్ని ఫలవంతం చేసుకోవటానికి అడ్డొచ్చిన సమాజాన్ని ఎదిరించాలి. అవసరమైతే హద్దులు మీరాలి, కటుబాట్లు ఛేదించాలి. ఇవన్నీ మీరు చెప్పినవే - కావాలంటే మీ పాత టపాలు చూసుకోండి. అప్పుడెప్పుడూ ఇవి పెళ్లి తర్వాతి ప్రేమలకు వర్తించవని మీరనలేదే? అయినా ప్రేమల్లో వ్యావహారిక, పెళ్ళి ముందరి, తరువాతి, రొమాంటిక్ - ఇలా రకరకాలుంటాయా?

మీరు చెప్పే నూతన విలువలు ఎదుటివారికేగానీ మీకు వర్తించవని అర్ధమైపోయింది.

@రానారె,

పనులు మానుకుని చవకబారు దాడులు చేసేంత తీరిక నాకు లేదు. 'మీరెందుకు భుజాలు తడుముకుంటారు' అంటారా? పేరుపెట్టి చెప్పకపోయినా మీరెవరిగురించి అన్నారో సుస్పష్టం. నే రాసినదానిలో అభ్యంతకరమైందేముంది? అందులో అశ్లీలమో, అసభ్యతో కనపడిందా మీకు? ఒకవేళ మీరు నన్ననలేదని సమర్ధించుకోజూసినా ఆ అనిపించుకున్నవాళ్ల తరపున నాదో ప్రశ్న. తనతో విబేధించేవాళ్లని బాకాగాళ్ళు, బాజారాయుళ్లు అంటూ ఎద్దేవా చేసే వ్యక్తి మీకు రామ్మోహన్ రాయ్ అంతటి సంస్కరణా శిఖరం - తాము తప్పనుకునందాన్ని నిర్మొహమాటంగా ఎత్తిచూపే నాబోటి వాళ్లవి మాత్రం చవకబారు దాడులు, నేలబారు రాతలూనా?

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర గారు, నా సమాధానాన్ని మీరు ఇలా అర్థం చేసుకున్నారా! మరోసారి కాస్త సమయం వెచ్చించి చదవగలరని మనవి.

మీ ప్రశలలో కొన్నింటికి Part 3 లో సమాధానం దొరుకుతాయి. వేచి చూడగలరు.

తెలుగు'వాడి'ని said...

మహేష్ గారు : నేను ఇలాంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు వేళ్లు పెట్టటానికి ఇష్టపడను .. కారణం : ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి అని ... కానీ ఎప్పుడూ ఒకటి రెండు వాక్యాలకన్నా ఎక్కువ రాయని రాధిక గారు కొంచెం సీరియస్ గా స్పందించిన తరువాత కొంచెం ఉత్సుకత ఏర్పడింది .. అయినా వారి వ్యాఖ్యానాలే చదివాను కానీ మీ టపాలు చదవలేదు ... తరువాత వంతు సుజాత గారిది .. కొత్తగా వచ్చినా కూడా తను కొంచెం ఓపికగా తన ప్రతి వ్యాఖ్యకు తిరిగి స్పందించే అలావాటు ఉండటంతో తను మీ టపాలపై అభిప్రాయాలు వెలిబుచ్చటంతో ఈ టపాలపై మరియు ఆ వ్యాఖ్యానాలపై ఒక కన్నేసి ఉంచా కానీ టపాలు మాత్రం చదవలేదు .. చివరిగా అబ్రకదబ్ర గారి వంతు .... వ్యాఖ్యలు రాసే వారిలో ఈ మధ్యకాలం లో తను నాకు బాగా నచ్చిన వ్యక్తి (ఇంతకు ముందు లలిత గారు, వారి వ్యాఖ్యలు కూడా బాగా ఇష్టం .. ఎందుకనో ఈ మధ్య వారి వ్యాఖ్యలు కనిపించటం లేదు)... ఈ ఇద్దరి వ్యాఖ్యలు నాకు నచ్చటానికి రెండు ముఖ్య కారణాలు : మొదటిది, తమ అభిప్రాయాలను సాధ్యమైనంత వివరంగా, వాళ్లు అనుకున్న భావాలను, ఆలోచనలకు స్పష్టమైన అక్షరరూపం ఇవ్వటానికి ప్రయత్నిస్తారు .. ఇక రెండవది ఎంతో ఓపికగా మరలా అదే బ్లాగ్/టపాకు వచ్చి ప్రతిస్పందిస్తారు తమ వ్యాఖ్యలకు వచ్చిన వ్యాఖ్యలపై ... ఎంతో ఆలోచనా పరునిగా, స్పష్టంగా, వివేకంతో, (సాధ్యమైనంత వరకు .. 95%) సంయమనంతో వ్యవహరించే తను ఇక్కడ మీ టపాకు స్పందించటం చూసిన తరువాత ఇక మీ టపా తప్పక చదివి తీరవలసిన పరిస్థితి వచ్చింది .. చదివా ... ఈ వ్యాఖ్య రాద్దామా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలో ఇక్కడ వ్యవహారం అంతా ముదిరి పాకాన పడింది .... ఇంతలోనే అబ్రకదబ్ర గారు ఒక పెద్ద సీరియస్(వేరే బ్లాగ్ లో అయితే ఇది పరిధి దాటినట్టే గానీ మీ బ్లాగ్ కి అది కరెక్టే) కామెంట్ రాశారు ఇక్కడ .... సరే చూద్దాం తన మనసులోకి దూరి తెలుసుకునే కన్నా మరలా వస్తారు కదా మీ వ్యాఖ్య చూసినాక అని ఆగా .. అదే నిజమయ్యింది ... వచ్చారు .. మరలా తనదైన శైలిలో (పైన చెప్పినట్టుగా) చాలా విస్పష్టంగా, ఇది ఏదో మూర్ఖత్వపు వాదన లాగా చేయకుండా చాలా చక్కగా ప్రశ్నించారు ... ఇక తప్పలేదు నేను కూడా వేలు పెట్టాలి అనిపించింది ...



ముందుగా అసలు ఈ టపాలకి పట్టిన దరిద్రం ఎక్కడా అంటే :

1. మీరు ఇంతకు ముందు రాసిన మీ కాలేజీ జీవిత విశేషాలకు సంబంధించిన టపాలకు అందరూ చాలా తరచుగా, ఎక్కువగా మీరు చాలా సూపర్ గా రాశా(స్తున్నా)రనీ చెప్పటంతో ఒక్కసారిగా మీరు జబ్బలు చరుచుకోని, ఒళ్లు విరుచుకోని, బట్టలు చించుకోని ఈ టపాలు రాయటానికి ఉపక్రమించటం ... (ఒప్పుకొని తీరాలి మీకు తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది .. పాఠకుణ్ని కదలనివ్వకుండా చివరి వరకు చదివించగల నేర్పు, ఈ టపాలను చాలా వేగవంతంగా రాయగలిగిన సమయం, ఓర్పు ఉన్నాయి .. అందుకు మీకు హాట్సాఫ్). కానీ మీకు బాగా తెలిసి కూడా ఒక్క క్షణం మర్చి పోయినట్టుగా అనిపించిన విషయం ఏమిటి అంటే, ఈ కాలేజీ విశేషాలు మరియు ఉద్యోగ అనుభవాలు మొదలగువాటిల్లో ప్రతి ఒక్కరూ వాళ్లను, వారి అనుభవాలను/జ్ఞాపకాలను చూసుకుంటారు అందుకే ఇలాంటి టపాలైనా లేక Happy Days / Hyd Blues/Dollar Dreams/Office Space లాంటి సినిమాలు అంత హిట్ అయ్యేది ...


నేను ఎప్పుడూ ప్రస్తుత టపాకు సంబంధించిన విషయంపై కాకుండా ఇలా అంటే ఇంత తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించను .. ఇక్కడ ఇలా దాడి చేయటానికి కారణం, మీరు ఎంచుకున్న విషయం ఇప్పటి సమాజంలో అధునిక(?!) యువతరానికి, అంతే ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు/స్నేహితులకు, చుట్టూ ఉన్న సమాజానికి అవసరం మరియు కొంతైనా ఉపయోగ పడే అవకాశం ఉంది .. కాకపోతే మీరు ఈ భాష పై ఉన్న పట్టు, పదాడంబరత, తిప్పి తిప్పి ఏదో ఏదేదో చెపుతూ అసలు విషయాన్ని పూర్తిగా పక్క/తప్పుదోవ పట్టిస్తున్నారు/పట్టించారు .. దానిని దారిలో పెట్టటానికి ఇది ఏమన్నా ఉపయోగపడుతుందనే ఆశ అంతే ... ఉపయోగపడితే అదే పదివేలు.

2. ఇలాంటి టపాలు రాసేటప్పుడు మీరు రాయాలి అనుకున్నది అంతా(అది పది కావచ్చు, పది హేను లేక వంద భాగాలు కావచ్చు) మీరు మొత్తం ముందుగానే పేపర్ మీద పెట్టుకొని ఈ టపాలను ప్రచురించాలి ... అప్పుడు మీరు అనుకుంటున్నది ఏమిటి దానికి మీరు ఎంత వరకు అక్షరరూపం ఇచ్చారు అన్నది మీకు, చదివే వారికి కూడా సులభంగా అర్ధమవుతుంది లేదా కనీసం అర్ధంచేసుకునే అవకాశాం ఉండేది .. అంతే కానీ ఎవరు ఏమి ప్రశ్నించినా/వివరణ కోరినా నా మూడో/నాలుగో/అరవై ఏడో భాగం కోసం చూడండి అని చెప్పటం చాలా హాస్యస్పదంగా మరియు/లేదా చదివే లేదా వ్యాఖ్యానించిన మమ్మల్ని వెధవల్ని చేయటానికి లాగా ఉంది ... హాస్యాస్పదం అని ఎందుకన్నాను అంటే మీరు ఇప్పుడు రాయబోయేది మీరు ఈ టాపిక్ పై చెప్పదలచుకున్న అభిప్రాయాలా లేక ఈ వ్యాఖ్యలకు అంతో ఇంతో వివరణ ఇచ్చేలా చూసుకుంటూ మీ ఆలోచనలు పక్కకి పోయేలా/పోయాయేమో అనిపించే అవకాశం ఉండటం ... ఇక అతి ముఖ్యమైన రెండవది ఏమిటి అంటే, మమ్మల్ని వెధవలని చేయటం అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మీరు శుభ్రంగా ఒక యాభై వాక్యాలు రాసి .. చూశారా, మీరందరూ అనవసరంగా ఆవేశపడ్డారు నేను చెప్పాలి అనుకుంది ఇది ... నేనే రైట్ .. హహ్హహ్హ ... అని ఒక వెర్రినవ్వు నవ్వటానికి సిధ్ధపడుతున్నట్టుగా ఉన్నాయి మీ సమాధానాలన్నీ

ఇక అసలు నా వ్యాఖ్యలోకి వెళ్దాము :

ముందుగా మీకు సమాజమంటే ఒకే ఒక్క మనిషి/వస్తువులాగానో భావించి ఈ టపాలోకి దిగినట్టు ఉంది ...

"మన ప్రస్తుత ఆనందం భవిష్యత్తుకు సమస్యాత్మకం కాకుండటం"(present happiness should not lead to future shock). అంటే, మన భవిష్యత్తును సమస్యల్లో ముంచని ఏ ఆనందమైనా అనుభవయోగ్యమే, అని అర్థం.

అసలు మీరు చెప్పదలచుకున్నది ఇంత స్పష్టంగా, మూర్ఖత్వంగా మొదలు పెట్టిన టరువాత కూడా అబ్రక్రదబ్ర గారి లాంటి వాళ్లు(ఆడవారిగా రాధిక/సుజాత గారుల స్పందనలు(కారణలు ఏవైనా గానీ) అర్ధం చేసుకోవచ్చు) అసలు ఈ టపాకు స్పందించటం ఇంకా నాకు ఆశ్చర్యాన్ని అంతకన్నా ఎక్కువ బాధని కలగజేస్తుంది.

ఇది చెప్పినప్పుడు మీరు 'ఆనందం' గురించి మాట్లాడారు తప్ప, ప్రేమ అన్నారే గాని టీనేజ్ లేక పెళ్లి కాకుండా అని ఎక్కడా చెప్పలేదు .... మరొక్కసారి చదవండి ... కాకపోతే మీ సమాధానం ఏమిటో నాకు తెలుసు (అది ఏమిటి అంటే .. "దయచేసి నా 35వ భాగం కోసం ఎదురు చూడండి) కాబట్టి నేను మీ సమాధానం కోసం ఎదురుచూడటం లేదు.

1. కామం, ఆకర్షణ, ప్రేమని ఒక్కటే అనుకోవడం: వీటిని "అంతా ఒక్కటే" అనే మూర్ఖత్వం నాలో లేదు. కానీ, ఇవన్నీ ప్రస్పర బంధం కలిగిన మానవ సంబంధాలు అని నా భావన. "ప్రేమలో కామం OK గానీ, కేవలం కామం తప్పు" అన్నది కొందరి వాదన. మెచ్యూరిటీ ఉన్న ఒక ఆడా-మగా కేవలం కామం కోసం ఒకటైతే అది "అనైతికం",అనేది మన సమాజం పెట్టిన ఒక రూలు. కాస్త ఆలోచిస్తే ఆ కండిషన్ ఎందుకు వచ్చిందో అర్థమైపోతుంది. కామం కోసం (సమాజానికి అంగీకారమైన ‘పెళ్ళి’ అనే బంధం తో నిమ్మిత్తం లేకుండా) ఏకమైన జంట ఆనందానికి ప్రతిఫలంగా ఒక బిడ్డ జన్మిస్తే, అది సమాజానికి ఒక సమస్యగా మారుతుంది. అనాధశరణాలయాలు కావాలి, ఆ బిడ్డడి ఆలనా పాలనా చూడాలి, వాడ్ని సమాజానికి కంటగింపు కాకుండా కాపాడాలి. అబ్బో...! సమాజానికి చాలా పని. అందుకే ఈ ‘నైతికం’ మంత్రం.

ఏ సమాజం గురించి మాట్లాడుతున్నారండీ మీరు .... ఎక్కడ ఉంది ఇలాంటి సమాజం .. పరిచయం చెయ్యండి మాక్కూడా ... ఒకవేళ సమాజమంటే ఒకరి కన్నా ఎక్కువైన జన సమూహం అని మీరు అనుకుంటే (మీరు ఇలా అనుకుంటారు అంటే నాకు సందేహమే) అందులో మీరు (లేక ఈ టపాలు చదివిన ఏ ఒక్క పాఠకులైనా) కూడా ఒక భాగం అనుకుంటే, గుండె మీద చేయివేసుకుని చెప్పండి ఎంతమందిని మీరు చేరదీశారు, కనీసం ఎన్ని అనాధశరణలయాలను మీరు దర్శించారు, ఎంత దానం చేశారు మొదలగునవి. అసలు ఇది ఒక్కటే కారణం అన్నట్టుగా మీరు చెప్పజూడటమే హాస్యాస్పదంగా ఉంది.

ఇక చివరిగా, మీకో సూటి ప్రశ్న :

స్వేచ్చ గురించి ఈ రేంజ్ లో తెగ దంచుతున్నారు కదా ... ఈ టపాలో మీరు ఎందుకు అన్ని పదుల/వందల పదాలకు డబుల్ కొటేషన్స్ లో పెట్టి చెప్పటం ...ముందు ఇక్కడ ఈ టపాలు చదివే(విన) మగ పాఠకులను అడిగి చూద్దాం ... ఆ పదాలు వాడిన మీ ఉద్దేశ్యం/భావం ఏమిటో ... అందరికీ తెలుసు ... మనం నలుగురం ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటే ఇవే పదాలు వాడతామా లేక మన 'సహజ' భాష వాడతామా ..

మరి మీరెందుకు సూటిగా చెప్పకుండా ఇలా డొంకతిరుగుడు పదాలు వాడటం ... ఇంతకు ముందు అయితే మీరు రాసినవి ఏ పత్రికకో పంపించాలి .. కానీ ఇక్కడ ఇది మీ సొంత బ్లాగ్ కదా ... దీనికి మీరే రాజు కదా .. మరి ఈ రోజుల్లో కూడా ఇంత సెన్సార్ తో మీరు టపాలు రాయటం అవసరం అంటారా .. మరి ఎందుకు రాస్తున్నారో మరి ... మీ సమాదానం ఎలాగూ రాబోయే 52వ భాగంలో కాబట్టి, అంత వరకు వేచి ఉండలేని వారికోసం నా వెర్షన్ నేను చెపుతా ... హద్దు దాటకుండా, నోటికి, చేతికి దురద ఉంది అనిపించుకోకుండా, సంస్కారవంతంగా నలుగురిలో(తో) మాట్లాడటం/రాయటం అనేది మీ తల్లిదండ్రులు, గురువులు చెప్పిన అ 'విలువల' ఫలితం/ప్రభావం అయినా అయ్యుండాలి లేదా మీ ఈ టపాలు ఒక వేళ మీ తల్లిదండ్రులు/గురువులు/స్నేహితులు చదివితే మీగురించి ఏమనుకుంటారో అన్న భయం అయ్యుండాలి లేదా కనీసం ఈ టపాలు చదవటానికి వచ్చిన వారికి కనీసం ఒక స్థాయిలో అన్నా చదవగలిగిన (అంటే బూతులు లేకుండా లేక బూతులు అనిపించకుండా ఉండటం కోసం) భాశను వాడకపోతే మిమ్మల్ని ఒక 'పెద్డ డాష్' కింద జమకడతారేమో అనే అనుమానం అయినా అయ్యుండాలి ... దీనిని మీరు మీ మొదటి టపాలో చెప్పిన 'సమాజం, విలువలు, నిరోధ్ లు, ఆనందం, స్వేచ్చ' లతో పోల్చుకోండి మీకే అర్ధమవుతుంది మీరేం చెప్పాలి అనుకుంటున్నారో, మీరేమి చెపుతున్నారో .. మీకనుగుణంగా మీరనుకునే వాటిని ఎలా మార్చుకుంటున్నారో, మసలుకుంటున్నారో ...

ఇప్పటికే మీమ్మల్ని రా.రా.మో.రాయ్, చలం లాంటి వాళ్లని దాటి పొయ్యారనో/పోబోతున్నారనో చెప్పే వాళ్లు తయారయ్యారు కాబట్టి, నాకు తెలిసినంతలో మీరు ఈ టపాలు మొదలు పెట్టిన ప్రయత్నం సార్ధకతను సాధించినట్టే కాబట్టి(మొదలు పెట్టబోయే ముందు మీ ఆలోచన ఇది కాదు అని తెలుస్తూనే ఉంది కాకపోతే తరువాత మీ ఉద్దేశ్యం మారిపోయింది .. ఎంతలా అంటే మిగతా ఎవరూ చెప్పనిది/చెప్పలేకపోయింది నేను మాత్రమే చెప్పగలుగుతున్నాను అని విర్రవీగేపోయేంత ... కాని మీకు అర్ధం కానిది ఏమిటి అంటే మిగతా వాళ్లు చెప్పలేక కాదండి చెప్పనిది ... చెప్పటానికి ఉన్న స్పష్టతను మాటల్లోకి మార్చేటప్పుడు అది ఈ సమాజానికి ఒక సరికొత్త దిశానిర్ధేశనం చేసేటట్టుగా ఉండాలి ... అలా ఉంచలేకపోతే అవిలేపే సరికొత్త ప్రశ్నలు లేనిపోని అయోమయాన్ని సృష్టించకుండా అన్నా ఈ సమాజాన్ని, సమాజంలోని మనుష్యులని కాపాడాలని చాలామంది వెనకడుగు వేస్తారు అంతే) ఇక మేము ఎంత చెప్పినా ఉపయోగం లేదు అనిపిస్తుంది ... సరే అలాగే కానియ్యండి ... ఇప్పుడు ఆలోచించి చెప్పండి మీరు చేస్తున్నది ఎక్కడికి దారితీస్తుందొ ....

చివరిగా నేను చెప్పదలచుకున్నది ఒకటే ...........(వీలైతే మరొక్క సారి శంకర్ గారి వ్యాఖ్య చదవండి ... ఆఖరకు దీనికి కూడా మీ స్టాండర్డ్ మూర్ఖత్వపు సమర్ధనే)

దయచేసి ఇప్పటికైనా ఈ టపాలు ఏ భాగానికి ఆ భాగం ప్రచురించటం ఆపెయ్యండి ... కొంత గాప్ తీసుకోని అయినా సరే మీ ఆలోచనలన్నింటినీ పూర్తిగా పేపర్ మీద పెట్టండి .... అన్నింటినీ ఒకేసారి ప్రచురించండి ... అప్పుడు ఎవరైనా లేవనెత్తిన ప్రశ్నలకు మీ సమాధానంగా మీ టపా సంఖ్యను సూచించండి ...

మీరు రాస్తున్న విషయం పై తరతరాలుగా కొన్ని వందల వేల సమాజాలలో సంఘర్షణ జరిగింది/జరుగుతూనే ఉంది ... అదే సంఘర్షణల ఒరిపిడి నుంచి మారుతున్న జన జీవన స్థితిగతులకు మరియు అదే సమాజంలోని జనాల ఆలోచనా విధానాలకు అనుగుణంగా (మీ/నా ఉద్దేశ్యంలో మెజారిటీ ప్రజలకు అయ్యుండొచ్చు కాక) విలువలు, స్వేచ్చ మొదలగునవి మారాయి, మారుతున్నాయి ఇంకా మారతాయి కూడా ... కాకపోతే ఇలాంటి టపాలు, రచనల వలన ఇది ఇంకా శీఘ్రవంతం అయ్యే అవకాశం ఉంది .. అది మంచిది కూడా చెడుకైనా, మంచికైనా కూడా .. కాకపోతే సమయం గడిచేకొద్దీ మరియు మీ ప్రతి స్పందనకూ మీరు లేని పోని సరికొత్త అయోమయాన్ని సృష్టిస్తున్నారు..

అందుకే మీరు చెప్పదలచుకున్నది సుస్పష్టంగా, నిక్కచ్చిగా, సూటిగా చెప్పండి ... ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీ టపాలో విషయం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అలాగే ఉంది కాకపోతే మీ వ్యాఖ్యలలో మీరు రాసిన దానిని మరీ మూర్ఖత్వంగా సమర్ధించుకో జూస్తున్నారు అని స్పష్టంగా అనిపిస్తుంది ... సమర్ధనతో పని లేదు మీరు ఈ టపాలన్నీ పూర్తిచేసేటంతవరకు ... పూర్తి అయిన తరువాత మీరింతే అని సరిపెట్టుకోవటమో లేక వారు వారి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవటం జరిగిపోతుంది .. ఇలాంటి టపాలకు కావలసింది, నాకు తెలిసి మీరు ఆశిస్తున్నది కూడా అదే అయ్యుంటుంది ...

కనుక ఆలోచించి చూడండి .. మీకే అర్ధమవుతుంది మీ తదుపరి ప్రణాళిక ఏమీటి .. టపాలన్నీ ఒకే సారి రాయాల లేక ఇలా ఒక్కో టపా రాస్తూ, వ్యాఖ్యలకు స్పందిస్తూ రాస్తే మంచిదా అని ... పైన చెప్పిన కొన్ని విషయాలు కాకుండా మరొక్క దానిలో కూడా మిమ్మల్ని అభినందించి తీరాలి .. అది, ప్రతి వ్యాఖ్యకు స్పందిస్తున్న మీ ఓపికకు ...


మిమ్మల్ని మీరు కనుక్కునే క్రమంలో మీ ఆలోచనలను, అనుభవాలాను, పరిశీలనలు మధించి, శోధించి మీరిక్కడ ఇస్తున్న అక్షరరూప పరిణామక్రమం మునుముందు ఎన్నో మార్పులకు చేర్పులకు లోనవుతుంది .. అది మీకు, ఈ టపాలు చదివే వారికి కొద్దో గొప్పో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా .. కాకపోతే ఈ సంఘర్షణ చక్రంలో, పరిణామ క్రమంలో, రూపాంతరాల వలయంలో ఉన్న పొరలను చేధించే, వలయాలను దాటుకునే ప్రక్రియలో .. మీరు కోరుకున్న నవసమాజం లేక సరికొత్త ఆలోచనల ప్రపంచం అనే ఒక విత్తనాన్ని నాటకపోయినా ఫర్వాలేదు గానీ, దారిలో ఎదురయ్యే విలువల వలువలనే పచ్చని ఆకులతో ఎదిగిన/ఎదుగుచున్న చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికెయ్యటానికి ప్రయత్నించకండి ... నరకమొక్కటే ప్రత్యామ్నాయం అనుకుంటే ధైర్యంగా చెయ్యండి .. డొంకతిరుగుడు వద్దు ...

Kathi Mahesh Kumar said...

అయ్యా తెలుగు ‘వాడి’ గారూ,చాలా సమయం వెచ్చించి నా టపాలూ వాటిల్లోని కామెంట్లూ చదివి ఇంత విస్తృతమైన వ్యాఖ్య చేసినందుకు మొదటిగా నెనర్లు.

కాకపొతే "ఏదైనా సరే స్నేహపూర్వక, వివాదరహిత వాతావరణంలో జరగాలని కోరుకునే" ఆదర్శాన్ని కలిగిన మీరు, స్థాయికి మించిన స్నేహహీనతను ఇక్కడ ప్రదర్సించారని, నా సవినయ మనవి.

నా ఆలోచనల్ని నాదైన విధానంలో నా బ్లాగులో పంచుకుంటే, నేనేదో ప్రపంచాన్ని నాశనం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వచ్చిన కామెంట్లకు సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తే, డొంకతిరుగుడు సమాధానాలు అని నింద వేస్తున్నారు. నా వాదనని నా తరఫునుంచీ చెప్పడానికి సాహసిస్తే, మూర్ఖత్వం అని ముద్ర వేస్తున్నారు.నా మీద ఇంత చిన్నచూపున్న మీరు నా టపా పై అంత సమయం వెచ్చించడం ఆశ్చర్యంగా ఉంది.అందులోనూ, అందరికన్నా పెద్ద కామెంట్ కూడా మీదే!

మీ స్పందనకు నా ప్రతిస్పందని రాసి నన్ను నేను కించపర్చుకోదల్చలేదు. కాకపోతే నా టపా నేను ఎలా నిర్వహించాలో, నా భావాల్ని,వ్యాఖ్యల్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న దానిపై మీరు స్వతంత్రించి ఇచ్చిన సలహాలపై మాత్రం కాస్త ఉటంకించకుండా ఉండలేక పోతున్నాను.

నా బ్లాగుకి నేనే రాజునని చెప్తూనే,హద్దుల మీరు నిర్ణయిస్తున్నారు.నా భాష బాగుందంటూనే "డొంకతిరుడెందుకూ...సహజ భాష ఉపయోగించి సూటిగా చెప్ప"మంటున్నారు.నా టపా ‘దరిద్రం’అంటూనే అది ఎన్ని భాగాలుగా ఉండాలో,వాటిని నేను ఎలా రాయాలో నిర్దేశిస్తున్నారు.

అంటే మీ భావాలకి అనుగుణంగా లేకపోతే మనుషుల్నీ వారి భావనల్నీ,ఆలోచననీ,నడవడికనీ,భాషనీ,భావశైలినీ,జీవన విధానాన్నీ,నమ్మకాన్నీ అన్నింటినీ సమూలంగా మార్చేసుకోవాలి, లేదు కనీసం ఆల్టర్ చేసుకోవాలి. అంతేగా...?!?

మీకు మించిన ‘నిజమైన సమాజ ప్రతినిధి’ నాకు ఇంతవరకూ బ్లాగు ప్రపంచంలో కనపడలేదు.మీ పరిచయ భాగ్యానికి చాలా సంతోషంగా ఉంది.

మీరన్నట్టు సమాజం అంటే ఒక వ్యక్తో వస్తువో అన్న అపోహనాకులేదు, "దాని భౌతిక స్వరూపం తెలీదుగానీ, ఉనికి మాత్రం అందరూ అనుభవవించేదే" అని నా మొదటి భాగంలోనే చెప్పాను. అయితే ఇప్పుడు మీద్వారా మళ్ళీ ఆ ఉనికి నా అనుభవంలోకి వచ్చింది.కనీసం అందుకైనా మరిన్ని ఆలోచనల్ని నా బ్లాగులో రాస్తాను.

మీ ప్రేరణకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

Bolloju Baba said...

the attack is perfect and the defence is excellent. as usual i enjoy both versions.
bollojubaba

Srinivas said...

అందరూ ఒకేలా ఆలోచించాలనుకోవడమూ, ఒకే విలువలు కలిగి ఉండాలనుకోవడమూ, అందుకు భిన్నంగా ఎవరయినా తటస్థ పడితే మితిమీరని అసహనాన్ని ప్రదర్శించడమూ వంటి లక్షణాలు మనిషికి సర్వసాధారణం. కొంచెం ఆలోచిస్తే వాటిని అధిగమించవచ్చు.

ఏ విలువా సార్వజనీనమూ, సార్వకాలికమూ కాదు. స్థూలంగా నాకు తోచిందేమిటంటే ప్రేమకు మారుతున్న అర్థాన్నీ, రూపాన్నీ మనం అర్థం చేసుకుని వొప్పుకు తీరవలసిన అవసరం గురించి మహేష్ చెపుతున్నారని. అయితే దీనివల్ల ప్రేమ పవిత్రం, ప్రేమే దైవం (నేను నాస్తికుణ్ణి ;-)అనుకునేవాళ్ళు ఆ విలువల్ని వదుల్చుకోనవసరం లేదనుకుంటాను. అలాగే తమలాగే బతకని ఇప్పటి కుర్రకారునీ వాళ్ళ విలువలనీ గూర్చి వాపోనవసరమూ లేదు.

మనకంతా గందరగోళంగా, భ్రష్టు పట్టినట్టనిపించే ఈ కాలపు ప్రేమల్లోనూ ఒక తీరూ తెన్నూ, క్రమమూ ఉన్నాయేమో! మనం వాళ్లతో మాట్లాడగలిగితే, వాళ్ళు మనతో మనసు విప్పి చెప్పుకోగలిగితే సమాధానాలు తెలుస్తాయి. కాకపోతే అటువంటి పరిస్థితులు ఇప్పట్లో కలగవని మాత్రం అనిపిస్తుంది.

Purnima said...

Where's the part 3? Long time, isn't it?