Sunday, June 8, 2008

నోరు మూసుకుని చదువు!



"నోరు మూసుకుని చదువు!" అన్న గద్దింపు, ప్రశ్న వేసిన ప్రతిసారీ చిన్నప్పట్నించీ నేను విన్నదే. బహుశా మనలొ ప్రతి ఒక్కరికీ ఇంట్లోనో, బళ్ళోనో ఈ గౌరవం సదా జరుగుతూ ఉండేదని నా నమ్మకం. ఈ గద్దింపుల విధానం మనలోని మానవీయ ఆసక్తిని, ప్రశ్నించి, శోధించి, జ్ఞానాన్ని సమపార్జించుకోవలసిన విధానాన్ని మనకు దూరం చేసిందేమో అని నా అనుమానం. "ఈ ధర్మసందేహం హఠాత్తుగా ఎందుకు కలిగింది?" అనుకుంటున్నారా ! దానికీ ఒక కారణముంది చెబుతా.



మొన్నీ మధ్య ఇక్కడి యునిసెఫ్ (UNICEF) లో మూడు సంవత్సరాలు పనిచేసిన ‘డాక్టర్ శామ్’ అనే ఒక బ్రిటిష్ అధికారి , ఆఫ్రికాలోని ఒక దేశానికి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్న తరుణంలో, ఆయనకు భారతదేశంలో నచ్చినవి,నచ్చనివీ అని పిచ్చాపాటీగా మాట్లాడుతూ అడగటం జరిగింది. దీనికి ఆయన చెప్పిన సమాధానమేమిట్రా అంటే, తనకు బాగా నచ్చింది చాలా చక్కగా విడదీయబడిన ఋతువులు (seasons). ఎందుకంటే తను పుట్టిపెరిగిన లండన్ లో వాతావరణం ఎప్పుడేలా మారుతుందో తెలీదుగనక, అదొక సమస్యగా ఎప్పుడూ చర్చల్లో ఉండేది. ఇక్కడ ఆ బాధ లేదు అని.


ఇక ఈ చర్చకు కారణమైన, నచ్చని విషయం వినండి. "Indians are very intelligent, they have their technical basics very right. But, when it comes to inter-twining them to solve human problems, they fall inadequate" అన్నాడు. దీనికి కొనసాగింపుగా చెబుతూ, "India is unique and needs innovative approaches to solve it's problems. I am afraid, with such limitations things would become difficult" అని. ఈ మాటకి ఒక్క క్షణం మనస్సు ఛివుక్కు మంది. కాకపోతే తన ఇన్నాళ్ళ అనుభవంతో చెప్పిన మాటల్లో కొంత నిజముందనిపించింది.


ప్రశ్నించి,ఆరాతీసి, చదివిన చదువులను జీవితానికి అన్వయించుకుని, తద్వారా కలిగిన సొంత ఆలోచనలనతో సమస్యలకు సమాధానాలు వెతుక్కొగలిగేలా మన చదువులు ఉండేవా? ఇప్పుడు ఉన్నాయా? అన్న సందేహం కలిగింది. తరచి నా జీవితానుభవాన్ని చూస్తే "అలా మన చదువులు లేవేమో!" అనిపించింది.


నన్నయ,తిక్కన పద్యాలు భట్టీయం వెయ్యలేక, వేమన మీదా,ఉపవాచకం మీదా ప్రేమ ఉన్నా... తెలుగుకు ఆమడదూరం పరుగెట్టజూసిన నా బాల్యం గుర్తుకొచ్చింది. ఆరవతరగతి తరువాత, లెక్కల్లో ఫార్ములాలను బెత్తం చూపి మరీ ‘పిడిబట్టించిన’ మా మాస్టారు పుణ్యమా అని ఇప్పటివరకూ లెక్కలకు దూరంగా వెళ్ళాలన్న నా పరుగు ఆగలేదు. సైన్సు కాస్త సులభంగా ఉన్నప్పటికీ ఎనిమిదోతరగతి బౌతికశాస్త్రం లో మళ్ళో ఫార్ములాల గొడవతో నా విజ్ఞానశాస్త్రం కాస్తా అటకెక్కేసిన వైనం ఇప్పటికీ బాగా గుర్తే. సోషియల్లో మనం తెగ విజృంభించినా, హిస్టరీలో తారీఖులు గుర్తుపెట్టుకోవడం లో బోల్తాకొట్టడం గొడ్డలిపెట్టే. ఇక ఇంగ్లీషంటారా, ‘రెన్ & మార్టిన్’ ను ఆంగ్లభాషా వ్యాకరణానికి బైబిలు గా గౌరవించి, భాష నేర్పకుండా గ్రామరు రూల్స్ మాత్రం చక్కగా వల్లెవేయించిన ‘సార్’ ఒకడు తగిలాడు; నా ఆంగ్లపాండిత్యానికి గండి కొట్టడానికి. ఇలా అనుమానమొస్తే అడక్కుండా, ప్రశ్న ఉదయిస్తే దాన్ని మనసులోనే అస్తమింపజేసి, పదవతరగతి వరకూ ‘నోరు మూసుకునే’ చదివేసా.


ఇంతటి భారీ పునాది కలిగిన నాకు, ఆ తరువాతి క్లాసుల్లొ ప్రశ్నించడం నేర్పబట్టీ, సాహిత్యాన్ని చదవబట్టీ కాస్తోకూస్తో స్వతంత్రంగా, సమాజం కోసం కాకపోయినా కనీసం నా కోసం నేను ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. ఒక సమస్య వస్తే ఫార్ములాని గుర్తుచేసుకోకుండా, దాన్ని అక్కడున్న పరిస్థితులను బట్టి స్వతంత్రంగా అర్థం చేసుకుని సమాధాన పరిచే ప్రయత్నాన్ని కాస్తైనా చేయగలుగుతున్నానని ఓ ఫీలింగ్.


అందుకే మన చదువులు కంఠతాపట్టి, ఏదో ఒక డిగ్రీ చేతబట్టి, ఉద్యోగం గుడ్డిగా వెలగబెట్టడానికి తప్ప వ్యక్తిగా ఈ సమాజానికీ, దేశానికీ ఉపయోగపడేలా ఉండటం లేదు అనే నీరసమైన నమ్మకం వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. డాక్టర్ శామ్ అన్నట్టు, భారతదేశం చాలా ప్రత్యేకమైనది...ఈ ప్రత్యేకమైన దేశానికి ఉపయోగపడే చదువులు మనం చదివామా? ప్రస్తుతం ఉన్న తరం చదువుతోందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

-------------------------

13 comments:

Aditya said...

భలే చెప్పారు!! నిజమే :)
రాస్తూ ఉండండి! మీ బ్లాగ్ కి నేను లింక్ పెట్టవచ్చా?
ఆదిత్య
www.gambholajamba.blogspot.com

Anonymous said...

" భారతదేశం చాలా ప్రత్యేకమైనది...ఈ ప్రత్యేకమైన దేశానికి ఉపయోగపడే చదువులు మనం చదివామా? ప్రస్తుతం ఉన్న తరం చదువుతోందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

ఏమిటండి మీ విలువలు?
డబ్బు సంపాదిస్తున్నాము.
ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు.
కష్టపడితే ఇస్తారు.
కష్టపడుతున్నాము.
ఖర్చు పెట్టుకుంటున్నాము.
ఖర్చు పెడుతున్నాము.
జన్మభూమికి ఇస్తున్నాము.
విరాళాలు ఇస్తున్నాము.
చందాలు ఇస్తున్నాము.
తల్లి తండ్రులని ఓల్డ్ ఏజ్ హోంస్‌లో చేర్పించి జాగ్రత్తగా చూసుకుంటున్నాము.
మంచి కట్నాలు ఇచ్చి అక్కయ్యకి, తమ్ముడికి పెళ్ళి చేస్తున్నాము.
కజిన్స్ స్కూల్స్ / కాలేజ్ ఫీజులు కడుతున్నాము.
మా పిల్లలకు చక్కటి ఏ సీ వాతవరణం ఉన్న స్కూల్స్‌లో సీట్లు సంపాదించి చక్కటి చదువు నేర్పిస్తున్నాము.
వాళ్ళకి విపరీతమైన పోటితత్వం నెలకొని ఉన్న ఈ ప్రస్తుత సమాజంలో కావల్సిన మానసిక వికాసానికి కావలిసిన వాతవరణంలో జీవనాన్ని నేర్పిస్తున్నాము.
ఇంతకంటే ఏం కావాలి?

Kathi Mahesh Kumar said...

@నెటిజన్, బహుశా నేను పెద్ద సమస్యని నా పర్సనల్ కోణంలోంచీ చర్చించేసరికీ మీరు కాస్త తికమక పడ్డట్టున్నారు.నేనన్న సమస్యలు వ్యక్తిగతంగా మనకు పనికొచ్చె చదువుల గురించి కాదు. మన చదువులు మనకు ఖచ్చితంగా కూడూ,గుడ్డా ఇచ్చి ట్యాక్సు కట్టనిచ్చి దేశానికి పనికొస్తున్నాయి. ఇక దేశానికి ‘కావల్సిన చదువు’లకీ, దేశాన్ని ‘ఉద్దరించడానికి కావల్సిన చదువు’కీ తేడా ఉంది.

అసలు నేను సజెస్ట్ చేసింది, nation bulding కు కావలసిన చదువులు. భారతీయ పరిస్థితులకి (ప్రజల కనుగుణంగా) అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు,నిర్మాణాలూ డిజైన్ చేసే చదువులు...ఇలా.

@ఆదిత్య ధన్యవాదాలు. నా బ్లాగుకి దర్జాగా లింకి పెట్టుకోండి.

Anil Dasari said...

మీరన్నది అక్షరాలా నిజం. మన చదువుల పద్ధతి మారాలి. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలూ వచ్చాక ఇవి ఇంకా ఘోరంగా తయారయ్యాయి. విద్యార్ధుల్ని ఉత్పత్తి చేసే కార్ఖానాలవి. తల్లిదండ్రులకి కూడా ఎంతకీ పిల్లల ర్యాంకులు, మార్కుల పర్సెంటేజీల మీదనే కానీ వాళ్లు నిజంగా ఏమి నేర్చుకుంటున్నారనేదాని మీద ఆసక్తి ఉండటం లేదు. చాలా సందర్భాల్లో వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో చదువుకునేవాళ్లకే కాదు, అది చెప్పేవాళ్లకూ తెలియదు.

Purnima said...

మన చదువులు బ్రతకడానికి ఉపయోగపడతాయేమో గాని, జీవించటానికి కాదు!! ఇది జగమెరిగిన సత్యం.. సాక్ష్యాలు మనముందటే ఉన్నాయి. ఒక సారి ఒక సమావేశంలో ఓ స్కూల్ అమ్మాయి.. ఏ.పి.జే. కలాం గారిని "భారతాభివృద్ధికి చదువు చాలా ముఖ్యం అంటున్నారు.. కానీ చదువుకున్న ఆఫీసర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు .. వీళ్ళే కదా అవినీతి చేసేది" అని అడిగింది. అప్పుడు వచ్చిన సమాధానం "It's not about education, it is about quality of education, education with morals" అని చెప్పారు. మనకు కావాల్సిందది.

ఓ మంచి విషయాన్ని ఎన్నుకున్నందుకు నా అభినందనలు!!

Anonymous said...

మీరు చెప్పినది నిజమే. మనకి చిన్నప్పటినుంచి ఇంట్లోనూ, బడిలోను ఏది సాధించలేకపోయినా అందరు చులకనగా చూడటం తో 'ఫైలుర్' నుంచి నేర్చుకోవడం బదులు 'ఫైల్యూర్' అంటే సిగ్గు/భయం అలవాటు అవుతాయి. 'ఫెయిల్' అవ్వడానికి సిద్ధపడకపోవడమేనేమో మన అసలు 'ప్రాబ్లం'?

Indian Minerva said...

మీతో నేనే మాత్రం ఏకీభవించను. దేశం సంగతి దేవుడెరుగు మన చదువులు మనక్కూడా పనికిరానివైపోయాయి :-). ఈ విషయం ఏ graduate ని అడిగినా తెలిసిపోతుంది. ఈ విషయం మీద త్వరలో ఒక టపా రాద్దామనుకుంటున్నాను కూడా. నానా చెత్త subjectలు చదివి డిగ్రీ పాసవుతామా వుద్యోగం రావడానికి మళ్ళీ చదవాలి. వుద్యొగం వచ్చాక అప్పటి దాకా చదివిందంతా వృధా అనితెలుసుకున్నాక నేను పడ్డ బాధ బాధకాదు మాష్టారూ.. వుద్యొగం వదిలేసి సముపార్జించిన "విజ్ఞానాన్ని" సద్వినియోగం చేయడానికి lecturer గా అవతారం యెత్తుదామను కొన్నాను. అదేం ఖర్మో గానీ Bacheler degree చదువుల్లో కూడా general awareness పేరుతో చెత్తంతా చదువుతాం.

Sankar said...

మీరు చెప్పిన Dr.Sam లాంటి వాళ్ళు అలా ఇతర దేశాలపైనా కామెంటడానికే కానీ సొంతవాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేరు. మన India గురించి ఈ western హిస్టరీ booksలో చ దివేసి వీళ్ళే దో ప్రపంచోధారకుల్లా మనకు సలహాలు ఇస్తారు కాని, వాళ్ళ దేశాల్లో యువత ఎం దుకు ఇంత అస్తవ్యస్తంగా, భా ద్యతా రహితంగా ఉంటుం దో అర్ధం చేసుకోలేరు, పరిష్కరించుకోనూలేరు. ఇంక వాళ్ళ చ దువుల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంతమంచి ది. ఏ దో మిడిమిడి జ్ఞానంతో పట్టాలు పుచ్చుకొని కాలం వెళ్ళబుచ్చుతారు. వ్యక్తిత్వ వికాశం విషయానికి వస్తే మనమే చాలా better. మనకు పుస్తకాల్లో కంటే జీవితాల్లోనే ఎక్కువ పాఠాలు నేర్చుకునే అవకాసం ఉం ది. అన్నీ అనువుగా సాగిపోయే వీళ్ళ జీవితాల్లో ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేని అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తుం ది. అం దుకే మన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా ఏ కంప్లైంటులూ చెప్పకుండా నెగ్గుకొస్తున్నారు. ఇలాంటి(Samలు) ఎక్కడికి వెళ్ళినా ఇమడలేక ఏ దోకటి ఎత్తి చూపుతున్నారు. indiaలో బ్రతకగలిగినవడు ప్రపంచంలో ఏమూలైనా బ్రతికేస్తాడు. మన చ దువుల గొప్ప దనం తెలుసు గనుకనే అన్ని రంగాల్లో ప్రధాన పాత్ర భారతీయుల సొంతం చేస్తున్నారు. ఇక మన చువుల గురించి మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించలేకున్నా. ఇవి అవసరమైనవి ఇవి అనవసరమైనవి అని నిర్ధారించడానికి లేదు కాబట్టే అందరికి కామన్‌గా 10th క్లాస్ వరకు ఒకే విధమైన విద్యనిచ్చి ఆ తర్వాత ఇష్టమొచ్చిన ఫీల్డు ఎంచుకొనే అవకాశాన్ని కల్పించారు మన systemలో . అందరూ మన education systemలో లోపాలున్నయంటారే కానీ అవేంటొ, ఎందుకో బలమైనా కారణాలు చెప్పరు, సరైన పరిష్కారాల్ని సూచించరు.

Kathi Mahesh Kumar said...

@శంకర్, Dr.Sam ఈ కామెంటు మేమడిగితేనే చెప్పాడు. అదీ ఇక్కడ మూడేళ్ళు ప్రభుత్వంతో పనిచేసిన (off the hat కాదు) తరువాత.ఈ మూడు సంవత్సరాలలో ఇతను చాలామంది IAS అధికారులతో, ఇంజనీర్లతో పనిచేసి వాళ్ళలో చాలామంది చదివిన చదువులు ప్రజల (UNICEF పిల్లలతో పనిచేస్తుంది)సమస్యలు తీర్చే జ్ఞానాన్ని ఇవ్వలేదనే గ్రహించి, ఈ మాటన్నాడు.

మనలో చాలా మంది చదువులు జ్ఞాపకశక్తికి ఉపయోగపడేవో,గుమస్తా ఉద్యోగానికో,మరీ ఎక్కువైతే సాప్ట్ వేర్ ఉద్యోగానికో పనికొస్తున్నాయేగానీ, నిజంగా జీవిత, దేశ సమస్యలు తిర్చడానికి పనికొస్తున్నాయంటారా?

ఇక యూనివర్సిటీల్లొ చేసే పరిశోధనల సంగతి దేవుడికే ఎరుక. "తీసి తీసి రాస్తే థీసీస్" అన్నట్టుగా, 100 పుస్తకాలు వెదకి వాటిలోని ఆలోచనల్ని కుప్పపోసి డాక్టరేట్ ఐపోతున్నారే గానీ, నిజంగా మన సమాజానికి పనికివచ్చే పరిశోఢనలు చేస్తున్నారా?

నేను పైన చెప్పిన విధంగా కాక నిజంగా ‘జ్ఞానాన్ని’ సంపాదింస్తున్న వాళ్ళు కొందరు ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ మెజారిటీ చదువులు ఇలాగే తగలడ్డాయి. కాదని చెప్పగలరా?

Sankar said...

'మెజారిటీ చువులు ఇలాగే తగలడ్డాయి' అన్నది మనకు మాత్రమే వర్తించదనేదే నే చెప్పేది (ఇది అన్ని దేశాలకు కామనే). నేనేదో మనం అత్యుత్తమ విద్యావిధానాన్ని కలిగున్నామని అనడంలేదు. కానీ ఎందుకు పనికిరానిదైతే కాని కాదని చెప్పగలను. ఇక్కడ యూనివెర్సిటీలలో demonstration చెసేప్పుడు తెలుస్తుంది మనకు నిర్భంధంగానైనా ఎంత మంచి education దొరికిందనేది.
'ఈ మూడు సంవత్సరాలలో ఇతను చాలామంది IAS అధికారులతో, ఇంజనీర్లతో పనిచేసి వాళ్ళలో చాలామంది చదివిన చదువులు ప్రజల (UNICEF పిల్లలతో పనిచేస్తుంది)సమస్యలు తీర్చే జ్ఞానాన్ని ఇవ్వలేదనే గ్రహించి, ఈ మాటన్నాడు.'
మరి మూడేళ్ళలో ఆయన ఎంత చేశారనేది ఇక్కడ ప్రశ్న. ఈలాంటివాటికి ఖచ్చితమైన కొలమానాలాతో కొలిచి చెప్పగలిగే జవాబులుంటాయని నేనకోవడం లేదు. ఇక్కడ నా ఉద్దేశ్యం Dr.Sam గారిని తప్పుబట్తడం కాదు. ఇలా వేరేవాళ్ల లోపాల్ని ఎత్తిచూపేవాళ్ళని ఇదే పరిస్ధితిలో వాళ్ళైతే ఏం చేస్తారో తెలుసుకోవాలనుకోవడమే. ఇది తప్పు , ఇది కరెక్ట్ అని ఏమీ ఉండవని నా అభిప్రాయం. సమస్యను అందరూ ఎత్తిచూపొచ్చు, ఎందుకంటే అది ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి. అందులో గొప్పేముంది. కానీ దాని పరిష్కారం చెప్పేవాడే గొప్పవాడౌతాడు.
' మనలో చాలా మంది చదువులు జ్ఞాపకశక్తికి ఉపయోగపడేవో,గుమస్తా ఉద్యోగానికో,మరీ ఎక్కువైతే సాప్ట్ వేర్ ఉద్యోగానికో పనికొస్తున్నాయేగానీ, నిజంగా జీవిత, దేశ సమస్యలు తిర్చడానికి పనికొస్తున్నాయంటారా?'
మనకే కాదు ఎక్కడా కూడా అందరూ దేశోద్ధారకులే వుండరు.మీరే చెప్పినట్టు మన చదువులు సొంతకాళ్ళ మీద నిలబడ్డానికి తద్వారా జీవిత పరమార్ధమైన ఆనందాన్ని(ఇదీ మీరు చెప్పిందే వేరే పోస్టులో :)) పొందడానికీ ఉపయేగపడితే చాలనుకుంటా. ఎందుకంటే దేశమంటే మనుషులు, దేశ సమస్యలు అంటే మనుషుల సమస్యలు కాబట్టీ.

Kathi Mahesh Kumar said...

@శంకర్, దేశ సమస్యలంటె (మనలాంటి urban educated,wlll to do యొక్క బ్రతుకుదెరువు) మనుషుల సమస్యలు అని చాలా తేలిగ్గా ముగించారు.

నేను చెబుతున్న(UNICEF పోరాడుతున్న) సమస్యలు పోషణలేక మరణిస్తున్న పిల్లలవి, పరిశుద్దమైన త్రాగునీరు దొరకక,పారిశుధ్య వాతావరణం లేక రోగం బారిన పడి అల్లాడుతూనో,ప్రాణాలు విడుస్తూనో ఉన్న ఒక మారుమూల గ్రామస్తుడివి. సమయానికి ఆరొగ్యకేంద్రంలో డాక్టర్ అందుబాటులొ లేక ప్రసవిస్తూ మరణిస్తున్న తల్లివి.

ఈ సమస్యలను తీర్చడానికి భారతీయ పరిస్థితులకి అనుగుణంగా కొన్ని విధానపరమైన Institutional Delivary Mechanisms కల్పించడానికి ఉపయోగకరమైన చదువు కావాలి...ఉన్న చదువుతో చాలామంది వీటికి మానవీయ సమాధానాలు అందించ లేకపోతున్నారు. ఇదీ ఇక్కడ సమస్య.

బహుశా నేను sweeping generalisation చెయ్యటం వలన మీకు నా బాధ వేరేగా అర్థమైందనుకుంటా!

Sankar said...

నిజమే నేను అర్ధం చేసుకున్నది వేరు. మీరు చెబుతోంది వేరు. మీరు చెప్పే సమస్యలకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి సంబంధాన్ని నేను అర్ధం చేసుకోలెకున్నాను. ఈ సమస్యలు తీరడానికి కావలసింది చదువు కాదు, ఎదుటివారి బాధను తమదిగా భావించి వాళ్ళను ఆదుకొనే హృదయాలు. అవి చదువువల్ల వచ్చేవికావని నా అభిప్రాయం. ఒకవేళ మీరన్నట్టు అలాంటి ఒక కోర్స్ పెట్టిన ఇప్పటిలానే చాలామంది examsకి ముందు ముక్కున పెట్టుకు వెళ్ళి చీదేసి వస్తారే కానీ ఏవిధమైనా impact ఉండదు. నలుగురు బాగూ కోరే వాళ్ళకి ఈ కోర్స్‌తో పనే లేదనుకోండి. మాటలతోనో , పుస్తకాల్లోని పాఠాలతోనో మార్పు రాదు, కేవలం చేతల వల్లే. చలం అన్నట్టు ' ఎంతో మంది సంగసంస్కర్తలు ఎన్నో ఉపన్యాసాలతో సాధించలేనిది వీరేశలింగం ఒక్క వితంతు వివాహంతో సాధించాడు '.

durgeswara said...

ప్రాచీనభారతీయ విద్యను కోల్పోయినమనం మీ ఆవేదనకు అసలు కారణాన్ని ,గుర్థించలేక,పరిష్కారం కనుగొనలేక సతమత మవుతున్నాము. ప్రాచీన విద్య అంటే 200 సంవత్సరాలుగా మనమేమీ తెలియని నమ్మకాన్ని మూఢులమనే భావాన్నిమన మెదడూలలో స్తిర పరచడానికి తయారు చేయబడ్డ చరిత్రలోదికాదు. జగద్గురువుగా ప్రసిధ్ధికెక్కిన అసలు సిసలు భారతీయ సంపద .అదికోల్పోయే ఒకనాడు. ఆదేశములో 33 కోట్లమంది దేవతలున్నారని ఇతరులు చెప్పుకునేలా చేసిన విద్య.అదిమరచిపోయామనే మహాత్ములంతా నెత్తీనోరూ బాదుకుని చేప్పినది. యుగప్రభావం. మంచి మనచెవిదగ్గరకు చేరేలోగా ,చెడు చెవిలోదూరి తిష్టవేస్తున్నది మన మనస్సును సత్యంవైపుకు మల్లకుండా చేయగలుగుతున్నది.