Friday, June 27, 2008

వావివరసల్లో ఆర్థిక మర్మాలు !?!

ఈ మధ్య నేను రాసిన ‘ఖుదా కేలియే’ అనే ఒక పాకిస్థానీ చిత్ర సమీక్షకు వచ్చిన ఒక స్పందనలో , ఆ చిత్రంలో సర్మద్ అనే పాత్ర తన బాబాయ్ కూతుర్ని బలవంతంగా పెళ్ళిచేసుకోవడం లోని ఔచిత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ విమర్శ ‘బలవంతపు పెళ్ళి’ మీద అయ్యుంటే అసలు సమస్య వచ్చుండేది కాదు. కానీ తన అభ్యంతరం, "వావివరసలు లేని" ఆ పెళ్ళి మీద. తను "ఇండియాలో ఎక్కడా ఎవరూ బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోరు" అని చాలా సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు నా బుర్రకు కాస్త పని కల్గింది."నిజమేనా?" అని నన్నునేను ప్రశ్నించుకుని, జవాబు తెలియక నా ముస్లిం మిత్రుడ్నడిగాను. దానికి అతను "అవును మీ తెలుగోళ్ళలో మేనత్త కూతుర్ని చేసుకున్నట్లే, మా వాళ్ళలో బాబాయ్ కూతుర్ని చేసుకోవచ్చు" అన్నాడు. ఈ ఒక్క వాక్యం లో నాకు కొన్ని మర్మాలు తెలిసినట్టైంది. ఆ మర్మాల్ని కాస్త ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ చెప్పే మర్మాలకి ఏవిధమైన సోషియాలజికల్, ఆంత్రపాలాజికల్ లేక మరే విధమైన సైంటిఫిక్ ఆధారాలు నా దగ్గరలేవు, ఒక్క నా మెట్ట లాజిక్ తప్ప.మనం వావివరసలకు చాలా ఖచ్చితమైన విలువల్ని ఆపాదిస్తాం. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల వారిలో అక్క, మేనత్త లేక మేనమామ పిల్లల్ని దర్జాగా పెళ్ళి చేసుకోవచ్చు. అదే మన భాషలో "వరస". ఇక బావా-మరదళ్ళ సరసాలమీద పుంఖాలు పుంఖాలుగా సాహిత్యం , సినిమాలూ మన సంస్కృతిలో ఒక అవిభాజ్య అంగం. పెళ్ళిళ్ళలో , ఫంక్షన్లలో సంబంధాలూ, వరసల చర్చలు లేకుంటే ఆ సంబరాలు చప్పగున్నట్లే లెక్క.
కానీ, ఈ మాటే ఎవరైనా భారతదేశం బయటున్నవారికి చెబితే దీన్ని "ఇన్సెస్ట్"(incest) అంటారు. "ఛివుక్కు మంటుంది కదూ?" పాశ్చ్యాత్య ధోరణుల్ని అంతగా నిరశించే మనల్ని , ఈ విషయం లో వీరు ఖచ్చితంగా తప్పుపట్టచ్చన్నమాట. ‘కజిన్స్’ మధ్య సంబంధాలు వీరికి ఏమాత్రం అంగీకారం కాదు. అంత దూరం ఎందుకు, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సంబంధాలు అంగీకారం కాదు. వీరైతే ఒకడుగు ముందుకేసి ఒకే గోత్రనామం ఉన్నా లేక ఒకే ఊరివాళ్ళైతే వారిని సోదర సమానులుగా భావిస్తారు. ఈ మధ్య కాలంలో హర్యానా లో జరిగిన honor killings ఈ కోవకే చెందినవి. ఇక ముస్లిం సముదాయంలో మనం ‘తప్పు’ అనుకునే బాబాయ్ కూతుర్ని మనవాళ్ళు మేనమామ కూతుర్ని చేసుకున్నంత తేలికగా పెళ్ళి చేసుకుంటారు. అంటే విలువల విషయంలో మనం absolute అని మాట్లాడే విషయాలు, చాలావరకూ సముదాయాన్నీ, సంస్కృతినీ బట్టి చాలా relative అన్నమాట.కానీ, ఈ "విపరీతాలకు" కొన్ని సామాజిక, ఆర్థిక కారణాలు ఖచ్చితంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సామాజికంగా పితృస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసి, ఆధిపత్యాన్ని రక్షించడానికి ఇది జరిగిఉంటుందని బహుశా ఫెమినిస్టులు ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇది వారి స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి, దాన్ని వారికే వదిలేస్తాను. ఇక నాకు అనిపించిన ఆర్థిక కారణాల్ని కాస్త చూద్దాం.


మన తెలుగు జీవితాలలో విలువలు రెండు రకాల మనుషులు నిర్ణయించేవారు. ఒకటి వేదాలు తెలిసిన బ్రాహ్మణులు, రెండు భూమి చేతుల్లో ఉండే భూస్వాములు. ఈ ఇద్దరికీ మేనరికాల వల్ల చాలా ఆర్థికస్వామిత్వం లభించిందని నా ఫీలింగ్. మొదటిగా బ్రాహ్మణుల్ని తీసుకుంటే, వీరు ఆలయ అర్చకత్వం మరియూ మాన్యాల మీద వచ్చే ఆదాయంపై తమ భుక్తికి ఆధారపడి బ్రతికారు. ఇలాంటి limited resource గనక మళ్ళీ మళ్ళీ విభజింపబడితే, గొడవలు తప్ప గౌరవప్రదమైన జీవితాలు జీవించగలిగేవాళ్ళూ కాదు. అందుకనే ఒక via medium ని చాలా convenient గా సృష్టించి ఉండొచ్చు. అవే, మేనరికాలు.కాకపోతే ఈ inbreeding కి కొంత logic కావాలి కాబట్టి, వాటి చుట్టూ కొన్ని విలుల్ని ఏర్పరిచారు. బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోకూడదు, ఎందుకంటే ఒకే ఇంటి పేరు కాబట్టి. అదే మేనత్త కూతుర్ని చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటిపేరు మారొచ్చింది కాబట్టి, లాంటివి. ఇంకా చిత్రం ఏమిటంటే, అన్నకూతుర్ని పెళ్ళిచేసుకోవడం ‘పాపం’, కానీ అదే అక్క కూతురితో రొమాన్స్ ‘ఆదర్శప్రాయం’. ఇలా అన్నమాట. అప్పట్లో కొన్ని కుటుంబాల మధ్యనే వివాహ సంబంధాలు ఉండేవి. మహా అయితే ఇటుపక్కూరో, అటుపక్కూర్లోనో ఉన్న వారితో పెళ్ళిసంబంధాలు నెరిపేవాళ్ళు. అంటే కొన్ని తరాలు ఇదే చక్రంలో, ఒకే ఆలయం మీదా దాని మాన్యం మీద బతికేసారన్నమాట.


ఇక భూస్వాముల ఇళ్ళలో చూస్తే, ఇవి ఇంకా చాలా నిబద్దతగా జరిగేవనడానికి మనలో చాలా మందికి ఆధారాలు తెలుసు. ఆస్తి బయటకు వెళ్ళకూడదు కాబట్టి బలవంతపు పెళ్ళిల్లు చెయ్యడంలో కూడా వీరు చాలా సిద్దహస్తులు. ఇలాంటి సంబంధాలు ఈడూ-జోడూ, ఒడ్డూ-పొడవూ, వయసూ -వంకాయతో సంబంధం లేకుండా తెగించిన సంస్కృతి వీళ్ళకి సొంతం. ఇదంతా ఎందుకూ? భూమికోసం ! చాలా విలువైన commodity ఇది, గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునే మహత్తర మార్గమిది. ఇక వీటికి విలువలూ, ఆదర్శాలూ, అవసరమైన రొమాన్సూ అద్దకుండా ఉంటారా? అదే జరిగింది. అందుకే అబ్బాయిలకు "మరదలు", అమ్మాయిల "బావ" అనగానే మనసులో జిల్ జిల్ జిగా.ప్రస్తుత కాలంలో, చాలావరకూ డాక్టర్లు కూడా మేనరికాలు వద్దని చెప్పడమో లేక మన జీవన పరిధులు పెరిగి బయటి సంబంధాలు (చాలా వరకూ ఒకే కులంలో) విరివిగా చేసుకుంటున్నాం. కానీ మన సామాజిక design న్ని మాత్రం సత్యం అనుకునే ఆలోచన చాలా మందిలో ఉంది. ఇంతకీ ఇంత మెట్ట లాజిక్ తియ్యడంలో ఉద్ద్యేశం ఏంటంటే, మన సంస్కృతిలోని విలువల్ని మాత్రమే జీవన సత్యాలని, మిగతా వారి సామాజిక జీవనాన్ని, పద్దతుల్ని చిన్నచూపుచూడడమో లేక అది తప్పు అనడం ఎంతవరకూ సమంజసం అని నాకు అనిపించడం. అందుకే ఎవరైనా మన తీరులకి భిన్నంగా ప్రవర్తిస్తే, మన విలువల్ని బట్టి value judgment ఇచ్చెయ్యక, కాస్త ఆలోచిద్దాం.

14 comments:

బొల్లోజు బాబా said...

మంచి భావాలు వలకపోసారు.

దగ్గర సంభందాలు చేసుకోవటంలో, పూర్తిగా ఆర్ధిక సంభందాలెకాక, కొన్ని ఆర్ధ్ర భంధాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు: మనవాడే చితికిపోయాడు వాళ్లమ్మాయిని కోడలుగా తెచ్చుకుందాం, మనింటి మనిషి భర్త చనిపోయి కష్టపడుతుంది సంభందం కలుపుకోవటం ధ్వారా పైకిలేపుదాం, వంటివి.

మీరుదహరించిన బ్రాహ్మణులలో మేనరికాలు, గుడిపెత్తనానికి గొప్ప ఉదాహరణ రామేశ్వరం.

రామేశ్వరం గుడిలో పూజారులు గుడిపెత్తనం పోకూడదని దగ్గర సంభందాలు కొన్ని పదుల తరాలుగా చేసుకుపోవటం వల్ల, ప్రస్తుత తరం అనేక జన్యుపరమైన అవలక్షణాలతో భాధపడుతున్నారన్న విషయాన్ని డాబ్జాంస్కీ అనే బయాలజిష్టు గుర్తించాడు. అప్పటినుంచి, మేనరికాలు/దగ్గరిసంభందాల వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయానికి, ఇదొక టైప్ స్టడీ గా మిగిలింది.

మన సంస్కృతిలోని విలువల్ని మాత్రమే జీవన సత్యాలని, మిగతా వారి సామాజిక జీవనాన్ని, పద్దతుల్ని చిన్నచూపుచూడటం ముమ్మాటికీ తప్పే. నేను మీ భావాలతో సంపూర్ణంగా ఏకీ భవిస్తున్నాను.


అందుకనే నాకొక్క సారి "అంతే అంతే" అనుకుంటూ బతికేయటం చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. . (ఈ విషయం గురించి కాదండోయ్ - నా చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కోసారి వెలిబుచ్చే విశ్వాసాలు, నమ్మకాల గురించి. ఒక్కోసారి అవి మూఢనమ్మకాలని తెలిసినా సరే)

బొల్లోజు బాబా

చైతన్య క్రిష్ణ పాటూరు said...

పై కారణాలే కాక, కొంత మనవారన్న భరోసాతో కూడా మేనరికాలు ప్రిఫర్ చేస్తారనుకుంటా. బయటి పిల్ల కోడలుగా వస్తే సరిగ్గా చూస్తుందో లేదో, అదే బంధువుల్లో అమ్మాయైతే, చిన్నప్పట్నుంచి చూస్తున్నామన్న భరోసా. అలాగే పిల్లనిచ్చే వాళ్ళకి కూడా కొత్త చోటైతే మన పిల్లని సరిగ్గా చూసుకుంటారో లేదో అని భయం వుంటుంది. అదే సొంతవాళ్ళ ఇళ్ళల్లో ఐతే, గొప్పగా కాకపోయినా మరీ అంత చెడ్డగా చూడరని నమ్మకం వుంటుంది.

అబ్రకదబ్ర said...

తెలుగు వాళ్లలో (తమిళులలో కూడా) ఒక సంప్రదాయం ఉంది. ఒకమ్మాయికి ఈడు, జోడు కుదిరితే మేనమామని, లేకపోతే ఆయన కొడుకుని ఇచ్చి పెళ్లి చేసే పద్ధతి! ఇదెంత రోతగా ఉందో చూడండి.

రాధిక said...

ఆస్తులు బయటకుపోకుండా లోపల లోపల పెళ్ళిళ్ళు ఇప్పటీ జరుగుతున్నాయి పల్లెటూళ్ళలో.మీలాజిక్కులు కొంత రీజనబుల్ గానే వున్నాయి.

వేణూ శ్రీకాంత్ said...

మంచి అనాలసిస్ మహేష్. మేనరికాలకి ఆర్ధిక కారణాలే కాకుండా బాబా గారు, చైతన్య గారు చెప్పిన కారణాలని కూడా కాదనలేం. అమెరికా లో కూడా పాత రోజులలో cousin marriages ఉండేవి అని విన్నాను I guess slowly as they realized the genetically complicated issues with it they dropped, which is what even Indians are doing now. ఒకప్పటితో పోలిస్తే ఇండియా లో ఇప్పుడు ఈ తరహా పెళ్ళిళ్ళు తక్కువే అనుకుంటున్నాను.

సుజాత said...

పై కామెంట్లన్నీ నిజంగానే అనిపిస్తున్నాయి. 'కుదిరితే మేనమామ, లేదంటే వాడి కొడుకు..' ఈ పద్ధతి చండాలంగా ఉంది. రాధిక గారు చెప్పినట్టు ఆస్తులు బయటికి పోకుండా ఉండాలని చేసే పెళ్ళిళ్ళు బోలెడు. (చంద్ర బాబు కొడుకు పెళ్ళి ఈ కోవలోదేనా? )బ్రాహ్మల పెళ్ళిళ్ల గురించి రాయాలంటే..ఒక పెద్ద టపా రాయొచ్చు కానీ రిస్కు!

పెదరాయ్డు said...

మన సాంప్రదాయాలను చిన్న చూపు చూడటం ద్వారా ప్రత్యేకతను ప్రదర్శించటం భారతీయులకు ప్రత్యేకించి ఆంధ్రులకు ఒక దురలవాటు.

అక్క కూతురితొ వరస కలపటం కాస్త మొరటుగా వున్నా, దానికి ఆర్థిక ప్రయోజనాలే ప్రాతిపదికగా చూపటం అన్యాయం. ఆర్థిక ప్రయొజనాలకే ప్రాముఖ్యం వుండి వుంటే పితృస్వామ్య వ్యవస్థలో అన్న కూతురు కూడా సులభ ఆమోదమే.

తరచి చూస్తే అనాదిగా భారతీయులు(హిందువులు అంటే నేను మత ఛాంధసుణ్ణని తీర్మానించేస్తారు) సామాజిక ప్రయోజనాలకు మానవ సంభంధాలకు ఇచ్చిన ప్రాధాన్యం ఎనలేనిది. కొంతమంది ఉన్మత్తులు/బలవంతులు మన విలువలను వికృతంగ వినియోగించి వాటి నిజ ప్రయోజనాలను దుర్వినియోగం చేసారు. పర సంస్కృతుల పిడలొ మరిన్ని విలువలను కొల్పోయాం. కాలక్రమంలో క్షీణించిన విలువలే స్థిరపడి పోయాయి.

దురదృష్ఠవశాత్తు ప్రశ్నించటాన్ని పాపంగా సూత్రీకరించటమే మన సంప్రదాయంలోని అతి పెద్ద లోపం. అర్థం తెలియక కొన్ని సంప్రదాయలను పాటించటం వల్ల కాలక్రమాన నిజాలు మరుగున పడి కొన్ని దుస్సంప్రదాయాలు స్థిరపడ్దాయి.

కాస్త సమయం వెచ్చించి ఆవేశ పడకుండా వివేచనతో శోధిస్థే మన వ్యవస్థకు పునఃర్వైభవం వస్తుంది.

గమనిక: వ్యక్తిగతంగా మిమ్మల్ని ధూషించటం నా అభిమతం కాదు.

Anonymous said...

మనకు కనిపిస్తున్న వర్తమాన సమాజాన్ని బట్టి గతకాలంలో కూడా ఇలాగే ఉండేదనుకోవడం సరైన విశ్లేషణ కాదు. కనిపిస్తున్నదీ, కనిపించేదానికి మూలమైనదీ ఎల్లప్పుడూ వేఱువేఱు స్వరూపాల్లో ఉంటాయి. అలాగే ఒక ఆచారం అది ఉద్దేశించబడ్డ అసలు ప్రయోజనాన్ని కాకుండా కాలక్రమంలో ఇంకేదో అనూహ్యమైన ప్రయోజనాన్ని నెఱవేఱుస్తూ ఉంటుంది, మన ఎన్నికల్లాగా. కొందఱు మేనఱికాల్ని ఆర్థికప్రయోజనాలకు వాడుకోవడం ఈ కోవలోకి వస్తుంది. దానర్థం అవి మౌలికంగా ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్దేశించబడ్డవని కాదు.


అత్యంత ప్రాచీనకాలంలో వావివరుసల పట్టింపు చాలా సకృత్తు (అరుదు). దానికి మొదట్లో ఆర్థిక కారణాలు లేవు. అసలు కారణం - జనాభా పెద్దగా లేకపోవడం. వైద్యసదుపాయం లేకపోవడంతో ఉన్న జనాభా కూడా తఱచుగా మృత్యువాత పడుతూండడం. మనుషులకు తమ సమాజం, తమ గ్రామం కాక ఇంకేదీ తెలియకపోవడం. రవాణా సౌకర్యాలు లేకపోవడం. అందువల్ల దగ్గరి సంబంధాలే చేసుకోవడం.


ఇంకొకటి- ఆచారాల్ని బ్రాహ్మలు గానీ మఱొకరు గానీ ఎవరూ పనిగట్టుకుని ఏర్పఱచరు. వాటంతటవే ఏర్పడతాయి. మేనఱికమైనా అంతే ! సమాజంలో ఆచార్యస్థానంలో ఉన్నప్పటికీ బ్రాహ్మణుడు సమాజానికి అతీతుడు కాడు. తాను జీవించే సమాజం ఎలా ఉంటుందో అతడు కూడా అలాగే ఉంటాడు. అందుచేత బ్రాహ్మణకులం మన దేశంలో 28 రాష్ట్రాల్లోను ఉన్నప్పటికీ వాళ్ళందఱి ఆచారవ్యవహారాలూ ఒకటి కాదు. బెంగాలీలంతా చేపలు తినడం వల్ల అక్కడి బ్రాహ్మలు కూడా చేపలు తినడం మొదలుపెట్టారు. మేనఱికం వెనక నిజంగా ఆర్థిక కారణాలే ఉంటే ఆ ఆర్థిక లాభాల్ని పొందడానికి ఉత్తరభారతీయ బ్రాహ్మణులెందుకు ఇష్టపడ్డంలేదని కూడా ఆలోచించాలి.

మేనఱికం అన్నాచెల్లెళ్ళ దాంపత్యానికి మిగిలిన ప్రాచీన అవశేషం. ప్రాచీనకాలంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోను అన్నాచెల్లెళ్ళ దాంపత్యం సమాజసమ్మతమైన శిష్టాచారం. అనంతరకాలంలో బాబాయి కూతుర్ని చేసుకోవడమూ, మామ కూతుర్ని చేసుకోవడమూ దానికి రూపాంతరాలు (ప్రత్యామ్నాయాలు). అందుకనే దక్షిణభారతదేశంలో ఆచారవ్యవహారాల్లో మేనమామకున్న ప్రాధాన్యం తండ్రిక్కూడా లేదు. ఎదుకంటే ఒకప్పుడు అతనే అసలు తండ్రి. కనుక ఈ ఆచారానికీ బ్రాహ్మలకీ ఏ సంబంధమూ లేదు.

ఇప్పుడు తల్చుకుంటే చాలా ఱోతగా, అసహ్యంగా అనిపిస్తుంది కాని, ఆ విధంగానే తల్లిని పెద్దకొడుకు వివాహం చేసుకోవడం కూడా అత్యంత ప్రాచీనకాలంలో అన్నిదేశాల్లోను ఉండేది (ఆంధ్రాతో సహా). తన తండ్రెవరో తనకు తెలియకపోవడం ఇందుకు కారణం.

బ్రాహ్మలు, ఉన్న ఆచారాల్ని శాస్త్రరూపంలో codify చెయ్యగలరు. లేనివాటిని సృష్టించజాలరు. ఎందుకంటే ప్రాచీనకాలంలో అందరూ సమాజానికి బందీలే. ఎవరూ ఒక కొత్తపుంత తొక్కడానికి అంత తేలిగ్గా సాహసించేవారు కాదు.

రాకేశ్వర రావు said...

హుఁ..
మీరనుకున్నట్టు పాశ్చాత్యులు మావల కూతుళ్ళను బాబాయిల కూతుళ్ళను చేసుకోవడం ఎప్పుడూ అసహ్యించుకునేవారు కాదు.
బ్రిటన్లో తఱచుగా ఇవి జరిగేవి.

తరువాత అలా చేసుకంటే జన్యురోగాలు వచ్చే అవాకాశాలు హెచ్చిస్తాయి అని తెలిసాక దాన్ని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు.

అంతెందుకు Charles Darwin కూడా తన స్వంత మేనత్తగారి పిల్లను చేసుకొని పదిమంది పిల్లల్ని కన్నారు.

కానీ వారు మన లాగా
parallel cousins కి cross cousins కి వ్యత్యాసం చూపేవారు కాదు.

ప్రపంచంలో చాలా చోట్ల cousin పెళ్ళి అనుమతించడం లేదా అనుమతించకపోవడం జరిగేది అంతే. మేనత్త కూతురా, బాబాయి కూతురా అని చూడరు. ఉదా- ఉత్తరాదిలో ఎటుంటి చుట్టాల్ని పెళ్లి చేసుకోరు. మన సినిమాలు డబ్ చేసుకున్నప్పుడు ఏం చేసేవారో మఱి కథను!

కానీ మేనమాఁవ ని పెళ్ళి చేసుకోవడం మాత్రం చాలా తక్కువ చోట్ల జరిగేది. అక్కడ మనవారు ఒక అడుగు ముందుకువేశారు.

----------
ఇక తాబాసు గారి మాట్లాడే విషయమై,
మన అత్యంత ప్రాచీన కంటే ప్రాచీన పూర్వీకులైన బోనోబో చింపాజీలలో అయితే తల్లీ కొడుకుల మధ్య చాలా గట్టి లైంగిక సంబంధం వుంటుంది.
అలానే 'వారు' ఎవరినైనా కలసినప్పుడు మంచి చేసుకోవడానికీ ముచ్చటించుకోవడానికి వారితో లైంగికంగా సంపర్కిస్తారు!

అందుకే ననుకుంట 'మనిషివా పశువుగా' అని అడుగుతారు చెడ్డపనులు చేస్తే!
మీరు మంచి సైకాలజీ క్లాసు తీసుకుంటే, ఆ మనిషికీ పశువుకీ పెద్ద తేడాలేదని కూడా రూఢీగా తెలియవస్తుంది. ఇక మిగిలింది మీరు ఊహించుకోండి. :-)

రాకేశ్వర రావు said...

లంకె చూడండి.
http://en.wikipedia.org/wiki/Iroquois_kinship

Krishna said...

హిందువులలో బీజ ప్రాధన్యమయిన సంభందాలు అయితే, ముస్లిం లలో, క్షెత్ర ప్రాధన్యమయిన సంభందాలు. Western World లో అయితే, రెండు ప్రక్కలా ప్రాధన్యమిన సంభందాలే.
ఆ విషయంలో, Eastern World లే, ఎంతో కొంత better. ఇప్పటికి Texas State allows close cousin marriages, compare to other States here.
ఆ మధ్య ఇక్కడ Dallas లో Bill Hill అనే public prosecutor (ఆయన బుష్ గారి రెపబ్లికన్ పార్టి మనిషి అని వెరే చెప్పక్కర్లెదు అనుకొంటాను) ఇక్కడ Indians ను, ముఖ్యంగా హిందువులను (హిందువులే ఇలాంటి పెళ్లిళ్లు చేసుకొంటారు అని భావించి)ఎదో సాధించి, Christian Right Wing జనతాలో ఓ ఇమేజి కొట్టెద్దామని , మేనరికం చేసుకొని, ఇక్కడ పిల్లలను కన్న ఓ కుటుంబం మీద, incest కేసు పెట్టదానికి, ready అయిపొతే, ఆ తెల్ల దొర గారి ఆవేశాన్ని తగ్గించటానికి మన వాళ్లు నానా తిప్పలు, పడాల్సి వచ్చింది. ఇండియా నుండి, ఆయన మెచ్చే బాప్టిస్ట్ చర్చులనుండి, ఇది మతానికి సంభందించి విషయం కాదు స్వామీ అని ఉత్తరాలు కూడ తెప్పించాల్సి వచ్చింది.
అందుకనే మన వాళ్లు ఇలాంటి వన్ని భరించాల్సి వస్తుందని, అమెరికాలో దక్షిణ రాష్ట్రాలలో వుండటానికి ఇంతక ముందు, ఇష్ట పడే వాళ్లు కాదు.

కత్తి మహేష్ కుమార్ said...

అందరికీ నెనర్లు. చాలా విలువైన సమాచారాన్నీ, అభిప్రాయాల్నీ పంచుకున్నారు. It was an education for me.

ఈ వ్యాసం రాయడం వెనుక ఉద్దేశ్యం ఇతర సంస్కృతులపైన value judgment చేసేవాళ్ళని ఒక్కసారి ఆలోచించమని చెప్పడమే తప్ప, మన సంస్కృతిపై ఒక వాల్యూజడ్జిమెంట్ చెయ్యడం అస్సలు కాదు. ఈ మన సాంప్రదాయానికి గల మూల కారణాలలో నాకు తోచిన ముఖ్యకారణం ఇది. ఇక దానికి మించి చూపిన ప్రమాణాలు ఖచ్చితంగా ఆమోదయోగ్యాలే అనుకుంటా.

గ్రీకులూ, రోమన్లూ ఇంకా ఈజిప్షియన్లు pure blood basis మీద సోదరసోదరిణుల మధ్య వివాహ సంబంధాలు నెరిపినట్లు చరిత్ర చెబుతున్న సత్యమే.మనకు తెలిసిన ముస్లింలలొ, బాబాయ్ కూతుర్ని చేసుకోవడం కూడా మనకు అంగీకారాత్మక సంస్కృతి కావాలేకానీ గర్హించనవసరం లేదు అని మాత్రమే ఇక్కడ ఉద్దేశ్యం.

@పెదరాయ్డు,మన సాంప్రదాయాల్ని చిన్నచూపు చూడటం మన తెలుగువాళ్ళకి అలవాటైతే కావచ్చుగానీ, ఇక్కడ ఇతరుల పట్ల అ చిన్నచూఫూ కూడదని మాత్రమే చెప్పడం జరుగుతోంది.

ఇక మీరు చెప్పిన మన వ్యవస్థ పునర్వైభవం కన్నా, ప్రస్తుతం ఉన్న మార్పులకు అనుగుణంగా మనం మారితేనే శాంతీయుతంగా మనగలమని నా ఉద్దేశ్యం.

పెదరాయ్డు said...

రెండూ తప్పేనండి. మనల్ని కించపర్చుకోకుండా ఇతరుల ఔన్నత్యాన్ని గుర్తిస్తే మంచిది. గుర్తించినపుడు మన అలవాట్లను సవరించుకుంటే ఉత్తమం. ఇతరుల్లో పొరపాట్లను గుర్తించినపుడు సంయమనంతొ వ్యవహరించాలి.

మీరన్నట్లు పునఃర్వైభవం కన్నా నూతన పొకడలపై దృష్టి సారించవచ్చు.

Praveen's talks said...

మా మేనత్త గారి కూతురు (నాకు వరసకి వదిన అవుతుంది), ఆమెని మా బాబాయికి (ఆమె మేనమామకి) ఇచ్చి పెళ్ళి చేశారు. ఆమెని అతనికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని మా బంధువులు చిన్నప్పటినుంచీ అనుకున్నారు. అందుకే నన్ను ఆమెని వదిన అని కాకుండా పిన్నీ అని పిలవమన్నారు. ఆమె చెల్లెళ్ళని మాత్రం మరదళ్ళు అనమన్నారు. మేనత్త కూతురు పిన్నమ్మ అవ్వడం ఒక విచిత్రం, పిన్నమ్మ చెల్లెళ్ళు మరదళ్ళు అవ్వడం ఇంకో విచిత్రం. పాశ్చాత్య దేశాలలో బావ-మరదలు వరసైన వాళ్ళు పెళ్ళి చేసుకోవడం కూడా చట్ట ప్రకారం నేరమే. ఆ నేరాన్ని అక్కడ ఇన్సెస్ట్ అంటారు. ఇక్కడ మాత్రం మేనమామ-మేనకోడలు పెళ్ళి చేసుకోవడం కూడా నేరం అనుకోరు. నాగరికత విషయంలో మన కంటే పాశ్చాత్యులే నయం అనడానికి ఇదొక ఉదాహరణ.