వడ్డించిన వర్షం
విస్తరి దాటితే వరద
వయసొచ్చిన అందం
వాకిలిదాటితే వరద
కలిసొచ్చిన కాలం
కళ్ళముందే కరిగితే వరద
మనసిచ్చిన చెలికాడు
మరుగుపడితే వరద
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
Posted by Kathi Mahesh Kumar at 8:55 PM 6 comments
Labels: కవిత
ఓ రెండ్రోజులుగా "Prejudice కి తెలుగు పదం ఏంటా?" అని నా దగ్గరున్న డిక్షనరీలన్నీ తిరగదోడాను. చివరకి బ్రౌను నిఘంటువులో, "విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి" అని అర్థాలు కనపడ్డాయేగానీ సమానాంతర పదం మాత్రం కానరాలేదు. అంటే నిజంగా మన తెలుగు ప్రజల నరనరాల్లో జీర్ణించుకున్న ఈ అమూల్యమైన లక్షణానికి, ఆంగ్లంలో తప్ప తెలుగులో సరైన పదం లేదని తెలిసిపోయింది.
కానీ మన జీవితాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండోయ్! ఇదుంటే మనకు చాలా సుఖం. ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. విషయాల నిజనిర్థారణ అవసరం లేదు, తప్పొప్పుల ఆలోచన అఖ్ఖరలేదు, శ్రమలేకుండా బతికెయ్యొచ్చు. ఈ సుఖానికి మనం ఎంతగా అలవాటుపడిపోయామంటే, మనుషుల్ని వారి ప్రవర్తనతోనో, ఆలోచనలూ, అభిప్రాయాలతోనో బేరీజు చెయ్యడం మానేసాం. వారు నివసించిన ప్రదేశాన్నో, సంస్కృతినో, ఇంటిపేరునో లేక కులాన్నో తెలుసుకుని దానికి తగ్గట్టు ఒక "బ్రాండ్" తగిలించి, సుఖపడిపోతాం. "అరవోళ్ళు", "ఆంధ్రావాళ్ళు", "దళితులు" అని కొన్ని బ్రాండ్ లేబుల్లు తగిలించి, మన ప్రెజుడిస్ ని విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉంటాము.
ఒక వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కొలవడంలో గల శ్రమని తగ్గించుకుని, ఇలాంటి బ్రాండ్లు కల్పించేసుకున్నామన్న మాట. అందుకే మన సామాజిక సంబంధాలు వ్యక్తులతో కాక, వారికి ప్రెజుడిస్ తో మనం తగిలించిన లేబుళ్ళతో నెరిపేస్తూ ఉంటాం. ఇలాకాక, ప్రతివ్యక్తినీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగల మనిషిగా అర్థం చేసుకుని, ఆదరించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి ! అందుకే మన వ్యక్తిగత అనుభవాలన్నీ, ‘రంగుటద్దాల’ సగం సత్యాలేకానీ, అసలు నిజానికి ఓ అంగుళం దూరంగానే ఎప్పుడూ ఉంటాయి.
ఈ ప్రెజుడిస్ అప్పుడప్పుడూ తీవ్రరూపం దాల్చి, మన మీడియాలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడితే ఫ్యాక్షనిస్టు, తెలంగాణ యాసైతే కామెడీ ఇలాగే అవ్వలేదూ? అంతెందుకు మనం చాలా విలువల్ని ఆపాదించే "ఇజాలు" కూడా ప్రెజుడిస్ పుణ్యమే కదా! కమ్యూనలిజం (మతతత్వం), జింగోయిజం, మేల్ ఛవ్వనిజం, సర్వాంతర్యామి అయిన క్యాస్టిజం (కులతత్వం) వీటిల్లో మచ్చుకకి కొన్ని.
ఇలాంటి సుఖమైన జీవితం నుండీ బయటపడమని చెప్పడం సాహసమే ! కానీ ఇలాగే సాగితే మన మానవ సంబంధాలు అతిమహా లోతుల్లోకీ, అధ:పాతాళానికీ చేరి ఇంకా సుఖపడతాయేమో అని ఎక్కడో చిన్న సందేహం. అందుకే కనీసం నిఘంటువులో అర్థాన్ని వెదికే సాహసం చేశాను. దయతొ అందరూ క్షమించగలరు.
Posted by Kathi Mahesh Kumar at 3:46 PM 8 comments
Labels: సమాజం
ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది.
కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం. మరికొన్నింటిని ఆరాధిస్తాం. కానీ ‘ద్వీప’, అనుభవించాల్సిన చిత్రాలకోవలోకి వస్తుంది.
ఒకవైపు డ్యాం పునరావాసం పై సామాజిక చర్చతోపాటూ, మరో వైపు మానవసంబంధాల సున్నితత్వాన్ని కూడా స్పృశించిన చిత్రమిది. ముంపుకు గురవ్వబోయే ద్వీపాన్ని విడిచి వెళ్ళని నమ్మకం, ప్రేమ ఒకవైపు కనిపిస్తే, తన సామ్రాజ్యమైన ఇంటిని కాపాడుకోవడానికి ఒక మహిళ పడే తపన, ప్రయత్నం కనిపిస్తాయి. ఇంత క్లిష్టమైన విషయాన్ని తెరపైకి అనువదించడం చాలా కొద్దిమంది దర్శకులకే సాధ్యం. వారిలో ఒకరు, ‘గిరీశ్ కాసరవళ్ళి’ అన్నది నిజం. సినిమా నిడివి కొంత ఎక్కువనిపించినా, చెప్పాలనుకున్న విషయం కూడా అంతే ముఖ్యమైంది కాబట్టి కొంత ఓపిక ప్రేక్షకులకి తప్పదు.
`గణపయ్య' (అవినాష్) మరియూ `నాగక్క' (సౌందర్య) అనే భార్యాభర్తలు వారి పెద్దదిక్కు గణపయ్య తండ్రి 'దుగ్గజ్జ' (వాసుదేవ రావ్) తో కలిసి ఒక ద్వీపంలో ఉంటారు. అక్కడి చిన్న గుడిలో పౌరోహిత్యం చేస్తూ, "నేమ" అనబడే ఒక సాంప్రదాయ పూజను జరుపుతూ, పొట్టపోసుకొంటూ ఉంటారు. అది ఒక డ్యామ్ సైట్ కావడం వల్ల త్వరలో ముంపుకు గురయ్యే ద్వీపాలలో ఒకటిగా గుర్తించి ప్రభుత్వం అందరినీ ఖాళీ చెయ్యమంటుంది. తండ్రి ఆ స్థలాన్ని వదిలి రావడానికి ఇష్టపడకపోతే కొడుకూ, కోడలు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. వారికి సహాయంగా ఉండటానికి ఒక నవయువకుడు ‘కృష్ణ’ కూడా అక్కడికి వస్తాడు. చివరికి ఆ ద్వీపం మునిగిపోతుందా? నాగక్కకీ, కృష్ణకీ మధ్య ఉన్న స్నేహం ఏవిధంగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది? చివరికి ఈ ప్రకృతి మరియూ వ్యక్తిగత కష్టం నుండీ ఈ కుటుంబం ఎలా గట్టెక్కింది? అన్నదే ఈ చిత్ర కథ.
ఈ సినిమా పూర్తి సమీక్షని ఇక్కడ చదవగలరు.
------------------------------------------------
Posted by Kathi Mahesh Kumar at 7:09 AM 7 comments
Labels: సినిమాలు
ఖమ్మం జిల్లాలో ఒక UNICEF ప్రాజెక్ట్ కోసం, నా మొదటి పెద్ద ఇంటర్వ్యూ జరిగింది. ఈ తంతు మొత్తం ఇంగ్లీషులోనే జరిగింది. అక్కడకు వచ్చిన యునిసెఫ్ అధికారి ఒరియా అవ్వడం ఒక కారణమైతే, మన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే చాలా ఇంటర్వ్యూ లలో ఉపయోగించినట్లే, ఇక్కడా ఆంగ్లాన్ని ఎడాపెడా ఉపయోగించేసారు.
మనమూ బాగా మాట్లాడే కాలేజీ, యూనివర్సిటీల్లో కాస్త చదువును చట్టుబండలు చేసొచ్చిన బాపతుకాబట్టి, సాధారణంగా వాడే ఆంగ్ల పదాలతోపాటూ, డిక్షనరీ చూస్తేనేగానీ అర్థం కాని క్లిష్ట పదాలు కొన్ని ఉపయోగించేసి, ఛాతీని కాస్త పెంచి మరీ వారెదుట సెటిలైపోయాం. నా వ్యవహారం వారికి నచ్చిన ఫీలింగ్ పెట్టి, ఒకరి మొఖాలొకళ్ళూ చూసుకుని అంగీకార సూచకం తలలూపేసారు. ఇంతలో వారికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం వచ్చింది...వారిలో ఒక పెద్దాయన నన్ను సందేహంగా చూస్తూ "Do you know Telugu?" అన్నాడు. తను చెప్పింది అర్థమయ్యేలోపల నా నోటివెంట అసంకల్పితంగా ఒక సమాధానం వచ్చింది "I think in Telugu" అని. నా సమాధానం విన్న వాళ్ళ మొఖాలు అప్పుడే స్విచ్ వేసిన ట్యూబ్ లైట్లల్లే కొద్దికొద్దిగా వెలిగి...హఠాత్తుగా దేదీప్యమానమయ్యాయి. అంతే, నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది.
ఈ సమాధానం ఇచ్చి, బయటొచ్చిన తరువాత నా అసంకల్పిత సమాధానంలోని లోతును కాస్త బేరీజు చెసాను. 8 వ తరగతి వరకూ పూర్తి తెలుగు మాధ్యమం (medium) లో చదివినా, 9-12 వ తరగతిలో ఇంగ్లీషు మాధ్యమం లోకి మారాను. 10 లో తెలుగు పరీక్షలు రాసిన తరువాత తెలుగు వాచకాన్ని అస్సలు ముట్టలేదు. ఇక కాలేజిలో చేసింది ఆంగ్ల సాహిత్యంలో మేజరు, యూనివర్సిటీ లో చేసింది Development Communication, అదీ పక్కా ఆంగ్లంలో. "మరి ఎనిమిదోతరగతి వరకూ, అవసరాలు తప్ప ఆలోచనలు చేసెరగనుకదా! మరి నా ఆలోచనలు తెలుగులోఎందుకున్నాయి?" అన్న తీవ్రమైన సందేహం నాకొచ్చేసింది.
తరచి చూస్తే, నాకు తోచిన సమాధానం ఇది. చిన్నప్పటి నుండీ, ఎప్పుడు ఈ తెలుగు పాఠాల నుంచీ తప్పించుకుంటానా అని చూడటం తప్ప తెలుగును, ముఖ్యంగా పాఠాల తెలుగును ప్రేమించి ఎరుగను. ఇక తెలుగు మీడియం అంటారా, లెక్కల్లో ‘సమితులు’ కన్నా ‘సెట్స్’ అనే పదం బాగా అర్థమయ్యేది, సైన్సులో ‘భాస్వరం’ అన్న భారీపదంకన్నా ‘ఫాస్ఫరస్’ అన్న తేలిక పదంలో నాకు సౌలభ్యత కనిపించింది. అంటే చాలామంది భాషావేత్తలు ఎలుగెత్తి చాటుతున్న మాతృభాషలో చదువు నా బోటివాడికి, తెలుగు కంటగింపుగానే తప్ప మనసుకింపుగా ఎప్పుడూ అనిపించలేదు.
మరి "ఇంత లావు మూర్ఖుడికి, తెలుగులో ఆలోచించే ఝాడ్యం ఎక్కడినుండీ అబ్బిందా? అనుకుంటున్నారా !" అక్కడే ఉంది నాకు స్ఫురించిన కిటుకు. చిన్నప్పటి నుండీ తెలుగు పాఠాలంటే పారిపోయినా, కథలంటే మాత్రం పడి చచ్చేవాడిని. చందమామ, బాలమిత్ర, బాలభారతి, బాలజ్యోతి, బాలరంజని లాంటి మాస పత్రికలలోని కథల్ని ఔపోసన పట్టడానికి శ్రమించేవాడిని. కాస్త వయసొచ్చాక ‘పాకెట్ పుస్తకాలు’ అని కొన్ని జానపద కథలున్న పుస్తకాలు, దానితోపాటూ మధుబాబు, పానుగంటి, కొప్పిశెట్టి ల షాడో, బుల్లెట్,కిల్లర్ కథలూ చదివాను. ఈ పుస్తకాలు నా భూగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటూ, కాస్త నా మెదడుయొక్క imaginative extent ని పెంచాయనిపించింది. ఒక సహజ ప్రగతి రూపంగా నేనూ యండమూరి నవలలు చదవడం ప్రారంభించాను. క్షుద్రసాహిత్యం అని అప్పట్లో వచ్చిన ఇతగాడి సాహిత్యాన్ని నిరసించినా, నేను మొదట చదివిన తన నవలలు ‘ఋషి’, ‘పర్ణశాల’. వీటిల్లో తను పరిచయం చేసిన మానవ సంబంధాల fragility నన్ను ఆ వయసులోనే చాలా ఆలోచనలకు పురికొల్పింది.
యండమూరి తో ఆరంభించి మల్లాది, యుద్దనపూడి, సూర్యదేవర, వేంపల్లి, మేర్లపాక...ఇంకా ఎందరో పాప్యులర్ రచయితల పుస్తకాలు నిరాటంకంగా, దాదాపు రెండురోజులకొకటి చొప్పున ప్రతి శెలవుల్లో సాధించేసాను. ఎంత వేగంగా చదివేవాడినంటే, నాకు పుస్తకాలు అద్దెకిచ్చే షాపు వాడు నామీద అభిమానంతో "ఎక్స్ ప్రెస్" అని పిల్చేవాడు. కొన్ని సార్లు ఆలస్యమైనా ఎక్కువ డబ్బులు అడిగేవాడు కాదు.
ఇక మైసూరు కాలేజీలో "ఆంగ్ల సాహిత్యంతో ప్రక్రియని తెలుసుకో, మీ భాషా సాహిత్యం చదివి అనుభవించు" అన్న సూత్రాన్ని నాకు మా ఫ్రొఫెసర్ తెలియజెప్పిన తరువాత, చలం నుంచీ తిలక్ వరకూ, విశ్వనాధ సత్యనారాయణ నుంచీ బుచ్చిబాబు వరకూ చాలా మందిని చదివాను. స్వంత ఆలోచనలు ప్రారంభమయ్యే తరుణం అదే కాబట్టి, ఆంగ్ల భాషలో నా పాఠాలు సాగినా, నా ఆలోచనా స్రవంతి మాత్రం తెలుగులో జరిగేది. నా సమాజం, దాని ఆలోచనలూ, సంస్కృతి మర్మాలూ, సామాజిక పోకడలూ సాహిత్యం ద్వారా నేను తెలుసుకొగలిగాను కాబట్టే తెలుగులో ఆలోచించి, ఆంగ్ల సాహిత్యానికి కూడా నావైన అర్థాలు (interpretations) చెప్పగలిగేవాడిని. ఉదాహరణకు Sigmund Freud ప్రకారం "పాము" sex కు symbol అంటే, మాకు మట్టుకూ అదొక దేవత అని ధైర్యంగా ఎద్దేవా చెయ్యగలిగే స్థాయికి నా తెలుగు ఆలోచనలు చేరుకున్నాయి.
అందుకే నామట్టుకూ నాకు తెలుగు మీడియం చదువులకూ, తెలుగు భాషా ప్రగతికీ అస్సలు సంబంధం లేదు. ఇంగ్లీషు మీడియం చదువుల వల్ల మన భాషకు వచ్చే తీవ్రనష్టమూ లేదు. రావాల్సిన నష్టం ఇప్పటికే మన భాషా బోధన, పిల్లలను తెలుగులో కథలుకూడా చదవమని ప్రోత్సహించలేని మన మారుతున్న సామాజిక రచనల వల్ల జరిగిపోయాయ్. అందుకే, భావవికాసం రాకున్నా, ఉద్యోగ వైకల్యం రాకుండా కాపాడే ఇంగ్లీషు చదువులే మిన్న. ఇక తెలుగుని రక్షించాలంటే దాన్ని, మనకు పాఠాలు చెప్పినట్లు చేదు మాత్రలు మింగిచినట్లు కాక ప్రేమగా ఉపయోగించే విధానాలు పిల్లలకి నేర్పుదాం.
తెలుగు భాషకు జై!
ఇంగ్లీషు మీడియం చదువులకు జై! జై!!
Posted by Kathi Mahesh Kumar at 9:23 AM 20 comments
Labels: సమాజం
ఈ మధ్య నేను రాసిన ‘ఖుదా కేలియే’ అనే ఒక పాకిస్థానీ చిత్ర సమీక్షకు వచ్చిన ఒక స్పందనలో , ఆ చిత్రంలో సర్మద్ అనే పాత్ర తన బాబాయ్ కూతుర్ని బలవంతంగా పెళ్ళిచేసుకోవడం లోని ఔచిత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ విమర్శ ‘బలవంతపు పెళ్ళి’ మీద అయ్యుంటే అసలు సమస్య వచ్చుండేది కాదు. కానీ తన అభ్యంతరం, "వావివరసలు లేని" ఆ పెళ్ళి మీద. తను "ఇండియాలో ఎక్కడా ఎవరూ బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోరు" అని చాలా సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు నా బుర్రకు కాస్త పని కల్గింది.
"నిజమేనా?" అని నన్నునేను ప్రశ్నించుకుని, జవాబు తెలియక నా ముస్లిం మిత్రుడ్నడిగాను. దానికి అతను "అవును మీ తెలుగోళ్ళలో మేనత్త కూతుర్ని చేసుకున్నట్లే, మా వాళ్ళలో బాబాయ్ కూతుర్ని చేసుకోవచ్చు" అన్నాడు. ఈ ఒక్క వాక్యం లో నాకు కొన్ని మర్మాలు తెలిసినట్టైంది. ఆ మర్మాల్ని కాస్త ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ చెప్పే మర్మాలకి ఏవిధమైన సోషియాలజికల్, ఆంత్రపాలాజికల్ లేక మరే విధమైన సైంటిఫిక్ ఆధారాలు నా దగ్గరలేవు, ఒక్క నా మెట్ట లాజిక్ తప్ప.
మనం వావివరసలకు చాలా ఖచ్చితమైన విలువల్ని ఆపాదిస్తాం. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల వారిలో అక్క, మేనత్త లేక మేనమామ పిల్లల్ని దర్జాగా పెళ్ళి చేసుకోవచ్చు. అదే మన భాషలో "వరస". ఇక బావా-మరదళ్ళ సరసాలమీద పుంఖాలు పుంఖాలుగా సాహిత్యం , సినిమాలూ మన సంస్కృతిలో ఒక అవిభాజ్య అంగం. పెళ్ళిళ్ళలో , ఫంక్షన్లలో సంబంధాలూ, వరసల చర్చలు లేకుంటే ఆ సంబరాలు చప్పగున్నట్లే లెక్క.
కానీ, ఈ మాటే ఎవరైనా భారతదేశం బయటున్నవారికి చెబితే దీన్ని "ఇన్సెస్ట్"(incest) అంటారు. "ఛివుక్కు మంటుంది కదూ?" పాశ్చ్యాత్య ధోరణుల్ని అంతగా నిరశించే మనల్ని , ఈ విషయం లో వీరు ఖచ్చితంగా తప్పుపట్టచ్చన్నమాట. ‘కజిన్స్’ మధ్య సంబంధాలు వీరికి ఏమాత్రం అంగీకారం కాదు. అంత దూరం ఎందుకు, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సంబంధాలు అంగీకారం కాదు. వీరైతే ఒకడుగు ముందుకేసి ఒకే గోత్రనామం ఉన్నా లేక ఒకే ఊరివాళ్ళైతే వారిని సోదర సమానులుగా భావిస్తారు. ఈ మధ్య కాలంలో హర్యానా లో జరిగిన honor killings ఈ కోవకే చెందినవి. ఇక ముస్లిం సముదాయంలో మనం ‘తప్పు’ అనుకునే బాబాయ్ కూతుర్ని మనవాళ్ళు మేనమామ కూతుర్ని చేసుకున్నంత తేలికగా పెళ్ళి చేసుకుంటారు. అంటే విలువల విషయంలో మనం absolute అని మాట్లాడే విషయాలు, చాలావరకూ సముదాయాన్నీ, సంస్కృతినీ బట్టి చాలా relative అన్నమాట.
కానీ, ఈ "విపరీతాలకు" కొన్ని సామాజిక, ఆర్థిక కారణాలు ఖచ్చితంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సామాజికంగా పితృస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసి, ఆధిపత్యాన్ని రక్షించడానికి ఇది జరిగిఉంటుందని బహుశా ఫెమినిస్టులు ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇది వారి స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి, దాన్ని వారికే వదిలేస్తాను. ఇక నాకు అనిపించిన ఆర్థిక కారణాల్ని కాస్త చూద్దాం.
మన తెలుగు జీవితాలలో విలువలు రెండు రకాల మనుషులు నిర్ణయించేవారు. ఒకటి వేదాలు తెలిసిన బ్రాహ్మణులు, రెండు భూమి చేతుల్లో ఉండే భూస్వాములు. ఈ ఇద్దరికీ మేనరికాల వల్ల చాలా ఆర్థికస్వామిత్వం లభించిందని నా ఫీలింగ్. మొదటిగా బ్రాహ్మణుల్ని తీసుకుంటే, వీరు ఆలయ అర్చకత్వం మరియూ మాన్యాల మీద వచ్చే ఆదాయంపై తమ భుక్తికి ఆధారపడి బ్రతికారు. ఇలాంటి limited resource గనక మళ్ళీ మళ్ళీ విభజింపబడితే, గొడవలు తప్ప గౌరవప్రదమైన జీవితాలు జీవించగలిగేవాళ్ళూ కాదు. అందుకనే ఒక via medium ని చాలా convenient గా సృష్టించి ఉండొచ్చు. అవే, మేనరికాలు.
కాకపోతే ఈ inbreeding కి కొంత logic కావాలి కాబట్టి, వాటి చుట్టూ కొన్ని విలుల్ని ఏర్పరిచారు. బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోకూడదు, ఎందుకంటే ఒకే ఇంటి పేరు కాబట్టి. అదే మేనత్త కూతుర్ని చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటిపేరు మారొచ్చింది కాబట్టి, లాంటివి. ఇంకా చిత్రం ఏమిటంటే, అన్నకూతుర్ని పెళ్ళిచేసుకోవడం ‘పాపం’, కానీ అదే అక్క కూతురితో రొమాన్స్ ‘ఆదర్శప్రాయం’. ఇలా అన్నమాట. అప్పట్లో కొన్ని కుటుంబాల మధ్యనే వివాహ సంబంధాలు ఉండేవి. మహా అయితే ఇటుపక్కూరో, అటుపక్కూర్లోనో ఉన్న వారితో పెళ్ళిసంబంధాలు నెరిపేవాళ్ళు. అంటే కొన్ని తరాలు ఇదే చక్రంలో, ఒకే ఆలయం మీదా దాని మాన్యం మీద బతికేసారన్నమాట.
ఇక భూస్వాముల ఇళ్ళలో చూస్తే, ఇవి ఇంకా చాలా నిబద్దతగా జరిగేవనడానికి మనలో చాలా మందికి ఆధారాలు తెలుసు. ఆస్తి బయటకు వెళ్ళకూడదు కాబట్టి బలవంతపు పెళ్ళిల్లు చెయ్యడంలో కూడా వీరు చాలా సిద్దహస్తులు. ఇలాంటి సంబంధాలు ఈడూ-జోడూ, ఒడ్డూ-పొడవూ, వయసూ -వంకాయతో సంబంధం లేకుండా తెగించిన సంస్కృతి వీళ్ళకి సొంతం. ఇదంతా ఎందుకూ? భూమికోసం ! చాలా విలువైన commodity ఇది, గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునే మహత్తర మార్గమిది. ఇక వీటికి విలువలూ, ఆదర్శాలూ, అవసరమైన రొమాన్సూ అద్దకుండా ఉంటారా? అదే జరిగింది. అందుకే అబ్బాయిలకు "మరదలు", అమ్మాయిల "బావ" అనగానే మనసులో జిల్ జిల్ జిగా.
ప్రస్తుత కాలంలో, చాలావరకూ డాక్టర్లు కూడా మేనరికాలు వద్దని చెప్పడమో లేక మన జీవన పరిధులు పెరిగి బయటి సంబంధాలు (చాలా వరకూ ఒకే కులంలో) విరివిగా చేసుకుంటున్నాం. కానీ మన సామాజిక design న్ని మాత్రం సత్యం అనుకునే ఆలోచన చాలా మందిలో ఉంది. ఇంతకీ ఇంత మెట్ట లాజిక్ తియ్యడంలో ఉద్ద్యేశం ఏంటంటే, మన సంస్కృతిలోని విలువల్ని మాత్రమే జీవన సత్యాలని, మిగతా వారి సామాజిక జీవనాన్ని, పద్దతుల్ని చిన్నచూపుచూడడమో లేక అది తప్పు అనడం ఎంతవరకూ సమంజసం అని నాకు అనిపించడం. అందుకే ఎవరైనా మన తీరులకి భిన్నంగా ప్రవర్తిస్తే, మన విలువల్ని బట్టి value judgment ఇచ్చెయ్యక, కాస్త ఆలోచిద్దాం.
Posted by Kathi Mahesh Kumar at 4:57 PM 14 comments
Labels: సమాజం
Posted by Kathi Mahesh Kumar at 6:27 PM 14 comments
Labels: కవిత
"అసలు మీరు కవికాదన్నవాడిని నేను కత్తితో పొడుస్తాను" అన్న రాధిక గారికి , "మొదటి కత్తిపోటు నాకే!" అని స్వీకరిస్తూ ఈ టపా రాస్తున్నా. నా ఇదివరకటి టపా ఆలోచనలూ Vs భావాలు లో, నా కవితలూ,కథలూ రాయలేని అసహాయతను నా ఆలోచనా శైలి, నా conditioning మీదకీ నెట్టి తప్పించుకున్నాను. కానీ ఈ మధ్య బ్లాగుల్లో అనేక కవితలూ, కథలూ చదివేకొద్దీ, రాయలేకపోయినా, స్పందించగలిగే హృదయంకాస్త ఏర్పడిందనిపించింది. దాన్ని ఆసరాగా తీసుకుని మన బుసాని పృథ్వీరాజు వర్మ గారి బ్లాగులోని బొమ్మలకు, కొంత కష్టపడి ‘పదాలని అల్లి’ ఈ కవిత రాసాను.
ప్రేమంటే...
నీ వేలితో నీ కన్నే పొడుచుకోవడం,
అని నా మిత్రుడి అనుకోలు.
కన్ను పొడుచుకునైనా...
ఆ ప్రేమ తడి అనుభవించాలని నా వేడుకోలు.
ఆ అనుభవం వెలుగులో,
జీవితం ఒక ఉదయకిరణంలా అనిపిస్తుంది.
అది కేవలం అనుభవిస్తేనే తెలుస్తుంది.
దీనిలో మన కూడలిలో ఈ మధ్య ప్రతిరోజూ కనిపిస్తున్న ‘అనుకోలు’ పదాన్ని వాడి సరదాపడ్డాను. ఇక బొమ్మ ఎలాగూ కళ్ళముందే ఉందిగనక, అల్లుకుపోవడం సులభంగా అనిపించింది. తెగించేసాను!
మళ్ళీ వర్మగారే ఒక రెఖాచిత్రాన్ని గీస్తే, నేను పదాల పందిరి వేసాను.
నా కళ్ళ నిరాశ
నుదుటి బొట్టై భాసిల్లుతుంటే,
నా గాజుల సవ్వడి
ఒంటరితనాన్ని పోగొట్టింది.
నా చెవి దుద్దులు
చెంప సిగ్గుల్ని ఆర్పేస్తే,
నా మెడలోని ప్రేమ గొలుసు
నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది.
వేలికున్న ఉంగరం
బంధాన్ని తెంపుకెళ్ళిన చెలికాడి వేలిముద్రగా మిగిలితే,
నాకు ఆశనీ, దు:ఖాన్నీ నగలుగా వదిలి
ఆనందం మాత్రం చాటుగా తప్పుకుంది.
దీనికి కాస్త మంచి స్పందన వచ్చేసరికీ, నా ఛాతీ విశాలమైన మాట వాస్తవమే. కానీ, నేను కవిననో లేక కవితలు రాయగలననో అంటే మాత్రం కాస్త దడగానే ఉంది.
ఎందుకంటే, కవితా లేఖనం సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ అత్యంత క్లిష్టమైంది అని నా ప్రఘాడ విశ్వాసం. మనిషి సాధారణంగా పదాలలొ చెప్పలేని, లేదా నిబిడీకృతం చెయ్యలేని భావాలు, సహజసిద్దంగా కవితా ధోరణిని అలవర్చుకుని ఒక కవిత రూపంలో సాక్షాత్కరిస్తాయనుకుంటాను. దానికి ఒక స్పందన కలిగిన హృదయంతో పాటూ, భావావేశం, ఒక mystique చైతన్యం కావాలి. అవి అలవర్చుకుంటే కొంత అమరినా, సహజంగా ఉంటేనే బాగా పండేది. అందుకే, ఆ ‘సహజత’ మనలో సహజంగా లేదు అని నా కనిపిస్తుంది. దానికి కారణం చాలా సులభంగా చెప్పాలంటే, ‘నాకు ఏదైనా చెప్పాలనిపించగానే నా కలానికి కవిత్వం రాదు’ అంతే. అంటే నేను కవిని కానన్నమాట.
Posted by Kathi Mahesh Kumar at 8:40 AM 15 comments
Labels: కవిత
సాధారణంగా లాజిక్కులూ, రీజనింగులూ అంటూ రాగాలు తీసే ఈ బ్లాగరి హఠాత్తుగా మనసుల మీద పడ్డాడేమిటా? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ శీర్షికలో ‘మనసు’ ఉందిగానీ, అసలు విషయంలో మనం తీసేవి మాత్రం, నాకు అలవాటైన (మెట్ట) లాజిక్కులే కాబట్టి పాఠకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
పిల్లలు యుక్త వయస్సుకి రాగానే, తల్లిదండ్రులు పిల్లలపట్ల చూపే ప్రేమల్లో, పిల్లలపట్ల వారి ఆలోచనల్లో మార్పులు రావడం చాలా సహజంగా జరిగే పరిణామం. తమ జీవితంలోని అనుభవాలనూ, చుట్టుపక్కలవారి వ్యవహారాలనుంచీ వీళ్ళు గ్రహించిన దాన్నిబట్టి, కొన్ని పాఠాలను అన్వయించుకుని, పిల్లల జీవితాల్ని సరైన దారిలో పెట్టాలని చాలా తపనపడిపోతుంటారు. ముఖ్యంగా ప్రేమ-పెళ్ళి విషయానికొచ్చేసరికీ మరీనూ. ఈ విషయంలో చాలా మంది తల్లుల ఆలోచనాధోరణి లోని ఒక చిన్న విచిత్రాన్ని ఇక్కడ చూద్దాం.
కూతురి పెళ్ళి ప్రసక్తి వచ్చే సరికీ తల్లి, తన భర్త కన్నా మంచివాడైన వ్యక్తి కూతురికి మొగుడుగా రావాలని కోరుకుంటుంది. అంటే మెజారిటీ ఆడవాళ్ళకి తన మొగుడు అంత మంచివాడు కాదు అని మనసులో ఎక్కడో ఖచ్చితంగా అసంతృప్తి ఉన్నట్లు లెక్క. తల్లికి ఇంకో కొలమానం ఏమిటంటే, తనను పెంచిన తండ్రి. "తన తండ్రి అంత మంచివాడు ఎక్కడా లేడు" అనేది చాలా మంది అమ్మాయిల విషయంలో, ప్రస్తుతం ‘అమ్మ’ల విషయంలో కూడా ఒక universal fact. ‘భర్త’ ఎప్పుడూ ఆ image కి సరితూగడు సరికదా, వారి తండ్రి ఇమేజ్ ని ఒక సాధారణ భర్తగా తన ప్రవర్తనతో, ఇంకా గట్టిపడేలా చేస్తాడు. ఇక్కడే తల్లి మనసుకూ, పెళ్ళికావలసిన ‘పిల్ల’ మనసుకూ ఉన్న కాంట్రాస్ట్ తెలుస్తుంది. అమ్మాయి తన తండ్రిలాంటి భర్త కావాలి అనుకుంటే, అమ్మాయి తల్లి మాత్రం, "తన మొగుడిలాంటి మగాడు తన కూతురికి అస్సలు వద్దు" అనుకుంటుంది. ఇక సమస్య రాకుండా ఉంటుందా?
ఇక కొడుకు విషయానికి వద్దాం. ప్రతి తల్లీ తనంత మంచి భార్య ఎక్కడా లేదు అనుకుంటుంది. తనంత బాగా ఇల్లూ,పిల్లలూ, భర్తనీ చూసే ఇల్లాలు ఈ భూప్రపంచంలో అస్సలు లేరు, ఇక ఉండబోరు అని ప్రతి తల్లికీ ఒక గోప్ప విశ్వాసం. అందుకనే తనలాంటి భార్య వస్తే, కొడుకు సుఖపడతాడు అనే నమ్మకాన్ని పెంచుకుంటుంది. కొడుకుకి కూడా తల్లిపట్ల ఉండే సహజమైన ప్రేమతో అలాగే ఆశిస్తాడు. అందుకే మగాళ్ళు తమ పెళ్ళాల వంటని, అమ్మల వంటతొ పోల్చి అస్తమానం ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక తల్లి విషయానికొస్తే, ఈ expectation పెళ్ళి వరకూ బాగానే ఉంటుందిగానీ, ఆ తరువాత కోడలు "తనలాంటిది కాదు, నిజానికి ఒకరకమైన విరోధి" అన్న నిజం మెల్లమెల్లగా తెలిసొచ్చి, అతాకోడళ్ళ ఆధిపత్యం పోరు మొదలౌతుంది. ఇందులో మొదటి బలిపశువు ఆ కొడుకు/భర్తే !
ఇలా ‘తల్లిమనసు’ మన జీవితాల్లోని కొన్ని సంఘటనలకూ, మన సంసారాల్లో కొన్ని ఘటనలకూ కారణమవుతూ ఉంటుందన్న మాట! చిత్రంగా ఉన్నా, చాలామంది పిల్లల జీవితాల్లో ఇదొక నిజం అంతే.
Posted by Kathi Mahesh Kumar at 12:31 PM 11 comments
Labels: వ్యక్తిగతం
ఈ శీర్షిక చదివి "వీడికి పిచ్చిగాని పట్టలేదు కదా?" అనుకుంటున్నారా! అదే ఇక్కడ విచిత్రం. సినిమా ధియేటర్ అంత ప్రజాస్వామికమైన స్థలం ఏదైనా ఉందా అసలు! అందులో అడుగు పెట్టాలంటే కావలసింది, వెళ్ళవలసిన క్లాసుకు, తీసుకునే టికెట్టు తేడానే తప్ప, ఓకే చూరు కింద నేల టికెట్టోళ్ళూ, క్లాసు జనాలూ ఒకే సినిమాని, ఒకే తెరపై చూడటం కన్నా ప్రజాస్వామ్యం ఇంకోటుందా?
ఈ విషయంలో ప్రజాస్వామ్యం పేరుతో మనకున్న రాజకీయ అధికారాలకన్నా సినిమా చాలా మేలు కదా! ఇందులో మనం ఓటు వెయ్యక...అదేనండీ టికెట్టు తియ్యకపోతే సినిమా ఫ్లాపై కూర్చుంటుంది. అంటే, మనకి call back option కూడా ఉన్నట్లే లెఖ్ఖ. రాజకీయ నాయకులకి ఒకసారి ఓటేస్తే..వాడెంత ఓటివాడైనా ఐదు సంవత్సరాలు భరించాల్సిందే. ఇక సినిమా అయితే ఒకటి కాకపోతే ఇంకొకటి ఎన్నుకునే అధికారం మనకుంది. రాజకీయాలలో మనకా ఛాయిస్ ఎక్కడా?
ఇంకా సౌలభ్యమైన విషయం సినిమాలలో ఇంకొకటుంది. అది ప్రేక్షకుల్ని బట్టి హీరోలు సినిమా తియ్యడం. అంత కన్నా అధికారం రాజకీయాలలొ మనకెక్కడుందీ! మనం కోరుకున్నట్లు ఈ నేతలు రాష్ట్రాన్ని నడుపుతున్నారా? కానీ మన హీరోలు, వారి అభిమానులు కోరుకున్నట్లుగా సినిమాలు మాత్రం తీస్తున్నారు. చిరంజీవి ఎప్పుడొస్తాడో తెలిసినట్టుగా, ప్రేక్షకులు ఈలలేసి గోలచేస్తేగానీ మన మెగాస్టార్ తెరపై ప్రత్యక్షమవ్వడం ఎవరికైనా గుర్తుందా? పాండురంగడులో బాలకృష్ణ నటనని, "అదరహో, తండ్రిని మరిపించాడు" అన్న అభిమాని కేక మీకు వినపడలేదా? ఈ ఈలలూ,కేకలూ మీరు వినికూడా ఇది ప్రజాస్వామ్యం కాదన్నారంటే, మీరు ఖచ్చితంగా అధికారంలో లేని అప్పోజిషనన్న మాట.
ఇలా నాలాంటి వాళ్ళ సరసన మీరు అప్పోజిషన్లో మైనారిటీగా ఉండి, కేకలేసినంత మాత్రానా అధికార పార్టీ, అభిమానుల ప్రకారం మన సినిమాల్ని పరిపాలించకుండా ఆపుకుంటారా? అంటే మన ఆపోజిషనోళ్ళు మెజారిటీ అయ్యేదాకా మనం కోరుకున్న మంచి ప్రభుత్వాలు(సినిమాలు) రావన్న మాట. అందుకే మన సినిమాల ప్రజాస్వామ్యం జిందాబాద్!!!.
Posted by Kathi Mahesh Kumar at 11:30 AM 13 comments
Labels: సినిమాలు
‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ గత వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘ఆమిర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది.
అప్పుడే విదేశం నుండీ వచ్చిన ‘అమీర్’ అనే ఒక ముస్లిం డాక్టర్, ముంబై ఎయిపోర్ట్ లో అడుగుపెట్టాగానే, తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసారని ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. ఆ కిడ్నాపర్లు చెప్పినట్టు చేస్తే అందరికీ విముక్తి అని ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి తన ద్వారా చేయించదలుచుకున్న పనేమిటి? తన తలరాత (किस्मत)ని ఫోన్ కాల్ ద్వారా శాసిస్తున్న వ్యక్తికి, అప్పటి వరకూ తన భవిష్యత్తును తనే మలుచుకున్న అమీర్ ఆఖరికి చెప్పిన సమాధానం ఏమిటి? అన్నది ఈ సినిమా ఇతి వృత్తం.
ఇలాంటి విషయాన్ని ఎన్నుకోవడం లోనే, మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న ‘రాజ్ కుమార్ గుప్తా’ యొక్క పరిణితి, అభిరుచి కనపడుతుంది. అమీర్ పాత్రలో నటుడిగా ఒక కొత్త ముఖంగా ‘రాజీవ్ ఖండేల్వాల్’ పరిచయ్యాడు. మొదటి ఫ్రేమ్ నుండే రాజీవ్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటనతో పాటూ, తెరమీద తన ఉనికి చాటుకునేలా ఉన్న ఇతడి స్క్రీన్ ప్రెజెంస్,వాయిస్ క్వాలిటీ రాబోయే కాలంలో అతడ్ని నిలబెడుతుందనిపిస్తుంది. దాదాపు 1 గంటా 35 నిమిషాల ఈ సినిమాలొ ఇతను తప్ప ఇంకెవ్వరూ స్క్రీన్ పైన కనిపించరు. ఆయినా ప్రేక్షకుల్ని కట్టిపడవెయ్యగలిగాడంటే, భవిష్యత్తులో చాలా సినిమాలలో ఇతను కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది.
Posted by Kathi Mahesh Kumar at 7:13 PM 6 comments
Labels: సినిమాలు
(www.navatarangam.com లో వచ్చిన కొన్ని కామెంట్లకి సమాధానంగా రాసి,ఈ మాసంలోనే ప్రచురింపబడిన వ్యాసం ఇది)
"తెలుగు సినిమా చెడిపోయిందహే!" అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి "దీన్నుంచైనా నెర్చుకోరు" అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి "కూసింత అంతర్మధనం అవసరమోయ్" అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా... కొంచం అమృతం, మరింత హాలాహలం దయచేసాయి. వచ్చినదాన్ని భరించి గొంతులోకి నెట్టెయ్యడానికి శంకరుణ్ణో, కేవలం మంచిని మాత్రం తమమధ్యనే పంచేసుకునే సురశిఖామణినో కాకపోవడంచేత, తెగించి ఆ సారాన్నిఇక్కడ బరితెగించబూనితిని.
అసలు తెలుగు సినిమా కొత్తగా ఏంచెడిందని ఇంత కోలాహలం నెరుపుతున్నారు? అని, మహబాగా అడగడం జరిగింది. నిజమే, కొత్తగా అర్జంటుపడి చెడింది ఏమీ లేదు. ఇది చాపకింద నీరులా ఎప్పుడో చెడటం మొదలెట్టింది, మనకు గుర్తించడం చేతకాక,గుర్తెరిగిన వాళ్ళకు దమ్ముల్లేక, "రైఠో !ఎలా జరిగితే అలా జరుగుతుంది" అన్న ఉదాసీనత మొదలైన మొదటిరోజే, తెలుగు సినిమా చెడిపోవడం మొదలయ్యింది. ఈ పరిణామక్రమం యొక్క తారీఖులు లెక్కగట్టడం కన్నా, మనకు కావలసింది, ‘లెక్క మార్చడం’. ఈపని "ఇండస్ట్రీ" లోని పెద్దలో,వారి గద్దెలో చేసేది కావని నా నమ్మకం. ఎందుకంటే, ఆల్ర్రెడీ సముద్రం లో మునిగినోడు మంచినీరు ఎలా ఇవ్వలేడో, వీళ్ళ భాగోతమూ అలాగే ఉంది కాబట్టి. సినిమా పరిశ్రమతప్ప బాహ్యప్రపంచం-నిజ జీవితం దాదాపు తెలియని, వంశపారంపర్య నూతిలో కప్పలు హీరోలు గా ఒకవైపు రాజ్యమేలుతున్నారు. సినిమాకి "కేప్టన్" అని భావించే దర్శకులుగా కొత్తవాళ్ళు, ‘సహాయదర్శకత్వంపు ఊడిగం’ అధమం ఐదుసంవత్సరాలైనా చేస్తేగాని అవడం లేదు. అన్ని సంవత్సరాల దాస్యం అలవడిన వాడు, ఆర్డర్లు తీసుకోగలడేగాని "సినిమా షిప్పుని" నడపగలడా? ఇంతగా స్వజాతి సంపర్కానికి అలవాటు పడ్డ సినీపరిశ్రమ జాతికి జవసత్వాలు తమంతటతాముగా వస్తాయంటారా?
మరైతే మార్పు ఎక్కడినుండి వస్తుంది? అన్నది, పెద్ద భేతాళ ప్రశ్న కానేకాదు. కాస్తోకూస్తో మార్పు అప్పుడప్పుడు ఎక్కడినుండీ వచ్చేదో, ఇప్పుడు ఎక్కడ్నుండి వస్తోందో గమనిస్తే, సమాధానం దానంతట అదే వస్తుంది. పాతమురుగు నుండి కొత్తనీరు రానట్టే, చిత్రసీమలో డెబ్భయ్యవ దశకం మొదలు ఇప్పటి వరకూ వచ్చిన నూతన ఒరవళ్ళన్నీ పరిశ్రమేతరులు తెచ్చినవే (వారిలో కొందరు ఇప్పుడు పెద్దరికం వెలగబెడుతూ,తమ మూలాల్ని మరిచారు.అది వేరే విషయం). వంశీ,జంధ్యాల,టి.కృష్ణ మొదలు కొత్తగా కలకలం రేపిన "గమ్యం" ‘క్రిష్’ వరకూ, మనకెన్నో ఉదాహరణలు.అసలు తెలుగు సినిమా చరిత్ర "శకాల"నే మార్చిన "శివ" దర్శకుడు ఎక్కడివాడు? ఏ తెలుగు దర్శకుడి దగ్గర దర్శకత్వం నేర్చాడు?
ఇక హీరోలంటారా, వారినీ చూద్దాం. అప్పటికే చిరంజీవి, రాజేంద్రప్రసాద్,మోహన్ బాబు మినహా (వీళ్ళ వారసులూ తయారయ్యారు మన ప్రాణాలకి) మిగతా వాళ్ళందరూ దాదాపు వారసత్వం బాపతే. అంటే మొదలెట్టగానే "బాబు"లన్న మాట. అందరినీ ఒకగాట కట్టలేముగానీ, అసలు ఈ ఝాఢ్యం ఎక్కడి నుండి మొదలో మాత్రం కొంత అంతు చిక్కుతోంది.ఇక ఈ పుట్టుక ‘హీరో రాజుల’ మాట ‘దాస్య దర్శకులు’ వినక చస్తారా! వారు తియ్యమన్న సినిమా తియ్యక చస్తారా!!
హీరో లను మినహయిస్తే, చెప్పుకోదగ్గ సహాయ"నటులు" మాత్రం, ఎప్పుడూ సామాన్యజనం నుండేవచ్చి తమ విలక్షణతను చాటారు. రావుగోఫాలరావు మొదలు కోట శ్రీనివాసరావు వరకు, ప్రకాష్ రాజ్ మొదలు నిన్నమొన్నటి షఫి వరకూ అందరూ జన‘ప్రవాహం’ నుంచేగాని, నూతులూ,బాత్ టబ్బులనుండీ మాత్రంకాదు. ఇల్లా వచ్చిన కొత్తనీరు ఎప్పటికప్పుడు కొంత సినీసముద్రపునీటిలో కలుస్తున్నా, ఈ పరిశ్రమ పన్నీరవడానికి మాత్రం మూలాలని కాస్త (బహుశా సమూలంగా) మార్చడం అత్యవసరం.
ఇంతస్థాయిలో మార్పురావాలంటే, ఏ అల్లాఉద్దీన్ అద్భుతదీపమో లేక అధమం ‘జై పాతాళ భైరవి’ మంత్రమో రావాలి. ఇవన్నీ రావుగనక, ‘సునామీ’ ఎలాగూ సినీపరిశ్రమలో పుట్టించలేక, ఒక చిన్న కొత్త కెరటం (నవతరంగం) తో సరిపెడుతున్నాం. ‘ఇక్కడ సభ్యుల ఉద్దేశాలు ఘనమే ఐనా, ఆచరణ సాధ్యమా?’ అని ఒక పెద్ద డౌటు ప్రజలకి. నిజమే...!!! కాకపోతే ఒక్క మాట, దుర్మార్గాన్ని కత్తిపట్టి ఎదిరించకపోయినా "ఇది అమానుషం" అని కనీసం చాటుగాఅయినా అన్నవాడే మనిషి. అదేపని మేముచేస్తున్నాం. అదీ అంతర్జాలంలో,మరీ భాహాటంగా అంతే తేడా. ఇక ఆచరణ సాధ్యాసాధ్యాల మాట మరో సంవత్సరంలో తేలిపోతుందని నా నమ్మకం. ‘మాటలనుంచీ చేతలకి మారడానికి కొన్ని చేతులు అప్పుడే సిద్ధమయ్యాయి’ అని మనవి.
నవతరంగం ఉద్దేశం, బోరుగొట్టే లాగుడు పీకుడు ఆర్టు సినిమాని ప్రమోట్ చెయ్యడం అసలుకాదు. ఎదో ‘మంచి సినిమా’ అన్నది ఎక్కడైనా (ప్రపంచం లో ఏ మూలైనా) కనపడితే, "చూడండి" అని చెప్పడం. ఇక మన తెలుగు సినిమాకూడా బాగుపడాలని కోరడం...ఒక్కోసారి పోరడం. కనీసం చెడిందని ఒప్పుకుంటేనే, బాగుపడటానికి అవకాశం ఉంది గనక డాక్టర్లుగా మారిన కొందరు పరీక్షించి, రోగాన్ని వెతుకుతున్నారే గానీ, చెడిందని చెప్పేసుకుని పాడెగట్టెయ్యడానికి మాత్రం కాదు. తెలుగు సినిమా మా అందరిజీవితం. దీనికి కాపాడుకుందామని ఒక కోరిక అంతే! తెలుగు సినిమాలో ప్రపంచసినిమాకి సాటైన సినిమాలు రాకపోయినా ఫరవాలేదు, కనీసం తెలుగు సంస్కృతికి, భాష కూ... కనీసం మనుషులకు దగ్గరగాఉన్న ‘కథ కలిగిన’ సినిమా రావాలనే మా ఆశ, తప్పంటారా?
Posted by Kathi Mahesh Kumar at 4:00 PM 4 comments
Labels: సినిమాలు
మనతో చాలా కాలం గడిపి, ఈ మధ్యనే దివంగతుడైన ‘ఇంగితజ్ఞానం’(common sense) అనే ఒక పాత మిత్రుడిని గుర్తుచేసుకోవడానికి ఇక్కడ మనం చేరాం. తన పుట్టుకకి సంబంధించిన వివరాలు సర్కారీ యంత్రాంగంలోని రెడ్-టేపిజం కారణంగా పొగొట్టుకున్నప్పటినుండీ, కనీసం అతని వయసు కూడా తెలీకుండా బ్రతికారు. అయినప్పటికీ చాలా విలువైన పాఠాలను తను మనకి తెలియజెప్పాడు. వాటిల్లో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. "ఎదుటివాడి పనిలో తలదూర్చకు", "పక్కవాడి అభిప్రాయాలకు గౌరవమివ్వు", "అంతా నాకే తెలుసు అని విర్రవీగకు", "తప్పైతే తప్పని ఒప్పుకో" లాంటివి మచ్చుకకి కొన్ని.
ఇంగితజ్ఞానం గారు చాలా సాధారణమైన ఆర్థిక విధానాల్ని అనుసరించేవారు. ‘సంపాదన ఉన్నంతనే ఖర్చుపెట్టు’, ‘ప్రపంచ బ్యాంకైనా సరే ఉత్తినే ఇస్తే అప్పుతీసుకోకు’ వంటి మౌళిక సూత్రాలని పాటించారు. కానీ, అర్జంటుగా ఎదిగిపోవాలని అప్పులూ, ఇంకా తలకు మించిన ఖర్చులూ తన చుట్టుపక్కల అందరూ చెయ్యడం మొదలయ్యేసరికీ వీరి ఆరోగ్యం కాస్త క్షీణించింది.
అసలే అనారొగ్యంతో ఉన్న వీరు, అర్థం పర్థం లేని తెలుగు సినిమాలు, ఎప్పటికీ లాజిక్ లేకుండా సాగుతున్న TV సీరియళ్ళూ, వాటిని అదేపనిగా వీక్షిస్తూ అతుక్కుపోతున్న ప్రజలనీ చూసి కాస్త చిత్త చాంచల్యం పాలుపడ్డారు. ఈ స్థితిలోనూ కాస్త కొనఊపిరితో ఉన్న వీరి పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలనూ,నాయకుల వెర్రివేషాలనూ చూసి విషమించింది.
చివరికి మొన్న జరిగిన మంద్యం లైసెంసుల అమ్మకాల ధరలు విని, వీరు గుండాగి మరణించారు. చనిపోయిన వీరికి ‘ఆలోచన’ అనే సహధర్మచారిణి తోపాటు, ‘బాధ్యత’ అనే కూతురు, ‘తర్కం’ అనే కొడుకూ ఉన్నారు. తన నలుగురు సవతి తమ్ముళ్ళైన ‘నా హక్కు నాకు తెలుసు’ , ‘నేనే కరెక్టు’, ‘నా ఇష్టమొచ్చినట్టే చేస్తా’, ఇంకా ‘తప్పు నాది కాదు, వేరే వాళ్ళది’ ఈ అంత్యక్రియలకి హాజరు కాలేకపోయారు.
ఇంగితజ్ఞానం గారి అంత్యక్రియలకి వీరితోపాటూ చాలామంది హాజరు కాలేదు. బహుశా తను పోయారని ఇప్పటికీ చాలా మందికి ఇంకా తెలిసుండకపోవచ్చు. ఒక వేళ మీకు ఈ విషయం తెలిస్తే, అందరిలాగే మీరు కూడా, ఏమీ చెయ్యకుండా ఉండవలసినదిగా ప్రార్థన. తన ఆత్మకు శాంతి....మనకు తగిన శాస్తీ కలుగుగాక!
Posted by Kathi Mahesh Kumar at 1:01 PM 19 comments
Labels: సమాజం
"మన మీద మనకు లేని శ్రద్ధ ప్రభుత్వానికి ఎందుకుండాలీ?" అని ఒక బ్లాగులో కామెంటిన ఇండియన్ మినర్వా గారి మాట లో , మద్యం లైసెంసుల వేలం పైన అందరి ఆర్గ్యుమెంట్లనీ తునాతునకలు చేసే బలముంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల బలహీనతలతో ఆడుకునే దౌర్భాగ్యానికి దిగజారకూడదు సరే, మరి మనిషికి మాత్రం కుటుంబాన్ని పణంగా పెట్టి మరీ బలహీనతకు (దర్జాగా) లోనయ్యే హక్కు ఉందంటారా?
హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న మద్యం దుకాణాల లైసెంసు కోసం చెల్లించిన ధర ప్రతి దుకాణానికీ 2 కోట్లు పైమాట. ప్రభుత్వానికి ఈ తంతు ద్వారా చేకూరిన పైకం అక్షరాలా 1649.49 కోట్లు. ఇక లేడి నెత్తురు మరిగిన పులి, గడ్డి మేస్తుందా? తెలుగుదేశం దారి చూపితే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆరులైన్ల హైవే చేసేసింది. అంతే తేడా, కాబట్టి ఈ రాజకీయ పార్టీలలో ఎవరికీ మరొకర్ని వేలెత్తిచూపే అర్హత లేదు. ఇక మన ‘ఎర్ర’ బాబులు సరదాగా ఉద్యమాలైతే చేస్తారేగానీ, విషయానికోచ్చేసరికీ వీరూ మందుగారిపోయారు. ఇక మిగిలింది, మన జయప్రకాష్ నారాయణ్ "నిబద్దత ఉంటే బ్రాందీ,సారాలు ఎన్నికల్లో ఉపయోగించం" అని రాజకీయ పార్టీల్ని మాటివ్వమని దాదాపు సంవత్సరంగా అరచి అరచీ ఇప్పుడు పాపం నోరుపడిపోయి, నోరెళ్ళబెట్టి ఈ ప్రహసనాన్ని చూసి బాధకన్నా, ఆశ్చర్యపోవడం ఇతడి వంతైంది. పాపం !
ఇక మహిళా ఉద్యమ కర్తలూ, తెలుగు మహిళా కార్యకర్తలూ (కొంత సినీ గ్లామరు మొఖానపూసి) తమవంతుగా మీడియాలో అక్కసు వెళ్ళగక్కారు. డబ్బుపెట్టి కొన్న కొన్ని సీసాల బ్రాందీ, విస్కీలని కెమెరా సాక్షిగా పగులగొట్టి చేతులు దులుపుకున్నారు. వేలం జరుగుతున్న చోట, వేలం పాడేవాళ్ళని ఐడెంటిటీ కార్డులిచ్చి మరీ పోలీసు ఎస్కార్టులు స్వాగతిస్తుంటే, మరో వైపు లాఠీ చూపించి ఉద్యమ కారుల్ని అదే పోలీసులు శాంతింపజేస్తున్నారు. ఆహా! ఏమి మనోహర దృశ్యం. అణువణువునా హాస్యం, అడుగడుగునా TV సీరియల్ని మరిపించే డ్రామా. నిజంగా అప్పుడనిపించింది, "మందు బాబులూ మీకు జోహార్లు" అని.
బ్లడ్/కాన్ఫ్లిక్ట్ డైమండ్ ఆధారిత కొన్ని ఆఫ్రికా దేశాల అర్ధిక వ్యవస్థల్లాగా మన రాష్ట్రమూ ఈ మద్యం డబ్బుతో అభివృద్ధి సాధించే దిశగా సగర్వంగా అడుగులేస్తుందేమో! మన ఆర్థిక మంత్రి రోశయ్యగారు మాత్రం చాలా హుందాగా "ఈ డబ్బుని మధ్యపాన వ్యతిరేక ప్రచారానికి వాడతాం" అని మరో తీవ్రమైన జోకొకటి పేల్చి, లుంబినీ పార్కు బాంబు విస్ఫోటాన్ని మరిపించారు. ఇన్ని జరుగుతున్నా, ఎక్కడా కనబడని జగన్నాటక సూత్రధారి మాత్రం...పేరు తెలీని మందు బాబులు.
ప్రభుత్వాలకూ,రాజకీయ పార్టీలకూ, సామాజిక ఉద్యమ కర్తలకూ వాళ్ళవాళ్ళ జెండాలూ,అజెండాలూ ఉన్నాయ్. కానీ వ్యక్తులుగా మన గమ్యం ఏమిటి? సాఫీగా జీవితం సాహించడమే కదా ! మరి ఈ మందులో జీవితాన్ని మరిపించే సుఖముందా!?! ఉంటే మాత్రం మందుకు జై ! మందు బాబులకు జై!జై! మందు బాబులూ మీకు జొహార్లు.
Posted by Kathi Mahesh Kumar at 4:23 PM 9 comments
Labels: సమాజం
పేరు: కత్తి ముకుంద్ అవినాష్
వయసు: వచ్చే నెలకి ఐదు వస్తాయి
వాడు చేసే అల్లరంతా కెమెరా లో బంధించడం కష్టమే...
కానీ, ఏదో అప్పుడప్పుడూ ఇలా కరుణించినప్పుడు క్లిక్కు మనిపించిన ఫోటోలివి.
Posted by Kathi Mahesh Kumar at 10:03 AM 15 comments
Labels: వ్యక్తిగతం
రాజకీయపరంగా, ఆర్థిక పరంగా వీరు ఒకమెట్టు ఎప్పుడూ పైనే ఉన్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని సవాలుచేస్తూ వస్తున్న వీరు, ఏనుగుని ఢీకొంటూ కూడా తమ పంతాన్ని ఎల్లప్పుడూ నెగ్గించుకున్నారు. ప్రస్తుత కాలంలో అత్యధిక కాంగ్రెస్ MP లున్న మన రాష్ట్రానికంటే ఎక్కువ నిధులు వీరు కేంద్రం నుండీ దండుకోవడానికి కారణం, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకున్నా, ఇలాంటి పని వారు 60 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. "ఎలా?" అని మాత్రం అడక్కండి, అది తమిళోడికే ఎరుక ! దీనికి కారణం బహుశా వీరిలో గట్టిగా ఉన్న భాషా,సాంస్కృతిక బంధం అని నా నమ్మకం. ఉదాహరణకు తమిళనాడు కేడర్ లో ఎవరైనా IAS,IPS లేక IFS అధికారి వస్తే, వారు ఖచ్చితంగా తమిళం నేర్చుకుని పనిచెయ్యల్సిందే. మరోటి, ఏ తమిళుడైనా ఇతర రాష్ట్రాలలో గానీ, ఢిల్లొ లోగానీ ఈ పదవుల్లో ఉంటే తన పూర్తి నిబద్ధత తమిళనాడు పట్ల చూపిస్తాడు. ఈ రెండుకారణాలుచాలవా అభివృద్దికి!
ఇక వీరి రాజకీయ అతికి పరాకాష్టగా చెప్పుకునేది ఒక్కోసారి ఒక్కొక్కపార్టీకి వీరిచ్చే absolute majority. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్కరో ఇద్దరో MLA లు మాత్రమే ఉన్న అసెంబ్లీ సెషన్లు ఈ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఇందులో ఉన్న మతలబు పెద్ద పెద్ద రాజకీయ పండితులకి కూడా వంటబట్టలేదుగానీ, ఎవరు అధికారంలోకి వచ్చినా చివరి విజయం మాత్రం ఎప్పుడూ ఒక సగటు తమిళుడిదే అనిపిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో అంతకన్నా ఏంకావాలి?
ఇన్ని పరస్పర విరోధాభాసాల మధ్య జీవిస్తున్న కొందరు తమిళులు మనకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వారి నమ్మకం మనకు మూర్ఖత్వంగా అనిపించొచ్చు. వారి భాషా ప్రేమను చాదస్తంగా భావింఛవచ్చు. వారి సామాజిక భావావేశాన్ని అరుపులుగా వర్గీకరించోచ్చు. వారి రాజకీయ నిర్ణయాల్ని పిచ్చితనంగా అభివర్ణించొచ్చు. కాకపోతే వీరి ‘అతిని’ అర్థం చేసుకుని స్నేహం చేస్తే, I think they have a lot to offer to our culture and polity.
ఏదిఏమైనా, తమిళొళ్ళను ఎంత అపార్థం చేసుకున్నా, మొత్తం తమిళజాతికి మిగతా భాషల వారి పట్ల చిన్నచూపుందంటే, అంతగా ఆమోదయోగ్యంగా అనిపించదు. కొందరు ఇలా ప్రవర్తించే వారు ఖచ్చితంగా ఉండొచ్చుగాక, అలాంటి వారు మనలో మాత్రం లేరా? లేకపోతే "తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవం అధ్వానం" అన్నది ఎక్కడి నుండీ పుట్టిందీ?
Posted by Kathi Mahesh Kumar at 8:07 AM 27 comments
Labels: సమాజం
Posted by Kathi Mahesh Kumar at 9:06 PM 21 comments
Labels: వ్యక్తిగతం
Posted by Kathi Mahesh Kumar at 12:28 PM 26 comments
Labels: సమాజం
Posted by Kathi Mahesh Kumar at 6:14 AM 25 comments
Labels: సమాజం
"నోరు మూసుకుని చదువు!" అన్న గద్దింపు, ప్రశ్న వేసిన ప్రతిసారీ చిన్నప్పట్నించీ నేను విన్నదే. బహుశా మనలొ ప్రతి ఒక్కరికీ ఇంట్లోనో, బళ్ళోనో ఈ గౌరవం సదా జరుగుతూ ఉండేదని నా నమ్మకం. ఈ గద్దింపుల విధానం మనలోని మానవీయ ఆసక్తిని, ప్రశ్నించి, శోధించి, జ్ఞానాన్ని సమపార్జించుకోవలసిన విధానాన్ని మనకు దూరం చేసిందేమో అని నా అనుమానం. "ఈ ధర్మసందేహం హఠాత్తుగా ఎందుకు కలిగింది?" అనుకుంటున్నారా ! దానికీ ఒక కారణముంది చెబుతా.
మొన్నీ మధ్య ఇక్కడి యునిసెఫ్ (UNICEF) లో మూడు సంవత్సరాలు పనిచేసిన ‘డాక్టర్ శామ్’ అనే ఒక బ్రిటిష్ అధికారి , ఆఫ్రికాలోని ఒక దేశానికి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్న తరుణంలో, ఆయనకు భారతదేశంలో నచ్చినవి,నచ్చనివీ అని పిచ్చాపాటీగా మాట్లాడుతూ అడగటం జరిగింది. దీనికి ఆయన చెప్పిన సమాధానమేమిట్రా అంటే, తనకు బాగా నచ్చింది చాలా చక్కగా విడదీయబడిన ఋతువులు (seasons). ఎందుకంటే తను పుట్టిపెరిగిన లండన్ లో వాతావరణం ఎప్పుడేలా మారుతుందో తెలీదుగనక, అదొక సమస్యగా ఎప్పుడూ చర్చల్లో ఉండేది. ఇక్కడ ఆ బాధ లేదు అని.
ఇక ఈ చర్చకు కారణమైన, నచ్చని విషయం వినండి. "Indians are very intelligent, they have their technical basics very right. But, when it comes to inter-twining them to solve human problems, they fall inadequate" అన్నాడు. దీనికి కొనసాగింపుగా చెబుతూ, "India is unique and needs innovative approaches to solve it's problems. I am afraid, with such limitations things would become difficult" అని. ఈ మాటకి ఒక్క క్షణం మనస్సు ఛివుక్కు మంది. కాకపోతే తన ఇన్నాళ్ళ అనుభవంతో చెప్పిన మాటల్లో కొంత నిజముందనిపించింది.
ప్రశ్నించి,ఆరాతీసి, చదివిన చదువులను జీవితానికి అన్వయించుకుని, తద్వారా కలిగిన సొంత ఆలోచనలనతో సమస్యలకు సమాధానాలు వెతుక్కొగలిగేలా మన చదువులు ఉండేవా? ఇప్పుడు ఉన్నాయా? అన్న సందేహం కలిగింది. తరచి నా జీవితానుభవాన్ని చూస్తే "అలా మన చదువులు లేవేమో!" అనిపించింది.
నన్నయ,తిక్కన పద్యాలు భట్టీయం వెయ్యలేక, వేమన మీదా,ఉపవాచకం మీదా ప్రేమ ఉన్నా... తెలుగుకు ఆమడదూరం పరుగెట్టజూసిన నా బాల్యం గుర్తుకొచ్చింది. ఆరవతరగతి తరువాత, లెక్కల్లో ఫార్ములాలను బెత్తం చూపి మరీ ‘పిడిబట్టించిన’ మా మాస్టారు పుణ్యమా అని ఇప్పటివరకూ లెక్కలకు దూరంగా వెళ్ళాలన్న నా పరుగు ఆగలేదు. సైన్సు కాస్త సులభంగా ఉన్నప్పటికీ ఎనిమిదోతరగతి బౌతికశాస్త్రం లో మళ్ళో ఫార్ములాల గొడవతో నా విజ్ఞానశాస్త్రం కాస్తా అటకెక్కేసిన వైనం ఇప్పటికీ బాగా గుర్తే. సోషియల్లో మనం తెగ విజృంభించినా, హిస్టరీలో తారీఖులు గుర్తుపెట్టుకోవడం లో బోల్తాకొట్టడం గొడ్డలిపెట్టే. ఇక ఇంగ్లీషంటారా, ‘రెన్ & మార్టిన్’ ను ఆంగ్లభాషా వ్యాకరణానికి బైబిలు గా గౌరవించి, భాష నేర్పకుండా గ్రామరు రూల్స్ మాత్రం చక్కగా వల్లెవేయించిన ‘సార్’ ఒకడు తగిలాడు; నా ఆంగ్లపాండిత్యానికి గండి కొట్టడానికి. ఇలా అనుమానమొస్తే అడక్కుండా, ప్రశ్న ఉదయిస్తే దాన్ని మనసులోనే అస్తమింపజేసి, పదవతరగతి వరకూ ‘నోరు మూసుకునే’ చదివేసా.
ఇంతటి భారీ పునాది కలిగిన నాకు, ఆ తరువాతి క్లాసుల్లొ ప్రశ్నించడం నేర్పబట్టీ, సాహిత్యాన్ని చదవబట్టీ కాస్తోకూస్తో స్వతంత్రంగా, సమాజం కోసం కాకపోయినా కనీసం నా కోసం నేను ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. ఒక సమస్య వస్తే ఫార్ములాని గుర్తుచేసుకోకుండా, దాన్ని అక్కడున్న పరిస్థితులను బట్టి స్వతంత్రంగా అర్థం చేసుకుని సమాధాన పరిచే ప్రయత్నాన్ని కాస్తైనా చేయగలుగుతున్నానని ఓ ఫీలింగ్.
అందుకే మన చదువులు కంఠతాపట్టి, ఏదో ఒక డిగ్రీ చేతబట్టి, ఉద్యోగం గుడ్డిగా వెలగబెట్టడానికి తప్ప వ్యక్తిగా ఈ సమాజానికీ, దేశానికీ ఉపయోగపడేలా ఉండటం లేదు అనే నీరసమైన నమ్మకం వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. డాక్టర్ శామ్ అన్నట్టు, భారతదేశం చాలా ప్రత్యేకమైనది...ఈ ప్రత్యేకమైన దేశానికి ఉపయోగపడే చదువులు మనం చదివామా? ప్రస్తుతం ఉన్న తరం చదువుతోందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
Posted by Kathi Mahesh Kumar at 2:40 PM 13 comments
Labels: సమాజం
Posted by Kathi Mahesh Kumar at 2:30 PM 7 comments
పేట్రోల్ ధరలు మండిన వార్త వినగానే "ఐతే ఏడ్లు కట్టండి" అనెక్కడన్నా వినపడుతుందేమో అని నా కనుల్నే చెవులుగా చేసి తెలుగు బ్లాగులన్ని ఆలకించేసా. తీరా చూస్తే, "పాపం మనం !" అనే బదులు సుజాత గారు ఆమోదయోగ్యమైన ప్రధానిగా మాత్రమే మిగిలిపోయి, "ఇది తప్పదు" అని చేతులెత్తేసిన మన్మోహన్ సింగ్ ను "పాపం!" అనేసరికీ, నా మెదడు మోకాల్లోకొచ్చి కొంత అతివాగుడు కామెంటెట్టి ఊరుకున్నా.
కాకపోతే నా మనసు మూలలో, "ఎందుకిలా చమురు ధరలు తగలడ్డాయా?" అన్న యక్షప్రశ్న బీజమై నాటుకుపోయింది. అది బహుశా కాస్త సారమైన మూలలో పడినట్టుంది. అందుకే ఈ రోజు హిందూస్థాన్ టైమ్స్ పేపరు లో ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర్ర ప్రభుత్వం పెట్రోలు,డీజల్ పై వేసే పన్ను మాత్రమే, లీటర్ కు 33 రూపాయలని చదివేసరికీ గుండె గుభేలుమని నానా రసాలన్నీఊరి ఆ అనుమాపు బీజాన్ని కాస్తా "ఇంతై వటుడింతై, బ్రహ్మాండంబంతై" అన్న తీరులో మహావృక్షం చేసేసాయ్.
ఈ వృక్షవిశాలాన్ని నా చిన్ని మనసులో కూర్చలేక, కుదించలేక భలే ఛావొచ్చిపడిందని తలచి కాస్త ఈ మతలబుని తెల్సుకుని నెమ్మదించుదామనుకున్నా. అనుకున్నదే తడవుగా కాస్త ఇలాంటి జ్ఞానంలో ప్రవీణుడైన మా ‘ఇంటాయన్ను’ ("నువ్వే మీ ఆవిడకో మొగుడివి, నీకింకో మొగుడా!" అని రావుగోపాలరావు లా పిదపబుద్ది చూపి అనేసుకోకండి, ఇంటాయనంటే మా ఇంటి ఓనర్ అనే సాధారణంగా) ఈ విషయమై ఆరాతీసా, కూపీలాగా.
నా సందేహ వృక్షరాజాన్ని ఆయన తేరిపారా తిలకించీ,నా మొర సాంతం ఆలకించి, సాలోచనగా "ఇలా జరగకూడదే" అన్నాడు. ఎలా జరక్కూడదో మనకస్సలు తెలియదు గనక వెర్రినవ్వొకటి విసిరి, ఇండియా మార్కు తెలిసీతెలియని తలఊపుడు ఒకటి ఇచ్చుకున్నా. నా అజ్ఞానాన్ని గ్రహించినవాడై, "పెన్నూపేపరూ తీసుకో" అన్నాడు. "సరే" అని కలంకాగితాన్ని నా అజ్ఞానాన్ని పోగొట్టే దివిటీలా, స్టాచ్యూఆఫ్ లిబర్టీ తరహాలో పట్టుకు కూర్చున్నా. "ఒక లెఖ్ఖ వెయ్" అన్నాడు మా ఇంటాయన. అసలే మనం లెఖ్ఖల్లో పెద్ద బొక్కగనక (జీరో అని గ్రహించి,ఈ శ్లేష పదాన్ని క్షమింఛగలరు) నా మొబైల్ లో ఉన్న క్యాలిక్యులేటర్ ని నిర్లజ్జగా నొక్కడానికి ప్రయత్నిస్తుండగా తనే "ఫరవాలేదు చిన్నలెఖ్ఖే" అని నోటితోనే ప్రపంచపు ఆయిల్ ఖాతాలన్నీ లెఖ్ఖగట్టిపారేసి నా విశాలవృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలించకపోయినా, ఒక కంఫర్ట్ లెవల్ కి కుదించాడు. ఈ కుదింపు లెఖ్ఖ కాస్త పంచుకుంటా!
ఒక బ్యారల్ (200 లీటర్లు) క్రూడ్ ఆయిల్ ధర, ప్రపంచ మార్కెట్టులో ఈ రోజు 125 $ అమెరికన్ డాలర్లు. అంటే ఒక లీటరు ధర మన రూపాయిల్లో ఐతే Rs 25/- అన్న మాట. ఇక మిగిలింది దానిని శుద్దిచేసే ఖర్చు. రిలయన్స్ రిపైనరీ వారి లెఖ్ఖల ప్రకారం ప్రతి బ్యారల్ కూ దాదాపు 10$ డాలర్ల ఖర్చు శుద్దీకరణకు వెచ్చించబడుతుంది. అంటే ఒక లీటరుకి కేవలం Rs 2/- ఖర్చు. అంటే, వెరసి ప్రస్తుతం ఉన్న ఖర్చులతో సహా లెఖ్ఖగడితే, మన పెట్రోలు ధర కేవలం Rs 27/- ఉండాలి. కానీ ఉందా? ఇక రవాణా, పరిశ్రమ లాభం, అతిగాలేని సేల్స్ ట్యాక్స్ కలుపుకుని పది రూపాయలనుకున్నా, Rs 37/- దాటకూడదన్నమాట. మరి ఇప్పుడు ధర...దాదాపు 60 రూపాయలు. ఇక మండదా గుండె?
ఇక నష్టం వచ్చే అవకాశమే లేనప్పుడు "పరిశ్రమ నష్టాల్లొ ఉంది" అని ఇంత హంగామా ఎందుకూ? అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. దీనికీ సమాధానం ఉంది. పోయిన సంవత్సరం క్రూడ్ ఆయిల్ రేటు ప్రకారం పరిశ్రమతో రేటు విషయమై (తనకు రావల్సిన పన్నుతోసహా) ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, ఒకవేళ ప్రపంచ మార్కెట్టులో ముడిచమురు ధర పెరిగినా, పరిశ్రమలను తన రేటు మాత్రం పెంచొద్దని చెప్పి, తనవంతు పన్ను మాత్రం దర్జాగా దండుకొని నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పన్ను మినహాయించి, లేక తగ్గించి నష్టాల్ని భర్తీ చెయ్యొచ్చు. కానీ, ఎన్నికల సమయంలో ‘అభివృద్ది చూపించడానికి’ కావలసిన డబ్బు లేకుండాపోతుంది. అందుకే పరిశ్రమ పేరు చెప్పి, ప్రభుత్వం తన జేబులూ పెట్రోలు డబ్బుతో ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని నింపుకొంటున్నదన్నమాట.
ఇవన్నీ తెలిసిన తరువాత ‘ఎడ్లు’ కాదు, ప్రభుత్వానికి పాడెగట్టాలన్నంత కోపమొస్తోంది.
Posted by Kathi Mahesh Kumar at 7:29 PM 15 comments
Labels: సమాజం
Posted by Kathi Mahesh Kumar at 4:05 AM 43 comments
Labels: జీవితం
Posted by Kathi Mahesh Kumar at 1:00 PM 14 comments
Labels: జీవితం