Thursday, June 4, 2009

‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా!

మీరాకుమార్ ను స్పీకర్ గా ఎంపిక చేసిన మరుక్షణం, "‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా! సామర్ధ్యం అవసరం లేదా?" అనే ప్రశ్నలు మీడియాలో వినబడుతున్నాయి. ఇక్కడా మెరిట్ వర్సెస్ కోటా వాదనలు అర్జంటుగా ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ "ఒక మహిళ, ఒక దళితమహిళ, దళితనేత జగజీవన్ రాం పుత్రిక లోక్ సభకు స్పీకర్ అవ్వడం" చారిత్రాత్మకం అని మీరాకుమార్ ను గురించి చెప్పడాన్ని సాకుగా తీసుకుని రంగులు పులిమి తిమ్మినిబమ్మిని చెయ్యడానికి చాలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఒక మాజీ ఐ.ఎఫ్.ఎస్ అధికారిణి. ఐదుసార్లు విజయవంతంగా లోక్ సభకు ఎన్నికైన రాజకీయ నేత. వివధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా చేసిన అనుభవజ్ఞురాలు. కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా చేసిన సామర్ధ్యం మీరాకుమార్ లో ఉండగా, ఇప్పుడు హఠాత్తుగా తన సామర్ధ్యం మీద ప్రశ్నలెందుకు ఉదయిస్తున్నాయో అన్నది చిదంబర రహస్యం. రాజకీయాలకు అతీతంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, వివిధ స్వచ్చంధ సేవా కార్యక్రమాలూ/ఉద్యమాలకు అధ్యక్షత వహించిన ఘనతకూడా మీరాకుమార్ కు ఉంది. 1967 లోవచ్చిన ఈ శతాబ్ధపు అత్యంత భయంకరమైన కరువు కాలంలో National Drought Relief Committee కి అధ్యక్షురాలిగా మీరాకుమార్ చేసిన సేవ అత్యంత ముదావహం. దళిత ఉద్యమంలో,మానవహకుల ఉద్యమంలో గత ఇరవై సంవత్సరాలుగా మీరాకుమార్ అందిస్తున్న సేవ అమోఘం. అంతేకాక రైఫిల్ షూటింగ్ లాంటి స్పోర్ట్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారిణి మీరాకుమార్. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాకూడా తన సామర్ధ్యాన్ని శంకించడం అంతర్లీనంగా మీడియాలో పేరుకుపోయిన లింగ,కుల వివక్షకు సంకేతం కాక మరేమిటి?

భారత రాజకీయాలలో సామాజిక సింబాలిజం కున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. అంత మాత్రానా సామర్ధ్యలేమితో కాంప్రమైజ్ అవుతూ రాజ్యాంగపరమైన బాధ్యతలను అంటగడుతున్నారన్నది అత్యంత అసంబద్ధమైన వాదన. ముఖ్యంగా మీరాకుమార్ విషయంలో ఈ వాదన అత్యంత పేలవం. లోక్ సభ స్పీకర్లను తయారు చెయ్యడానికి ప్రత్యేకమైన స్కూలేదీ లేదు. ఎన్నికైన సభ్యుల నుంచే ఒక ఆమోదయోగ్యమైన సభ్యుడ్ని/సభ్యురాల్ని స్పీకర్ గా ఎన్నిక చేస్తారు. ఇప్పుడూ అదే జరిగింది. మీరా కుమార్ స్పీకర్ సీట్లో కూర్చుని ఒకరోజుకూడా కాలేదు. అప్పుడే "సామర్ధ్యం లేదు" అంటే ఎవరు నిరూపిస్తారు? ఎలా నిర్ధారిస్తారు?

సోమ్ నాధ్ చటర్జీ, బాలయోగి, సాంగ్మా అందరూ స్పీకర్లయ్యాకనే సభాపాలనతో తమ మార్కు ప్రత్యేకతను చాటారు. తమదైన సాంప్రదాయాలను నిలిపారు. ఇప్పటి వరకూ ఒక మహిళ స్పీకర్ అవలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మీరాకుమార్ ఒక కొత్త ఒరవడిని తీసుకురాదని ఖచ్చితంగా ఎరైనా చెప్పగలరా? మరి ఈ స్పెక్యులేషన్స్ ఎందుకు? ఎందుకంటే ఒక మహిళ, ఒక దళిత మహిళ సామర్ధ్యం మీద ప్రశ్నలు రేపడం చాలా సులభం గనక. అలా చేస్తే ఒక తరగతి ప్రజలు సంతోషిస్తారు గనక. ఇందులో వివక్ష లేదు అంటే నమ్మేదెలా?

ఒకానొక ఛానెల్లో అయితే మరో మెట్టు దిగి మీరాకుమార్ సన్నని పీల గొంతు పెద్ద డిస్క్వాలిఫికేషన్ అన్నట్లుగా పదినిమిషాల కథనాన్ని వినిపించేశారు. లోక్ సభను అదుపులో పెట్టడానికి కంచుకఠం కావాలనీ, అది లేదు కాబట్టి మీరాకుమార్ తగదనీ తేల్చేశారు. బహుశా వీళ్ళకు స్పీకర్ బాధ్యతల గురించి కనీస పరిజ్ఞానం కూడా ఉన్నట్లు లేదు. మనం ‘లోక్ సభ టివి’లో చూసే ప్రొసీడింగ్స్ మాత్రమే స్పీకర్ పని కాదు. అంతకు మించిన రాజ్యాంగ బాధ్యతలు స్పీకర్ కున్నాయన్న ఎరుక కూడా లేకుండా మీరాకుమార్ సామర్ధ్యాన్ని శంకిస్తున్న ధోరణిని ఏమనాలి?

మహిళా రాష్ట్రపతి, మహిళా స్పీకర్, మహిళా యూపీఏ చైర్ పర్సన్, మహిళా ప్రతిపక్ష నేత (లోక్ సభ లో సుష్మాస్వరాజ్) ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పటికైనా పాస్ అవుతుందా అనే ఉపయోగకరమైన చర్చలు వదిలేసి ఇలాంటి వివక్షాపూర్వకమైన చర్చలతో మీడియా కాలయాపన చెయ్యటం కొత్త కాకపోయినా, (మరొక్కసారి) నిరాశాజనకం అనిమాత్రం చెప్పొచ్చు.

*****

11 comments:

Anonymous said...

బాగా చెప్పారు.. నా దౄష్టి లొ ఆడైన, మగైన, దళితైన, వేరే ఎవరైన సమర్దవంతంగ నిర్వర్తిస్తే చాలు..

మేధ said...

నాకు అర్ధం కానిది ఒక్కటే... ఆవిడ కి అన్ని సామర్ధ్యాలుండగా, దళిత మహిళ కి పట్టం గడుతున్నామని మన్మోహన్ గారు మాట్లాడడం ఎందుకు.. ఆయన ఒక్కరే కాదు, అన్ని చోట్ల అదే వాదన... ఎంతసేపూ దళిత మహిళ, అదీ-ఇదీ.. ఆవిడ దళితురాలా వేరొకటా అనేది అనవసరం, ఆవిడ బాధ్యత సభ సజావుగా జరిగేలా చూడడం.. దానికి ఏమి చేయగలదో చూడాలి కానీ, ఇలాంటి ఉపమానాలన్నీ పెట్టి, అసలు విషయం మరుగున పడేస్తున్నారు...

గీతాచార్య said...

నేను మాయావతి పోస్టప్పుడే అన్నాను. ఈ రకమైన టాగ్స్ ని తగిలిస్తారని. ఇవి వదిలించుకోందే మనం ఎదగం. మనం అంటే మహేష్, గీతాచార్య అని కాదు. ఈ జనాలు అని.

Kathi Mahesh Kumar said...

@మేధ: నేటి రాజకీయాల్లో political posturingకున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. ఇక సామాజిక సింబాలిజంకున్న ప్రాముఖ్యత దాచుకునేదీ అసలు కాదు. మన్మోహన్ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ పంపాలనుకున్న (రాజకీయ)సందేశానికి చిహ్నం.

గత రెండు దశాబ్ధాలవరకూ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలా నిలిచిన దళితులు బి.ఎస్.పి పుణ్యమా అని దూరమయ్యారు. బీహార్ లో కాంగ్రెసేతర శక్తిగా లాలూ,నితీశ్,పాశ్వాన్ ల ఎదుగుదలతో బీసీలు దూరమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ తన పాతవైభవాన్ని తిరగితెచ్చుకునే ఏర్పాట్లలో ఉంది. ఈ బృహత్తర పధకంలో ఒక చిన్న భాగమే ఈ ఎన్నిక.

దళితులకు సముచిత స్థానం కల్పించే పార్టీగా కాంగ్రెస్ మాయావతి ఏకఛత్రధిపత్యానికి చెక్ పెట్టొచ్చు.దళిత ఆత్మగౌరవాన్ని దువ్వి మరింతగా ఉత్తరప్రదేశ్ లో బలపడొచ్చు. అలాగే మీరాకుమార్ బిహార్ నుంచీ అవడం వలన బీహార్ గౌరవానికి, క్షేమానికీ కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందనే మెసేజ్ కూడా పంపొచ్చు.ఇది కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్. వారి రాజకీయ భవిష్యత్తుకు రాచబాట.

ఈ విధమైన రాజకీయ విశ్లేషణ ఎంతైనా చెయ్యదగ్గదే.కాంగ్రెస్ పార్టీ రాజకీయ విన్యాసం ఎంతైనా చర్చనీయమే. కానీ ఈ సాకుతో మీరాకుమార్ సామర్ధ్యంపై ప్రశ్నచిహ్నలు తగిలించడం మాత్రం కేవలం వివక్షా పూర్వకమే.

గీతాచార్య said...

ur analysis is nice, and logical

Anil Dasari said...

>> "‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా! సామర్ధ్యం అవసరం లేదా?" అనే ప్రశ్నలు మీడియాలో వినబడుతున్నాయి"

నేను ఈనాడు ఒక్కటే చదివాను. ఈవిడ దళితురాలు అని మీ టపా చదివితేనే తెలిసింది. పై ప్రశ్నలు ఆంగ్ల మీడియావా?

>> "ఎందుకంటే ఒక మహిళ, ఒక దళిత మహిళ సామర్ధ్యం మీద ప్రశ్నలు రేపడం చాలా సులభం గనక"

Well, 'దళిత' కార్డు ఎదగటానికి పనికొచ్చినప్పుడు అదే కార్డు పేరుతో ఎదురు దెబ్బలూ తగుల్తాయి. తప్పదు. మీరా కుమార్ గురించి మాట్లాడటం లేదు నేను. ఆవిడ గురించి పెద్దగా తెలీదు నాకు. మీ వ్యాఖ్యకి సంబంధించి ఒక సాధారణీకరించబడ్డ అభిప్రాయం నాది.

ప్రశ్నలు రేపటానికి దళితా కాదా అన్నది అనవసరం. సోనియా, ప్రతిభా పాటిల్ మీదా కూడా రేపబడ్డాయి ప్రశ్నలు. రాజకీయం ముఖ్యం అక్కడ. దానికి ఏది ఉపయోగపడితే అది వాడుకుంటాయి ప్రతిపక్షాలు, వాళ్లకి దన్నుగా నిలిచే మీడియా. మీరే చెప్పారు కదా, మన్మోహన్ వ్యాఖ్య ఓ రాజకీయ సందేశం అని. అందులో ఎంత రాజకీయం ఉందో, ఇందులోనూ అంతే రాజకీయం ఉంది. ఏతా వాతా, దళిత వాదమైనా, మరే వాదమైనా రాజకీయాంశాలే.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్ళ కులం గుఱించి మాట్లాడే దురలవాటు ప్రజలకు చేసింది మొదట బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాల నాయకులు. ఆ తరువాత అది మీడియాలో ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఆ తరువాత అది మనందఱికీ ఒక మానసికవ్యాధిలా అంటించబడింది.

"దళితమహిళ, దళితమహిళ, దళితమహిళ....."

మళ్ళీ ఆ దళితుల్లో కూడా ఆమె మాలా ? మాదిగా ? మాదిగయితే క్రైస్తవురాలవునా ? కాదా ? ఇదే చర్చతో మన జీవితాలు తెల్లవాఱుతున్నాయి. ఇహ మనం మీరాకుమార్ ని ఒక మనిషిగా, వ్యక్తిగా చూసేదెప్పుడు ?

satya said...

మహేష్ గారు,

మీరాకుమార్ ని కేవలం దళిత నేత గా పరిగణించటం తప్పే.. కానీ అలా project చేస్తుంది మాత్రం కాంగ్రెస్ అనే విషయం మరువకండి.

Btw..ఇక్కడే నాదొక సూచన.. ప్రతిపక్ష నేత గా, సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా, 6 సార్లు ప్రజలమద్దతు తో గెలిచిన నేత, మాజీ ఉప ప్రధాని ని కేవలం ఒక హిందుత్వ నేత గా విమర్శించి మనం సంబరపడకూడదు.

vrdarla said...

manchi post raasaaru. abhinandalnalu

కత్తి మహేష్ కుమార్ said...

@సత్య: కాంగ్రెస్ మీరాకుమార్ ని దళిత మహిళగా ప్రొజెక్ట్ చెయ్యడంలోని రాజకీయ ఉద్దేశం తెలియనిది కాదు. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ వ్యక్తి సామర్ధ్యాన్ని శంకించడాన్ని మాత్రమే నేను తప్పుబడుతున్నాను.

ఇక్కడ హఠాత్తుగా అద్వానీ విషయం ఎందుకొచ్చిందే నాకు తెలీదుగానీ, అద్వానీ హిందుత్వ భావజాలానికి సంబంధించిన జాతీయ నేత అనేది బీజేపీకి గౌరవప్రదమైన గుర్తింపే కదా! ఇందులో derogatory ఏమీ లేదే. They are proud of that identity.

@తాడేపల్లి: మన సామాజిక రాజకీయ వ్యవస్థలు ఇలా ఉన్నంతవరకూ వ్యక్తుల కన్నా వారి పుట్టుకలు ముఖ్యంగానే ఉంటాయేమో!

@అబ్రకదబ్ర: ఒక్క అంగ్ల మీడియా మాత్రమే కాదు. హిందీ మీడియాకూడా ఇదే పోకడలు పోయింది. నేను టపాలో చెప్పిన "పీల గొంతు" కథనం ఆజ్ తక్ లోనిది. లింగ,కుల వివక్ష అంతర్లీనంగా మన మీడియాలో ఉన్నదే. ఈ చర్చలు దానికి ఉదాహరణ మాత్రమే.

@దార్ల గారు:ధన్యవాదాలు.

కెక్యూబ్ వర్మ said...

Neti ennikala vyavasthalo saruku kaanidedi ledu. intamandi mahilalunnta matraana mahilalapai jarugutunna amanaveeya daalu agledu kadaa. idamta prajalanu bhramalalo vunchadaaniki. crorepati kuturugaa edigina lady dalith mahilaga ela gurtistunnaro perumaallake eruka.