Friday, June 12, 2009

కథ వెనుక కత/సొద

గాల్లోంచీ పుట్టడానికి కథలు స్వాములోరి విభూధో, లింగాలో కాదు కదా! ఈ కథా గాల్లోంచే పుట్టలేదు. నా స్వీయానుభవాల్లోంచీ కాకపోయినా, నేను చూసిన ఘటనల్లోంచీ పుట్టింది. నాకు పరిచయమున్న మనుషుల్లోంచీ పుట్టింది. విడివిడి అనుభవాల్నీ, విభిన్నమైన ఘటనల్ని, వేరువేరు మనుషుల్ని ఒక్క తాటితో బంధించి ఒక్క కథగా చెబుతామన్న నా ఆలోచనలోంచీ వచ్చింది. అక్కడ్నించీ ప్రారంభమయ్యింది నా కథ వెనుక కథ.

కథ రాయాలి అనుకున్నాక, ‘కథే ఎందుకు’ అనే ప్రశ్నకాక ‘కథంటే ఏమిటి’ అనే అంతర్మధనం మొదలయ్యింది. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో రాసేది సాహిత్యమేనా! పేరున్న పత్రికలూ వాటి సంపాదకులూ "వాహ్ వాహ్" అనకుంటే ఆ కథకు అస్తిత్వం ఉంటుందా? అనే కొసరు ప్రశ్నలనుంచీ, అసలు కథంటే ఏమిటి అనే అసలు ప్రశ్న ఉదయించింది. అంటే నేను చిన్నప్పుడు చందమామా,బాలమిత్ర చదవలేదని కాదు. పెద్దయ్యాక కొడవటిగంటి, చిట్టిబాబు,మధురాంతకం రాజారాం, చలం కథలు ఎరగక కాదు. సమస్యల్లా అవి ఎరిగుండటమే అనిపించింది. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కథను నిర్వచించలేదు. కథల్ని సృష్టించారు. కథన రీతుల్ని కవ్వించారు. కథాశైలిని నర్తింపజేసారు. ఏ ఒక్కరి కథాగమనం మరొకరితో పోల్చలేం. ఏ ఒకరి మూసనూ ఇదే కథ అని తేల్చలేము. అంతెందుకు, మధురాంతకం గారు స్వయంగా తెలుగు కథా చరిత్ర గురించి రాసిన ‘కథాయాత్ర’ లో తెలుగు కథ పరిణామం, పాత్ర చిత్రణల్ని గురించి చెప్పారేగానీ తెలుగు కథకు ఈ లక్షణాలే ఉండాలని శాసించలేదు. కానీ,ఇప్పుడు ఒక ‘కత’ చెబితే "అబ్బే ఇది కథలాగా లేదే" అనే నిర్ణయస్వరం బహుగాఠ్ఠిగా వినిపించేస్తున్నారు. ఇక మంచికథ, గొప్పకథ, ప్రమాణాల్లో తూగే కథ అని నానారకాల లేబుళ్ళు కూడా తయారయ్యాయి. అందుకే నేను రాసిన తరువాత "ఇది కథ కాదు. నాకు కథ అంటే ఏమిటో తెలీదు" అనే డిస్క్లైమరొకటి పడేద్దామనుకుని రాయడం మొదలెట్టాను.

నాకు తోచినట్లు, నేను అనుకున్నట్లు రాసేసాను. తీరా రాశాక, ఇప్పుడింకో తంటా. కొందరు మిత్రులకి రహస్యంగా చూపించాను. కొంచెం పరిణితి కనిపించిందన్నారు. కొంత ఎడిటింగ్ అవసరం అన్నారు. "నువ్వే కనిపిస్తున్నావ్ నీ పాత్రలెక్కడా?" అని ప్రశ్నించారు. కథా వస్తువు బాగుంది కానీ పాత్ర చిత్రీకరణ "ప్చ్" అని పెదవి విరిచారు. "డిటెయిల్స్ ఎక్కడా? వర్ణనలు ఏవి?" అని గద్ధించారు. "బ్లాగులో కావాలంటే పెట్టుకో పత్రికలకు పంపితే ఇంతే సంగతులు చిత్తగించవలెను" అన్నారు. కనీసం వెబ్ పత్రికలకు పంపించు వారి ఫీడ్ బ్యాక్ మంచి చేస్తుందేమో అన్నారు. కథలో ఉన్న లోటుపాట్లేమిటో ఇది కథగా ఎందుకు క్వాలిఫై కాదో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఒకరు సహృదయతతో "అసలు కథ ద్వారా ఏంచెప్పలనుకున్నావు?" అని అడిగారు. దిమ్మతిరిగిపోయిందంటే నమ్మండి. చచ్చీచెడీ చెప్పాలనుకున్నది కథరూపంలో చెప్పేస్తే, ఏంచెప్పాలనుకున్నావని అడిగితే ఎలా!

ఒక స్నేహితుడు శ్రమపడి వాక్య నిర్మాణాన్ని సరిదిద్ది ప్రవాహంలో అర్థాలు కోల్పోతున్న వాక్యాలకూ ఊతమిచ్చి ఒడ్డుకు చేర్చారు. మరో మిత్రుడు "నీ అభిప్రాయాలను పాత్రల చేత పలికించి, నీ భావాలను పాఠకులపై ఎందుకు రుద్ధాలనుకుంటున్నావు?" అని సూటిగా ప్రశ్నించాడు. "కథ రాసింది నేను. ఈ ఆలోచనలు పాత్రల రూపంలో అయితే బాగుంటాయని నిర్ధారించింది నేను. ఆ భావలకు భాషనందించి ఒక రూపుదిద్దింది నేను. అలాంటప్పుడు ఈ కథ ‘నా కథ’లాగా కాకుండా పాత్రల కథగా ఎందుకుండాలి?" అని ఎదురు ప్రశ్నిస్తే నీ తలరాత అని తప్పుకున్నాడు. అంతటితో ఆగుతానా, పాఠకులపై నేను రుద్ధడమేమిటి? అని ప్రశ్నించాను. తన దగ్గర నుంచీ సమాధానం లేదు. ఇక భావాల సంగతంటావా, ఎంత మంది తమ ప్రేమ రొదల్ని కవితలుగా అల్లటం లేదు. ఎంత మంది తమ విరహ వేదనల్ని కావ్యాలు చెయ్యటం లేదు. మరి నేను నా భావాలను కథగా రాస్తే తప్పేమిటి అనిపించింది. అంతగా అయితే దీన్ని అభిప్రాయాల కథ, ఆలోచనల కథ, సొంత భావాల కథ, మహేష్ భావజాలం కథ అని ఎన్నైనా అనుకో అని ఆ మిత్రుడికి వెసులుబాటు కల్పించేశాను. ఎవరో ఒకరు పుట్టిస్తేగానీ భాషలో పదాలు పుట్టనట్లు, కొందరు మనుషుల్ని కలగలిపితేగానీ ఒక కథాపాత్రవ్వదుకదా! కొన్ని ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ వారిలో నింపితేగానీ ఆ పాత్రలకు రూపం రాదుగా! మరి ఆ ఆలోచనలూ, అభిప్రాయాలూ రచయితవైతే వచ్చిన తప్పేమిటి? లేదా రచయిత ఆశించినవైతే వచ్చే నష్టమేమిటి అనేవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

ఈ కథకాని కథకొస్తే... అసలు ‘దేవత’ అనే పదానికి నెగిటివ్ అర్థం వచ్చేలా చూడొచ్చనే ఆలోచన కలిగించిన మిత్రుడు హరీష్ కు శీర్షిక క్రెడిట్ ఇవ్వాలి. కాలేజిలో ప్రియ అని మధురై నుంచీ ఒక జూనియర్ ఉండేది. చాలా అందమైన పిల్ల. ఎంత అందమంటే...నిజంగా కల్పనల్లోని దేవతలాగా, రవివర్మ పెయింటింగ్ లోని దేవతలాగా ఉండేది. ఒకసారి ఆ అమ్మాయి అందాన్ని పొగుడుతూ ఉంటే హరీష్ అన్నాడు "నిజమే ఆ అమ్మాయి దేవత. నీకూ నాకూ ఇక్కడున్న అందరికీ పూజించి ఆరాధించడానికి తప్ప మరెందుకూ పనికిరాని దేవత" అని ఎత్తిపొడిచాడు. అప్పుడనిపించింది, what a way of looking at it అని. అద్వితీయమైన మంచితనాన్ని కూడా దేవతల లక్షణంగా చెబుతాం. కానీ, ఆ మంచితనాన్ని సాధారణమైన మనుషులు భరించలేరు. అలాంటిది, ఒక స్త్రీ మగాడితో సమానంగా వ్యవహరిస్తేనే భరించలేని వ్యక్తికి ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ ప్రేమిస్తే ఆమెనుకూడా భరించలేడు అనే ఆలోచన ఎప్పటి నుండో ఉండేది. అలా ప్రారంభమయ్యింది ఈ దేవత కథ.

హేమంత్ పాత్ర కొంత నేను మరికొంత నాకు బాగా తెలిసిన కొందరు మగాళ్ళ మనసుకు, ఆలోచనకూ రూపం. చిన్నప్పటి నుంచీ నూరిపోయబడిన ‘మగతనం’, మారుతున్న ఆధునిక నగరీయ జీవితంలోని అంగీకరించలేని ‘లైంగిక సమానత్వం’ మధ్యన వ్యక్తిత్వాన్ని విశాల పరుచుకుంటున్నామో లేక కోల్పోతున్నామో తెలియని యువతకు ప్రతినిధి హేమంత్. పర్వర్టో, దుర్మారుడో కాదు. కేవలం గుర్తింపు రాహిత్యం (identity crisis)లో కొట్టుమిట్టాడుతున్న సాధారణమైన మగాడు. హేమంత్ ని విలన్ ని చెయ్యడం చాలా సులభం. తనలో ఒకే క్షణంలో ఉద్భవించే ఉన్నత భావాలు, లేకి అభిప్రాయాల మధ్యనున్న వైరుధ్యాల్ని ఆరా తియ్యడం మరీ సులభం. కానీ అంతకన్నా తన "ఉదాత్తమైన వెధవతనాన్ని" సహానుభూతితో అర్థం చేసుకోవడం చాలా అవసరం అనిపించింది.తన ఆలోచనల్లోని బలహీనతల్ని తన నమ్మకాలుగా చెప్పించడం ద్వారా, పాత్ర వెధవ అని తేలుతుంది. కానీ తన నమ్మకం పట్ల సానుభూతిని మిగులుస్తుంది అనిపించింది. అందుకే కథను ప్రధమ పురుషలో తన తరఫునుంచీ చెప్పించాలనిపించింది. ఎలాగూ హేమంత్ నాలో కొంత భాగం, నాకు తెలిసిన ఇతరుల ఆలోచనల రూపం కాబట్టి కథకుడిగా కథను ‘నడిపించడం’లో వెసులుబాటు ఉంటుందని అలా కానిచ్చేసాను.

నిజానికి నాదృష్టిలో హేమంత్ నిజమైన హీరో. తనకు సామాజిక సంక్రమణలుగా లభించిన బలహీనతల్ని నమ్మకాలుగా మలుచుకుని, ఆ నమ్మకాల కోసం సుప్రియ ప్రేమను త్యజించిన హీరో హేమంత్. సాధారణంగా హీరో అంటే మారాలి. తన బలహీనతల్ని అధిగమించి "మంచి"గా మారాలి. కానీ ఈ హీరో ట్రాజిక్ హీరో. తన బలహీనతల కోసం వెధవలాగా పాఠకుల మనసుల్లో మిగిలిపోయే నాయకుడు. అలా మిగిలిపోతూ కూడా మగపాఠకుల మనసుల్లో కొన్ని ప్రశ్నల్ని నిలిపే హీరో. కథ చదివిన మగపాఠకులు బయటకు ఒప్పుకోకపోయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలు అసంకల్పితంగానే ఎప్పుడో ఒకసారి తమకూ వచ్చాయనే స్పృహ కలిగించే ధీరుడు. ఇక స్త్రీపాఠకులు ఖచ్చితంగా identify చేసుకోగలిగిన హీరో అని ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరలేదనుకుంటాను.

సుప్రియ పాత్రలోని యాక్సిడెంట్ ఘట్టం. కుడిచేయి పోతే ఎడమచేత్తో మళ్ళీ వెనువెంఠనే జీవితాన్ని ప్రారంభించిన ఘట్టాలు నిజంగా నాకు తెలిసిన అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు. కలిసి పెట్టే ఖర్చును లెక్కేసి మరీ వెనక్కిచ్చేస్తే లక్షణమూ నాకు పరిచయమున్న కొందరు స్నేహితురాళ్ళకుంది. వాళ్ళ లాజిక్ సింపుల్ "కలిసి ఖర్చు పెట్టాం. కలిసి షేర్ చేసుకుందాం". ఇందులో అఫెండ్ అవడానికి ఏమీ లేకున్నా, కొందరు మగవాళ్ళు తమ మ్యాగ్నానిమిటీకి దెబ్బ అనుకుంటారు. ఈ లక్షణాలన్నింటినీ కలగలిపినా సుప్రియ పాత్ర సృష్టి కష్టమే అనిపించింది. ఎందుకంటే she is just a manifestation of insecurity in many of the men. కాబట్టి తన పాత్రకన్నా హేమంత్ ఆ పాత్రద్వారా పొందిన "ఆత్మన్యూనత" కథాంశమైతే బాగుంటుందనిపించింది. కాబట్టే ఎక్కడా సుప్రియ వర్ణన లేదు. తను అందంగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానం ఎక్కడా దొరకదు. తన బాహ్యసౌందర్యంకన్నా, తన బలమైన వ్యక్తిత్వంకన్నా తను హేమంత్ లో రేపే ఇన్సెక్యూరిటీ ఈ కథలో నేను చెప్పాలనుకున్న విషయానికి ముఖ్యం అనిపించింది. అందుకే సుప్రియ కథలో ఎక్కడా కనిపించదు.

ఇక "ప్రేమించడంలో" స్త్రీ యాక్టివ్ పాత్ర తీసుకుంటే తమ మగతనానికి ఛాలెంజ్ అనే విధంగా ప్రయత్నించేవాళ్ళే కాకుండా, తీవ్రమైన ఇన్సెక్యూరిటీ పాలయ్యేవాళ్ళు (చెప్పరుగానీ) చాలా మందే. ఈ లక్షణాలనన్నింటినీ కలగలిపి హేమంత్ ని తయారు చేశాను. He is the best hero I have created అని నాకైతే అనిపించింది. ఇంకెవరికైనా మరోలా అనిపించుంటే నేను చెయ్యడానికి ఏమీ లేదు.

కొసమెరుపు ఏమిటంటే, ఈ కథని ఒక వెబ్ పత్రికకి పంపించాను. వారి సమాధానం

"మహేష్ కుమార్ గారూ,

మీరు పంపిన "దేవత" కథ ---- నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ప్రచురించలేకపోతున్నాం. మీనుంచి మరింత ఉన్నత ప్రమాణాలతో కూడిన రచనలను ఆశిస్తూ

నెనరులతో
-----------"

అప్పుడనుకున్నాను. పత్రికా ప్రమాణాలను బట్టి నేను కథరాయాలా? నా నమ్మకాలే ప్రమాణాలుగా కథరాయాలా? అని. ఎందుకో రెండోదే బెటర్ అనిపించింది. ఈ మధ్య అబ్రదబ్రగారి చర్చల్లోకూడా దాదాపు ఇలాంటి యక్షప్రశ్నలే ఎదురయ్యాయి. I write because I want to write. Then its better I stick to my blog writing. అనుకుంటున్నాను. హేమిటో ఈ ప్రమాణాలూ, నాణ్యతలూ నాకైతే అర్థం కావు. రాసుకుంటూ పోవడమే మ తరహా!

(బ్లాగులున్నదే సొంత కతలు చెప్పుకోవడానికి. కాబట్టి నా స్వోత్కర్ష మీకు తప్పదు)

******

21 comments:

జ్యోతి said...

I write because I want to write. Then its better I stick to my blog writing. good mahesh..

we are writing for ourselves. we know what we are writing. so dont bother abt others or any magazine. what if they reject? you have ur own magazine, give all ur thoughts and stories in ur blog. and keep it for discussion.

Vinay Chakravarthi.Gogineni said...

hey adi baagaledani evaru annaru koncham akkadakkada edit cheste bagundedi but chaala baagundi........abbo inta kante chandaalamga raasevi vestunnaru deenni enduku veyatam ledo

ante boss tokkestunnaru mimmalni..........just kidding

hey nijamga baagundi............

మేధ said...

కధ చదివిన తరువాత మళ్ళీ కామెంటుతా..

asha said...

మీ కధ నాకు బాగా నచ్చింది. ఇది వ్రాయటానికి ముందు మీకున్న అనుభవాల వల్ల మీరు ఈ కోణం నుండే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. మొదటిసారే అంగీకరించబడవు కదా చాలామందివి. వాళ్ళను మీరు అడగాల్సింది నాణ్యతలూ, ప్రమాణాలూ అంటే ఏమిటో? ఇంకా ఎక్కువమంది మీ కధలు చదవగలుగుతారు కదా.

Anonymous said...

@I write because I want to write.

good one.

Anonymous said...

మీ కధని అదే పత్రికకు రిఫరెన్స్ మీద ఇవ్వండి..కళ్ళ కద్దుకొని తీసుకుంటాయి. ఇలాంటి ధోరణి ఉన్న పత్రికలా ప్రమాణాలు,నాణ్యతలు గురించి మాట్లాడుతున్నాయి.
అయిన ప్రమాణాలు,నాణ్యతలు అని కూర్చుంటే తొక్కలో పాత చింతకాయ కధలే వస్తాయి. విభిన్నమైన పాయింట్ ఉన్న కధలు ప్రచురిస్తేనే కదా చదువరులకు ఆసక్తిగా ఉంటుంది. లేదంటే..ముసలమ్మ..ఒక్కడే కొడుకు..తల్లిని చూడడు..ఇలాంటి కాన్సెప్ట్ లే వస్తాయి.
మీ కధ చాలా బాగుంది. కధలో మీరు తీసుకున్న అంశం కొత్తగా చాలా బాగుంది.

>>గాల్లోంచీ పుట్టడానికి కథలు స్వాములోరి విభూధో, లింగాలో కాదు కదా!
ఇప్పుడు మీరు రాసిన దానికి, పై వాఖ్యం రాయడానికి ఏమైనా సంభందం ఉందా??? మీకు వివాదాలు అంటే చాలా ఇష్టమా??

సుజాత వేల్పూరి said...

శుభం! రాసుకుంటూ పోవడమే!మీ నమ్మకాలే ప్రమాణాలుగా! నచ్చిన వారే అంగీకరిస్తారు! రాయడం మీ వృత్తి కాదుకాబట్టి రాజీ పడక్కర్లేదు.రాసేది మీ బ్లాగులో కాబట్టి చింతే లేదు.విమర్శలనేవి ఎక్కడా తప్పవు కాబట్టి వాటికి మాత్రం మీరు సమాధానాలు ఇవ్వాల్సిందే!


కథ కంటే కథ వెనుక కథ మరీ బాగుంది!వర్ణనలు, డీటైల్సూ,ఎడిటింగూ, మనోభావాల చిత్రణా ఇవన్నీ కాదు గానీ మీ కథలో నాకు నచ్చింది సూటిదనం. అస్పష్టత
తో పాఠకులను confuse చేయకపోవడం! హీరో పాత్ర ద్వారా హీరోయిన్ ఏమిటో పాఠకులకు క్లియర్ పిక్చర్ ఇచ్చేలా చిత్రించడం. పాత విషయమే అయినా కొత్తగా ఉంది.

మొత్తానికి కథలెప్పుడూ జీవితంలోంచే పుడతాయి, పుట్టాలి కూడా! ఊహలమీద ఆధారపడ్డ కథలైనా సరే, జీవితంలో లేని ఊహలెక్కడివి?

పత్రిక వారు మీ కథను తిరస్కరించడం ఆశ్చర్యాన్ని కల్గించలేదు.

Malakpet Rowdy said...

I write because I want to write
__________________________________

I love this!!!!

కామేశ్వరరావు said...

మీ అక్కసు ఎవరి మీదో ఇప్పుడు తెలిసింది, నా అపోహని పోగొట్టినందుకు థేంక్స్ :-)

గీతాచార్య said...

First thanks for mailing me the story to me.

అప్పుడనుకున్నాను. పత్రికా ప్రమాణాలను బట్టి నేను కథరాయాలా? నా నమ్మకాలే ప్రమాణాలుగా కథరాయాలా? అని. ఎందుకో రెండోదే బెటర్ అనిపించింది.

Well well well... I too feel like that, Hats-off.

I hope u read this one. See again, "కలిసి ఖర్చు పెట్టాం. కలిసి షేర్ చేసుకుందాం" ఈ contest లో ఇంకోసారి చూసి చెప్పండి.

I'll comment about the story later

గీతాచార్య said...

Oh missed the link.
http://thinkquisistor.blogspot.com/2008/12/blog-post.html

Anil Dasari said...

ఇది కథ వెనక కత గురించిన కామెంట్ కాదు. కామెంట్ మీద కామెంట్ :-)

>> "మొత్తానికి కథలెప్పుడూ జీవితంలోంచే పుడతాయి, పుట్టాలి కూడా! ఊహలమీద ఆధారపడ్డ కథలైనా సరే, జీవితంలో లేని ఊహలెక్కడివి?"

వాదనెందుక్కానీ, అలాంటిదొకటి నేను రాసి చూపిస్తాను కాస్త ఓపిక పట్టండి.

భావన said...

చిన్నప్పటి నుంచీ నూరిపోయబడిన ‘మగతనం’, మారుతున్న ఆధునిక నగరీయ జీవితంలోని అంగీకరించలేని ‘లైంగిక సమానత్వం’ మధ్యన వ్యక్తిత్వాన్ని విశాల పరుచుకుంటున్నామో లేక కోల్పోతున్నామో తెలియని యువతకు ప్రతినిధి హేమంత్.100% నిజం...
జీవితం విశాలమయ్యే కొద్ది ఆలోచనలు సంకుచితమైపోతున్నాయి... చలాన్ని ఇప్పుడంటే అందరు పొగుడు తున్నారు కాని ఆయన ఆయన అల్లుడు వజీర్ రహ్మాన్ కు, సూర్య ప్రసాద్ గారికి రాసిన వుత్తరాలు చదవండీ ఎంత విసుగు పడతారో ఈ పత్రికా సంపాదకుల మీద.. అంటే అందరు సంపాదకులు వుండరేమో అలా కాని అధిక శాతం..

Padmarpita said...

కథ వ్రాయాలంటే ఇంత కధ ఉందని, కధ వెనుక కథ అనే కథ ద్వారా తెలిపిన కత్తి మహేష్ గారికి కరచాలములు....

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
మీరు ఇంతకుముందే ఒక కథ త్వరలో సిద్ధమవుతోందని మీ బ్లాగులో చెప్పనే చెప్పారు. దానికోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే ఇప్పుడేమో ఛాలెంజ్ చేసి మరీ రాస్తానంటున్నారు. ఉత్కంఠ మరింత పెంచక, త్వరగా రాసెయ్యండి. అర్జెంటు!

Anonymous said...

కథ రాసిన వాళ్లంతా ఇంతగా, దాని వెనుక కథ చెప్పడం మొదలు పెడితే కష్టమే. మీరు రాస్తూ ఉండండి. మొదటి కథకే అందరూ తలలూపాలంటే బాగుండదు. మన పని మనం చేస్తూ పోదాం. మన ఆనందం మనది మరి.

కొత్త పాళీ said...

hmm... I beg to differ.
Any piece of writing, even a blog entry .. why write at all? You have felt what you have felt. Your experience is yours .. there ends the matter.
The trouble is it does not end there!
So when you write something down, there is going to be an audience for it.
And when there is an audience for it, the writer automatically thinks about that audience. If this were not true, then the writer would not write at all.
Therefore, I can not buy your argument that you write for yourself.
The question on what defines a story is a different ballgame all together and does not fit in this comment.
One point I'd like you to think about - If you write because you want to write, then why send it to so many "friends" for feedback before clicking the "publish" button? And then why write this whole post with many a snide remark on the received feedback?
BTW .. "కొడవటిగంటి, చిట్టిబాబు,మధురాంతకం రాజారాం,"
I suppose you mean Buccibabu

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళి: మీరు నా స్టేట్మెంట్ ని వక్రీకరించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేనన్నది "I write because I want to write" అనిమాత్రమే. దీనర్థం `I write for myself' ఎన్నటికీ కానేరదు.

ఎవరైనా ఎందుకు రాస్తారు? నాకొచ్చిన ఆలోచన బాగుందనో లేకపోతే ఆ ఆలోచన అక్షరరూపంలో అనువదించడం అవసరమనో భావనకలిగితేనే రాస్తాం. ఆ అక్షరరూపం చదవబడాలని చర్చించబడాలని ఖచ్చితంగా కోరిక ఉంటుంది. ఎంతైనా బాగున్న ఆలోచన అని మనం అనుకున్నాంకదా!

కానీ, తెలియని ఎవరికోసమో నిర్దేశిత ప్రమాణాల్ని అనుసరించి రాయడం నాకు చేతకాలేదు అనే అంటున్నాను. అందుకే నేను రాసేవి రాస్తాను. అవి చదివేపాఠకులు దొరికితే బోనస్ అనుకుంటున్నాను. అంతేతప్ప, ప్రమాణాలకు అనుగుణంగా(What ever they are)ముఖ్యంగా ఎవరో నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా రాయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను.

నాకు ఈ కథకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ని నేను ఒక evaluation గా భావించక నా ఆలోచనకు ఒక validation గా ఉపయోగించుకున్నాను. Isn't that my choice?

సవరణకు ధన్యవాదాలు. అది బుచ్చిబాబే.

Anonymous said...

మీ వివరణ, అంతకు మించి మీకు వచ్చిన వ్యాఖ్యలకు మీరు react అయ్యేతీరు నాకు బాగా నచ్చింది.

Mauli said...

mahesh gaaru,


ee kadha mee blog lo chadavadaniki bagundandi..kani nenu yedaina web site lo kani, magazine lo kani chadavalenu ...akkada encourage cheyyalenu ....meery raasindi yentha vastvikatha tho unnadayinaaa... so the comments you got from publishers is right...


yendukante kadha lo supriya just easy ga anni share chesesikonnatlu ga kanipistundi ...inka vanilo kooda principles ....banglore ammayilni represent chese la rasaru inka ... kosamerupu enti ante ..aa ammayi yedama chetho oka doctor peru rasindi kada...easy ga athanu (youngster ayithe) aame next boy friend ayye avakasam undi ...inka naku mee kadha lo hero decision kooda correcte la undi ...yeppudu accounts settle avuthune unnayi ..so aame kosam tyagam cheyyakkara ledu kada andi ...yento nenu ila raastunnanu ...

ante paina yevaro cheppinatlu ammayilu kani abbayilu kani andari lo balaheenathalu untayi...

Ram Pammy said...

మీ కథ నచ్చేసింది, కథే కాదు టోటల్ గా మీ పర్నశాలే నచ్చేసింది..