Wednesday, June 24, 2009

ఒక కాశ్మీరీ యువకుడి జీవిత శోధన - కర్ఫ్యూడ్ నైట్



అందానికే అందం కాశ్మీరం. భువిలో స్వర్గం కాశ్మీరం.
1989 ....తరువాత
పాకిస్తానీ ఉగ్రవాదుల స్థావరం కాశ్మీరం. భారతీయ సైన్యం పర్మనెంటు గుడారం కాశ్మీరం.

భారత ప్రభుత్వం కథనాలమధ్య. పాకిస్తానీ అంతర్జాతీయ ఆరోపణలమధ్య. భారతీయ మీడియా అందించే కథలతొ మనకు కాశ్మీరం అర్థమయ్యింది. అంతే మనకు తెలిసొచ్చింది.

ఒక ఉగ్రవాద పోరాటం. ఒక మిలిటరీ ఆపరేషన్. ఒక ద్వైపాక్షిక సమస్య. కొన్ని అంతర్జాతీయ ఘటనలకు మూలం. ఇంకా లోతుగా వెళితే ఒక రాజకీయ విన్యాసం. మత ఘర్షణల పరమపదసొపానం. వేర్పాటువాదం. భారత-పాకిస్తానీ వ్యతిరేకత. స్వయంప్రతిపత్తికోసం పోరాటం. వగైరా వగైరాలు.

రెండు దశాబ్దాలు గడిచాయి. ఒక తరం మారింది. కానీ...కాశ్మీర్ లోయనుంచీ తరిమివేయబడ్డ కాశ్మీరీ పండితులు ఒకవైపు , మరోవైపు తుపాకి నీడలో జీవితం గడుపుతున్న కాశ్మీరీ ముస్లింలు, మొత్తంగా కాశ్మీరీ ప్రజలు ఈ సమస్యను ఎలా చూస్తున్నారో, వారి మనసుల్లో ఎటువంటి భావాలున్నాయో ఒక తెలియని...బహుశా మనమెప్పుడూ తెలుసుకోదలచని కోణం.

ఆ అత్యవసరకోణాన్ని ఆవిష్కరించే పుస్తకం "కర్ఫ్యూడ్ నైట్". ఇదొక కాశ్మీరీ యువకుడి జ్ఞాపకాల,నిజాల, కథల శోధన ప్రయాణం. 1989 లో కాశ్మీర్లో మిలిటెంసీ -ఉగ్రవాదం విస్తృతంగా తలెత్తినప్పుడు బష్రత్ పీర్ ఒక టీనేజి కుర్రాడు. తన స్కూలొక ఉగ్రవాద అడ్డాగా మారటం. అన్యాయమైపోతున్నామన్న భావన మధ్య తుపాకిని దగ్గరగా చూసి మిలిటెంసీని రొమాంటిసైజ్ చెయ్యడం (అచ్చు సింధూరం సినిమాలో రవితేజ చేసినట్లు). తన దేశంలోనే తననొక అన్యుడిగా చూస్తూ అడుగడుక్కీ ఐడెంటిటీ కార్డులడగటం, అనుమానంగా చూడటం,కొద్దిలో అన్యాయపు అరెస్టు నుంచీ తప్పించుకోవడం, మిత్రులు ఎన్కౌంటర్లో చనిపోవడం వంటి ఘటనల నేపధ్యంలో తీవ్రవాదం పట్ల ఆర్షితుడౌతాడు.

కానీ కుటుంబ ఒత్తిడుల మధ్య పైచదువులకోసం అలీఘడ్ పంపెయ్యబడతాడు. 2003 వరకూ అలీఘడ్ లో చదువు, ఢిల్లీలో రీడిఫ్,తెహల్కా,గార్డియన్,ఫైనాన్షియల్ టైంస్ వంటి పత్రికల్లొ ఉద్యోగం తరువాత తన అనుభవాల్ని వెతుక్కుంటూ కాశ్మీర్ ప్రయాణ మవుతాడు. పాత జ్ఞాపకాలు, పరిచయాలు, ఉగ్రవాద కథలు, కుటుంబాల శోకాలు, యువత నైరాశ్యం, కోపం,ద్వేషం వంటి ఎన్నో భావనల వెనుక ఆలోచనల్ని,ఆభిప్రాయాల వెనుక అనుభవాల్నీ మనసులో పొందుపరిచి అక్షరబద్ధం చేస్తాడు. ఇప్పుడీ రచయిత న్యూయార్క్ లో జీవిస్తున్నాడు.

బ్రష్రత్ పీర్ జీవితంలో చిన్నప్పట్నుంచీ ఇప్పటివరకూ సాగిన అనుభవాల,జ్ఞాపకాల, ప్రయాణాల కథనం కర్ఫ్యూడ్ నైట్. 256 పేజీల పుస్తకం. ఖరీదు 395 రూపాయలు. కానీ మనకు తెలీని కాశ్మీర్ కోణాన్ని చూపించే ఒక దుర్భుణి. ఒక కాశ్మీరీ ముస్లిం ధృక్కోణం నుంచీ జరిగిన ఘటనల్ని తెలియజెప్పే కథనం. "beautifully written,brutally honest and deeply hurtful" అని ప్రముఖ ఇండియన్ ఇంగ్లీష్ రచయిత కుష్వంత్ సింగ్ చే కితాబు దక్కించుకున్ పుస్తకం ఇది. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. కాశ్మీర్ సమస్యను ఒక మానవీయకోణం నుంచీ ఒక వ్యక్తిగతకోణంలోంచీ చూడటానికి ఈ పుస్తకాన్ని చదవాలి.

హైదరాబాద్ లోని అన్ని (ఇంగ్లీషు)పుస్తకాల షాపుల్లోనూ ఈ పుస్తకం దొరుకుతుంది.

*****

4 comments:

గీతాచార్య said...

;-)

I heard about this one. And had it in my hands in my last Hyd trip too. But the price is very high. Even though it is an essential book, the price is too high.

But a good intro.

Anonymous said...

అచ్చు సింధూరం సినిమాలో రవితేజ చేసినట్లు - మరిక తెలీందేముంది ;)

అంత కాస్ట్లీ బుక్ ఐనప్పుడు ఇంకొద్దిగా రాసి పుణ్యం కట్టుకోనుండచ్చుగా!

I want to learn something here -
మీకు కరెక్టుగా "అంత" పోస్టే ఎలా వస్తుంది.సహజంగానా,లేక ఇంకేదైనా టెక్నిక్కు, టెక్నికల్ కారణాలున్నాయా అని!

Kathi Mahesh Kumar said...

@రేరాజు: ఆలోచనల్లో క్లారిటీ ఉన్నప్పుడు ఎకానమీ ఆఫ్ వర్డ్స్ దానంతట అదే వస్తుంది. కాస్ట్లీ బుక్కేగానీ నాదగ్గరుంది. కాబట్టి మీరు తీసుకుని చదువుకుని ఇచ్చెయ్యొచ్చు. స్వాగతం.

@గీతాచార్య: నీకూ స్వాగతం.

Anonymous said...

:))..
మీ సమాధానం మార్చి చెప్తాను.మీకు అది సహజ సిద్ధం.
ఇప్పుడిది ఇలా మార్చి చెప్పకపోతే, మీ సమాధానంలోని క్లారిటీ మీద నాకు కొన్ని అనవసర ఆలోచనలొస్తాయి. :))