Tuesday, June 30, 2009

తెలుగుకు పొయ్యేగాలం !

"ఒకసారి పల్లెల్లొకిబోయి సూడండి సామీ బాస దర్జాగా బతికిపోతావుండాది. సచ్చింది సస్తావుండేదీ “ఇది సరైన భాష” అని చెప్పిచచ్చిన భాష. అది ఉన్న్యా పోయినా ఒగటే.పనికొచ్చే బాసంటే ఉద్యోగానికి అచ్చొచ్చిన బాసేకాదు. బతుకుల్ని బతికించే బాసగూడా. మాఊర్లో ఇంగా అదే మాట్లాడతావుండాము. తెలుగు. గాకపోతే కొందరు మనుసుల్లాంటి మనుసులు “అహే నీది బాసేకాదు. రాయాలంటే ఇలాగే ‘వ్రాయాల’. యాకరణం శుద్దంగా ఇట్టే పలకాల” అని నాశనం సేసి హైరానా పట్టిత్తనారుగానీ మాబాసకేమొచ్చింది పోగాలం? వడ్డారమైన మీబాసలకే వస్తాది పొయ్యేగాలం."
- కత్తి మహేష్ కుమార్

బ్లాగులు భావవ్యక్తీకరణకు అని నేను అన్నప్పుడల్లా "భాష ఉపయోగం కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు" అని రేరాజు పోస్టేసిమరీ నా వెనుక పరుగెట్టేవారు. నాబాధ నాదిరా మగడా అంటే, భాషే అన్నిటికీ సుప్రీం. తెలుగు భాషలో ఆలోచిద్ధాం అనే మెలికేసి వాయించెయ్యడం రేరాజు సహజమైన తరహా. ఈ చర్చల మధ్యలో ఎప్పుడో డిగ్రీలో చదివిన "functions of language" అప్పుడప్పుడూ గుర్తొచ్చేది. ఈ రోజు పొద్దులో భైరవభట్ల కామేశ్వర్రావు గారి "An Apology of a Telugu fa(lu)natic" చదవగానే ఆ చదువు కాస్త పంచుకుందామనే ఆవేశం వచ్చింది. అందుకే ఈ టపా.

Buhler అనే మానసిక -భాషా శాస్త్రవేత్త ప్రతిపాదించిన థియరీ ఆఫ్ లాంగ్వేజ్ ప్రకారం భాషకు మూడు ఉపయోగాలున్నాయి. ఒకటి expressive function- (భయాలూ,బాధలూ,కోపాలూ,ఆనందాలూ,అవసరాలూ చెప్పుకునే కార్యం) భావవ్యక్తీకరణ కార్యం. రెండోది signaling function - సౌజ్ఞలు (మాటలతో అవసరం లేకుండానే చేతలతో,ముఖకవళికలతో, శబ్ధాలతో) చేసేపని. మూడోదిగా descriptive function - వివరణాత్మక కార్యం. కాలక్రమంలో ఇంకో ముఖ్యమైనపని భాష చేస్తుందని గ్రహించి Popper అనే ఆయన నాలుగోదిగా argumentative function -వాదోపవాదాల పనిని జోడించారు. కానీ ఇక్కడ మతలబేమిటంటే "animal and human languages have much in common at the levels of expression and signaling but the descriptive level is distinctively human" అని తేలుస్తారు. ఇక వాదోపవాదాలు మనుషులుతప్ప మరొకరు చేసేపని కాదనేది జగమెరిగిన సత్యం.

మనుషుల్లో భాషయొక్క వివరణాత్మకమైన ఉపయోగాన్ని వివరిస్తూ "The descriptive function is characteristic of the human species. And it is something new,and something truly revolutionary: human language can convey information about a state of affairs, about a situation that may or may not be present or biologically relevant. It may not even exist." అని సాహితీసృజన భాషా ఉపయోగంగా ఎలా మారిందో వివరిస్తాడు పోప్పర్.

ఒకడుగు ముందుకేసి "descriptive language is almost infinitely flexible and this enables the playful and creative invention of myths and stories (hence),The advent of descriptive language raises the issues of truth and falsity, which leads to the possibility of argument and the use of reasons for or against the truth or adequacy of a description." అంటూ వాదోపవాదాలకు కూడా ఈ వివరణాత్మక ప్రక్రియే మనుషుల్లో కారణం అని సుతిమెత్తగా చెప్పాడు. ఈ వృద్దిచెందిన భాషా ప్రయోగాలే మనిషిని సృజనాత్మకతకూ, భిన్నమైన ఆలోచనలకూ పురిగొలుపుతుంది కాబట్టి ఇవే మనిషిని మనిషిగా మారుస్తాయి అని పట్టంగడతాడు.

ఈ సిద్ధాంతంలో "తెలుగునం" లేదుకాబట్టి లేదా ఇదొ "తెలుగు ఆలోచన" కాదు కాబట్టి, నేను అంగీకరించను అనేవాళ్ళతో నేను వాదించలేనుగానీ, భాష పుట్టినతరువాత భాష ఉపయోగాన్ని విశ్లేషించడానికే తప్ప కొత్తభాషను పుట్టించడానికి ఈ సిద్ధాంతం ప్రతిపాదించలేదు గనక ఈ ధియరీతో నాకు పెద్దగా సమస్యలు లేవు.

ఇప్పుడు మనల్ని పట్టిపీడిస్తున్నదనుకుంటున్న సమస్య తెలుగు భాష మనుగడ. నాకైతే అది సమస్యగా అస్సలు అనిపించడం లేదు. ఎందుకంటే మనిషి...ముఖ్యంగా తెలుగు మనిషి బ్రతికున్నంతవరకూ మొదటి రెండు పనులైన భావవ్యక్తీకరణా, సౌజ్ఞల పనులు భేషుగ్గా జరుగుతూనే ఉంటాయి. మనుగడలేకుండాపోతే సంస్కరించి,స్థిరీకరించామనుకుంటున్న వివరణాత్మక తెలుగు ముగడలేకుండా పోతుంది. ఎందుకంటే, మనోళ్ళు భాషను అర్థంచేసుకునే ఉద్దేశంతో కాకుండా, "శుద్ది" చేసి "సంస్కరించే" నెపంతో వ్యాకరణాన్ని గొంతుక్రిందకి దిగదియ్యాలనుకున్నారు. అప్పుడే మూల ఉపయోగాల్ని కించరిచే మానవప్రత్యేకమైన వివరణాత్మక,వాదోపవాద కార్యాలకు విపరీతమైన ప్రధాన్యత తెలుగు భాషలో ఉదయించింది. బలమైన పునాదిలేకుండా భవంతి ఎలా నిలబడదో, మూలవాసుల భావవ్యక్తీకరణను చిన్నచూపుచూసి సంస్కరితవ్యాకరణం ఆధారంగా వివరణాత్మకతకు ప్రాధాన్యతనిస్తే భాషా నిలబడదు.


మనిషిని జంతువున్నా ఉన్నతుల్ని చేసే వివరణాత్మక కార్యాన్ని జనబాహుళ్యానికి చెందకుండా కేవలం పరిమిత స్థితిగతుల్లో జరిగేలా మనోళ్ళు చాలా జాగ్రత్తలు తీసేసుకున్నారు. ఇందులో స్వార్ధముందో లేక తెలియనితనం ఉందో నాకు తెలీదుగానీ. ఇదే జరిగిందేమో అనేది నా "అపోహ". సంస్కృతాన్ని ప్రమాణంగా తీసుకుని ఎప్పుడైతే మనం మన వ్యాకరణాన్ని సంస్కరించామో అప్పుడే మన భాషకు మంగళహారతి పాడెయ్యటం జరిగింది. ఇక తెలుగులో "ఒరిజినల్ ధాట్" ఎక్కడ్నుంచీ వస్తుంది? మన ఆదికవి నన్నయ్యే అనువాద కవి అయితే మనదైన "తెలుగు సాహిత్యం" ఎక్కడ్నుంచీ పుడుతుంది? ఈ విధంగా తెలుగు ప్రజల భావాల్ని (భాషని) పట్టించుకోకుండా తెలుగు "అభివృద్ధి" చెందిపోయింది. మహాకావ్యాలు పుట్టేశాయి. పద్యకావ్యాలు గంగవెర్రులెత్తాయి. గ్రాంధికాలు తమ బాకాలు ఊదాయి. వ్యావహారికంతో విప్లవం తేవాలనుకున్నా, దానిలోనూ ఆభిజాత్యాలు సహజత్వాన్ని చంపేశాయి. ఇలా "(రా)వ్రాస్తేనే గౌరవప్రదమైన తెలుగు" అని తెలుగోళ్ళనే తెలుక్కి దూరం చేసేశారు. ‘జానుతెనుగు’ అంటూ పల్లెతెలుగును కుదేశారు.

ఈ వ్యవహారాన్నంతా అమలు(perpetuate) చేసే బోధనాపద్దతి గురించి ఎంత తక్కువమాట్లాడుకుంటే అంత మంచిది. ఎంతైనా కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుందాయె. నాదైన ఆవు వ్యాసం పూర్తిగా రాయించకుండానే, సీసపద్యంలోని సొబగుని ఆస్వాదించమన్న తెలుగుకి దూరంగా ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా పారిపోవాలనుకున్న మొదటి విద్యార్థిని నేను కాదు. అలాగని చచ్చిన సంస్కృతాన్ని మార్కులకోసం ఉద్దరించడం చేతకాక, కనీసం "పనికొస్తుందేమో"అన్న ఆశతో హిందీ తీసుకున్న విద్యార్థుల్లో మాత్రం నేనొకడిని. నిత్యజీవితంలోని భావవ్యక్తీకణకు సహాయకారి కావడానికి సహకరించాల్సిన భాషను తమ భిజాత్యంతో ఆకాశంలో కూర్చోబెట్టి, ఇప్పుడు "గగనమైపోతోంది" అని వాపోతే ఎలా? దానికి బాధ్యత ఎవరిది. కారణం ఎవరు.


నావరకైతే గ్రంధాలు నశించినా, పద్యాలు కృశించినా, పుస్తకాలు చెదపట్టినా తెలుగుమాత్రం బ్రతికే ఉంటుంది. మా ఊర్లో, మా అవసరాల్లో, మా అవేశాల్లో, మా అవేదనల్లో, మా ఆనందాల్లో తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది. పొయ్యేగాలం పోవాల్సిన తెలుగుకే వస్తుంది. తెలుగు మాత్రం బ్రతికేవుంటుంది.

****

32 comments:

Indian Minerva said...

పొయ్యేగాలం పోవాల్సిన తెలుగుకే వస్తుంది. తెలుగు మాత్రం బ్రతికేవుంటుంది.
తధాస్థు!!

గీతాచార్య said...

I'l comment on the content later. ;-)

But one thing is for sure. The expression of a writer is his own choice. He has that liberty to express in whatever best possible way, be it language, or symbol. There should be no restriction.

పెదరాయ్డు said...

తెలుగు చస్తో౦ది పల్లెల్లోనే..అర్థ౦కాని కాన్వె౦టు చదువుల్తో పులి(పట్న౦) వాతలు పెట్టుకొని రె౦టికీ చెడ్డ రేవడి అయి పల్లెల్లో ఇమడలేక నగరాల్లో వారు పడే అవస్థను చూస్తే కడుపు తరుక్కుపోతు౦ది. పల్లెపాటలు ఎవరు పాడుతున్నారిపుడు. సీరియళ్ళ పిచ్చిలో పడి, జన౦ గు౦పగుత్తగా పర స౦స్కృతులకు బానిసలైపోతున్నారు. తమదైన సాహిత్యవిలువలను, సహజత్వాన్ని కోల్పోతున్నారు.
పట్నాల్లో ఉన్న చదువుకున్న వారికి తమ దుస్ఠితి పై కనీస స్పృహ అయినా ఉ౦టు౦ది, నివారి౦చ లేక పోయినా నిలువరి౦చటానికి ప్రయత్నిస్తారు. పల్లెల్లోని అమాయక ప్రజలు తమ సహజత్వానికి కలిగే నష్టాన్ని గమని౦చే లోపే అది నాశన౦ అయు౦టు౦ది.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: నాదగ్గర పాతలెక్కలు 2005-06 వి ఉన్నాయి. గడచిన మూడు సంవత్సరాలలో సర్వశిక్షా అభియాన్ రాకతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మరింత మెరుగయ్యింది. అయినా కూడా ఈ పాతలెక్కలే ఒక సారి చూడండి.

గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50,895 ప్రాధమిక పాఠశాలలున్నాయి.విధ్యార్థుల సంఖ్య 30,84,212. ప్రైవేటు పాఠశాలలు కేవలం 3,570. విద్యార్థలు 6,03,160. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగులోనే బోధిస్తారనేది అందరికీ తెలిసిందే. పాఠశాల విద్యలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. ప్రాధమిక మరియూ పాఠశాల విద్య కలిగిన స్కూళ్ళు 11,195. ప్రైవేటువి 2,772. విధ్యార్థులు 17,55,415. 54,7415 మంది ప్రైవేటు పాఠశాలలో.

కాబట్టి పల్లెల్లో తెలుగుకొచ్చిన డొకా ఇప్పట్లో ఏమీ లేదు. కాకపోతే తెలుగు బోధన ఇలా తలక్రిందులుగా కొనసాగితే, అసలే బోధించే తెలుక్కూ జీవించే తెలుక్కూ ఉన్న తేడాతో తికమకమౌతున్న పిల్లలు మరింతగా తెలుగును తరిమేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు.

So, a reform is surely needed in the way Telugu teaching is done. పైపెచ్చు మన తెలుగును కాపాడేవాళ్ళ పద్యాల,వ్యాకరణాల fixations,lunacy నుంచీ తెలుగును కాపాడకపోతే మొదటికే ముప్పువస్తుంది.

పెదరాయ్డు said...

ప్రస్తుతానికి ఢోకా లేదన్నది మ౦చిదే. మీరు ఇక్కడ తెలుగు పాఠ్యా౦శాల గురి౦చి చెబుతున్నారా లేక, తెలుగు బోధన గురి౦చి చెబుతున్నారా? తెలుగు ఒక సబ్జెక్టుగా చూస్తే, మన సాహిత్య పరిచయమే మ౦చిది. గ్రామీణ సాహిత్య౦ కూడా జోడి౦చాలన్న వాదన సమ౦జసమైనదే. జీవి౦చే/భోధి౦చే తెలుగన్నది మన అపోహే. జీవి౦చే తెలుగన్నది మీ ఉద్దేశ్య౦లో వాడుక తెలుగయితే, మన రాష్ట్ర్ర౦లోని కులాలన్ని వాడుకలున్నాయి. అన్ని౦టినీ భోధనలో ఇమడ్చట౦ కష్ట౦. కాకపోతే సరళీకరణ ఆమోదయోగ్యమే. ఉదాహరణకు దినపత్రికల్లో, TVల్లో ఉపయోగిస్తున్న తెలుగు అ౦దరికీ బాగానే అర్థమవుతు౦ది. ఇదే భాషనే ఇతర సబ్జెక్టులకు(లెక్కలు, సామాన్య, సా౦ఘిక శాస్త్రాలకు) వాడుతున్నారు. నేను తెలుగు మీడియ౦లోనే చదివాను. తెలుగు పద్యభాగాలతో, వ్యాకరణాలతో చిక్కున్నా(అర్థమయ్యే తీరు, మార్కుల పర౦గా), అది ఉ౦డకూడదని నాకెప్పుడూ అనిపి౦చలేదు. మీ ఉద్దేశ్య౦ అటువ౦టి వాటికి దూర౦గా వు౦డాలనా? మీరు తీసుకున్న హి౦దీలో ఇటువ౦టి వ్యాకరణ బాధలు లేవా? అక్కడ వారు కఠిన సాహిత్యాలను పాఠ్యా౦శాలుగా తీసుకోలేదా?

నాకనిపి౦చేదేమిట౦టే, తెలుగు వారికి ఎప్పుడూ పొరిగి౦టి పుల్లకూరే రుచి. మొదట్లో స౦స్కృత౦, హి౦దీ, తరువాత ఆ౦గ్ల వ్యామోహమే మన దుస్థితికి కారణ౦. దీన్ని మార్చుకోక మన సాహిత్య౦ పైనే విమర్శలు కురిపిస్తే ప్రయోజన౦ లేదు.

Ramani Rao said...

మా ఊర్లో, మా అవసరాల్లో, మా అవేశాల్లో, మా అవేదనల్లో, మా ఆనందాల్లో తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది. 100/100

సుజాత వేల్పూరి said...

పొయ్యేగాలం పోవాల్సిన తెలుగుకే వస్తుంది. తెలుగు మాత్రం బ్రతికేవుంటుంది.తథాస్తు!

మా ఊర్లో, మా అవసరాల్లో, మా అవేశాల్లో, మా అవేదనల్లో, మా ఆనందాల్లో తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది. 100/100

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

వాదోపవాదాలు మనుషులకే పరిమితం అన్నారు మీరు. కానీ నాకు ఆది తప్పేమో అని పీస్తోంది అండీ. కుక్కలు,కోతులు లాంటివి వాటి భాషలోనే మొరగటమో మరోరకంగానో వాద్నాలు చెస్కోవటం చూస్తుంటాము కదా? signaling function , argumentative function కలిసి ఉంటుందేమో వాటికి

Ajit Kumar said...

తెనెలొలుకు తెలుగు భాషలో మృతభాషావ్యర్ధాలు నిరంతరమూ కలుస్తున్నందున రుచి తగ్గినమాట నిజమే. నిజానికి మన తెలుగులో ఉన్నన్ని చక్కని తీయని తిట్లు మరో భాషకు సరిపోవు.రవితేజ సినిమాల్లో చక్కని వెరైటీ తిట్లుంటున్నాయి. ఓసారి నేను ప్రయాణంలో ఉండగా బస్సుమిస్సయిందని ఓ ఎద్దుల టైర్ల బండి ఎక్కి కొందరు గ్రామీణులతో కలసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా ప్రయాణం పొడవునా వారి ప్రతి వాక్యానికి ముందొక తిట్టు, చివరో తిట్టూ . సజీవులనూ,నిర్జీవులనూ వదలకుండా ఈ చరాచర జగత్తంతా తమకొకటిగానే భావించే తత్వంగా అనిపించింది. పదప్రయోగాల్లో నూతనత్వం,పోటీతత్వం కన్పించింది.

రాధిక said...

"మా ఊర్లో, మా అవసరాల్లో, మా అవేశాల్లో, మా అవేదనల్లో, మా ఆనందాల్లో తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది."నేనూ ఇదే మాట ఎన్నో సార్లు చెప్పాను.తెలుగు మనకి జీవనోపాధి ఇచ్చినంత కాలం అది బ్రతికి వుంటుంది.పల్లెల్లో వేరే భాష మాట్లాడాల్సిన అవసరం లేదు కనుక అక్కడ బ్రతికి వుంది.పట్నాల్లో అంతరించడానికి సిద్దం గా వుంది.ఎందుకంటే అక్కడి ప్రజలు ఇంగ్లీషు ఇచ్చే జీవనోపాథి మెరుగ్గా వుంటుందని భావించడం వల్ల.నగరాల్లో తెలుగు అంతరించిపోతుంది.ఎందుకంటే ఇంగ్లీషే జీవనోపాథి అవ్వడం వల్ల.

సృజన said...

అంతా మంచే జరుగుతుందిలెండి.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: తెలుగు పాఠ్యా౦శాలు,తెలుగు బోధనా రెండింటి గురించీ చెబుతున్నాను. పాఠ్యాంశాలు ఎలాగూ "నేర్చుకునే విషయాలే"కాబట్టి అక్కడ పెద్ద సమస్య కాదు. కానీ తెలుగు బోధన మనదగ్గర తలక్రిందులుగా జరుగుతోంది. అన్నప్రాసనరోజే ఆవకాయ అన్నట్టు ప్రారంభంలోనే పదకొండోశతాబ్ధపు తెలుగు నిజంగా మనకు అవసరమంటారా?

ఐదోతరగతి వరకూ నిత్యజీవితంలో ఒక విధ్యార్థివాడే తెలుగుని కొంచెంకొంచెం చంపుకుని "కొత్త తెలుగులో" చదవడం (వ్రా)రాయడం నేర్చుకుంటాడు. ఆ తరువాత తన ఆలోచనల్ని ఎలా తెలుగులో పంచుకోవాలో నేర్పించాల్సిన తరుణంలో హఠాత్తుగా మనం "గొప్పసాహిత్యం"తో వాడి వెంటబడి ప్రాణాలు తోడేస్తాం. నజబజజజర,భరనభభరవల్లో వాడి మెదడుని కలగాపులగం చేసి తెలుగు మీద ప్రేమ ఎక్కడన్నా మిగులుంటే దాన్ని పరపరానమిలి మింగేస్తాం.ఇక్కడా చేసేదేమిటి...వల్లెవేయడం. ప్రతిపదార్థం తాత్పర్యం బట్టీబట్టడం. తను సాధారణంగా మాట్లాడే తెలుగు న్యూనతమైనది అని తెలుసుకోవడం. అంతేగా!

ఇక వ్యాకరణం సంగతి. సహజంగా తెలుగువాడైన విద్యార్థికి నిజంగా వ్యాకరణం "నేర్పించడం" అవసరం అంటారా? అన్యాపదేశంగా ‘వాడు మాట్లాడే తెలుగు తప్పు. కాబట్టి సరిచేసుకో’ అనే మెసేజ్ ఇవ్వడానికి కాకపోతే ఎందుకీ వ్యాకరణం. అది సవర్ణదీర్ఘసంధో,గుణసంధో తెలీకముందునుంచే నేను దాన్ని ప్రయోగిస్తన్నానుకదా! మరి దాన్ని మీరు భట్టీయం వేయించడంలోని ఔచిత్యం ఏమిటి?

హిందీలో వచనం,వ్యాసం,కథలూ ఎక్కువా పద్యాలు తక్కువ. ఆ పద్యాల్ని కూడా భట్టీపట్టించరు వాటి అర్థాల్ని,వాటివెనుకనున్న వేదాంతాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ భాష రూపంగా నాకు కొత్త ఆలోచనలతో పరిచయం చేస్తారేతప్ప, పార్వతి స్థనసౌందర్యాన్ని వర్ణించి చెప్పరు.

ముఖ్యంగా కబీర్,సూర్ దాస్ లాంటి "పాత" కవుల్లోకూడా బోలెడంత జీవనవేదాన్ని ఎలా పద్యాల్లో గుప్పించారో చదువుకుని ఆనందిస్తామే తప్ప బట్టీకొట్టమని మొటిక్కాయలు వేయించుకోము.

హిందీ ఎలాగూ second language కాబట్టి ఇక్కడ వ్యాకరణం తప్పదు. ద్వితీయభాష మన సహజ భాష కాదుకాబట్టి కొన్ని సూత్రాలు "గుడ్డిగా" నేర్వకతప్పదు. కానీ ఇక్కడా మాట్లాడి "సహజంగా" నేర్చుకునే పద్ధతిని ప్రోత్సహిస్తారు. కాకపోతే కొన్ని తప్పవు.

తెలుగోళ్ళకు "హిందీ వ్యామోహం" ఉందని నేను అనుకోను. ఒకటి హిందీ నేర్చుకోవడం సులభం. రెండు మొత్తం భారతదేశం తిరగాలంటే హిందీ నేర్చుకోవడం ఉపయోగకరం. అంతే. నేనైతే "పనికొస్తుంది" అనే నేర్చుకున్నాను. నా జీవితంలో పనికొచ్చింది కూడా.

శ్రీనివాస్ పప్పు said...

ఇక్కడ సందర్భం కాకపోయినా అడగాల్సి వస్తోంది.తప్పుగా అర్ధం చేసుకోకండి.
"పార్వతి స్థనసౌందర్యాన్ని వర్ణించి చెప్పరు".
పార్వతీ దేవి స్థన సౌందర్యాని మీరు ఏ తరగతిలో చదువుకున్నారు మహేష్ గారూ?ఒకవేళ మీరు అలాంటి సౌందర్య్యాని అలా చదువుకున్న వయసులో మీకేమన్నా ఇబ్బందిగా అనిపించిదా?అమ్మ స్థన సౌందర్యాన్ని చూస్తే మీకు ఇబ్బందిగా ఉంటుందా అలాంటి వయసులో?అసలు సౌందర్యాన్ని ఎన్ని విధాలుగ చెప్పుకోవచ్చు మీరు నేర్చుకున్న లేకపోయిన చెప్పారంటున్న ఆ భాషలో?చిన్నప్పుడు అమ్మ పాలు తాగుతూ వాటితో ఆడుకుంటాముగా దాన్ని సౌందర్యం అనలేమా?లేక అలోచనా లోపమా?
తెలుగోళ్ళకు "హిందీ వ్యామోహం" ఉందని నేను అనుకోను.
ఎవరన్నారు మహేష్ ఇలాంటి మోజు లేదని,లేదా మీకుగా మీరనుకుంటున్నారా?ఇన్ని కోట్ల ఆంధ్రులలో బ్రతుకుతెరువుకావాల్సిన వాడికి అవసరాన్ని బట్టే(పనికొస్తుందనే)నేర్చుకుంటారని మీరే సెలవిస్తున్నప్పుడు వ్యామోహం ఎందుకుండాలి మరి?ఏదన్నా అవసరమయితే వాడి బ్రతుకు తెరువుకు అవసరమయితే అది కష్టమా నష్టమా అని ఆలోచించరెవరూ(మీలాగే),భాషయినా...ఇంకేదయినా...

Kathi Mahesh Kumar said...

@పప్పుశ్రీనివాస్: మీరు మరీ ఇబ్బందిపెట్టేస్తున్నారండీ బాబూ! "పార్వతి తపస్సు" అని ఎనిమిదో తరగతిలోని పాఠం. బహుశా శ్రీనాధుడు రాసిన కావ్యంలోంచీ ఒక ఖండిక అనుకుంటాను అందులోని పార్వతి వర్ణనను పైవ్యాఖ్యలో ఉటంకించాను.

నాకైతే శ్రీనాధుడి వర్ణనలో "చిలిపితనం"గోచరించిందేతప్ప మీరు చెబుతున్న ఉత్తమమైన భావాలు స్ఫురించలేదు.మా తెలుగు ఉపాధ్యాయుడూ అదే ఉత్సాహంతో చెప్పినట్లే గుర్తు. బహుశా అది నా ఆలోచనా లోపమయితే I can't help it. ఇదే పాఠంలో వర్షంలో కఠోరతపస్సు చేస్తున్న పార్వతి శరీరంమీద పడిన నీరు ఎక్కడెక్కడ ప్రవహిస్తుందోకూడా వివరిస్తాడులెండి. కాబట్టి శ్రీనాధుడి భక్తిమీద మీకున్న శంక పెద్దగా సత్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎంతైనా "పరమేశా గంగవిడుము పార్వతి చాలున్"అన్న పండితోత్తముడుకదా!

మీరు ఈ పార్వతిసౌదర్యంలోపడి నా అసలు పాయింట్ మర్చిపోయినట్లున్నారు. నా ఉద్దేశం వర్ణనలకన్నా ఆలొచనల్ని పెంపొందించే భాషా పఠనం ఆ వయసులో అవసరం అని మాత్రమే. అందుకే నాకు శతకాలతో ముఖ్యంగా వేమన,సుమతీ శతకపద్యాలతో ఏమాత్రం పేచీ లేదు. అవి సామాజిక స్పృహని,విన్నూత్నమైన "తెలుగు ఆలోచనల్నీ" మెండుగా ఇస్తాయి.

ఇక హిందీ వ్యామోహం గురించి. మోజు వేరు అవసరం వేరని నా భావన. నా వ్యాఖ్య పెదరాయ్డు గారి "పొరిగింటి పుల్లగూర" కు సమాధానం మాత్రమే. ఆ కోణంలోంచీ చూడవలసినదిగా ప్రార్థన.

పెదరాయ్డు said...

మహేష్ గారూ, మీ లాజిక్కులు సామాన్యులకు అర్థ౦ కాద౦డీ!!

"హిందీ ఎలాగూ second language కాబట్టి ఇక్కడ వ్యాకరణం తప్పదు. ద్వితీయభాష మన సహజ భాష కాదుకాబట్టి కొన్ని సూత్రాలు "గుడ్డిగా" నేర్వకతప్పదు. కానీ ఇక్కడా మాట్లాడి "సహజంగా" నేర్చుకునే పద్ధతిని ప్రోత్సహిస్తారు. కాకపోతే కొన్ని తప్పవు."

"సహజంగా తెలుగువాడైన విద్యార్థికి నిజంగా వ్యాకరణం "నేర్పించడం" అవసరం అంటారా? అన్యాపదేశంగా ‘వాడు మాట్లాడే తెలుగు తప్పు. కాబట్టి సరిచేసుకో’ అనే మెసేజ్ ఇవ్వడానికి కాకపోతే ఎందుకీ వ్యాకరణం."

"కొన్ని తప్పవు" అ౦టూ హి౦దీ పట్ల ఎ౦తో ఔదార్య౦ ప్రదర్శి౦చారు, బాగు౦ది. మీ లాజిక్ ప్రకార౦ తెలుగు వాళ్ళకు తెలుగు బోధి౦చ కూడదు. హి౦దీ వాళ్ళకు హి౦దీ బోధి౦చ కూడదు (ఇక్కడ మీరుగా ఒక వెసులుబాటిచ్చారు, కేవల౦ వ్యాకరణ౦ అవసర౦ లేదని). మరి హి౦దీ ప౦తుళ్ళు వారి వ్యాకరణాలను వారి పిల్లలకు నేర్పరా? వారికి "వాడు మాట్లాడే హి౦దీ తప్పు. కాబట్టి సరిచేసుకో" అనే మెసేజీ ఇవ్వరా? మీ ఆలోచన ప్రకార౦, ఆపిల్ ఎప్పుడూ కి౦దే పడుతు౦ది కాబట్టి పిల్లలకు న్యూటన్ సూత్ర౦ చెప్పట౦ వేస్ట్.

"హిందీలో వచనం,వ్యాసం,కథలూ ఎక్కువా పద్యాలు తక్కువ." కాబట్టి తెలుగులో కూడా అలానే వు౦డాలా? నాకయితే మీరు చెప్పిన దాని ప్రకార౦ హి౦దీలో సరైన కవులు లేరని అనిపిస్తో౦ది. కానీ, ఏ భాషా సౌ౦దర్య౦ దానిది.

మీ లా౦టి వారు, లై౦గిక విఙ్ఞాన్నాన్ని ఆరో తరగతి ను౦చే బోధి౦చటాన్ని సమర్థిస్తారు గానీ, ఎనిమిదవ తరగతి లోని పార్వతి వర్ణనను తప్పు బడతారు. ఎ౦దరో వ్రాసిన ఎన్నో పద్యాలు౦డగా, మీకు శ్రీనాధుడు(కాళిదాసు కూడా ఇటువ౦టి వర్ణన చేశాడు) ఎనిమిదో తరగతిలో చెప్పిన పార్వతి వర్ణన మాత్రమే గుర్తు౦ద౦టే, తప్పు ఎవరిది? పల్లెల్లో మాట్లాడే బూతుల్లో(అవే మాట్లాడతారని కాదు) విలువ కనిపి౦చే మీకు, ప౦డితుడి లోని శృ౦గార౦ అభ్య౦తర కర౦. పార్వతి వర్ణణలో మీకు భాష యొక్క గొప్పతన౦ కనిపి౦చలేదా? స౦స్కరి౦చబడిన ఆ భాషనేర్వక ఎవరైనా, ఇదే వర్ణనను వినిపిస్తే ఎ౦త జుగుప్సగా వు౦టు౦దీ మీకు తెలియనిదా? లేక మీ గొప్పతనాన్ని ప్రదర్శి౦చటానికి మరచిపోయారా?

చదువు స౦స్కరి౦చడానికనే కనీస సూత్రాన్ని విస్మరి౦చి, మీరు చేస్తున్న విత౦డ వాదన విచారకర౦.

ఒక్కటి మాత్ర౦ నిజ౦, మీరు పట్టుకున్న కు౦దేటికి ఐదు కాళ్ళు.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: మీకు language learning/teaching principles తెలీకపోతే నేను ఆశ్చర్యపడను. ముఖ్యంగా మాతృభాషబోధనకూ ద్వితీయభాషా బోధనకూ గల తేడా తెలీకపోతే అస్సలు.

మాతృభాషో sequence వినికిడి,మాట్లాడటం,చదవడం,రాయడం తో జరిగితే ద్వితీయభాష చదవడంతో రాయడం ఆ తరువాత మాట్లాడటం జరుగుతాయి వినికిడి చాలా వరకూ తక్కువగా జరుగుతుంది. కారణం మన చుట్టుపక్కల ఆ ద్వితీయభాష మాట్లాడే వాతావరణం లేకుండటం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు భాష ఎలా నేర్పించాలి అనే విధానం వేరువేరుగా ఉంటుంది.

నేను ద్వితీయ భాషా(English)బోధకుడిగా శిక్షణ పొందినవాడిని. కాబట్టి నేను పట్టిన కుందేలుకు ఖచ్చితంగా నేను నేర్చుకున్నదాన్నిబట్టి ఐదేకాళ్ళులెండి.

Anil Dasari said...

>> "అలాగని చచ్చిన సంస్కృతాన్ని మార్కులకోసం ఉద్దరించడం చేతకాక, కనీసం "పనికొస్తుందేమో"అన్న ఆశతో హిందీ తీసుకున్న విద్యార్థుల్లో మాత్రం నేనొకడిని. నిత్యజీవితంలోని భావవ్యక్తీకణకు సహాయకారి కావడానికి సహకరించాల్సిన భాషను తమ భిజాత్యంతో ఆకాశంలో కూర్చోబెట్టి, ఇప్పుడు "గగనమైపోతోంది" అని వాపోతే ఎలా? దానికి బాధ్యత ఎవరిది. కారణం ఎవరు"

మీరే ; నేను మాత్రం కాదు. ఎందుకంటే నేను ఇంటర్లోనూ, డిగ్రీలోనూ కూడా సుబ్బరంగా తెలుగే రెండో భాషగా స్వీకరించా కాబట్టి :-)

పెదరాయ్డు said...

మీరు ద్వితీయ భాషా(English)బోధకుడిగా శిక్షణ పొందినవారా!! అలాగయితే మీరే కరెక్టు అయి ఉ౦టారు.ఇ౦తకూ మీరు ప్రధమ భాషా బొధనకు శిక్షణ తీసుకున్నారా?


మీరు దే౦ట్లో శిక్షణ తీసుకున్నా, నా ప్రశ్నకు సమాధాన౦ మాత్ర౦ లభి౦చలేదు.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: మీ ప్రశ్నల్లో "I want to have the last word" అనే ఉక్రోషంతో నా ఇతరత్రా అభిప్రాయాలతో కలగలిపి చేస్తున్న వ్యక్తిగత ఆరోపణపణలేతప్ప ఈ చర్చకు పనికొచ్చే విషయాలు ఏమీ లేవు. అందుకని సమాధానం చెప్పలేదు.

నేను లైంగిక విద్యను సమర్ధించడానికీ తెలుగు భాషా బోధనాపద్దతిని సంస్కరించాలని చెప్పడానికీ ఏమి సంబంధం? నాకు ఎనిమిదోతరగతిలోని పార్వతివర్ణన మాత్రమే గుర్తుందని మీరు ఎందుకనుకుంటున్నారు? నేను తెలుగులో అభివ్యక్తి నేర్పాల్సిన వయసులో పద్యసాహిత్యానికి ప్రాముఖ్యతనిచ్చి తెలుగు ఆలోచనని చంపేస్తున్నారని చెబితే, శృంగార వర్ణనకు వ్యతిరేకి అని మీకెందుకు అనిపిస్తోంది?

పైగా ఇక్కడ తెలుగు గురించి చర్చిస్తుంటే మొత్తంగా "చదువు సంస్కరించడానికి"ని నేను విస్మరించాననే ఒక sweeping statement ఇస్తూ, నాదొక వితండవాదం అని నిర్ణయించేశాక ఆ విషయం గురించి నేను విశదీకరించి చెప్పినా మీరు వింటారా? All you wanted was to rubbish me. You did it. If you really wanted to discuss, you would have not made conclusions before that.

ద్వితీయ భాషా బోధనా పద్దతిని చెప్పేప్పుడు "భాషాబోధన"కు చెందిన మూలాలు చెప్పకుండా వదిలేస్తారా? ద్వితీయభాషా బోధకులకు ఇంగ్లీష్ బోధనాపద్ధతి చెప్పేప్పుడు ఆబోధనకూ మాతృభాషా బోధనకూ గల తేడా చెప్పకుండా ఎవరైనా కోర్సు డిజైన్ చేస్తారా?

argument లో గెలవాలని కాకపోతే మీరడిగిన ప్రశ్నల్లో ఏమైనా "విషయం" ఉందా? ఇలా చర్చల్ని వాదనలు చెయ్యడం. ఆ తరువాత నన్నొక వితండవాది అనడం.

పెదరాయ్డు said...

మీ పద్దతిని చూసి కొ౦చె౦ ఆవేశ౦గా అడిగి౦ది నిజమే కానీ, నేనడిగి౦దేమీ అనవసర౦ కాదు. ఎనిమిదోతరగతిలోని పార్వతి వర్ణనను ’మాత్రమే’ సాకుగా చూపి తెలుగు సాహిత్యాన్ని(ఆ పాఠ్యా౦శాన్ని) చులకన చేయడానికి మీరు ప్రయత్ని౦చిన౦దు వల్లే నేనలా అడగవలసి వచ్చి౦ది.

ద్వితీయ భాషా బోధనా పద్దతిని చెప్పేప్పుడు "భాషాబోధన"కు చెందిన మూలాలు చెప్పకుండా వదిలేయమని నేనట్లేదు. ప్రధమ భాషా బోధనలో "భాషాబోధన"కు చెందిన మూలాలు అవసర౦ లేదన్న మీ వాదనే నాకు అర్థ౦ కావట్లేదు.

"All you wanted was to rubbish me. You did it." నా వుద్దేశ్య౦ ఇదైతే కాదు, దీనివల్ల నాకు లభి౦చే పరమార్ధమేమీ లేదు. మీ conclusion కూడా తప్పే.
నాదొక వితండవాదం అని నిర్ణయించేశాక ఆ విషయం గురించి నేను విశదీకరించి చెప్పినా మీరు వింటారా? - మీ ఈ నిర్ణయ౦ కూడా తప్పే. నాకైతే మీరు ఈ విధ౦గా అనేక ప్రశ్నలను ignore చేస్తున్నారనిపిస్తు౦ది.
"argument లో గెలవాలని " -- ఇక్కడ గెలిచి నేను పోగు చేసుకునే స౦పదే౦ లేదు. ఓడి ఏ౦ పోగొట్టుకో౦. మీ వాదనలో నాక్కనిపి౦చి౦ది చెప్పాను. సమాధానమివ్వలేక మీరు చూపి౦చే ఉక్రోషమే ఇది.

"తెలుగు గురించి చర్చిస్తుంటే మొత్తంగా "చదువు సంస్కరించడానికి"ని నేను విస్మరించాననే ..." - తెలుగు కాదు ’తెలుగు చదువు గురి౦చి’....నా తెలుగు ఇది కాబట్టి ఇలాగే మాట్లాడుతాన౦టే ఇక తెలుగు చదవట౦ లోని పరమార్థమేమిటి? తెలుగు వ్యాకరణ బోధనలో "వాడు మాట్లాడే తెలుగు తప్పు. కాబట్టి సరిచేసుకో"అనే మెసేజీ ’మాత్రమే’ మీకు కనిపిస్తే ఎలా?

"కొన్ని తప్పవు" అ౦టూ హి౦దీ పట్ల ఎ౦తో ఔదార్య౦ ప్రదర్శి౦చారు, బాగు౦ది. మీ లాజిక్ ప్రకార౦ తెలుగు వాళ్ళకు తెలుగు బోధి౦చ కూడదు. హి౦దీ వాళ్ళకు హి౦దీ బోధి౦చ కూడదు (ఇక్కడ మీరుగా ఒక వెసులుబాటిచ్చారు, కేవల౦ వ్యాకరణ౦ అవసర౦ లేదని). మరి హి౦దీ ప౦తుళ్ళు వారి వ్యాకరణాలను వారి పిల్లలకు నేర్పరా? వారికి "వాడు మాట్లాడే హి౦దీ తప్పు. కాబట్టి సరిచేసుకో" అనే మెసేజీ ఇవ్వరా? మీ ఆలోచన ప్రకార౦, ఆపిల్ ఎప్పుడూ కి౦దే పడుతు౦ది కాబట్టి పిల్లలకు న్యూటన్ సూత్ర౦ చెప్పట౦ వేస్ట్.

నేనడిగిన మూల ప్రశ్న ఇది. దీనికి సమాధాన౦ చెప్ప౦డి.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: నేను మీ మూల ప్రశ్నల్ని విస్మరించలేదు. వివరణ ఇచ్చాను. బహుశా నా వివరణ మీకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మళ్ళీ ప్రయత్నిస్తాను.

భాష ముఖ్య ఉద్దేశం భావవ్యక్తీకరణ. మాతృభాష (అయాచిత)సహజభాష కాబట్టి ఆ భావవ్యక్తీకరణని క్రమబద్ధం చేసుకొని higher functions such as 'descriptive,analytical and argumentative' స్థాయికి చేరుకోవడానికి పదోతరగతి వరకూ "నేర్పిస్తే" సరిపోతుంది. కానీ ద్వితీయ భాష యాచిత భాషకాబట్టి భాషయొక్క పరిమితుల్ని(వ్యాకరణాన్ని) భాష నేర్చుకోవడంతోపాటూ తెలుసుకోవలసి వస్తుంది.

రెంటిలోనూ వ్యాకరణం అవసరమే అయినా, మాతృభాషలో whole-part method లో బోధన జరిగితే ద్వితీయభాషలో part-whole method లో జరుగుతుంది. అంటే రివర్స్ లో అన్నమాట. మాతృభాషలో తెలిసిన వాడుకనుంచీ వ్యాకరణం నేర్పిస్తే, ద్వితీయభాషలో సూత్రం ముందుగాచెప్పి సోదాహరణగా వివరిస్తారు.అంతేకాక హిందీయేతరులకు నేర్పించే హిందీకోసం ‘కోర్ హిందీ’ అనీ, హిందీవాళ్ళకు(మాతృభాషగా హిందీకలిగినవాళ్ళకు) నేర్పించడానికి ‘ఎలెక్టివ్ హిందీ’ అని బోధనాపద్ధతుల్లో తేడాలున్నాయి. వారివారి భాషావసరాలు వేరుకాబట్టి దానికి అనుగుణంగా బోధనాపద్ధతి మారుతుంది.దానిప్రకారమే వారికి ఏమి ఎప్పుడు ఎలా చెప్పాలి అనేది నిర్ధారించబదుతుంది.ఇది నేను హిందీపై చూపించిన ఔదార్యంకాదు. ప్రస్తుతం నెలకొనివున్న పద్ధతి.

మన తెలుగులో ఆ సౌలభ్యం లేదు. మన తెలుగు బోధనలో వచ్చిన సమస్య ఏమిటంటే విద్యార్థి "సహజ భాష"కు దూరంగా పాఠాల భాష ఉండటం. మన వ్యాకరణం సంస్కృతభూయిష్టమై "వల్లెవేసే" పద్దతిలోనే బోధించడం.అంటే కొండొకచో తెలుగువాడు తన భాషైన తెలుగునే అన్యభాషని నేర్చుకున్నట్లు నేర్చుకునే పద్ధతిలో మన తెలుగు బోధన తగలడింది.

పెదరాయ్డు said...

ఈ వివరణ కాస్త మర్యాదకర౦గానే తర్కబద్ద౦గానూ ఉ౦ది :) మీరు చెప్పినట్లు ఆ సౌలభ్య౦ తెలుగులో లేకపోవడ౦ అన్నది నేను గుర్తి౦చలేక పోతున్నాను. ఎ౦దుక౦టే మాకు నేర్పినపుడు, అయ్యవార్లు మొదట ఉదాహరణలు చెప్పి స౦ధులు, సమాసాలు, విభక్తులను, పద్యాలను వివరి౦చేవారు మొదటి తరగతుల్లో. తరువాతి తరగతుల్లో ఛ౦దస్సుల వ౦టి వాటిని వల్లె వేసిన మాట నిజ౦. నాకు తెలిసిన౦త వరకూ దీన్ని సాధన చేస్తే, ఇది కూడా మొదటి దానివలే సామాన్యుల వాడుకలో కొస్తు౦ది. ఏ భాషైనా ఇలాగే వృద్ది చె౦దుతు౦ది. కానీ దీనికి ప్రత్యామ్యాయ౦ ఉ౦ద౦టారా?

నిజ౦గా మీరన్న పద్దతులు మన౦ పాటి౦చక పోతే, దాన్ని సవరి౦చుకోవచ్చు. కానీ ఆ వ౦కతో మన సాహిత్యాన్ని వదలుకోవాలనడ౦ తిరోగమనమే. అలా అనరనే/అనలేదనే భావిస్తాను.

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు: ప్రత్యామ్న్యాయం ఉంది. 1989 లో అనుకుంటాను ఒక భాషాకమిటీ చేసిన రెకమండేషన్స్ కొన్ని చెబుతాను వినండి.ఇందులో సాహిత్యాన్ని వదులుకోవడం కాదుకదా సాహిత్యాన్ని ఆధారం చేసుకునే మొత్తం బోధన ప్రతిపాదించడం జరిగింది.

1)మొదటి ఐదు తరగతుల్లో మౌఖికంగా బాల సాహిత్యం (పాటలూ,గేయాలూ,గీతాలూ,కథాపఠనం) నేర్పుతూ కేవలం ఆక్షరాలు రాయడం,చదవడం నేర్పాలి.
2)ఆరు ఏడు ఎనిమిదో తరగతుల్లో వాడుకభాషలోని కథలు,వ్యాసాలు,వాడుక భాషకు దగ్గరగా ఉండే శతక పద్యాలు ఇతర గేయాలను పరిచయం చెయ్యాలి. కథావ్యాసాల్లోని ఆలోచనల్ని,అభిప్రాయాల్నీ అర్థం చేసుకోవడం,విస్తరణ,కుదింపు,వాక్యనిర్మాణం (దానికి సంబంధించిన వ్యాకరణం) వంటి ప్రక్రియలలో నిపుణుల్ని చెయ్యాలి.నిఘంటువు శోధనను అనివార్యం చేసే చర్యలు చేపట్టాలి. తద్వారా పిల్లల్లోని ఆలోచనా శక్తిని,సృజనాత్మకనూ పెంపొందించి స్వయంగా తమ ఆలోచనల్ని రాసేవిధంగా ప్రేరేపించాలి.
ఉపవాచకాలుగా ట్రావెలాగులు,విహారప్రదేశాల వర్ణనలు వంటివి పరిచయం చెయ్యడం ప్రోత్సహించదగినవి.

3)తొమ్మిది పది తరగతుల్లో తెలుగును రెండు సమ భాగాలుగా చేసి పద్యసాహిత్యం ఒకవైపు గద్య సాహిత్యం మరొకవైపూ బోధించాలి. పద్యసాహిత్యాన్ని ఆధునిక కవితలతో మొదలుపెట్టి ఛంధోబద్ధమైన పద్యాల వరకూ అన్ని ప్రక్రియలతోనూ పరిచయం కలిగేలా బోధించాలి. గద్యసాహిత్యంలో కథ,కథానిక,గల్పిక,నవలిక,ట్రావెలాగ్ వంటి ప్రక్రియను పరిచయం చేస్తూ పాఠ్యాంశాలను జతచెయ్యాలి. ఉపవాచకంగా నవలా సాహిత్యాన్ని లేక నాటకాన్ని పరిచయం చెయ్యడం ఉత్తమం.

ఈ ప్రతిపాదనను తెలుగు భాష "గొప్పతనానికి" కీడుచేసి, మన భాషా వారసత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఉందని కొందరు మేధావులు అమలు కానివ్వకుండా చేశారు.ఇప్పుడు మనం ఫలితం అనుభవిస్తున్నాము. ఇదే మేధావులు ఇప్పుడు జానుతెనుగు కుదించుకుపోతోంది కుంచించుకుపోతోందీ అని తమ పిల్లల్ని ఇంగ్లీషు చదువులు చదివిస్తూ వాపోతున్నారు.

చదువరి said...

మనదైనదాన్ని తిట్టాలి, అవతలోడి గొప్పకు చాటింపు వెయ్యాలి. తిట్టడం ఏ స్థాయికి వెళ్ళిందంటే.. సాహిత్యాన్ని తుంగలో తొక్కాలన్నంతగా! నన్నయను అవమానించేంతగా! ఛందోబద్ధ కవిత్వం పనికిమాలినది, నన్నయ రాసిన కవిత్వం బోడి అనువాదం అని మాట్టాడారు. పాత సాహిత్యమూ, ఆ తెలుగూ చచ్చిపోవాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంత కచ్చ? ఆ తెలుగును నేర్చుకోలేని చేతకానితనమా? అందుకు సాహిత్యాన్ని పాతరెయ్యాలా? గ్రాంధికం మీకు నచ్చకపోవచ్చు, రాకపోవచ్చు. కానీ పాతసాహిత్యాన్ని తుంగలో తొక్కాలని ఎందుకనిపిస్తోంది?

మీ ఆవేశం చూస్తూంటే పద్యాల మీద కాక, ఆ సాహిత్యం మీద కాక, అంతర్గతంగా మీకు ఇంకా దేనిమీదో కసి ఉన్నట్టనిపిస్తోంది. ఏదో భావజాలం మీకా ఆవేశాన్ని కలిగిస్తున్నట్టనిపిస్తోంది. అది మిమ్మల్ని ఊపేస్తోంది. ఈ మధ్య మరీ ఎక్కువైపోతోందీ ధోరణి! మీరా 'ఫిక్సేషన్నుం'చి బయటికి రావాలని కోరుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

@చదువరి: నా వ్యాఖ్యల్లో మీకు కోపం/కసి/కచ్చ/భావజాలం/ఫిక్షేశన్ మాత్రమే కనిపిస్తే తప్పు ఖచ్చితంగా నాదికాదు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతివిషయానికీ సహేతుకమైన కారణాలు చెబుతూ వాటికి ఆధారాలు చూపించినా మీకు కనిపించలేదు.

నా కోపం మాత్రమే కనిపించి దానివెనుక నేను చెబుతున్న ఆవేదన కనిపించలేదంటే మీ ఫిక్షేషన్ ఊహాజనిత "నా భావజాలం" మీదేతప్ప నేను చెబుతున్న అసలు విషయం గురించి కాదేమో!

"మొత్తం సాహిత్యాన్ని కట్టగట్టి గంగలో విసిరేసినా, తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది. బహుశా అప్పుడు బ్రతికున్న తెలుగే అసలు తెలుగు కాబోలు.” అనేది నా వ్యాఖ్య. ఇందులో "”భాషనుంచి సాహిత్యం గానీ సాహిత్యం నుంచి భాష కాదు.” అనే భావన ఉందేతప్ప తెలుగు సాహిత్యాన్ని కించపరిచే ఉద్దేశం లేదు. అలా మీకు కనబడింది అంతే!లేదా మీరు అదే చూడాలనుకున్నారు. అంతే!

నన్నయ అనువాదకవి అన్నది తెలుగులో "ఒరిజినల్ థాట్" కు సంబంధించిన నేపధ్యంలో. మహాభారతం తెలుగు(భాషా) సంస్కృతికి సంబంధించినది కాదు. కనీసం బౌగోళికంగా,చారిత్రకంగా కూడా సంబంధించినది కాదు.ముందే సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెనుగీకరించడాన్ని అనువాదం కాక మరేమనాలి? సాహిత్యం సంస్కృతి,భాషలలోని భావాలకు అద్దంపట్టాలి.వాటిలోని సొబగులకు అక్షరాలద్దాలి. అలాకాకుండా ఎక్కడిదో మహాభారతాన్ని తెలుగులోరాస్తే ఒరిజనల్ థాట్ ఎక్కడ్నుంచీ వస్తుంది అనే నేపధ్యంలో ప్రశ్నించానేతప్ప నన్నయ్య రాసిన పద్యాల్ని అవమానించడం ఎట్లా అయ్యింది?

బోడి అనువాదం అన్నది మీరు. నేను కాదు. ఛంధోకవిత్వం పనికిమలినది అన్నది నేను కాదు. మీరు. సాహిత్యాన్ని పాతరెయ్యలని నేను ఎక్కడా అనలేదు. ఇక్కడ ఆ మాట అంటూ నాకు ఆపాదిస్తోంది మాత్రం, మీరే.

ఛందోబద్ధమైన కవిత్వాన్ని నేర్పాల్సిన వయసులో,స్థాయిలో నేర్పాలనే సూచనేతప్ప దాన్ని పనికిమాలినదిగా నేనెప్పుడూ భావించలేదు.

గ్రాంధికం నాకు రాదు. దానవసరం నాకు లేదు.అది నా చేతకానితనంగా మీకు కనిపిస్తే అది మీ ఆభిజాత్యమేతప్ప మరిఒకటి కాదు.ఇందులో నేను బాధపడాల్సిందీ కుమిలికుములి కచ్చ ఏర్పరుచుకోవలసిందీ ఏమీ లేదు. అదొచ్చినోళ్ళు గొప్పోళ్ళని మీరు అనుకుంటూ నాకు న్యూనత ఆపాదిస్తున్నరేతప్ప నలుపు మీ వాదనలోనే ఉందని గ్రహించండి.

కొత్త పాళీ said...

మనుగడ, బతికించడం, లాంటి ఇమోషనల్ పదాల్ని ఉపయోగించడం వల్ల చర్చ పూర్తిగా పక్కదారి పడుతున్నదని నాకనిపిస్తున్నది. మీరిది రాసింది కామేశ్వర్రావుగారి పొద్దు వ్యాసానికి బదులుగానయితే, మీరాయన ఉద్దేశాన్ని ప్రయత్నపూర్వకంగా తప్పుగా అర్ధం చేసుకున్నారని నిస్సంశయంగా చెప్పగలను. భాష బతికే ఉంటుంది, భాష మారుతూ ఉంటుంది, ఇవన్నీ నిజమే. ఆ విషయాన్ని కామేశ్వర్రావు ప్రభృతులు కూడా కాదంటారనుకోను.
టీవీలంగరమ్మల సంకర భాషవల్లనే తెలుక్కి ఏదో ముంచుకొచ్చిందని కాదు అసలు సమస్య. మీరు ఈ టపాలోనే చివర్లో చెప్పినట్టు, ఒక భాషగా తెలుగు బోధన అధ్వాన్న స్థాయికి దిగజారిపోతున్నదనేది కాదనలేని నిజం. తెలుగు మీడియంలో పదోతరగతి చదువుకున్న విద్యార్ధి పట్టుమని పది వాక్యాలు తెలుగులో రాయలేకపోవడం, మాట్లాడలేకపోవడం దీనికి గుర్తులు. మీరు శ్రమపడి మీ భాషాశాస్త్ర పాఠాల్ని వల్లించి చెప్పినట్టు, ఆ నాలుగు ఉపయోగాలకి ఒక భాషగా తెలుగు ఉపయోగించడం తగ్గిపోయినప్పుడు భాష కుచించుకు పోయినట్టే. అంతకంటే భయం గొలిపేది మన రాష్ట్ర ప్రభుత్వ వైఖిరి .. అసలు ఇదొక సమస్యగానే తోచక పోవడం. కొన్ని కొన్ని పనులు ప్రభుత్వ జోక్యం వల్లనే సాధ్యమవుతాయి.

కొత్త పాళీ said...

"ఒకవేళ మీరు అలాంటి సౌందర్య్యాని అలా చదువుకున్న వయసులో మీకేమన్నా ఇబ్బందిగా అనిపించిదా?అమ్మ స్థన సౌందర్యాన్ని చూస్తే మీకు ఇబ్బందిగా ఉంటుందా అలాంటి వయసులో?"
హ హ హ. భలే ప్రశ్న శ్రీనివాసు గారూ.
సందర్భం కాకపోయినా, గౌతం ఘోష్ తీసిన యాత్ర సినిమాలో ఒక దృశ్యం గుర్తొచ్చింది. ఢిల్లీలో కార్పొరేట్ స్పాస్నర్షిప్లో ఒక హైక్లాసు సాహిత్య సభ జరుగుతుంటుంది. చీర సరిగ్గా కట్టుకోటం చేతకాని ఒక యువతి పైట జారిపోతే, ఒక ఛోటా రాజకీయ నాయకుడు ఆమె చనుకట్టు కేసి ఆబగా చూస్తుంటాడు. పక్కనే ఉన్న నానాపటేకర్ అతనితో "అమ్మ గుర్తొస్తోంది కదూ!" అంటాడు.

Kathi Mahesh Kumar said...

@కొత్తాపాళీ: ప్రభుత్వ వైఖరి(ఉదాసీనతకు) గల మూల కారణం చెబుతా వినండి.కొంచెం ఘాటుగా అనిపించినా కొన్ని నిజాలు వినకతప్పదు.

తెలుగు భాష కోసం మొత్తుకుంటున్న మేధావుల పిల్లలెవరూ తెలుగు మీడియం చదువులు చదవటం లేదు. వీళ్ళు ప్రభుత్వం మీదపడి స్టేజిల్లోనూ,బ్లాగుల్లోనూ ఏడవటంతప్ప క్రియాశీలకంగా తెలుగును ఒక ప్రజాఉద్యమంగా ఎన్నడూ చెయ్యాలనుకోలేదు.ఎందుకంటే,ఒక్కసారి ప్రజల్లో పడితే వీళ్ళబ్రతుకులు కుక్కలుచింపిన విస్తరే. "మీకు మాత్రం ఇంగ్లీషు చదువులూ మాకు మాత్రం తెలుగు బ్రతుకులా" అని ప్రజలు అడిగితే వీళ్ళు మొఖం ఎక్కడబెట్టుకుంటారో వీళ్ళకే తెలీదు.

ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం,ప్రజాఉద్యమాలకున్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పరిస్థితినే రాష్ట్రప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి వాడుకుంటోంది. పాఠశాల విద్యను 6-12 వరకూ చేసి ఇంగ్లీషు-హిందీ చేస్తే కేంద్రప్రభుత్వం తేరగా నిధులిస్తుంది.రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులు విద్యాశాఖలు కేటాయించాల్సిన పనిలేదు. ప్రాధమిక విద్య ఎలాగూ SSA (సర్వశిక్షా అభియాన్) పుణ్యమా అని కేంద్రం నిధులతో గడిచిపోతోంది. పాఠశాల విద్యకూడా ఒదిలిపోతే ఒకపనైపోతుందనేది ప్రభుత్వ విధానం.

ఈ తెలుగు భాషా ‘బాధ’కులకు మిగిలింది మూడు options. ఒకటి భాషాబోధనను మార్చడం. అది వాళ్ళు చచ్చినా చెయ్యరు. ఎందుకంటే అదే "అచ్చతెలుగు" అనేది వీళ్ళ పిచ్చినమ్మకం. భాషా వారసత్వం వీరికి ముఖ్యం. భాష కాదు. వీరికి వర్తమానంకన్నా భూతకాలపు వైభవం ముఖ్యం.ప్రజల తెలుగుకన్నా, సారస్వతం ముఖ్యం.

రెండోది. ఏ ఆర్థిక కారణాల వల్లనైతే ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం చదువులవైపు మొగ్గుచూపతోందో ఆ ఆర్ధిక కారణాన్ని రూపుమాపడం. స్వచ్చందంగా "భాషా సెస్" విధించమని ప్రభుత్వానికి చెప్పి,తెలుగు భాషా పరిరక్షణకోసం ట్యాక్స్ కట్టడానికి తయారవ్వడం. ఈ పని వీళ్ళు చేస్తారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఏదో తెలుగు భాషకోసం lip service వరకూ చేస్తారుగానీ జేబులోంచీ డబ్బుతీసి తెలుగు భాషను రక్షించడమంటే..హమ్మో!

మూడొది. తెలుగు భాషను ఒక రాజకీయ ఉద్యమం చెయ్యడం. అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలోనూ తెలుగు భాషను "రక్షించే"(what ever it means to them)విధంగా చర్యలు ప్రతిపాదింపజెయ్యడం. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరిచేలా ఒత్తిడి తేవడం. లోక్ సత్తా లాంటి స్థానిక పరిపాలన తెలుగులో జరగాలని కోరుకునే పార్టీల నెత్తిన తమ ఆభిజాత్యాల్ని రుద్ధకుండా, పరిపాలనా తెలుగును సర్వత్రా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటూ స్వచ్చందంగా దానికోసం పాటుపడటం.

నా టపా పొద్దు వ్యాసానికి(అది నిఝంగా వ్యాసమా!)ముఖ్యంగా అందులోని వ్యాఖ్యలకు, రేరాజుతో నా చర్చలకీ ప్రతిస్పందనగా రాసిందే. నేను కామేశ్వర్రావుగారు రాసింది అర్థం చేసుకున్నాను. తప్పుగా మాత్రం కాదు.

కామేశ్వరరావు said...

మహేష్ గారు,
నేను రాసింది సరిగ్గా అర్థం చేసుకునుంటే మరి నా చివరి కామెంటులో సూచించిన విషయానికి మీరు ఎందుకు స్పందించలేదండీ? (మీరే కాదు ఎవరూ స్పందించలేదనుకోండి, కాని వాళ్ళు మీలా ఇలా బ్లాగు రాయలేదు కాబట్టి వాళ్ళని నేరుగా అడిగే అవకాశం లేదు)

Kathi Mahesh Kumar said...

@కామేశ్వరరావు గారు: నేను స్పందించాను. కానీ పొద్దువాళ్ళు నా వ్యాఖ్యని అమోదించలేదు. బహుశా ఈ చర్చ ఇంతటితో సమాప్తం అనుకుని మీ వ్యాఖ్యతో మంగళహారతి పాడినట్లున్నారు. మిగతావారి వ్యాఖ్యలూ అలాగే అయ్యాయేమో తెలీదు.

కామేశ్వరరావు said...

మీరేమన్నారు? మనం కలిసి ఏమైనా చెయ్యగలమంటారా?

Kathi Mahesh Kumar said...

@భైరవభట్ల కామేశ్వర రావు: మనం చెయ్యగలిగేవి నా దృష్టిలో కొన్నున్నాయి. కొన్ని వ్యక్తిగతంగా చెయ్యొచ్చు. మరికొన్నిటికి ఉద్యమాలు కావాలి. కాబట్టి వ్యక్తిగతంగా చెయ్యగలిగేవాటికే నా ప్రాధాన్యత.
1.బడిలో తెలుగు మానినా తెలుగు చదవడం మాకండి అని మన చుట్టుపక్కలవారికీ,బంధువర్గానికీ,స్నేహితులకీ వాళ్ళ పిల్లలకీ చెప్పడం.
2. పిల్లలచేత బడిలో తెలుగు పుస్తకాలు మానిపించినా కనీసం తెలుగు కథల పుస్తకాలు కొనివ్వండని పెద్దలకు చెప్పడం.
3. పుట్టినరోజులకూ,పెళ్ళిరోజులకూ ఇతరత్రా రోజుల్లో బహుమతులుగా తెలుగు పుస్తకాలు ఇవ్వడం.
4.మనకు తెలిసిన తెలుగు పుస్తకాల గురించి, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాల గురించీ వీలైనంత మంది ఔత్సాహికులకి చెప్పి, చదవమని ప్రోత్సహించడం.


నేను పైవన్నీ చేస్తున్నాను. ఇకపై చేస్తానుకూడా. తెలుగు కోసం ఉద్యమాలు చెయ్యడం నాకు చేతకాదు. కాబట్టి I refrain from commenting on that from my end.