పదోతరగతి బోర్డు పరీక్షలు ఎత్తేస్తామనే కపిల్ సిబ్బల్ పిలుపుతో కొందరు పిల్లలు సంతోషపడితే మరికొందరు మేము మిగతావారికంటే మెరుగని తెలిసేదెట్లా అని వాపోయారు. కొందరు పెద్దలు మరి మా పిల్లల "విలువ" గ్రహించేదెలా అని బాధపడితే, మరికొందరు కనీసం ఒక టెన్షన్ తగ్గిందని సంబరపడ్డారు. కొందరు విద్యావేత్తలు పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుందని శెలవిస్తే, మరికొందరు ఇంటర్లో బ్లాంచులు కేటాయించేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు (U.P) మేము మీకన్నా ముందున్నాం అని ఈ సంవత్సరం నుంచే పదోతరగతి పరీక్షల్ని తీసేస్తే, మరికొన్ని రాష్ట్రాలు స్టేట్ సబ్జెక్టైన విద్యను కేంద్రం లాగేసుకోవడానికి ఇదొక ఎత్తుగడ అని వ్యతిరేకిస్తున్నారు.
ఇన్ని విభిన్నమైన ఆలోచనలూ ప్రతిస్పందనల మధ్య ఈ విషయం నిల్చుంది. టీవీల్లో మేధావులు మేధావులు తమ అమూల్యమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే...ఈ ప్రతిపాదనను కపిల్ సిబ్బల్ కొత్తగా ప్రతిపాదించినట్లు అందరూ చెప్పుకోవడం. నిజానికి విద్యను ఒక రాజ్యాంగపరమైన హక్కుగా చెయ్యడం, ప్రస్తుతం ఉన్న విద్యావిధానం (National curriculum for school education) చాలా పురాతనమైనది గనుక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం అనేవి క్రితం సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెయ్యాలనుకున్న పనులు. ఒకవైపు అర్జున్ సింగ్ అలసత్వం మరోవైపు లెఫ్ట్ పార్టీల గోల, బీజేపీ పాలిత రాష్ట్రాల వ్యతిరేకత (బహుశా వీళ్ళకి తాము ఆధికారంలో ఉన్నప్పుడు చేసిన చిలిపిపనులు గుర్తొచ్చాయేమో) అన్నీ కలిపి ఏమీ చెయ్యలేక పోయింది.
ప్రస్తుత ప్రతిపాదనకొక చరిత్ర ఉంది. ఒక నేపధ్యముంది. ఎందరో విద్యావేత్తల మేధావుల,టీచర్ల, విద్యార్థుల అనుభవాలూ పరిశీలనలూ ఉన్నాయి. National Policy on Education in 1986 ఆధారంగా జరిపిన ఒక పరిశోధన సారంగా Learning without Burden (1993) సూచనలు వెలువడినప్పుడు దేశంలోని విద్యావేత్తలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తాము విద్యార్థులపైన ఎంత జులుంచేస్తున్నామో గ్రహించారు. చదువుకోవడం ఒక భారంగా భావిస్తున్న విద్యార్థులకు ముకుతాడుకట్టి విద్యబోధించడం జ్ఞానాన్ని అందించడం కాదనే నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుండీ వివిధ స్థాయిల్లొ చర్చలు జరిగాయి. ప్రతి రాష్ట్రప్రభుత్వంతోనూ సమన్వయ కమిటీలు ఏర్పరిచారు. ప్రొఫెసర్ యశ్పాల్ సార్ధ్యంలో 35 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీ ఏర్పడింది. 21 జాతీయ చర్చా సమూహాలు దేశం నలుమూలలా తిరిగి అభిప్రాయ సేకరణ, శోధన,పరిశోధన చేశారు.
a) Areas of Curricular Concern - అన్ని సబ్జెక్టుల్లో బోధనా పద్దతుల సమీక్ష
b) Areas for systemic reform - విద్యావ్యస్థ పాలన విధానాల్లో మార్పులు
c) National Concerns - ఆర్ధిక,సామాజి,లింగపరమైన integration కోసం ప్రయత్నం
పై విషయాలలో విస్తృత చర్చలు జరిగాయి. ఈ చర్చల్లోని కొన్ని నిర్ణయాల మూలంగానే మా కాలేజిలో (Regional Collage of Education) లో గ్రాడ్యుయేట్ టీచర్ కోర్సులు తీసేసి In -service teacher education మొదలెట్టారు. పైపై మెరుగులు ఎన్నిదిద్దినా మూల విషయాలలో పెద్ద break through జరలేదు. చివరకు కొన్ని పోరాటాల తరువాత అన్ని SCERT ల (State Council for Educational reserach and Training) consensus తో National curriculum for school education-2005 బయటికొచ్చింది. అప్పట్నుంచీ ఇప్పటిదాకా అది కూడా కోల్డ్ స్టోరేజిలో ఉంటే ఇప్పుడే కపిల్ సిబ్బల్ దానికి వేడి పుట్టించారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వాలు దీన్ని పాటిస్తాయో లేదో తెలీదు. ఈ సంస్కరణలు ఎప్పుడు మొదలవుతాయో...ఎప్పుడు మన విద్యావ్యవస్థ బాగుపడుతుందో!
NCSE-2005 లోంచీ వచ్చిన మొదటి రెకమండేషన్ ఇది. ప్రస్తుతానికి కేవలం CBSC స్కూళ్ళకే వర్తిస్తుంది. ఎందుకంటే, వీరి ప్రకారం 5th - 12th స్కూల్ విద్యగా పరిగణిస్తారు. పదోతరగతి నుంచీ పదకొండు కేవలం క్లాసు రూములో మార్పేతప్ప స్కూలు మార్పుకాదు. కానీ మనలాంటి రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ను pre-university education గా పరిగణిస్తారు. దీన్ని మార్చే వరకూ మన విద్యార్థులకు "విడుదల" లేనట్టే. చెయ్యాల్సిందింకా చాలా ఉంది. ఎంతచేసినా తక్కువే అవుతుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో!
Friday, June 26, 2009
బోర్డు పరీక్ష..హుష్ కాకి!
*****
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
exams teeseste emi vastundio koncham cheppandi.....plz naaku telusukovaalani vundi.......
education baagupadutundi annaru elano koncham cheppagalara..........
asalu exams teesetse ela education system ni prakshalaana chesinatlo naaku artham kaadu............
boss vaallu chepparu veellu chepparu ani kaadu meeku em anipinchindio cheppandi........
@వినయ్ చక్రవర్తి: నేను లంకెలో ఇచ్చిన National Curriculum Framework 2005 చదివితే ఇన్ని ప్రశ్నలు వచ్చుండేవి కావేమో!
ఇక్కడ పరీక్షలు తీసెయ్యటం లేదు. ఈ పరీక్షలకు "జీవితంలో ఉన్న ప్రాధాన్యతను" తగ్గిస్తున్నారు. అంతే! Evaluation would still take place. But student's lives are not going to be decided by this exam.
పదవతరగతిలో ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిలవ్వడం వలన పూర్తిగా పైచదువులకు దూరమౌతున్న వారి సంఖ్య విపరీతంగా (కొన్ని లక్షల్లో) ఉంది. మిగతా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉండీ, పైచదువులు చదవగలిగే సత్తాఉండీ, కేవలం ఒక పరీక్షవలన అదీ బహుశా జీవితంలో ఎప్పుడూ మళ్ళీ చదవనక్కరలేని సబ్జెక్టువలన జీవితాల్ని చదువుకు దూరం చెయ్యడం అర్థరహితం. ఉదాహరణకు మ్యాధ్స్ లో పెయిలైన విధ్యార్థి 11th 12th లో వొకేషనల్ (టైపు షార్టుహ్యండు వగైరా)కోర్సులు చెయ్యాలన్నా కుదరదు. ఎంత అన్యాయమైన పరిస్థితి!
రెండు. కేంద్రప్రభుత్వం ప్రకారం పాఠశాల విద్య ఆరోతరగతి నుంచీ పన్నెండో తరగతి వరకూ. అంటే ఒకే స్కూల్లో అన్నమాట. అలాంటప్పుడు పదోతరగతిని ఒక మధ్యమెట్టుగా ఎందుకుచూడాలి? ఆరోతరగతి నుంచీ అదేస్కూల్లో చదువుతున్న విద్యార్థి శక్తిసామర్ధ్యాలు టీచర్లకు తెలుసు.దాన్నిబట్టి తనకు కోర్సులు రెకమండ్ చేసే సౌలభ్యం ఉంది. బలవంతంగా పిల్లల్ని ఇంజనీరూ డాక్టరూ చేసేద్ధామని ఎమ్.పీ.సీలూ బై.పీ.సీలూ చేయించాల్సిన ఉత్సాహం మన ఆంధ్రాలో కొంచెం ఎక్కువ. బహుశా అందుకని మీకు ఈ ప్రతిపాదన కొంచెం చిత్రంగా ఉన్నా జ్ఞానం కోసం,పిల్లవాడి ఆనందం కోసం చదువు అనే ఆలోచన నేపధ్యంలో ఈ ప్రతిపాదన సరైనదే.పదోతరగతి మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థి తను చెయ్యగలిగింది, తనకు ఇష్టమైంది 11th,12th లో చెయ్యొచ్చు. అంతకన్నా pleasurable experience మరొకటుంటుందని నేననుకోను. ఒకసారి ఇలా తనదైన పట్టాలు విద్యార్థిపట్టాడంటే జీవితమొక సూపర్ ఎక్స్ప్రెస్సే...
ఈ పరీక్ష ఒకటి తియ్యగానే విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగిపోయినట్లు నేనెక్కడన్నా చెప్పానా? "NCSE-2005 లోంచీ వచ్చిన మొదటి రెకమండేషన్ ఇది." అని చెప్పానే. పైగా "ఈ సంస్కరణలు ఎప్పుడు మొదలవుతాయో...ఎప్పుడు మన విద్యావ్యవస్థ బాగుపడుతుందో!" అని ఒక నిట్టూర్పుకూడా విడిచాను.
150 పేజీల ఆ "చట్రాన్ని" చదివే ఓపిక లేక...చదవలేకపోయామండి...ఇప్పుడేదో కాస్త అర్ధం అయ్యింది . రేపు మళ్ళీ చూస్తాను.
ఆ యశ్ పాల్ గారి ముందుమాట - తెలుగులో - చదువుతుంటే, అచ్చు మీ రాతలానే అనిపించింది. నా భ్రమా? నిజమేనా!?
it is a welcoming concept.
the modalities are still to be framed.
let us wait and see.
పదవ తరగతి పరీక్షలు తీసెయ్యడం ఒక మంచి పరిణామం! కేంద్రీయ విద్యాలయాల్లో పదవ తరగతి వరకూ Continual Evaluation ఇప్పటికే అమలులో ఉంది. సంవత్సరమంతా పాఠాలు చెప్పిన టీచర్లకంటే, పది ప్రశ్నలిచ్చేసి వాటి ఆధారంగా ఎవాల్యుయేషన్ చేసే వారికి పిల్లల గురించి సరియైన అంచనా ఉంటుందన్న ప్రమాదకరమైన నమ్మకం పునాదిపై ఏర్పడినవి ఈ పబ్లిక్ పరీక్షలు.
ఇంతటితో ఐపోలేదు. ఇప్పుడున్న CBSE, ISCE, Anglo Indian Board, ఇంకా సవాలక్ష బోర్డులను రద్దు చేసి ఒక్క బోర్డుకిందికి దేశాన్నంతటినీ తేవడం అంత సులభమైన పని కాదు.
మహేష్ కత్తి మీరు ఇలా అన్నారు.
=================================
కేంద్రప్రభుత్వం ప్రకారం పాఠశాల విద్య ఆరోతరగతి నుంచీ పన్నెండో తరగతి వరకూ. అంటే ఒకే స్కూల్లో అన్నమాట. అలాంటప్పుడు పదోతరగతిని ఒక మధ్యమెట్టుగా ఎందుకుచూడాలి? ఆరోతరగతి నుంచీ అదేస్కూల్లో చదువుతున్న విద్యార్థి శక్తిసామర్ధ్యాలు టీచర్లకు తెలుసు.దాన్నిబట్టి తనకు కోర్సులు రెకమండ్ చేసే సౌలభ్యం ఉంది. బలవంతంగా పిల్లల్ని ఇంజనీరూ డాక్టరూ చేసేద్ధామని ఎమ్.పీ.సీలూ బై.పీ.సీలూ చేయించాల్సిన ఉత్సాహం మన ఆంధ్రాలో కొంచెం ఎక్కువ. బహుశా అందుకని మీకు ఈ ప్రతిపాదన కొంచెం చిత్రంగా ఉన్నా జ్ఞానం కోసం,పిల్లవాడి ఆనందం కోసం చదువు అనే ఆలోచన నేపధ్యంలో ఈ ప్రతిపాదన సరైనదే.పదోతరగతి మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థి తను చెయ్యగలిగింది, తనకు ఇష్టమైంది 11th,12th లో చెయ్యొచ్చు. అంతకన్నా pleasurable experience మరొకటుంటుందని నేననుకోను
=================================
భారత దేశం లో చదువు కేవలం విద్యార్థుల సౌలభ్యం, వాళ్ళకు మానసికానందం ఇచ్చే ఒక వ్యాపకం కాదేమో అని నా అభిప్రాయం. అమెరికా లాంటి దేశాల్లో జనాభా తక్కువ, అవకాశాలు ఎక్కువ కాబట్టి అలాంటి విద్యా విధానం వాళ్ళకు సౌలభ్యం గా ఉంటుంది. కానీ మనలాంటి దేశాలకు, ఒక విద్యార్థికి చదువు బ్రతుకు తెరువు చూపే ఒక ప్రధాన సాధనం. ఇది కరెక్టా కాదా అనేది మరో చర్చనీయాంశం.
ఇక పోతే 6 నుండి 12 వరకూ ఒకటే స్కూల్ అనే లాజిక్ బాగానే ఉన్నా, ఒక మధ్య మెట్టు ఉండటం అనేది చాలా అవసరం ! దీని వల్ల నష్టం కన్నా లాభాలే ఎక్కువ. ఎలా అంటారా.. ? ఆ మధ్య మెట్టు అనేది విద్యార్థి జీవితం లో తొలి మెట్టు ! అక్కడ జరిగే లోటు పాట్లను అతను భవిష్యత్తు లో సరిదిద్దుకోవచ్చు.. అలా దిద్దుకొన్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఒక పోరాట స్ఫూర్తి ఏర్పడటానికి ఆ పదో తరర్గతి మధ్య మెట్టు దోహదం చేస్తుంది. ఇక మీరు చెప్పినట్టు, ఎందులో ఆసక్తి ఉందో అది ఎన్నుకోవడానికి పదో తరగతి ఆటంకం కాదు. తనకు ఆసక్తి ఉన్న పాఠ్యాంశాల్ని తను ఎన్నుకొనే అవకాశం ఎలాగూ 11 నుండే విద్యార్థి కి కలుగుతున్నపుడు, ఆసక్తి లేని పాఠ్యాంశాల్ని మరో రెండు సంవత్సరాలు మోయాల్సిన అవసరం లేని ప్రస్తుత విద్యా విధానం సరైనదే అని నా అభిప్రాయం. 12 వరకూ ఒకటే స్కూల్ అనుకోంటే.. ఆ విద్యార్థి కి 10 తరగతి లో వచ్చిన సమస్య, 12 లొ మరింత జటిలమవుతుందే కానీ, తీరదు. ఎందుకంటే.. మరో రెండేళ్ళు ఆ విద్యార్థి అనవసర భారాన్ని మోయాలి కాబట్టి.. !
ఏమంటారు?
@వరుణుడు: పదవతరగతి వరకూ చదువు జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో చెప్పడానికి మార్గం మాత్రమే. ఆ process ఆనందకరంగానే ఉండాలి.లేకపోతే విధ్యార్థికి చదువంటే "బలవంతం" అవుతుందేతప్ప "ఇష్టం" కలగదు. "మనలాంటి దేశాలకు, ఒక విద్యార్థికి చదువు బ్రతుకు తెరువు చూపే ఒక ప్రధాన సాధనం." అనే మాటతో విభేధించకతప్పదు. ముఖ్యంగా ప్రస్తుతం చర్చిస్తున్న context లో. పదవతరగతి చదువుతో ఎవరూ ప్రొఫెషనల్స్ అయిపోవడం లేదు. వేరే పనులు చేసుకోవడానికి తగ్గ వృత్తినైపుణ్యాల్ని ఎవరూ పొందడం లేదు.
ప్రాధమిక విద్య reading, writing,comprehension నేర్పిస్తే,పాఠశాల విద్య arithmetic,language proficiency,basic scientific inquiry, social skills నేర్పించాలి. కానీ మనం learning objectives కన్నా విషయపరిజ్ఞానం మీద దృష్టిపెట్టి పదోతరగతి అనే పరీక్షతో విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించేస్తున్నాము.అది తప్పు అన్నదే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయానికి కారణం.
"ఎందులో ఆసక్తి ఉందో అది ఎన్నుకోవడానికి పదో తరగతి ఆటంకం కాదు." ఖచ్చితంగా ఆటంకమే. బోర్డుపరీక్ష ఉండటం వలన పదోతరగతి పాస్ అవ్వందే 11th,12th వెళ్ళటానికి వీలవ్వదు. ఇలా ఫిల్టర్ చేసి వేరే సబ్జెక్టుల్లో అత్యుత్తమంగా రాణించే అవకాశం ఉన్న చాలా మందిని ముందుకెళ్ళకుండా ఆపెయ్యడం సమాజానికి శ్రేయస్కరం కాదు. పదోతరగతి మ్యాథ్స్ లో ఫెయిలైన విద్యార్థి సైకాలజీలోనో,సోషియల్ సైన్సులోనూ,లిటరేచర్లోనో excel అయ్యేఅవకాశం లేకుండా చెయ్యడం అన్యాయం.
"పోరాట స్ఫూర్తి"; ఎక్కడ లేదు పోరాటం? ఎప్పుడు అంతమవుతుంది ఈ పోరాటం? ప్రతిమెట్టూ పోరాటమే. ఇప్పుడుకూడా పదోతరగతికి పరీక్షపెడతారు. మార్కులో గ్రేడులో ఇస్తారు. కేవలం జీవితాల్ని నిర్ణయించరు అంతే. వచ్చిన మార్కుల/గ్రేడుల ఆధారంగా 11th,12th వెళతారు.తమకు చేతనైన,తాము ఇష్టపడి జీవితాన్ని గడపగలిగిన చదువుని ఎంచుకుంటారు.
@చంద్రమోహన్: నేనూ నవోదయా విద్యాలయ విద్యార్థినండీ. Continual Evaluation లోని సౌలభ్యాన్ని గ్రహించినవాడినే. I completely agree with that system. పాఠశాల రంగంలో సంస్కరణలు ఇప్పుడే మొదలయ్యాయి. చూద్ధాం ఎలా ఉంటుందో.
@బొల్లోజుబాబా: మొడాలిటీస్ చాలా వరకూ ఫ్రేమ్ చేసేశారండి. మొదటగా CBSE స్కూళ్ళలోనే ప్రవేశపెడుతున్నారు గనక పెద్ద కష్టం కాదు.
ఉదాహరణకు CBSEలో ఇంతకు ముందే ఒక పరీక్ష(సబ్జెక్ట్) పోయినా పాసే. 11th,12th కు వెళ్ళినప్పుడు ఆ పోయిన సబ్జెక్ట్ తీసుకోవడం కుదరదు. ముఖ్యంగా సైన్సెస్ తీసుకోవాలంటే సైన్సులో 50-55 మార్కులు ఖచ్చితంగా వచ్చుండాలి. ఇలా చాలా పద్ధతులున్నాయి.
@రేరాజు: యశ్ పాల్ గారు indirect గా నా టీచర్ లెండి.నేను టీచర్ ఎడ్యుకేషన్ చదివింది ఆయన methodology ఉన్న కాలేజిలో. కాబట్టి If I am sounding like him,that need not be shocking.
అక్షరాస్యులను తిరిగి నిరక్షరాస్యులుగా మార్చడానికే ఉపయోగిస్తాయి ఇవ్వన్ని.
ప్రజలు ఎంత తెలివిలేని మూర్ఖ్హులైతే ప్రబుత్వాలకంత ఉపయోగం.
@అనామకుడు: మీ వ్యాఖ్య ఉద్దేశం అర్థం కాకుండా ఉంది. పదోతరగతిలో పబ్లిక్ పరీక్ష తీసెయ్యడానికీ "అక్షరాస్యులను తిరిగి నిరక్షరాస్యులుగా మార్చడానికీ" సంబంధం ఏమిటో అస్సలు తెలియట్లేదు. మళ్ళీ దీనికీ ప్రజల తెలివితేటలకీ పొంతనలేని పొంతన కల్పించి మీరు చెప్పదలుచుకున్నదేమిటో అస్సలు అర్థం కావటం లేదు.
@గోగినేని వినయ్ చక్రవర్తి: మీరు సూచించిన మార్పులన్నీ ఈ విధానంలో ఉన్నాయి. అయినా 35 మార్కులు రాగానే "పాస్" అని డిసైడ్ చెయ్యడంలోని ఔచిత్యం ఒకసారి గ్రహించండి. అదేమైనా మినిమమ్ స్టాండర్డా! మినిమమ్ లర్నింగ్ కు చిహ్నమా!
పదవతరగతి వరకూ నిర్భంధ విద్య అనేది అన్ని సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం వస్తుందని.చదవడం ముఖ్యమేగానీ అదే జీవితాన్ని నిర్ణయించే పరీక్షకాకూడదని మాత్రమే ఈ నిర్ణయం.
పబ్లిక్ పరీక్ష లేకపోయినా పాస్ ఫెయిల్ నిర్ణయిస్తారు. కనీ ఫెయిలైన సబ్జెక్టుల్లో +1,+2 చేసే అవకాశం ఉండదు. అంతే తేడా. ఇందులో వెసులుబాటు ఉందే తప్ప "నేర్చుకోకండి" అనే మెసేజ్ లేదు.
Post a Comment