Wednesday, June 10, 2009

దేవత

బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. మగ అహం, మగాలోచన,మగాహంకారం,మగభావాలు ప్రశ్నింపబడ్డాక మగటిమి ప్రశ్నార్థకమౌతుంది.కొన్ని వేల సంవత్సరాలుగా మగాడి నరనరాల్లో నిక్షిప్తమైన మగసంస్కృతి పతనమౌతుంది. సుప్రియ అలాంటి ఆడది. పరిచయమయినప్పటి నుంచీ అంతే. నేను మగాడినన్న స్పృహేనాకు కలిగించలేదు. మగాడన్న స్పృహే తడబడ్డాక ఆడామగా మధ్య ఉన్న బంధం నిలుస్తుందా? ఆ విషయం ఇప్పుడైనా అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఎంతైనా, ‘తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’

****

జీన్సు వేసుకునే ఆమ్మాయిల ఆప్రోచబిలిటీ గురించి నేను చేసే ప్రతిపాదనల్ని క్లాస్ రూంలో ఒకమూల సైలెంటుగా కూర్చుని వింటుండగా మొదటిసారి చూశాను. అప్పుడే సుప్రియ నన్ను చూసి కళ్ళతోనే ఫక్కున వెక్కిరించినట్టనిపించింది. ఆ తరువాత నెలపాటూ, మా పరిచయం మొదలయ్యేవరకూ ఆ వెక్కిరింపే నన్ను వెంటాడింది. బెంగుళూర్ అమ్మాయిలంటే నాక్కొంచెం చులక భావం. ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలంటే మరీను. మేకప్పు, మార్కుల మీదున్న శ్రద్ధ వీరికి మనుషుల మీదుండదు. తమ వీకెండ్ ప్లాన్స్ మీదున్న ఆసక్తి వల్డ్ దిసి వీక్ (World This Week) మీదుండదు. హాలీవుడ్ సెలబ్రిటీలు ఫింగర్ టిప్స్ మీదుంటారుగానీ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సినిమాల గురించి తెలీదు. ప్రపంచమంతా బెంగుళూరు చుట్టే తిరుగుతుందనే బలమైన నమ్మకం వీళ్ళకి. అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీషు మాట్లాడే అబ్బాయిలతో తప్ప బట్లరింగ్లీషుగాళ్ళు వీళ్ళలెక్కలో అసలు మగాళ్ళేకాదు.

సుప్రియది బెంగుళూరు.కానీ తెలుగమ్మాయి అని తరువాత తెలిసింది. అప్పటికీ "మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని" అనే చెప్పింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ని అని చెప్పినంత హుందాగా. అదేమిటోగానీ, నేను ‘హైద్రాబాదీని’ అని చెప్పుకుందామనుకున్నా దాంట్లోంచీ కూడా ఏదో ముతకవాసనే వస్తుంది. ఆ గుర్తింపులోంచీ మధ్యతరగతి అస్తిత్వపు అరుపు వినిపిస్తుందేతప్ప అర్బన్ పోష్ నెస్ అస్సలు కనిపించదు.

మా పరిచయంకూడా చాలా విచిత్రంగానే జరిగింది. యూనివర్సిటీలో చేరిన నెలకు మా సీనియర్లు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో జూనియర్స్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి. పాటలు పాడాలి కొన్ని గేమ్స్ డిజైన్ చెయ్యాలి అని ప్రతిపాదించారు. గ్రూప్ గేమ్స్ డిజైన్ చెయ్యడానికి కొందరు వాలంటీర్ చేసేస్తే, ఇక పాటలుపాడేవాళ్ళెవరనే దగ్గరకొచ్చి చర్చ ఆగింది. ఇబ్బందిగానే నేను పాడగలను అని చెప్పేసాను. సుప్రియకూడా పాడుతుందట. ఇద్దరూ ఒకొక సోలో సాంగ్ ఆ తరువాత కలిపి ఒక డ్యూయెట్ పాడాలని క్లాస్ వాళ్ళు నిర్ణయించేశారు. "హలో హేమంత్. యు సింగ్ టూ?" అంటూ దగ్గరకొచ్చింది. అప్పటివరకూ సుప్రియకు నా పేరు తెలుసనికూడా నాకెప్పుడూ అనిపించలేదు.

మా క్లాస్ లోని ఐదుమంది బెంగుళూర్ అమ్మాయిలదీ ఒక జట్టు. ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదు. వాళ్ళ జోకులూ, మాటలూ,నవ్వులూ మనలోకానికి సంబంధించినవిగా అనిపించేవికావు. వేరే అమ్మాయిలతో సంబంధం లేనట్లు ప్రవర్తించేవాళ్ళు. అబ్బాయిల్నైతే అసలు గుర్తించేవాళ్ళే కాదు. వాళ్ళుతప్ప మిగతావాళ్ళెవరూ మనుషులు కారన్నట్లుగా ఉండేది ప్రవర్తన. అందుకే సుప్రియకు నాపేరు తెలుసంటే ఆశ్చర్యం.
"యెస్" అని ముక్తసరిగా సమాధానం చెప్పాను.
"వాటార్యూ ప్లానింగ్ టు సింగ్? ఎనీ తెలుగు సాంగ్!" అంది.
చులకన చేస్తోందేమో అనిపించింది.
"లేదు. నో. అయాం సింగింగ్ ఎ హిందీ సాంగ్" అన్నాను.
"హిందీ ఎందుకు? తెలుగులో చాలా మంచి పాటలున్నాయిగా!"
అప్పుడే సుప్రియ నోటివెంట తెలుగు మాటలు వినడం. "నువ్వు తెలుగా" అన్నాను ఆశ్చర్యంగా.
"కాదు. మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని" అంది. ఆ గొంతులో ఏదో ఆలోచన. తన గుర్తింపుని తనే నిర్దేశించుకునే తపన.
ఒక్క క్షణం ఆలోచించి "తెలుగులో ఏం మంచిపాటలున్నాయ్!" అనగలిగాను.
"కొత్తవి కాదు. పాత పాటలు. ముఖ్యంగా బాలసుబ్రమణ్యం లేతగొంతుతోపాడిన పాటలు ఎన్ని లేవు" అంది.
తరువాత సుప్రియ కొనసాగింపుగా "రాజన్ -నాగేంద్ర సంగీతంలో కన్నడ తెలుగు భాషల్లో వచ్చిన బోలెడన్నిపాటలున్నాయి. అన్నీ నాకిష్టమైన పాటలే" అంటూ నా సమాధానం కోసం ఎదురుచూసింది.
ఒక్కసారిగా షాక్ మీద షాక్. నాలోని తన ఊహాచిత్రం ఛిద్రమైన క్షణం. నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం. ఐ జస్ట్ హేటెడ్ హర్. నన్ను నా బలహీనతల సాక్షిగా కుదింపజేసిన సుప్రియని జీవితంలో క్షమించలేననుకున్నాను.

"మరి నువ్వుకూడా తెలుగు పాట పాడుతావా?"
"లేదులేదు. తెలుగు మాట్లాడటం వరకే. పాడటం నాకు రాదు. కాబట్టి హిందీ పాడతాను."
"మరి డ్యూయెట్ ఎలా? హిందీ పాడదామా!" అని అడిగాను. వెంఠనే "సరే" అంది.
క్లాసులైపోయిన తరువాత కలిసేవాళ్ళం.రెండ్రోజులు డ్యూయెట్ ప్రాక్టిస్ చేశాం. చష్మెబద్దూర్ అనే హిందీ సినిమాలోంచీ ‘కహాసే ఆయే బదరా...ఖిల్తా జాయే కజరా..’ అనే సెమీ క్లాసికల్ గీతం. నిజానికి ఏ కాంపిటీషన్లో పాడాల్సిన పాట. సుప్రియ "చాలా మంచిపాట కదా పాడుదాం" అంటే, ఫ్రెషర్స్ పార్టీ కోసం పాడటానికి ఒప్పుకున్నాను. ఎక్కడో ఒక మూల ఈ పాట విని నీరసంగా ఉందని సీనియర్లు వెక్కిరిస్తారని ఒక కోరిక. నేను పొందే అవమానంకన్నా, సుప్రియ ఆ అవమానంలో భాగవుతుందన్న ఆశ గొప్ప స్వాంతన కలిగించింది. దీక్షగా పాట ప్రాక్టిస్ చేశాను.

ఆరోజు సాయంత్రం. సుప్రియ ఉమ్రావ్ జాన్ సినిమాలోంచీ ‘దిల్ చీజ్ క్యాహై ఆప్ మెరే జాన్ లీజియే’ అనే ఘజల్ పాడింది. ఆ తరువాత కాస్సేపటికి ఇద్దరి డ్యూయెట్. చాలా కష్టమైన పాట పాడామని అందరూ అభినందించారు.చివరిగా నా వంతు.

నేను ‘పూజ’ సినిమా నుంచీ రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ’ అనే బాలసుబ్రమణ్యం పాట పాడాను. సుప్రియ కళ్ళలో మెరుపు. ఆ పాటపాడాలని నేనెందుకు నిర్ణయించుకున్నానో నాకు ఖచ్చితంగా తెలీదు. అంతగా ద్వేషించే సుప్రియని ఆకర్షించాలని నాలో అంతర్లీనంగా కోరికుందేమో. బహశా తనపై నా ఆధిపత్యాన్ని తనకిష్టమొచ్చింది చేసి సంపాదించుకోవావన్న కోరికనాలో కలిగిందేమో. ఇద్దరిమధ్యా పరిచయం పెరగడానికి ఆ పాట తోడ్పడింది. మరికొన్ని సాయంత్రాలు మామధ్య రాజన్-నాగేంద్ర రాజ్యమేలారు. బాలసుబ్రమణ్యం గాత్రం నా గొంతులోంచీ వినిపించేది. నా పాట మరుపుకు సుప్రియ కళ్ళలోని మెరుపు ఆరాధన అనిపించిన గర్వక్షణాల్ని, నా పాటకు బదులుగా తను పాడేపాటతో తునాతుకలు చేసేది. ఇక్కడా బదులు తీర్చుకునేది. నేనేదో "ఇచ్చానన్న" సంతృప్తినికూడా కలిగనిచ్చేది కాదు.

సినిమాలలో,షికార్లలో, హోటళ్ళలో తనవంతు ఖర్చు తాను క్రమం తప్పకుండా ఇచ్చేది. ఒకవేళ నేను కావాలని మర్చిపోయినా గుర్తుచేసి మరీ అప్పు తీర్చేది. ప్రేమించే మగాడిగా, సాధికారంగా సుప్రియ కోసం నేను చేయాలనుకున్న ఏ పనులూ తను చెయ్యనిచ్చేది కాదు. "కలిసి తిరుగుతున్నాం. కాబట్టి, కలసి చేసే ఖర్చు పంచుకుని చెయ్యాలి" అని నా విలువని శంకిస్తూ మాట్లాడేది.తనని "ఆదుకునే" అధికారం నాకు ఏమాత్రం లేదని ఎప్పుడూ గుర్తుచేసేది. నా చెయ్యి తన శరీరాన్ని తాకినపుడు సహజమైన సిగ్గుతో కుంచించికుపోకుండా, దయతో ప్రేమతో కోరికతో సహకరించేది. అనుభవాన్ని అధికారంతో పంచుకునేది. "ఇలాకాదు ఇలా" అని మార్గనిర్దేశన చేసి నన్నొక వస్తువులాగా, కీ ఇస్తే ఆడే బొమ్మలాగా వాడుకునేది. ఎన్ని అవమానాలు. ఎన్ని ఆక్షేపణలు. ఇలా నా అహాన్నీ,వ్యక్తిత్వాన్ని ఫణంగాపెట్టి సుప్రియ వ్యక్తిత్వాన్ని భరించాల్సి వచ్చేది.


ఏదోఒక స్థాయలో మనల్నిమనం మోసం చేసుకుంటేగానీ జీవితంలో ప్రేమించలేమేమో. "ఐ లైక్ యువర్ సింప్లిసిటీ అండ్ డౌన్ టూ ఎర్చ్ నేచర్" అని సుప్రియ అన్నప్పుడల్లా, నిజంగా నేనూ తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానేమో అనే అపోహ కలగేది. సుప్రియ నన్నంతగా అభిమానించడానికి నాలోని గుణాల్ని ఎంచిచూపించేదేకానీ తనకున్న కారణాలు చెప్పేది కాదు.సాధికారంగా జీవితాన్ని పంచుకునేదేగానీ, ఆధారపడుతూ నా ప్రాముఖ్యతను పెంచేది కాదు. నన్ను తన జీవితంలో ఒక ముఖ్యమైనవాడిగా చేస్తూ నన్నొక బానిసని చేసింది. తన జీవితంలో నన్నొక సమానమైన భాగం చేసి నా అహాన్ని కాలరాసింది.

ఇలా ఒక సంవత్సరం నన్ను నేను చంపుకుంటూ తన నిర్వచనాల్లో ఒంపుకుంటూ గడిచింది. వేసవి శెలవులకి సుప్రియ వారం రోజుల ముందే బయల్దేరింది. సుప్రియ వెళ్ళిన మరుసటి రోజు ఒక దారుణమైన వార్త తెలిసింది. సుప్రియ వెళ్ళే బస్సుకి కర్నూలు -అనంతపూర్ల మధ్యన యాక్సిడెంట్ అయ్యింది. విండో సీట్లోకూర్చున్న సుప్రియ కుడిచెయ్యి మోచేతివరకూ తెగిపోయింది. ఆపరేషన్ కోసం బెంగుళూరు చేరేసరికీ తెగిన చెయ్యిని ఐస్ బాక్సులో పెట్టి జాగ్రత చెయ్యకపోవడంతో సర్జరీ చేసి అతికించేందుకు వీలులేకుండా పోయింది. నా గుండె ఆగినంత పనయ్యింది. హుటాహుటిన బెంగుళూరు బయల్దేరాను.ఈ క్షణం లో నా స్నేహితురాలిపై సానుభూతి తప్ప వేరే ఏ భావమూ కలగలేదు. ఐతే ఒక పక్కన ఆమెని నేను నిజం గా ప్రేమిస్తున్నానేమో.


ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు. హఠాత్తుగా అనిపించింది ‘ఇప్పుడు తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’ అని. నావ్యక్తిత్వాన్ని తిరిగి దక్కించుకునే అవకాశం నాకు దక్కుతుందేమో. నా మగతనాన్ని తిరిగి సంపాదించుకునే ఛాన్స్ దొరుకుతుందేమో. గర్వంగా తనని ఈ కష్టం నుంచీ ఆదుకునే అదను లభిస్తుందేమో. ఎక్కడో ఆశ. మై పాస్ట్ గ్లోరీ విల్ రెటర్న్.

బాధలో,ఆలోచనల్లో,ఆశల్లో తేలుతూ హాస్పిటల్ చేరాను. సుప్రియ రూము బయటే తన తల్లిదండ్రుల్ని డాక్టర్ తో మాట్లాడుతుండగా కలిశాను. డాక్టర్ అంటున్నాడు "వాటే బ్రేవ్ గర్ల్ షి ఈజ్. స్పృహలోకొచ్చిన మరుక్షణమే, తన పరిస్థితి తెలిసి ఏడ్చి బాధపడకుండా, పక్కనే ఉన్న పెన్నూ, డైరీ తీసుకుని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరేమిటి అని తెలుసుకుని ఏడమచేత్తో రాయడం మొదలెట్టింది. యు షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్".

ఆమె పట్ల నాకేదైనా సాఫ్ట్ కార్నర్ /ప్రేమ అనే భావన ఉంటే ఆ క్షణమే పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.తన కష్టాలకీ, నా కష్టాలకీ తనే నా గుండె పై వాలి "హేమూ, నువ్వు లేకపోతే నేనేమైపోయే దాన్ని" అని భరింపరాని కృతజ్నత తో నా పురుషత్వాన్ని కన్నీటితో ముంచేసే స్త్రీత్వం లేని సుప్రియ ని ఏ మగవాడైనా ఎలా ప్రేమించగలడో నాకర్ధం కాలేదు.

వెనక్కొచ్చేశాను. సుప్రియని కనీసం కలవకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియ తల్లిదండ్రులు ఆగమని చెబుతున్నా వినకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియను ఎప్పుడు కలుస్తానో, అసలు కలుస్తానో లేదో తెలీదు. కానీ ఒక లేఖ మాత్రం రాశాను. ఎప్పుడో ఒకప్పుడు తనకు ఇవ్వడానికి.

"సుప్రియా, నువ్వు దేవతవి. నువ్వు గొప్పదానివని నేను నిన్ను ‘దేవత’ అని పిలవటం లేదు. నువ్వు నాకూ, ఈ ప్రపంచానికీ పనికిరానిదానివి కాబట్టి దేవతగా భావిస్తున్నాను. పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనుషులు మసలే సమానత్వమనే ఒక ఊహాలోకపు జీవివి నువ్వు. అందుకే నీకు ఈ లోకంలో అందరు మనుషుల్లా బ్రతికే హక్కులేదు. నీ ఉనికిని, వ్యక్తిత్వాన్నీ నేనూ,ఈ ప్రపంచం భరించలేము. అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను."
ఇట్లు
హేమంత్

*****
(ఇది కథో కాదో నాకు తెలీదు. అసలు కథంటే ఏమిటో తెలీకుండా పోయింది.
ఎందుకలా అంటున్నానో ‘కథవెనుక కథ’ లో చెబుతాను)

41 comments:

మాకినేని ప్రదీపు said...

చాలా బాగుంది.

Anonymous said...

అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీషు మాట్లాడే అబ్బాయిలతో తప్ప బట్లరింగ్లీషుగాళ్ళు వీళ్ళలెక్కలో అసలు మగాళ్ళేకాదు.

నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం.

మీ శైళి కదం తొక్కినట్లనిపిస్తుంది.. అన్నట్లు ఇది ఒక కథా? లెదా మీ వ్యక్తిగత మా? ఎదైనా కాని చాలా చక్కగా నెమరు వేసారు..

ఉష said...

"బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది." చాలా నిజం. సుప్రియ అంత ధీర వనితని కాదు కానీ, వ్యక్తిత్వం వలన చేదు స్వీయానుభావాలు చవిచూసినదాన్నే. అలాగని రాజీ పడిపోయినదాన్నీ కాదు. సుప్రియ వంటి మనస్తత్వం కలిగిన ప్రతి స్త్రీ జీవితానికీ ఏదో ఓ పోలిక వున్న కథ కాని ఈ కథా వస్తువు మీరు ఎంచుకోవటం అభినందనీయం

teresa said...

Wonderful!! కథ అయినా దీనికి ప్రేరణ వాస్తవమనే నమ్ముతాను.

లక్ష్మి said...

బహుశా నేటి మహిళల్లో బయల్పడుతున్న ఆ బలమైన వ్యక్తిత్వమే విడాకుల సంఖ్య ఇంతలా పెరగటానికి కారణం కూడా అనుకుంటా. చాలా చక్కటి కథ (కథ లాంటి నిజమా??)

Neeharika said...

"బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది." నిజమే ఇది ఈతరం ఎదుర్కోంటున్న సమస్య....ఇది భరించలేక తాగుడుకి బానిస అయినవాళ్ళని చూసాను.బాగా రాసారు.

శ్రీనివాస్ said...

సుప్రియ లాంటి కారెక్టర్ ని నేను నవలల్లో తప్ప ఇంకెక్కడా చూడలేదు నాకు తగల్లేదు . తగిల్తే నా అహం దెబ్బ తింటుందో లేదో చూడాలి మరి .

అబ్రకదబ్ర said...

శైలి, కధనం బాగున్నాయి - చివరిదాకా చదివించేలా. అయితే అక్కడక్కడా గుంతల దారిలో ప్రయాణంలా అనిపించింది.

>> "తరువాత సుప్రియ కొనసాగింపుగా "రాజన్ -నాగేంద్ర సంగీతంలో కన్నడ తెలుగు భాషల్లో వచ్చిన బోలెడన్నిపాటలున్నాయి. అన్నీ నాకిష్టమైన పాటలే" అంటూ నా సమాధానం కోసం ఎదురుచూసింది"

>> "ఒక్కసారిగా షాక్ మీద షాక్. నాలోని తన ఊహాచిత్రం ఛిద్రమైన క్షణం. నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం. ఐ జస్ట్ హేటెడ్ హర్. నన్ను నా బలహీనతల సాక్షిగా కుదింపజేసిన సుప్రియని జీవితంలో క్షమించలేననుకున్నాను"

ఇది కొంత అతిగా ఉంది. ఆమె విషయంలో మీ ఊహ అంచనా తప్పింది. దానికి అంత భీభత్సకరమైన రియాక్షనా!!

>> "నా చెయ్యి తన శరీరాన్ని తాకినపుడు సహజమైన సిగ్గుతో కుంచించికుపోకుండా, దయతో ప్రేమతో కోరికతో సహకరించేది"

పైదేంటో నాకర్ధం కాలేదు. ఆ మూడ్నాలుగు పేరాలూ రాసేప్పుడు కొంత గందరగోళంలో పడ్డట్లున్నారు - అతి తక్కువ వాక్యాల్లో ఎంతో చెప్పాలనే ప్రయత్నంలో.

మొత్తమ్మీద, మీరు చెప్పినదాన్నిబట్టి సుప్రియ వ్యక్తిత్వం ధీర వనితదిలా నాకనిపించలేదు. జీవితం అంటే చాలా caliculated అభిప్రాయాలు ఉన్న వ్యక్తిలా మాత్రమే అనిపించింది. ఆమెకి జీవితంలో ప్రతిదీ ఓ లెక్క ప్రకారమే జరగాలి. మహా అయితే దీన్ని విశిష్ట వ్యక్తిత్వం అనొచ్చు. వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి పనికొచ్చే వ్యక్తిత్వం - జీవితంలో కాదు. ఎదుటివారిపై అధికారం చెలాయించటం - అది ఆడైనా, మగైనా - ధీరత్వానికి ప్రతీక కాదు. దగ్గరి స్నేహితులతో కూడా కాఫీ ఖర్చుల్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలనుకునే వ్యక్తులు ఎవరితోనూ జీవితం పంచుకోలేరు.

ఇంతకీ ఆమె స్పృహ రాగానే డాక్టర్ పేరు డైరీలో ఎందుకు రాసుకుంది? కధ వెనుక కధలో దాని గురించీ చెప్పండి :-)

జ్యోతి said...

అమ్మాయిలు అలా ధైర్యంగా ఉంటే నచ్చదు కదా .. ఎప్పుడూ మగవాడి మీదే ఆదారపడి ఉండాలి అనుకునే వారెందరో. మంచి కధ. అసలు కధకోసం వెయిటింగ్..

రమణి said...

"బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది." ఇది నేను ఒప్పుకొంటాను., ఎక్కడో అక్కడ అనుభవం ఇలా వ్రాసే విధంగా చేసిందని నేను నమ్ముతున్నాను.... ఇది వాస్తవమే అనిపిస్తొంది.

నేను అబ్రకదబ్రగారితో ఏకీభవిస్తున్నాను. కథ వెనుక కథ కోసం ఎదురుచూస్తూ......

భావన said...

"అందుకే నీకు ఈ లోకంలో అందరు మనుషుల్లా బ్రతికే హక్కులేదు. నీ ఉనికిని, వ్యక్తిత్వాన్నీ నేనూ,ఈ ప్రపంచం భరించలేము. అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను." దూరం గా వుంటాను అన్నాడు నయమే భరించలేను అంత సమానత్వం ముగించెయ్యి నీ జీవితం అనలేదు (ఇప్పుడె శేఖర్ పెదగోపు గారి పోస్ట్ చదివి వచ్చాను లే) ... కష్టమే తనమీద ఆధరపడని మగువని భరించటం... అసలే ఆడదంటే అబల, మగువ, ఇంతి, పూబంతి అంటు వర్ణించిన జాతి కదా మనది .. బాగుంది మహేష్... వ్యక్తిత్వం వికసించని ఒక అబ్బాయి కథ... కాని రియల్ లైఫ్ లో "ఆ గొంతులో ఏదో ఆలోచన. తన గుర్తింపుని తనే నిర్దేశించుకునే తపన." ఇలా ఆలోచించేంత మెచ్యూరిటి "బహశా తనపై నా ఆధిపత్యాన్ని తనకిష్టమొచ్చింది చేసి సంపాదించుకోవావన్న కోరిక నాలో కలిగిందేమో." ఇలా ఆలోచించే అపరిపక్వత ఒకే మనిషి లో వుంటాయంటారా?
ఇంకో విషయం "ప్రేమించే మగాడిగా, సాధికారంగా సుప్రియ కోసం నేను చేయాలనుకున్న ఏ పనులూ తను చెయ్యనిచ్చేది కాదు." అన్నారు కాని వాళ్ళ మద్య ప్రేమ వున్నట్లు establish చెయ్యనే లేదు మీరు అది కూడా అతని ఏక పక్ష నిర్ణయమా?

కత్తి మహేష్ కుమార్ said...

@భావన: సామాజిక ఆంక్షల నేపధ్యంలో స్త్రీ తన ఆశలూ, కోరికల వ్యక్తీకరణలో ambiguity ని నింపేసుకుని "అర్థాలే వేరులే" లా ఎలా మిగిలిపోయిందో, మగాడూ అదే సామాజిక ఆశయాల త్రాసులో ఒక వైపు పురుషాహంకారం మరోవైపు నపుంసకత్వాన్ని సమానంగా నింపుకుని అటూఇటూ కాకుండా అర్థసత్యంలా ఊగుతున్నాడు. అలాంటి మగాడు ఒక క్షణంలో మెచ్యూరిటీ మరోక్షణంలో అపరిపక్వత చూపించితే అందులో వైరుధ్యం ఏముంది?

ప్రేమ ఉన్నట్లు "ఎస్టాబ్లిష్" చెయ్యాల్సిన అవసరం ఉందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటివరకూ నేను చూసిన నిజజీవితం ప్రేమల్లో "ప్రేమిస్తున్నాను"అని ఎస్టాబ్లిష్ చేసిమరీ ప్రేమించడం జరగలేదు.అదొక process. దానిలో వేడుకోలులూ, ఒప్పుకోలులూ ఉండవు.కలిసుంటూనే కలిసిపోతారు అంతే!

@అబ్రకదబ్ర: మీ ఆఖరి ప్రశ్నలు మాత్రం ఇప్పుడు సమాధానం చెబుతాను. ‘కుడిచెయ్యి’ కోల్పోయిన సుప్రియ ఇకనైనా ఆధారపడుతుందనుకుంటాడు హేమంత్. కానీ సుప్రియ ఆపరేషనైన మరుక్షణం "ఎడమచేత్తో" డాక్టర్ పేరు రాయడం మొదలెట్టడంతో independence సాధించేసింది. ఇక ఆధారపడటానికి ఆస్కారం ఎక్కడుంది? హేమంత్ ఆశకు స్థానం ఎక్కడుంది?

భావన said...

ఓహ్ అలా అంటారా సాధ్యమేనేమో రెండు పరస్పర విరుద్దమైన భావాలు వుండటం మీరు అన్నట్లు ఆలోచిస్తే...
ఇంక ప్రేమ ను ఎస్టాబ్లిష్ చెయ్యటం: నిజ జీవితం లో బోర్డ్ కట్టుకుని తిరగరు లే మాస్టారు.. కాని ఇది కథ కదా (జీవితం లాంటి కధ అనే ఆర్గ్యుమెంట్ లేక పోతే) పాఠకుడికి మీరు వాళ్ళది స్నేహమన్నట్టు గానే చూపించారు అంటే అంత బలమయిన వ్యక్తిత్వం వున్న అమ్మయి ఖచ్చితం గా రాజన్ నాగేంద్ర పాటలు పాడగానే ప్రేమించదు కదా ;-) అంతే కాదు అంత పరిణితి కలిగిన అమ్మయి కాబట్టీ అలా అనిపించింది అదేమి పెద్ద విషయం కధ కు అడ్డు వచ్చేది కాదు అనుకోండి..

Anonymous said...

మా జూనియర్ ఒకామె ఇలానే పూర్తి చెయ్యిని కోల్పోతే, ఎటువంటి ఆత్మా స్థైర్యాన్ని కోల్పోకుండా, ఏమీ జరగనట్టు నార్మల్ గా కాలేజికి వచ్చి అందరినీ ఆశ్చర్యాలతో ముంచేత్తింది. she belongs to bangalore and accident happened బెంగుళూరు-హైదరాబాద్ హైవే. ఆమె accident బేస్ చేసుకునే ఈ కథ అల్లినట్టుగా అనిపించింది .

Shiva Bandaru said...

"బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది"
అంటే మగవాళ్లు అంత బలహీనులా? కేవలం బలమైన వ్యక్తిత్వంగల ఆడదాన్ని చూసి మగవాళ్ళుకు ఆత్మనూన్యత వచ్చేస్తుందా. :)

...Padmarpita... said...

ఎంత బాగా రాసారు.... మీ బ్లాగ్ అభిమానినైపోయాను.

Anonymous said...

"హఠాత్తుగా అనిపించింది ‘ఇప్పుడు తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’ అని. నావ్యక్తిత్వాన్ని తిరిగి దక్కించుకునే అవకాశం నాకు దక్కుతుందేమో."

This in this story.. what is he? a pervert??? If I were Praneeta, I wouldn't go anywhere near such a spineless man.

కత్తి మహేష్ కుమార్ said...

@అనామకుడు: దాన్ని పర్వర్షన్ అని మీరనుకుంటే అదే సరి. కాకపోతే ఒక్క విషయం, మనిషి తన ఆలోచనని యధాతధంగా చెప్పుకుంటే ప్రతొక్కరూ పర్వర్టెడ్ గానే అనిపించొచ్చు. ఒక నిమిషం ప్రయత్నించి చూడండి.

@బండారు శివ:బలవంతులం అనుకోవడమే మగాడికున్న బలహీనత. మానసికంగా మగాడికున్న దౌర్బల్యాన్ని వ్యక్తీకరించలేక,తనకు తానే ఒప్పుకోలేకపోవడమే మగాడి బలహీనత.

@a2zdreams: మీకాలేజా యూనివర్సిటీనా?

@భావన: ఏ భవిష్యత్ ప్రణాళికలూ లేకుంటా స్నేహం-ప్రేమ కలగలిపిన స్థాయిల్లో కొన్ని బంధాలుంటాయి. బహుశా ఈ పాత్రలు అలాంటి relationship లో ఉన్నాయేమో!

కలిసుండటానికీ, ప్రేమించడానికీ నిజంగా పెద్ద కారణాలు బలమైన శోధనలూ అవసరమవుతాయనేది కొంత సందేహమే."అలా జరిగిపోయే" వాటిల్లో ప్రేమలొకటి.

@అనామకుడు: మధ్యలో తాడేపల్లి గారు ఎందుకవసరమయ్యారబ్బా!

@పద్మార్పిత/రమణి/జ్యోతి/లక్ష్మి/తెరెసా/నీహారిక/ఉష/ప్రదీప్: ధన్యవాదాలు.

Sharada said...

మహేష్ గారూ,
కథ చాలా బాగుంది. ఈ విషయం గురించి నా ఆలొచనలు-

అ)స్త్రీ ఆశలూ కోరికల వ్యక్తీకరణలో ambiguityయే కాదు, కొండొకచో contradictionలు కూడా వుంటయి. అయితే దానికి సామాజిక ఆంక్షల కాక స్త్రీల genetic make up కూడా కొంతవరకు కారణమే. సహజంగా స్త్రీలకి చుట్టూ వున్న వారితో (కుటుంబ సభ్యులూ, స్నేహితులూ)సంఘర్షణ ఇష్టం వుండదు. They are more hard wired to please than conflict. ఇల్లు సర్దుకుని శుబ్రంగా పెట్టుకోవటంలోనూ, అందంగా అలంకరించుకోవటంలోనూ, ఇంట్లో వాళ్ళకి పెట్టి మిగిలింది తాము తినటంలోనూ ఈ hard wired make up బయటపడుతుంది. ఆడ వాళ్ళ ప్రవర్తనా, వ్యక్తిత్వాల్లో వుండే contradictionలు నాకు అర్ధమైనంత వరకూ, ఈ పరస్పర విరుధ్ధమైన ఆశలు (desire for self-expression AND desire to please) వుండటం వల్ల వచ్చినవే. I would like to know what others think about this.

ఆ)వ్యక్తిత్వమూ, ఆ వ్యక్తిత్వాన్ని ప్రకటించుకునే స్వేఛ్ఛా (this is what I keep calling as self-expression) వున్న స్త్రీని చూసి పురుషుడు భయపడటం సహజమే. కానీ, నిజానికి అలా తనకంటూ ఒక వ్యక్తిత్వమూ, స్వేఛ్ఛ వున్న ఆడదే పురుషుని వ్యక్తిత్వాన్నీ, స్వేఛ్ఛనీ గౌరవిస్తుంది. అవి లేని ఆడవారే పురుషులని భార్యా విధేయులుగానో, తల్లి చాటు పిల్లవాడిలాగానో మార్చటానికి ప్రయత్నిస్తూ వుంటారు. This is not a conscious deed on their part. That is just their behaviour pattern, that I observed. అందువల్ల స్త్రీల వ్యక్తిత్వాలని గౌరవించి ప్రోత్సహించటమే మగవాడికి beneficial, in the long run.

Sharada

kalpanarentala said...

మహేష్,

ఇది కధ కాకపోవటమేమి కాదు. మీరే చెప్పినట్లు కధా స్వరూపం మారింది.కాబట్టి కధ గా అంగీకరించటానికి నాకేమి అభ్యంతరం లేదు.

ఇక కధ విషయానికి వస్తే , నా అంచనా లేదా అభిప్రాయం ప్రకారం ఎక్కువ శాతం మంది మగవాళ్ళు ఆత్మవిశ్వాసం వున్న అమ్మాయల్ని ప్రేమించటానికి ఇష్టపడతరు. పెళ్ళికి మాత్రం ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళ ఆత్మవిశ్వాసం తమ నపుంశకత్వం అనుకునే మీ కధానాయకుడి లాంటి వాళ్ళకు కొదవేమి లేదు.

కల్పన

kalpanarentala said...

కాకపోతే కధ మొదట్లోనే ఆడది లాంటి పదప్రయోగం మాత్రం పంటి కింద రాళ్ళలా నన్ను ఇబ్బంది పెట్టింది.కాని హెమంత్ లాంటి వాళ్ళ అలోచనలు అలాగే వుండవచ్చేమో!

కల్పన

Anonymous said...

కథనం బాగుంది, ఎప్పటి లాగే ! కథా వస్తువు విషయం వస్తే, సరిగ్గా అబ్రకదబ్ర గారి అభిప్రాయమే నాది కూడానూ !
తన అభిప్రాయం తారు మారు అయితేనే, ఐ హటేడ్ హర్ అంటూ భీభత్సమైన రియాక్షన్ !

మరీ కాఫీ కర్చులు ఇచేయటం,close friends ki kooda, కొంత అసహజం గా ఉంది ... ఇది నిజానికి అబ్రకదబ్ర గారు అన్నట్టు బలమైన వ్యక్తిత్వ చిహ్నం కాదు !

ఇకపోతే, ఆవిడ బలం, ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యం కోల్పోకుండా నిలబడటం ... adi చూసి ... కేవలం నిజమైన బలం ఉన్న మగాడు మాత్రమే ( శివ బండారు గారు అన్నట్టు ), తట్టుకోగలడు ! లోపల insecurity, inferiority complex లు ఉన్నవాళ్ళు, ఎంత సేపు పైకి పక్క వాళ్ళు మన మీద ఆధారపడితే తప్ప, మన అస్తిత్వం లేదు అనుకునే వాళ్ళు, పైకి డాంబికం గా కనిపించే వాళ్ళు తట్టుకోలేరు ! మీరు మరీ మగాళ్ళని మూస చేసేసి, ఏ మగాడు తట్టుకోలేడు అనటం అసమంజసం.

ఇకపోతే, మీ కథనం ఆపకుండా చదివిస్తుంది. ఈ మధ్య ఆరోగ్య రీత్యా మీ బ్లాగ్ వైపు చూసి చాల కాలం అయ్యింది ! మీ ముకుందుడి గురించి, భోపాల్ వంటకాల గురించి వీలుంటే రాయండి !

Naresh M said...

Wow! I like it very much. remembered the Chalam.

>>నా చెయ్యి తన శరీరాన్ని తాకినపుడు సహజమైన సిగ్గుతో కుంచించికుపోకుండా, దయతో ప్రేమతో కోరికతో సహకరించేది. అనుభవాన్ని అధికారంతో పంచుకునేది.

Anonymous said...

కథ సూపర్ గా నచ్చింది ; కామెంట్స్ చదివే టైము లేదు. బట్ నా కామెంటొకటి వెయ్యాలి.

శశాంక్ సుప్రియను మొట్టమొదటి సారి, ఎయిర్‌పోర్టులో చూసాడు. అప్పుడు తను ఫస్టు టైము ఫ్లైటు ఎక్కుతున్నాడు. శంశాక్‌కు ఏమీ తెలీక పోతుంటే, తనే సహాయం చేసింది. అప్పటికి శశాంక్‌కు ఎస్కులేటరు ఎక్కటం కూడా రాదాయే! (లేక పోతే, ఫస్టు టైము రైల్వేస్టేషనులో కలిసాడు. రిజర్వేషన్ దొరకక పోవడంతో, ఇద్దరూ జనరల్ టికెట్టు కొనొక్కునే లైన్లో కలిసారు. ఆ రోజు సుప్రియే టిసితో మాట్లాడి, రిజర్వేషన్ భోగీలో ఇద్దరికో చెరో బెర్త్ సంపాందించింది.)

శశాంక్ మరో మూగ ప్రేమికుడు; సుప్రియతో జీవించాలని కోరుకున్నాడు. ఆమె గుండెలపై వాలి, ఆమె నుండి ధైర్యాన్ని, ఓదార్పును, స్ఫూర్తిని పొందాడు. సుప్రియ లేనిదే, తానేమైపోయే వాడోనని భయపడేవాడు. సుప్రియ లేకపోతే,తానేమీ సాధించలేనని, తను బతకలేడని అతని నిశ్చయ అభిప్రాయం. కాలగమనంలో వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. పిల్లలు కూడా పుట్టారు. తను ఉద్యోగం చేస్తున్నా, మొత్తం కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత కూడా తనే చూసుకుంటోంది. ప్లాన్ చేస్తోంది. చాలా విషయల్లో తను కేవలం ఆమె చెప్పినట్టు నడుచుకుంటాడు. తను ఎక్కువ శాతం తన కిష్టమైన పుస్తక పఠనం (లేదా సినిమా/ లేదా సంగీతం/లేదా క్రికెట్టు) లోనే కాలం గడిపేస్తున్నాడు.

కానీ అదేంటో, చుట్టూ ఉన్న సమాజం, ముఖ్యంగా ఆడ సమాజం - "శశాంక్ వెన్నుముక లేని మగాడు; పిరికివాడు" అంటున్నారేంటి !? ఆడదాని ధైర్యాన్ని సహించటం అని కాదు, ఆమెలోని ధైర్యాన్ని చూసే ఆమె తోడు కావాలని కోరుకున్నాడు తను. అది తన వ్యక్తిత్వలేమికి చిహ్నం ఎందుకయ్యిందో అర్ధం కాక, సతమతమౌతున్నాడు.

కానీ ఓ రోజు ఉన్నట్టుండి సుప్రియ "నేనంటే నీకు ప్రేమ లేదు. నా కోసం ఏం చేసావు నువ్వు!? " అని ప్రశ్నించింది. వెనక్కి తిరిగి చూస్తే, నిజానికి తను జీవితంలో చేసినవన్నీ, సుప్రియ చెప్పినవే!!! ఈ రోజు కొత్తగా తనేం చెయ్యాలి!? తనంతట తను ఎప్పుడూ ఇలా ఆలోచించ లేదు. ఆమెకి ఆనందం కలుగుతుందని తెలిస్తే, తనకిష్టం లేనివైనా వెంటనే చేసిపెట్టేవాడు. ఎందుకంటే, సుప్రియ అంటే తనకిష్టం. సుప్రియతో జీవనం తనకిష్టం. కానీ, ఈ రోజు సుప్రియకి ఎందుకు ఈ అభిప్రాయం కలిగింది. తనిప్పుడేం చేయాలి!?
( ఈ గొలుసు కధ రాస్తారా!? :)) )

శారద said...

మహేష్ గారూ,
భార్యకి గొప్ప వ్యక్తిత్వం వుండాలనీ, మనుషులకి తోడుగా వుండేవి ఎప్పటికైనా వారి వారి శక్తి సామర్ధ్యాలూ, వ్యక్తిత్వాలేనన్న విషయం మీద వసుంధర దంపతులు "మిసెస్ కాసులమ్మ ఏలియాస్ వికాసిని" అనే గొప్ప నవల రాసారు. ఈ నవల జూన్ 2008 చతురలో వచ్చింది. నారికేళ పాకం లాటి శైలితో రాస్తారు వసుంధర గారు. మీకు దొరికినట్టైతే తప్పక చదవండి. చాలా ఆలోచింప జేస్తుంది.
శారద

సుజాత said...

చాలా బాగా రాశారు మహేష్! ఇది కథ కాకపోవడమేం?
బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. అందరు మగాళ్ళనీనా? కాదులెండి!
కాకపోతే వ్యక్తిత్వం గల అమ్మాయిల్ని అబ్బాయిలు ఇష్టపడతారు కానీ జీవితాంతం కలిసుండాలనే నిర్ణయం తీసుకునేటపుడు మాత్రం "రిస్కు" తీసుకోడానికి ఎక్కువమంది ఇష్టపడరు. ఎప్పటికైనా ప్రమాదమే అని..! చూశారా మళ్ళీ హేమంత్ దగ్గరకే వచ్చింది కథ!

తన మీద తప్పకుండా డిపెండెంట్ గా స్త్రీ ఉండి తీరాలనుకునే హేమంత్ మనస్థత్వాన్ని బాగా చిత్రించారు.

"రాజన్ -నాగేంద్ర సంగీతంలో కన్నడ తెలుగు భాషల్లో వచ్చిన బోలెడన్నిపాటలున్నాయి. అన్నీ నాకిష్టమైన పాటలే" అంటూ నా సమాధానం కోసం ఎదురుచూసింది.
ఒక్కసారిగా షాక్ మీద షాక్. నాలోని తన ఊహాచిత్రం ఛిద్రమైన క్షణం. నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం. ఐ జస్ట్ హేటెడ్ హర్. నన్ను నా బలహీనతల సాక్షిగా కుదింపజేసిన సుప్రియని జీవితంలో క్షమించలేననుకున్నాను..."

తన అభిరుచులే ఆ అమ్మాయికి ఉండటం కూడా సహించలేనంత అసహనం!

స్త్రీల వ్యక్తిత్వం గురించి అందరూ పైన చెప్పేశారు గాబట్టి ఇక చెప్పడానికేం లేదు.

ఇక ఇది కథో కాదో నాకు తెలీదు అని ఎందుకు సందేహ పడుతున్నారో మరి! కథ అనేదాన్ని మహా మహా రచయితలే 'ఇలా' ఉండాలని నిర్వచించలేదు. రచయితను బట్టి ఒక్కో కథ ప్రెజెంటేషన్ మారుతుంది. అంతే! దానికి ప్రయోజనం తప్పకుండా ఉండాలనో,ఈ పరిధులు దాటకూడదనో ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారేమో తెలీదు.

కొన్ని స్కెచ్ లు కథల్లా ఉంటాయి. కథలు స్కెచ్ ల లాగా ఉంటాయి. కథలు ఊహల్లోంచే ఊడిపడాలనో,లేక నిజజీవితానుభవాలనుంచే సృష్టి కావాలనో ఎక్కడుంది? కథ రాయడానికి ఇదీ సబ్జెక్టు అని ఎవరైనా ఎలా చెప్పగలరు?

కానీ పాఠకుడిని అయోమయంలోకి నెట్టకుండా చెప్పదలుచుకున్నదేదైనా సరే, సూటిగా అందేట్లుగా రాయడం మాత్ర తప్పనిసరి! భావ వ్యక్తీకరణలోనూ, ఎన్నుకున్న సబ్జెక్టులోనూ ఆ confusion ఉండకూడదు.బలవంతంగా కథ కోసమే రాసినట్లు గాక అలవోగ్గా ఆ ఫ్లో అలా సాగిపోవాలి. కుటుంబరావు కథలు చూడండి, తూలిక మాలతి గారి కథలు చూడండి..అలా!

పాఠకురాలిగా ఇది నా అభిప్రాయం.

నిషిగంధ said...

నేనైతే ఇది కధే అనేసుకుంటున్నాను.. బాగా నచ్చింది కూడా.. ముఖ్యంగా కధనం మూలంగా! అబ్రకదబ్ర గారు చెప్పిన కొన్ని విషయాలే (లైక్, మామూలు సన్నివేశానికి ఎక్కువ రియాక్షన్) పంటి కింద రాళ్ళలా అనిపించాయి.. ఇంకా నే చెప్పాలనుకున్నవన్నీ సుజాత చెప్పేచేసారు :-)

కత్తి మహేష్ కుమార్ said...

@నిషిగంధ: ఇది కథేనండీ బాబూ! కథవెనుక కథ ఉన్నంత మాత్రానా కథంతా నిజమనుకుంటే ఎలా? కథవెనుక ఖచ్చితంగా కొంత మంది (నాకుతెసిన)మనుషుల ఆలోచనలూ,అభిప్రాయాలూ ఉన్నాయి. సుప్రియ పాత్ర లోని కొన్ని పార్శ్వాలు సజీవ మహిళవే.నేను చెబుదామనుకున్నవి ఈ కథ వెనుక నేనుపడ్డ సొద. చెబుతా చెబుతా!

@సుజాత: కథ హేమంత్ తరఫునుంచీ చెప్పించడమే అతన్నొక "సిన్సియర్ వెధవని" చెయ్యడానికి. ఆ ఉద్దేశం సఫలమైనట్లు అనిపిస్తోంది.

@అనామకుడు: హేమంతుది భీభత్సమైన రియాక్షన్ అని మీరు అబ్రకదబ్ర అనుకోవడం నాకు కొంత చిత్రంగా అనిపించింది. ఎందుకంతే ఇంత వివక్షాపూరితమైన నమ్మకాల్ని కలిగిన హేమంత్ తన అభిప్రాయాల్ని నిట్టనిలువునా కూల్చిన సుప్రియని సిన్సియర్గా "ఐ హటేడ్ హర్" అనుకోవడం నేను చూసిన సెట్టింగ్స్ లో "సహజం"...

నేను మగాళ్ళని "మూస చేశాను" అని అభియోగం మోపుతున్నారు. ఈ కథలో నేనెక్కడా లేను. ఇది హేమంత్ తరఫునుంచీ చెప్పబడుతున్న కథ. తను తట్టుకోలేడు. కాబట్టి అందరూ తట్టుకోలేరనే అనుకుంటాడు.

@రెంటాల కల్పన: కథో కాదో తెలీక అలా డిస్క్లైమర్ ఇవ్వాసొచ్చింది. ఈ మధ్య కొన్ని నిర్వచనాలు బయల్దేరుతున్నాయి లెండి. అందుకే తప్పలేదు.

@శారద: చాలా విలువైన విషయాలు లేవనెత్తారు. యండమూరి తన ‘మీరు మంచి అమ్మాయి కాదు’ పుస్తకంలో మీ ప్రతిపాదన లాంటి విశ్లేషణ చేసి దానికి "గుడ్ గర్ల్ సిండ్రోమ్" అని పేరుపెట్టాడు. ఆలోచించాల్సిన విషయం. మీరు చెప్పిన పుస్తకం చదివే ప్రయత్నం చేస్తాను.

వేణు said...

మహేష్ గారూ!
హేమంత్ లాంటి ‘ఇరుకు, పురుషాధిక్య మనస్తత్వం’ ఉన్న వ్యక్తితో అంతకాలం స్నేహం (ప్రేమ కూడానేమో) కొనసాగించటం సుప్రియ స్థాయిని దిగజార్చే విషయమే. కానీ ఇదంతా హేమంత్ కోణం నుంచి సుప్రియను చూస్తూంటే అన్పించే విషయం. మరి ఇదే కథను సుప్రియ కోణం నుంచి కూడా రాసి చూడండి, ... ఎలా ఉంటుందో?

Anonymous said...

she is from chickballapur - bangalore university

Anonymous said...

మహేష్ గారు,
మొత్తానికి కథలో నాయికలాంటి "every thing perfect" అమ్మాయి నిజజీవితంలో వుంటుందంటారా? ప్రతీ వ్యక్తిలోను బలము బలహీనత వుంటాయి. కథలో హీరో ఒక యాంగిలులో బలహీనుడు అయితే, హీరోయిను అదే యాంగిలులో బలవంతురాలు. అంతే కదా? ఆమెకు కూడా ఏదో ఒక బలహీనత లేకుండా వుండదు.

నిజానికి ఒక అందమైన అమ్మాయి ఆపదలోవుంటే కాపాడాలని ప్రతీ పురుషుడికి వుంటుందని ఏదో నవల్లో యండమూరి గారు చెప్పారు,. బహుషా అంత అందమైన అమ్మాయి ఆ మగాన్ని ఇష్టపడాలంటే అలాంటీ పనులు చెయ్యాలి అని పురాన గాధల దగ్గరనుండి, మన చెత్త సినిమాల వరకూ ప్రతీ దాంట్లో వుండడమే కారనం కాబోలు. అదేవిదంగా ఇలాంటి బలహీనతలు ఆడవారికి కూడా వుంటాయి. మనకు (మగాల్లకు) తెలీనంత మాత్రాన లేనట్లు కాదు కదా?

ఏదో వూహాలోకంలో ఒక అబ్దుత స్త్రీని వూహించుకొని మగాల్లను మానసికంగా బలహీనులని సెర్టిఫికేటు ఇవ్వడం అంత బాలేదు.

Malakpet Rowdy said...

Very well written stuff!!! (Since it is only a story, I am not going into the character analysis/assassination)

te.thulika said...

పైవ్యాఖ్యలన్నీ చూసింతరవాత నాకేముంది రాయడానికి. కథా, కథనం కూడా బాగున్నాయి. ఉత్తమపురుషలో కథ నడపడంలో సౌఖ్యం ఏమిటో ఇక్కడ తెలుస్తుంది. హేమంత్ పాత్రని చాలా చక్కగా ఆవిష్కరించేరు. మహేష్. అభినందనలు.

Praveen's talks said...

నేను కూడా ఒక కథ వ్రాసాను. ఆడవాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకునే మగ మహారాజుల్ని నేను కూడా చూశాను. http://viplavatarangam.net/2009/06/13/25

కొత్త పాళీ said...

సబ్జక్టు కానెస్ప్టుతో నాకేమి గొడవలేదు.
కాని కథ చెప్పడం, రాయడంలో మీకున్న రచనా శక్తికి దీనికంటే ఒక మూడు మెట్లు పైన రాసి ఉండొచ్చని నాకనిపిస్తోంది.
మంచి కథా విషయం తోచినప్పుడు దాన్ని తోందరగా ప్రచురిద్దామా అని కాకుండా దీన్ని ఇంకా ఎంత బాగా చెప్పగల్ను అని పరిశీలించుకుని చూడండి.

saleem said...

really good story.u r a good writer.
saleem

M Vani said...

లక్ష్మి said...

బహుశా నేటి మహిళల్లో బయల్పడుతున్న ఆ బలమైన వ్యక్తిత్వమే విడాకుల సంఖ్య ఇంతలా పెరగటానికి కారణం కూడా అనుకుంటా.

లక్ష్మి గారు,
నాకు ఒక విషయం అర్థం కాలేదు.
ఈ విడాకులు ఆడవారి బలమైన వ్యక్తిత్వం వల్లనా? లేక వ్యక్తిత్వం ఉన్న ఆడది మగవాడి మీద ఆధారపడట్లేదు అన్న మగవాడి ఆలోచన వల్లనా?

కత్తి మహేష్ కుమార్ said...

@వాణి: రెండోదే కరెక్టు.

Rishi.. In Natures Beauty said...

హయ్ మహేష్ గారు.. మీరు రాసిన ఈ కధ నాకు ఎంతగానో నచ్చింది!! నాకు మొదటి నుండి సినిమా పిచ్చి వుంది.. చాలా కధలు తయారుచేసుకుంటూ మురిసిపోతుంటాను.. ఒక మంచి ముహుర్తం చూసుకోని ఏదన్నా కధకు కధనాన్ని పేర్చాలని వువ్విళ్ళూరుతున్నాను. దేవత నాకు చాలా బాగ నచ్చింది.. మీరు అనుమతిస్తే దేవతను లఘు చిత్రంగా మారుద్దామనుకుంటున్నాను!! మీ భావనికి దోషం పట్టనివ్వకుండా మీ వూహల్లోని దేవతకు ప్రాణం పొసే అవకాశం ఇస్తారని ఆసిస్తున్నను!!
Tnx n Rgrds,
MastanVali Shaik

Kathi Mahesh Kumar said...

@మస్తాన్ వలి: నిరభ్యంతరంగా నా కథని వాడుకోవచ్చు. క్రెడిట్ ఇస్తే చాలు.

suvarchala said...

బలమైన వ్యక్తిత్వం వున్న స్త్రీ మగవాడ్ని ఆత్మన్యూనతకు గురిచేయటం నిజం! మీ దేవత చదివాక ఓల్గా గారి కథ(పేరు గుర్తుకు రావట్లేదు) గుర్తుకు వచ్చింది. అంత వ్యక్తిత్వం వున్న అమ్మాయిని ప్రేమిస్తాడుకానీ, పెళ్లిచేసుకునే సాహసం చేయలేకపోతాడు!! ఫలితం..సగటు అమ్మాయితో పెళ్లి.."మీ వాళ్లు మావాళ్లకు అవి జరపలేదు..ఇవి జరపలేదు..మేం సారె తెస్తే కొబ్బరిచిప్పలు సరిపోలేదని మీ వాళ్లు అన్నారు"..ఇలాంటి నేరారోపణలు చేసే భార్యను చూసి విస్తుపోతాడు. మరి వాడ్ని చూసి జాలిపడటం మినహా ఏంచేయగలం? మీ సుప్రియలాంటి అమ్మాయిలు కనిపిస్తారు/కనిపించకుండాకూడా వుంటారు. కారణం.. నాకనిపిస్తుందీ..మగవాడి అభిజాత్యాన్ని సహించలేక, తమకుతాము అటువంటి చికాకుల్నుండి ఎస్కేప్ అవటం కోసం .. ఎన్నుకున్న మార్గం.."సర్దుబాటు"! కానీ వాడి ఇజాల్ని సంతృప్తి పరిచేందుకు మాత్రమే స్త్రీ మరింత సహకరించేలా తయారవుతుంది వ్యవహారం!
మీ ఈ కథ ..కథ కాని కథ! మరోసారి అద్దంలో చూపించే ప్రయత్నం అనిపించింది నాకు.