Wednesday, June 17, 2009

లిటరరీ & ఫిల్మ్ క్లబ్స్ ఎక్కడా?

రచయిత ఉద్దేశించినట్లే అందరు పాఠకులూ అర్థం చేసుకోవాలని కోరుకోవడం బహుశా మితిమీరిన ఆశావాహక దృక్పధం అనిపించుకుంటుంది. సినిమా విషయంలోనూ అంతే. దర్శకులూ,నిర్మాతలు ఎవరూ ఫ్లాపు సినిమా తియ్యాలని తియ్యరు. అలా అయిపోతాయంతే. ఒక రచన చేసేప్పుడు అది "ముఖ్యమైనది" అనుకునే రచయితలు రాస్తారు. కానీ పాఠకుడు "చెత్త" అనుకుంటే మనం చెయ్యగలిగెదేమీ లేదు. దీనికి విపరీతంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఏదో ‘అలాఅలా’ రాసేస్తే అదొక ఉద్యమాన్ని సృష్టించెయ్యొచ్చు. సినిమా మామూలుగా తీస్తే కళాఖండంగా మిగిలిపొనూవచ్చు.

రాసిన వెంఠనే రచన రచయితను మీరి స్వతంత్ర్య ప్రతిపత్తిని సంతరించుకుంటుంది. ఒకసారి పాఠకుడి చేతుల్లోకి వెళ్ళిన తరువాత తన మనఃస్థితిని బట్టి, పూర్వజ్ఞానాన్ని బట్టి కొత్త అర్థాల్ని సంతరించుకుంటుంది. దీన్నే reader centric interpretation అంటారు. సినిమాను తెరపై చూస్తున్న ప్రతి ప్రేక్షకుడూ ఒకే స్పందన చెందుతాడనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఇక్కడా ప్రేక్షకుడి "స్వీయానువాదానికి" బలమైన స్థానముంది. ఆ స్పందనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే...ఒకసారి నవతరంగంలో ఒకే సినిమాపై వచ్చే రెండు విపరీతమైన సమీక్షలు చదివితే అర్థమవుతాయి. టీవీల్లో తమ సినిమాని ఊదరగొట్టే దర్శకులు చెప్పినదానికీ ఈ రెండు,మూడు,నాలుగు సమీక్షలకీ అస్సలు పొంతనుండదు. మరొ వందమంది అదే సినిమా గురించి చెప్పినా అవి ఎంతోకొంత స్థాయిలో విభిన్నంగానే ఉంటాయి.

ప్రతి పాఠక/ప్రేక్షకుడి “స్థాయీ” రచయిత/దర్శకుడి స్థాయి కాబఖ్ఖరలేదు. రచయిత/దర్శకుడు ఆశించిన స్థాయిలోనే పాఠక/ప్రేక్షకుడు రసస్పందన చెందనవసరమూ లేదు. అయితే, పాఠక/ప్రేక్షకుల స్వీయానువాదానికి ఎంత విలువున్నా ఒక text ని intended form లో చదవడానికి కొంత “EDUCATION”(what ever it means) అవసరం అనేది చాలా మంది అంగీకరించే విషయం. సినిమా విషయంలో కూడా ఈ వాదన చాలా బలంగా వినిపిస్తుంది. అందుకే లిటరరీ క్లబ్స్, ఫిల్మ్ క్లబ్స్ ఒక సాంస్కృతిక ఒకప్పుడు ఉద్యమంలాగా బయల్దేరాయి. ఈ క్లబ్స్ ఉద్దేశం రచనలు/సినిమాల మూల ఉద్దేశాల్ని అవగతం చెయ్యడం. అంతేకాక వాటికున్న సామాజిక సైద్ధాంతిక నేపధ్యాల్ని పరిచయం చేస్తూ పాఠక/ప్రేక్షకుల్లో ఒక మానసిక వేదికని ఏర్పరిచి అభిరుచుల్ని పెంపొందించుకునేలా చేసేవి. కానీ ఇప్పుడు అవి బలహీనమయ్యాయో లేక అనవసరం అయ్యాయో తెలీటం లేదు. బ్లాగుల్లో జరుగుతున్న సాహితీచర్చల నేపధ్యంలో వాటి అవసరం మాత్రం ఉంది అనిపిస్తోంది.

****

3 comments:

Anonymous said...

ఆ క్లబ్బులు చచ్చేయేమో గానీ, తెలుగు బ్లాగ్లోకం మాత్రం అలాంటి సాహిత్య క్లబ్బుగా తయారైంది. అంతకు మించి ఇక్కడేమీ లేదు అనిపిస్తుందు నాకు :(

భావన said...

"ఈ క్లబ్స్ ఉద్దేశం రచనలు/సినిమాల మూల ఉద్దేశాల్ని అవగతం చెయ్యడం. అంతేకాక వాటికున్న సామాజిక సైద్ధాంతిక నేపధ్యాల్ని పరిచయం చేస్తూ పాఠక/ప్రేక్షకుల్లో ఒక మానసిక వేదికని ఏర్పరిచి అభిరుచుల్ని పెంపొందించుకునేలా చేసేవి. కానీ ఇప్పుడు అవి బలహీనమయ్యాయో లేక అనవసరం అయ్యాయో తెలీటం లేదు." బహుశా ఆ సంస్థ లు కూడా biased అవటం మూలం గానేమో అనుకుంటా.. సాహిత్యమేమో కాని సినిమాల విషయం లో ఐతే ఐనట్లే వుంటుంది మరి..

Anil Dasari said...

మరీ క్లుప్తంగా ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే, టైటిల్స్ ఐపోగానే శుభం కార్డేసినట్లుంది :-)