Monday, May 4, 2009

తిరస్కృతి


అక్షరాల పొరల్లోంచీ
కొత్త అర్థాలు వెతుకుతూ
అది పదోసారి...
దుర్భిణితో
అనంతాన్ని కొలుస్తూ
అది పదకొండోసారి...

చదివిన ప్రతిసారీ
కాదు ఔనవుతుందన్న ఆశ
అందలేని దూరాల తార
అధాట్టున అందుతున్న ధ్యాస

నిజం...
నీ తిరస్కారంలో
నా ఉనికికి
కొత్త అర్థం వచ్చింది
పన్నెండోసారి...

ధనవంతుడి పక్కనుంటేనే కదా
పేదోడికి తన దరిద్రం తెలిసేది
నువ్వు కాదంటేనే కదా
నా ఉనికికి అస్థిత్వం వచ్చేది!
పదమూడోసారి...

పద్నాలుగోసారి....
అర్థం మారలేదు
అక్షరాల పొరల్లోంచీ
నీ కాఠిణ్యం
కత్తులు దూస్తుంటే
నా గుండెలు చిందిన రక్తం
నన్ను పునీతుణ్ణి చేసింది
పదిహేనోసారి...
నన్ను పునర్జీవితుడ్ని చేసింది

పదహారోసారి...
మరొక్కసారి నీ జవాబుకై
ఎదురుచూశాను
మళ్ళీ మరణించడానికి
నన్నునేను సిద్ధం చేశాను
మళ్ళీ...ఒకటోసారి...

****

7 comments:

Anonymous said...

మహేష్ గారు..

బాగుందండీ ప్రతిసారీ.. కాని నాకు ఇంకా బాగుండేది.. మీరు వివరిస్తే రెండు - తొమ్మిదో సారి.. :-) :-)

asha said...

చాలా బాగుంది మహేశ్‌గారు.
ప్రేమని programmingలో loopలా, economicsలో vicious cycle లా
వర్ణించారు అనిపించింది. సారీ! నేనింతకంటే అందంగా ఆలోచించలేను. మీరు సర్దుకుపోవాలి మరి.:)

మధురవాణి said...

బావుందండీ కవిత.!
బొమ్మ కూడా సరిగ్గా సరిపోయింది.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది మహేష్...

bhaavatarangini said...

W.B. Yeats' "Second Coming"

Turning and turning in the widening gyre
The falcon can not hear the falconer
things fall apart: the centre can not hold
Mere anarchy is loosened upon the world.

Is that the same story - the falcon, the falconer..??

MURALI said...

మహేష్ మీ ఇంటి పేరులా ఉంది కవిత. నిజమే మరోసారి చదివితే కొత్త అర్ధం దొరుకుతుందేమొ అనే ఆశతో చదవటం, మరోసారి అడిగితే నిర్ణయం మారుతుందేమొ అనుకోవటం పతీ ప్రేమికునికి అలవాటే.

కొత్త పాళీ said...

చాలా బావుంది