Friday, May 1, 2009

‘మునెమ్మ’ పాఠకుడి (native reader) స్పందన - భాగం 1


ఈ మధ్యకాలంలో తెలుగు నవలాసాహిత్యంలో ఒక అలజడిని రేపిన నవల మునెమ్మ. ఈ నవల గురించి నా అభిప్రాయాలు కొన్ని...

నేను కాలేజిలో ఆంగ్లసాహిత్యం మేజరు చదివేప్పుడు మా ఫ్రొఫెసర్ ఎన్.ఎస్.రఘునాథ్ , "Read English literature to understand it, to appreciate it and to learn literary theories.But, if you really want to "feel" literature, go back to your native (language) literature" అని చెప్పేవారు. అంటే, స్థానికేతర సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించడం వరకూ బానేవుంటుందిగానీ, అనుభవానికొచ్చే సరికీ స్థానిక సాహిత్యమే బెస్టన్నమాట. సాహిత్యసృజన ఆ భాషకు సంబంధించిన సామాజిక-సాంస్కృతిక-రాజకీయ-ఆర్ధిక నేపధ్యంనుంచీ కలిగే అభివ్యక్తిని
అక్షరబద్ధం చేసే ప్రక్రియ. ముఖ్యంగా, ఈ అన్ని అంశాల్నీ ప్రభావితం చేసే క్షేత్ర లక్షణాల్ని (nature of land scape) ఆ సాహిత్యం పుణికిపుచ్చుకుంటుంది .అందుకే ఈ నేపధ్యానికి దగ్గరగావున్న స్థానికులు తమ భాషా సాహిత్యాన్ని అర్థంచేసుకుని ఆస్వాదించడమే కాకుండా ముఖ్యంగా అనుభవించగలిగిన సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సౌలభ్యం పరాయి సాహిత్యంలో అంతసులువుగా సంభవం కాదు. ఇదే తర్కాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళితే,మునెమ్మ నవలలోని కథాప్రదేశానికి (రాయలసీమ- చిత్తూరు) స్థానికుడిగా, నా అనుభవానికీ ఇతర ప్రాంతాల వారి పఠనానుభవానికీ పిసరంత తేడా ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. ఆ నమ్మకమే ఈ వ్యాసం రాయడానికి కారణం !

ఈ నేపధ్యంలోంచీ నేను 'మునెమ్మ' చదివాను. బహుశా ఆ కారణంగానే ముందుమాట, వెనకమాట, సైకో-సోషియల్ సాహితీ సిద్ధాంతాల ప్రమేయం లేకుండా ఆ (నా) నేల మీద నడిచిన కథ నడిచినట్టుగానే నన్ను ఆకట్టుకుంది. అందుకే నా విశ్లేషణని వ్యాఖ్యానంగా కాక ఒక ప్రతిస్పందనగా భావిస్తాను. విమర్శకుల కొలమానాల శాస్త్రీయత ఇక్కడ కనిపించదు. స్థానికపాఠకుడిగా ఇది నా స్పందన, ఒక ధృక్కోణం అంతే!

కాల్పనిక సాహిత్యంలో, ఇతివృత్తం (theme) తరువాత కథాప్రదేశం (setting) అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కథ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలకు అత్యంత కీలకమైన సమాధానాలుగల అంశం అది . ఆతరువాత ప్రముఖంగా చెప్పుకునే అంశాలైన పాత్రలు(characters) కథావస్తువు(plot),ధృక్కోణం(point of view),శైలి (style) మొదలైన అంశాలు కథాప్రదేశానికి అనుగుణంగానే ఏర్పడతాయి. పాత్రల ప్రవర్తన,వేషభాషలూ మరియూ విధివిధానాలూ. కథావస్తువు సాగే విధానం.ఎవరి ధృక్కోణంలో కథ సాగుతోందన్న సత్యం. వీటన్నిటికీ అనువుగా శైలి కుదురుకుంటాయి లేక ఎంచుకోబడతాయి. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మునెమ్మ నవలలో నాకు కనిపించిన మరో ముఖ్యపాత్ర కథాప్రదేశానిది.ఆంగ్లంలో landscape అనుకోవచ్చు. అందుకే for me మునెమ్మ novel is as much about the place and its culture in itself beyond the story that happened over there.


రెండో భాగం త్వరలో...

*****

3 comments:

సుజాత said...

waiting.....!

దుప్పల రవికుమార్ said...

మరిక అసలు విషయంలోకి వేగం వెళ్లండి...

అనిల్ said...

ఉపోద్ఘాతం ఐపోయింది కదా. :)
ఇక రెండవ భాగం చూద్దాం.