Tuesday, May 19, 2009

తెలుగు పుస్తకం : విలువ Vs ధర

ఇప్పుడే కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులో పుస్తకాలు వాటి ధరల గురించి ఒక రచయిత వేదన అనుభవించి వస్తున్నాను.

నిజమే! మల్టిప్లెక్సులో తెలిసితెలిసీ ఒక చెత్త సినిమా చూడ్డానికి పెట్టే వందరూపాయలు ఒక చదవగలిగిన ( చదివితేగానీ అది మంచి పుస్తకమా చెత్త పుస్తకమా అని తెలీదు) తెలుగు పుస్తకానికి ఖర్చుపెట్టాలంటే మనకెందుకో ‘నొప్పి’. అదే ఇంగ్లీషు పుస్తకానికి పెట్టాలంటే వందకాదుకదా, ఐదువందలైనా ఏమాత్రం సంకోచం చేకుండా పెట్టేస్తాం. అంటే పుస్తకానికి ఖర్చుపెట్టడం సమస్య కాదుగానీ, తెలుక్కొచ్చేసరికీ మాత్రం "ధర" ఒక పెద్ద క్రైటీరియా అయిపోయింది. ఇలా పాఠకుడికీ పుస్తకానికీ. పుస్తకాల వెలకూ విలువకూ సంబంధం లేని ధరలతో మన తెలుగు పుస్తకాల మార్కెట్ కళకళలాడుతూ కలగాపులగంగా తయారయ్యింది.

తెలుగునాట కొత్త పాఠకులు తయారయ్యే సంస్కృతే లేదు అనే మూల సమస్యని పక్కనబెడితే, ప్రస్తుతం ఉన్న ఈ సమస్యకు నాకు అనిపించిన సమాధానం, ఇంగ్లీషు పుస్తకాలు కొనేముందు వాటి "విలువ" యొక్క సమాచారం మనకు ఎక్కడో ఒకదగ్గర తెలిసుండటం. ఒక రచయిత గొప్పతనమో, ఆపుస్తకం యొక్క ఉపయోగత్వమో లేదా ఆ పుస్తకాన్ని చదివిచెప్పిన ఒక "విలువైన" అభిప్రాయమో మనకు ముందే తెలుస్తాయి. అప్పుడు పుస్తకం యొక్క ధరతో విలువను బేరీజు చేసి కొనడానికి మానసికంగా సంసిద్ధమైపోతాం. ఎకానమీ ఆఫ్ స్కేల్ తీసుకుంటే అధిక సంఖ్యలో అమ్ముడవుతాయి కాబట్టి ఇంగ్లీషు పుస్తకాల ధరలు తక్కువగా ఉండాలి. కానీ వారు ధరని కాకుండా, విలువని మార్కెట్ చెయ్యటంలో సఫలమవుతున్నారు. కాబట్టి లాభాలకు లాభాలూ ధరలకు ధరలూ మెండుగా దండుకొంటున్నారు. కానీ తెలుగులో ఆ సౌలభ్యం తక్కువ. పుస్తక సమీక్షలు, చర్చాగోష్టులూ తప్ప పుస్తకాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యడానికి, ప్రమోట్ చెయ్యడానికీ మనకు తగినన్ని సంస్థాగత ఏర్పాట్లు లేవు. ఈ కారణంగా అలాంటి పుస్తకాల్ని చదవాలనుకునే టార్గెట్ పాఠకుల్ని కూడా అందుకోలేని దుస్థితి మన తెలుగు పుస్తకాలకు పట్టింది. లేకపోతే పదికోట్ల జనాభావున్న తెలుగోళ్ళుండగా సంవత్సరాల తరబడి కనీసం వెయ్యికాపీలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రచయితలూ పబ్లిషర్లూ ఉండటమేమిటి?

ఒక వేళ ఆ సౌలభ్యం ఉన్నా, అంత ధర చెల్లించి మనోళ్ళు తెలుగు పుస్తకాలు అస్సలు కొనరన్నది కొందరి వాదన. అలా అయితే, కొంత మన మానసికతను గురించి ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుపుస్తకాల్ని చీప్ గా కొనడం మనకు అలవాటయ్యిందా లేక ధరకుతగ్గ విలువ మన పుస్తకాల్లో ఉండదా అనేవి తెలుసుకోవలసిన సమాధానాలు. ఇక్కడ మళ్ళీ విత్తుముందా చెట్టుముందా అనే ప్రశ్న ఉదయిస్తుందేమో! అంత ధరకు తప్ప పెరిగితే కొనేవాళ్ళు తక్కువకాబట్టి అంతే నిర్ణయించామని పబ్లిషర్లు, ఇంత ధరకే ఇప్పటివరకూ లభ్యతలో ఉంది కాబట్టి అంతకే కొంటూవచ్చాం అని పాఠకులూ అనేస్తే మన మొదటి ప్రశ్న కాస్తా చతికిలబడుతుంది. అంటే తక్కువ ధర ఒక ‘అలవాటు’ అనేది కొంచెం సంశయించాల్సిన విషయమే.

ఎందుకంటే, మన దినపత్రికలూ, వారపత్రికలూ, మాసపత్రికల ధరలు గత పది సంవత్సరాలలో కనీసం వందశాతం పెరిగాయి. ఉదాహరణకు 5 రూపాయలున్న సితార ఇప్పుడు 10 రూపాయలు. ఈ పత్రిక ప్రయాణాల్లో పదినిషాలు చదువుకుని, ఆ తరువాత పేపర్ ప్లేట్లుగా ఉపయోగించుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాదు.ఆరు రూపాయలున్న స్వాతి పత్రిక ఇప్పుడు పది రూపాయలు. దినపత్రికలైతే అలవాటు పడిన తరువాత రెండ్రూపాయలనుంచీ మూడున్నరకు వెళ్ళినా కొనడం ఆపిన ప్రజలు నాకైతే ఎవరూ కనిపించలేదు. ఇహ వాటి సర్క్యులేషనైతే నేను పుట్టినప్పటి నుంచీ ఎప్పుడూ లక్షల్లోనే ఉంది. అంటే టైంపాసు పత్రికలకూ, ఆరోజు గడిచిన తరువాత ఎటువంటి విలువా లేని దినపత్రికల ధరల్లో మార్పులు జరిగినా కొనడం ఆపని పాఠకుడు చదివి దాచుకోగలిగే పుస్తకానికొచ్చే సరికీ ధర విషయంలో వెనకంజ వేస్తాడా? అనేది పరిశోధించదగిన విషయం. లేదా మన పబ్లిషర్లూ,రచయితలూ కొనరన్న అపోహతో ధరల్ని కుదించి అలా సెటిలైపోయారా అనేదికూడా తెలుసుకోవాలి.

రెండో విషయం మన తెలుగులో ధరకుతగ్గ విలువున్న పుస్తకాలు తక్కువుండటం. ఇది మరో ఔట్రేజియస్ ఆరోపణే అవుతుంది. కొత్త పుస్తకాల విలువలు ప్రమోషనూ, పబ్లిసిటీ నిర్ణయించినా, మన దగ్గర అత్యంత విలువైన పాతబంగారమైన సాహితీభాండారం ఉన్నమాటైతే ఎవరూ కాదనలేని నిజం. మరి ఆ విలుకుతగ్గ ధరని మనం నిర్ణయించామా అనేది ఆలోచించాలి. కొన్ని ఎవర్ గ్రీన్ పుస్తకాలు ఎప్పుడూ అమ్ముడయ్యేవే. చలం, బుచ్చిబాబు,తిలక్,రంగనాయకమ్మ, కొడవటిగంటి,మధురాంతకం,శ్రీశ్రీ, లు సమయం, సందర్భం, ధరతో సంబంధం లేకుండా పుస్తకాల షెల్ఫుల నుంచీ ఎగిరెళ్ళిపోయే వారే. కాకపోతే ఇక్కడ ధరతోపాటూ పుస్తకాల ముద్రణయొక్క నాణ్యత మరో సమస్య. నాదగ్గరున్న ‘అమరావతి కథలు’ ఎవరో తీసుకుని మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ కొందామని ఈ మధ్య షాపుకెళ్ళాను. ధర పదిశాతం పెరిగిందిగానీ, నాణ్యత వందశాంతం తగ్గింది. ఇదే దుస్థితి బారిష్టర్ పార్వతీశం పుస్తకానీకీ పట్టింది. చలం పుస్తకాల రీడిజైనింగ్ ఇంకా కొత్త పాఠకుల్ని తెచ్చిపెట్టగలదు. కొన్ని మంచి పుస్తకాలు ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్ అని చెబుతూనే ఉంటారు. 2000 సంవత్సరంలో లో ఔటాఫ్ ప్రింట్ అయిన ‘ఖాకీబతుకులు’ నవల నేనింకా వెతుకుతూనే ఉన్నాను. ఇలా మరెన్నో పుస్తకాలు జ్ఞాపకాల్లోతప్ప పుస్తకాలుగా నాదగ్గర లేకుండా పోయాయి. ఇదో తెలుగు పాఠకుడి వెరైటీ ఖర్మ.

మళ్ళీ మొదటి నుంచీ మెదలెడితే, ఈ మధ్య సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు చూడ్డం మానేసి డబ్బులెక్కువ పెట్టి మల్టిప్లెక్సుల్లో సినిమాలు చూడ్డానికి కారణం, సినిమా చూడ్డంలో పొందే నిర్థిష్టమైన అనుభవం. మామూలు ధియేటర్లలో ఆపరేటర్ ఇష్టమొచ్చిన దగ్గర సౌండ్ పెంచెయ్యడం, కార్బన్ సరిగ్గా పెట్టక బొమ్మ మసకేసెయ్యడం, కొత్త సినిమా అయితే బోనస్ గా వచ్చే అరుపులూ కేకలూ మల్టిప్లెక్సుల్లో ఉండవు. సినిమాని దర్శకుడు ఎలా చూపించడానికి డిజైన్ చేశాడో అదే అనుభవాన్ని మల్టిప్లెక్స్ నాకు అందిస్తుంది. సెట్టింగ్, ఫెసిలిటీ, అనభవంలో మార్పుకోసం అదనంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి తయార్. ఇదే అనాలజీ పుస్తకాల షాపులకు కూడా వర్తిస్తుందేమో! ఉదాహరణకు ఒడిస్సీ, వాల్దన్, క్రాస్ రోడ్స్ లాంటి షాపులకు వెళ్ళండి. అక్కడి యాంబియెన్స్ ద్వారా ఒక పాఠకుడితో ఆ షాపు ప్రవర్తించే తీరు, పుస్తకాన్ని ఖరీదుచేసే వాతావరణాన్ని సమూలంగా మార్చేస్తుంది.

మైసూర్ లో చదువుతుండగా అక్కడ యూనివర్సటీ క్యాంపస్ లోని హిగిన్ బాథమ్ రెగ్యులర్ విజిటింగ్ పాయింట్. అక్కడ మనం మొదటి సారి వెళ్ళి ఒక పుస్తకాన్ని ఎంచుకుని కౌంటర్లోకి రాగానే మన అభిరుచికి అనుగుణంగా మరికొన్ని మరికొన్ని పుస్తకాలు సూచింపబడతాయి. అప్పటికప్పుడు మరొకటి కొనడమో లేక కనీసం ఆ తరువాత కొనడానికి నిర్ణయించుకోవడానికో ఈ సూచనలు ఉపయోగపడతాయి. రెండోసారి వెళ్ళినప్పుడు ఆపుస్తకం షాపు యజమాని మనం క్రితం కొన్న పుస్తకం ఎలా ఉంది? నచ్చిందా,లేదా? అనే ప్రశ్నలు ఖచ్చితంగా ఆడుగుతాడు. ఈ విధంగా ఆ పుస్తకం షాపుతో మనకు ఒక వ్యక్తిగత బంధం ఏర్పడిపోతుంది. ఇక ఎక్కడికెళ్ళొచ్చిన్నా, ఆ పుస్తకం షాపుమాత్రం జీవితంలో ఒక భాగంగా మిగిలిపోతుంది. ఈ మధ్యకాలంలోని మాల్ బుక్ షాపుల్లో, పుస్తకం కొనకపోయినా కాఫీ తాగుతూ ఆ పుస్తకం చదివే సౌకర్యాలూ, పుస్తకాల గురించి చర్చించుకునే చర్చా వేదికలూ, పుస్తక పఠన సెషన్లూ కల్పిస్తూ పాఠకులకు మరింత దగ్గరవుతున్నాయి. కానీ తెలుగు పుస్తకం, పుస్తకాల షాపూ, పాఠకుడూ ఎక్కడవేసిన గోంగళి అక్కడనే. పుస్తకమేళాలూ, ఎగ్జిబిషన్లూ మొదలైనా అవి ఈవెనింగ్ ఔటింగుకెక్కువా, తెలుగు పుస్తక ప్రమోషన్కు తక్కువాగా ఉన్నవే.

ఏదిఏమైనా, ఒక పుస్తకం "విలువ" అది చదివితేగానీ మనకు తెలీదు. చదివినా, దాని విలువని మన జీవితానికి ఆ పుస్తకం అందించే అనుభవాన్ని బట్టిగానీ నిర్ణయించలేము. అందుకే కొన్ని పుస్తకాల్ని ‘అమూల్యం’ అంటుంటాము. కొన్నింటిని "వేస్టు" అనేస్తాం. కానీ ఈ రెండు నిర్ణయాలకూ పుస్తకాల్ని కొని చదవడం అవసరం. కానీ కొనిచదవడానికి "ధర" మనకు అడ్డొస్తే....ఆ కారణంగా మనం కోల్పోబోయే విలువని తెలియజెప్పడానికి ఒక మాధ్యమం కావాలి. అది తెలుగులో లేనన్నాళ్ళూ ఒకవైపు రచయితకూ, పబ్లిషర్లకూ మరోవైపు పాఠకుడికీ ఈ తిప్పలు తప్పవు.

*****

17 comments:

Vinay Chakravarthi.Gogineni said...

bbaga raasaru...........good.......

$h@nK@R ! said...

avunandi.. chala varaku alage alochistaaru

సుజాత వేల్పూరి said...

మీరు చెప్పిన అనేక అంశాలు ఆసక్తి కరంగానూ, అంగీకరించాల్సినవి గానూ ఉన్నాయి.పాత రచనలను రీ-డిజైన్ చెయ్యడం,పుస్తకాల షాపుల్లో తగిన ఆంబియెన్స్ ఉండాలనడం వంద శాతం కరక్టు! సుల్తాన్ బజార్ లో ని విశాలాంధ్రలో రెగ్యులర్ గా కొనే వాళ్ళను సైతం కనీసం రిసెప్షన్లో ఉండేవాళ్ళు తలెత్తి కూడా చూడరు చాలా సార్లు!ఏం కావాలో చెప్తే ఒకరితో ఒకరు పది సార్లు సంప్రదించుకుంటారు గానీ సరైన సమాచారం ఉండదు. ఈ విషయంలో నవోదయ వాళ్ళు చాలా నయం! మీరు చెప్పిన హిగ్గిన్ బాథమ్‌స్ వాతావరణం ఇక్కడ ఎదురవుతుంది నాకు! వాల్డన్ లో కూడా ఈ మధ్య కొన్ని తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయి.

అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ ప్రింట్స్ వేయకపోవడం మీద కూడా నా ఆరోపణ. చాలా రోజుల క్రితం వసంత రావు దేశ్పాండే అనే ఆయన రాసిన "అడవి" అనే నవల చతుర లో చదివిన గుర్తు. ఆ తర్వాత ఆ నవల పుస్తకంగా వచ్చింది. రీ ప్రింట్ పడలేదు. ఎన్ని రోజులుగా వెదుకుతున్నానో!

Anonymous said...

Selling 2000 copies of Telugu books will easily taking 2 to 5 years. How can we expect immediate reprints with improved quality at less price.
This is the fate of Telugu literature.

Anonymous said...

మురళీ కృష్ణగారి పోస్టుపైనే నా కామెంట్ వేశాను. మీరు చర్చించదల్చుకుంటే, అది మీ బ్లాగులోనే చేద్దాం అని మనవి.

bphanibabu said...

మల్టీ ప్లెక్స్ లో అరుపులూ కేకలూ ఉండవని అనకండి. పూణే లో మేము ఒకసారి " ఈ స్క్వేర్ " లో చిరంజీవి సినిమాకి వెళ్ళేము. అక్కడ ప్రేక్షకులు చేసిన గొడవ చూసిన తరువాత మళ్ళీ ఏ సినిమాకీ వెళ్ళే ధైర్యం చేయలేదు !! ఈలలూ, కేకలూ, హారతులూ అడగకండి. మన వీరాభిమానులు ఎక్కడైనా సరే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని మరువరు.

Kathi Mahesh Kumar said...

@రేరాజు: నేను రెడీ! ఆ వ్యాఖ్య ఇక్కడ పెట్టండి. చర్చకు ఆహ్వానిద్ధాం.

శరత్ కాలమ్ said...

ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంకా పుస్తకాలు ముద్రించుకోవాలనే తాపత్రయం అవసరమా? ముందున్నది ఈ-బుక్స్ కాలం కాదూ?

చంద్ర మోహన్ said...

మీరు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చాలావరకు అంగీకరించవలసిన విషయాలే. ఐతే పుస్తకాలు ప్రచురించడం, కొని చదవడం అన్నది ఒక్కొక్క భాషా సంస్కౄతికి చెందిన విషయం అని నా అభిప్రాయం. ఇక్కడ మైసూరులో జరిగే పుస్తకప్రదర్శనలలో కన్నడ పుస్తకాలను చూసి " ఇంత అందంగా, ఇంత చక్కని కాగితం మీద, ఇంత వైవిధ్యభరితమైన అంశాలపై పుస్తకాలు తెలుగులో ఎందుకు రావు?" అని ఆశ్చర్యపోతాను. ఇంటికి రెండు కార్లున్నా పేపరు పక్కింటివాడి దగ్గర అడుక్కుని చదివే జాతి మనది. నిజానికి పుస్తకం ఖరీదు కొనుగోలును ప్రభావితం చేస్తుందని నేననుకోను. అది ఒక సంస్కృతి యొక్క అలవాటు మాత్రమే. తమిళ భాషలో "వందార్గళ్.. వెండ్రార్గళ్" (వచ్చారు.. జయించారు) అని ఓ పుస్తకం అచ్చయింది. మదన్ అనే ఓ కార్టూనిస్ట్ రచించిన ఆ పుస్తకాన్ని వికటన్ ప్రచురణాలయం ప్రచురించింది. తైమూర్ నుండి ఔరంగజేబ్ వరకు భారతదేశంపై జరిగిన దండయాత్రల చరిత్రను పిల్లలకు, గృహిణులకు కూడ అర్థమయ్యే విధంగా వ్రాసిన చరిత్ర పుస్తకం. వెల నూట పది రూపాయలు. 1994 లో ప్రథమ ముద్రణ ఐన ఆ పుస్తకం 2007 నాటికి పన్నెండవ ముద్రణ (నా వద్దనున్న కాపీ) చెందింది. అప్పటికే లక్ష ప్రతులను దాటి పోయింది. తెలుగులో ఒక చరిత్ర పుస్తకం, ఆ మాటకొస్తే ఏ పుస్తకమైనా లక్ష ప్రతులను చూడగలదా! మీరు ఎంత అందంగా ముద్రించి ఎంత చౌకగా అమ్మినా సరే, తెలుగువాడు పుస్తకం కొని చదవడం దండగ అని భావిస్తాడు. కనుక ప్రచురణారంగాన్ని ఒక భాషా సంస్కృతి కి చెందిన దృక్కోణంనుంచి మాత్రమే పరిశీలించాలి. జనరలైజ్ చేయడం కుదరదు.

Ravi said...

నిజమే మనలో ఈ పుస్తకాలు కొనడం అనే అలవాటు తక్కువ. కొనే అలవాటు వున్నవాళ్ళే పక్కవాళ్ళకు అది అలవాటు చెయ్యచ్చు. కొంచెం కష్టమే కానీ ఆచరణ అసాధ్యం ఏం కాదు. నామటుకు నేనైతే కొనడం, చదవడం అలవాటు లేని మిత్రులకు కూడా గిఫ్టు రూపం లో పుస్తకాలు ఇచ్చేవాడిని. ఈ గ్రీటింగ్ కార్డులు పూల బొకేల బదులు. మెల్లిగా వాళ్ళకు కూడా అదే అలవాటయ్యింది(ఒక నాలుగేళ్ళు పట్టిందనుకోండి). మొదటిది పఠనాభిలాష పెరుగుతుంది. అది మొదలైతే ఆటోమాటిక్ గా కొనుగోలు కూడా పెరుగుతుంది కదా. ఒక పర్సెంట్ పెరిగినా పెరిగినట్టేగా! ట్రై చేసి చూడండి. నాక్కూడా పుస్తకాలు గిఫ్ట్ల రూపంలో రావడం మొదలయ్యాయి. మనమూ ఎంచెక్కా కొత్త పుస్తకాలు చదివెయ్యొచ్చు, ఒక గ్రూప్ ఏర్పాటు అయ్యాక మనలో మనం పుస్తకాలు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేను తెలుగు పుస్తకాలగురించే మాట్లాడుతున్నా ఇక్కడ. కాకపోతే ఈపధ్ధతిలో ఒక చిన్న సూచన పుస్తకం ఇచ్చే ముందు పక్కవాడి అభిరుచిని బట్టి కామెడీ, మిస్టరీ, ఆధ్యాత్మికం ఇలా తగినట్టు ఇస్తే ఇది తప్పకుండా వర్కవుట్ అయ్యే చాన్స్ వుంది.

asha said...

నాకైతే మన రీడింగ్ హేబిట్ కూడా ఒక కారణం అనిపిస్తుంది.
రెగ్యులర్‌గా పుస్తకాలు చదివే అలవాటు మనలో చాలామందికి లేదు అని నా అభిప్రాయం.
ఈ చానెళ్ళ రాకతో ఇంతకు మునుపు పుస్తకాలతో కాలక్షేపం చేసేవాళ్ళు తక్కువ.
అందుకే ఆ అభిరుచి కూడా పెరగలేదేమోననిపిస్తుంది. పాఠకులు తక్కువ ఉండటం మూలాన
ధరలు అలా ఉంటాయేమో.

@శరత్‌గారు
నాకైతే మామూలు పుస్తకాలే చదవటానికి సౌకర్యంగా ఉంటాయి.

Anil Dasari said...

ఈ సమస్యలు పెద్దగా నాకెదువరలేదు కాబట్టి ఏమనాలో తెలీదు. ఓ అనుభవం మాత్రం అయింది.

ఏడాది క్రితం హైదరాబాదులో తెలుగు పుస్తకాలెక్కడ దొరుకుతాయని అడక్కూడనివాళ్లనెవర్నో అడిగితే 'వాల్డెన్' అన్నారు. ట్రాఫిక్‌లో రెండుగంటలీది అక్కడికెళితే దొరికిందల్లా దిక్కు మాలిన వాటిలా ఓ మూల గోడవారగా సర్దున్న వందలోపు పుస్తకాలు మాత్రమే. వాటిలోనూ చెప్పుకోదగ్గవేమీ లేవు. విశాలాంధ్ర, నవోదయ, etc గురించి తర్వాతెవరో బ్లాగర్లే (సుజాత?) చెబితే తెలిసింది కానీ అప్పటికే నేను వెనక్కొచ్చేశాను.

జీడిపప్పు said...

well written మహేష్ గారు. నేనయితే అచ్చుపుస్తకాల యుగం అంతమయిపోయింది అనే అనుకుంటున్నాను. విశాలాంధ్రలో కూడా పేరు పొందిన రచయితల పుస్తకాలు దొరకడం లేదు. అడిగితే "ఎవరు కొంటున్నారు ఇప్పుడు" అన్నారు. శరత్ గారు అన్నట్టు మున్ముందు అంతా ఈ-బుక్స్ కాలం అని నేను నమ్ముతున్నా! నావరకు పేపరు పుస్తకం దొరక్కపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. హాయిగా తెలుగువన్ సైటులో ఉన్న వందల కొద్దీ పుస్తకాలతో లాగించేస్తున్నా.

మీరు "నాణ్యత" అంటే గుర్తొస్తున్నది. అసలు మనవాళ్ళు ఎందుకు అంత బరువయిన పుస్తకాలను ముద్రిస్తారు? సూపర్ డూపర్ క్వాలిటీ పేపరు వల్ల 250 పేజీల పుస్తకానికి కూడా ఎంతో ఖర్చవుతుంది, బరువు ఎక్కువ. దానిబదులు 'రీసైకిల్డ్' పేపర్ వాడవచ్చు కదా? రీసైకిల్డ్ పేపరుతో కూడా పాఠకులు మెచ్చేవిధంగా పుస్తకాలు ముద్రించవచ్చు కానీ ఎందుకు మనవాళ్ళు దానిగురించి ఆలోచించలేదు దశాబ్దాలుగా??!!

Kathi Mahesh Kumar said...

@రేరాజు: ఇంకా ఎదురుచూస్తున్నాను.
@శరత్ & జీడిపప్పు: ఈ-పుస్తకాలు వచ్చినా అచ్చుపుస్తకాలు ప్రస్తుతానికి తగ్గవు.అందుకు ఉదాహరణ అమెరికన్ పబ్లిషింగ్ రంగమే. ఇక మన తెలుగు పాఠకుడి దగ్గరకొస్తే ఈ మార్పు మరింత నెమ్మది. కాబట్టి ఈ-పుస్తకం మరో మాధ్యమం అవుతుందేతప్ప ప్రత్యామ్న్యాయం ఎంత మాత్రం కాదు. ఈ-పేపర్ లభ్యతలో ఉన్నాకూడా ఉదయన్నే పేపరు చదివే అలవాటు ఇంటర్నెట్ హైస్పీడ్లో ఉన్న ఇళ్ళల్లోకూడా ఇప్పటికీ ఉంది.

@చంద్రమోహన్: మీ ఆవేదన అంగీకరించదగినది. నేను కర్ణాటకలో చదువుతుండగా ఒక తెలుగువాడిగా ఇటువంటి న్యూనతాభావానికి బలైనవాడినే. మన (కు)సంస్కృతికి కారణాలు తెలవక,సరైన సమాధానాలు లేక ఫ్రస్ట్రేషన్ అనుభవించినవాడినే.

పుస్తక పఠనానికి సంబంధించిన మన తెలుగువాళ్ళు పోగొట్టుకున్న భాషా-సంస్కృతిక సంబంధం ఇంకా నాకు అర్థం కాలేదు.అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. అందుకే ఈ మూల అంశాన్ని,దానితోపాటూ కొత్త పాఠకుడ్ని తయారుచేయలేకపోతున్న విధానాన్ని ఈ వ్యాసంలో చర్చకు పెట్టలేదు.

@రవి: చాలా మంచి సూచన. నేను కూడా కొన్నేళ్ళుగా ఈ పద్ధతిని అవలంభిస్తున్నాను.

@భవాని: అభిరుచి మన ఇష్టాఇష్టాల్ని బట్టి ఏర్పడుతుంది. బహుశా ఈ మధ్య మన సాహిత్యంలో పాఠకుడి జీవితాన్ని ప్రతిఫలించే విషయం కూడా లేదేమో! అనేది ఒక ఆలొచించాల్సిన విషయం. ఎందుకంటే ఎన్ని ఎంటర్టైన్మెంట్ మాధ్యమాలు మారినా ఇంగ్లీషు పుస్తకాలు వేలకువేలుపెట్టి కోనేవాళ్ళు మారలెదుకదా! మరి తెలుగుపుస్తకాలు మాత్రం చదివేవాళ్ళు ఎందుకుతగ్గారు?

@అబ్రకదబ్ర: తెలుగు పుస్తకాల కోసం వాల్డన్ సజెస్ట్ చేసిన బడుద్ధాయిలెవరబ్బా!

cbrao said...

"ఇంగ్లీషు పుస్తకాలు వేలకువేలుపెట్టి కోనేవాళ్ళు మారలెదుకదా! మరి తెలుగుపుస్తకాలు మాత్రం చదివేవాళ్ళు ఎందుకుతగ్గారు?" -స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులు తెలుగు బదులు ఇతర భాషలు తీసుకోవటం ఎక్కువయ్యింది. సర్కారు వారే ప్రభుత్వ స్కూళ్లలో 6 వ తరగతి నుంచి ఆంగ్లానికి పెద్దపీట వేస్తున్నారు. ఇహ తెలుగు పుస్తకాలకు మహారాజ పోషకులయిన గృహిణులు టి.వి. సీరియల్స్ పైకి తమ దృష్టిని మరల్చటంతో తెలుగు పుస్తకాలకు ఆదరణ కరువయ్యింది.

ఈ-పుస్తకాలు అచ్చు పుస్తకాలకు పోటీ కావు. దేని పాఠకులు దానికి ఉన్నారు. తెలుగు పుస్తకాలు కొన్నింటికి ఆమోదయోగ్యంకాని ఎక్కువ ధరలుంటున్నాయి. ఎమెస్కో వారు పాఠకులకు అందుబాటు ధరలో ప్రత్యేకంగా పుస్తకాలు ప్రచురించారు. అవి విశేష ఆదరణ పొందాయి.

Anonymous said...

@మహేష్ : సారీ; చూడటం లేటయింది. కానీ మంచిదే, కొన్ని అటూ ఇటూ కూడా వచ్చేశాయి. ఇంతకీ మళ్ళీ ఆ కామెంట్ ఇక్కడ వెయ్యటం ఎందుకు? దానికి మీరు చెప్పేది చెప్తే, నా ఆలోచన నేనూ చెప్తాను.

సరే అడిగారు కాబాట్టి :
"మహేష్ అంటారు : మార్కెటింగ్ వ్యవస్థ లేదు కాబట్టి, మనం అమ్ముకోలేం అంటారు; అది నిజమే!కానీ అసలు “అలాంటి” మార్కెటింగ్ వ్యవస్థ మాత్రమే ఉండాలి అనుకోవడంలోనే ఉంది సమస్యంతా! "

చెప్పండి, మీరేమంటారో!

Anil Dasari said...

>> "తెలుగు పుస్తకాల కోసం వాల్డన్ సజెస్ట్ చేసిన బడుద్ధాయిలెవరబ్బా"

విశాలాంధ్ర, నవోదయ కాకుండా వాల్డెన్ అంటే 'ష్టయిలు'గా ఉంటుందని అలా చెప్పానని తర్వాతెప్పుడో నే చీవాట్లు పెడితే ఒప్పేసుకున్నాడులే పాపం. ఎన్నారైలకి లేనిపోని గొప్పదనం ఆపాదించి వాళ్లముందు అనవసరమైన నామోషీలు ఫీలవతారు కొందరు. మావాడూ అదే పని చేశాడు.