Wednesday, May 6, 2009

మునెమ్మ పై ఒక స్థానిక పాఠకుడి (native reader) స్పందన -3

(పూర్తి విశ్లేషణ ఓకే భాగంలో ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి)
ఈ వ్యాసం యొక్క మొదటి మరియు రెండవ భాగాల్ని ఇక్కడ చదవండి.

కథలో చాలా మంది విమర్శకులకూ పాఠకులకూ అర్థంకాని పజిల్ గా మిగిలింది ఆరంభ ఘట్టం. బొల్లిగిత్తని జయరాముడు చావగొట్టే ఉదంతం.దాంతోపాటూ, ఇంట్లో పెరిగిన గొడ్డుని.ప్రాణంలా చూసుకున్న గొడ్డుని.తమ్ముడిలా చూసుకున్న గొడ్డుని. జోవనోపాధిగా మారిన గొడ్డుని. జయరాముడు (పరసలో)సంతలో తెగనమ్మేందుకు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ కథకుడు ఆ ఘటనా స్థలిలో ఉండే పాత్రల ద్వారా కాకుండా, అక్కడ ఏం జరుగుంటుంది? జయరాముడికి ఆ ఉన్మాదం ఎలా ఆవరించింది? అనే ప్రశ్నలకు జయరాముడి తల్లి సాయమ్మ భయంద్వారా సమాధానం ఇప్పిస్తాడు. ఆ సమాధానం మూల ప్రశ్నల్లోనే మార్పుని ఆశిస్తుంది.

బొల్లిగిత్త మునెమ్మ మీదికి ఏ ఉద్దేశంతో చేరింది అనే ప్రశ్నకన్నా, జయరాముడు బొల్లిగిత్త చేష్టలకి హఠాత్తున ఉగ్రుడెందుకయ్యాడు అనేది సరైన ప్రశ్న. జయరాముడు బొల్లిగిత్తని తమ్ముడిలాగా చూసుకున్నాడన్నది కథారీత్యా తెలిసిన సత్యం. మునెమ్మ, జయరాముడూ,బొల్లిగిత్తా వీధిలో వెళ్తుంటే సీతారామలక్ష్మణుల్లాగా అనిపించేదని మునెమ్మ కూడా చెబుతుంది. అలాంటప్పుడు బొల్లిగిత్త ప్రేమగా మునెమ్మను చేరడం చూసి, పెళ్ళాం చీరకట్టిన పాపానికి నాటకంలో వేషం వేసినాయన్ని తెగనరికిన దొరసామిరెడ్డి రక్తం ప్రవహిస్తున్న జయరామి రెడ్డిని ఆ క్షణాన ఉన్మాదం ఆవరించడం సహజమైన భ్రంశనగానే అనిపిస్తుంది. "జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగటే కనబడతావుండాయి" అన్న సాయమ్మ వాగ్మూలం అందుకు సాక్షం. అంటే ఇక్కడ బొల్లిగిత్త యొక్క తెలియని ఉద్దేశాలకన్నా, మునెమ్మ అమాయకత్వంకన్నా, జయరాముడి ఉన్మాద చర్య కథకు కీలకం. దీన్నొదిలేసి విమర్శకులు, పశువులు మనుషులపైకి వస్తాయా? boredom sex పశువుల్లో ఉందా? అనే పనికిమాలిన శాస్త్రీయ ప్రమాణాలను వెతుక్కున్నారు. పైపెచ్చు అదేదో రచయిత మానసిక రుగ్మతకు సాక్షంగా ఊదరగొట్టారు.

ఒక రాయలసీమ పల్లెవాసిగా, ఎదకొచ్చిన/సుల్లరానికొచ్చిన పశువులు మనుషుల మీద "ఎగరడం" నాకు తెలుసు. దానికి శాస్త్రీయ ప్రమాణం అనవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ప్రాధాన్యమైన సంస్కృతిలో పశువుల్ని మనుషుల్లాగా ప్రేమించడం ఎంత సహజమో, పశువులకూ మనుషులకూ "సంబంధాల్ని" అంటగట్టి హాస్యాలాడ్డమూ అంతే సహజం. కాబట్టి, ఇక్కడ శాస్త్రీయ ఆధారాలకన్నా, సాంస్కృతిక ధోరణిని అర్థం చేసుకోవడం అవసరం. అంతేకాక, విషయం అవగతమైన తరువాత సాయమ్మ అనే మాటలు గమనిస్తే, అంతర్లీనంగా జయరాముడి మార్పుపట్ల భయం కనిపిస్తుందేతప్ప ఆ ఘటన యొక్క "తప్పొప్పులు" కాదు. సాయమ్మ సినబ్బతో అంటుంది,"...పాపమేది పుణ్యమేది అని తెగజెప్పాల్సి వచ్చినప్పుడు దేవాను దేవతలే ఒక్కోసారి ముందూ యనకా అయినారు. మనుషులు మనమెంత? జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగిటే కనబడతా ఉండాయి. వాడికి మీసాలొచ్చినప్పట్నుంచి ఇది గవనిస్తానే ఉండాను. ఇక ఆ గొడ్డు ఒక్క దినం గూడా ఉండకూడదనిపించిందిరా. అది ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఏ మూలనో నాగుపాము ఉన్నట్లే ఉంటుంది" అని. ఇక్కడ కూడా బొల్లిగిత్త ఎందుకు మునెమ్మ మీదకొచ్చింది? అది తప్పాఒప్పా? అనే ప్రశ్నలకన్నా, జయరాముడి అనుమానం ద్వారా కలిగే విపరీతాలనుంచీ కుటుంబాన్ని కాపాడలనుకునే తల్లే కనిపిస్తుంది. అడ్డుచెబుతుందనుకున్న అత్తకూడా బొల్లిగిత్తను అమ్మేందుకే తయారవడం మునెమ్మకు అర్థం కాకపోవడానికి కారణంకూడా సాయమ్మకు తెలిసిన కుటుంబ చరిత్ర మునెమ్మకు తెలియకపోవడమే.

ఈ అపోహకు కారణం బహుశా, నవలతోపాటూ వచ్చిన అంబటి సురేంద్రరెడ్డి రాసిన విశ్లేషణలోని వాక్యాలు కూడా కావచ్చు. ముందుమాటలూ, వెనుకమాటలూ, విశ్లేషణలూ నవలతోపాటూ ఇవ్వడం పాఠకుడి ఊహల్ని కుంచించుకుపోయేలా చేసి, ఒక preconditioned మూసలో interpret చేసేలా ప్రేరేపిస్తాయనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఈ నవల ఇస్తూ చాలా మందికి ముందుమాటా వెనకమాటా చదవొద్దని చెప్పాను. బహుశా ఈ నవల చాలా చిన్నదవటం వలన, పేజీలు పెంచడానికి ప్రకాశకులు వీటిని జతచేశారేమో. ఇలా జతచేయడం వలన లాభంతో పాటూ కొంత నష్టమూ జరిగిందని మాత్రం చెప్పగను.

(నాలుగవ భాగం త్వరలో...)

*****

5 comments:

గీతాచార్య said...

అపోహ సంగతి నాకు తెలియదు కానీ ఎందుకో నాకా నవల కొన్ని పెజీలు చదవంగానే విసుగొచ్చింది. బహుశా పూర్తి స్థాయి నేపథ్యం తెలియకపోవటం వాళ్ళ కావొచ్చు. మీ పూర్తి విశ్లేషణ అందుకు నాకు సహాయం చేయవచ్చు.

మీరన్నది నిజమే. ముందు మాటలూ, వెనుక మాటలూ జనాన్ని (పాఠకులు కాదు. పాఠకుల కున్న అర్థం వేరు. They are serious thinkers too. పుస్తకాలన్నీ పాఠకుల కన్నా జనమే ఎక్కువ చదువుతున్నారు ఈ మధ్య. అప్ఫలానా పుస్తకం నేను చదివానహో...! అని చాటుకునేటందుకు. Remember Lois Cook and Peter Keating?) influence చేస్తాయనేది పచ్చి నిజం. పాఠకుల ఊహలని నిర్దేశ్యించ బూనటమే అది. కొన్ని సందర్భాలలో అవి ఆ రచనని అర్థం చేసుకునేటందుకు దోహద పడవచ్చేమో కానీ, చాలా సార్లు వాటిలో వీపు గోకుడే ఎక్కువ.

Waiting for the next installment.

Kathi Mahesh Kumar said...

@గీతాచార్య: బహుశా మీ విసుగుకు కారణం ఆ నవలలో ఉపయోగించిన చిత్తూరు మాండలీకం కూడా కావచ్చు. కొంత చదివితే ఆ తరువాత అలవాటవుతుంది. ప్రత్నించండి.

సుజాత వేల్పూరి said...

"ముందుమాటలూ, వెనుకమాటలూ, విశ్లేషణలూ నవలతోపాటూ ఇవ్వడం పాఠకుడి ఊహల్ని కుంచించుకుపోయేలా చేసి, ఒక preconditioned మూసలో interpret చేసేలా ప్రేరేపిస్తాయనడానికి ఇదొక ఉదాహరణ.",.........

ఇది మాత్రం అక్షర సత్యం! అందుకే ముందు మాటలు నవల మీద అభిప్రాయాలని తెలియజేసేవి గా ఉండాలి గానీ, మనం చదవడానికి ముందే నవల్ని విశ్లేషించి,చీల్చి చెండాడేసి, మనకంటూ ఆలోచించడానికి ఏమీ లేకుండా చేయకూడదు. నాలుగో భాగం ఎప్పుడు?

@గీతాచార్య,
బహుశా మీరు ఇంతకు ముందు రాయలసీమ మాండలికం చదివి ఉండరు. మనది కాని భాష మొదటి సారి బోరుకొట్టడం సహజమే! ఇంకోసారి చదవండి.

మేధ said...

నాకూ మొదట్లో పుస్తకం కాస్త బోర్ కొట్టి ప్రక్కన పడేశా.. తరువాతేప్పుడో మళ్ళీ చదివా.. అలవాటు పడిన తరువాత బోర్ కొట్టలేదు...
మామూలుగా ముందు మాట చదివి మొదలుపెడదామనుకున్నా, కానీ కాత్యాయిని గారి విమర్శ చూసి, వేరే వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు - నేను చదువుకోవడమే సబబు అనిపించి, ముందుమాటని దాటి ముందుకెళ్ళిపోయా.. :)

Hyderabad Book Trust said...

మునెమ్మ సమీక్ష నాలుగవ భాగం ఇంకా వెలువడినట్టు లేదు.
చాలా అద్భుతమైన సమీక్ష .
అభినందనలు.
మీరు అనుమతిస్తే మా వీక్షకుల సౌలభ్యం కోసం మొత్తం నాలుగు భాగాలు కలిపి
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగ్ లో పునః ప్రచురిస్తే బాగుంటుందని భావిస్తున్నాము.
మీ ఆమోదాన్ని తెలుపగలరు.
hyderabadbooktrust@gmail.com